
18
ఒక హిందీ ఉపాధ్యాయుడు గాంధీని కలవడం
అనుసాయా ప్రసాద్ పాఠక్
1934లో బీహార్ భూకంపం కారణంగా ఖైదీలం దరినీ విడుదల చేశారు. హరిజనోద్ధరణ కోసం గాంధీజీ ఒరిస్సా పర్యటనకు రానున్నారు. ‘నేను ఆయన్ని తప్పక కలుస్తాను’ అని నాకు నేనే బాస చేసుకున్నాను.
ఆయన రాక కోసం అమితాసక్తితో ఎదురుచూశాను. ఆయన అనుకున్న సమయానికే వచ్చి, నేరుగా పూరీ వెళ్లారు. అక్కడి నుంచే గాంధీజీ తన యాత్ర ప్రారంభిస్తారన్న వార్త నాకు తెలిసింది. ఆ నడకను ‘హరిజన పాదయాత్ర’ అని పిలిచారు. ఎప్పటికైనా నేనాయన్ని కలవగలనని నాకు నమ్మకం కుదిరింది. అందుకని ఒకరోజు అక్కడికి వెళ్లాను.
సాక్షీగోపాల్ చేరుకుని గాంధీజీ కార్యదర్శి మహాదేవ్ దేశాయ్‌ని కలిశాను. ‘గాంధీజీని కలవాలనుకుంటున్నాను’ అని ఆయనకి చెప్పాను.
దానికి మహాదేవ్ భాయ్, ‘ఆయనకు చాలా పని ఉంది; నీ కోసం సమయం కేటాయించడం ఆయన వల్ల కాదు’ అన్నారు.
ఆయన మాటలు నాకేమాత్రం నచ్చలేదు. ‘గొప్పవాళ్ళని కలవడానికి మాత్రమే ఆయనకి టైముంటుంది, నాలాంటి సామాన్యుడి కోసం ఉండదు’ అని నాలో నేనే అనుకున్నాను. అయినా సరే ఆయన్ను కలవాలనే వేచి ఉన్నాను. ఏ ప్రేరణ నన్ను ఆయన గది వైపు అడుగులు వేయించిందో నాకే తెలియదు. నేనేమీ ముందు ఆలోచించుకున్నదికాదు. మీరాబెహెన్ ఆయనకు భోజనం వడ్డిస్తుండటం కనిపించింది. గాంధీజీ తలుపు వైపు చూశారు. నేను రొప్పుతూనే, ‘నేనిక్కడ హిందీ ప్రచారం కోసం పనిచేస్తున్నాను. మీతో కొన్ని సమస్యలు చర్చించాలి. దయచేసి నాక్కాస్త సమయం ఇవ్వండి’ అన్నాను.
గాంధీజీ స్పందిస్తూ, ‘నువ్విక్కడే ఉండు. రేపు యాత్ర మొదలయ్యాక దారిలో మాట్లాడుకుందాం’ అన్నారు.
నేను తలవంచి ఆయనకు నమస్కరించి బయటకు వచ్చేశాను. ఈ సంభాషణ ముప్ఫై నలభై సెకన్లకు మించి సాగి ఉండదు. మర్నాడు కలవమని గాంధీజీ నాతో చెప్పిన సంగతి నేనెవరికీ చెప్పకపోవడంతో, ఆ విషయం ఎవరికీ తెలియదు. నేనక్కడే ఉండిపోయాను, రాత్రి భోజనం కూడా దొరికింది. ఆ రోజు వంటల బాధ్యత రమాదేవి చూసుకుంటుండటంతో నా బసకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.
ఇచ్చిన మాట గాంధీజీకి గుర్తుంటుందా లేదా అన్న అనుమానం నన్ను వేధించింది. ఆయన గనుక మర్చిపోతే నా పని అలాగే ఉండిపోతుంది. నాలో నేనే ఇలా అనుకున్నాను: ‘ఓ పాఠక్, కటక్ తిరిగి వెళ్లిపో. నువ్వో హిందీ మాస్టారువి. ఇంట్లోనేమో తినడానికి ఏమీ లేదు, తల్లేమో విందుకు పోతోందన్నట్టుంది నీ పరిస్థితి.’ కబీర్ అన్నట్టుగా—‘చాహియే అమియా పర్ జురే న చాఛు’ (తేనె కావాలని ఆశపడతాడు కానీ కనీసం మజ్జిగ కూడా దొరకదు). అక్కడే ఉండాలా లేక వెళ్లిపోవాలా అన్న మీమాంసతో ఆ రాత్రంతా గడిపేశాను. నాకు టైమిస్తానన్న తన వాగ్దానం గాంధీజీకి ఎలా గుర్తుచేయాలన్నదే నాకున్న ముఖ్య సమస్య.
ఉదయం అల్పాహారం ముగిశాక గాంధీజీ స్వయంగా గోపబాబుతో, ‘ఒరిస్సాలో హిందీ ప్రచారం కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిని లోపలికి తీసుకురండి’ అన్నారు.
ఆయన తీక్షణమైన జ్ఞాపకశక్తికి నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. అంతటి పని ఒత్తిడిలోనూ ఆయన నా అభ్యర్థన గుర్తుంచుకోడానికి సమయం కేటాయించారంటే నమ్మలేకపోయాను. నేను ఆయన్ని కలవడానికి లోపలికి వెళ్లినప్పుడు బాబా రాఘవదాస్ ఆయనతో మాట్లాడుతూ కనిపించారు. ‘బాపూజీ, హిందీ ప్రచారం కోసం మేం రేపు పూరీలో ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం’ అని బాబా రాఘవదాస్ అన్నారు.
‘హిందీ ప్రచారానికి నేనొకరిని పంపుతాను’ అన్నారు.
‘సరేలే,’ అంటూ గాంధీజీ నా వైపు తిరిగి, ‘నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు?’ అని అడిగారు.
‘నేను రెండేళ్లుగా ఇక్కడ హిందీ ప్రచారం చేస్తున్నాను. ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటయింది’ అన్నాను. ఆ తర్వాత ఆ కమిటీలోని సభ్యుల పేర్లు చదివి వినిపించాను.
గాంధీజీ స్పందిస్తూ, ‘బాబా రాఘవజీ, ఒరిస్సాకు చెందిన సభ్యులంతా ఆయన కమిటీలోనే ఉన్నారు. చేయాల్సిన పని కూడా అతనే చేస్తున్నాడు, కాబట్టి ఇంకో కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కమిటీలు ఎక్కువైతే కూడా ప్రయోజనం ఉండదు’ అన్నారు. తర్వాత నా వైపు చూసి, ‘సరే, నువ్వింకా చెప్ప వలసింది ఏమైనా ఉందా?’ అని అడిగారు.
దానికి నేను, ‘నేను పనైతే చేస్తున్నాను కానీ, నా పొట్ట గడవడానికి ఎలాంటి ఏర్పాటూ జరగలేదు. ఇల్లిల్లూ తిరుగుతూ హిందీ చెప్పవలసి వస్తోంది, ఎదుటివాళ్ల ఇళ్లల్లోనే తిండి తినాల్సి వస్తోంది’ అన్నాను.
గాంధీజీ నా వైపు తీక్షణంగా చూస్తూ, ‘ఇప్పటివరకు నీకేమీ ఏర్పాటు చేయకపోతే, నీకు ఆర్థిక సహాయం అందేలా నేనేదో ఒకటి చేస్తాను. నాతో పాటు భద్రక్ రా. బసంత్‌లాల్ మురార్ అక్కడ నన్ను కలవడానికి రానున్నారు. కొంత విరాళం ఇవ్వమని నేనాయన్ను అడుగుతాను. నీకు ఎంతైతే సరిపోతుంది?’ అన్నారు.
‘ఎంత ఇచ్చినా ఫరవాలేదు, ఇరవై రూపాయలో, ముప్పై రూపాయలో, లేక నలభై రూపాయలైనా సరే’ అన్నాను.
గాంధీజీ—‘నీకు డబ్బు అందేలా చూస్తాను, ఇంకేమైనా మాట్లాడాలా?’ అన్నారు.
నేను విన్నవించుకుంటూ, ‘ఈ సంవత్సరం ఆరుగురు విద్యార్థులు హిందీ సాహిత్య సమ్మేళన్ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో ఐదుగురు ఉత్తీర్ణులయ్యారు. వారికి మీ చేతుల మీదుగానే బహుమతులూ సర్టిఫికెట్లూ ఇప్పించాలని ఉంది’ అన్నాను.
గాంధీజీ—‘తప్పకుండా ఇస్తాను. ఈ పని కటక్‌లో పెట్టుకోవచ్చా?’ అన్నారు.
‘అలాగే బాబూ’ అన్నాను. నా కళ్లు చెమర్చాయి. ఎంతటి ఘనకార్యం సాధించాను! దాన్ని తలచుకుంటేనే నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ క్షణంలో నాకెలా అనిపించిందో వర్ణించడానికి నా దగ్గర మాటలు చాలవు.
‘కానీ మిమ్మల్ని భద్రక్‌లో ఎలా కలవడం? మీ చుట్టూ ఉన్నవాళ్లు నన్ను మీ దగ్గరకు రానివ్వరు కదా’ అని అడిగాను.
గాంధీజీ చిరునవ్వుతో, ‘బసంత్ లాల్ గారితో నేను కనిపించగానే నేరుగా నా దగ్గరకు వచ్చేయ్. నిన్ను ఆపవద్దని వాళ్లకు చెబుతాను’ అని బదులిచ్చారు.
మేము వీడ్కోలు తీసుకునే సమయంలో గాంధీజీ నా వైపు ఒక ఆప్యాయమైన చూపు చూశారు. ఆ చూపును మాటల్లో వర్ణించడం నా వల్ల కాదు. కానీ ఆ క్షణపు జ్ఞాపకం నా మదిలో ఇప్పటికీ తాజాగా మెదులుతూనే ఉంది. ఆ చూపులో వ్యక్తమైన వాత్సల్యం నన్ను పరవశింపజేసింది. నా జీవితంలో ఇదే అత్యంత గొప్ప సాధన. నేను అడిగినవన్నీ నాకు దక్కాయి. ఇంక అడగడానికి నాకేమీ మిగల్లేదు. ఇంకేం చెప్పాలనుకున్నానో అవన్నీ పూర్తిగా మర్చిపోయాను, ఎందుకంటే నేనప్పటికే ఒక ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోయాను.
మాట ఇచ్చినట్టే గాంధీజీ కటక్ వచ్చారు. విద్యార్థులు ఆయన చేతుల మీదుగా పురస్కారాలూ ధ్రువపత్రాలూ అందుకున్నారు. కానీ హరిజనోద్ధరణ నిధి సేకరణ కోసం ఆయన ఆ పుస్తకాలన్నింటినీ వేలం వేయడానికి పట్టుకెళ్లిపోయారు. ఆ వేలంపాట ద్వారా ఎంత మొత్తం వసూలైందో నాకు ఖచ్చితంగా గుర్తులేదు గానీ, ఆఖరి పాట బహుశా ఎనిమిది వందల రూపాయలు పలికింది.
నేను గాంధీజీ పాదయాత్రలో కలవలేదు కానీ, ఆయన్ను కలవవలసిన రోజున భద్రక్ చేరుకున్నాను. అది ఉదయపు వేళ. హరేకృష్ణ మహతాబ్ గారి ఇంటి ముందున్న మైదానంలో కొందరు జనం గుమిగూడి ఉన్నారు. గాంధీజీ పక్కనే బసంత్‌లాల్ మురార్ గారు కూర్చుని ఉండటం కనిపించింది. దాంతో నేను నేరుగా ఆయన వైపు నడిచాను. దారిలో నన్నెవరూ అడ్డుకోలేదు. నేను ఆయన దగ్గరకు చేరానో లేదో గాంధీజీ వెంటనే బసంత్‌లాల్ గారితో, ‘ఈయన ఒరిస్సాలో హిందీ ప్రచారం చేస్తున్నాడు, కానీ ఆ పనికి ఎలాంటి పారితోషికమూ అందడం లేదు. ఆయనకి జీతం ఎంతోకొంత నేను ఏర్పాటు చేయాలా, లేక ఆ విషయం మీరే చూసుకుంటారా? నెలకు కనీసం ఇరవై రూపాయలు అడుగుతున్నాడు, దాన్ని ముప్పైకో నలభైకో పెంచవచ్చు. ఆయనకు నెలకు నలభై రూపాయలు ఇప్పించాలని నా అభిప్రాయం’ అన్నారు.
‘అలాగేనండి, మేమే ప్రతి నెలా మీకు నలభై రూపాయలు పంపుతాం’ అన్నారు బసంత్‌లాల్ గారు. గాంధీజీ నా వైపు చూసి, ‘సరే, నువ్వు వెళ్లి నీ పని కొనసాగించు, వివరాలు నాకు తెలియజేస్తూ ఉండు’ అన్నారు.
ఇక నేనేమీ మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది. గాంధీజీ నా కోరికలన్నింటినీ తీర్చేశారు. నాకు నెలకు నలభై రూపాయలు రావడం మొదలయ్యాక, నా కోసం ఇరవై రూపాయలు ఉంచుకుని, మిగతా డబ్బు పూరీ పంపేవాణ్ణి; అక్కడొక కొత్త హిందీ ప్రచార కేంద్రాన్ని తెరవాలన్నది నా సంకల్పం.
(అనుసాయా ప్రసాద్ పాఠక్ (1913-1970) రాష్ట్రభాషా ప్రచార సమితి ద్వారా ఒరిస్సాలో హిందీ ప్రచారం కోసం తన జీవితాన్ని ధారపోశారు. ప్రస్తుత భాగం ఆయన ఆత్మకథ ‘మేరా ఉత్కళ్ ప్రవాస్’ నుండి తీసుకున్నది. దీన్ని ఇంగ్లీషులోకి అనువదించిన ప్రియంవదా పాల్ భువనేశ్వర్‌లోని సిలికాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆంగ్ల అధ్యాపకురాలు. అనువాదకురాలూ, చిత్రకారిణీ కూడా.)
19
మామిడి తోపులో సభ
ఆర్తబంధు మొహంతి
రామచంద్రపూర్ పాఠశాలలో పనిచేస్తున్న రోజుల్లో అక్కడ నేను వినాయక చవితి పూజలు ప్రారంభించాను. వేణుధర్ బెహూరియా గారూ, ఆదిత్య బల్ గారూ, కృష్ణచంద్ర కర్ గారూ తదితరులు ఆ పూజలు జరపడంలో నాకు తోడ్పడ్డారు. ఆ పూజలో పాల్గోడానికి నేను హరిజనుల్ని కూడా ఆహ్వానించాను. నూలు వడికే కార్యక్రమాలూ ఏర్పాటు చేశాను. ఇది చూసి పాఠశాల సెక్రటరీ చిర్రుబుర్రులాడారు.
1934 మే 31న మహాత్మా గాంధీ హరిజనుల్తో కలిసి బారీ చేరుకున్నారు. ఆయన ఖర్చుల కోసం గోపబంధు బాబూ, నేనూ కలిసి విరాళాల ద్వారా నూట ఎనిమిది రూపాయలు సమకూర్చాం. బామన్ బాబు గారి ఇంటి ముంగిట్లో గాంధీ బసకు ఏర్పాట్లు చేశారు. చౌధురి పూర్ణచంద్ర మహాపాత్ర గాంధీజీకీ ఆయన బృందానికీ అయ్యే భోజన వసతి ఖర్చులన్నీ భరించారు.
ఉదయం ఆరు గంటలకు బగ్దా మైదానంలో సభ జరిగింది. అంత వేకువజామునే రావడం చాలామందికి వీలుపడకపోవడంతో ఆ సభకు హాజరు పలుచగా ఉంది. అందుకని సహస్పూర్ వెళ్లే దారిన అతీరా దగ్గర మామిడి తోపులో మరో సభ ఏర్పాటు చేశారు. అస్పృశ్యతా నివారణ ఆవశ్యకతమీద గాంధీజీ ప్రసంగించారు. ఆ సందర్భంగా హరిజనులు ఒక మేళా నిర్వహించారు. గాంధీజీ ఉపన్యాస స్ఫూర్తితో గోవర్ధన్ పూహాన్ అనే వ్యక్తి ఒక హరిజనుడి చేతి నుంచి మంచినీళ్లు తీసుకుని తాగారు. మా ప్రాంతంలో అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే.
గాంధీజీని కలవడానికి బారీకి చెందిన ఎందరో ప్రముఖులు బామన్ బాబు గారి ముంగిట్లోకి వచ్చారు. బామన్ బాబూ, ఆయన కుమారుడు నవబాబూ అస్పృశ్యతమీద గాంధీ ఆలోచనల్ని సిద్ధాంతపరంగా అంగీకరించారు కానీ, కొద్దిమంది సనాతన బ్రాహ్మణుల అభ్యంతరాలకు భయపడి వాటిని ఆచరణలో పెట్టడానికి సాహసించలేకపోయారు. దీనికి స్పందిస్తూ—బ్రిటిష్ ప్రభుత్వపు తూటాలనెదుర్కొనే ధైర్యం చూపిన ప్రజలు, బ్రాహ్మణుల్ని చూసి మాత్రం ఇంకా జడుసుకుంటున్నారని గాంధీజీ చమత్కరించారు. ఆ తర్వాత ఆలయాల్లోకి హరిజనులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ‘నేను భద్రక్ చేరుకునేలోపే ఈ విషయంలో నాకు గట్టి హామీ దక్కేలా చూడండి’ అన్నారు గాంధీజీ.
(ఆర్తబంధు మొహంతి (1905-1989) పాఠశాల ఉపాధ్యాయుడూ, సంఘసేవకుడూ. ఆయన అసంపూర్ణ ఆత్మకథ, కటక్‌లో గ్రామసేవక్ సమవాయ ప్రెస్ లిమిటెడ్ ప్రచురించిన ఆర్తబంధు స్మరణేలో 1990లో వెలువడింది. ప్రియంవదా పాల్ గారే ఈ భాగాన్ని కూడా ఇంగ్లీషులోకి అనువదించారు.)
7-10-2026


తెలిసింది ఇసుమంత
తెలియనిది మిన్నంత
మీవల్ల ఈ కొంత
తీర్చుతున్నది చింత
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!