మట్టిమనిషి

అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రసిద్ధ నాటకరచయిత వల్లూరి శివప్రసాద్ గారు మొన్న ఫోన్ చేసి వాసిరెడ్డి సీతాదేవి గారి ‘మట్టిమనిషి’ నవలను తాను నాటకీకరణ చేసాననీ, ఆ ప్రదర్శన రవీంద్రభారతిలో ఉంటుందనీ, చూట్టానికి నన్ను కూడా రమ్మనీ ఆహ్వానించేరు.

శివప్రసాద్ గారు గంగోత్రి సాయిగారితో కలిసి ‘ప్రసిద్ధ తెలుగు నాటకాలు’ (1880-2020) పేరిట వంద సుప్రసిద్ధ తెలుగు నాటకాల్ని ఆరుసంపుటాలుగా వెలువరించిన వ్యక్తి. తానా ప్రచురణలుగా వెలువడ్డ ఆ ఆరుసంపుటాలు (2021) సామాన్యమైన కృషి కాదు. తెలుగు నాటక ప్రేమికులకి అదొక రత్నమంజూష. అటువంటి సాహితీవేత్త తాను నాటకీకరణ చేసిన ప్రదర్శనకు నన్ను రమ్మని స్వయంగా ఆహ్వానించడం నాకు చాలా సంతోషమనిపించింది. కాని ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు నన్ను మరింత ఉబ్బితబ్బిబ్బు చేసాయి.

తాను ఆ నవలను నాటకీకరించడానికి పరోక్షంగా నేనే కారణమని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. నస్రీన్ ఇషాక్ దర్శకత్వం వహించిన ‘పాకుడురాళ్ళు’ నాటకం మీద నేను నా బ్లాగు లో రాసిన సమీక్ష తనకి ఎవరో పంపించారనీ, అది చదవగానే తాను ఆ డైరక్టరుతో మాట్లాడి పాకుడురాళ్ళు మరో ప్రదర్శన గుంటూరులో ఏర్పాటు చేసాననీ చెప్పారాయన. అంతేకాదు, తాను కూడా అటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదనిపించి మట్టిమనిషి నవలను నాటకంగా మలచగలరా అని నస్రీన్ గారిని అడిగాననీ, ఆ ప్రయత్నమే ఇన్నాళ్ళకు తొలి ప్రదర్శనగా సిద్ధమైందనీ, కాబట్టి నేను కూడా వచ్చి ఆ నాటకం చూస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందనీ అన్నారాయన.

సంతోషంగా వెళ్ళాను. నిన్న రవీంద్రభారతిలో రసరంజని సమర్పణగా తొలిప్రదర్శనకు నోచుకున్న మట్టిమనిషి నాటకానికి హాలంతా కిక్కిరిసిపోయింది. టిక్కెట్టు కొనుక్కుని మరీ అయిదువందలమందికి పైగా ప్రేక్షకులు హాజరవడం రసరంజని చరిత్రలోనే మొదటిసారి అని నిర్వాహకులు వేదికమీద సంతోషంగా ప్రకటించారు కూడా.

నాటక ప్రదర్శన పూర్తయ్యాక, ప్రేక్షకులనుంచి కూడా స్పందనలు వినిపించమని కొందరు సందర్శకులు కోరినమీదట నిర్వాహకులు నన్నూ, శివారెడ్డిగారినీ స్పందన తెలియచెయ్యమని కోరారు.

నేనక్కడ పంచుకున్న స్పందననే ఇక్కడ మళ్ళా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

తెలుగులో గొప్ప నవలలు, కథలు ఎన్నో వచ్చినప్పటికీ, తెలుగు సినిమారంగం, టెలీవిజన్ సీరియల్ రంగం వాటిని ప్రదర్శనయోగ్యాలుగా స్వీకరించే స్థితిలో లేకపోవడం తెలుగు వారి దురదృష్టం. ఒక జాతి తన కథల్ని దృశ్యశ్రవణమాధ్యమాలుగా ఎంత సమర్థవంతంగా మార్చుకోగలిగితే ఆ జాతి అంత చైతన్యవంతంగా ఉందని చెప్పవచ్చు. పాశ్చాత్య ప్రపంచంలో ఒక నవల ప్రసిద్ధంకాగానే వెంటనే దాన్ని సినిమాగా తియ్యడానికి నిర్మాతలూ, దర్శకులూ, దాన్ని తెరమీద చూడటానికి ప్రేక్షకులూ కూడా ఉవ్విళ్ళూరుతుంటారు. కాని తెలుగులో సినిమా కథ అంటే నిర్వచనం వేరు. నిజానికి తెలుగు సినిమాలో ఫార్ములా ఉంటుంది తప్ప, కథ ఉండదు. కొన్నాళ్ళకు ఆ ఫార్ములా predictable గా మారిపోకతప్పదు. అప్పుడు మళ్ళా మరొక ఫార్ములా తయారు చేసుకోడం మొదలుపెడతారు. సరిగ్గా ఇదే భావదారిద్య్రం తెలుగు రాజకీయాల్లోకీ, పరిపాలనలోకీ కూడా ప్రసరించడం మొదలుపెట్టింది. కథ ఫార్ములా కాదు. నిజానికి ఫార్ములా break అవడమే కథ. జీవితంలో predictablity విఫలమవడంలోంచే కథ పుడుతుంది. కాబట్టి తెలుగు సినిమా, టివీ ఫార్ములాని వదిలిపెట్టి కథకి దృశ్యకల్పన చెయ్యడం మొదలుపెడితే తప్ప తెలుగు జాతి సాంస్కృతికంగా పరిణతి చెందడం మొదలుపెట్టదు.

అదృష్టవశాత్తూ సినిమా, టివీ విఫలమైన ఈ తావులో తెలుగు నాటకం తిరిగి ప్రాణం పోసుకుంటోంది.  నిజానికి చాలాకాలం కిందట మాలపల్లి నవలని నగ్నముని నాటకీకరించడంతో ఈ ప్రయత్నం మొదలయ్యిందికాని, మధ్యలో చాలా పెద్ద విరామమే నడిచింది. తెలుగు మాతృభాషకాని ఒక దర్శకురాలు ఇప్పటికే రెండు సుప్రసిద్ధ తెలుగు నవలలు, ‘మైదానం’, ‘పాకుడురాళ్ళు’ నాటకీకరించడంతో తెలుగు నాటకంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె  మట్టిమనుషులు నవలను నాటకీకరించడం ఈ ప్రయాణంలో మరొక పెద్ద మజిలీ. ఇక రానున్న రోజుల్లో తెలుగులోని ఎన్నో గొప్ప నవలలు, కథలు ఇలా రూపకాలుగా మారతాయని మనం ఇప్పుడు బలంగా నమ్మవచ్చు.

మట్టిమనిషి యాభై ఏళ్ళ కింద వెలువడ్డ నవల. అరవైల్లో, డెబ్భయిల్లో తెలుగు గ్రామసీమ పట్టణీకరణ, నగరీకరణ చెందుతున్న కాలం నాటి సంఘర్షణను విస్తృతంగా చిత్రించిన నవల. వ్యవసాయాన్నీ, రెక్కల కష్టాన్నీ మాత్రమే నమ్ముకున్న ఒక రైతు కుటుంబంలో, అతడి తర్వాతి తరం పట్టణ జీవితాన్నీ, పెట్టుబడినీ, సినిమా వ్యాపారాన్నీ కోరుకోడంతో, ఆ కుటుంబ జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది. రెండవ తరం చేసిన పొరపాట్ల వల్ల మూడోతరం అనాథగా మారినప్పుడు, ఆ పిల్లవాడు తిరిగి తన తాత దగ్గరికి చేరుకుంటాడు. ఆ తాతామనవలిద్దరూ మళ్లా మట్టిని నమ్ముకున్న మనుషులుగా సేద్యం మొదలు పెట్టడంతో కథ పూర్తవుతుంది

ఇంత నేలని వ్యవసాయభూమిగా మార్చి ఏడాదిపాటు రెక్కలు ముక్కలు చేసుకుని సాగుభూమిగా మార్చడం కన్నా అక్కడొక సినిమా హాలు కట్టడం ఎక్కువ లాభదాయకం అనీ, తొందరలోనే పెట్టుబడి రెండింతలూ, మూడింతలూ అవుతుందని నమ్మిన కాలం నాటి కథ మట్టిమనిషి. ఆ జూదం చివరికి మానవసంబంధాల్ని ఎలా భగ్నం చేస్తుందో, చెమట, పంట, పండగల ప్రపంచంలోకి తాగుడు, అక్రమసంబంధాలు, కోర్టుకేసులు, హత్యలు, జైళ్ళు ఎలా వచ్చిచేరతాయో ఆ వికృతత్వం తాలూకు సహజపరిణామాన్ని మట్టిమనిషి నాటకం ఎంతో బలంగా కళ్ళముందు కదలాడేట్టు చేసింది.

ఆ నాటకం చూస్తున్నంతసేపూ, ఆ కథాంశానికి కాలం చెల్లలేదనీ, ఇప్పుడు మన సమాజంలో మట్టిమనిషి వెర్షన్ 2.0 నడుస్తోందనీ నాకు పదే పదే అనిపించింది. ఇప్పుడు సాగుభూమిని సినిమాహాలుగా మార్చి పెట్టుబడిని రెండింతలు, మూడింతలు చేసుకోడం మీద కాదు, ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ పాచికగా మార్చి, పెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే పదింతలు చేసుకోవాలనే రాక్షసదురాశ ఆవహించిన కాలంలో ఉన్నాం. ఆ మాయలో పడి ఎన్ని జీవితాలు, ఎన్ని దాంపత్యాలు, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయో, ఆ కథల్ని బలంగా చెప్పగల రచయితలూ, ఆ కథల్ని కళారూపాలుగా మార్చగల దర్శకులే చాలినంతమంది లేరిప్పుడు!

నిభా థియేటర్ ఎన్ సెంబుల్ వారు ఈ నవలల్ని నాటకాలుగా మార్చేటప్పుడు సాంప్రదాయికంగా అంకాల వారీ నాటకాలుగా కాకుండా బ్రెహ్ట్ తరహాలో episodic కథాగమనాలుగా మారుస్తున్నారు. ఈ నవలని నాటకంగా మార్చినప్పుడు కూడా తెంపులేని సన్నివేశమాలికగా కథని ప్రదర్శించడంతో కథాగమనంలో వేగం, ఉత్కంఠ చోటుచేసుకున్నాయి. అంకాల వారీగా ఉండే సాంప్రదాయికనాటకంలో పాత్రల మనోధర్మంతో ప్రేక్షకుడు ఎక్కువ మమేకం కావడానికి వీలుంటుంది. కాని ఇక్కడ పాత్రలకన్నా కథ ప్రధానం, సంఘటనలు ప్రధానం, సమాజాన్ని నడిపిస్తున్న శక్తుల గురించి ప్రేక్షకుడికి కలిగించే జాగృతి ప్రధానం. ఈ రెండు పద్ధతుల్లో ఏది మేలైనది అన్నది చెప్పడం కష్టం. నాటకం పూర్తయ్యాక అంతిమంగా లెక్కకొచ్చేది, ప్రదర్శన సఫలమయిందా లేదా అన్నది మాత్రమే.

నాటకంలో ప్రతి ఒక్క పాత్రధారీ తన పాత్రకి న్యాయం చేసాడనే చెప్పాలి. కాని పాకుడురాళ్ళులో మంజరి లానే ఈ నాటకంలో కూడా వరూధిని పాత్రధారి తక్కిన పాత్రలకన్నా ఒక మెట్టు ఎక్కువగానే కథని నడిపించింది అని చెప్పవచ్చు. గ్రామం పట్టణంగా మారడంలోని జిగిబిగి, గజిబిజి, మిలమిల, తళతళ మొత్తం ఆమె రూపరేఖావిన్యాసాల్లో విస్మయకరంగా రూపుకట్టిందని చెప్తే అతిశయోక్తి కాదు. ఆమె తర్వాత స్థానంలో వెంకట పతి పాత్రధారి నా ప్రశంసకి నోచుకుంటాడు.

ఇది తొలిప్రదర్శన అనీ, తర్వాత ప్రదర్శనల్లో మరింత మెరుగుపర్చుకుంటాం అనీ నాటకబృందం చెప్పుకున్నారు. వారు దృష్టి పెట్టవలసిన అంశాలు ఒకటి రెండున్నాయి. మొదటిది, నాటకం మొదట్లో సాంబయ్య పాత్రను నిర్మిస్తున్నప్పుడు, అతడికి పొలం తప్ప మరేదీ పట్టదని చెప్పే క్రమంలో అతణ్ణి పిసినారిగానూ, భార్య మరణానికి కూడా చలించని రాతిమనిషిగానూ చిత్రించారు. ఆ రకమైన అభిప్రాయం నవల్లోనే ఉందేమో నాకు తెలియదు. కాని అది పాత్ర ఔచిత్యాన్ని భంగపరుస్తున్నది. అలాగే రామనాథబాబుకీ, వరూధినీ మధ్య దూరం పెరగడాన్ని చిత్రించేటప్పుడు అందుకు కారణాల్ని ఎప్పటికప్పుడు మరింత స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. తిట్లు, ముఖ్యంగా స్త్రీలని కించపరిచే లాంటి తిట్లు గ్రామీణ సమాజంలో సాధారణమే అయినప్పటికీ, వాటిని మనం రంగస్థలం మీద ప్రయోగించడం విషయంలో చాలా జాగ్రత్తవహించాలి. అసలు ఆ తిట్లు వాడకుండానే సంభాషణల్ని నడపగలమనే నా నమ్మకం. (ఈ సమస్య ఈ నాటకానికే కాదు, ఆ మధ్య కన్యాశుల్కాన్ని రంగస్థలం మీద చూసినప్పుడు కూడా ఈ తిట్లు  అడుగడుగునా నన్ను ఇబ్బందిపెడుతూనే ఉన్నాయి).

ఏమైనప్పటికీ ఒక ప్రయోజనకరమైన, అభ్యుదయచైతన్యం కలిగిన, మానవతా పరిమళాన్ని వెదజల్లుతున్న ఒక నాటకాన్ని మనముందుకు తీసుకొచ్చినందుకు వల్లూరి శివప్రసాద్ గారికీ, నస్రీన్ ఇషాక్ గారికీ, నాటకప్రదర్శనకు ఆర్థికంగా మద్దతునిచ్చిన డా.వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ వారికీ, రసరంజని వారికీ మరోమారు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

25-4-2024

9 Replies to “మట్టిమనిషి”

  1. కేవలం ‘మట్టి మనిషి’ నాటక విశ్లేషణ మాత్రమే కాకుండా సాహితీ, సాంస్కృతిక రంగ నడుస్తున్న చరిత్రనూ అవలోకించారు.దర్శకురాలు అనుసరించిన నాటక ప్రక్రియ ఏదైనా సరే, ప్రేక్షకులు జాగృతి ప్రధానం అన్న మీ అభిప్రాయం సముచితంగా ఉంది.నమస్సులు.
    డాక్టర్ బి జయప్రకాష్

  2. చక్కని విశ్లేషణ సర్.
    సమాజాన్ని నడిపిస్తున్న శక్తుల గురించి ప్రేక్షకుడికి కలిగించే జాగృతి ప్రధానం.అనే మాట నాకెంతో నచ్చింది.

    1. ప్రదర్శన ను మించిన ప్రశంశ చేశారు వీరభద్రుడు గారు.ఒక రంగస్థల నటుడు, దర్శకుడు,ప్రయోక్త దృక్పథం నుంచి ప్రదర్శన మంచి చెడ్డలు చూడ్డం వేరు..కేవలం సిద్దాంతం,శాస్త్ర చర్చచేయడం వేరు అని నా అభిప్రాయం.ప్రదర్శనను ప్రేక్షకునికి నేరుగా చేరవేయడంలో నస్రీన్ గారు సఫలత చెందారా లేదా అనేది తానుగా విశ్లేషించుకుని, రాబోయే ప్రదర్శనల్లో మరింతగా కృషి చ ఏం యడవల్ల మెరుగైన ప్రదర్శన ఇవ్వవచ్చు.వరూధిని ఇంట్రోడక్షన్ తరువాత కనుమరుగైన మట్టి మనిషి సాంబయ్య పాత్రను ఎలా నాటకంలోనడిపించ వచ్చు అని రచయిత, దర్శకురాలు ఆలోచన చేయాలి..ఇది మూడు తరాల మట్టినే నమ్ముకున్న మనుషుల కథ.

  3. చాలా చక్కటి విమర్శచేశారు.
    ఎప్పటికీ మీ ముద్ర ప్రత్యేకంగా నూ ,
    అవగాహన పెంచేది గాను వుంటుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading