
23
దొరికిన వెండి రూపాయి
కృష్ణచంద్ర కర్
1934 మే నెలలో మొదటిరోజులు. కటక్ వీథులన్నీ ఒకటే సందడిగా ఉన్నాయి. ఎవరి నోట విన్నా ఒకటే మాట: గాంధీజీ పూరీ నుంచి యాత్ర మొదలుపెట్టి , ఈ రోజుకి తెలంగాపెంథా చేరుకుంటారు. తెలంగాపెంథాలో పెద్ద మామిడి తోపులో ఆయన ఆ రాత్రికి బస చెయ్యబోతున్నారు. మహాత్ముని పాదస్పర్శతో ఆ తోట ఒక పవిత్ర, చిరస్మరణీయ పుణ్యక్షేత్రంగా మారబోతోంది. కులమతాలూ వయోభేదాలూ మరచి, లక్షలాది మంది ప్రజలు బారులు తీరి గాంధీజీ వెంటే నడిచారు.
కటక్ నగరమంతా సరికొత్తగా ప్రాణం పోసుకుంది. గుడిసెలూ, బంగ్లాలూ, చివరకు సందుగొందుల్లోని ధూళిరేణువుల్తో సహా నగరం అణువణువునా ఆనందమూ గర్వమూ నిండిన ఒక పులకింత కనిపించింది. మహాత్ముని దర్శనం చేసుకోవాలన్న ఆత్రుతతో వందలాది మంది తెలంగాపెంథా వెళ్లడానికి సిద్ధమయ్యారు. నది వైపు పోటెత్తుతున్న ఆ మానవ ప్రవాహంలోకి నేను కూడా దూకాను.
మరికొద్ది నిమిషాల్లో నాలుగు గంటలు కావొస్తుంది. కాట్జూరి నది మీద కట్టిన కొత్త ఆనకట్ట ఒక కొస నుండి మరో కొస దాకా కదులుతున్న మనుషుల శిరస్సమూహంతో నిండిపోయి, దూరం నుంచి చూస్తే అదంతా రాముడి వానరసేన కట్టిన వారధిలాగా కనిపిస్తోంది. ఏ దిక్కున చూసినా జనం పారవశ్యంతో నేరుగా కాట్జూరి నదీ తీరం వైపే లంఘిస్తున్నారు; మొత్తం నగర జనాభా అంతా తెలంగాపెంథాలోకి వచ్చి వాలుతోందా అన్నట్టుగా ఉంది.
యావత్ ప్రపంచమూ ఆరాధించే ఆ ‘దిగంబర ఫకీరు’ తన అనుచరుల్తో కలిసి తెలంగాపెంథా మామిడి తోపుకు చేరుకున్నారు. మేం ఆయనకంటే ముందే అక్కడికి చేరుకున్నాం. ఇటీవల వరదల వల్ల అతలాకుతలమైన ఆ ప్రాంతం ఇప్పుడు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. సుదూర గ్రామాల నుంచీ జనం ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. గాంధీజీ కోసం, ఆయన సహచరుల కోసం రాత్రి బసకి అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, వారంతా నేరుగా సభా స్థలానికి బయలుదేరారు. గంభీర స్వరంతో గాంధీజీ సభికులనుద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టారు. మహాత్ముని మాటలు సమ్మోహితులై వింటున్న ఆ జనసందోహంపైన ప్రశాంతనిశ్శబ్దం ఆవరించింది. పేదలపట్లా, ముఖ్యంగా దోపిడీకి గురవుతున్న నిమ్న కులాల హరిజనులపట్లా గాంధీజీ అపారమైన సానుభూతి వ్యక్తం చేశారు. అందుకే అస్పృశ్యతా నివారణను అంతగా నొక్కి చెబుతూ,ఆయన, వారిని గౌరవించమనీ, తమ స్వంత రక్తసంబంధీకుల్లా ఆదరించమనీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. అంటరానివారిని మనం మన సమాజంలో భాగంగా అంగీకరించనంత కాలం స్వరాజ్యానికి అర్థమే లేదని గాంధీజీ కుండబద్దలు కొట్టారు.
సూర్యుని చివరి కిరణాలు మాయమయ్యాయో లేదో, లెక్కలేనన్ని పెట్రోమాక్స్ దీపాలతో ఆ మామిడి తోపంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. రాత్రి చీకట్లు దొంగలా వెనక్కి తగ్గాయి. గాంధీజీ ప్రసంగం ముగియగానే, తమ సందేహాలను నివృత్తి చేసుకోడానికి సభికుల్లో కొందరు లేచి ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ గాంధీజీ సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు.
అప్పటి ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పండిట్ నీలకంఠ దాస్ హిందీలో అడిగిన ఒక్క ప్రశ్న మాత్రమే నాకు గుర్తుంది. ‘బాపూజీ, శాకాహార భోజనమే చేయాలని మీరెప్పుడూ చెప్తుంటారు కదా. మరి ఒరిస్సా ప్రజలు చేపలు తినడం సరైనదేనా?’ అని ఆయన అడిగారు. కరుణామూర్తి అయిన మహాత్మాజీ బదులిస్తూ: ‘ఒరిస్సా జనాభాలో సగానికి పైగా ప్రజలకు రోజుకు ఒక్క పూట కూడా కడుపునిండా తిండి దొరకడం లేదు. వారిలో చాలామంది ఆహారం కోసం పల్లెపల్లెకూ తిరుగుతున్నారు. రాష్ట్రమంతటా విస్తరించి ఉన్న అసంఖ్యాకమైన నదీజలాల్లోనూ, పిల్ల కాలువల్లోనూ, సరస్సుల్లోనూ, చెరువుల్లోనూ, సెలయేళ్లలోనూ చేపల రూపంలో ప్రకృతి వారికి అపారమైన సంపద ప్రసాదించింది. అది కాక సముద్రం కూడా మత్స్యగర్భగా అలరారుతోంది. పేదరికంతో అల్లాడే ఒరిస్సా ప్రజలు వాటితో తమ ఆకలి తీర్చుకోవచ్చు. అందుకోసం వాళ్లు పైసా కూడా ఖర్చు చేయాల్సిన పనే లేదు. వాళ్లు చేయాల్సిందల్లా కాస్త శ్రమపడటమే’ అన్నారు.
సభ ముగిశాక సహపంక్తిభోజనాలు నడిచాయి; హెచ్చుతగ్గుల తారతమ్యాలు లేకుండా వందలాది మంది అగ్రకులాలవారూ నిమ్నకులాలు ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేశారు. ఎంతటి హృద్యమైన దృశ్యమది! శంఖనాదాలతోనూ, హులహులి (మంగళ ధ్వనులు)తోనూ, ‘మహాత్మా గాంధీకి జై’, ‘భరతమాతకు జై’ అన్న నినాదాలతోనూ ఆ పరిసరాలన్నీ మార్మోగాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా గాంధీజీ ఇచ్చిన పిలుపుతో, వేదాలు విధించిన కట్టుబాట్లు సైతం పక్కన పెట్టి బ్రాహ్మణుడూ చండాలుడూ ఇద్దరూ ఆ పవిత్ర స్థలంలో ఏకమయ్యారు. స్వయంగా గాంధీజీయే హరిజనుల మధ్య కూర్చుని భోజనం చేయడం భారత చరిత్రలోనే ఒక నవశకానికి నాంది పలికింది.
భోజనం ముగిశాక గాంధీజీ ఆయన బృందమూ తమతమ గుడారాలకు వెళ్లిపోయారు. జనం ఇళ్లకు తిరుగుముఖం పట్టడంతో ఆ మహత్తర సమావేశం జరిగిన స్థలం నెమ్మదిగా బోసిపోవడం మొదలైంది. అర్ధరాత్రి వేళకు ఆ మామిడి తోటంతా ఖాళీ అయిపోయింది.
అక్కడే ఉండిపోయిన కొద్దిమంది, రాత్రి గడపడానికి ఎవరికి తోచిన చెట్టు కింద వాళ్లు ఆశ్రయం వెతుక్కున్నారు. నేను కూడా విశ్రాంతి తీసుకోడానికి శుభ్రమైన స్థలం కోసం వెతికాను గానీ ఏదీ దొరకలేదు. చివరకు ఆరుబయట ఒక చిరిగిన కొబ్బరి మట్ట కనిపించడంతో, దానిమీద పడుకుని చల్లగాలి ఆస్వాదిస్తూ రాత్రంతా ప్రశాంతంగా గడిపేయవచ్చని అనుకున్నాను. ఆ మట్టమీద కూర్చోగానే, ఇసుకలో మెరుస్తున్న ఏదో వస్తువు అంచు నా కంటపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని చూస్తే, విక్టోరియా రాణి ముఖముద్ర ఉన్న వెండి రూపాయి నాణెం కనిపించింది.
అది దొరికినందుకు మొదట అమితానందం కలిగినా, ఎక్కడ ఏ చిక్కుల్లో పడతానోనన్న భయంతో నా ఆనందం కాస్తా ఆవిరైపోయింది. ఇది ఎవరిది? దీన్నెవరు పోగొట్టుకున్నారు? వాళ్లెవరో నేనెలా కనుక్కోవడం? ఈ నాణేన్ని అసలు యజమానికి ఎలా చేర్చడం? ఆ మనిషి ఎంత కంగారుపడుతుంటాడో కదా! ఇలాంటి ఆలోచనలు నా మనసును ముంచెత్తి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇలాంటి స్థితిలో నిద్ర ఎలా పడుతుంది? కొబ్బరి మట్టమీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా, యువ కాంగ్రెస్ నాయకుడూ గొప్ప వక్తా అయిన రాజకృష్ణ బోస్ నా వైపు నడుచుకుంటూ వచ్చారు. తెల్లవారే సమయం కావస్తోంది. పల్లెటూరి కోడి కూత పెట్టి నిద్రలేపడానికి సిద్ధమవుతోంది.
భారత జాతీయ కాంగ్రెస్‌లో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అనే ఇద్దరు గొప్ప నాయకులు ఎలాగైతే వెలుగులోకి వచ్చారో, ఒరిస్సా కాంగ్రెస్ పార్టీలో కూడా జాదుమణి మంగరాజ్, రాజకృష్ణ బోస్ అనే ఇద్దరు చైతన్యవంతమైన యువ నాయకులు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. కటక్ వీధుల్లో నడుం బిగించి యోధుల మాదిరిగా గంభీరంగా నడిచే వారిద్దరి నడకా చూడముచ్చటైన దృశ్యం. నేను నా జీవిత ప్రస్థానం ప్రారంభించిన వాణిజ్య సంస్థలో రాజకృష్ణ బాబు వాటాలు కొనుగోలు చేశారు. మా పరిచయం అక్కడే మొదలై, ఈనాటికి మరింత సన్నిహితంగా మారింది.
నా ముఖ కవళికల్ని బట్టి, ఏదో కారణం చేత నేను తీవ్రమైన ఆందోళనలో ఉన్నానని ఆయన పసిగట్టారు; ‘ఇంత రాత్రివేళ వరకూ మెలకువగా ఎందుకున్నావు? భయమేస్తోందా?’ అని అడిగారు.
నేను: ఔను.
బోస్: ఈ స్థలం ఏకాంతంగా, నిర్మానుష్యంగా ఉందని భయపడుతున్నావా?
నేను: కాదు.
బోస్: మరి దేనికి నీ భయం?
నేను: ముంచుకొస్తున్న ఒక ప్రమాదానికి భయపడుతున్నాను.
బోస్: ఏమిటది?
నాకు వచ్చిపడ్డ ఆ ప్రమాదం గురించి ఆయనకి వివరంగా చెప్పాను. కంగారుపడాల్సిందేమీ లేదంటూ రాజకృష్ణ బాబు ఆ విషయాన్ని నవ్వి కొట్టిపారేశారు. నన్నంతగా వేధిస్తున్న ఆ విషయానికి ఆయన ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నేను ఆయన వైపు విస్తుపోయి చూశాను. కానీ ఆయన వివరాలన్నీ చెప్పగానే, నీళ్లు చల్లినప్పుడు మంట ఆరిపోయినట్టుగా నా భయాలన్నీ పటాపంచలయ్యాయి.
రాజకృష్ణ బాబు మాట్లాడుతూ, ‘నేను నేరుగా మహాదేవ్ దేశాయ్ (గాంధీజీ కార్యదర్శి) గుడారం నుంచే వస్తున్నాను. అక్కణ్ణుంచి నుండి బయటకు రాగానే నువ్వు కనిపించడంతో ఇటొచ్చాను. అక్కడ మహాదేవ్ బాబు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఏ వస్తువు దొరికితే నీకింత బెంగ పట్టుకుందో, సరిగ్గా అదే వస్తువు పోయిందని ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహాదేవ్ బాబుకు ఇవాల్టి లెక్కలు తేలడం లేదు. లెక్కల్లో ఒక రూపాయి తేడా వచ్చింది. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అది ఎక్కడ ఖర్చయిందో ఆయనకు గుర్తుకు రావడం లేదు. గాంధీజీ సభలో ఉన్నప్పుడు, మహాదేవ్ బాబు సరిగ్గా ఈ కొబ్బరి మట్టమీద కూర్చునే నగదు పెట్టె లెక్కలన్నీ చూశారు. నీకిక్కడ ఇసుకలో దొరికిన ఆ నాణెం మహాదేవ్ బాబు చేతిలోంచి జారిపడి ఇసుకలో కూరుకుపోయి ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు ఆయన దగ్గరకొచ్చి వచ్చి దీన్ని ఆయన చేతుల్లో పెట్టావనుకో దీంతో మీ ఇద్దరి తలనొప్పీ ఒకేసారి తీరిపోతుంది’ అన్నారు.
సమస్య పరిష్కారం కావడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. రాజకృష్ణ బాబు వేగవంతమైన నడకతో సమానంగా అడుగులు వేయడం నాకు చాలా కష్టమైంది. గమ్యస్థానానికి చేరుకుని చూస్తే, అక్కడ మహాదేవ్ బాబులోతైన ధ్యానంలో మునిగిన మునిలాగా నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. చేతుల్ని చెంపలకు ఆనించి ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నారు. రాజకృష్ణ బాబు వెనుక నుండి నేను ముందుకు వచ్చి ఆయనకు నమస్కరించాను. మహాదేవ్ బాబు నా నమస్కారాన్ని స్వీకరించారు. ఆయన చేతుల్లోంచి జారిపడ్డ ఆ సొత్తు ఆయన చేతిలో పెట్టాను.
తన చేతిలో మెరుస్తున్న ఆ నాణెం చూసి ఆయన విస్మయం చెంది, రాజకృష్ణ బాబు వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నన్ను మహాదేవ్ బాబుకు పరిచయం చేస్తూ, నాకా నాణెం ఎలా దొరికిందో రాజకృష్ణ బాబు పూసగుచ్చినట్టు చెప్పారు. మహాదేవ్ బాబు నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతటితో ఆగకుండా, ఉదయం కాలకృత్యాలూ ప్రార్థనా ముగిశాక నన్ను గాంధీజీకి పరిచయం చేస్తాననీ, ఆ వెండి రూపాయి దొరికిన కథను ఆయనకు స్వయంగా వివరిస్తాననీ పట్టుబట్టారు. తెలంగాపెంథాలో జరిగిన ఈ సంఘటన గురించి తను నడిపే పత్రికలో ఒక వ్యాసం రాయవలసిందిగా గాంధీజీని కోరతానని కూడా అన్నారు. అది మన దేశ పౌరుల వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుందని చెప్పారు.
మహాదేవ్ బాబు గుడారం నుండి బయటకు వచ్చాక రాజకృష్ణ బాబూ, నేనూ చెరొక వైపు వెళ్లాం—నేను నా పాత స్థలానికి చేరుకుని ఆ కొబ్బరి మట్టమీద నడుం వాల్చగా, రాజకృష్ణ బాబు తన బృందంలోని ఇతర సభ్యుల వద్దకు వెళ్లిపోయారు.
ఇక నాకు నిద్రపట్టే ప్రసక్తే లేదు. కళ్లు తెరిచిపెట్టుకుని, మహాత్ముణ్ణి ఎప్పుడెప్పుడు కలుస్తానా అన్న ఆత్రుతతో అటూ ఇటూ దొర్లుతూ గడిపేశాను. సరిగ్గా అదే సమయంలో తెల్లవారిందని సూచిస్తూ ఆశ్రమంలో గంట మోగింది. మహాత్మాజీ తెలంగాపెంథా విడిచిపెట్టి తన తర్వాతి యాత్రను ప్రారంభించవలసి ఉన్నందున, గాంధీజీతో సహా అందరూ తమ కాలకృత్యాలు ముగించుకోడానికి పడకలు వదిలి లేచారు.
ఆ గంట శబ్దం నన్ను ఉలిక్కిపడేలా చేసింది. తగినంత ధైర్యం కూడగట్టుకోడానికి కొద్దిసేపు ఆ మట్టమీదే కూర్చున్నాను. కానీ నాలో అసహనం నన్నెక్కువసేపు నిమ్మళంగా కూర్చోనివ్వలేదు; అది నన్ను నేరుగా మహాదేవ్ దేశాయ్ గుడారానికి నడిపించింది. ఆ సమయానికి గాంధీజీ ఉదయపు ప్రార్థన ముగిసే దశలో ఉంది. నాణెం గురించిన వివరాలు మహాదేవ్ బాబు అంతకుముందే గాంధీజీకి నివేదించారు. ఇప్పుడు ఆయన నన్ను గాంధీజీ ముందుకు తోడ్కొని వెళ్లారు.
గౌరవమూ భయమూ రెండూ ఒకేసారి మనసులో కలిగినప్పుడు, మనుషులు తమను తాము ఒక గడ్డిపోచతో సమానంగా భావించి నేలమీద సాష్టాంగపడతారు. జగద్గురువు మహాత్మా గాంధీ పాదాల ముందర నేను ప్రణమిల్లినప్పుడు, బురద నుండి వికసించిన ఒక కమలంలా నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావించుకున్నాను. గాంధీజీ ఎంతో మృదువైన స్వరంతో ఇలా అన్నారు:
‘నీ స్వచ్ఛమైన అంతరాత్మ గురించీ, ప్రశంసనీయమైన శీల సంపద గురించీ మహాదేవ్జీ చెప్పగా విని నేను ఎంతో ముగ్ధుడనయ్యాను. నీలాంటి వ్యక్తులు ఎక్కువైతే, మన దేశ నలుమూలలా యువత కోసం చైతన్య సంఘాలను ఏర్పాటు చేసి జాతీయ శీలాన్ని సంస్కరించవచ్చు. అదే గనుక జరిగితే, నేను కలలుగన్న భారతదేశం అతి త్వరలోనే సాకారమవుతుంది. రామరాజ్యం (యూటోపియా) అనేది దివ్యమైనదే అయినప్పటికీ, అది ఆకాశం నుండి ఊడిపడదు; ఈ గడ్డమీదే అది ప్రభవించి వికసించాలి. భారతదేశ ప్రజలు—రాజు గానీ ప్రజలు గానీ, పాలకుడు గానీ పాలితుడు గానీ—సత్యవంతులూ, ధర్మాత్ములూ, నిజాయితీపరులూ అయినప్పుడే భారతదేశం ఒక ఆదర్శ రాజ్యంగా రూపాంతరం చెందుతుంది’ అన్నారు.
బాపూజీ పలుకులనే అమృతాన్ని గ్రోలి, ఆయన పాదాలు తాకి సెలవు తీసుకున్నాను. బయటకు వచ్చేసరికి, చీకటి పలుచటి తెరలు వేగంగా తప్పుకుంటూ ఉదయపు అరుణ కిరణాలకు చోటిస్తున్నాయి. మామిడి తోపు పందిరి కింద వందలాది మంది ప్రజలు గుమిగూడి, గాంధీజీ తర్వాతి యాత్రలో ఆయన వెంటే నడవడానికి సిద్ధంగా ఉన్నారు; దారిలో ఎదురయ్యే ఎలాంటి కష్టనష్టాలనూ ఏమాత్రం లెక్కచేయకుండా, ఈ నవ్య పుణ్యక్షేత్రం వైపు ఇంకా ఎందరో జనం బారులు తీరుతూనే ఉన్నారు.
(కృష్ణచంద్ర కర్ (1906-1995) నిఘంటుకర్త, బాలసాహిత్య రచయిత. ఆయన ఆత్మకథ ‘హజిలా దినర స్మృతి’ కటక్‌లోని గ్రంథ మందిర్ ద్వారా 1991లో వెలువడింది. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన ప్రియంవదా పాల్ భువనేశ్వర్‌లో సిలికాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆంగ్ల అధ్యాపకురాలు. అనువాదకురాలూ, చిత్రకారిణీ కూడా.)
9-10-2026

