ఆ వెన్నెల రాత్రులు-9

Image design: Mallika Pulagurtha

ఒకరితో ఒకరికి మాటాడుకోడానికి తీరికలేనంతగా మధువు సేకరించుకునే తేనెటీగల్లాగా మేము పనిలో కూరుకుపోయాము. తొందరలోనే నేను నాకు అప్పగించిన గ్రిడ్ పొడుగునా ఉన్న మొక్కల్ని, చెట్లనీ, తీగల్నీ గుర్తుపట్టి మాపులో గుర్తుపెట్టగలిగే సామర్థ్యం సాధించుకున్నాను.

ఒక చెట్టునో, చామనో గుర్తుపట్టగానే దాని స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారో చెప్పడానికి జోసెఫ్ గారు నాకు ఒక ఫారెస్టు వాచర్ ని సాయంగా ఇచ్చారు. చెల్లన్నదొర అనే ఆ వాచరు కొండదొర. యాభై ఏళ్ళ పైబడ్డ వయస్సు. అప్పటికి పాతికేళ్ళుగా వాచరుగా పనిచేస్తున్నాడు. పదవతరగతి కూడా పూర్తి చెయ్యకపోవడంతో పై ఉద్యోగాలకి ప్రమోషను పొందలేకపోయాడు. కాని అతణ్ణి అడవిపండితుడని చెప్పవచ్చు. తక్కినవాళ్ళకన్నా అతడు రెండాకులు కాదు, రెండు వందల ఆకులు ఎక్కువ చదివాడు.

అది ఇప్పట్లాగా ప్లాంట్ ఫైండర్లూ, ప్లాంట్ నెట్ లూ లేని కాలం. మేము గుర్తుపట్టలేని మొక్కనో, చెట్టునో కనిపించినప్పుడు, దాని సాంపిల్సును సేకరించి, డ్రాయింగు వేసిపెట్టుకోడం తప్ప మరేమీ చెయ్యలేకపోయేదాన్ని.

కాని నాకు గుర్తున్నంతలో దాదాపు రెండువందల యాభైకి పైగా చెట్ల జాతుల్ని గుర్తుపట్టాము. అవి యాభైకి పైగా కుటుఝబాలకు చెందిన చెట్లూ, మొక్కలూ అని గుర్తు.

అన్నిట్లోనూ ఫబేసియై కుటుంబానికి చెందిన మొక్కలూ, చెట్లూ ఎక్కువ సంఖ్యలో కనబడ్డాయి. కాలేజీలో లెగుమనేసీ అని చదువుకున్న ఫబయేసి మొత్తం వృక్షకుటుంబాలు అన్నిటిలోనూ మూడవ అతి పెద్ద కుటుంబం. ఉష్ణమండల దేశాల్లో దాని రాజ్యం చాలా పెద్దది. సండ్ర, గనర, దిరిసెన, మోదుగ, రేల, ఇరిడి, బాడిత, కానుగ, ఏగిస, ఆరె, దేవకాంచనం లాంటి ఆ చెట్ల నీడలు ఇప్పటికీ నన్ను వెన్నంటి ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ హేమంతకాలమంతటా, మధ్యాహ్నాల్లో ఆ కోవిదార వృక్షాల ఘాటైన మధురసుగంధం ఇంటికివచ్చాక కూడా నాతోనే వస్తున్నట్టు ఉండేది. ఇప్పుడు కూడా ఎప్పుడేనా ఆ ఏ రెస్టరెంటు దగ్గరో, ఏ పార్కు బెంచీ పక్కనో నవంబరు,  డిసెంబరు నెలల్లో విరగబూసే ఆ ఊదారంగు పూల సువాసన నన్ను తాకగానే నేనొక్క క్షణం మైమరుస్తాను. అల్లసాని పెద్దన రాసిన కవితలో అతడి కాళ్ళకు పసరు రాసుకుంటే తక్షణమే హిమాలయాలకు వెళ్ళిపోయాడని చదువుకున్నాం. కాని బహీనియా ఫ్రాగ్రెన్సు ఇప్పుడు సోకినా కూడా నేను మరుక్షణమే ఆ తూర్పుకనుమల్లోకి తేలిపోతాను.

తూర్పుకనుమల్లో ఫబేసియై తర్వాత ఎక్కువ జాతులు రుబియేసియై కుటుంబానికి చెందినవని పుస్తకాల్లో రాసారుగాని, నాకు ఎక్కువ మాల్వేసియై కుటుంబమే కనిపించింది. బూరుగ, తెల్లబూరుగ, కొండ పత్తి, కొండ తామరలాంటి చెట్లు. అందులోనూ బూరుగచెట్ల గురించి నేను ముందుముందు ఎలానూ తలుచుకోబోతున్నాను కాబట్టి ఇప్పటికి కష్టం మీదనే నన్ను నేను నిగ్రహించుకుంటూ మొరేసియై కుటుంబాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అవన్నీ దాదాపుగా ఫైకస్ జాతి చెట్లు. పనస, రావ్వి, మేడి, జువ్వి, బొడ్డ, బరణిక లాంటి చెట్లన్నమాట. ఫిలంతసియై కుటుంబం కూడా పెద్దదే అంటారుగాని నేను చూసిన మొక్కల్లో ఒక్క ఉసిరి చెట్లు తప్ప మరేవీ నాకిప్పుడు గుర్తులేవు.

కాని ఒక అడవినుంచి నువ్వు ఒక్క జ్ఞాపకం మించి ఎక్కువ మూటగట్టి తెచ్చుకోడానికి అనుమతించమంటే ఉసిరిచెట్ల జ్ఞాపకమొక్కటీ చాలంటాను. చెట్టంతా, ప్రతి కొమ్మనా, ప్రతి కొమ్మ మొదట్లోనూ, ప్రతి ఒంపులోనూ ఒళ్లంతా పులకించినట్టుగా విరగ్గాసిన ఆ ఉసిరిచెట్లని ఎలా మర్చిపోగలుగుతాను? కోతులు ముట్టుకోనందుకు అనుకుంటాను, ఆ కాయలు చెట్లమీద గుత్తులుగా గుత్తులుగా కనబడేవి. మనుషులకి వాటిని నెమ్మదిగా కోసుకునే ఓపికలేక, కోతులకన్నా క్రూరంగా ఆ కొమ్మలు విరిచి, ఆ చెట్లు దులిపి పొయ్యేవారు. వాళ్ళు వెళ్ళిన చాలాసేపటిదాకా అడవి కార్చిన కన్నిటిచుక్కల్లాగా ఉసిరికాయలు ఆ నేలలో, గడ్డిమీద చెల్లాచెదురుగా పడి ఉండేవి.

ఇందాకా ఏమన్నాను? అడవినుంచి ఒకే ఒక్క జ్ఞాపకం తెచ్చుకోమంటే ఉసిరిచెట్లను తలుచుకుంటాను అని కదా. బహుశా, ఈ లోకం వదిలివెళ్ళిపోయేటప్పుడు ఏదన్నా ఒక్క వస్తువు వెంటతీసుకుపోడానికి అనుమతిస్తామంటే ఒక్క ఉసిరికాయ చాలనుకుంటాను. ఉసిరికాయ కొరికి ఆ వగరు, ఆ పులుపు, ఆ చేదు అట్లా కొంతసేపు నోట్లో నానాక నీ లాలాజలమంతా తీపెక్కుతుంది చూడు- బహుశా, మానవజీవితసారమంతా ఒక ఉసిరికాయని కొరికి రుచిచూడటంలాంటిదే అనుకుంటాను.

కొన్ని కుటుంబాలవి, ఎక్కువ వృక్షజాలం లేకపోయినా, ఆ ఉన్నవే విస్తారంగా ఆ అడవిపొడుగునా కనబడేవి. వాటిలో అన్నిటికన్నా ముందు తలుచుకోవలసింది కొంబటేసియా కుటుంబానికి చెందిన నల్లమద్ది, తెల్లమద్ది, తాడి, కరక చెట్లు. అడవిలో అడుగుపెట్టగానే ముందు పలకరించేవి నల్లమద్ది చెట్లే. కొండవాలులోనూ, ఏటిమలుపులోనూ జెండాలు పాతినట్టు తెల్లమద్ది చెట్లు. ఇక ఫాల్గుణమాసం లో రాబోతున్న వసంతానికి దూతలాగా చిగురించే కరకచెట్ల పచ్చదనాన్ని వర్ణించడం నాకు సాధ్యం కాదు.

ఇవి కాక, మామిడి, కొండమామిడి, నల్లజీడి, సీతాఫలం, రామాఫలం, దుద్దుగ, చిలకదుద్దుగ, జీలుగు, ఈత, అందుగ, కొండగోగు, తపసి, రేగు, గుమ్మిడి, నెమలి, వేప, వెలగ, నేరేడు, మారేడు, కుంకుడు, చింత, పాల- ప్రతి ఒక్క చెట్టూ నాకు అడవిపెద్దలాగా, ఏ క్రెటాషియస్ యుగంలోనో అవి, నేనూ కలిసి తొలిసారి సూర్యకాంతికి చేరువైనట్టుగానూ కనిపించేది..

ప్రతి చెట్టునీ చూడగానే, బహుశా ప్రొఫెసరు ఇచ్చిన తర్ఫీదు వల్ల కాబోలు, ముందు నాకు ఒక పిలుపు వినబడేది. అక్కడ ఆ చెట్టునీడన రెండుమూడు నిమిషాలు మౌనంగా నిలబడేదాన్ని. నా కరాంగుళుల్తో ఆ బెరడుని మృదువుగా స్పృశించేదాన్ని. ఒక్కొక్కప్పుడు పక్కన ఎవరూ లేనప్పుడు, రెండు చేతులూ చాపి ఆ చెట్టుని కావిలించుకునేదాన్ని. నిండుగా పూసిన వేపచెట్టునో, నిండుగా ఫలాల్తో బరువెక్కిన మారేడుచెట్టునో, వెలగచెట్టునో, మామిడి చెట్టునో నీ రెండుబాహువుల్తోనూ చుట్టినా కూడా ఇంకా ఆ చెట్టు నీకు పూర్తిగా అందదు చూడు, అప్పుడు అచ్చంగా, ఆ చెట్టు మీ అమ్మలానూ, నువ్వు మీ అమ్మ మోకాళ్లను వాటేసుకుంటున్న పసిబిడ్డలానూ అయిపోతావు.

అసలు ఈ అనుభవాలన్నీ తలుచుకోవడం పక్కన పెట్టి ముందు ఆ చెట్లతో నా అనుభవాల్ని, ఆ ప్రథమ సందర్శనాల్ని, ఆ ప్రథమ పరిష్వంగాల్ని పేరుపేరునా తలుచుకోవాలని ఉంది. ప్రతి ఒక్క చెట్టునీ మొదటిసారి చూసినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, గాలి ఎటువైపు నుంచి వీస్తూ ఉంది, అడవిలో ఏ పిట్ట పాటపాడుతూ ఉంది, ఆ చెట్టు న విరబూసిన ఆ పూల తావి నన్ను తాకినప్పుడు నాలో చెలరేగిన మధురోహలు ఎలాంటివి-మొదలైనవాటితో ప్రతి ఒక్క చెట్టునీ గుర్తుతెచ్చుకోవాలని ఉంది. పట్టణాల్లో మామూలుగా చూసే మామిడి, చింత, వేప, దిరిసెన, తురాయి, టేకు లాంటి చెట్లు కూడా అడవిలో చూసినప్పుడు ఎంతో కొత్తగా కనిపించాయి. సింహాల్నీ, పులుల్నీ జూలో చూడటానికీ, అడవిలో చూడటానికీ మధ్య ఉన్న తేడా అంతా అందులో ఉంది.

కొన్ని చెట్లు నాకు బాగా స్నేహితులైపోయాయి. వాటిలోనూ, నాలోనూ ఒకలాంటి హృదయస్పందనే ఉందనుకుంటాను. అన్నింటిలోనూ ముందు గుర్తొస్తున్నవి, తురాయి చెట్లు. గుల్ మొహర్, డెలొనిక్స్ రెజియా. కానీ వనలత వాటిని కృష్ణచూర వృక్షాలని పిలిచేది. చూర అంటే మకుటమట! తురాయి అంటే కూడా అదే కదా అర్థం! కాని కృష్ణుడు నెమిలితురాయి వదిలి ఈ ఎర్ర తురాయి ఎందుకుపెట్టుకున్నాడు?

‘కృష్ణ చూరనా? అయితే రాధాచూర కూడా ఉందంటావా? ఏమిటి?’ అనడిగాను ఒకసారి.

‘ఎందుకు లేవు! ఉన్నాయి కదా’ అంది.

పచ్చతురాయి, కొండచింత, దిరిసెన అని పిలిచే పూలచెట్టు, మన నగరంలో వసంతకాలంలో అవిరామంగా పసుపుపూల వాన కురిపించే ఆ చెట్లే రాధాచూరవృక్షాలట.

ఉన్నాయిట్లా, ప్రతి ఒక్క చెట్టుతో పెనవేసుకుని ఒక కథ, ఒక స్మృతి, ఒక పరిమళం.

‘ఈ పూలని మీరేమని పిలుస్తారు’ అనడిగాను చెల్లన్నదొరని.

‘అవా అమ్మగారూ, వాటిని మేము కోడిజుత్తు పూలంటాం’ అన్నాడు. పిల్లలు ఆ పూలకేసరాల్తో కోడిపందేల ఆటలాడుకుంటారట.

ఎక్కడి కృష్ణచూర శబ్దం! ఎక్కడి కోడిజుత్తు పూలు!

ఒక్క పూలగుత్తి చుట్టూ ఎంత వైవిధ్యం! ఆ రెండు శబ్దాల్లో ఏది స్వీకరించదగ్గదో, ఏది వదిలిపెట్టదగ్గదో నేనిప్పటికీ తేల్చుకోలేకపోయాను.

మేము అడవిలో ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినప్పుడు ప్రొఫెసరు ఎప్పుడేనా ఒక్కడూ ధ్యానంలోనో, మౌనంలోనో కూచుండిపోయినప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను కూడా అనుకున్నాను. అందుకని ఆయన్ని చూసి కూడా నాదారిన నేను నా పనిలో నిమగ్నమైపోయేదాన్ని. కాని ఒక్కోసారి ప్రొఫెసరు తన పని వదిలిపెట్టి నాదగ్గరకే వచ్చేవాడు. నాతో ఏదో ఒక సంభాషణ మొదలుపెట్టేవాడు.

గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర ఉండే శిష్యులకి ఇలాంటి అనుభవాలు లభిస్తూ ఉంటాయి కాబోలు. అంటే తామేదీ అడక్కుండానే గురువులే తమంత తాముగా తమ దగ్గరికొచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉండటం. ఎక్కువ జెన్ బౌద్ధంలో అలాంటి కథలు ఉంటాయంటారు.  ప్రొఫెసరు తనంతటతానే నా దగ్గరకొచ్చి తనంతతానే ఏదో ఒక పువ్వుగురించో, పిట్టగురించో, రాయిగురించో, రప్ప గురించో చెప్పాలని  బహుశా నాలోపల్లోపల ఒక గాఢమైన కోరిక ఉండేదనుకుంటాను. అది ఆయనకు ఎలానో తెలిసేదనుకుంటాను.

ఒకరోజు నేను ఒక బండమీద కూచుని దగ్గరలో కనిపిస్తున్న ఒక కంపకేసి చూస్తూ ఉన్నాను. మామూలుగా హేమంత ఋతువు పూలకీ, తేనెటీగలకీ బంధువు కాదు. పూలదీ, తుమ్మెదలదీ వసంతఋతువు. ఆ కాలంలో అవి పాడుకోవలసినంతగా పాటలు పాడుకుంటేనే, మధుకోశాన్ని కొల్లగొట్టుకుంటేనే, ఆ అమృతభాండాన్ని ఫలాలుగా, పంటలుగా చేత ధరించి హేమంత ఋతువు అడుగుపెడుతుంది. అందుకనే హేమంతం మొదలవుతూనే సీతాకోకచిలుకలు కూడా తూర్పుకనుమలనుంచి పడమటికనుమలకి వలసపోతాయి. కాని ఆ రోజు నా ఎదురుగా ఇంకా ఒక పొదపూలతో విరబూసి ఉంది. దానిమీద తేనెటీగలు విహ్వలంగా భ్రమిస్తోనే ఉన్నాయి.

ప్రొఫెసరు వచ్చి నా పక్కన కూచున్నట్టు నాకు తెలియలేదు. ఆయన ‘ఏమి చూస్తున్నావు?’ అని అడిగేదాకా.

నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆయనలా వచ్చి కూచుంటే. ఏదో ఒక రకంగా మాటలు పొడిగిస్తే, ఇవాళ గొప్ప ప్రసంగమే సాగుతుందని ఆశపుట్టింది.

‘ఆ లంటానా ని చూస్తున్నాను. తక్కిన పూలన్నటికీ ఏదో ఒక సీజన్ ఉంటుంది కాని, వీటికి ఏ సీజన్ లేదు. చాలా జెనరస్ అనిపిస్తాయి. అందులోనూ, ఎన్ని రంగులో చూడండి!’ అన్నాను. నాక్కూడా ప్రొఫెసరు భాష కొద్దికొద్దిగా పట్టుబడింది అనుకున్నాను.

ప్రొఫెసరు రెండు మూడు నిమిషాల పాటు ఆ పులికంప పొదలకేసి కన్నార్పకుండా చూసాడు. వాద్యకారుడి అంగుళుల కొసలు హార్మోనియం  మెట్లనీ తాకీతాకకుండా చలిస్తున్నంత వేగంగా ఆ పూలమీద వాలితేలుతో, తేలివాలుతో ఉన్న ఆ తేనెటీగల్ని చూసాడు.

అప్పుడు దీర్ఘంగా శ్వాస వదిలి

‘విమలా, యు నో -‘ అన్నాడు.

నేను చెవుల్ని దొప్పగా చేసుకుని ఆయన వైపు ఒగ్గాను. ‘యు నో ‘ అని  అన్నాడంటే ఆ తర్వాత తేనెవర్షిస్తుందని నాకు తెలుసు.

‘ఈ పూలే లేకపోతే మనం లేము తెలుసునా. ఇవంటే, ఇవని కాదు, అసలు పూల గురించి మాట్లాడుతున్నాన్నేను’ అని అన్నాడు.

పూలకీ, మనిషికీ సంబంధం ఏమిటి? మరొక కొత్త పాఠం మొదలవుతోందని అర్థమయింది. వనలత కూడా ఎక్కడున్నా వెంటనే ఇటొస్తే బాగుణ్ణు అనుకున్నాను.

‘భూమ్మీద జీవజాలం వికసించిన చరిత్రని పూలకి ముందూ, పూలతర్వాతా అని రెండు అధ్యాయాలుగా విభజించవచ్చు. ఒక రచయిత ఏం రాసాండంటే, ఎవరేనా గ్రహాంతరవాసి వేరే చోటనుంచి కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమిని చూస్తూ ఉంటే, ఇప్పటికి పదికోట్ల సంవత్సరాలనుంచి మాత్రమే ఈ రంగులు అతడికి కనబడుతూ ఉంటాయని. ఎందుకంటే పదికోట్ల సంవత్సరాలకింద ఈ భూమ్మీద పువ్వుల్లేవు. ఊహించు, 440 కోట్ల సంవత్సరాల పాటు భూమి తన జడలో పూలు ముడుచుకుని ఎరగదు. అప్పుడు ఎటు చూసినా ఒకే ఒక్క ఆకుపచ్చ ఉండేది. ఆ ఆకుపచ్చ కూడా వ్యాపించకపూర్వం, కుతకుతా ఉడుకుతున్న భూగర్భంతాలూకు, ఎరుపు, గంధకజ్వాలల తాలూకు పసుపు, కరిగి కెరటాల్లాగా ఎగిసిపడుతున్న లావా తుపాన్ల ధూమ్రవర్ణాలు మాత్రమే భూమికి తెలిసిన రంగులు’.

‘ఇప్పటికి పాతికకోట్ల సంవత్సరాల కిందట, సరీసృపాలు తలెత్తిన కాలంలో గాలిద్వారా విత్తనాలు ప్రయాణించి చెట్లు ప్రపంచమంతా వ్యాపించడం మొదలయ్యాక, వాటిమీద ఆధారపడి బతికే రెప్టైల్స్ భూమ్మీద ప్రాణంపోసుకున్నాయి గాని, వాటికింకా, అన్నిరకాల శీతోష్ణాల్నీ తట్టుకునే శక్తిరాలేదు. బల్లుల్లాంటి పక్షులు మాత్రమే బతగ్గలిగిన కాలం అది. మన పూర్వీకుల పూర్వీకుడు ఆ కాలంలో ఏదో ఒక చిన్న ఎలకలాంటి ప్రాణిలాగా ఎక్కడో ఊపిరితీస్తూ ఉండేవాడు.’

‘ఆ మహాయుగం ముగిసిపోతూండగా, ఊహించని ఒక మహావిప్లవం సంభవించింది. అది పూల విప్లవం. మీరు ఏంజియో స్పెర్మ్స్ అంటారే ఆ మొక్కలన్నమాట. ఏంజియో స్పెర్మ్ అంటే ఏమిటి? భద్రంగా ఒక పెట్టెలో దాచిపెట్టిన విత్తనం అన్నమాట. అంతేనా, ఆ పెట్టెకి కింద పోగులుపోగుల్లాంటి లింకులు కూడా. ఆ పెట్టె గాల్లో ఎక్కడికి ఎగిరినా ఆ విత్తనానికి ఏమీ కాదు. ఆ పోగుల వల్ల అది దేనికన్నా అతుక్కోగలదు. కుంతి కర్ణుణ్ణి పెట్టెలో పెట్టి గంగలో వదిలినట్టు, ఆ పెట్టె ఆ విత్తనాన్ని ఎంత దూరప్రాంతానికైనా క్షేమంగా తీసుకుపోగలదు. అది ఒక్కటే కాదు, ఆ విత్తనం కుక్కిపెట్టిన ఒక ఎనర్జీ కాప్సూల్. అలా పౌష్టికాహారం ఒక విటమిన్ మాత్రలాగా దొరకడం మొదలయ్యాక, క్షీరదాలకి వంట్లో రక్తాన్ని వెచ్చగా నిలుపుకోవడం సాధ్యమైంది. లేకపోతే అంతకుముందు శీతాకాలమంతా అవి హైబర్నేషన్లో గడపక తప్పేదికాదు. పూలవల్ల అపారమైన ఆహారం రెడీ-టు-ఈట్ ఫుడ్ లాగా దొరకడం మొదలయ్యాక పక్షులు ఎగరడానికీ, క్షీరదాలు వర్ధిల్లడానికీ, పరిణామ క్రమంలో మనిషి తలెత్తడానికీ దారి సులువయ్యింది’ అన్నాడు ప్రొఫెసరు.

ఆయన మళ్ళా ఆ పూలకేసి చూసాడు. ఎరుపు, గులాబి, పసుపు, లేతనీలం, ఊదా- అసంఖ్యాకమైన రంగుపూల గుత్తుల్తో ఆ పొదమొత్తం ఒక పూల గుత్తిలాగా ఉంది.

‘మనకి తెలియట్లేదుగానీ, ఈ పూలకి మనరహస్యం తెలుసనిపిస్తుంది. అందుకనే పరిణామ క్రమాన్ని ఎంతో చక్కగా వివరించాడనుకున్న డార్విన్ కూడా పూలవిప్లవం దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఎబొమినబుల్ మిష్టరీ అని అనకుండా ఉండలేకపోయాడు’ అని అన్నాడు.

అప్పుడు లేవబోయాడు. కాని ఎవరో తన కాళ్లు పట్టుకుని ఆపినట్టు మళ్లా చతికిలబడ్డాడు.

‘పూలు, రాళ్ళు, మొక్కలు- చివరికి, ఇదిగో ఈ స్పైడర్ వెబ్ చూడు’ అని ఒక పొదనీ దానిపక్కనున్న నరవేప చెట్టునీ అల్లుకుంటున్న  ఒక సాలీడుని చూపించాడు. ఆ హేమంత ప్రభాతకాంతిలో ఆ సాలీడు గూడు ఒక మంత్రసౌధపు ద్వారానికి వేలాడుతున్న జలతారు తెరలాగా ఉంది.

‘చివరికి ఈ సాలీడు గూడుని చూసినా కూడా నేనొక అద్వితీయమైన ఆనందంలో మునిగిపోతాను. నీకు సందేహం రావచ్చు, ఈయన సైంటిస్టు కదా, ఇలా మాట్లాడుతున్నాదేమిటి? అని. నిజమే, నేను సైంటిస్టునే. అది నా అబ్జర్వేషన్స్ లో. వాటిని అనలైజ్ చెయ్యడంలో మాత్రమే. కానీ నా అనుభూతిలో నేనొక మిస్టిక్ ని. మామూలుగా ఒక జియాలజిస్టు జీవితంలో ఏదీ డ్రమటిక్ కాదు. కాని నాలాంటివాడికి ప్రతి ఒక్కరోజూ పొయెటిక్ గానే ఉంటుంది.

‘చూడు, ఈ కొండలు, ఇప్పటికి, ముప్ఫై ఏళ్ళుగా వీటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. జియాలజి లో చేరినప్పుడు తరగతిగదిలో మొదటిరోజుల్లో ఏం చెప్తారో తెలుసా? మీరు ఏది చూసినా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. వాటి కొలతలు రికార్డు చెయ్యండి. చూసిన వివరాలన్నీ డిటెయిల్డ్ గా రాసుకోండి. సాంపిల్స్ సేకరించండి అని చెప్తారు. కాని స్టూడెంట్ గా ఉన్నప్పుడూ, ఆ తర్వాత నేనే టీచరుగా మారినప్పుడూ కూడా, అక్కడ క్లాసులో ఏం చెప్తానో, ఏమి విన్నానో గాని, తీరా చేసి ఒక కొండముందు నిలబడేటప్పటికి నా మైండ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రంగులు కలపడం గురించి ఎంత చదివినా, ఎంత నేర్చుకున్న, తీరా తన ఎదట ఉన్న దృశ్యాన్ని చిత్రించమనేటప్పటికి, పెయింటర్స్ కి కూడా అలాగే భావప్రవాహం ఆగిపోతుందని విన్నాను. ఎందుకో తెలుసునా? ఎంత చెప్పినా సైంటిఫిక్ మెథడ్ ఈజ్ అల్టిమేట్లీ టు-డైమెన్షనల్. ఒక కళాకారుడు మాత్రమే తాను చూసినదాన్నీ, అనుభవించినదాన్నీ త్రీ-డైమెన్షనల్ గా మనకి అందించగలుగుతాడు.’

ఇంతలో నా ఆరాటం వనలతకి వినబడింది కాబోలు, ఆమె కూడా మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. ఖాకీ పాంటు, ముదురు ఆకుపచ్చ రంగు టీషర్టు. కంఠం చుట్టూ ఎర్రటి స్కార్ఫ్ తో ఆమె ఒక రెడ్ బ్రెస్టెడ్ రాబిన్ లాగా ఉంది. జీవనానందుడు ఆమె కళ్ళని చూసే పక్షిగూళ్ళల్లాంటి నేత్రాలు అన్నాడేమో!

ఆమెని చూస్తూనే ప్రొఫెసరు మాటలు మరింత ఉద్వేగభరితంగా మారాయి.

‘విమల అడిగింది నన్ను, మీరెందుకు ఎప్పుడూ పొయెటిక్ గా మాట్లాడుతుంటారు అని. (నేను అడిగానా?) నేనేం చెప్తున్నానంటే, పొయెట్ దీ, జియాలజిస్టు దీ కూడా ఒకటే ఫీల్డ్ అని. బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ద లాండ్ ఆఫ్ వైల్డర్ నెస్ అని.’

‘ఒకసారి నా నోటంట వైల్డర్ నెస్ అనే మాట విని నా కొలీగ్ ఒకడు వైల్డర్ నెస్ అంటే మనుషులు తిరుగాడే చోటుకాదనీ, ఒక యూనివెర్సిటీ ప్రొఫెసరుగా నేను సివిలైజ్డ్ వరల్డ్ గురించి మాట్లాడాలి తప్ప వైల్డ్ ప్లేసెస్ గురించి కాదనీ వాదించాడు-‘ అని ఆగాడు.

ఆ పెద్దమనిషి గుర్తుకొచ్చినట్టున్నాడు.

‘పూర్ ఫెలో’ అని అన్నాడు చిరునవ్వుతో.

‘వాడికేం తెలుసు? గారీ స్నైడర్ ని చదివితే తెలుస్తుంది. మనం వైల్డర్ నెస్ కి ఇచ్చే డెఫినిషన్లన్నీ మనుషుల వైపు నుంచి చెప్పుకుంటున్న మీనింగ్స్ అని. ఈ మనిషెంత? ఈ నాలుగున్నర బిలియన్ల జియొలాజికల్ టైమ్‌లో మనిషి బతుకెంత? వైల్డర్ నెస్  కి మనుషుల వైపునుంచి కాదు, ఈ రాళ్లవైపు నుంచి అర్థం చెప్పాలి, ఈ మహారణ్యాల వైపు నుంచి అర్థం చెప్పాలి, ఏనుగులు, కొండచిలువలు, ఎలుగుబంట్ల దృష్టిలో అర్థం చెప్పాలి’ అని అన్నాడు ఉద్వేగంగా.

అప్పుడు ఒక క్షణం అటూ ఇటూ వెతుక్కున్నాడు. మంచినీళ్ళకోసం అని నాకు అర్థమయింది. నా దగ్గరున్న బాటిల్ ఇచ్చాను. ఆ బాటిల్ మొత్తం గటగటా తాగేసాడు. నీళ్ళు అతని పెదాలమీంచి కంఠం మీదుగా షర్ట్ మీదకీ కారిపోయాయి.

‘వాడికి తెలియందేమంటే, సైంటిఫిక్ ఎక్స్ పీరియెన్స్ లో కూడా మూడు దశలుంటాయి. మొదటి దశలో మన అంచనాలు ఊహలు తలకిందులవుతాయి. దశ రెండో దశలో  మనం మనల్ని నెమ్మదిగా కూడగట్టుకుంటూ మన ముందున్న వాస్తవంతో ఒక అంగీకారానికి వస్తాం. మనం గ్రహిస్తున్న చిన్న చిన్న సత్యాలు తెలియడం మొదలుపెట్టాక మన ముందున్న ప్రపంచం గురించి ఏం తెలుసుకోగలమో ఏం తెలుసుకోలేమో తెలుసుకోవడం మూడవ దశ. ఆ మూడవదశలో అన్నిటికన్నా ముందు వినయం కావాలి. నువ్వు నిజమైన జియాలజిస్టువి, బోటనిస్టువి, నాచురలిస్టువి ఎప్పుడవుతావంటే,  అడవికీ, కొండలకీ నువ్వు  ఒక శిష్యురాలివి కాగలిగినప్పుడు. గుర్తుపెట్టుకోండి. మనం ఒక స్థలానికి వెళ్ళామంటే అది మనకి వట్టి అనుభవంగా మాత్రమే కాదు, ఒక ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ గా మారిపోవాలి. మనం ఎంతసేపు చూసినా ఉపరితలం మాత్రమే చూడగలం. ఈ రాళ్ళు, ఈ ఆకులు, ఈ కణాలు మైక్రోస్కోపులో పెడితే మరికొంత లోతుకి చూడగలం. మీ కార్బన్-14 డేటింగ్ మెథడ్ మిమ్మల్ని మహా అయితే నలభై వేల ఏళ్ళదాకా వెనక్కి తీసుకువెళ్ళదు. ఆ తర్వాత?’

‘నేనేమంటానంటే నువ్వు ఎంతైనా పరిశీలించు, ఎంతలోతుగానైనా విశ్లేషించు, కానీ ఆ వండర్ కి దూరంకాకూడదు. విమలా, నువ్వు రోజూ ఎన్నో మొక్కల్ని చూస్తున్నావు, గుర్తుపడుతున్నావు, రికార్డు రాసుకుంటున్నావు, కాని గుర్తుతెచ్చుకో, మొట్టమొదటిసారి ఒక మొక్కకి వేర్లుంటాయని నీకెప్పుడు తెలిసింది? నేలలోంచి ఒక్కని బయటికి పీకినప్పుడు అల్లిబిల్లిగా అల్లుకుపోయిన వేర్లు కనబడ్డ దృశ్యం ఎప్పుడు చూసావు? ఆ క్షణం గుర్తుందా? కుడ్ యు రికలెక్ట్ దట్ సెన్స్ ఆఫ్ వండర్?’ అనడిగాడు నా కళ్ళల్లోకి చూస్తూ.

నేను గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాను.

‘విమలా, ఒరుణిమా, రిమెంబర్, మనం ఒక అనాది నిర్మలత్వం నుంచి ఎంత దూరంగా జరిగిపోయామో ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడే తెలుస్తుంది. వాడు, ఆ నా కొలీగ్  మానవమేధ అంటే బ్రెయిన్ ఒక్కటే అనుకుంటున్నాడు. యు నో.  నక్షత్రధూళీ, కాలమూ, ప్రొటోప్లాజమూ కలిస్తేనే మానవమేధ తయారయ్యేది అని వాడికి ఎలా చెప్పేది?’

‘నువ్వు మొదటిసారి ఒక కొండ దగ్గర నిలబడ్డప్పుడు కాలం దేశం ఖండించుకునే ఆ బిందువు దగ్గర నీ కలిగిన అనుభవాన్ని అనుభూతిని నువ్వు ఎప్పటికీ టు డైమెన్షనల్ మ్యాపులోకి కుదించలేవు. అందుకనే  మళ్ళా మళ్లా  నువ్వు ఆ కొండల దగ్గరికి తిరిగి వెళుతూనే ఉంటావు. అవి నీకు  మళ్లీమళ్లీ చదవాలి అనిపించే ఒక ప్రాచీన కావ్యం లాగా కనిపిస్తాయి.  ఒక పర్వత శ్రేణి తాలూకు చరిత్ర అనేక కాండలుగా, పర్వాలుగా మలిచిన ఇతిహాసం లాంటిది. నువ్వు స్టడీ చేస్తున్న, అనలైజ్ చేస్తున్న ఔట్ క్రాప్ మహా అయితే ఆ ఇతిహాసంలో ఒక పేరాగ్రాఫ్ లేదా ఒక శ్లోకం అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఈ రహస్యం చీనా చిత్రకారులకి తెలుసు. వాళ్లు చిత్రించిన షాన్-సుయి చిత్రలేఖనాలు చూడు. వాటిల్లో మనిషి కనిపించనే కనిపించడు. ఒకవేళ ఉన్నా అంగుష్ఠమాత్రుడిగా కనిపిస్తాడు. కాబట్టి ఫస్ట్ లెర్న్ హుమిలిటీ. ఒకణ్ణి నేను ఆర్టిస్టు అనో, జియాలజిస్టు అనో ఎప్పుడు అనగలనంటే, వాడి అణువణువులోనూ, ఒక అబ్సొల్యూట్ హుమిలిటీ కనిపించాలి. దట్ హి షుడ్ కన్సిడర్ హిమ్‌సెల్ఫ్ లైటర్ దేన్ ద లైటెస్ట్ పార్టికల్ ఆఫ్ డస్ట్’

అప్పటికే చాలాసేపటిగా మాటాడుతూండటంతో సేన్ గుప్త అలసిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నుదుటిమీద, ముక్కుమీదా, చెంపలమీదా చెమట పడుతోంది.

‘కాకూ, షల్ వుయ్ మేక్ ఎ మూవ్’ అంది వనలత. అని తన చేయి ఊతంగా ఆయన్ని లేపింది. పైకి లేచి నిలబడి ప్రొఫెసరు సేన్ గుప్త తన ఎదట ఉన్న కొండని మరోసారి ప్రేమగా పరికించాడు.

‘విమలా! మనం యుద్ధభూమిలో అలిసి మూర్ఛపోయినప్పుడు మనకి ప్రాణం పొయ్యడానికి ఒక్క మూలిక చాలదు. అందుకే కాబోలు హనుమాన్ ఏకంగా ఒక కొండనే పట్టుకొచ్చాడు’ అని అన్నాడు.

10-4-2023

21 Replies to “ఆ వెన్నెల రాత్రులు-9”

  1. “ఎంతైనా పరిశీలించు, ఎంతలోతుగానైనా విశ్లేషించు, కానీ ఆ వండర్ కి దూరంకాకూడదు“
    మామూలుగా routine గా జరిగే విషయాల్లోనే జీవితమున్నట్లు వాటిల్లోని వండర్ ని miss అవకూడదంటారు!! Is it practice, sir?

  2. విషయ పరిజ్ఞానానికి గీటు రాయి!

    సుప్రభాత వేళ!
    శుభమస్తు గాలి వీచే…

  3. ముందుగా బాటనీ పాఠముంది మ్యాటనీ ఆటఉంది దేనికో ఓటు చెప్పరా అన్న చరణాలు చెవుల్ని తాకి వెళ్లిపోయాయి. తరువాత H.S.C. వరకు చదువుకున్న జీవశాస్త్ర ప్రాథమిక పరిచయం కన్పించింది. తరువాత చిన్నప్పుడు అనేక వృక్షజాతులను పరిచయం చేసిన మా ఊరి చుట్టూ ఉన్న హరిత వనం కనుల ముందు కదలాడింది. ఓషధీ మొక్కలకు ఆలవాలమని ఎవరో చెప్పగా విని అరవై అయిదేళ్ల వయసులో సాహసం చేసి ఎక్కిన రామగిరి, దిగేప్పుడు ఇదే ఆఖరురోజేమో అనుకునేంత ప్యానిక్ సిటువేషన్ నుండి బయట పడిన అనుభవం అన్నీ పక్కనుండి కదులుతున్నా మీరు విమల పాత్రను ఆవహించుకొని సేన్ పాత్రను పరామర్శిస్తూ రాస్తున్న కథ అనాలో గాథ అనాలో వచన కావ్యం అనాలో నిర్థారించుకోలేని అనుభూతిని నా స్పందనగా నివేదిస్తున్మా. మధ్యలో బషో లాంటి వారు ఎందుకు కొండల్ని కోనల్ని తమలోకం చేసుకున్నారో ఆలోచిస్తూ ఒక అలౌకిక పురాస్మృతుల జాడల్ని లీలగా కంటున్నా. మనిషి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడానికి కావలిసిన తపోమార్గం మీ వెన్నెల రాత్రులు.నమస్సులు

  4. బాగుంది.. పూల ‘సంజీవని’ తో పునరుజ్జీవనం పొందినట్లు వుంది. ధన్యవాదాలు.

  5. ప్రకృతి లో ఆణువణువూ, దేన్నీ వదలకుండా..
    నిశితంగా పరిశీలించి, విశ్లేషించి..
    ప్రతి అణువు వైవిధ్యాన్ని, ప్రత్యేకతను..
    ఎలా అనుభవైకవేద్యం చేసుకోవాలో..
    ఆ విషయాలకు, మెదడు లో ఒక ప్రత్యేక అర ఏర్పరచి ఎలా నిక్షిప్తం చేసుకోవాలో..
    ఆ నిక్షిప్తమైన ప్రకృతి ప్రత్యేకత.. మళ్ళీ మన జ్ఞానేంద్రియాలకు అనుభవంలోకి వచ్చినప్పుడు..ఆ వైవిధ్యాన్ని మనసుతో సృజించి రమించాలో.. అర్ధం అవుతున్నది. ఎదో కొత్తలోకం లో విహరిస్తున్నట్లు ఉంది. ధన్యవాదాలు.

  6. మీరు అడవి ఋణం తీర్చుకుంటున్నట్లే ఉంది

  7. “—మనుషులు , నెమ్మదిగా కోసుకునే ఓపికలేక,   ఆ కొమ్మలు విరిచి, ఆ చెట్లు దులిపి పొయ్యేవారు. వాళ్ళు వెళ్ళిన చాలాసేపటిదాకా అడవి కార్చిన కన్నిటిచుక్కల్లాగా ఉసిరికాయలు ఆ నేలలో, గడ్డిమీద చెల్లాచెదురుగా పడి ఉండేవి….. ……మానవజీవితసారమంతా  ఉసిరికాయని కొరికి రుచిచూడటంలాంటిదే !
    —మనిషిని ఆర్టిస్టు అనో, జియాలజిస్టు అనో ఎప్పుడు అనగలమOటే, ఆమనిషి అణువణువులోనూ, ఒక అబ్సొల్యూట్ హుమిలిటీ కనిపించాలి. దట్ హి షుడ్ కన్సిడర్ హిమ్‌సెల్ఫ్ లైటర్ దేన్ ద లైటెస్ట్ పార్టికల్ ఆఫ్ డస్ట్’—“

  8. అభిజ్ఞానశాకుంతలంలోని పంచమాంకంలో కాళిదాసుని పద్యంలా
    రమ్యాణి వీక్ష్య, మధురాంశ్చ నిశమ్య శబ్దాన్
    పర్యత్సుకో భవతి యత్ సుఖితోఽపి జంతుః
    త చ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం
    భావస్థిరాణి జననాంతర సౌహృదాని –
    ఎంతటి సుఖావస్థలో ఉన్న ప్రాణి అయినా, అందమైన దృశ్యాల్ని చూసిన తర్వాత, మధురమైన శబ్దాల్ని విన్న తర్వాత, ఇలాంటి పర్యుత్సుకతని (excitement) పొందుతూనే ఉంటుంది. ఇంతకు పూర్వం తెలియని ఏదో ఒక విషయాన్ని గురించి మనసులో నెమరు వేసుకుంటూనే ఉంటుంది. అందువల్లే, పూర్వజన్మల్లో ఏర్పడ్డ స్నేహాలు మనస్సుల్లో గాఢంగా నాటుకుని ఉంటాయి అన్న భావంలా
    ఇటువంటి పర్యుత్సుకతని అణువణువునా అందిస్తూన్న మీ పాండితీ ప్రకర్షకు మౌనంగా సాష్టంగ దండ ప్రణామాలు, సభక్తికంగా సమర్పించడం తప్ప మరేమీ చేయలేము.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading