ఆ వెన్నెల రాత్రులు-3

Image design: Mallika Pulagurtha

ఆ మర్నాటికి స్కూళ్ళు తెరిచారు. నేనుంటున్న పిన్నిగారి పిల్లలు పెద్దమ్మాయి, చిన్నమ్మాయి బడికి బయల్దేరారు. బడి అంటే ఎక్కడో లేదు, ఆ ఇంటి ఎదురుగా ఉన్న రామకోవెలనే బడి. ఆ రెండురోజులూ నిశ్శబ్దంగా ఉన్న ఆ వీథి బడితెరవగానే కిలకిల్లాడటం మొదలుపెట్టింది. ఆ సాయంకాలం ఆ పిల్లలిద్దర్నీ నాకు ఊరంతా తిప్పి చూపించమని అడిగాను.

ఆ ఊరు ఎటువేపు తిరిగినా అయిదారు ఫర్లాంగులకి మించి లేదు. ఊరికి ఉత్తరం వేపు ఒక కొండవాగు. దాని మీద కొత్తగా వేసిన బ్రిడ్జి. ఆ వంతెన దాటాక దళితవాడ. మరోవేపు ఊరుదాటగానే రోడ్డుమీదకీ ప్రవహిస్తున్నట్టుండే కొండ. ఆ కొండవాలు ఒక చాపరాయిలాగా పరుచుకుని ఉంది. ఆ చాపరాయి దగ్గర్లోనే ఫారెస్టు ఆఫీసరుగారి ఇల్లు. మేముంటున్న ఇంటికీ రామకోవెలకీ మధ్య సన్నని లోపలిదారి. ఆ దారమ్మట లోపలకి వెళ్తే అసలైన ఊరు. అదంతా కొండరెడ్లు నివసించే ఒక చిన్నపాటి గిరిజన గ్రామం. ఆ దారి అలా అడవిలోకి, కొండలమధ్యలోయలోకీ సాగిపోతుంది. రామకోవెలకి ఎదురుగా రోడ్డు. తారురోడ్డు. ఆ రోడ్డు దాటి పడమటి వైపు కూడా ఊరు విస్తరించి ఉంది. రోడ్డు పక్కనే మునసబు గారి బంగళా. ఆ పక్కన కొత్తగా వెలిసిన ఒక చిన్న టీదుకాణం. దాని పక్కన గిరిజన కార్పొరేషన్ వారి డిపో. ఆ బంగళాకు మరొక పక్క చింతచెట్ల వరస. వాటిమీద పూలు పూసినట్టుగా కొంగలు. ఆ చింతచెట్ల వెనగ్గా ఉన్న ఇంటిముంగట పందిరిమీద రంగువిరజిమ్మినట్టు ఎర్రటి బోగన్ విల్లియా. ఆ ఇంటిపక్కనుంచి లోపలకీ నడిస్తే, ఆ సన్నని దారి అటూ ఇటూ మలుపులు తిరిగి ఊరుకింద చెరువుగట్టుమీదగా పొలాల్లోకి సాగిపోతుంది. ఆ చెరువు గట్టుకింద అరటితోట, చెరకు తోట. ఏటిమీద బ్రిడ్జి దాటి మరికొంతముందుకు నడిస్తే తారురోడ్డు మలుపు తిరిగేచోట గ్రామదేవత గుడి. ఆ గుడి చుట్టూ జీడిమామిడితోటలు. ఆ తోటలు దాటి, రోడ్డుమలుపు దాటాక మరికొంత ముందుకినడిస్తే ఫారెస్టు డిపార్ట్ మెంటు పెంచుతున్న టేకుచెట్ల వనం.

మళ్ళా వెనక్కి వస్తే, బ్రిడ్జి ఇంకా ఎక్కకముందే ఒకవైపు గట్టుమీద కొండమామిడి చెట్ల డొంక. అది ఊరికి స్మశానం. దానికి ఆవల, ఏటి గట్టుకి పైన పొలాలు, ఆ పొలాలమ్మట మళ్ళా ఊళ్ళోకి అడుగుపెట్టే చోట మరొక చెరువు. దాన్ని పెద్ద చెరువు అంటారని చెప్పారు పిల్లలు. ఆ చెరువు మీద పెద్ద రావిచెట్టు. ఆ చెరువు పక్క చిన్న డొంక. ఆ డొంకపక్కనుంచి లోపలకీ మరొక గిరిజన గ్రామానికి పొయ్యే ఒక మట్టిబాట.

ఆ డొంకదారికి అవతలపక్క బావి. ఊరంతటికీ అదొక్కటే బావి అని విన్నాను. ఆ బావి చుట్టూ నీళ్ళు తోడుకుంటున్న స్త్రీలు, ఆ పక్కనే స్నానం చేస్తున్న యువకులు, దానికి కొద్దిగా దిగువన చిన్నపాటి దొరువులో గేదెల్ని తోముతూ కొందరు. ఆ బావి పక్కన సగం పాడైపోయి కూలిపోడానికి సిద్ధంగా ఉన్న పాతబడి బిల్డింగు. ఇంకా కూలిపోని ఒకపక్క గోడమీద ‘చేనుకు చేవ, రైతుకు రొక్కం గ్రోమోర్’ అని ఒక నినాదం.

ఏటికి దిగువవేపు చాకళ్ళు గుడ్డలుతికే చోటు. అక్కడొక తుమ్మచెట్టు. గుడ్డలు ఉడకబెట్టే బాన, పొయ్యి. అక్కడ వెడల్పుగా లోతుతక్కువగా పరుచుకున్న ఏటిపాయ. ఆ పాయదాటి అవతలి వైపు కాలినడకన ఆ గట్టు ఎక్కితే అక్కడొక యూకలిప్టస్ తోట. ఆ పైన దూరంగా పొలాలకి ఆవల ఆకుపచ్చని సముద్రతీరమ్మీంచి ఎగిసిపడుతుండే కెరటాల్లాగా కొండలు, తెల్లటినీలంగా, నీలంపు ఆకుపచ్చగా, ఆకుపచ్చని మంచులా.

ఆ ఏటినుంచి పొలంగట్లమీద ఒడుపుగా దారిచేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ కడవల్లో తాగడానికి మంచినీళ్ళు తోడి తెచ్చుకుంటున్న స్త్రీలు. తడిసి ఒకవైపు నీళ్ళు చిందుతున్న ఆ కడవల అంచుల మీంచి బంగారం తుంచుతున్నట్టుగా సాయంసంధ్యారశ్మి.

ఊరికి తూర్పువేపు దాదాపుగా ఊరిని ఆనుకుని మూడు కొండలు. ఆ కొండల్లో మరీ దక్షిణంగా ఉండే కొండ మీద ఎప్పుడూ ఎగురుతూ ఉండే ఒక జెండా.

ఊరిమధ్యలో చిన్న కాలువ, దానిమీద ఒక తూము. ఆ తూము పక్క ఒక ఊడుగచెట్టు. ఆ తూముకి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు చిన్నపాటి చెరువులాగా నీళ్ళు చేరిన దొరువులు. ఆ గుంతల్లో మెట్టతామరపూలమొక్కలు.

శరత్కాలం కావడంతో పొలాల్లో వరిచేలు పచ్చగా కలకల్లడుతున్నాయి. సన్నని వరికంకులు ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. గాలికి ఆ వెన్నులు ఊగినప్పుడల్లా అసంఖ్యాకమైన చుక్కలు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఆ పొలాలకు దిగువ ఏటి ఒడ్డున అక్కడక్కడా రెల్లు పొదలు.

ఊరంతా తిరిగి చూడటానికి నాకు రెండు గంటలమించి పట్టలేదు. కాని ఆ కొండలమధ్య, ఆ గ్రామం, ఆ మొక్కలు, ఆ దొరువులు, ఆ తీగలు, ఆ కొంగలు, ఆ పొలాలు, ఆ తోటలు ఎన్నాళ్ళనుంచో నాకోసం ఎదురుచూస్తున్నట్టుగానూ, అవీ నేనూ కూడా కలిసి ఒక పడవమీద ప్రయాణం మొదలుపెట్టినట్టుగానూ అనిపించింది.

ఆ మర్నాడు మధ్యాహ్నం మూడింటికి నాకు ఫారెస్టు ఆఫీసరుగారినుంచి కబురు వచ్చింది. వాళ్ళింటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటిముందు ఒక జీపు ఆగి ఉంది. ఇంట్లో అడుగుపెట్టగానే ఒక పెద్దాయన, ఆయనతో పాటు ఒక యువతీ కనిపించారు. వాళ్ళు పరిచయం చేసుకోకముందే నాకు అర్థమయింది వాళ్ళే ప్రొఫెసరుగారూ, వనలతా సేన్ గుప్తా అని. నేను వాళ్ళకి నమస్కారం చేసి నన్ను పరిచయం చేసుకున్నాను.

ఆ ప్రొఫెసరుగారు దాదాపు అరవైఏళ్ళకు దగ్గరలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయన్ని చూడగానే శరత్ బాబు శేష ప్రశ్న నవల్లో ఆశుతోష్ గుప్త లాగా అనిపించాడని రాజు తర్వాత నాతో అన్నాడు. అప్పటికి నేను శేష ప్రశ్న చదవలేదు. కాని తర్వాత చదివాక ఆ పోలిక మరీ అన్యాయం అనిపించింది. అదీకాక ఆశుతోష్ బాబు తనని రోగిష్టి మనిషిగా పరిచయం చేసుకుంటాడు. కాని ప్రొఫెసరు సేన్ గుప్తాని మొదటిసారి చూడగానే ఆయన ఎంతో ఆరోగ్యవంతుడిగానూ, ఆ ఆరోగ్యం అన్నిటికన్నా ముందు మానసికమనీ అనిపించకుండా ఉండదు. దబ్బపండులాంటి దేహమేకాని, ఏళ్ళ తరబడి కొండల్లో, కోనల్లో తిరిగినందువల్ల ఆ చర్మం పైన పలచని ఊదారంగు పొర పేరుకుందా అనిపిస్తుంది. ఆయన్ని చూడగానే ముందు మనల్ని ఉన్నచోటే కట్టిపడేసేదిఆయన చిరునవ్వు. పసిపాపల్లో మాత్రమే కనవచ్చే ఆ చిరునవ్వు. ఆయన నన్ను చూస్తూనే కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. స్థూలకాయుడు కాబట్టి లేవడంలో కొద్దిగా తొట్రుపడ్డా, మొహమాటానికి సగం లేచి ఆగిపోకుండా, పూర్తిగా, సంతోషంగా, స్వాగతపూర్వకంగా లేచి నించున్నాడు. రెండు చేతులూ చాపి దగ్గరగా తీసుకున్నాడు. నా తండ్రి దగ్గర నేనెప్పుడూ అటువంటి ఆలింగనం ఎరగను గాని, పితృవాత్సల్యాన్ని రెండుచేతుల్తోనూ పంచవచ్చునని అప్పుడే తెలిసింది నాకు.

ఆయన తన పక్కన కూచున్న వనలతని పరిచయం చెయ్యబోతుంటే-

‘తెలుసు నాకు, వనలత’ అన్నాను ఇంగ్లిషులో.

వనలత ప్రేమగా చెయ్యి చాపింది. ఆమెకి పాతికేళ్ళ వయసు ఉండవచ్చు. ఏదో బెంగాలీ నవల్లోంచి సరాసరి ఈ అడవికి నడిచి వచ్చినట్టుగా ఉంది. విరబోసుకున్న కురుల మధ్య, గుండ్రంగానూ, పుష్టిగానూ ఉన్న ఆ వదనం పొద్దున్నే నిండుగా పూసిన తామరపువ్వులాగా ఉంది. మరీ ముఖ్యంగా ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆమె నాతో కరచాలనం చేస్తూ ఎంతో ఇష్టంగా తలూపగానే ఆమె చెవిలోలాకులు రెండు పూలరేకుల్లాగా అటూ ఇటూ ఊగాయి.

‘ఆర్ యు కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లిష్?’ అని అడిగాడు ప్రొఫెసర్.

అవునన్నాను.

ఆ తర్వాత మా సంభాషణ మొత్తం ఇంగ్లిషులోనే సాగింది. ప్రొఫెసరు ఇంగ్లిషు ఉచ్చారణలో బంగ్లా యాస బాగా ఉండటంతో నాకు మొదట్లో ఆయన మాటలు అంత స్పష్టంగా అర్థం కాలేదు. కాని వనలత చిన్నప్పణ్ణుంచీ ఇంగ్లిషు మీడియంలో చదువుకుని ఉండి ఉంటుంది కాబోలు, ఆమె ఇంగ్లిషు సులభంగానూ, సరళంగానూ వినబడుతూ ఉంది.

ప్రొఫెసరు ముందు నా బస గురించీ, నాకు ఆతిథ్యమిస్తున్న కుటుంబం గురించీ అడిగాడు. వాళ్ళని వెంటనే వెళ్ళి కలుద్దామన్నాడుగాని, జోసెఫ్ ఆ తర్వాత కలుద్దాం, పర్వాలేదన్నాడు. ప్రొఫెసరు నన్ను బోటనీ గురించీ, మొక్కల గురించీ, నా చదువుగురించీ, మార్కుల గురించీ అడుగుతాడనుకున్నానుగానీ ఆయన ఎక్కువ మా కుటుంబం గురించీ, నా తల్లిదండ్రుల గురించీ, మా తమ్ముడి గురించీ, చెల్లి గురించీ, మా ఇష్టాయిష్టాల గురించీ-ఇలాంటివే ఏవేవో అడుగుతూ ఉన్నాడు. ఈ లోపు గ్రేస్ మేడం మాకు టీ తీసుకొచ్చింది. టీతో పాటు బిస్కట్లు కూడా. సేన్ గుప్తా ఆ టీ తాగిన పద్ధతి నాకు చాలా కొత్తగా, గమ్మత్తుగా అనిపించింది. అలా టీ తాగవచ్చునని నాకు అప్పటిదాకా తెలియలేదు. ఆయన టీ తాగుతున్నంతసేపూ మమ్మల్నే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆ టీపాయ్ చుట్టూ కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పినట్టుగా ఉంది.

‘డు యు నో! వియ్ షుడ్ నాట్ డ్రింక్ టీ’ అన్నాడు ఆయన మాటల మధ్యలో.

నేను అర్థం కానట్టు చూసాను.

‘రాదర్, వియ్ షుడ్ సేవర్ ఇట్’ అన్నాడాయన నవ్వుతూ.

‘సేవరింగ్ టీ ఈజ్ ఎ సెరిమొని, యు నో’  అని కూడా అన్నాడు.

ఆ టీ సెరిమొని అయ్యేటప్పటికి ఆయన నాకు ఎంతో కాలంగా తెలిసినవాడిలానూ, నా చిన్నప్పుడు మా పొరుగింట్లో ఉండే పెద్దమనిషిగానూ, నా ప్రైమరీ స్కూలు టీచరుగానూ మారిపోయాడు.

ప్రొఫెసరుగారికీ, వనలతకీ జోసెఫ్ గారు ముందు విలేజిచావిడిలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేసాడు. ఆ విలేజి చావిడి బ్రిటిష్ కాలం నాటి బంగళా. దాదాపుగా శిథిలావస్థకు చేరుకుంటూ ఉంది. ఆ ఊరికి గవర్నమెంటు సిబ్బంది ఎవరు వచ్చినా అక్కడే బస ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కలకత్తా బృందానికి కూడా వారం రోజుల పాటు అక్కడే బస ఏర్పాటు చేసామనీ, ఈలోపు తాను వాళ్ళకోసం కట్టిస్తున్న కుటీరం పూర్తయిపోతుందనీ జోసెఫ్ గారు చెప్పాడు.

అప్పుడు ఆయన తన ఇంటికి కొద్దిగా వెనగ్గా, కొండవార కడుతూ ఉన్న ఆ కుటీరానికి మమ్మల్ని తీసుకువెళ్ళి చూపించాడు. అది మట్టి గోడల ఇల్లు. మట్టి అరుగులు. తాటిదూలాల్తో, వెదురుబొంగుల్తో కప్పు అల్లి దాని మీద గడ్డి కప్పు వేస్తున్నారు. చుట్టూ వెదురుకంచె పెడుతున్నారు. ఆవరణలో కొన్ని బొప్పాయిమొక్కలు, ఒక పక్కగా నాలుగైదు నీలగిరిమొక్కలు కూడా నాటి ఉన్నాయి. అవి కాక ఎప్పటివో చాలా ఏళ్ళుగా పెరుగుతూ వస్తున్న మామిడిచెట్లు కూడా ఉన్నాయి. కుటీరానికీ, కొండవాలుకీ మధ్య రెండుమూడు చింతచెట్లు, ఒక వేపచెట్టు కూడా ఉన్నాయి.

బహుశా ప్రొఫెసరు ఇక్కడికి స్టడీ కోసం వస్తున్నాడని తెలిసినవెంటనే ఫారెస్టు ఆఫీసరు కుటీరం నిర్మించే  పని మొదలుపెట్టినట్టున్నాడు. ఆ కుటీరం, దాన్ని అక్షరాలా కుటీరం అనవచ్చు, దాన్ని చూడగానే సేన్ గుప్తా కొంతసేపు దిగ్భ్రాంతితో అట్లాగే నిలబడిపోయాడు. ఆయన చూపులుడిగి నిలబడ్డాడని కూడా చెప్పవచ్చు.

‘ఓహ్! బ్యూటిఫుల్! సింప్లీ ఎ స్లైస్ ఆఫ్ పారడైజ్ ఆన్ ద ఎర్త్’ అంది వనలత. ఆమె చిన్నపిల్లలా ఆ కుటీరం చుట్టూ తిరిగింది. ఆ మట్టిగోడల్ని చేతుల్తో తాకింది. ఇంకా తడి ఆరని ఆ మట్టిని తన కోమలమైన అంగుళుల్తో గుచ్చి చూసింది. ఆ చింతచెట్టుమీద గుత్తులుగుత్తులుగా వేలాడుతున్న చింతకాయల్ని చూసింది.

‘మీరు ఈ వారం రోజులూ ప్రిపరేటరీ వర్క్ ఏదైనా ఉంటే చూసుకోండి. రేపు సాయంకాలం చిన్న గేదరింగ్ ఏర్పాటు చేసాను. ఊళ్ళో పెద్దమనుషులు కొందరిని పిలుస్తున్నాను. మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చెయ్యడానికి’ అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్.

సేన్ గుప్తా తలపంకించాడు, కాని ఆయన దృష్టి ఇంకా మనుషుల మధ్యకి రాలేదు.

ఆ మర్నాడు సాయంకాలం జోసెఫ్ తన కుటీరం అరుగుమీదనే రెండుమూడు చాపలు పరిచాడు. పది కుర్చీలు తెప్పించి ఒక పక్కగా వేయించాడు. నెమ్మదిగా ఒకరూ ఒకరూ పెద్దమనుషులు అక్కడకు చేరుకునేటప్పటికి చీకటి పడటం మొదలయ్యింది.

ఆ అరుగుమీదనే చిన్న వేదికలాగా నాలుగు కుర్చీలు వేసి ఫారెస్టు ఆఫీసరు ప్రొఫెసరు సేన్ గుప్తాని, వనలతనీ, నన్నూ కూర్చోమన్నాడు. వచ్చినవాళ్ళందరికీ మంచినీళ్ళూ, బిస్కట్లూ, టీ ఏర్పాటు చేసాడు. గ్రామపెద్దల్లో ముఖ్యమైన వాళ్ళంతా వచ్చారనుకున్నాక, అందరినీ ఉద్దేశించి చెప్పడం మొదలుపెట్టాడు.

‘వీరు ప్రొఫెసరు సేన్ గుప్త. ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న శాస్త్రవేత్త. వీరు మన ప్రాంతంలో ఉండే కొండల గురించీ, అడవులగురించీ, మన కొండరెడ్ల గురించీ కూడా పరిశోధన చెయ్యడానికి వచ్చారు. ఇక్కడ ఆరునెలలైనా ఉంటారు. వీరికి అన్ని ఏర్పాట్లూ చెయ్యమని, ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకోమనీ మా కన్సర్వేటరుగారు మరీమరీ చెప్పారని మా డి ఎఫ్ ఓ గారు నాకు పర్సనల్ గా చెప్పారు. ఇటువంటి వారు మన గ్రామానికి రావడం, ఇక్కడ రీసెర్చి చెయ్యడం మన గ్రామం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. వీరికి మనందరి తరఫునా స్వాగతం పలుకుతున్నాను’ అన్నాడు. అక్కడున్నవారంతా ఆ మాటలకి ఆమోదపూర్వకంగా చప్పట్లు కొట్టారు.

‘కొండల మీద పరిశోధన అంటే ఏమిటి చేస్తారు?’ అనడిగాడు ఒకాయన. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటో జోసెఫ్ గారు సేన్ గుప్తాకి ఇంగ్లిషులో తిరిగిచెప్పాడు. అప్పుడు తనే ఆ అడిగినాయనతో

‘కొండలు అంటే రాళ్ళు, ఆ రాళ్ళు ఎలా ఏర్పడ్డాయి, ఎలా వ్యాపించాయి, ఎలాంటి మార్పులు చెందుతూ ఉన్నాయి లాంటివన్నీ పరిశోధిస్తారు. ఆ శాస్త్రాన్ని జియాలజి అంటారు’ అని చెప్పాడు.

‘అంటే పొలాల్లో బావులు తవ్వడానికీ, బోర్లు వెయ్యడానికీ ఎక్కడ నీళ్ళు పడతాయో అది చెప్పేవాళ్ళే కదా జియాలజిస్టులంటే’ అన్నాడు మరొకాయన.

‘అవును’ అన్నాడు ఫారెస్టు ఆఫీసరు. ‘అయితే వీరు చేసే పరిశోధన  అంతకన్నా పెద్దది. దాని వల్ల ముందు ముందు మన ప్రాంతం గురించి చాలా విషయాలు మనకి తెలుస్తాయి’ అని కూడా అన్నాడు.

అప్పుడు వనలతనీ, నన్నూ అక్కడున్నవాళ్ళకి పరిచయం చేసాడు. అప్పటికే రెండుమూడు రోజులుగా నన్ను చూస్తున్న ఆ గ్రామస్థులకి నేను అక్కడికి ఎందుకొచ్చానో ఇప్పుడు అర్థమయినట్టు తలాడించారు. కాని వారందరి దృష్టీ ప్రధానంగా వనలత మీదనే ఉంది. ఆమె విరబోసుకున్న శిరోజాలు, తొడుక్కున్న టీషర్ట్, జీన్సు పాంటు వాళ్ళకి కొత్తగా ఉన్నాయి. ఎక్కడో సీమనుంచి దిగివచ్చిన దొరసానిలాగా ఉందనుకున్నారు వాళ్ళు.

‘వనలత అంటే టాగూరు నవల్లో కేరక్టరా’అనడిగారు ఎవరో. అది కూడా ఇంగ్లిషులో అడిగారు. అంతా ఆ ప్రశ్న వినబడ్డ దిక్కుకి చూసారు. అక్కడ అరుగుకింద నిలబడి ఉన్న నలుగురైదుగురు యువకుల్లో ఒకరు ఆ ప్రశ్న అడిగారు.

‘ఎవరు అడుగుతున్నది?’ అనడిగాడు జోసెఫ్ ఆ దిక్కుకేసి చూస్తూ,

నేను సార్, రాజుని’ అంటో ముందుకొచ్చాడో యువకుడు. చూడటానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు. కాని ఆ కనుచీకటిలో కూడా ఆ కళ్ళు షార్ప్ గా కనబడుతున్నాయి. జోసెఫ్ ఆ ప్రశ్నకి ఏమి జవాబివ్వాలో తెలీక ‘అరె రాజూ! కిందనే నిలబడిపోయారు, పైకి రండి, ఇక్కడికొచ్చి కూచోండి’ అంటో అక్కడ ఖాళీగా ఉన్న ఓ కుర్చీ వేపు చూపించాడు.

కాని ఆ యువకుడు ఆ ప్రశ్న ఇంగ్లిషులో అడగడంతో, సేన్ గుప్తాకి అతనేమడుగుతున్నాడో అర్థమయింది. అతణ్ణి ముందుకు రమ్మని పిలిచాడు.

‘ఐ వండర్ హౌ సమ్ వన్ కుడ్ మెన్షన్ గురుదేవ్ ఇన్ దిస్ రిమోట్ ఫారెస్ట్’ అని అన్నాడు. టాగోర్ అనే మాట సేన్ గుప్తని అమాంతం ఎత్తి బెంగాల్ కు తీసుకుపోయినట్టుగా వుంది ఆయన ముఖం ఆ సమయంలో. అప్పుడు నింపాదిగా ఇంగ్లిషులోనే జవాబిచ్చాడు.

‘లేదు, వనలత గురుదేవ్ నవలల్లో నాయిక కాదు. మా దగ్గర జీబనానంద దాస్ అని మరొక గొప్ప కవి ఉన్నాడు. ఆయన వనలతా సేన్ అని ఒక కవిత రాసాడు. మా అన్నయ్యకి ఆ కవిత అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్, నాకు కూడా ఇష్టమే. అసలు ఆ కవితంటే ఇష్టపడని బెంగాలీ ఎవరూ ఉండరు. అందుకని మా అమ్మాయికి ఆ పేరు పెట్టుకున్నాం’ అన్నాడు.

అప్పుడు గ్రామస్థులవైపు తిరిగి ‘ మీరంతా ఈ సాయంకాలం మా కోసం ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము చెయ్యబోయే పరిశోధన మీకు నేరుగా ఉపయోగపడుతుందని చెప్పలేను. కాని జాతికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. మనుషులు ఎక్కడున్నా ఒక కుటుంబమే అని నాకు ఈ సాయంకాలం మరో సారి రుజువయ్యింది. మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు’ అని చెప్పి అందరికీ శిరసు వంచి నమస్కరించాడు. మమ్మల్ని కూడా లేచి నిలబడి నమస్కరించమన్నాడు. ఆయన ఇంగ్లిషులో చెప్పిన మాటల్ని ఫారెస్టు అధికారి అందరికీ మళ్ళా తెలుగులో అనువదించి చెప్పాడు. మరోసారి అంతా చప్పట్లు కొట్టారు.

టీ, బిస్కట్లు సర్వ్ చేసారు. టీ తాగుతుండగా సేన్ గుప్త ఆ రాజు అనే యువకుణ్ణి దగ్గరగా పిలిచాడు. అతడి తలమీద చేయివేసి ఆశీర్వాదపూర్వకంగా తలనిమిరాడు.

ఈ పున్నమి రాత్రి గురుదేవుల పేరు ప్రస్తావించి మీరు మా బెంగాల్ని తాడుకట్టి ఇక్కడిదాకా లాక్కొచ్చేసారు అని అంటూ ‘ఆయన పుస్తకాలు ఏం చదివారు మీరు?’ అనడిగాడు. ఆ పిల్లవాడు ఏదో చెప్పడం మొదలుపెట్టాడుగాని అప్పటికే గ్రామస్థులంతా లేచి ఒక్కొక్కరే మా దగ్గరనుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతూండటంతో ఆ మాటలు నాకు  స్పష్టంగా వినబడలేదు.

5-4-2023

15 Replies to “ఆ వెన్నెల రాత్రులు-3”

 1. “ఆరోగ్యం అన్నిటికన్నా ముందు మానసికమనీ అనిపించకుండా ఉండదు.”

  వైద్యానికి స్వస్తి పలికే వాక్యం.

  ఇపుడు డాక్టర్ చినవీరభద్రులు అనకుండా ఉండలేను…సర్.

 2. కథ ఆసక్తికరంగా సాగుతూ ఉంది. పల్లెటూరు వర్ణన నాటి అన్ని గ్రామాలకు ప్రతీక లాగా కన్పించింది.

 3. ‘వనలతా సేన్’ ని మీరు తెలుగు చేశారా!?

  ఈ ఒక్క భాగంలోని ల్యాండ్ స్కేప్స్ ని, గిరిధర గౌడ గారి బొమ్మలతో వచ్చిన శ్రీరమణ గారి ‘నాలుగో ఎకరం’ లాంటి పుస్తకంతో సన్మానించాలి అనిపించింది.

  1. .వనలతాసేన్

   సింహళ సముద్రాలనుండి మలయా జలసంధి దాకా
   యుగాలుగా నేనీ పృథ్వీమార్గాలమ్మట సంచరించాను,
   అర్ధరాత్రులు ఏకాకిగా ప్రయాణించాను.
   బింబిసార అశోకుల మసకజ్ఞాపకాల్లోంచి
   నీడలు కమ్మిన విదర్భ గుండా
   అంధకారకాలప్రాంగణంలో సంచరించాను.
   అలసిన నా ఆత్మచుట్టూ ఇంకా ఘోషిస్తున్న
   కోపోద్రిక్తతరంగాల మధ్య నా ఏకైకశాంతి నాటోర్ వనలతాసేన్.

   విదిశలో కమ్ముకునే అర్ధరాత్రి లాంటి కేశపాశం.
   శ్రావస్తి శిల్పంలాంటి వదనం.
   తుపాను వెలిసిన తరువాత సముద్రం మీద చుక్కాని లేని నావికుడు
   దాల్చినచెక్కల దీవిలో పచ్చికబయలు కనుగొన్నట్టు నేనామెను చూశాను.
   పక్షిగూళ్లలాంటి నేత్రాలతో నన్ను చూస్తూ,
   ‘ఇన్నాళ్లుగా ఎక్కడున్నావు?’ అంటూ,
   మరేమో అడిగింది నాటోర్ వనలతాసేన్.

   సాయంకాలపు మంచు రాలుతున్న వేళ
   మహాశకుంతం తన రెక్కలమీంచి
   సూర్యబింబసుగంధాన్ని తుడిచేసుకుంటున్న వేళ
   ప్రపంచపు చప్పుళ్లన్నీ అణగిపోయేవేళ
   మిణుగురుపురుగుల కాంతిలో
   ప్రాచీన తాళపత్రమొకటి మాంత్రికరాత్రి కథలు
   వినిపించడానికి సమాయత్తమవుతున్నది.
   ప్రతి పక్షీ గూడు చేరుకున్నది. నదులన్నీ సాగరానికి చేరుకున్నవి.
   చీకటి చిక్కబడింది. ఇదీ సమయం వనలతా సేన్ కి. (2014)

   ~

   మీకు కానుకగా.

   1. తెలుగుకి ముందుగానే దగ్గరైందన్నమాట వనలత. కోపోద్రిక్త తరంగాల జీవిత సముద్రం, ప్రాచీన తాళపత్రాలు, మార్మికరాత్రి వంటి మీవైన మాటల చేరికతో ఇంకాస్త అర్థవంతంగా వచ్చినట్లుంది.

    ఎప్పుడైనా ఒకసారి ఆ పురా భౌగోళిక, చారిత్రక వీధుల్లోంచి నాటోర్ వనలతా సేన్ దగ్గరకి తీసుకువెళ్లి చూపించండి. ధన్యవాదాలు.

   2. ..చదువుతున్నప్పుడు, ఆగి అడగాలనుకున్నది ఇలా అగుపించడం.. ఆనందకంగా ఉంది

 4. అందమైన గ్రామం ఎలా వుండాలో చక్కగా వర్ణించి మా మనోనేత్రాలముందు ఆవిష్కరింపజేశారు.
  రచనలు చేయటానికి మనుష్యుల్ని చదివితే చాలనుకున్ననాకు తప్పక చదవవలసిన పుస్తకాల పరిచయం అవుతోంది.🙏

 5. మీ రచనలలో ప్రతి ఒక్కరూ తమని తాము ఎక్కడో అక్కడ చూసుకుoటారు అన్నది నిజం.
  ఆ ప్రకృతి లో మమేకం కానివారు ఉండరు .
  జీవితాన్ని 40-50 ఏళ్లు వెనక్కి తిప్పే మంత్ర దండం మీ దగ్గర ఉంది మరి!

Leave a Reply

%d bloggers like this: