
మొదటిరోజు: మూడవ సంభాషణ (మొదటి భాగం)
అనుభూతి అనుభవాన్ని ఆకృతిగా మార్చడమే కళ
మధ్యాహ్న భోజనం గురూజీ ఇంట్లోనే చేసాను. భోజనం అయ్యాక గురూజీ కొంతసేపు విశ్రాంతి తీసుకోడానికి వెళ్ళారు. నేను గెస్టు హవుసుకి వెళ్ళాలనుకోలేదు. అక్కడే కళాశ్రమంలోనే పెద్ద అరుగు మీద మేను వాల్చాను. బయట ఎండతో సంబంధం లేకుండా ఆ అరుగులు చాలా చల్లగా ఉన్నాయి. పూర్వకాలపు సమష్టి కుటుంబాలుండే మట్టి ఇళ్ళని, పేడతో అలికే అరుగుల్ని ఆ ఆశ్రమం అరుగులు గుర్తుకు తెస్తున్నాయి. ఒక గంటసేపు అలా గడిచి ఉంటుంది. గురూజీ చెప్పిన మాటలే నా మనసులో మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ ఉన్నాను.
మూడుగంటలయ్యేటప్పటికి గురూజీ నా దగ్గరికొచ్చారు. ఆయన ఒక కంచు చెంబులో టీ తీసుకొచ్చారు. ఇద్దరం టీ తాగాం. గురూజీ మళ్ళా ఒక బీడీ ముట్టించి తాను తన సంభాషణ పొద్దున్న ఎక్కడ ఆపారో అక్కడ మొదలుపెట్టారు.
‘అక్కడ మేమొకసారి క్రిస్టల్ బార్ లో కూర్చొని పని చేస్తున్నాం. సీలింగ్ తయారు చేస్తున్నాం. దానికి గాను పిల్లర్ తయారు చేస్తున్నాము. . ఆ పని మధ్యలో ఒక చిన్న పనిముట్టు తీసుకొని ఇలా చెవిలో తిప్పుతుంటే, ఎక్కడ తగిలిందో తెలియదు. దానివల్ల చెవిలో నుండి చాలా నీరు కారడం ప్రారంభమైంది. దాంతో చెవి అంతా ఇదైపోయింది. లోపల ఎముక నుంచి చాలా శబ్దం రావడం మొదలైంది. తింటుంటే ‘ఖాట్ ఖాట్’ అని శబ్దం వచ్చేది, చాలా గట్టిగట్టిగా. ఒకరోజు ఒకచోట కూర్చొని నేను ఇలా తలపై కొట్టి చూశాను. అప్పుడు గంట శబ్దం వచ్చినట్లు శబ్దం రావడం ప్రారంభమైంది. నేను ఇక్కడ కొట్టి చూశాను, ఇక్కడ కొట్టి చూశాను (తల మీద కొట్టి చూపిస్తూ) దీనివల్ల తల అంతటా గంట శబ్దమే వస్తోంది.’
‘చాలా కంగారు పడిపోయాను, అప్పుడు దాస్ సాబ్‌కు చెబితే ఆయన తలకి ఎక్స్ రే తీయించాల్సి ఉంటుందన్నారు. ఏంటి బేటా ఏదో వింత గోల తగిలింది అనుకున్నాను. దవాఖానాకు వెళ్ళడం మొదలయ్యింది. అక్కడ ఉంది కదా కోఠిదగ్గర, ముక్కు, చెవి దవాఖానా, కన్ను వగైరాది. అక్కడికి వెళ్తే, వాళ్ళు రోజుకో ఇంజెక్షన్ గుచ్చేవాళ్ళు. ‘నీరసంగా అయిపోయింది’ అనేవాళ్ళు. చెవిలో నుండి కారుతున్న దానికి ఏమీ చేయకుండా ఇంకేదో చేస్తున్నారనిపించింది. ‘డాక్టర్ సాబ్, కనీసం చెవిలో ఏముందో, ఏమి లేదో చూడండి అనడిగితే, చూస్తే ,చాలా మలినం ఉంది. దాన్నంతా బయటికి తీసారు. ఆ తర్వాత రెండో చెవి కూడా అలానే అయిపోయింది. వీటన్నిటివల్ల నేనొక్కసారిగా నీరసపడిపోయాను.’
‘ఇదిలా ఉండగా, బుద్ధుడికి సంబంధించి 510 తాంత్రిక రూపాలు ఉన్నాయి, అవి టిబెట్‌లో తయారయ్యాయి. ఆ 510 తాంత్రిక రూపాలను తయారు చేసి ఏదైనా మ్యూజియంకు ఇద్దామనిపించింది. దానికి సంబంధించిన ఐకనోగ్రఫీ కూడా నాకు దొరికింది. ఆ పని మొదలుపెట్టాను. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయడం. కూర్చొని మాత్రమే ఆ పని చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చిన్న చిన్నవి చాలా విగ్రహాలు తయారు చేశాను. అప్పుడు చాలాసార్లు బియ్యం స్టవ్‌పై పెట్టి ఉంచితే ఆ గిన్నె కూడా కాలిపోయేది. ఆ విషయం తెలిసేది కాదు. ఇంక ఎవరు వంట వండాలి, ఎవరు తినాలి? అందుకని, అవన్నీ పక్కనపెట్టేసి, సోమవారం, మంగళవారం ఉపవాసం, శుక్రవారం, శనివారం ఉపవాసం మొదలుపెట్టాను. వండడమూ లేదు, తినడమూ లేదు.’
‘నేను అఖాడా నడిపేటప్పుడు ఎనభై కిలోల బరువు ఉండేవాడిని. ఈ తిప్పలన్నింటి వల్ల నా బరువు నలభై ఐదు కిలోలకు వచ్చేసింది. కానీ ఇరవై నాలుగు గంటలూ ఒకటే ఆందోళన ఉండేది. కళ అంటే ఏమిటి, సృజనాత్మకత అని దేన్నంటారు-అదే ఆలోచన. అలా ఆలోచిస్తూనే చాలా తిరిగేవాడిని. ఈ బుద్ధుడి విగ్రహాలు చేస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు విగ్రహాలు చేస్తుండగా, ఒకరోజు సాయంత్రం కరెంట్ పోయింది. అప్పుడు ఏదేనా సినిమా చూద్దామనుకున్నాను. చిక్కడపల్లి నారాయణగూడలో దీపక్ మహల్ ఉండేది. ఆ దీపక్ మహల్‌లో ‘అర్ధాంగి’ అనే పాత సినిమా నడుస్తోంది, అది చూడటానికి వెళ్లాను. టికెట్ తీసుకొని సినిమా చూడ్డానికి కూచున్నప్పుడు నాకు ఆ కుర్చీలో కలిసిపోయినట్టనిపించింది. కొంచెం సర్దుకుని కూచున్నాను. మళ్ళీ కాసేపటికి అలాగే అనిపించింది. ఒక విధమైన జలదరింపు కలిగింది. లేచి వాష్ రూం కి వెళ్ళి వచ్చి కూచున్నాను. మళ్ళీ అలాగే అనిపించింది. ఏదో గడబిడ మొదలయ్యిందనుకున్నాను. బయటకు వచ్చేశాను. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో రిక్షాలు నడిచేవి, ఆటోలు లేవు. ఒక రిక్షాలో కూర్చొని చిక్కడపల్లి వచ్చాను. అదిలాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి పెళ్ళయి అక్కడ ఉంటోంది. ఆమెను మేము అక్కా అక్కా అని పిలిచేవాళ్ళం, సోదరిలా అనుకునేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్లాను, ఆమె నన్ను చూసి ‘ఏమైంది? ఏమైంది? ఏమైంది?’ అని ఆత్రుతగా అడిగింది. ‘దీపక్ మహల్‌లో సినిమా చూడటానికి వెళ్లాను, అక్కడ అక్కడ ఏదో ఉంది, అది పట్టుకుంది’ అన్నాను. ‘అయ్యో! ఇదేం గొడవ?’ అన్నాను. ఆమె ‘అక్కడేదో ఉంది, అలా చాలామందికి అయ్యిందది’ అని చెప్పింది. వాళ్ళ అత్తగారు ‘అలాంటిదేమీ లేదు’ అంటూ పైత్యం ఎక్కువయ్యిందని, శొంఠి వగైరా నూరి తినిపించింది. ధూపం వేసింది.రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాను.’
‘పొద్దున్న లేచాక, ఇంక వంట ఎవరు వండుతారని చిక్కడపల్లిలో సుధా హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి తినడానికి కూచుంటే, మళ్ళీ అలాగే అయిపోయింది. నేను వెంటనే హోటల్ వాడితో ‘ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా’ అని అడిగితే వాడు కంగారు పడిపోయాడు. ‘డాక్టర్ ఏమిటి? బిడ్డా! భోజనంలో ఏమైనా అయ్యిందా?’ అని ఆందోళన పడిపోయాడు. నాకే ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి దగ్గరలోనే దాస్ సాబ్ ఇల్లుంటే, ఆయన దగ్గరకు వెళ్ళాను. నా మనసులో ఒకటే మాట ఇరుక్కుపోయింది: ‘నన్ను ఏదో పట్టుకుంది.’. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళిదే మాట చెప్తున్నారు. ఆ మాట నా బుర్రలో ఎంతలా ఎక్కేసిందంటే, చివరకి నేను పచ్చగా పాలిపోయాను. అలాంటి స్థితిలోనే అదిలాబాద్ కూడా వెళ్ళివచ్చాను.’
‘మళ్ళీ నేను ఆ అక్కని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె వంటగదిలో రొట్టెలు చేస్తూ ఉంది, ఆమె నన్ను చూసి లోపలకి వెళ్ళి వాళ్ళత్తగారితో ‘ఇంకా దిగలేదు’ అని చెప్పింది. నా తలపట్టుకున్నాను. ‘ఇదేమిటిరా బిడ్డా, ఇంత పరేషానీ అయ్యిపోయింది’ అనుకున్నాను. నేనొక రోజు ఆమెతో ‘అక్కా, అది నిన్ను పట్టుకున్నప్పుడు నీకెలా ఉండేది? ఏమయ్యేది?’ అనడిగాను. ఆమె ‘గుండె దడదడలాడుతుంది. కళ్ళు తిరుగుతాయి. గొంతు..’ అని ఆమె ఏమేం చెప్పిందో అవన్నీ నాకు కూడా అవుతున్నాయని అర్థమయింది. ‘అక్కా, నీకలా అయినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళి దిష్టి తీయించుకున్నావు?’ అనడిగాను. ఆమె మహబూబ్ నగర్ వెళ్ళాననీ, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాననీ అంది. ఎంత ఖర్చవుతుందని అడిగాను. పన్నెండు పదమూడు వందలదాకా కావొచ్చని చెప్పింది. పన్నెండు పదమూడు వందలా! అంత డబ్బు ఎక్కణ్ణుంచి తెచ్చేది అనుకున్నాను.’
‘అదంతా చాలా చిత్రంగా ఉండేది. ఆ రోజుల్లో ఇక్కడ కూడా అలాంటి కథలు చాలానే నడిచేవి. ప్రతి చోటా ఈ ముచ్చట్లే నడిచేవి. పదే పదే ఆ మాటలే మనసులో తిరుగుతుండటంతో చాలా కంగారుగా ఉండేది. చివరికొకరోజు, సరే, పోయి దిష్టి తీయించుకుని వద్దాం, ఏమవుతుందో చూద్దాం అనుకున్నాను. ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాను. కాని మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించాను.’నేను సప్తశతి పారాయణం చేస్తాను, దేవి పారాయణం చేస్తాను, నన్నే దెయ్యం పట్టుకుంటుంది? నన్ను చూసి అది పారిపోవాలి. నన్ను ఆ రోజుల్లో దయ్యాల గురువు అనేవాళ్ళు కదా, ఆ మాట ఊరికే అనలేదు కదా’ అనుకున్నాను.’
‘ఒకరోజు కాలేజీకి వెళ్లాను. కాలేజీలో కింద నుండి పైకి, పై నుండి కిందకి- మూడో అంతస్తులో మా కారిడార్ ఉండేది- పైకి వెళ్తుంటే మళ్ళీ అలాగే అయ్యేది. కళ్ళు తిరగడం మొదలయ్యేది. ఒకరోజక్కడ నిలబడి ఉంటే, ఖాద్రీ సాబ్ అని ఒకాయన ఉండేవారు, తోలు పని చాలా బాగా చేసేవారు, ఆయన ఒక గోలీ వేసుకుంటున్నారు. సాబ్, మీరు ఆ గోలీ దేనికి వేసుకుంటున్నారు? మీకేమయ్యిందనడిగితే, ‘అయ్యో మియా, గ్యాస్ ఫామ్ అవుతుంది, హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతాయి, అదొస్తుంది, ఇదొస్తుంది’ అన్నారు. ‘సాబ్, ఇవన్నీ నాకు కూడా అవుతున్నాయి కదా! సైతాన్ పట్టుకుందని చెప్పలేదా మీకు?’ అనడిగాను. ఆయన నవ్వి, ‘హేయ్! సైతాన్ లేదు, గియితాన్ లేదు. ఈ టాబ్లెట్ వేసుకో. ఇవి గ్యాస్ ట్రబుల్స్ మియా. పొట్టలో గ్యాస్ ఎక్కువై తలకెక్కితే ఇలాగే అవుతుంది అందరికీ’ అన్నారు. నాకా టాబ్లెట్ ఇచ్చారు. ఆ గ్యాస్ వాస్ మొత్తం పోయింది, నేను చక్కగా అయిపోయాను. నవరాత్రులు వచ్చాయి. నవరాత్రుల్లో చాలా పద్ధతిగా పూజ చేసేవాడిని ఆ సమయంలో. ఆ ఖాద్రీ సాబ్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల, ఆ మాట, ‘నన్నేదో పట్టుకుంది’ అనే మాట, నా బుర్రలోంచి కూడా పూర్తిగా బయటకు పోయింది.’
‘కానీ ఆ సమయంలో కూడా మనసులో ఒకటే ఆలోచన నడుస్తుండేది.’ఏం చేయాలి?’, ‘సృజనాత్మకమైన పని అని దేన్నంటారు?’. శరీరాన్ని నిస్సత్తువ ఆవహించింది. నా శరీరమంతా ఎలా అయిపోయిందంటే, ట్రైన్ బోగీలో కూర్చుంటే మనిషి ఊగుతాడు కదా, అలా ఇరవై నాలుగు గంటలూ ఊగుతుండేది. ఎవరో వెనుక నుండి నెడుతున్నట్టుండేది. సాయంత్రం పూట ఎవరినైనా పట్టుకొని నడవాల్సి వచ్చేది, గాల్లో నడుస్తున్నట్లు అనిపించేది.’
‘ఒకరోజు నేను రాత్రి పూట నకాశీ పనివాళ్ళ దగ్గరకి వెళ్ళాను. అక్కడంతా కూచుని ఉన్నారు. నేను మెల్లగా గోవిందుకి చెప్పాను, నాకిలా ఉంది, చాలా నెలలనుంచి ఇలా బాధపడుతున్నాను, ఏం చెయ్యాలనడిగాను. అక్కడ రాజేశ్వర్ చౌదరి అని ఒకాయన ఉన్నారు. ఆయన ‘ఇది గుల్మ పిత్తం. ఎనభై నాలుగు రకాల పిత్తాలు ఉన్నాయి, అందులో దీన్ని గుల్మ పిత్తం అంటారు. మనిషి మరీ ఎక్కువగా ఆలోచిస్తుంటే, ఇలా అవుతుంటుంది. కాస్త అల్లం నూరి, నీళ్ళల్లో కాచి, కొంచెం ధనియాలు వేసుకుని తాగెయ్యి, మొత్తం సర్దుకుంటుంది’ అని చెప్పారు. మా ఇంటి పక్కన ఒక మార్వాడీ కుటుంబం ఉండేది. వాళ్ళ దగ్గరకు వెళ్తే, వాళ్ళు అదంతా నూరి బాగా తయారు చేసి తాగించారు. ఒకటి రెండు సార్లు తాగాను, దాంతో మొత్తం మామూలైపోయింది.’
‘ఆ తర్వాత నేను బరోడా వెళ్లాను కదా. హైదరాబాద్‌లో చదువు పూర్తయ్యాక ఒక ఏడాది పాటు ఖాళీగా ఇంట్లోనే కూర్చున్నాను. అప్పుడు మా ప్రొఫెసర్లు ఉస్మాన్ సాబ్ గట్రా అందరూ కలిసి ‘నువ్విలా ఖాళీగా ఉండకూడదు శర్మా, పై చదువుల కోసం బరోడా వెళ్ళు. అక్కడ అద్భుతమైన వాతావరణం ఉంటుంది’ అని చెప్పారు. పెద్ద సిఫార్సు లేఖ రాసిచ్చారు. లలిత కళా అకాడమీ వాళ్ళు నెలకి 200 రూపాయల స్కాలర్ షిప్ మంజూరు చేసారు. నేను బరోడా వెళ్లాను.’
‘నేను బరోడా వెళ్ళిన రోజే స్కైల్యాబ్ పడిపోయే రోజు కూడా. ఆ రోజు నేను ట్రైన్ లో ఉన్నాను. అది జూలై తొమ్మిదో తేదీ అనుకుంటాను. ట్రైన్లు ఖాళీ, స్టేషన్లు ఖాళీ. ఎక్కడా ఎవరూ లేరు (నవ్వుతూ). రాత్రి రెండు గంటలకి బరోడాలో దిగాను. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తాను అని చూస్తుంటే, కొంచెం తెలుగు భాష వినిపించింది. ‘అబ్బా, మనవాళ్ళున్నారు’ అనుకుని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పక్కనే నేలమీద నా తువ్వాలు పరుచుకుని పడుకున్నాను. ఆ పక్కన బెంచిమీద ఒకబ్బాయి కూచుని ఏడుస్తున్నాడు. ఎందుకేడుస్తున్నావని అడిగితే, ‘రేపు స్కైలాబ్ పడిపోతుందిట కదా, అది కరెక్టుగా ఇక్కడే మన నెత్తిమీద పడుతుందిట’అని ఏడుస్తున్నాడు.’
‘అది మా ఊళ్ళో పడుతుందని చెప్తే దాన్ని తప్పించుకోడానికే నేనిక్కడికి పారిపోయి వచ్చాను. అదిక్కడ పడుతుందా?’ అన్నాన్నేను. ‘అయితే మరి నువ్వు చావడానికి ఇంతదూరమెందుకొచ్చావు’ అనడిగాను నవ్వుతూ. ‘పడితే పడిందిలే, పడ్డప్పుడు చూసుకుందాం’ అన్నాను.
‘పొద్దున్నే లేచి హాస్టలుకి వెళ్ళాను, అక్కడ సుధాకర రెడ్డి వగైరా తెలిసినవాళ్ళున్నారు. ఆ రోజే, అంటే పదో తారీకునే , ఇంటర్వ్యూ కూడా. హైదరాబాదుకి చెందిన కొందరు అబ్బాయిలు అక్కడ నాకు పరిచయమయ్యారు. వాళ్ళు ‘శర్మా, నువ్వెందుకొచ్చావు? ఇక్కడ నీకు సీటు దొరకదు. ఇది చాలా మోడరన్ కాలేజి. ఇక్కడ ఫారినర్సు కూడా ఉంటారు. ఇక్కడ పర్సనాలిటీ కూడా చూస్తారు. నువ్వు ధోతీ కట్టుకొచ్చావు. నీకు సీటివ్వరు’ అన్నారు. ‘సరే, ఇవ్వకపోతే ఇప్పుడే వెనక్కివెళ్ళిపోతాను, నేనేమన్నా ఇక్కడ ఉంటానని వచ్చానా?’ అన్నాను వాళ్ళతో.
కాలేజికి వెళ్ళినప్పుడు అందరికన్నా ముందు నా పేరే పిలిచారు. నేను కాలేజి వాళ్ళనే చూస్తూ, వెళ్ళలేదు, దాంతో మరొకర్ని పిలిచారు, ఇంకొకర్ని పిలిచారు, అలా చివరిలో నా నంబరొచ్చింది. ఇంటర్వ్యూ పొద్దున్న ఎనిమిదింటికి మొదలైతే, పదిన్నర ప్రాంతంలో నన్ను పిలిచారు. లోపల అడుగుపెట్టాను. సంభాషణ మొదలయ్యింది. పదిన్నర నుండి పన్నెండున్నర, ఒంటిగంట అయిపోయింది. రెండున్నరగంటల పాటు నడిచింది ఇంటర్వ్యూ! మహేంద్ర పాండ్యా, పాంచాల్ సాబ్ మొదలైనవాళ్ళంతా ఉన్నారక్కడ.
‘శర్మా, నీకు కాలేజిలో సీటు దొరికింది. హాస్టలు సీటు కూడా దొరికింది. నువ్వు పోయి నీ సామాను తెచ్చుకో’ అని చెప్పారు.
‘కానీ అక్కడ చేరిన తరువాత నేననుకున్నట్టుగా సాగలేదు. అనారోగ్యం నడుస్తూనే ఉంది. ఏడాదిన్నరపాటు మలేరియాతో బాధపడ్డాను. లోపల అనారోగ్యం ఉందని నాకు తెలియదు. పొట్టలో చాలా ఇబ్బందిగా ఉండేది. వేలకొద్దీ తేనుపులొచ్చేవి.’
‘మొదట్లో అంతగా పనిచెయ్యలేకపోయేవాణ్ణి. కాని ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాణ్ణి. చాలా పనులే చేసాను, కానీ అసలేం చెయ్యాలన్న ఆలోచనైతే నన్ను వదల్లేదు. ఆ రోజుల్లో కమాటి బాగ్ అని కాలేజికి ఎదురుగా ఒక పార్కు ఉండేది. అక్కడకి పోయి కూచునేవాణ్ణి. ఎవరితోటీ మాట్లాడేవాణ్ణి కాదు. మామూలుగానే తక్కువమాట్లాడేవాణ్ణి. రోజూ పోయి అక్కడ కూచునేవాణ్ణి. అక్కడొక చెట్టుకింద అయిదారునెలలపాటు కూచున్నాను. అదొక మర్రిచెట్టు. దాని ఎదట వేరే చెట్లు చాలానే ఉండేవి. ఆ చెట్లు చూస్తూ ఉండేవాణ్ణి. ఆ చెట్లమీద పూలు వచ్చాయి, పండ్లు వచ్చాయి, తర్వాత అన్నీ రాలిపోయాయి, చివరికి ఒక్కొక్క ఆకూ కూడా రాలిపోయింది. దాని తర్వాత మళ్ళా కొత్త కొత్త ఆకులు వచ్చాయి. చిగుర్లు వచ్చాయి.’
‘నాకు ఆ రోజు అనిపించింది. ప్రకృతిలో ఏదన్నా కొత్తగా సృష్టించాలంటే పాతదంతా వదిలేస్తుంది. మనం పాతవిషయాలన్నీ మనసులో నింపుకుని కొత్తగా ఏం నేర్చుకుంటాం, ఏం చేస్తాం? అందుకని అంతా మర్చిపోవడం మంచిది. ఇన్ని విద్యలు నేర్చుకున్నాం, ఇంత పని నేర్చుకున్నాం- ఇవన్నీ మర్చిపోవాలి. నేను మర్చిపోయాను కూడా. ఏమీ రానట్లు అయిపోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయాను.’
గురూజీ పరిచయమైన తొలి రోజుల్లోనే ఒకసారి ఆయన నోటమ్మటే విన్నాను ఈ సంఘటన గురించి. చాలా ఆశ్చర్యపోయాను. మనం పుట్టినప్పణ్ణుంచీ, జీవితంలో చాలాకాలందాకా నేర్చుకోడం మీదనే దృష్టి పెడుతూ ఉంటాం. ఆ ఆరాటంలో మనకి మనం నెమ్మదిగా దూరంగా జరుగుతూ ఉంటాం. అందుకని మిస్టిక్కులు unlearning అవసరమంటారు. మనమీద కాలం, దేశం, సమాజం వదిలిపెడుతూ వచ్చిన ముద్రలు చెరుపుకోవలసిన అవసరం గురించి చెప్తుంటారు. మన అలవాట్లనుంచీ, నిశ్చల నిశ్చితాల నుంచీ, నీరసతథ్యాల నుంచీ బయటపడాలని చెప్తారు. Unlearning అనే మాట ఇరవయ్యో శతాబ్దం ద్వితీయార్ధంలో యూరోపులో పుట్టినప్పటికీ, దాని మూలాలు డావోయిజంలోనూ, జపనీయ జెన్ బౌద్ధంలోనూ ఉన్నాయి. కాని నా జీవితంలో నేను మొదటిసారి ఒక మనిషిని, అన్ లెర్నింగ్ అవసరాన్ని తనంతతనే గుర్తుపట్టినమనిషిని చూసాను అనుకున్నాను. సిద్ధార్థుడికి రావిచెట్టుకింద జ్ఞానోదయమైతే ఈ గురూజీకి మర్రిచెట్టుకింద జ్ఞానోదయమయ్యిందనుకున్నాను.
గురూజీ ఇంకా చెప్తున్నారు: ‘ఒకరోజు నన్ను ఇంట్లో వాళ్ళ పేర్లడిగారు. రెండు మూడు పేర్లు మాత్రమే గుర్తొచ్చాయి, మిగిలినవి గుర్తుకు రాలేదు. ‘ఏమయ్యింది నాకు? ఇలాగైతే పిచ్చివాణ్ణైపోతాను’అని పరుగెత్తుకుంటూ నా గదికి వెళ్ళి ఉత్తరాలు బయటకి తీసాను. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, ఉత్తరాలుండేవి, అవి తీసి చూసాక అందరి పేర్లూ గుర్తొచ్చాయి. అప్పటికి మనసుకి కొంత ప్రశాంతత చిక్కింది. ‘
‘అలాగే తిరుగుతూ ఉండేవాణ్ణి. నీరసంగానే తిరుగుతుండేవాణ్ణి. పులిగోర్లు ఉంటాయి కదా. తేలుకొండి ముళ్ళల్లాగా ఉంటాయి. దెయ్యం గోర్లు అంటారు కదా. వెనక విశ్వామిత్రి అని ఒక వాగుండేది, దానిలో చాలా దొరికేవి, నేను వాటితో చాలా అందమైన వస్తువులు తయారుచేసేవాణ్ణి. వాళ్ళవి తీసుకుంటూ ఉండేవారు. ఖర్చులు గడుస్తుండేవి. ఎందుకంటే లలితకళా అకాడెమీ వాళ్ళిచ్చే స్కాలర్ షిప్పు మహేంద్ర పాండ్యా నాతో గొడవపడి ఆపించేసారు. చేతిలో అస్సలు డబ్బులుంటేవి కావు. ఆ పులిగోళ్ళతో తయారుచేసిన వస్తువులు, తేలులాంటి బొమ్మలు, వాటితో ఎలాగో ఓలా నడిచేపోయేది.’
‘ఒకరోజు చాలా అందమైన తేలుబొమ్మ తయారుచేసాను. నిరంజన త్రివేది అని ఒకాయన ఉండేవారు. ఆయన దాన్ని వందరూపాయలకి ఇచ్చేయమని అడిగారు. ‘ఇది చాలా అందంగా వచ్చింది, దీన్నెవరికీ ఇవ్వను, నేనే ఉంచేసుకుంటాను’ అని చెప్పాను. ‘ప్రభుజీ, నూట యాభై ఇస్తాను, ఇచ్చేసేయండి’ అనడిగారు నిరంజన్. నేనివ్వలేదు, నా దగ్గరే ఉంచుకున్నాను.’
‘ఆ సాయంకాలం దాన్ని చేతిలో పట్టుకునే గార్డెన్ మీంచి వెళ్తున్నాం. నాకు చాలా ఆకలివేసింది. నిరంజన్ ని నాలుగణాల శనగలు తీసుకొమ్మని అడిగాను. ఆయన ‘ఆ తేలుబొమ్మ ఇటివ్వండి, ఈ శనగలు తీసుకోండి’ అన్నాడు. ఆ నాలుగు అణాల శనగలు నా చేతిలో పెట్టి ఆ బొమ్మ తీసుకువెళ్ళిపొయ్యాడు. పొద్దుణ్ణుంచీ వంద రూపాయలిస్తానన్నా ఇవ్వని బొమ్మని.’
‘ఒకరోజు చాలా సేపు తిరుగుతూ తిరుగుతూ హాస్టలుకి వచ్చాను. సాయంకాలమయ్యింది. మంచం మీద పడుకున్నాను. చిన్న కునుకు పట్టింది. నిద్ర కాదు, కాని ఆ కునుకులోనే మనసులో ఏవేవో ఆలోచనలు కదలాడాయి.’
‘అనుభూతి అనుభవాన్ని ఆకృతిగా మార్చడమే కళ-‘
‘ఈ మాట అకస్మాత్తుగా నా మదిలో మెదిలింది. ‘అనుభూతి అనుభవాన్ని ఆకృతిగా మార్చడమే కళ.’ వెంటనే లేచాను. స్నానం చేసాను. బయటికొచ్చాను, అన్నం తిన్నాను. ఇంక ఆ రాత్రి నిద్రపట్టలేదు. తెల్లవారుజాము నాలుగింటికే లేచి కాలేజీకి వెళ్ళిపోయాను కాలేజీకి వెళ్ళి వచ్చాక మళ్ళా రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇదేమిటి, ఇదేమిటని.’
‘అప్పుడు నాకు ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సు. నేను ఇరవై ఏళ్ళప్పుడు ఏం చేసాను? పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయసులో ఏం చేసాను? ఏడేనిమిదేళ్ళ వయసులో ఏం చేసాను? అలా నాలుగేళ్ళ వయసప్పటిదాకా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేనేం చేసేవాణ్ణో, ఎలాంటి ఆకృతులు తయారుచేసానో, ఏమేం చేసానో, ఏ పనులు చేసానో, అవన్నీ గుర్తుతెచ్చుకున్నాను. అవన్నీ నా సొంత పనులు, దానిపై ఎవరి ప్రభావం లేదు, అది నా సొంత అనుభూతి.’
‘మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ, నాలుగేళ్ళ వయసులో ఏం చేసానో, మళ్ళా అవే చేసాను. వాటిని తయారు చేసిపెట్టినప్పుడు- ఆసార్ అని ఒక ఆస్ట్రేలియా కళాకారుడుండేవాడు, ఆయన రోజు విడిచి రోజు నా దగ్గరికొచ్చేవాడు, నాతో మాట్లాడటానికి. శివాజీ పణిక్కర్ అనే ఆయన మా మధ్యన కూచునే వాడు. ఆ ఆస్ట్రేలియన్ ఇంగ్లిషు మాట్లాడేవాడు. నేను హిందీ మాట్లాడేవాణ్ణి. ఈ శివాజీ అతనికి అర్థమయ్యేలా చెప్పేవాడు. ఆయన ఒక రోజు వచ్చినప్పుడు నేను తయారు చేసి పెట్టిన బొమ్మలు చూసి ఎంత సంతోషపడిపోయాడంటే, ‘శర్మాజీ, ఇవన్నీ నేను ఆస్ట్రేలియా తీసుకువెళ్టాను’ అన్నాడు. అవన్నీ ఆయనికిచ్చేసాను.’
‘అక్కణ్ణుంచి మళ్ళా జీవితం పునఃప్రారంభించాను. నాలుగేళ్ళ వయసునుండీ చేసిన ఆ పనులు పట్టుకుని మళ్ళీ ఇరవై ఎనిమిదేళ్ళ వయసుదాకా వచ్చాను. ఆ చిన్నప్పటి పని చాలా అందమైన పని. దానిమీద ఎవరి ప్రభావం లేదు కదా, అది నా సొంతపని. దాన్నే మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాను. మిగిలిన ఈ శైలులు- ఇవన్నీ వేరు.’
‘అక్కణ్ణుంచి తిరిగి వచ్చిన తరువాత కొలాం ఆశ్రమస్కూల్లో పని మొదలుపెట్టినప్పుడు, నేనిదే అనుకున్నాను: పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో అక్కణ్ణుంచి ప్రారంభించాలి. చిన్న చిన్న పిల్లలు కదా. ఈ పిల్లల లోపల నుంచి వచ్చిన పని కూడా అద్భుతంగా ఉంది కదా. పెద్ద పెద్ద కళాకారులు ఆశ్చర్యపోయేవారు ఈ కొలాం పిల్లల పని చూసి. దాని తర్వాత, ఆ పిల్లలు తమ పనిలో నైపుణ్యం సాధించాక, నేను వీళ్ళకి వేరే శైలులు నేర్పించాను. పోర్ట్రయిట్ అంటే ఏమిటి, కంపొజిషన్- ఇటువంటివి నేర్పించాను ఈ పిల్లలకి. కాని మొదట వీళ్ళ సొంతపని, ఆ పిల్లల పని వచ్చిందే, అది అద్భుతమైన పని.’
కొలాములు అదిలాబాదులోని ఒక అనాది గిరిజన తెగ. భారత ప్రభుత్వం వారిని మొదట్లో పి.టి.జిలు అంటే ఆదిమ గిరిజన తెగలనీ, ఆ తర్వాత పి.వి.టి.జిలు, అంటే Particularly Vulnerable Tribes అనీ పిలవడం మొదలుపెట్టింది. కానీ సాంస్కృతికంగా కొలాములది చాలా సుసంపన్నమైన వారసత్వం. వారిలో అక్షరాస్యత తక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వం వారి విద్య కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వాటిల్లో భాగంగానే అదిలాబాదు పట్టణంలో ఉండే ఆశ్రమస్కూలును కొలాం పిల్లలకోసమే ప్రత్యేకంగా కేటాయించింది. ఉట్నూరు ఐటిడిఎలో ఎం.వి.పి.సి. శాస్త్రిగారు ప్రాజెక్టు ఆఫీసరుగా పనిచేస్తున్నప్పుడు, ఆయన అభ్యర్థన మీద గురూజీ కొలాం పిల్లల్తో పనిచేయడానికి ఆ స్కూలుకి రావడం మొదలుపెట్టారు. అలా గురూజీ కోలాం ఆశ్రం స్కూల్లో పనిచేస్తున్నప్పుడే నేను ఆయన్ని మొదటిసారి చూసాను. ఆయన పర్యవేక్షణలొ కొలాం పిల్లలు గీసిన బొమ్మలు నేను కూడా చూసాను. అవి పికాసో చాలా పరిణత దశలో గీసిన బొమ్మల్లాగా ఉండేవి.
గురూజీ తన సంభాషణ కొనసాగించారు:
‘అలా పనిచేస్తున్న సమయంలో కార్ల్ వాట్ అని ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక కళాకారుడు వచ్చాడు. ఆయన ఆర్కిటెక్టు. ఆఫ్గనిస్తాన్ లో పశాయి ఆదివాసులతో పనిచేస్తున్నాడు. వారి వాస్తుశిల్పం అధ్యయనం చేస్తున్నాడు. ఆ ఆదివాసి పిల్లల డ్రాయింగులు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఆయన అదిలాబాదు ఎందుకు వచ్చాడో నాకు తెలియదు గానీ, ఎవరో ఆయన్ని నా దగ్గరకు పంపించారు. ఆయన ఇక్కడకొచ్చి ఈ పిల్లల పనివరసలు చూసి ఆశ్చర్యపోయాడు, తన దగ్గరున్న బొమ్మలు తీసుకొచ్చి చూపించాడు. ఆ పిల్లల పనీ, ఈ పిల్లల పనీ ఒక్కలానే ఉంది చూడమన్నాడు.’
‘ఈ కొలాం పిల్లలు చేసే పని చాలా వరకూ ఈజిప్షియను పెయింటింగ్సులాగా ఉండేది. ఆ లక్షణాలు వీళ్లపనిలోకి ఎలా వచ్చాయనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ ఈజిప్షియను ప్రభావం వీళ్ళ పనిలోకి రావడం చూసి చింతగా కూడా ఉండేది. కాని కార్ల్ వాట్ అది చూసి ఆశ్చర్యపోయాడు. ఆఫ్గనిస్తాన్ లో పషాయి తెగకీ, పాకిస్తాన్ లో కలాశ్ అనే తెగకీ చెందిన పిల్లలదీ, ఇక్కడ ఈ కోలాం పిల్లలదీ పెయింటింగు శైలి ఒక్కలానే ఉందని చెప్పాడు.’
‘ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కణ్ణుంచి హాండ్ మేడ్ పేపరు పట్టుకొచ్చాడు. నా కోసం ఒక కెమేరా కూడా తీసుకొచ్చాడు. ఆయన తిరిగొచ్చాక మేం పిల్లలతో కలిసి మళ్ళా చాలా పెయింటింగ్ వర్క్ చేసాం. చిప్కో ఉద్యమం మీద వాళ్ళతో పనిచేయించాం. వాటిల్లోంచి కొన్ని బొమ్మలు తీసుకెళ్ళి ఆయన తన యూనివెర్సిటీకి వెళ్ళాక ఒక సెమినార్ ఏర్పాటు చేసాడు. మేము కూడా ఈ పిల్లలతో రూపొందించిన పెయింటింగ్సు ఒక వెయ్యి ప్లేట్లు హైదరాబాదులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అది చాలా బాగా జరిగింది.’
‘అలా బరోడాలో మళ్ళీ నా పని మొదలయ్యింది, అప్పటికి ఏడాదిన్నరా, రెండేళ్ళు గడిచిపోయాయి. అక్కడ గుజరాత్ లో గొడవలు మొదలయ్యాయి. నవనిర్మాణ్ ఆందోళన. కాలేజీలు బందైపోయాయి. నేనొక వెదురుపొద దగ్గర కూచునేవాణ్ణి, అక్కడే పనిచేసుకునేవాణ్ణి. బరోడాలో జీవితం చాలా ఆనందంగా ఉండేది. రోజూ మధ్యాహ్నం మూడు దాటాక కొందరు లెక్చెరర్లూ, కొందరు విద్యార్థులూ కూడా ఆ వెదురుపొదల దగ్గరకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి నేను మహాభారత కథ చెప్పేవాణ్ణి. అలా కొన్ని నెలలపాటు చెప్పాను. రోజూ మూడింటినుంచి అయిదింటిదాకా మహాభారతం నడిచేది. ఆదివారాలు హాస్టల్లో కథ చెప్పేవాణ్ణి. మెస్ లో అన్నం తిని లాబీలో కూచుని కథ చెప్తుంటే మొత్తం లాబీ కిక్కిరిసిపొయ్యేది. మహాభారతంతో పాటు మరెన్నో కథలు కూడా చెప్పేవాణ్ణి. చేతిలో డబ్బులుండేవికావు, కానీ చాలా బావుండేదప్పుడు.’
‘ఆ తర్వాత నా దగ్గర అస్సలు డబ్బుల్లేకుండా పోయాయి. రెండుమూడు నెలలు నేనో చెట్టుకింద దిమ్మరిలాగా అడ్డా తెరిచాను. కాంపస్ లో చుట్టుపక్కల చాలామంది లెక్చరర్లు ఉండేవారు. వాళ్ళంతా మెల్లమెల్లగా రావడం మొదలయ్యింది. అక్కడ కూడా కథల ముచ్చట్లు నడుస్తుండేవి. ఒక మంచి వాతావరణం ఏర్పడింది. వాళ్ళు ‘మీకు టీ తాగాలనిపిస్తే చెప్పండి’ అనేవారు, లేదా ‘మీ కోసం మేము ఆంధ్రా టిఫిన్ తయారుచేసాం, దోశలు వేసాం, పదండి’ అనేవారు. దాంతో తినడానికి, తాగడానికి అక్కడ వసతి జరిగిపోయింది.
నేనో రోజు కూచుని పని చేసుకుంటూ ఉండగా, ఒకాయన వచ్చాడు, గుండు, పెద్ద పెద్ద చెవులు. వచ్చి చేతులు జోడించి నా ఎదట కూచున్నాడు. ఏమిటని అడిగాను. ‘మహరాజ్, మా ఇంట్లో భోజనానికి రండి’ అన్నాడు. ఏమిటన్నాను. ‘మా నాన్నగారు చనిపోయారు. పదమూడో రోజు కార్యక్రమం. భోజనానికి రండి’అన్నాడు. సరే వస్తానని చెప్పాను. చూద్దాం, అక్కడ వంటలెలా ఉంటాయో అని వెళ్తే వాళ్ళు నాకు కాళ్ళు కడిగి కూచోబెట్టి ఇంత గిన్నె నిండా నెయ్యి, పప్పు, చాలా చక్కటి భోజనం పెట్టారు. నేను అన్నం తినడం పూర్తవగానే అతను దక్షిణ తీసుకుని నిలబడ్డాడు. నేను భోంచేసాను కదా, దక్షిణ తీసుకోను అన్నాను. మీరిది తీసుకోకపోతే నాకు పుణ్యమెలా దక్కుతుందన్నాడు. అని యాభై ఒక్క రూపాయలు నా చేతుల్లో పెట్టాడు.
బయటకు రాగానే అక్కడొక తెలుగు సంఘం ఉండేది. రెండువేలదాకా తెలుగు కుటుంబాలుండేవక్కడ. ఆ సంఘం వాళ్ళొచ్చారు. ‘మెంబరవ్వండి, మెంబరవ్వండి ‘అంటూ. ‘సరే, చేసేయండి మెంబర్’ అని ఆ డబ్బులు వాళ్ళకిచ్చేసాను. అక్కడ కూడా ఈ రెడ్లకీ, రావులకి మధ్య పెద్ద గొడవలు నడిచేవి. ఆ రెడ్డే ప్రెసిడెంటుగా ఎందుకవ్వాలి, ఈయన ఎందుక్కాడు- ఇదే గొడవ అక్కడ కూడా ఉండేది. నేను చాలా రోజులదాకా తెలుగు మాట్లాడేవాళ్ళ మధ్యలోనే ఉన్నాను. తర్వాత అనిపించింది, ‘వీళ్ళ మధ్యనే ఉంటే ఏమీ చూడలేం, వినలేం. ఏమీ అర్థం చేసుకోలేం. గుజరాతీ ఎప్పటికీ మాట్లాడలేం’ అని వారి నుండి దూరంగా వచ్చేసాను. ఆ తర్వాత గుజరాత్ అంతా తిరిగాను, చూశాను. గుజరాతీ విషయాలు చాలా అర్థం చేసుకున్నాను. లేకపోతే తెలుగువాళ్ళ మధ్యలోనే ఉండిపోతే ఏమీ చూడలేకపోయేవాణ్ణి.
ఒకరోజు మెస్‌లో అన్నం తినడానికి కూర్చున్నాను. అన్నం తినడానికి కూర్చుంటే ఆంధ్రా పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు తెలుగులో నన్ను చాలా తిడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. తిడుతున్నారు. నేను వింటూ ఉన్నాను, వింటూ ఉన్నాను. వింటూ వింటూ, మూడు నాలుగు రోజులు గడిచిపోయాయి. ఇంతలో రమేష్ అనే అబ్బాయి వచ్చాడు, ఆయన నాతో తెలుగు మాట్లాడటం ప్రారంభించాడు. నేను కూడా అతనితో తెలుగు మాట్లాడగానే వీళ్ళు ఎంత కంగారు పడిపోయారంటే,’మీకు తెలుగు వచ్చా?’ అని అడిగారు. అవునన్నాను, ‘నాలుగు రోజుల నుండి మీ మాటలు వింటున్నాను. మీరిక్కడ కూచుని వాగుతున్న చెత్తంతా వింటూనే ఉన్నాను’ అని చెప్పాను.
ఒకసారి కాలేజీలో పెద్ద చర్చ నడిచింది. నేనైతే ధోతీ కట్టుకునే ఉండేవాడిని. ఒకరోజు నేను చెట్టు పక్కన కూర్చొని ఉన్నాను. మహేంద్ర పాండ్యా, పాంచాల్ వగైరా ఒక ఇనుప దిమ్మ లాంటిది ఉంటే దానిమీద కూచుని ఉన్నారు. శ్యామ్ చోయిందా అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు మెల్లగా వీళ్ళనడిగాడు, ‘సార్, శర్మాజీ ఎగ్జామ్ రాస్తారా ఈ ఏడాది’ అని. ‘ఏం? రాస్తారు? ఎందుకు రాయరు?’ అనడిగారు వీళ్ళు. ‘లేదు, ఆయన తన పని పూర్తి చెయ్యలేదు కదా’ అని అన్నాడు. ‘పనైతే పూర్తికాలేదు. కానీ ఎగ్జామ్ రాయడానికి పర్మిషనిస్తారు. ఏముందందులో? ‘ అన్నారు. ‘పని పూర్తి కాకుండా ఎలా’ అనడిగాడతను. అప్పుడు వాళ్ళొక మాటన్నారు: ‘చూడు శ్యామ్ , ఏ మనిషి అయితే ఈ వాతావరణంలో’, అక్కడంతా ఇంగ్లిషు వాతావరణమే ఉండేది, ‘ ఈ వాతావరణంలో కూడా ధోతీ కట్టుకుని, నుదుట తిలకం పెట్టుకుని ఉన్నాడో, అతని విల్ పవర్ ఏమిటో తెలుస్తోంది కదా, ఏ రోజు చెయ్యాలనుకుంటే, ఆ రోజే పూర్తిచేసేస్తాడు తన పని. దాని గురించి నీకెందుకు చింత?’ అని అన్నారు ఆ లెక్చరర్లు. ‘వీళ్ళకే ఇంత నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు చెయ్యలేను’ అనుకున్నాను. ఆ పని పూర్తిచేసేసాను. ఒకటి కాదు, చాలా పనులు పూర్తి చేసేసాను. ఒకసారి ఈ సంగతి బోధపడ్డాక ఇరవై రోజుల్లో ముప్ఫై రెండు అసైనుమెంట్లు పూర్తిచేసేసాను!’
‘అక్కడ మెటల్ కాస్టింగ్ ఇటాలియన్ ప్రాసెస్ లో జరిగేది. అది అయిదురోజుల కార్యక్రమం. ముఫ్పై ఆరుగంటల పాటు బట్టీ మండుతుండాలి. తర్వాత దాన్నొక రోజు వదిలెయ్యాలి. ఆ తర్వాత అయిదో రోజు కాస్టింగ్ జరుగుతుంది, అంటే పోత పోస్తారు. కాని మేం చేసే పని అయిదు గంటల్లో పూర్తిచేసేసేవాళ్ళం. నేనైతే ఈ టెక్నిక్కులన్నీ అప్పటికే నేర్చుకుని ఉన్నాను కదా. అంత పెద్ద పని, ఆ పోతపొయ్యడం, అయిదుగంటల్లో చేసి చూపించాను. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అప్పణ్ణుంచీ నేను చూపించిన పద్ధతిలోనే కాస్టింగ్ మొదలుపెట్టారు.’
‘ఈ దేశీయ పద్ధతి చాలా సులువైన పద్ధతి. బట్టీ పెట్టడం, కాలడం, మైనం కరిగిపోవడం, ఇత్తడి కరిగించడం, పోత పోయడం- మొత్తం అయిదారుగంటల్లో అయిపోయేది.’
‘నేను మూసలు మట్టితో చేసేవాణ్ణి. వాళ్ళు ప్లాస్టరు తో చేసేవాళ్ళు. ప్లాస్టరు, ఇటుకపొడి లాంటివన్నీ కలిపి చెయ్యడంతో ఆ మూసలు చాలా బరువుగా ఉండేవి. అవి కాలడానికి ముప్ఫై ఆరుగంటలు పట్టేది. అందులో ఉన్న మైనం కరగడానికి అంత సమయం పట్టేది. ఆ తర్వాత రాంత్రిబగళ్ళు కట్టెలు పెట్టి దాన్ని ఇరవై నాలుగు గంటలు తగలబెట్టాల్సి వచ్చేది. వాళ్ళేమనుకునేవారంటే, హిందుస్తానీ పద్ధతిలో పెద్దకాస్టింగు అవదని. ‘హిందుస్తానీ పద్ధతిలో పెద్ద కాస్టింగ్ ఎందుక్కాదు? పెద్ద పెద్ద ఫిరంగులు పోతపోసారు కదా, వాటినిక్కడే తయారు చేసారు కదా, అవేమీ ఇటలీనుంచి రాలేదే. ఇక్కడ పోతపోసే తయారు చేసారు కదా ‘ అనే వాణ్ణి నేను.’
‘నటరాజ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, తొమ్మిది, తొమ్మిది అడుగుల విగ్రహాలు ఇక్కడ తయారు చేసినవే కదా, బయటినుంచి వచ్చినవి కావు కదా, నేనా పద్ధతులన్నీ అప్పటికే తెలుసుకుని ఉన్నాను. అవెలా తయారు చేస్తారో, ఎలా పోతపోస్తారో, ఆ మెలకువలన్నీ.’
5-6-2026


ఎక్కడా ఆపకుండా చదివాను. ధన్యవాదాలు
ధన్యవాదాలు మేడం!
మమ్మల్ని వేలు పట్టి ఏదో ఒక గొప్ప లోకం లో సంచారం చేయిస్తున్నారు.. మొత్తం చదివేటప్పటికీ ఒక ట్రాన్స్ లో ఉండి బయటకి రావడానికి చాలా కష్టం అవుతోంది.
“కొత్తగా సృష్టించాలంటే పాతదంతా వదిలేస్తుంది. మనం పాతవిషయాలన్నీ మనసులో నింపుకుని కొత్తగా ఏం నేర్చుకుంటాం, ఏం చేస్తాం? అందుకని అంతా మర్చిపోవడం మంచిది. ఇన్ని విద్యలు నేర్చుకున్నాం, ఇంత పని నేర్చుకున్నాం- ఇవన్నీ మర్చిపోవాలి.”
గురూజీ చెప్పింది నిజమే ఇప్పటి వరకూ నేర్చుకున్న కొన్ని విషయాలు మర్చిపోతేనే ఉత్తమం.. నేను ఇంతకు మునుపు ఒక ప్రసంగం లో ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఉపనిషత్ వాక్యాన్ని విశ్లేషిస్తూ.. మనం నేర్చుకున్న ఎన్నో సంగతులను , అంటే విజ్ఞానాన్ని వయసు పెరిగే కొద్దీ, జ్ఞాన సముపార్జన జరిగే కొద్దీ unlearning ప్రక్రియతో వదిలేసినప్పుడు మిగిలేది ప్రజ్ఞానం అని చెప్పిన సంగతి గుర్తొచ్చింది.. మీ వాక్యాలు ఈ చేయించి దానికి దగ్గరగా ఉండడం నాకు భలే ఆనందంగా అనిపించింది
“మనం పుట్టినప్పణ్ణుంచీ, జీవితంలో చాలాకాలందాకా నేర్చుకోడం మీదనే దృష్టి పెడుతూ ఉంటాం. ఆ ఆరాటంలో మనకి మనం నెమ్మదిగా దూరంగా జరుగుతూ ఉంటాం. అందుకని మిస్టిక్కులు unlearning అవసరమంటారు. మనమీద కాలం, దేశం, సమాజం వదిలిపెడుతూ వచ్చిన ముద్రలు చెరుపుకోవలసిన అవసరం గురించి చెప్తుంటారు. మన అలవాట్లనుంచీ, నిశ్చల నిశ్చితాల నుంచీ, నీరసతథ్యాల నుంచీ బయటపడాలని చెప్తారు. Unlearning అనే మాట ఇరవయ్యో శతాబ్దం ద్వితీయార్ధంలో యూరోపులో పుట్టినప్పటికీ, దాని మూలాలు డావోయిజంలోనూ, జపనీయ జెన్ బౌద్ధంలోనూ ఉన్నాయి. ”
We are be becoming better Individuals While reading these Conversations. Thank You Very Much Once Again..
మీరు చదువుతుండడం నా భాగ్యం.
మన్నించాలండి. ఈ Unlearning అనే తాత్త్విక భావనకు మూలం భగవద్గీత యందే గోచరమౌతున్నదని నాఅభిప్రాయం. “సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ” అన్న భగవద్వాక్యం లోనే ఈభావన దాగి ఉన్నది. ఆచరణలో శ్రేష్ఠత్వం ధర్మాచరణతోనే సాధ్యమై, ఆధర్మాచరణకు వివేకమూ, దానికి విజ్ఞానమూ ప్రాతిపదికలుగా ఉండటం కారణంగా ఈ విజ్ఞానమూ ధర్మమూ అనేవాటిని కూడా అంటిపెట్టుకోవటమూ బంధమే కాబట్టి కేవలం నన్నే ఆశ్రయించమని భగవానువాచ. ఇక్కడ భగవానుడు ప్రజ్ఞానస్వరూపి ఐన బ్రహ్మమే. అంటే బ్రహ్మవేత్తవై బంధాలను వదలమని. అందువలన ఇదేదో సనాతనధర్మానికి ఆవల జనించిన కొత్తభావన కాదు.
వీరభద్రుడు గారు అన్నట్లు సర్వ ధర్మాన్ పరిత్యజ్య , unlearning వేరు వేరు అంశాలు.
అయితే అద్వైత సిద్ధాంతం కొంతమేరకు unlearning గురించి చెబుతుంది అనిపిస్తుంది. అంటే కర్మలు, ఉపాసనలు ఇలాంటివి ఒక స్టేజి తరువాత వదిలేయవలసి ఉంటుంది అని చెబుతుంది.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
అనుభూతి అనుభవాన్ని ఆకృతిగా మార్చడమే కళ !
సమాధానం దొరికింది.
ఆయనతో పాటు ఇలా ప్రయాణం చేయడం నిజంగా ఒక భాగ్యం .. ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఒక మంత్రమయ లేక విహారంలా ఉంది చదువుతుంటే . చేసింది చెప్పడంలో సగం కరిగిపోతుంది . ఒక అనుభవాన్ని ఆనందించాలంటే అలాంటి అనుభవం మనకు కలగాలి . ఇవి వింటుంటేనే ఇొమత ఆనందంగా ఉంది . అనుభవించిన ఆయన ఎంతటి కళాపూర్ణులో . మీ గ్రంథం మరో కళాపూర్ణోదయం . మీకు నమస్సులు .ఆయనకు జోహార్లు. మిడిమిడి జ్ఞానంతో నేను మీగురించి మళ్లీ ఒకసారి వచ్చి వివరాలు సేకరించి రాస్తాను అన్నాను . ఆయన నవ్వి సరే అలాగే అన్నారు . నాకు ఆ అవకాశం రాలేదు . కానీ మంచిదయింది . దానికి ఎంతటి అర్హత కావాలో ఇన్నాళ్లకు అర్థమౌతుంది.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!