కర్ణికార పుష్పాలు: మూడు దృశ్యాలు

ఈ రోజు కల్కి ఆన్ లైన్ పత్రికలో ఒకామె రేలపూల గురించి రాసింది. ఇండియన్ లాబర్నమ్ గా పిలిచే రేలచెట్టు తమిళ సంగం సాహిత్యంలో, తేవారంలో కొన్రై పూలచెట్టుగానూ, రామాయణమహాభారతాల్లో కర్ణికారవృక్షంగానూ వర్ణనకు నోచుకున్న సంగతిని గుర్తుచేసిందామె.

వాల్మీకిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. రామాయణ గాథ పొడుగునా ఆయన ఎన్ని పూలనీ, ఎన్ని చెట్లనీ ఎక్కడికక్కడ ఎలా నాటుకుంటూ వచ్చాడో! మళ్ళా కొన్ని పూలు మరీ ప్రత్యేకం. వాటిని చూస్తే ఆయనకి ఒక్క అవస్థకాదు, మానవజీవితంలోని సంతోషం, వియోగం, విలాపం- పరస్పరవిరుద్ధావస్థలు కూడా గుర్తొస్తాయి.

అలాంటి పూలల్లో కర్ణికారపుష్పాలు మరీను. అలాంటి మూడు తావులు చూడండి:

కర్ణికార పుష్పాలు: మూడు దృశ్యాలు

1

(భరద్వాజ ఆశ్రమానికి భరతుడితో వెళ్ళినప్పుడు, అక్కడ కౌసల్య భుజాన్ని ఆనుకుని నిలబడ్డ సుమిత్రను వర్ణిస్తున్న దృశ్యం)

అస్య వామా భుజం శ్లిష్టా యా ఏషా తిష్టతి దుర్మనాః
కర్ణికారస్య శాఖా ఇవ శీర్ణ పుష్పా వనాంతరే

(అయోధ్య:92-22)

ఆమె ఎడమ భుజాన్ని పట్టుకుని
వేలాడుతున్న ఆ దుఃఖితురాలు
అడవిలోపల  వాడిపోయిన
రేలపూల కొమ్మలాగా ఉంది

2

(పర్ణశాలలో సీత కనిపించనప్పుడు రాముడు శోకిస్తో ప్రతి చెట్టునీ, ప్రతి పువ్వునీ, ప్రతి పక్షినీ సీత జాడ గురించి అడుగుతో కర్ణికారవృక్షాన్ని కూడా అడుగుతున్నాడు)

అహో త్వమ్ కర్ణికార అద్య పుష్పితః శోభసే భృశమ్
కర్ణికార ప్రియాం సాధ్వీమ్ శంస దృష్ట్వా యది ప్రియా

(అరణ్య, 60-20)

ఓహో! విరబూసిన కర్ణికారమా!
నీ పూలంటే ఆమెకి ఎంత ఇష్టమని!
అంతమంచి మనిషి, నా ప్రాణం,
ఆమెని చూసి ఉంటే చెప్పవూ!

3

(పంపా సరోవర తీరంలో అడుగుపెట్టిన రామలక్ష్మణులకి అడవి అంతా ఆవరిస్తున్న వసంతశోభ కనిపించింది. ఆ వసంతఋతు వైభవంలో కర్ణికారపుష్పాల పసిడి వెలుగు కనిపించకుండా ఎలా ఉంటుంది!)

సుపుష్పితాంసు పశ్య ఏతాన్ కర్ణికారాన్ సమన్తతః
హాటక ప్రతి సంఛన్నాన్ నరాన్ పీతాంబరాన్ ఇవ.

(కిష్కింధ:1-21)

అంతటా నిండుగా విరబూసిన
ఈ కర్ణికారవృక్షాల్ని చూస్తుంటే
పచ్చటి ఉడుపులు కట్టుకుని
పసిడినగలు తొడుక్కున్నట్టుంది

26-4-2024

6 Replies to “కర్ణికార పుష్పాలు: మూడు దృశ్యాలు”

  1. చిత్రించనూ బుద్దేస్తుంది.. మీ ప్రొఫైల్ పిక్ లోని కర్ణికార బొమ్మవేయ ప్రయత్నించా

  2. అద్భుతః.. చాలా ఆనందం కలిగింది మీ పోస్టు చదవగానే. కల్పవృక్షంలో విశ్వనాథ వారు యుద్ధకాండలో రామచంద్రుని కాంచె రావణుండు అనే మకుటం తో రాసిన సీసపద్యాల్లో ఒక చోట ఉత్తరీయాన్ని వర్ణిస్తూ “పరిచితారగ్వధావనిజాత కిసలయో పరిసాంధ్యరాగ సంవ్యానయుగళు”
    అంటారు. అందరికీ సుపరిచితమైన రేలచెట్టు లేత పూల పూత సంధ్యారాగపు ఎరుపు రంగుతో వున్న ఉత్తరీయం రామచంద్రుని భుజాలను అలంకరించివుందంటూ.. బహుశా వాల్మీకి రామాయణం లో ఈ రేలపూల ప్రస్తావనను తనదైన రీతిలో ఉపమామించారనుకుంటా..

  3. నమస్సులు. కర్ణికార వృక్షాలు అని వినడం. ఇదే మొదటి సారి. కర్ణికార వృక్షాలకి పూచే పూవుల్ని రేలపూలు అంటారని తెలుసుకున్నాను. కృతజ్ఞతలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading