బసవన్న వచనాలు-5

కాయికం గురించిన బసవన్న దృక్పథం గురించి మరొక రెండు మాటలు పంచుకోవలసి ఉంది.

మన సమాజంలో కులాల అంతరాల తొలగిపోవాలనీ, కుల వివక్ష సమసిపోవాలనీ ఎవరికుండదు? కాని కులాల పుట్టుక వెనక ఉన్న మానసిక ఆధిపత్య భావనల్ని క్షాళనం చెయ్యకుండా కులవివక్ష నిర్మూలన ఎలా జరుగుతుంది?

కులవివక్ష మూలాలు వృత్తి వివక్షలో ఉన్నాయి. కొన్ని శౌచ వృత్తులనీ, కొన్ని అశౌచ వృత్తులనీ అనుకోవడంలోంచే మలినవృత్తుల్ని కొందరికి కట్టబెట్టి, ఆ వృత్తుల్నించి వాళ్ళు తప్పించుకోడానికి వీల్లేకుండా కులాల చట్రాల్ని బిగించారని మనం గుర్తుపట్టలేమా? కులాల మధ్య మొబిలిటీ సాధ్యం కావడం ద్వారా, నిమ్నవృత్తులనుంచీ, మలినవృత్తులనుంచీ చదువు ద్వారా, ఉద్యోగ అవకాశాల ద్వారా, రాజకీయాధికారం ద్వారా కొందరు బయటపడవచ్చుగాక, కాని ఆ వృత్తులపట్ల సమాజంలో ఒక ఏహ్యత ఉన్నంతకాలం ఆ వృత్తులు చెయ్యవలసినవచ్చినవాళ్ళు ఎప్పటికీ వివక్షకి గురవుతూనే ఉంటారు కదా.

ఉదాహరణకి గ్రామాల్లో ‘అగ్రకులాలు’ అనబడే వాటిలో పుట్టి బతుకుతెరువుకోసం పట్టణాలకు వచ్చి హోటళ్ళలో వెయిటర్లగానో, గిన్నెలు కడిగేవాళ్ళుగానో, లేదా వీథులు ఊడ్చేవాళ్ళుగానో, లెదా సులభ్ కాంప్లెక్సుల్లో పనిచేసేవాళ్ళుగానో ఉపాధి వెతుక్కునేవాళ్ళున్నారనుకుందాం. వాళ్ళు కులంవల్ల వివక్షకి లోనుకాకపోయినా, వృత్తి వల్ల వివక్షకీ, చిన్నచూపుకీ గురికాకుండా ఉండగలరా? ఈ సమస్యకి ఆర్థిక, సాంకేతిక పరిష్కారాలు వెతకడంతో పాటు, మానసిక పరిష్కారం కూడా ఒకటి వెతకాలి. అదేమంటే, ఏ వృత్తీ కూడా నీచమైంది కాదనీ, మలినవృత్తి అంటూ ఏదీ లేదనీ సమాజానికొక సంస్కారాన్ని అలవర్చడం అత్యవసరం. బసవన్న తన కవిత్వం ద్వారా చేయడానికి ప్రయత్నించింది ఇదే.

కాని ఆయన ఇక్కడితో సంతృప్తిచెందలేదు. వృత్తిపరమైన మాలిన్యాన్ని మనిషికీ, అతడి కుటుంబానికీ, అతడి అస్తిత్వానికీ అంటగట్టే సమాజం దృష్టిని మార్చాలంటే తాను కూడా వాళ్ళల్లో ఒకడిగా మారితే తప్ప సాధ్యం కాదని ఆయన అనుకున్నాడు. ఎన్నో వందల ఏళ్ళ తరువాత గాంధీగారు కూడా ఇదే అభిప్రాయానికి చేరుకున్నారు. కాని ఆయన తన జీవితకాలంలో తననొక నేతపనివాడుగా చెప్పుకున్నారు. మరొక జన్మంటూ ఉంటే ఆ జన్మలో తాను దళితుడిగా పుట్టాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. కాని ఎనిమిది వందల ఏళ్ళకి ముందే బసవన్న తన జీవితకాలంలోనే తాను మానసికంగా దళితుడిగా మారగలిగాడు. ఈ వచనం (348) చూడండి:

మా నాన్న మాల చెన్నయ్య
మా పెదనాన్న డొక్కల కన్నయ్య
చిన్నాన్న మా అయ్య కనవయ్య
మా అన్నయ్య కిన్నరి బ్రహ్మయ్య
ఇంకా మీరు నన్ను గుర్తుపట్టడంలేదు
కూడలసంగమదేవా?

తన కాలంలో ‘అగ్రవర్ణం’ గా పరిగణించే బ్రాహ్మణ కులంలో పుట్టిన అపరాధానికి ఆయన జీవితమంతా కుమిలిపోతూనే ఉన్నాడు. ఈ వచనం (343) చూడండి:

ఉత్తమ కులంలో పుట్టాననే
కష్టం నా నెత్తిన బరువుమోపకండయ్యా
మీరలా చేస్తే
కక్కయ్య తాను తినగా మిగిలింది
నాకు పెట్టడు
దానయ్య శివదానం చెయ్యడు
మన్ననల చెన్నయ్య
నన్ను మన్నించడు
మహాప్రభో! కూడలసంగమదేవా!

ఇంకా తీవ్రమైన ఈ వచనం (346) చూడండి:

చెన్నయ్య ఇంట్లో
పనిచేసేవాడి కొడుకు

కక్కయ్య ఇంట్లో
పనిమనిషి కూతురు

పేడకళ్లలెత్తటానికి పొలానికి పోయి
ఒక్కటయ్యారు.

వాళ్ళిద్దరికీ
పుట్టిన పిల్లాణ్ణి నేను,
కూడలసంగమదేవుడు
సాక్షి.

వృత్తిని బట్టి మనిషి తారతమ్యాలు ఎంచే దోషం నుంచి తాను బయటపడాలనుకున్నది కేవలం పౌరవృత్తుల విషయంలోనే కాదు, దొంగలు, వ్యభిచారులు, చివరికి ఖైదీల విషయంలో కూడా ఆ రకమైన భేదదృష్టినుంచి ఆయన బయటపడాలనుకున్నాడు.

ఈ వచనం చూడండి (151, వచనము, బసవసమితి, బెంగుళూరు)

దొంగ, బంధితుడు, పాములవాడు, వ్యభిచారి
బంటు, సైనికుడని వ్యాఖ్యానించినా
నీవు మొదలుగా వచ్చిన భక్తులను నీవే అని అనకున్నా
అది ద్రోహం.
నడత, నుడులలో తేడా కలిగితే
కూడల సంగని చూపిన చన్నబసవన్నపై ఆన.

బసవన్నలో ఈ దృష్టి, ఈ సంస్కారం ఏ మేరకు చేరుకుందంటే, ఒక మనిషి ఎంత ‘హీన’ వృత్తి చేస్తే, ఎంత ‘మలిన’ వృత్తి చేస్తే, ఆయన అన్ని రెట్లు అధికంగా ఆ మనిషిని గౌరవించడం మొదలుపెట్టాడు.

ఈ మానసిక పరిణితికి ఒక దృష్టాంతాన్ని పాలుకురికి సోమన బసవపురాణంలో అత్యంత హృద్యంగా వర్ణిస్తాడు. శివనాగుమయ్య అనే ఒక దళిత శివభక్తుడితో బసవన్న కలిసి తిరుగుతున్నాడని కొందరు బిజ్జలుడికి ఫిర్యాదు చేస్తే రాజు ఆ శివనాగుమయ్యకు కబురంపిస్తాడు. తీరా అతడు తనని చూడటానికి వస్తుంటే, అతడు కొలువులో అడుగుపెడితే కొలువు మైల పడుతుందని రాజు తానే మందిరంలోంచి బయటికి వెళ్తాడు. బసవన్న కూడా ఆయనవెనకనే బయటకి వెళ్ళి అక్కడికి వచ్చిన శివనాగుమయ్యని అక్కడ అరుగుమీద కూచోమని చెప్తూ, తన ఉత్తరీయం తీసి ఆ అరుగు శుభ్రం చేసి అక్కడ కూచోమంటాడు. అదంతా రాజూ, తక్కిన సభాసదులూ చూస్తూ ఉండగా. బసవపురాణంలోని ఈ దృశ్యం నేను జీవించినంతకాలం నా మనసులోంచి తొలగదు. అలా de-classify కాగలిగిన మనిషి, de-castify కాగలిగిన మనిషి ఈ రోజు నాకు కనబడితే, నేను అతడి ఇంట్లో సంతోషంగా అంట్లు తోముతాను.


41

భక్తుడి ముఖమనే అద్దంలో
దైవాన్ని చూడొచ్చు.

భక్తుడి దేహంలో దేవుడు
రెప్పకూడా వాల్చకుండా

భక్తుడు మాట్లాడే మాటల్లో
రాశీభూతుడై నిలుస్తాడు. (145)

42

జాణ అంటే అతడు, లింగాన్ని నమ్మినవాడు
జాణ అంటే అతడు, జంగానికి ధనం ధారపోసేవాడు
జాణ అంటే అతడు, కూడల సంగమ శరణుడు
అతడు జాణ,
యముడి నోటినీ, తోకనీ కూడా కోసేగలడు. (153)

43

లెస్స అనిపించుకుని అయిదు దినాలు బతికితే చాలదా
లెస్స అనిపించుకుని నాలుగు దినాలు బతికితే చాలదా
లెస్స అనిపించుకుని మూడు దినాలు బతికితే చాలదా
లెస్స అనిపించుకుని రెండు దినాలు బతికితే చాలదా

జీవితం శివభక్తానాం వరం పంచదినానిచ
అజకల్ప సహస్రేభ్యో భక్తిహీనస్య శాంకరీ
అని అన్నారు కాబట్టి

కూడల సంగమశరణుల మాటల్లో లెస్సనిపించుకుని
ఒక్కదినం బతికితే చాలదా? (154)

44

ఈ మర్త్యలోకం ఆయన టంకసాల.
ఇక్కడ చెల్లేవాళ్ళు అక్కడా చెల్లతారు
ఇక్కడ చెల్లనివాళ్ళు అక్కడా చెల్లరయ్యా
కూడల సంగమదేవా ( 155)

45

పొద్దున్నే లేచి శివలింగదేవుణ్ణి
కళ్లప్పగించి చూడనివాడి జీవితం ఏమి జీవితం?
వాడిదేం జీవితం?
బతికే పీనుగది, చచ్చే పీనుగది.
ఏమిజీవితం వాడిది?
నడిచే పీనుగది, నసిగే పీనుగది.

ఏమి జీవితం వాడిది
నీకు బానిసగా బతకనివాడిది?
కర్తా! కూడలసంగమ దేవా!(157)

46

అత్యవసరం, అత్యవసరం.

కాసిన కాయం రాలకముందే
వినియోగించవయ్యా
పిడకలు ఏరడంలోనే పొద్దుపోకముందే
వండుకు తినవయ్యా!

మళ్ళీ పుడతావో పుట్టవో

మనల్ని పుట్టించిన
కూడలసంగముడికి శరణనవయ్యా (168)

47

సదాశివుడనే లింగాన్ని నమ్ముకొమ్మని
పెద్దలు చెప్పినమాట
చూడండయ్యా!
పరుసవేది.

నమ్మారా! నెగ్గడం ఖాయం!

కూడలసంగమ శరణుల మాటలు వేపరుచి
నోటికి చేదు, కడుపుకు తీపి. (171)

48

పొద్దున్నే పోయి నీళ్ళూ, పత్రీ తెచ్చి
పొద్దుపోకముందే దేవుణ్ణి పూజించు.

పొద్దుగడిచాక నువ్వెవరికి గుర్తుంటావు?

పొద్దుపోకముందే
మృత్యువు ముట్టకముందే
పోయి మొదలుపెట్టవయ్యా
కూడలసంగమసేవ. (172)

49

ఎందుకయ్యా ఆందోళనపడతావు
ఈ సంసారాన్ని తలుచుకుని?

రోజూ, ప్రతి రోజూ శివరాత్రి చెయ్యి.
వెంటనే, వెనువెంటనే
శివపూజ మొదలుపెట్టు.
కూడలసంగముడి పాదాలు పట్టు. (173)

50

యుద్ధరంగంలో అడుగుపెట్టి
తీరా చెయ్యి పైకెత్తకపోతే
శత్రువు చంపడం మానుకుంటాడా?
మీ స్మరణ చెయ్యడం మర్చిపోతే
తనువుని పాపం తినడం మానేస్తుందా?

కూడలసంగమయ్యను
తలచుకుంటే కదా
నిప్పు తాకిన లక్కలాగా
పాపం కరిగిపొయ్యేది (178)

26-11-2023

12 Replies to “బసవన్న వచనాలు-5”

  1. ఇంట్లో పనిచేసే మనిషికి అమ్మకు ఇచ్చినంత ప్రేమతో గౌరవంతో టీ ఇవ్వాలి అని నా వద్ద ఉన్న వాళ్లకు చెబితే నా భయంతో ఇస్తారు కానీ ప్రేమతో ఇవ్వటం తెలియాలంటే ఇదిగో ఇలాంటివి చదవాలి.

  2. శుభోదయం sir,
    “కూడల సంగమ శరణుల మాటల్లో
    లెస్స అనిపించుకుని
    ఒక్కదినం బతికితే చాలదా”

    పంది గా పదేళ్లు బతికే కన్నా
    నంది గా నాలుగేళ్లు బతకడం
    కదా జీవితమంటే….

    బిజ్జలుని సమక్షం లో శివనాగుమయ్య ను బసవన్న ఆదరించిన తీరు
    ఆనాటి కాలానికే కాదు
    ఈనాటికీ అది అద్భుత దృశ్యమే!

    కార్తిక మాసం లోని ఉదయాలు మీరు వినిపించే బసవన్న వచనాలతో శివమయమై
    పాఠకుల హృదయాలు కైలాసవాసునితో
    మమేకం అవుతున్నాయి.
    ధన్యవాదాలు sir.

  3. “ఏ వృత్తీ కూడా నీచమైంది కాదనీ, మలినవృత్తి అంటూ ఏదీ లేదనీ సమాజానికొక సంస్కారాన్ని అలవర్చడం అత్యవసరం.” 🙏🏽

    “అలా de-classify కాగలిగిన మనిషి, de-castify కాగలిగిన మనిషి ఈ రోజు నాకు కనబడితే, నేను అతడి ఇంట్లో సంతోషంగా అంట్లు తోముతాను.“ 🙇🏻‍♀️

  4. De-classifiy , de-castify నా చుట్టూ వర్గరహితమూ వర్ణ రహితమూ అయినా వ్యవస్థ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం లో నా ఇంటర్మీడియట్ రోజుల నుంచీ పది సంవత్సరాల పాటు రోజూ యుద్ధం చేసాను ఇంట్లో నిషిద్ధ ఆహారాన్ని తినడం తో సహా అప్పుడు నేను చాలా మందికి నచ్చేవాణ్ణి కాదు ఇప్పుడు అందరికీ నచ్చుతున్నా నాకు నేను తప్ప….అప్పటి నా ఆలోచనలు తప్పు కాదని ఇప్పుడు మీరు చెప్పారు 🙏

  5. Egalitarian society గురించి చదువుకున్నప్పుడు ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సమానులే అని చెప్పారు. బసవన్న చెప్పింది కూడా అదే కదా. దానిలో రాజు, సేవకుడు ఇద్దరూ ఉండకూడదు. అలా మీరు సేవకుడులా మారారంటే అర్థం అది ఒక paradox అని కాదా?? దానిలో…పాత్రలు మారొచ్చు కానీ మరల అది ఒక సోపానమే కదా… అలా కాకుండా…తన పనిలో మీరు భాగస్వామిగా ఉంటాననో లేదా మీ పనిలో తనని సహచరుడుగా స్వాగతిస్తాననో చెపితే…శ్రమలో భాగీధారి అయితే… అప్పుడు సమానత్వం స్థాపించినట్లు కాదా??

    బసవన్న మానసికంగా దళితుడుగా మారాడు అన్నారు కదా… నాకు మానవుడిగా మారాడేమో….. అనిపించింది. ఇంకా చెప్పాలంటే…దేవుడిగా మారాడేమో…
    మళ్లీ దళితుడుగానో… బహుజనులు గానో మారటం అంటే ఇంకో ముద్ర ఆపాదించటం కాదా… ఈ చట్రంకి ఆవల ఉన్న సమ సమాజ స్థాపన చేరుకోలేము కదా..

    మిమ్మల్ని ఇలా అడగటంలో ఉద్దేశ్యం నా అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవటం మాత్రమే అండి…తెలియని విషయాలు మీ లాంటి విజ్ఞులు దగ్గరే కదా నేర్చుకోవాల్సింది..

    1. చాలా చక్కగా రాశారు. మీరు రాసింది అక్షర సత్యం. కాకపోతే ఒక వివక్షని నిర్మూలించే క్రమంలో మనుషులు సమానులయ్యే క్రమంలో అంతదాకా అణిచివేత గురైన వాళ్ళు పైకి రావడంతో పాటు, అణచివేస్తున్న స్థానాల్లో ఉన్నవాళ్లు మరింత నేలకు దగ్గరగా జరగడం కూడా తప్పనిసరి.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading