
రెండో రోజు- రెండవ సంభాషణ
సమృద్ధి వేరు సంపన్నత వేరు
గురూజీ మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలపు అర్థవ్యవస్థ ఎలా సామాజికమో చెప్తున్నారు కదా, ఆ విషయాన్నే ఆయన మరింత విపులంగా చెప్తున్నారు:
‘గ్రామాల్లో ఇన్ని రకాల చేతివృత్తుల వాళ్ళు బతికేటప్పుడు, ప్రతి ఒక్క సాంకేతికతా, అంటే టెక్నాలజీ గ్రామంలోనే ఉండేది. ప్రతి ఒక్క వస్తువూ గ్రామంలోనే తయారయ్యేది. ఉత్పత్తీ, మార్కెటింగు రెండూ కూడా గ్రామంలోనే నడిచేవి. తయారు చేసినదాన్ని బయటికి తీసుకువెళ్ళవలసిన అవసరముండేది కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళ మార్కెట్ వ్యవస్థ ఎలా ఉండేదో చూడాలి.’
‘మన అవసరాలు చాలా తక్కువగా ఉంటాయి. కాని అంత తక్కువ అవసరాల కోసం ఎవరేనా వస్తువులు ఉత్పత్తి చేస్తారా అంటే చేయరు. వాడు బతకాలి అంటే వాడికి పూర్తి స్థాయిలో పని కావాలి. ఆ పని కూడా ఎలా ఉండాలంటే, వాడొక సామాజిక జీవితాన్ని జీవించేలా ఉండాలి, అసామాజిక జీవితం కాదు. మనదగ్గరున్న పాత పద్ధతి ప్రకారం, భగవంతుడు మనకిచ్చిన 24 గంటల్లో, ఎనిమిది గంటలు పడుకోవాలి, నిద్ర కూడా ముఖ్యమే, ఎనిమిది గంటలు మన ఆహారంకోసం, జీవనం కోసం పనిచేయాలి, ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఆహారం కోసం పనిచేయకూడదు. మిగిలిన మన ఎనిమిది గంటల సమయాన్ని ఆధ్యాత్మిక, సామాజిక జీవితం కోసం కేటాయించాలి. ఈ జీవితాన్ని ఇప్పుడు జీవించకపోతే ఇంక ఎవరికోసం బతకాలి? ఆధ్యాత్మిక, సామాజిక జీవితం జీవించకపోతే ఇంకెందుకు బతకాలి?’
‘ఈ రోజుల్లో చాలామంది, కంపెనీలలో ఇక్కడా అక్కడా పని చేసేవాళ్ళు, ఈ పిల్లలు, తాము రోజుకి పద్ధెనిమిది గంటలనుంచి ఇరవై గంటల దాకా కూడా పని చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు గాడిదలు. మనుషులు కారు. మన దగ్గర ఉన్న ఎద్దులు, గాడిదలు కూడా ఇన్ని గంటలు పని చేయవు. నువ్వు మనిషివై ఉండి కూడా ఇన్ని గంటలు చాకిరీ చేస్తూ చస్తున్నావు. మరి నీ సామాజిక జీవితం ఏమైంది? మీకు కనీసం గృహస్థజీవితం కూడా లేకుండా పోయింది. సామాజిక జీవితం అనేది చాలా దూరపు మాట, కనీసం కుటుంబ జీవితం కూడా లేకుండా పోయింది.’
‘కానీ మన పాత పద్ధతిలో అలా ఉండేది కాదు. ఆధ్యాత్మిక, సామాజిక జీవితం గడపాలి. దాని కోసం పూర్తి స్థాయిలో సమయం దొరకాలి. అందుకోసమే అటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించారు, దానివల్ల ఎవరూ కూడా ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఎవరూ పని చేయాల్సిన అవసరముండేది కాదు. కాబట్టి ఈ చేతివృత్తుల వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో పని కల్పించాలి. చేతినిండా పని ఉండాలి, కానీ చచ్చేంత పని కాకూడదు. మరి చేతినిండా పని ఇవ్వాలంటే ఎలా? అందుకోసం పూర్వం ‘ఇవ్వడం’ అనే పద్ధతి పెట్టారు, ‘అమ్మడం’ కాదు. మన దగ్గర ఉన్న చేతివృత్తుల వాళ్ళు ‘మేము ఆ ఇంటికి ఈ వస్తువునివ్వాలి’ అనంటారు తప్ప, అమ్మడం గురించి మాట్లాడరు. ఈ రోజు మనం కళాకారులతో, వృత్తి పనివాళ్ళతో అమ్మడం గురించి మాట్లాడుతున్నాము. ఎప్పుడైతే అమ్మడం అనే మాట వస్తుందో, అప్పుడు మనిషి ఒక మెషిన్ లాగా పని చేయాల్సి వస్తుంది. అదే ‘ఇవ్వడం’ అనే భావన ఉన్నప్పుడు, మనిషి తన సామాజిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతాడు.అతనికి తెలుసు, ఏ ఇంటికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని. ఆ లెక్కన అతను తన పనిని చేసుకుంటాడు. అప్పుడతనికి ఎటువంటి టెన్షన్, ఎటువంటి ఆందోళన ఉండవు. ప్రశాంతంగా తన పనిని చేసుకుంటాడు, ‘ఆ ఇంటికి ఆ సమయానికి ఇవ్వాలి కదా’ అని ఆ లెక్కన ముందే సిద్ధం చేసుకుంటాడు. అతని మెదడులో ఆ మార్కెట్ అంతా ముందే స్థిరపడి ఉంటుంది—నేను ఫలానా ఇంటికి ఇదివ్వాలి అని.’
‘పూర్వం వృత్తిపనివాళ్ళు మూడు రకాలుగా పని చేసేవాళ్ళు: ఒకటి, వ్యాపారం కోసం, ఎవరి వృత్తి ఏదైతే దాని కోసం. రెండవది, ఇంటి కోసం. మూడవది, గ్రామం కోసం. వాళ్ళు చేసే పనులన్నీ వ్యాపారం, ఇల్లు, గ్రామం కోసం చేసేవాళ్ళు. వ్యాపారం లేదా వృత్తి సంబంధంగా చేసే పనులకి ఖచ్చితమైన ధర నిర్ణయించి ఉండేది. ‘మేమింతిస్తాం, నువ్వు మాకు ఇంతివ్వాలి ‘ అని ముందే నిర్ణయించుకునేవారు. ప్రతి ఒక్కరికీ ఇది వర్తించేది. ఉదాహరణకి, ఒక రైతున్నాడనుకోండి, అతనికి పశువులు నీళ్ళు తాగడానికి మట్టి గోలేలు కావలసి ఉంటుంది. నీళ్ళు నింపుకోడానికి కావాలి, వంట వండుకోడానికి మట్టి పాత్రలు కావాలి, మరికొన్ని వస్తువులు కావాలి. ఇవన్నీ ఏడాది పొడుగునా అవసరమవుతాయి. కాబట్టి వాటికి ముందే ఒక విలువ ఖరారై ఉండేది. ఇంతింత ఇవ్వాలని ఉండేది. అది కుటుంబాల లెక్కన లేదా పశువుల సంఖ్యను బట్టి ఉండేది. దానికి మించి అదనంగా ఇంకేదైనా కావాలంటే, ఉదాహరణకి, ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండి పశువులు నీళ్ళు తాగే గోలేలు పగిలిపోయాయనుకోండి, అప్పుడు ముందే నిర్ణయించుకున్న లెక్కకు మించి కావాల్సి వస్తే, దానికి విడిగా మళ్ళీ అదనపు ధర చెల్లించాల్సి వచ్చేది. అంతేకానీ అది ఏడాది పొడవునా ఒకే పద్ధతిలో సాగ దు. దానికి అదనపు ధర ఉంటుంది.’
‘ఇక ఇంటి కోసం ఇవ్వడమంటే ఎలా ఉండేది? మన దేశంలో 49 రకాల సంస్కారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సంస్కారంలోనూ ప్రతి వృత్తి పనివాడూ కనీసం ఒక్క వస్తువు నుండి గరిష్ఠంగా ఐదు వస్తువుల దాకా ఇచ్చే ఒక పద్ధతి ఉండేది. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఒక బిడ్డ పుట్టినప్పటి నుండి చనిపోయే దాకా ఈ 49 సంస్కారాలు నడుస్తాయి. అందులో 16 పెద్ద పెద్ద సంస్కారాలుంటే, మిగతావన్నీ, చిన్నా పెద్దా కలిసి మొత్తం 49 సంస్కారాలు.’
‘మూడవది, గ్రామం కోసం చేసే పని. గ్రామంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి—గ్రామ దేవతల పూజలు, లేదా గ్రామం అంతా కలిసి జరుపుకునే పండుగలు. దసరా, దీపావళి వంటివి గ్రామం ఉమ్మడిగా జరుపుకునే పండుగలుగా భావించేవాళ్ళు. ఇవి ఎవరికీ వారే విడివిడిగా చేసుకునేవి కావు. అవి మొత్తం గ్రామం జరుపుకునే పండుగలు. హోలీ కూడా మొత్తం గ్రామం జరుపుకునే పండుగ. ఆ తర్వాత గ్రామ దేవతల పూజలు, జాతరలు ఉంటాయి. వాటి కోసం వీళ్ళిచ్చే వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి, ఒకటి లేదా రెండు వస్తువులు ఉంటాయి. ప్రతి ఒక్కరి హక్కు లేదా వాటా అందులో ఉంటుంది. దాని కోసం గ్రామం తరపున వాళ్ళని గౌరవించేవాళ్ళు, వాళ్ళకి మర్యాద చేసేవాళ్ళు.’
‘వ్యాపారం లేదా వృత్తి కోసం, ధాన్యాల కోసం ఇచ్చేదానికి ఖచ్చితమైన విలువ ఉండేది. “మేమింత ఇస్తాము, నువ్వు మాకు ఇంతివ్వాలి’ అని ప్రతి ఒక్కరికీ ముందే ఖరారై ఉండేది. దాన్నే ‘ధాని’ అనేవాళ్ళు. ధాన్యం ద్వారా ఇచ్చే వాటా అది. ఇక రెండవది ఇంటి కోసం, ఇంటి కోసం ఇచ్చేదానికి ఎటువంటి ఖచ్చితమైన ధర ఉండేది కాదు. ఇంటి ప్రజలు వాళ్ళని గౌరవించేవాళ్ళు, సత్కరించేవాళ్ళు. చాలాసార్లు వృత్తి పనివాడు తన వస్తువులని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు, లేదా చాలాసార్లు ఆ ఇంటి వాళ్ళే వృత్తి పనివాడి ఇంటికి వచ్చి ఆ వస్తువులని తెచ్చుకుంటారు.’
‘వృత్తి పనివాళ్ళకి కావలసిన రా మెటీరియల్, ప్రతి ఒక్క ఇంటినుంచీ లేదా మొత్తం గ్రామం నుంచీ దానంతట అదే లభిస్తూ ఉండేది. అది వాళ్ళకి చాలా సులభంగా లభించేది. ఇంటికోసం తీసుకు రావలసి వచ్చినప్పుడు, అంటే చాలాసార్లు వీళ్ళే వెళ్ళాల్సి వచ్చేది, అప్పుడు ఇళ్ళెన్ని, ఎలా ఉండేవి? వాళ్ళు ఇళ్ళని చాలా పద్ధతిగా పంచుకునేవాళ్ళు. ఒక పెద్ద నగరం లేదా గ్రామం ఉంటే అందులో ఉండే ఇళ్ళన్నీ పంచుకునేవాళ్ళు. చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల పరిథిలో ఉండే గ్రామాల్ని కూడా పంచుకునేవాళ్ళు. నగరంలో ఇళ్ళని పంచుకునేవాళ్ళు. ఇదిప్పటికీ ఇక్కడ ఉంది. ఇక్కడున్న కుమ్మరులందరికీ తమకంటూ ప్రత్యేకంగా కొన్ని గ్రామాలున్నాయి. ఆ గ్రామాలకి కుమ్మరే స్వయంగా వెళ్ళి ఆ వస్తువులిస్తాడు. బస్తీలో ఇళ్ళని పంచుకునే పద్ధతి ఎలా ఉండేదంటే, ఒక బస్తీలో వంద ఇళ్ళు ఉన్నాయనుకుంటే, పది మంది కుమ్మరులుంటే, ప్రతి ఒక్కారూ తలా తొమ్మిదిళ్ళూ పంచుకునేవారు. మిగిలిన పదీ వీళ్ళ కుటుంబాల ఇళ్ళు. పురోహితులు కూడా ఇలానే ఇళ్ళనీ గ్రామాల్నీ పంచుకుంటారు.’
‘ఇల్లు, దాని నియమాలు, పద్ధతులు చాలా ఖచ్చితంగా ఉండేవి. ఎలా ఇవ్వాలి, ఎవరి వాటా ఎవరికి వెళ్తుంది, ఒకవేళ ఆ సమయంలో, ఆ గ్రామానికి చెందిన కుమ్మరి లేదా చేనేత కార్మికుడు అనారోగ్యంతో ఉంటే అతని స్థానంలో ఎవరు వెళ్ళాలి, అలా వెళ్ళినందుకు ఏమివ్వాలి మొదలైనవన్నీ ముందే నిర్ణయించి ఉండేవి. పూర్తిగా ఖరారై ఖచ్చితంగా ఉండేవి. అందులో చాలా కులాల పద్ధతి ఎలా ఉండేదంటే, ప్రతి సంవత్సరం వాళ్ళు మారిపోయేవాళ్ళు. ఈ సంవత్సరం మీ గ్రామానికి వచ్చిన పురోహితుడు వచ్చే సంవత్సరం రాడు. వేరొకరు వస్తారు. అలాగే ఈ సంవత్సరం మీ ఇంటి దుస్తులు ఉతికిన చాకలి వచ్చే సంవత్సరం రాడు. అతను మారిపోతాడు. అంతేకానీ ఒకే వ్యక్తి శాశ్వతంగా ఒకరి ఇంటి గుడ్డలు ఉతుకుతాడని లేదు.’
‘సంవత్సరానికి పన్నెండు నెలలున్నాయి. మొత్తం పన్నెండు నెలల లెక్కన సాగుతుంది. ఒకవేళ ‘అధిక మాసం’ వస్తే. అప్పుడు ఆ సంవత్సరం పదమూడు నెలల సంవత్సరం అవుతుంది. ప్రతి మూడేళ్లకీ ఒకసారి అధిక మాసం వస్తుంది కదా! దాన్ని మామూలు సంవత్సరంలో లెక్కించరు. ఆ అధిక మాసానికి వీళ్ళు విడిగా అదనంగా అన్ని వస్తువులూ ఇవ్వాల్సి ఉంటుంది.’
‘సేవా కార్యక్రమాలలో లేదా వృత్తులలో ఉన్న సమాజాలకి సంవత్సరంలో ఒక నెల సెలవు ఉండేది. ఉదాహరణకు మంగళి, అంటే నాయీ బ్రాహ్మణుడు ఉన్నాడు, చాకలి అంటే ధోబీ ఉన్నాడు. వీళ్ళొక నెల పాటు సెలవు తీసుకుంటారు. ఇప్పుడు శ్రావణ మాసంలో మనం గడ్డాలు, మీసాలు, జుట్టు కత్తిరించుకోము కదా. అది మనం పెట్టుకున్న నియమం కాదు. ఆ నెల పాటు మంగళి జుట్టు కత్తిరించడు. అది అతను పెట్టుకున్న నియమం. గ్రామాలలో కొన్ని ఇళ్ళలో సోమవారం రోజు గడ్డం చేసుకోరు, కొంతమంది బుధవారం చేసుకోరు, కొంతమంది గురువారం చేసుకోరు. ఇవి ఆయా ఇళ్ళ వాళ్ళు పెట్టుకున్న నియమాలు కావు. ఆ మంగళిసమాజమే నిర్ణయించింది. ఫలానా కుటుంబాలకి ఈ రోజు, ఫలానా కుటుంబాలకి ఆ రోజు, ఫలానా కుటుంబాలకి ఫలానా రోజు నేను క్షవరం చేస్తాను అని అతను ఒక పద్ధతి పెట్టుకున్నాడు. రోజూ మొత్తం గ్రామానికి గడ్డం చేయలేడు కదా! కాబట్టి ఇంతమంది ప్రజలకి నేనీ రోజు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా వేరే రోజు వస్తే, ‘లేదు, ఈ రోజు నీ వంతు కాదు, నీకు గురువారం రోజు చేస్తాను’ అని చెప్తాడు. ఇలా అంతా అతనే ఖరారు చేసుకున్నాడు.’
‘ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? ‘ఈ రోజు మంగళవారం, ఈ రోజు గురువారం, నేను గడ్డం చేసుకోను, క్షవరం చేయించుకోను’ అంటారు. ఇవి వాళ్ళ ఇళ్ళ నియమాలు కావు. ఆ మంగళి తన వీలును బట్టి పెట్టుకున్న నియమాలివి, అలాగే నీకు ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడు. నువ్వు ఎక్కడికి పడితే అక్కడికిపోయి చేయించుకోలేవు. అలా శ్రావణమాసం మొత్తం ఒక నెలరోజుల పాటు అతను ఏ గ్రామానికీ వెళ్ళేవాడు కాదు, ఏ ఇంటికీ వెళ్ళేవాడు కాదు. అందరికీ తెలుసు, ఆ నెల రోజులు జుట్టు పెంచుకోవాల్సిందే అని. ఒక నెల తర్వాతే అందరికీ క్షవరాలు జరిగేవి. ఇప్పుడు కూడా మన వాళ్ళు శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించుకోరు కదా!’
‘నవరాత్రులు ఉన్నాయి, ఆ తొమ్మిది పది రోజుల పాటు పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, పండుగలున్నప్పుడు, అందులో అతనికి పండుగ లేదా? అతడు కూడా తన పండుగ చేసుకోవాలి కదా, తన ఆచారాల ప్రకారం పూజలు చేసుకోవాలి కదా! అతడు కూడా ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇక పనెప్పుడు చేస్తాడు? అందుకోసమే అటువంటి సమయాలలో పనిని నిషేధించారు.’
‘ఇక జ్యేష్ఠ మాసంలో చాకలి వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు కాదు. ఒక నెల రోజుల పాటు బట్టలు ఉతకడం బంద్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉండేవి, నీటి కొరత ఉండేది. అందుకని ఆ నెలంతా వాళ్ళు బట్టలుతికేవాళ్ళు కాదు. మొదటి వర్షం పడగానే, భూమికి పూజ చేసి ఆ తర్వాతే మళ్ళీ బట్టలు ఉతకడం ప్రారంభించేవాళ్ళు. కానీ ఆ నెల రోజులకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఒక నెలకీ ఇవ్వం అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.’
‘కాబట్టి ఈ విధంగా ఒక పద్ధతి ఉండేది. అలా ఏర్పరచుకున్న పద్ధతి ప్రకారం గ్రామంలో చేతివృత్తుల వాళ్ళకి పెద్ద పెద్ద ఖర్చులుండేవి కావు. అప్పటి వృత్తి పనివాళ్ళకి ముఖ్యంగా మూడు రకాల ఖర్చులు మిగిలేవి: మొదటిది, ప్యాకింగ్ ఖర్చు, రెండోది, రవాణా ఖర్చు, మూడోది అడ్వర్టైజింగు ఖర్చు. ఈ మూడూ ఖర్చులూ ఉండేవి కావు వాళ్ళకి. ప్రకటనల ఖర్చయితే అస్సలుండేది కాదు. పాకింగ్ చెయ్యాల్సిన పనిలేదు, రవాణా ఖర్చు లేదు. మహా అయితే పది కిలోమీటర్ల దూరం తలమీద పెట్టుకుని పోయి ఇచ్చేవాళ్ళు. ఆ సరుకులు ఇళ్ళకు చేరేయడానికి పెద్ద ట్రక్కు కావాలి, వాహనం కావాలనే అవసరం ఉండేది కాదు. ఈ మూడు ఖర్చులూ లేకపోవడం వల్లనే ప్రతి ఒక్క వస్తువూ ప్రజలకి చాలా సులభంగా, తక్కువ ధరకే లభించేది.’
‘ఈ రోజుల్లో అత్యధిక ఖర్చులు ఈ మూడింటివల్లనే కదా వస్తున్నాయి. రూపాయి వస్తువు కాస్తా పది రూపాయలకి అమ్ముడవుతోందంటే దానికి కారణం ఈ మూడు ఖర్చులే కదా. కానీ పూర్వం వాళ్ళకి ఈ మూడు ఖర్చులూ ఉండేవి కావు. ఎందుకని? ఎందుకంటే, గ్రామంలోనే ఆ సాంకేతికత ఉండేది. గ్రామంలోనే ఉత్పత్తి అయ్యేది, గ్రామంలోనే మార్కెట్ కూడా సాగేది. ఆ సరుకును వేరే ఎక్కడికో తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు కాబట్టి ఆ ఖర్చులన్నీ మిగిలిపోయేవి.’
గురూజీ మాటలు వింటూ ఉంటే నా ఆలోచనలు నేను చదువుకున్న అర్థశాస్త్రాన్ని గుర్తుచేస్తున్నాయి. యూరోపులో పారిశ్రామికీకరణ వల్ల తలెత్తిన వలసవాదం భారతీయ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చెయ్యకముందు, భారతీయ గ్రామాలు స్వయం-సమర్థవంతంగా ఉండేవనీ, అందుకనే అవి మహాసామ్రాజ్యాల ఉత్థాన పతనాల్ని కూడా పట్టించుకునేవి కావనీ మార్క్స్ రాసిన సంగతి గుర్తొచ్చింది. ఆయన దాన్ని Asiatic mode of production అని అన్నాడుగాని, అదెలాంటిదో, దాని స్వరూప స్వభావాలేమిటో తెలుసుకోలేకపోయాడు. ఆయన అధ్యయనం ప్రధానంగా బ్రిటిష్ లైబ్రరీలో ఉండే కలొనియల్ పత్రాల్ని బట్టీ, పదిహేడో శతాబ్ది యాత్రాకథనాల్ని బట్టీ ఆధారపడింది. వాటికి తోడు, జర్మన్ తత్త్వశాస్త్ర సంప్రదాయపు పాక్షికత కూడా ఆయనకు అడ్డుపడింది. ఒకవేళ గురూజీ లాగా భారతీయ గ్రామాల్ని అర్థం చేసుకున్న వ్యక్తులెవరేనా ఆయనకు తారసపడి ఉంటే, తమ అనుభవం మీద ఆధారపడ్డ ప్రత్యక్ష కథనాల్ని ఆయనకి చెప్పి ఉంటే, భారతీయ గ్రామాలు మరింత గతిశీలాలని మార్క్స్ గుర్తించగలిగి ఉండేవాడనుకుంటాను.
అవి మహా సామ్రాజ్యాల్ని పట్టించుకోకపోవడం కాదు వాటి గతినే అవి నిర్ణయిస్తూ ఉండేవి. భారతీయ గ్రామ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోకుండా, యూరోపియన్ నమూనా ప్రకారం ఇక్కడ సామ్యవాద విప్లవాన్ని నిర్మించాలని చేసే ప్రయత్నాలు అందుకనే సఫలీకృతం కాలేకపోయాయి. సరే, ఇవన్నీ నా ఆలోచనలు. మరెవరైనా జిజ్ఞాసువులు మరింత క్షుణ్ణంగా పరిశోధించి నిగ్గు తేల్చవలసిన విషయాలు. నేను నా ఆలోచనలనుండి బయటపడి మళ్ళా గురూజీ వైపు చెవొగ్గాను.
గురూజీ చెప్తున్నారు: ‘పూర్వం ఈ ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉండేదో చూద్దాం. దాన్ని ఎలా వశంలో వుంచుకునేవారో తెలుసుకుందాం. అప్పట్లో ఈ మూడు ఖర్చులూ ఉండేవి కావని చెప్పాను కదా. కాబట్టి ఆనాటి ప్రజలు తమ డిజైన్ల ద్వారా కూడా మార్కెట్ ని అదుపులో ఉంచుకున్నారు. ఎవరూ కూడా వేరొకరి మార్కెట్ ని ఆక్రమించుకోడానికి వీలుండేది కాదు. ఉదాహరణకి, నీళ్ళు నింపిపెట్టుకోడానికి ఉపయోగించే ఇత్తడి బిందె ఉంది కదా, ఆ బిందె ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేక శైలిలో ఉండేది. గుజరాతీ బిందె ఉంది. గుజరాత్ లో దాన్ని నీళ్ళు నింపడానికి వాడతారు. అలానే మహారాష్ట్రలోనూ ఉంది, ఇక్కడా ఉంది. ఒకవేళ ఆ గుజరాతీ బిందెని తీసుకొచ్చి, ఇక్కడి తెలంగాణా మహిళల నెత్తిమీద పెడితే అందంగా కనిపిస్తుందా? కనిపించదు కదా. అలాగే ఇక్కడి బిందెని తీసుకెళ్ళి గుజరాతీ మహిళల తలమీద పెడితే అది కూడా అందంగా కనిపించదు. ఒకవేళ ఎవరేనా వ్యాపారి దాన్ని అమ్ముకోడానికి ఇక్కడికీ తీసుకొచ్చినా ఇక్కడి ప్రజలు దాన్ని కొనరు.’
‘కాబట్టి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులేవైనా సరే, ఇక్కడి ప్రజల సొంత డిజైన్ల ప్రకారం మాత్రమే ఉండేవి. ఇక్కడి వృత్తిపనివాడు లేదా ఇక్కడి ప్రజలు ఏం చూసేవారంటే, ఇక్కడి మనిషి శరీర రూపురేఖలెలా ఉన్నాయి, వాళ్ళ జీవనవిధానమెలా ఉంది, దుస్తులెలా ఉన్నాయి, వాళ్ళ తల మీద ఏ వస్తువునుంచితే అందంగా ఉంటుంది లేదా చేత్తో ఎలాంటి వస్తువును పట్టుకుంటే అది అందంగా గమనిస్తుందిలాంటివన్నీ గమనించేవాళ్ళు.’
‘ఇక్కడ మనముందున్న ఈ పరిమిత ప్రాంతంలోనే చూసినా- మథుర సమాజపు మహిళలు నెత్తిమీద పెట్టుకునే బిందెలొకలాగా ఉంటాయి. గోండు మహిళల బిందెలొకలాగా ఉంటాయి. లంబాడా మహిళల బిందెలు మరోలా ఉంటాయి. అందరి బిందెలూ వేరువేరుగా ఉంటాయి. మథుర మహిళల తలపైన బిందెలు చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని తలమీద మొయ్యడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఒక చుట్టకుదురు లాంటిది తయారు చేసి, అది కూడా రెండు భాగాలుగా ఉంటుంది, దాన్ని తలమీద అమర్చి, ఆ చుట్ట కుదురు మీద నీళ్ళ కడవ పెట్టుకునేవారు. ఆ కుండ కూడా పూర్తిగా గోళాకారంగా ఉండేది కాదు. కొంచెం చదునుగా ఉండేది. కింది భాగం వెడల్పుగా వచ్చేది. దానివల్ల అది తలమీద చాలా సులభంగా, స్థిరంగా కూచునేది. మిగతావాళ్ళ కుండలన్నీ గుండ్రంగానే ఉంటాయి. ఇలా చాలా అద్భుతమైన రూపురేఖల్తో నిర్మించుకుంటూ వచ్చారు.’
‘ఒకరోజు మేం మాహోరు వెళ్తున్నాం. చూడటానికి చాలా అందంగా సాంప్రదాయిక లంబాడా దుస్తులు ధరించి ఒక మహిళ బయటకు వెళ్తోంది. ఆమె చేతిలో ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది. ఆ సాంప్రదాయిక దుస్తుల శైలికి అనుగుణంగా మరేదైనా వస్తువు ఆమె చేతుల్లో ఉండాలి. అది లేకుండా ఈ ప్లాస్టిక్ డబ్బా ఆ దుస్తుల్తో అస్సలు సెట్ కావడం లేదు. విషయమేమిటంటే, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బా రావడం వల్ల ఆమె తన పూర్తి సాంప్రదాయిక దుస్తుల శైలి మార్చుకోవలసి ఉంటుంది.’
‘ఆ కాలంలో ఉన్న వృత్తిపనివాళ్ళందరికీ, బస్తీలో ఉన్న పనివాళ్ళందరకీ తమదంటూ ఒక ఉమ్మడి మార్కెట్ ఉండేది. చాలా బలమైన మార్కెట్ వ్యవస్థని నిర్మించుకున్నారు వాళ్ళు. ఇన్ని ఇళ్ళు, ఇన్ని గ్రామాలు వాళ్ళకి చెందుతాయని ఉండేది. ఆ అమరికలోనే వాడు జీవించాల్సి ఉంటుంది. ఆ లెక్కన వానికి కావలసినవన్నీ దొరుకుతూ ఉండేవి. వాళ్ళ ద్వారా ఇళ్ళకు కావలసిన ప్రతి ఒక్క వస్తువూ సులభంగా ప్రతి ఒక్కరి దగ్గరికీ వచ్చేది. సంవత్సరం పొడుగునా ఇది సాగుతూనే ఉండేది. ఎలాగంటే, మట్టిపాత్రలు ఏడాది పొడుగునా మారుస్తూనే ఉంటారు. పప్పుగుత్తి, చల్ల చిలికే కవ్వం, రొట్టెలు చేసే పీట, రోకలి- వడ్రంగులు ప్రతి సంవత్సరం వీటిని మారుస్తూ ఉండేవాళ్ళు. సంవత్సరాల తరబడి ఒకే వస్తువు వాడాలనేది లేదు. ఆ వస్తువులకి కూడా నిర్దిష్టమైన ఋతువులుండేవి. ఇక్కడ ఉగాది సమయంలో కొత్త రోకలి వస్తుంది. పొలాల పండగ సమయంలో కొత్త పప్పుగుత్తులు వచ్చేవి. ఆ సమయానికి అనుగుణంగా వాళ్ళు ఆ వస్తువుల్ని తీసుకు వచ్చి ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంచేవాళ్ళు. అంతేకానీ ఒకేసారి అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు కాదు.’
‘బొంగరాలు ఆడుకునే సమయం వచ్చిందనుకోండి, అప్పుడు వడ్రంగుల భార్యలు చేటలోనో తట్టలోనో ఆ బొంగరాలు పెట్టుకుని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళవి తెచ్చినప్పుడు గృహస్థులు ఇక్కడ అరుగుమీద ఒక తట్టనో, గిన్నెనో పెట్టుకుని ఉండేవారు. వాళ్ళు తాము తెచ్చిన బొంగరాలు అందులో వేసేవాళ్ళు. ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నారో ఆ లెక్కన బొంగరాలిచ్చేవాళ్ళు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళకి ‘సీదా’ అంటే ధాన్యం వాటా ఇచ్చేవారు. సీదా అంటే తెలుసు కదా? ఒక చేటలో పప్పు, బియ్యం, పిండి, ఉప్పు, మిరపకాయలు—ఇవన్నీ ఉంచి ఇవ్వాలి, అదొక పూర్తి భోజనం అవుతుంది. గిల్లీ దండా ఆడుకునే సమయం వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళా ఖచ్చితంగా కర్రా, బిళ్ళలు తీసుకొచ్చి ఇంటింటికీ అందించేవాళ్ళు. ఆ తర్వాత దసరా సమయం వచ్చిందనుకోండి, కట్టెతో చేసిన కత్తులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు. దాని కోసం సీదా ఇవ్వాలి. శ్రావణ మాసం వచ్చిందనుకోండి, ఈ ‘మార్ గోల్లు’ అంటే,ఇంతకుముందు చెప్పాను కదా, వెదురుకర్రలకి అమర్చిన కాళ్ళమీద నడిచేవారు కదా, వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు.’
‘అలా వాళ్ళు తెచ్చేవి ఆ ఇంట్లో వాళ్ళు అవసరం అనుకోవాలి కదా?’అని ఒకరడిగారు. అటువంటి ప్రశ్నల కోసమే గురూజీ ఎదురు చూస్తుంటారు. తక్షణమే ఆయన తన సౌందర్యశాస్త్రం, తత్త్వశాస్త్రం వివరించడం మొదలుపెడతారు.
‘అవును. ఒకరు తయారు చేసిన వస్తువు మరొకరు ఎందుకు తీసుకుంటారు? నేనీ ప్రశ్న ఇంతకుముందు కూడా అడిగాను’ అన్నారు గురూజీ. దానికి ఆయనే జవాబు చెప్పడం మొదలుపెట్టారు. ‘అవసరం ఉంటే తీసుకుంటారు, మీరన్నట్టు. లేదా అది అందంగా కనిపిస్తే తీసుకుంటారు. అవసరం లేకుండా మనిషి ఏ వస్తువూ తీసుకోడు. కానీ సంగతేమిటంటే, మన పల్లెటూళ్ళల్లో చాలా రకాల కారీగర్లున్నారు. వాళ్ళల్లో నిజంగా చాలా అవసరమైన సామాను తయారు చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒక రకంగా చూస్తే కుంకుమ వల్ల ఏముంది అవసరం? బంగారం అవసరం ఏముంది? మనిషికి బట్టలు మాత్రం ఎంత కావాలి? చాలా చాలా తక్కువ. ఒక గొంగడికి మధ్యలో రంధ్రం చేసి, నడుముకి ఒక తాడు కట్టుకుంటే, మనిషి సగం జీవితం గడిపేయవచ్చు. అంతకన్నా మించిన దుస్తులెందుకు కావాలి?’
‘కానీ ప్రతి ఒక్కటీ కేవలం అవసరంతోనే నడవదు. అవసరాలు చాల తక్కువుంటాయి. కానీ ఒక కారీగర్ ఒక లెక్క కన్నా తక్కువ ఉత్పత్తి చేస్తే బతకలేడు కదా. అతను బతకాలంటే అతనికి చేతినిండా పనికావాలి. అంతకన్నా తక్కువ ఉత్పత్తి చేస్తే అతను జీవించలేడు. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి అతడు బతకడానికి చేతినిండా పని మనమెలా ఇవ్వగలం? అక్కడే సుందరత అవసరం మొదలవుతుంది. మనిషి ఏ జీవితం గడిపినా అది అందంగా, అందమైన రీతిలో గడపాలి. నిరాడంబరత అంటే దాని అర్థం అసహ్యంగా బతకడం కాదు. నిరాడంబరత అంటే అందంతో కూడుకున్నదనే అర్థం.’
‘స్వావలంబనలో కూడా రెండు రకాలున్నాయి. ఒకటి గాంధీజీ చెప్పిన పద్ధతి. కానీ గాంధీ అనుయాయులు అసలైన స్వావలంబన అంటే ఏమిటనే విషయంలో చాలా తర్కిస్తుంటారు. తమ పని తాము చేసుకోవడమే స్వావలంబన అని కొందరి భావన. ఒకసారి ఐఐటి చెందిన ఇద్దరు ముగ్గురు పిలగాళ్ళు కూచుని మూడు నాలుగురోజులు కష్టపడి ఒక లెక్క వేసారు. ఒక మనిషికి ఎంత బట్ట కావాలి? ఆ బట్టకోసం ఎంత నూలు కావాలి? ఆ నూలు ఎంత పత్తినుంచి వస్తుంది? దానికి ఎన్ని మొక్కలు కావాలి? అంటే ఒక మనిషి ఇన్ని పత్తిమొక్కలు నాటుకుంటే చాలని తేల్చారు. అలాగే దీపం వెలిగించడానికి ఎంత నూనె కావాలి? ఒక సంవత్సరానికి ఎంత కావాలి? దానికి ఎన్ని ఆముదం చెట్లు నాటవలసి ఉంటుంది? ఇలా అన్నింటికీ వాళ్ళొక హిసాబు వేసారు.’
‘ఆ పూర్తి లెక్క నాకు చూపిస్తూ ఒక మనిషి దగ్గర ఇంత భూమి ఉంటే చాలు, తన పనులు తనే చేసుకోవచ్చు అని చెప్పారు. సరే. నేనొక రోజు అడిగాను: ‘రామకృష్ణా, నీ కోసం అన్నీ నువ్వే పండించుకుంటున్నావు సరే, రాత్రికి రాత్రి ఏదైనా గేదె ఆ పొలంలో పడి మేసేస్తే అప్పుడేం చేస్తావు?’ అని. నీ పొలాన్నేదైనా జంతువొచ్చి తినేస్తే నీ గతేమిటి? వేరొకరు నీకు సహాయమెందుకు చేస్తారు? వాళ్ళు కూడా తమకోసం తామే తయారు చేసుకుంటున్నారు కదా. అంటే అప్పుడు నువ్వు ఏడాది పొడుగునా దిగంబరంగా, ఆకలితో కూచోవాల్సిందేనా?’ అనడిగాను. నా యీ ఒక్క ప్రశ్నతో వాళ్ళ మూడు నాలుగు రోజుల లెక్కమొత్తం గాలికి కొట్టుకుపోయింది.
‘దీన్నే అసామాజిక ఆత్మనిర్భరత అంటారు. ఈ మధ్య గుజరాత్ నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు రెండెకరాల భూమిలో తమకి కావలసినవన్నీ పండించుకుంటున్నారు. వస్త్రాలు కూడా వాళ్ళే నేసుకుంటున్నారు. పిల్లల్ని స్కూలుకి కూడా పంపడం లేదు. వాళ్ళకి రెండు విషయాలే నేర్పించారు-ఒకటి ఇంగ్లిషు, రెండోది, లెక్కలు.’
‘గురూజీ, ఈ హిందుస్తాన్ లో ఎవరికైనా ఇంగ్లిషు వస్తే చాలు, వాళ్ళకన్నీ వచ్చినట్టే అని వచ్చినాయన అన్నాడు. బస్, ఇంగ్లిషు మాట్లాడటం రావాలి, మిగతావాటికోసం లెక్కలు రావాలి. పిల్లలు తకిలీ పట్టుకుని నూలు వడికేవాళ్ళు. ఆ నూలుతోనే వస్త్రం నేసుకునేవాళ్ళు. ఆ రెండెకరాల్లో ఇరవై రకాల కూరగాయలు, ఇరవై రకాల పండ్లు పండించేవారు. ధాన్యం, పప్పులు, నూనె కోసం వేరుసెనగ అన్నీ పండించేవారు. కొన్ని చిన్న యంత్రాలు కూడా వాళ్ళు తయారుచేసుకున్నారు. చాలామంది ట్రైయినింగు కోసం వాళ్ళ దగ్గరకి వెళ్తుంటారు.’
నేనన్నాను: ‘ఇది బానే ఉంది. కాని దీన్ని స్వావలంబన అని ఎలా అంటాం? మన పనులు మనం చేసుకోవడం, మన బట్టలు మనం ఉతుక్కోవడం స్వావలంబనయే కావచ్చు, కానీ ఇది పూర్తిగా అసామాజిక స్వావలంబన. ఇంత అసామాజికంగా మనం బతగ్గలమా? అదెప్పటికీ సాధ్యం కాదు.’
‘మనం సామాజిక స్వావలంబన గురించి మాట్లాడాలి. మనమెప్పుడూ సామాజికంగా కలిసి బతికే వాళ్ళం. కాబట్టి ఆ సామాజిక స్వావలంబన ఎలా ఉండాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి. వ్యక్తి సంపన్నుడైతే ఊరు బీదదవుతుంది. కానీ ఒక ఊరు సమృద్ధి చెందితే ఆ ఊళ్ళో ఉండే అత్యంత బీద వ్యక్తి కూడా అభివృద్ధి చెందుతాడు. అందుకే మన దగ్గర ఊరు సమృద్ధికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యక్తిగత సంపదకి కాదు. ఊరు బాగుంటే అందులో ఉండే సామాన్య వ్యక్తి కూడా బాగుంటాడు. మన లక్ష్యం ఊరిని అభివృద్ధి చెయ్యడం కావాలి.’
‘వ్యక్తి ఎప్పటికీ సమృద్ధి చెందలేడు. వ్యక్తి కేవలం సంపన్నుడు మాత్రమే అవుతాడు. అతని సంపన్నత ఎందరినో బీదవారిని చేసి వస్తుంది. అంటే ఒక వ్యక్తి సంపన్నుడవడం మొదలుపెడితే అతను తన చుట్టూ ఉన్నవారందరినీ దరిద్రులుగా మారుస్తాడు. కానీ ఒక ఊరు సమృద్ధి చెందితే ఆ ఊళ్ళో బతికే అత్యంత సామాన్యవ్యక్తి కూడా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి సమృద్ధికీ, సంపన్నతకీ మధ్య ఉన్న తేడాని మీరు బాగా అర్థం చేసుకోండి.’
‘ఒకరోజు నేను ఆశ్రమం నుంచి బయటకి అడుగుపెట్టినప్పుడు, ఒకాయన సైకిలు మీదనుండి కిందపడిపోడం చూసాను. అప్పట్లో ఇక్కడేమీ ఉండేది కాదు. ఆయన పడిపోగానే పక్కనే కిరాయికి ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు వచ్చి అతణ్ణి పైకి లేపారు, దుమ్ము దులిపారు. కానీ అతనికి రక్తం విపరీతంగా కారుతోంది. ఆ రక్తం ఆగాలంటే ఏదైనా గుడ్డ కట్టాలి. కానీ ఎవరూ కట్టడానికి ప్రయత్నించడం లేదు. అదే సమయంలొ ఒక పశువుల కాపరి అటుగా వెళ్తున్నాడు. అతని భుజం మీద ఒక తువ్వాలుంది. అతను కూడా చూసి ఆగి, ‘అరె, రక్తం కారుతోంది, ఏదో ఒకటి కట్టాలి కదా’ అన్నాడు. ఆ విద్యార్థులు ‘ఏం కట్టాలి? ‘ అనడిగారు. ఆ పశువుల కాపరి మరేమీ ఆలోచించకుండా తన భుజం మీదనున్న తువ్వాలు చింపి తన దగ్గరున్న నీళ్ళల్లో తడిపి ఆ గాయానికి పట్టీ కట్టేసాడు. నేనక్కడ నిలబడి అదంతా చూస్తున్నాను. వీరిలో ఎవరు సంపన్నుడు, ఎవరు సమృద్ధ శాలి అని ఆలోచిస్తున్నాను. ఆ విద్యార్థులంతా మంచి పాంట్లు వేసుకున్నారు. అందరి దగ్గరా చేతిరుమాళ్ళున్నాయి. వాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఇంటినుంచి నెలనెలా వెయ్యీ, రెండు వేలదాకా వస్తూండచ్చు. కానీ ఆ పశువుల కాపరి నెలకి మూడువందల రూపాయల కూలీకి పశువులు కాస్తున్నాడు. అతని ఒంటిమీద సరైన బట్టలు కూడా లేవు. కానీ ఇక్కడ విషయమేమిటంటే, ఆ విద్యార్థుల దగ్గరుండే చేతిరుమాలు తీసి కడితే వాళ్ళింక పేదవాళ్ళైపోతారు, ఆ వస్తువింక వాళ్ళ దగ్గరుండదు. ఆ ఇచ్చే శక్తి ఎవరిదగ్గరుంటుందీ అంటే, ‘నేనొకటి ఇచ్చాక కూడా నా దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ‘ అని ఎవరికితెలుసో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ‘ఇచ్చేస్తే నా దగ్గరేమీ ఉండదు ‘ అని భయపడేవాడు ఎప్పటికీ ఇవ్వలేడు. ఆ పశువుల కాపరి దగ్గరున్నది ఒకటే తువాలు, కానీ అది ఎంత పెద్దదంటే, దాన్ని చింపి ఇచ్చాక కూడా అది అతని దగ్గర మిగిలింది. అందుకే అతను వెంటనే దాన్ని చింపి కట్టు కట్టగలిగాడు. వీరిద్దరి వేషభూషల్లో ఒకరిది సంపన్నత అయితే, మరొకరిది సమృద్ధి.’
‘సంపన్నత మనిషిని అమానవీయంగా మారుస్తుంది. సంపన్నులు మానవత్వం గురించి మాటలు చెప్తారు, కానీ ఆ పని చేయలేరు. ఎందుకంటే వారి వేషధారణ, వారి హోదా దానికి అనుమతించవు. కానీ ఆ పశువుల కాపరి మానవత్వం గురించి గొప్ప మాటలేమీ చెప్పలేదు, కానీ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఎందుకంటే అతని వేషధారణలో సమృద్ధి ఉంది. సమృద్ధికీ, సంపన్నతకు మధ్య తేడా ఇదే.’
ఈ ఉదాహరణ గురూజీ చెప్పగా ఇంతకు ముందు కూడా విన్నాను. కానీ మళ్ళా అప్రతిభుణ్ణై విన్నాను. ఆయన అంతకు ముందు ఈ ఉదాహరణ చెప్పినప్పుడు ఉపనిషత్తుల మాట కూడా గుర్తుచేసారు. ‘పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే’- పూర్ణ పదార్థం నుంచి పూర్ణ పదార్థాన్ని తీసేసిన తర్వాత కూడా పూర్ణపదార్థమే మిగుల్తుంది అనే మాటకి ఆ పశువుల కాపరి భుజం మీద తువ్వాలు తనకి నిజమైన భాష్యం చెప్పిందన్నారు.
10-6-2026


ఒక వ్యక్తి సంపన్నుడవడం మొదలు పెడితే అతని చుట్టూ ఉన్న వాలందరిని దరిద్రులుగా మారుస్తాడు. కానీ ఒక ఊరు సమృద్ధి చెందితే ఆ ఊళ్ళో బతికే అత్యంత సామాన్యవ్యక్తి కూడా అభివృద్ధి చెందుతాడు. ఇదే సమృద్ధికీ, సంపన్నతకీ మధ్య ఉన్న తేడా….
Thank you for sharing another informative conversation, Sir!
How a self-sufficient Indian village economy worked, how the rules were laid out, and how the communities protected their markets through social arrangements, customs and traditions.
Your thoughts on Marx’s observations about the Asiatic Mode of Production were also very interesting. Too bad there was no record of ground level research like the one Guruji has done for Marx to arrive at a complete understanding of how Indias villages functioned.
“సమృద్ధి” కి “సంపన్నత” కి గురూజీ చెప్పిన తేడా ఎంత నిజమైన మాట అనిపించింది.
ఆ పశువుల కాపరి example చాలా powerful గా ఉంది. బయటకు చూస్తే students సంపన్నులు, పశువుల కాపరి పేదవాడు. కానీ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎవరు వెంటనే ఇవ్వగలిగారు అన్నదే అసలు difference అని గురూజీ చెప్పిన విధానం చాలా thought provoking.
And the way you connected this to the Upanishads was beautiful.
‘“పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే” — పూర్ణ పదార్థం నుంచి పూర్ణ పదార్థాన్ని తీసేసిన తర్వాత కూడా పూర్ణమే మిగులుతుంది అనే భావానికి, ఆ పశువుల కాపరి భుజం మీద తువ్వాలు నిజమైన భాష్యం చెప్పిందన్నారు.’
🙏🏽