
మొదటిరోజు: నాలుగవ సంభాషణ (మొదటి భాగం)
సూత్రం ఒక్కటే, కొలతలు వేరు
అప్పటికి ఎండ తగ్గింది. ఇంకా చల్లబడలేదుగాని, గాలి వీచడం మొదలుపెట్టింది. మేము, మూజియం దగ్గరనుంచి, పొద్దున్న కూర్చున్న హాలు దగ్గరికి వచ్చాం.’ప్రార్థనా స్థల్ ‘ అంటారు దాన్ని. అప్పటికి అశిష్ కుమార్ గుప్తా కూడా వచ్చిచేరాడు. గుప్తా గురూజీ మానసపుత్రుడు. ఆయనది మధ్యప్రదేశ్ లో జబల్పూరు. ఆనంద్ లో రూరల్ మానేజిమెంటులో ఎంబీఏ చేశాక, కొన్నాళ్ళు ప్రభుత్వంలో పనిచేసాడు. 2015 లో జబల్పూరు దగ్గర ‘జీవికఆశ్రమం’ ప్రారంభించాడు. ఆ ఆశ్రమ నిర్మాణం, అక్కడి పద్ధతులు, వారు చేపట్టే కార్యకలాపం మొత్తం గురూజీ ఆలోచనలకి అనుగుణంగా నడుస్తుంటాయి. అప్పటికి, అంటే, 2010 లో ఈ సంభాషణలు నడుస్తున్నప్పటికి, అశీష్ ఇంకా ఒక దారి వెతుక్కుంటూ ఉన్నాడు. నాకు గుర్తున్నంతవరకూ ఆయన కూడా ఆ అయిదారు రోజులపాటూ మా సంభాషణల్లో పాలుపంచుకున్నాడు.
ప్రార్థనామందిరానికి వచ్చాక గురూజీ సంభాషణ కొనసాగించారు. మళ్ళా ఒకసారి తన తలపుల్లో వెనక్కి వెళ్ళారు. ‘హైదరాబాద్ చదువు పూర్తయింది. చదువు అయిపోయాక కొన్నాళ్ళు ఇదే ఆలోచన నడిచింది. అప్పుడందరూ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు వెళ్తున్నారు, కొందరు టీచర్లు అవుతున్నారు. కానీ నా మనసు అక్కడెక్కడా లేదు. అదిలాబాదు వచ్చేద్దామనుకున్నాను. కాని ఇక్కడికి వచ్చాక కూడా అదే చింత, ఏం చెయ్యాలి అని. అప్పట్లో ఇక్కడొక చిన్న స్కూలుండేది. కొన్నాళ్ళక్కడ పనిచేసాను. కాని ఆ స్కూలు నాకు నచ్చలేదు. అక్కడ పిల్లలకి మళ్ళాఅవే ఏబీసీడీలు నేర్పించడం- అది నా వల్ల కాదనిపించింది. వదిలేసాను. మళ్ళీ అఖాడా మొదలుపెట్టాను. అఖాడాకి చాలామంది పిల్లలు రావడం మొదలుపెట్టారు. అప్పట్లో అదిలాబాదులో చాలామంది కళాకారులుండేవారు.’
ఎవరెవరుండేవారప్పుడు అనడిగాను.
‘గోవిందు ఉండేవాడు. ఎల్లప్ప తాత ఉండేవాడు. రామ చందర్ ఉండేవారు, వీళ్ళందరితో కూచోడమే పనిగా నడిచేది. ఒకరోజు నాకనిపించింది, నేనే నా సొంత వర్క్ షాపు ఎందుకు మొదలుపెట్టకూడదని. దానికి స్థలం కావాలి. మనవాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి కూడా ఏమీ పాలుపోలేదు. అవును, స్థలం ఎక్కడ దొరుకుతుంది?’
‘అప్పట్లో అదిలాబాదులో చాలా ఖాళీ స్థలాలుండేవి. నేనో చోటు చూసాను. ఒక పాత బంగ్లా. అదెవరిదీ కాదు, ఊరికే ఖాళీగా పడి ఉండేది. నా సామాను అక్కడ పెట్టేసాను. మెల్లమెల్లగా పని మొదలుపెట్టాను. మట్టి తీసుకురావడం, విగ్రహాలు చెయ్యడం. ఒకరోజు కలెక్టరుగారు ఆ దారమ్మట వెళ్తూ అక్కడ ఆగి చూసారు. అసలిక్కడేం జరుగుతోందని. నేను ఆయనకి అంతా వివరించాను. మేం చేసే పని ఎలాంటిదో చెప్పాను. ఆయనకది చాలా బాగా నచ్చింది. ‘నీకేమైనా సాయం కావాలా?’ అనడిగారు. ‘నాకేమీ అక్కర్లేదు. నా పని నన్ను చేసుకోనిస్తే చాలన్నాను.’
‘అక్కణ్ణుంచి కొత్త జీవితం మొదలయ్యింది. ప్రజలు రావడం మొదలుపెట్టారు. అదిలాబాదు వాళ్ళకి కూడా వాళ్ళ కళాకారుడెవరో ఒకడు పని మొదలుపెట్టాడు అనుకున్నారు. ఆ సమయంలో నేను చాలా పనివరసలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇనుముతోనూ, ఇత్తడితోనూ పనిచెయ్యడం.’
‘శిల్పకళ విషయానికి వస్తే, మన దేశంలో శిల్పకళకు సంబంధించిన అసంఖ్యాకమైన గ్రంథాలు ఉండేవి. నేను తంజావూరు గురించి చెప్పాను కదా. అక్కడ 40,000 తాళపత్ర గ్రంథాలు పడి ఉన్నాయి. కానీ, ఎవరూ వాటిని చూడటం లేదు. అందులో శిల్ప శాస్త్రం ఉంది, చిత్రకళ ఉంది, సంగీతం ఉంది. ప్రతి విషయానికి ఒక శాస్త్రం ఉంది. మన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి. వీళ్లంతా కళాకారులు. వీళ్ళ దగ్గర తమదైన విద్య ఉండేది. ఆ విద్య పరంపరాగతంగా వస్తోంది. కానీ బ్రిటిష్ వాళ్లు ఏం చేశారు? వాళ్లు మన ఈ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు. వాళ్లు స్కూళ్ళూ, కాలేజీలూ పట్టుకొచ్చారు, అక్కడ కేవలం డిగ్రీలు మాత్రమే దొరుకుతాయి, విజ్ఞానం దొరకదు. నేను బరోడాలో ఉన్నప్పుడు చూశాను, వాళ్లు మట్టితో ఎలా ఆడుకుంటారో, కానీ, మన ఆదిలాబాద్ కుమ్మరి దగ్గర ఏదైతే ఉందో ఆ బరోడా మట్టిలో ఆ స్పర్శ లేదు. అక్కడంతా టెక్నికల్. ఇక్కడ సహజత్వం ఉంది. మట్టిని చూడగానే దానితో ఏం తయారవుతుందో మన కుమ్మరి చెప్పేస్తాడు. ఈ అనుభవం ఏ కాలేజీ లోనూ దొరకదు.’
‘నా మనసులో ఎప్పుడూ ఒక విషయం నడుస్తుండేది. మన సాంప్రదాయిక కళని మనమెలా కాపాడుకోగలమని. ఎందుకంటే హైదరాబాదులో అంతా ఆధునికంగా ఉండేది. కానీ అదిలాబాదులో అంతా మట్టితో ముడిపడి ఉండేది. ఇక్కడి గిరిజనులు, ఇక్కడి కారీగర్లు వీళ్ళు చేసే పనులు- ఇదంతా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఈ మధ్యలో బరోడా వెళ్ళాను. ఎం.ఎస్.యూనివర్సిటీలో చదువుకున్నాను. అదంతా మీకు చెప్పాను కదా. కాని అక్కడికి వెళ్ళి చూస్తే, అదంతా చాలా పెద్ద విషయంగానే అనిపించింది. శిల్పకళకి సంబంధించి అది చాలా పెద్ద చోటు. అక్కడ శిల్పశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసాను. అక్కడ చాలా విషయాలు చూసే అవకాశం దొరికింది. కానీ, మనసులోపలి ఆ అశాంతి మాత్రం తగ్గలేదు.’
‘మొత్తం మీద బరోడా వాతావరణం మీకెలా అనిపించింది?’ అనడిగాను.
‘బరోడా అంతా పెద్ద పెద్ద కళాకారులుండేవారు. కాని అక్కడ కూడా అదే సమస్య, వెస్టర్న్ ఇన్ ఫ్లుయెన్సు చాలా ఎక్కువగా ఉండేదనిపించింది. నేనుగనక అక్కడ ఉండిపోతే నా మూలాల్ని పూర్తిగా మర్చిపోతాననిపించింది. అందుకనే వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఉండకుండా అదిలాబాద్ తిరిగి వచ్చేసాను.’
‘బరోడా వదిలి వచ్చేసాక, జనం నన్నో మూర్ఖుడిగా జమకట్టారు. అంత పెద్ద యూనివర్సిటీ వదిలిపెట్టి వచ్చేసాడు చూడన్నారు. కాని నాకు తెలుసు నా కర్మక్షేత్రమేదో. నా నిజమైన పని ఎక్కడుందో. అందుకని ఇక్కడికొచ్చి మళ్ళీ అదే పని మొదలుపెట్టాను. అప్పటికి నా దగ్గరో విజన్ ఉంది. నేనేం చేయాలో నాకు పూర్తి అవగాహన ఉంది. ఒక ఆశ్రమం ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచన కూడా అప్పుడే వచ్చింది. ఎక్కడైతే కళాకారులు జమకూడగలరో, కలిసి కూచుని పనిచేసుకోగలరో అటువంటి ఒక చోటు. నెమ్మది నెమ్మదిగా అదంతా సమకూరింది. అదిలాబాదు గిరిజనుల్ని కలిసాను. వాళ్ళతో కలిసి పనిచేసాను. అదొక సుదీర్ఘ ప్రయాణం.’
అప్పటిదాకా గడిచిన తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, తనని నడిపించిన ప్రశ్నలు, తాను తిరిగిన దారుల గురించి పంచుకున్నాక, గురూజీ తన ఆలోచనలు పంచుకోవడం మొదలుపెట్టారు. వివిధ విషయాల గురించి తన ఆలోచనలు పంచుకోవాలని ఆయన అనుకోగానే ఎన్నెన్నో విషయాలు, ఎక్కడెక్కడి సంగతులూ ఆయన మనోద్వారం దగ్గర కిక్కిరిసిపోయాయి. వాటిని ఆయనతో ఏదో ఒక క్రమ పద్ధతిలో చెప్పించాలని గానీ, లేదా ఆయనేదన్నా చెప్తున్నప్పుడు, నేనేవో ప్రశ్నలు వేసి ఆ స్మృతి ధారను ఆపాలని గాని నాకనిపించలేదు. ఆ భావాలతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ కబీరు అన్నాడే ‘నువ్వు కాగితం చూసి మాట్లాడతావు, నేను కళ్ళతో చూసింది మాట్లాడతాను’ అని, అలా, ఆయన తన కళ్ళతో చూసిందీ, తన చెవులతో విన్నదీ, తనకై తాను ఎంతో మథనపడి సమన్వయించుకున్నదీ చెప్పడం మొదలుపెట్టారు. చూడండి:
‘నేను పరిశీలించినంత మేరకు మూల సూత్రం ఒక్కటే. ఉదాహరణకి ఈ మంచం చూడండి. దీని నిర్మాణ సూత్రం ఒకటే. కాని దాని కొలతలు వేరు. మనిషి ఎత్తును బట్టి కొలతలు మారతాయి. నాగర శిల్పం ఒక్కటే, కాని నాగర ప్రమాణాలు మారుతుంటాయి. మనుషుల ఎత్తుని బట్టి, పొడవువెడల్పుల్ని బట్టి మంచం కొలతలు మారినట్టే. కానీ సూత్రం మారదు. హిందుస్తాన్ లో ఎక్కడికి వెళ్ళినా రెండు ప్లస్ రెండు నాలుగే అయినట్టుగా, నాగర్ శైలి హిందుస్తాన్ అంతటా తయారయ్యింది. కూచునే పీటలు హిందుస్తాన్ అంతటా తయారయ్యాయి. కానీ వాటి పొడవు వెడల్పుల ప్రమాణాలు అక్కడి మనుషుల ఆకృతిని బట్టి ఉంటాయి. ఎక్కడ మనుషులు ఎత్తుగా ఉంటారో అక్కడ కొలతలు ఒకలా ఉంటాయి, ఎక్కడ మనుషులు పొట్టిగా ఉంటారో అక్కడ కొలతలు మరోలా ఉంటాయి.’
‘కానీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమంటే, ప్రజల మనోభావాలు తెలుసుకోవడమంటే, మన సొంత మానసిక ప్రవృత్తి ఎలా ఉందో తెలుసుకోవడం. ఇది విభిన్నమైన విషయమనుకోండి. మనం ఏ మేరకు చేయగలం, ఏ మేరకు చేయలేమో తెలుసుకోవడం. కాని సూత్రమైతే ఒక్కటే. నేనిప్పటిదాకా చూసినదాన్ని బట్టి అన్నిచోట్లా ఉన్నదొకటే సూత్రం. రంగులు ఇక్కడా తయారయ్యాయి. గుజరాత్ లోనూ తయారయ్యాయి. వాటిని తయారు చేసే పద్ధతి ఒక్కటే, కానీ మెటీరియల్ మారుతుంది. పద్ధతులు మారవు. సాంకేతికత వగైరా అన్నిచోట్లా దాదాపు ఒక్కలానే ఉంటుంది.’
‘భారతీయ ఆర్థిక వ్యవస్థ కూడా ఒకేలా ఉండేది. హిందుస్తాన్ ఇంత పెద్ద దేశం కదా, కానీ రాజకీయంగా ఎప్పుడూ కలిసి లేదు. చాలా మంది రాజులుండేవారు. వాళ్ళ జెండాలు వేరు. ప్రతి ఒకరికీ సొంతనాణేలుండేవి. అయినా సరే, ఆఫ్గనిస్తాన్ నుండి బర్మా దాకా దీన్ని భారత ఖండం అనే అనేవారు. ఎందుకంటే, ఈ మొత్తం భూభాగమంతా ఒకే రకమైన ఆర్థ వ్యవస్థ నడిచేది.’
‘తీర్థాలూ, తీర్థయాత్రలూ మనల్నందరినీ కట్టిఉంచేవి. రాజులు వేరు, రాజ్యాలు వేరు, కానీ తీర్థాలూ, తీర్థయాత్రలూ అందరికీ ఒక్కటే. ప్రతి మనిషీ ఇన్ని తీర్థయాత్రలు చేయాలి, ఇన్ని ధామాలు తిరగాలి అనే నియమం అందరికీ ఒకటే. అందరికీ అలా తిరిగే స్వేచ్ఛ ఉండేది. ఈ తీర్థాల బలంతోనే మనమందరం ఎక్కడో ఒకచోట ఒక్కటవుతూ వచ్చాం.’
‘కానీ, ఈ నదుల్ని కలుపుతాం అనే మాట వింటున్నప్పుడు నాకు చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు మన తీర్థాలన్నీ అంతమైపోతాయి. అసలు తీర్థమంటే ఏమిటి? సంగమం కాదు. సంగమం సంగమమే, కాని అది తీర్థం కాదు. ఏ క్షేత్రంలో నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందో ఆ క్షేత్రాన్నే తీర్థక్షేత్రమంటారు. అంతే. గంగానది కాశీలో ఉత్తరవాహిని. అందుకే అది తీర్థ క్షేత్రం. మిగిలిన చోట మరెక్కడా గంగానది ఉత్తరవాహిని కాదు. కాబట్టి మొత్తం గంగాతీరమంతా తీర్థక్షేత్రం కాదు. గోదావరి ఒడ్డు మొత్తం తీర్థక్షేత్రం కాదు.’
‘ప్రకృతి ప్రతి నదికీ ఒక స్వభావాన్నిచ్చింది. ప్రతి నదికీ ఒక గుణం ఉంటుంది. గంగ నీరు వేరు, గోదావరి నీరు వేరు. ఒకవేళ మీరు వీటిని కలిపేస్తే, ఆ నదిలో ఉండే ఒక విశేష శక్తి అంతమై పోతుంది. ఉదాహరణకు మన శరీరం ఉంది. మన శరీరంలో వేర్వేరు నాళాలు ఉన్నాయి. రక్తం ప్రవహించే నాళం వేరు, నీటి నాళం వేరు. ఒకవేళ మీరు అన్నిటినీ కలిపేస్తే ఏమవుతుంది? మనిషి చనిపోతాడు. అలాగే ఈ భూమి కూడా ఒక ప్రాణం. దీనికి కూడా తనవైన నాళాలు ఉన్నాయి, వాటినే మనం నదులు అంటాం. నదుల్ని కలిపేస్తే ఇదంతా ఖతమైపోతుంది కదా. గంగనీ, కావేరినీ కలిపితే తీర్థాలన్నీ అంతమైపోతాయి కదా. నదీ తీరాలకుండే మహత్వం పూర్తిగా కనుమరుగైపోతుంది. కాబట్టి నదుల్ని కలపడమంటే మన మొత్తం సంస్కృతి అంతమైపోడమనే మనం అర్థం చేసుకోవాలి.’
‘ఎందుకంటే మనం వేల ఏళ్ళుగా కలిసి ఉన్నామంటే, అది ఈ తీర్థాల వల్లనే. లేకపోతే ఇక్కణ్ణుంచి కాశీ దాకా పోడానికి ఎవరికి అవసరముంటుంది? ఎవరు తపిస్తారు? లేదా కాశీనుంచి రామేశ్వరం దాకా ఎవరైనా ఎందుకొస్తారు? ఇప్పుడు రామేశ్వరం వెళ్ళేవాళ్ళు కాశీ వెళ్ళేటప్పుడు సముద్రం నుంచి ఇసుక తీసుకుని వెళ్తారు. కాశీనుంచి తిరిగి వచ్చేటప్పుడు గంగాజలం తీసుకొచ్చి రామేశ్వరంలో అభిషేకం చెయ్యాలి. రామేశ్వరం వెళ్ళినవాడు కాశీ వెళ్ళి తీరాల్సిందే. దేశాలు, రాజ్యాలూ వేరువేరుగా ఉండేవి, కానీ మనం తీర్థాల బలంతోనే ఒకటిగా ఉన్నాం, ఈ తీర్థాల వల్లనే అన్నిచోట్లా ఒకే రకమైన ఆర్థిక వ్యవస్థ ఉండేది.’
‘అప్పుడప్పుడనిపిస్తుంది. ఈ నదుల అనుసంధానం అనే నినాదం వల్ల, అరే, ఇక్కడున్నదంతా తుడిచిపెట్టుకు పోతుందే అని. ప్రజలు ఒకచోటినుంచి మరో చోటుకి వెళ్ళడానికి ఇష్టపడరు. దేనికోసం వెళ్తారు? వెళ్ళరు. ప్రకృతికి తనదైన ఒక పద్ధతి ఉంటుంది. అది జరిగినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నదుల్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల హిందుస్తాన్ ‘సస్యశ్యామలం’ అయిపోతుందట. ‘సస్యశ్యామలం’ ఎలా అవుతుంది?’
‘నేను ఒకసారి ఖరగ్ పూర్ వెళుతున్నప్పుడు ఈ తెలంగాణా ప్రాంతంలో ప్రయాణించాను. ఇదంతా ఎండిపోయి, దుర్భిక్షంగా కనిపించింది. ఇక్కణ్ణుంచి ఆంధ్రాలోకి వెళ్ళగానే అదంతా పచ్చపచ్చగా, వరిచేలతో నిండుగా కనిపించింది. అక్కడినుంచి ఒరిస్సాలోకి ప్రవేశించగానే జానెడు భూమి కూడా ఖాళీగా కనిపించలేదు. ఎటువైపు చూసినా పచ్చనిపొలాలే కనిపిస్తుంటాయి. అక్కణ్ణుంచి బెంగాలుకి వెళ్ళాక- బంకించంద్రుడు ‘సస్యశ్యామల దేశం’ అని ఎందుకు రాసారంటే, అక్కడ పుట్టారు కాబట్టి రాసారు, ఇక్కడ పుట్టి ఉంటే, సస్యశ్యామల దేశం అని ఎప్పటికీ రాసి ఉండేవారు కారు.’
‘కానీ ఒక తమాషా ఏమిటంటే, ఎక్కడ ఇంత పచ్చదనం ఉందో, ఎక్కడ పంటలు పుష్కళంగా ఉన్నాయో, అక్కడే ఆకలి చావులున్నాయి. ఈ ఎండిపోయిన ప్రాంతం ఉందే- ఇక్కడెవరూ ఆకలితో చావడం లేదు. ఒడిశాలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. హిందుస్తాన్ లో అత్యధికభాగం ఊషరక్షేత్రం ఉన్నది రాజస్తాన్ లో. కాని అక్కడ ఒక్కడైనా ఆకలిచావుతో చనిపోయినట్లు మనం వింటామా? అక్కడ ఒక్క రైతేనా ఆత్మహత్య చేసుకున్నట్టు వింటామా? ఎక్కడైతే ‘సస్యశ్యామలం’ గా ఉందో అక్కడి రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడే ప్రజలు ఆకలితో చస్తున్నారు. ఇది వ్యవస్థా దోషం.’
‘ఇక్కడ చూడండి. ఎంత దూరంచూసినా పొలాలు కనిపించవు. కేవలం కొండలు మాత్రమే కనిపిస్తాయి, అలాంటి కొండల వాలుమీద ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. అక్కడేం పండుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఎవరూ ఆకలితో చచ్చిపోవడం లేదుకదా. మా ఇంట్లో తినడానికి తిండిలేదని ఎవరూ హాహాకారాలు చెయ్యడం లేదు కదా. ఎవరూ ఎప్పుడూ అలా చెప్పరు. చెప్పుకోరు. ఇప్పుడైతే ఏదో ఒక కారణం వల్ల అలా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇది వ్యవస్థాదోషం. నీటి వ్యవస్థకు సంబంధించిన పెద్ద గడబిడ. నేను దీని గురించి మళ్ళా వివరంగా చెప్తాను. మన దగ్గర ఎలాంటి నీటివ్యవస్థలుండేవో, నదుల్ని ఎలా నిర్వహించుకునేవారో. ఇవన్నీ మనకి పైపైన మాత్రమే తెలుస్తుంటాయి. కొన్ని విషయాలు పురాణాలు గట్రా చదివితే కూడా తెలుస్తాయి. మత్స్యపురాణంలో హిందుస్తాన్ లో ప్రతి ఒక్క నదీ, చిన్నదీ పెద్దదీ కూడా ఎక్కడ ఉత్తర వాహిని అవుతుందో రాసి ఉంది. అంత పెద్ద సర్వే ఎవరు చేసారో మనకి తెలియదు.’
‘ఇలాంటి విషయాలన్నీ నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఉదాహరణకి జాలం సింగ్, అలానే ఎల్లప్ప తాత. ఆయన తొంభై ఏళ్ళ వయసులో ఉన్న వృద్ధుల దగ్గరికి పోయి అడిగి తెలుసుకునేవారు. అలా కనీసం నూట యాభై ఏళ్ళ కిందటి సంగతులైనా సరే మనకి తెలిసేవి. ఇక్కడ ఒక గోండు వృద్ధురాలుండేది. ఆమెకి 1857 నాటి విప్లవం గుర్తుంది. ఆమె చాలా కాలం బతికింది. ఆమె దగ్గర కూచుంటే ఎన్నో విషయాలు చెప్పేది. నాకో పెద్దాయన పరిచయమయ్యారు. ఆయన పేరు మహాత్మా తహేద్. ఆయన వయస్సు 113 సంవత్సరాలు, ఒక చిన్న గ్రామంలో కలిసారు. ఆ వయస్సులో ఆయన కూచుని జొన్న రొట్టె తింటున్నారు. అవును. జొన్న రొట్టెనే. నేనాయన్ని వ్యాధుల గురించి అడిగాను. ‘మీరు మీ జీవితంలో ఎలాంటి వ్యాధులు చూసారు?’ అని. ఆయన ఖాందేశ్ వాడు. ప్లేగు ఎప్పుడొచ్చింది, ఏం జరిగిందనేది ప్రజలకు గుర్తుంటుందికదా, లేదా ఎలకల ద్వారా వచ్చే వ్యాధి ఎప్పుడొచ్చింది- ఇలాంటివి పాత తరం వృద్ధులకి తెలుస్తాయి, కొత్త తరానికి తెలియవు కదా. అందుకని, ‘మీరు 113 సంవత్సరాల వయసులో ఉన్నారు కదా, ఆ కాలం నాటి వ్యాధుల గురించి చెప్పండి’ అనడిగాను. ‘ఆ రోజుల్లో ఖాందేశ్ లో కరువొచ్చింది. కాని ఆ కరువులో చిత్రమైన విషయమేమిటంటే, గాజరు దుంపలు విపరీతంగా పండాయి. ప్రజలు కారెట్లు మాత్రమే తిని బతికారు. అప్పుడొక వింత వ్యాధి వచ్చింది. మనిషి అలా మెడ పక్కకు తిప్పేవాడు, చనిపోయేవాడు. అది ఏ వ్యాధినో తెలియదు’ అని చెప్పాడు. ఆయనొక లంబాడా. మహాత్ముడని చెప్పవచ్చు.’
‘ఇక్కడ మఠంలో ఒక మహంతు ఉండేవాడు. ఆయన ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, చాలా మితభాషి. కానీ ఒక్కోసారి నాతో చాలా విషయాలు మాట్లాడేవాడు. ఆయన్నొకసారి ‘సమాధి స్థితి ఎలా ఉంటుంది?’ అనడిగాను. ‘సమాధి గురించి నేనంతగా చెప్పలేను, కొంత చెప్పగలను’ అని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఆ సమయంలో శ్వాస రాయిలాగా అయిపోతుందట. కళ్ళు కూడా రాతిలాగా నిశ్చలంగా అయిపోతాయట. అప్పుడు నాతో పాటు నిశికాంత్ కూడా ఉన్నాడు. నిశికాంత్ నేనూ ఇద్దరం కలిసి చాలా తిరిగాం. మహంతుతో మాట్లాడుతున్నప్పుడు అతడు కూడా ఉన్నాడు.’
‘ఆ మహంతుకి ఆయుర్వేదం పైన ఎంత అద్భుతమైన జ్ఞానముండేదంటే, ఎవరైనా రోగి ఆయన దగ్గరకు రాలేకపోతే, ఆ రోగి ధరించిన వస్త్రాన్ని తెప్పించుకునేవారు. ఆ వస్త్రం వాసన చూసి మందులిచ్చేవారు. అంటే చెమట వాసన ద్వారా ఆయన ఆ రోగాన్ని గుర్తించేవారు. దానికి తగిన మందులిచ్చేవారు. ఆయనే బ్రహ్మానంద మహరాజ్. గొప్ప జ్ఞాని. ఆ రోజుల్లోనే ఎమ్మే చేసారు. ఇంగ్లిషు చాలా చక్కగా మాట్లాడేవారు. సంస్కృత పండితులు. ఆయుర్వేదంలో దిట్ట. యోగాలో సిద్ధహస్తుడు. మాస్టర్ మైండ్. ఆయన నర్మదా ప్రదక్షిణ చేసారు. నర్మదా ప్రదక్షిణ చేయడానికి 3 సంవత్సరాల, 3 నెలల, 13 రోజులు పడుతుందిట-అది కూడా నిరంతరం నడుస్తూ ఉంటేనే. ఆ అనుభవాల గురించి చెప్తూ ఆయన ‘ఆ ప్రదక్షిణనుంచి తిరిగివస్తూండగా, తాడోబా అడవిలో ఒక గుహ చూసాను. అందులోకి తొంగి చూస్తూండగా, ఆ లోపల ఇరుక్కుపోయాను. బయటికి రాలేకపోయాను’ అని చెప్పారు. బయటికి రాడానికి చాలా ప్రయత్నం చేసారటగానీ రాలేకపోయారు. దాంతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ధ్యానంలో ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత తనంతట తనే సమాధి స్థితి నుంచి బయటికి వచ్చారు. ఒకరోజు ఫారెస్టు డిపార్ట్ మెంటు వాళ్ళు అటుగా వచ్చారు. వాళ్ళు గుహలోకి టార్చిలైటు వేసి చూసారు. ఈయన లోపలినుండి ‘నన్ను బయటికి లాగండి’ అని గట్టిగా అరిచారు. వాళ్ళు భయపడి పారిపోయారు, లోపల ఏముందో తెలియక. మరాఠాల దగ్గర పెద్ద పెద్ద పగిడీలు ఉంటాయి కదా, అలాంటి రెండుమూడు తలపాగాలు తాడులాగా పేని దాని ఒక కొస ఒక చెట్టుకి కట్టి, మరో కొస లోపలకి విసిరి దూరంగా పారిపోయారు. ఈయన ఆ తలపాగాల తాడుపట్టుకుని బయటికొచ్చారు. బయటికి రాగానే ‘ఈ రోజు ఏ వారం, ఏమి తేదీ, ఏమి తిథి?’ అనడిగారు. వాళ్ళు చెప్పగానే ‘ఓహో, తొమ్మిది నెలలు గడిచిపోయాయా?’ అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా మేమాయన్ని చాలా సార్లడిగాం: తొమ్మిదినెలలపాటు ఏమీ తినకుండా, తాగకుండా లోపలెలా ఉండగలిగారు? అని. దానికి ఆయన యోగాలోని ఎన్నో క్రియల గురించి చెప్పారు. అలా తాగకుండా, తినకుండా ఎలా ఉండవచ్చో అదంతా. ఇలాంటి వ్యక్తులెంతోమంది ఉండేవారు. వారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. వృద్ధుల దగ్గర కూచుని వాళ్ళనడుగుతుంటే ఇలాంటి విషయాలెన్నో చెప్పేవారు.’
‘ఆ రోజుల్లో నిశి కాంత్ చాలా మంచి పెయింటింగ్స్ కూడా వేసేవాడు. నాతో పాటు చాలా తిరిగాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూనేవున్నాం. అతణ్ణి మొదటిసారి 74 లో కలిసాను. అలానే లక్ష్మన్న అని మరొకాయన ఉండేవాడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు. వాళ్ళు సమాజం కోసం ఏదో ఒకటి చేస్తూండేవారు. ఈ సామాజిక వ్యవస్థలపై వాళ్ళకి చాలా అవగాహన ఉండేది. ఆయన గ్రామదేవతల్ని తయారు చేసేవారు. గ్రామదేవతల గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. ఇళ్ళు కట్టే వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. వాళ్ళకి ఇళ్ళ గురించి తెలుసు. వాస్తు గురించి పూర్తి జ్ఞానం ఉండేది. వాస్తు గురించి చాలా మంచి అవగాహన ఉన్న ఒక మౌల్వీ సాబ్ మా ఇంటి పక్కనే ఉండేవారు. ముగ్గురన్నదమ్ములు. ముగ్గురూ టీచర్లే. ఈయన వాస్తులో చాలా నిపుణుడు. మండేపల్లి లో ఒకాయన ఉండేవాడు. పేరు గుర్తురావడం లేదు. మండేపల్లి రాజయ్య అయి ఉండొచ్చు. నేనాయన్ను కలిసినప్పుడు ఇళ్ళ గురించి, వాస్తు గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇంటిని మానవశరీర రూపంలో వర్ణించారు. శరీరాన్ని ఇంటితో ఎలా పోల్చవచ్చో చెప్పారు. ఎన్ని పక్కటెముకలున్నాయి, ఎన్ని ద్వారాలుండాలి- ఈ లెక్కన ఇంటి గురించి చెప్పారు. దీన్నే వాస్తు అంటారని చెప్పారు. మన వంట్లో ఎన్ని ఎముకలు ఉంటాయో అంతటి లెక్కతోనే ఇంటికి కలప వాడాలి అనేది ఆయన సిద్ధాంతం. మాకు బెనారస్ లో ఒకాయన కలిసారు. ఆయన వాస్తుకీ, పశుపక్ష్యాదులకీ ఉన్న సంబంధమేమిటో చెప్పారు. ఒక పాము ఇంట్లోకి వస్తే అదెలా బయటకు వెళ్ళాలో లేదా ఒక ఆవు ఇంట్లోకి రాగానే మొదట ఏ వైపు తిరుగుతుందో, అక్కడ గోశాల ఎందుకు పెట్టాలో- ఇలాంటివన్నీ అలాంటి వాళ్ళ ద్వారానే తెలిసాయి.’
‘ఇటువంటి మరొక పెద్దాయన చెప్పిందేమంటే ‘పూర్వం, వందేళ్ళు కాగానే, గ్రామాన్ని తగలబెట్టేసేవారు. అప్పుడు మళ్ళా ఒక కొత్త గ్రామం నిర్మించుకునేవారు’ అని చెప్పారు. ఇటువంటి సమాచారం హిందుస్తాన్ లో వేరే చోట్ల కూడా కనిపిస్తుంది. శుక్రనీతి ప్రకారం హిందుస్తాన్ ని పద్ధెనిమిది భాగాలు చేసారు. అంగ, వంగ, కళింగ, ద్రవిడ, పాంచాల, గీంచాల- ఇవి భౌగోళిక స్థితుల పేర్లు, ఇది విదర్భ. ఇది దీని భౌగోళిక స్థితి. కళింగకు తనదైన భౌగోళిక స్థితి ఉంది. ఇదంతా శాస్త్రాల ద్వారా తెలిసింది-ఇది భౌగోళిక స్థితి, ఇందులో ఈ ఆహారం పండుతుంది, దీనిని తినే ప్రజల శరీర నిర్మాణం ఇలా ఉంటుంది, వీరు ఈ రకమైన మనస్తత్వం కలిగిన ప్రజలై ఉంటారు, కాబట్టి వీరి మధ్య ఇలాంటి వ్యవస్థ ఉండాలి అని వారి మధ్య ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులోనూ మళ్లీ-ఆహారం, భాష, వేషం, భూషణం మరియు భవనం- ఈ ఐదింటి ఆధారంగా మళ్లీ వేర్వేరు భాగాలుగా విభజించారు.’
‘ఇది మొత్తం తెలంగాణనే. కానీ తెలంగాణలో చాలా భాగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి భాష వేరు, ఆహారం వేరు, వేషం వేరు, భవన నిర్మాణం వేరు. ఈ ఆధారంగా మొత్తం హిందుస్థాన్‌లో దాదాపు 108 భాగాలు ఉన్నాయి. ఆయా భాగాలలో వారి వారి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీరు ఇతరులతో కలిస్తే చాలా గందరగోళం ఏర్పడుతుంది, వీరిలో వీరే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అని. వారి స్వంత నిర్వహణ, వారి స్వంత పద్ధతులు ఉంటే చాలా మంచిది. కానీ ఇప్పుడు జరిగేదేమంటే, బీహార్ నుండి ఒక కలెక్టర్ ఇక్కడికి వస్తాడు. ఆయనకు ఈ ప్రాంతం గురించి ఏమీ తెలియదు-ఏం పండుగలున్నాయి, ప్రజలు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏమీ తెలియదు! ఆయన ఏదో ఒకరోజు ఏదో ఒక మీటింగ్ పెట్టేస్తాడు. ఆయనకు దానితో ఏమీ సంబంధం లేదు, ఆయనకు అక్కడి విషయాలన్నీ తెలుసు కానీ ఇక్కడి విషయాలు తెలియవు కదా? ఇప్పుడు ఇక్కడి వాణ్ణి తీసుకెళ్లి ఎక్కడో కలెక్టర్‌ను చేస్తారు. ఎక్కడైతే పుట్టాడో, అక్కడ అతడిని కలెక్టర్‌ను చేయరనుకుంటా! ఆయన వేరే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీరు అక్కడి విషయాల గురించి ఏమీ తెలియకపోయినా తమ పద్ధతులను నడిపిస్తూ ఉంటారు, ప్రజల పద్ధతులు నడుస్తూ ఉంటాయి. మనస్తత్వం గురించి తెలియదు, స్వభావం గురించి తెలియదు, ఇదంతా జరుగుతున్నదే కదా!’
‘ఆయా ప్రాంతాల స్వభావాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో శతృత్వం లేదు అని చెప్పాను కదా, కానీ తెలంగాణాలోనే మరో ప్రాంతముంది. అక్కడ పగ చాలా ఎక్కువ. ఇవి వేర్వేరు ప్రాంతాల స్వభావాలు. అదే రాయలసీమ వైపు వెళ్తే, అక్కడ పౌరుషం చాలా ఎక్కువ. దుర్మార్గులు కాదు కానీ పౌరుషం చాలా ఎక్కువ, ఏం చేస్తాం? ఆ ప్రకారంగా వారిదంతా సాగుతూ ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా భరించలేరు. ప్రతి ప్రాంతానికి తనదైన స్వభావం, తనదైన పద్ధతి ఉంటుంది, ఇది మనకు కనిపిస్తుంటుంది.’
‘విశ్వగుణాదర్శ చంపు’ అనే ఒక పుస్తకం ఉంది. కృష్ణదేవరాయల కాలంలో ఉన్న తిమ్మరసు మనవడు రాసిన పుస్తకం అది. ఏ పుస్తకం అది ! ‘విశ్వగుణాదర్శ చంపు’. అదెప్పుడైనా చదవండి, దాదాపు 400-500 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అది. ఎంత పెద్ద సర్వే చేశారో తెలియదు! అందులో ఏముంటుందంటే, ఇద్దరు స్నేహితులు విమానంలో ప్రయాణిస్తూ ఉంటారు- ‘పదండి భూమండలం చూద్దాం’ అని. అప్పుడు ఒక స్నేహితుడు రెండో స్నేహితుణ్ణి అడుగుతాడు-‘ఇప్పుడు మనమెక్కడున్నాం?’ అని. దానికి ఆయన-‘ఇప్పుడు మనం విదర్భ దేశంలో ఉన్నాం’ అని చెప్తాడు. ‘అవునా! విదర్భ దేశంలో ఉన్నామా? ఇది స్వర్గం లాంటి భూమి కదా, ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి’ అని. రెండో వాడు అంటాడు-‘నువ్వు ఏ త్రేతాయుగం ముచ్చట మాట్లాడుతున్నావు? ఇది కలియుగం! ఇక్కడ ఇప్పుడు ఏమీ లేదు, అంతా ఎండిపోయింది, గడ్డి కూడా మొలవడం లేదు, అందుకే దీనిని విదర్భ (దర్భలు లేనిది) అన్నారు’ అంటాడు. అంటే ఒక స్నేహితుడికి తప్పులు వెతకడం అలవాటు, మరో స్నేహితుడికి గుణాలు చూడటం అలవాటు. అలా ఆ ప్రాంతంలోని లోపాలు, గుణాలు ఏమిటో చాలా చక్కగా రాశారు.
‘ప్రతి ఒక్క ప్రాంతం గురించి ఆయన రాశారు. విదర్భ గురించి చాలా బాగా రాశారు-‘ఇక్కడి బ్రాహ్మణుడు తినడానికి ముందే స్నానం చేస్తాడు’. అది ఇప్పటికీ ఉంది-భోజనం తయారవ్వగానే స్నానం చేస్తారు విదర్భలో. ఇక్కడి గురించి రాశారు-‘గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రజలు ఎలా ఉంటారు?’ అని. అప్పట్లో రాష్ట్రాలు లేవు కదా, నదుల ఆధారంగానే ఉండేది-‘గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రజలు’ అని- ఆయన చాలా విచిత్రంగా రాశారు-‘ఇక్కడి వాడు ఒక రూపాయి దానం చేసి, పది దిక్కులా తన కీర్తిని కోరుకుంటాడు’. ఆ గుణం ఇప్పటికీ ఇక్కడ ఉంది కదా! ఎక్కడపడితే అక్కడ తన పేరు రాయించుకుంటాడు- ‘నేనిది దానం చేశాను, అది దానం చేశాను’ అని. ఆయన ఎంతగా తిరిగారో, లోపాలు-గుణాలు ఎలా తెలుసుకున్నారో-ప్రతి ఒక్క ప్రాంతానివి!”
‘ఇప్పుడెక్కడున్నాం? ‘వెంకటాద్రి పర్వతంపై ఉన్నాం’. ‘ఓహో! ఇది డబ్బులు వసూలు చేసే దేవుడి స్థలం కదా, ఇక్కడ చాలా డబ్బు వసూలవుతుంది’ అని ఒకడు లోపాలు చెప్తుంటే, రెండో వాడు దాని గుణాలను చెప్తాడు. చాలా అద్భుతమైన పుస్తకం, ఎప్పుడైనా చదవండి. శాస్త్రీజీ ఔరంగాబాద్ నుండి వచ్చినప్పుడు వారి పుస్తకాలు ఇక్కడే ఉండిపోయాయి, నేనలా చూశాను. సంస్కృతంలో ఉందిది. ‘విశ్వగుణాదర్శ చంపు’, వెంకటేశ్వర దీక్షితులు రాశారు. తిమ్మరసు మనవడు.’
‘నా ఎనిమిదో ఏటనే మా అమ్మ చనిపోయింది. మా తాయి, అంటే, మా పెద్దమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆమెకు సంతానం లేదు, దాంతో ఆమె మమ్మల్ని పెంచింది. మా అమ్మ చనిపోయేటప్పటికి మేము చాలా చిన్నపిల్లలం. కాబట్టి మా పెద్దమ్మ దగ్గరే పెరిగాం. మా తాయి చాలా కథలు చెప్పేది, ఆమెకు చాలా కథలు వచ్చు. రూపబసంత కథ అని, ఎన్నెన్నో కథలు, పంజాబ్ ప్రాంతానికి చెందిన కథలు చెప్పేదామె. కానీ మా చాచీకి అంటే మా పిన్నికి ఒక అలవాటుండేది-నేను అఖాడా నడిపేవాడిని, వ్యాయామం చేసేవాడిని. ‘నువ్వు వ్యాయామశాల నడిపేవాడివి, రాతిపని చేసేవాడివి, నువ్విది తినాలి, అది తినాలి’ అని బాగా చూసుకునేది. ఆమె ఆవు పాలు పితికేటప్పుడే, అక్కడికక్కడే ఒక గ్లాసు పాలు నాకు తాగించేసేది-‘తాగేయ్ పాలు, పచ్చి పాలు, ఆవు పాలు’ అని. వాళ్లు మజ్జిగ చేసేటప్పుడు, వెన్న కొద్దిగా పైకి రాగానే ఒక గ్లాసు వెన్నతో కూడిన మజ్జిగ నాకు తాగించేది. వారికి ఒక విచిత్రమైన అవగాహన ఉండేది-ఎవరు ఏ పని చేస్తున్నారు, వారికి ఏం అవసరం అనేది ఆమెకు తెలుసు. ఈరోజుల్లో ఏ తల్లికీ ఈ అవగాహన లేదు, పిల్లల గురించి అస్సలు పట్టించుకోరు.’
‘ఆమెకు ఒకసారి ఎందుకో అనిపించింది-నాకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ అని. దాంతో ఆమె చారుమగజ్, గోధుమలు నానబెట్టి, గోధుమలను దంచి దాని పాలు తీసి, ఆ చారుమగజ్, ఇంకా ఏమేమో కలిపి, ఏదో వండి చాలా రోజుల పాటు నాకు తినిపించేది. చాలా రుచిగా ఉండేది, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్తూ ఉంటాను-అలాంటిది ఏదైనా చేయండి అని! నన్నెవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు, నన్నెవరూ ఎప్పుడూ వారించలేదు. ఎందుకు ఆపలేదో తెలియదు కానీ, నన్ను ఎవరూ ఆపలేదు. నాతో పాటు పని చేసే పిల్లలున్నారు కదా, వారి కుటుంబాలు వారిని చాలా వారించేవి. సతీష్ కుటుంబం చాలా వారించేది, నిశి కాంత్ కుటుంబం చాలా వారించేది. ‘ఇలాంటి పనులు చేయకూడదు’ అని. కానీ ఇంట్లో వాళ్లు అలా వారిస్తారనే ఊహ కూడా నాకు లేదు. ఒక్కోసారి వారి తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చి నన్ను తిట్టి పొయ్యేవారు కూడా!’
‘పెళ్లి గురించి అయితే నాకు అస్సలు ఆలోచనే లేదు-నాకు కూడా పెళ్లవుతుందని, లేదా సంసారం పెడతానని, అలాంటిదేమీ బుర్రలో లేదు. బరోడాలో చదువుకునేటప్పుడు, ధ్రువ్ మిస్త్రీ అనే ఒక స్నేహితుడుండేవాడు, ఆనంద్ పక్క వాళ్ల గ్రామం ఉండేది- చిన్న గ్రామం. అక్కడికి వెళ్లాం. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు, ఈయన ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడేమో, కళ్లు తిరుగుతున్నాయని వెళ్ళి పడుకున్నాడు. వాళ్ల నాన్నగారు వడ్రంగి పని చేసేవారు, సుతార్ పని. వడ్రంగులకు జ్యోతిష్యశాస్త్రం మీద చాలా అవగాహన ఉంటుంది. ఆయన నన్నడిగారు-‘నువ్వెప్పుడు పుట్టావో చెప్పు’ అనడిగారు. ‘నాకు మిగతా విషయాలన్నీ తెలియదు కానీ, 5 సెప్టెంబర్ 1952 నా పుట్టినరోజుగా భావిస్తారని చెప్పాను.’ దాంతో ఆయన 1952 పంచాంగం తీసి, పలక పైన మొత్తం లెక్కలు వేశారు. లెక్కలు వేసి-‘నువ్వు 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు రెండంతస్తుల మేడ పైనుండి కింద పడ్డావా?’ అనడిగారు. అవునన్నాను. ‘నీకు ఎనిమిదేళ్ళప్పుడు మీ అమ్మ చనిపోయిందా?’ . ‘అవును, చనిపోయింది’ ‘అయితే నువ్వు ఈ సమయంలోనే పుట్టావు, ఇది నీ నక్షత్రం’ అని చెప్పారు. ఆ తర్వాత నాకు చాలా విషయాలు చెప్పారు-‘నీ చదువులో ఇంతకుముందు కూడా ఒక రెండు సంవత్సరాలు వృథా అయ్యాయి, ఇప్పుడు కూడా చదువులో ఇంకో సంవత్సరం వృథా అవుతుందన్నారు. ‘సంవత్సరం వృథా కానే కాదన్నాను.’ ఇప్పుడు మీ ఇంట్లో నీ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారు’ అని చెప్పారు. అప్పట్లో నేనిలాంటివి నమ్మేవాణ్ణి కాదు కదా-‘సరే చూద్దాం’ అనుకున్నాను. కానీ ఆ సంవత్సరం మహేంద్ర పాండ్యా నన్ను పరీక్ష రాయకుండా ఆపేశారు. నేనూ ఆగిపోయాను. నేను వాళ్ల గ్రామం నుండి హాస్టల్‌కు రాగానే, అక్కడ ఒక ఫోటో ఉంది-‘ఈమెతో నీ పెళ్లి నిశ్చయం చేస్తున్నారు’ అని. నేను ఇంటికి వచ్చి చాలా రచ్చ చేశాను, పెళ్లి గిల్లి ఏం చేసుకుంటాం అని! ఆ తర్వాత ఆ పెళ్లి కూడా ఆగిపోయింది.’
కానీ ఆయన హటాత్తుగా తన పత్ని గురించి చెప్పడం మొదలుపెట్టారు. ‘ఈమే నేనూ కలిసి కలిసి చాలా పని చేశాం. రాత్రి రెండు మూడు గంటలైనా సరే ఎప్పుడు మెలకువ వచ్చినా, ఎదురుగానే ఆశ్రమం ఉండేది, స్నానం చేసి అక్కడికి వెళ్లి కూర్చుని పని చేసేవాళ్లం, కదా! ఇక్కడికి వచ్చేవాళ్లంతా నన్ను గౌరవిస్తారు కానీ ఈమెని ప్రేమిస్తారు. కదా ఆశిష్! ప్రజలు ఈమె తోటే తమ ఏడుపులు, పెడబొబ్బలు మొత్తం పంచుకుంటారు. వాళ్ళ ఇంటి గురించీ, కుటుంబవిషయాల గురించీ ఈమెతోనే కూచుని మాటాడుకుంటారు. నాతో ఎవరూ మాట్లాడరు. ఎవరున్నా, ఎలా ఉన్నా ప్రతి ఒక్కరి వ్యవస్థని చక్కగా గమనించి చూసుకుంటుంది ఈమె.’
అవును, ఆ మాటలు అక్షర సత్యం. గురుపత్ని మూర్తీభవించిన సౌమ్యమూర్తి. గురూజీ తన జీవితం మొత్తం ప్రజలకి అంకితం చేయగలిగారంటే అది ఆమె వల్లనే అని మనకి తెలుస్తూనే ఉంటుంది.
Featured image photography by Sardar Harpal Singh, Adilabad
7-6-2026

