శ్రీరామ్!

నిన్న పొద్దున్న శివ రాచర్ల వాల్ మీద వెలమూరి శ్రీరామ్ ఫొటో చూస్తూనే, మనసు ఏదో కీడు శంకిస్తుండగా, అక్కడ ఏమి రాసి ఉందా అని చదివాను.

నమ్మలేని వార్త. నమ్మకూడని వార్త.

నా జీవితంలో వెలమూరి శ్రీరామ్ వంటి వ్యక్తుల్ని అతి కొద్ది మందిని మాత్రమే చూసాను. హృదయం ఉండవలసిన చోట ఇంత వెన్నముద్ద పెట్టుకుని తిరిగిన అపురూపమైన మనిషి ఆయన.

1998-99 నాటి మాట. నేనప్పుడు శ్రీశైలంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నాను. చెంచువారి కోసం పనిచేసే ఆ ప్రాజెక్టు పరిధిలో ఆరు జిల్లాలున్నప్పటికీ, దోర్నాల మండలం, యెర్రగొండపాలెం మండలాల్లో ఉండే చెంచువారి జీవనస్థితిగతులు నాకెప్పటికీ కొత్త సవాళ్ళు విసురుతూనే ఉండేవి. వారి అభివృద్ధి కోసం పనిచెయ్యవలసిన సంస్థ అధికారిగా విద్యాధికారుల్నో, వైద్యాధికారుల్నో కలవవలసి ఉండటం వేరు. కానీ రోజూ ఫారెస్టు అధికారుల్నో, పోలీసు అధికారుల్నో, ఎక్సైజ్ అధికారుల్నో కలుసుకోవలసిన అవసరం పడుతుండటం వేరు. అటువంటి పరిస్థితుల్లో ఆ శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడటమే ఒక ఛాలెంజిగా ఉండేది. వాళ్ళకి చెంచు వారి పట్ల ఉండే prejudices ని పదే పదే వినవలసి రావడమూ, వారికి పదే పదే clarify చెయ్యాల్సి రావడమూ రెండూ కూడా చాలా విసుగ్గా, ఒంట్లో ఓపిక తోడేసేటంత కష్టంగానూ ఉండేవి. అలాంటి రోజుల్లో దోర్నాలకి ఒక కొత్త ఎస్సై వచ్చారనీ, ఆయన చాలా సానుకూలంగా మాట్లాడుతున్నారనీ ముందు చెంచువారి ద్వారా విన్నాను, తర్వాత మా క్షేత్ర స్థాయి అధికారులద్వారా విన్నాను. అంతలోనే ఆయన్ని కలవాల్సిన అవసరం కూడా వచ్చిపడింది.

ఒక చెంచుగూడేనికి సంబంధించిన ఏదో తగాదా, ఏదో తగాదా అంటే, పెద్ద తగాదేనే, ఒక చెంచు మరొకడిపైన అంబులు ఎక్కుపెట్టి గాయపర్చడం లాంటి సంఘటన. మామూలుగా అయితే ఆ చెంచుని హత్యానేరం కింద న్యాయస్థానాలకు పట్టుకు పోయి ఉరిశిక్ష వేయించినా కూడా ఆ సంగతి ఎవరూ పట్టించుకుని ఉండేవారు కాదు. కానీ ఈ కొత్త పోలీసు అధికారి ప్రజల కష్టసుఖాలు చెవొగ్గి వింటున్నాడని విన్నాను కాబట్టి నాకు తెలిసిన సమాచారం నేనే పోయి చెప్తే ఆయన ఈ కేసును సానుకూలంగా పరిశీలించగలడనిపించింది.

నాకు బాగా గుర్తు. నేనేవో చెంచుగూడేలకు పోయి రాత్రి ఏడున్నరా ఎనిమిదిగంటల టైములో పోలీసు స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ చూసాను మొదటిసారి శ్రీరామ్ ని. ఆయన నా గురించి చాలా విన్నానని, అది కూడా ఉద్యోగపరంగా కాదు, సాహిత్యపరంగా అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఆ పోలీసు స్టేషన్ లో పోలీసు దుస్తుల్లో ఉన్న ఒక యువకుడు చలం గురించీ, బుచ్చిబాబు గురించి మాట్లాడుతుంటే, మరీ ముఖ్యంగా, అప్పటి నా మానసిక పరిస్థితిలో ఎలా ఉండి ఉంటుందో మీరూహించగలరు.

ఆ తర్వాత చాలా కాలం, దూరం మా మధ్య తెచ్చిన మౌనాన్ని ఫేస్ బుక్ మాధ్యమం బద్దలుకోట్టేసింది. 2018 లో నేను బ్లాగు తెరిచిన తరువాత, ప్రతి రోజూ ఆ బ్లాగుని సందర్శిస్తూ వచ్చిన అతికొద్దిమందిలో శ్రీరాం పేరే మొదటిసారి చెప్పాలి.

‘నా మార్నింగ్ వాక్ లోనో, జిమ్ లోనో లేదా ప్రయాణాల్లోనో మీ మోహన రాగం ప్రసంగాలు వింటూ గడవని రోజులేదు. మీరు హేమంతం మీదా శరత్తు మీదా మాట్లాడిన ప్రసంగాలు మొత్తం అప్పచెప్పగలను’ అని అన్నారాయన . 2024 లో నా పుట్టినరోజు సందర్భంగా ఆయన తన వాల్ మీద రాసిన మాటలు నిష్కారణంగా కురిపించిన తేనె. ‘కనీసం రోజుకి ఒక గంటసేపు ఆయన వెబ్ సైట్లో విహరించడం ఉదయం పూట నడకలో కనీసం ఒక గంట ఆయన ప్రసంగాలు వినడం నేను చేసుకున్న అనేక అనేక అదృష్టాల్లో ఒకటి’ అని రాసారక్కడ.

కానీ ఆయనిలాంటి ప్రేమాభిషేకం నా ఒక్కరికే చేసారనుకుంటే పొరపాటు. నిన్న ఒంగోల్లో ఆయన పార్థివదేహానికి వీడ్కోలు పలకడానికి కనీసం పదివేలమంది వచ్చి ఉంటారని శివ రాచర్ల రాసారు. సాహితీకారుల్నీ, ఉన్నతాధికారుల్నీ, సినిమా ప్రముఖుల్ని ఆత్మీయంగా పలకరించేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ ఒక హోం గార్డుని కూడా అంతే ఆత్మీయంగా పలకరించే మనిషి ఆయన. ఉద్యోగంలోనూ, జీవితంలోనూ మనుషుల హెచ్చు తగ్గులు చూడనివాడు. పైపై మాటలు మాట్లాడనివాడు. అసలు మాటల్తో పని కూడా లేదు ఆయనకి. ఒక్కసారి మనతో కరచాలనం చేస్తే చాలు జీవితాంతం ఆ స్నేహస్పర్శ మర్చిపోలేం.

రెండు సార్లు నేనాయన్ని కలుసుకునే అవకాశం లభించింది. నాలుగేళ్ళ కిందట పొదిలిలో నాయని సుబ్బారావుగారిని స్మరించుకోడానికి సాయి పాపినేని గారితో కలిసి వెళ్తున్నప్పుడు ఒంగోలులో కలిసాం. మూడేళ్ళ కిందట గుండ్లకమ్మ లోయలో పురావస్తు పరిశోధనలు చేస్తున్న బృందాన్ని కలుసుకోడానికి సాయిపాపినేనిగారితో కలిసి వెళ్ళాను. అప్పుడు మేము పామూరులో ఒక హోటల్లో ఉన్నాం. శ్రీరామ్ ఆ హోటల్ కి వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మాతో పాటు తాను కూడా ఆ పరిశోధనలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. ఆ మధ్యాహ్నం మేము తిరుగుతున్న ప్రాంతంలో భోజనం దొరకడం కష్టం. అటువంటిది శ్రీరామ్ ఎవరితోనో మాట్లాడి ఒక చిన్న హోటల్లో పెద్ద విందు ఏర్పాటు చేయించారు.

అసలు ఆ రోజంతా ఆయన నన్ను తన వెహికిల్ లోనే కూచోబెట్టుకున్నారు. ఆయన వృత్తిరీత్యా అప్పుడు ఇంటలిజెన్సు లో పనిచేస్తున్నారు. ఆ వెహికిల్ లో వైర్ లెస్ పదే పదే మోగుతూనే ఉండేది. ఆ సాయంకాలం ఆ ప్రయాణంలోనే ఆయన పై అధికారుల్తో ఒక టెలి కాన్ఫరెన్సు లాంటిది కూడా జరిగింది. కానీ ఆ రణగొణధ్వనిమధ్యనే ఆయన నాతో సాహిత్యం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కూంబింగ్ గురించీ, ఎన్ కౌంటర్ల గురించీ, నక్సలైట్లకీ ప్రభుత్వానికీ మధ్య జరిగే పోరాటం గురించి ఆ అరగంటలోనే ఆయన నావెన్నో సందేహాలు నివృత్తి చేస్తూనే ఉన్నారు.

ఒక పోలీసు స్టేషన్ ఎలా పనిచేస్తున్నదో చూడాలని అంటే, మేము పామూరు రాగానే, ఆయన ఆ ఊళ్ళో పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్ళారు. అక్కడ ప్రతి ఒక్క విభాగం గురించీ కూలంకషంగా వివరించారు. కానీ నన్ను ఆకట్టుకున్నది అక్కడ ఆయన తన సహ పోలీసు ఉద్యోగుల్ని పలకరించిన తీరు, వాళ్ళీయన్ని పలకరించిన తీరూను. వాళ్ళ మధ్య కుటుంబసభ్యుల్లో ఉండే ఆత్మీయత కనిపించింది నాకు.

మేము తిరిగి వచ్చాక ఆయన నాకు ఒక బుట్టెడు ఉలవపాడు మామిడిపండ్లు పంపించారు. ఆ పండ్లు తిన్నంతసేపూ తాను నాకు గుర్తొస్తానని అన్నారు. కానీ ఇక మీదట ఉలవపాడు మామిడిపండు అనే మాటవినగానే వెలమూరు శ్రీరాం అనే మాట నాకు జీవితమంతా గుర్తొస్తూనే ఉంటుందని చెప్పగలను.

ఈ మధ్యనే ఎప్పుడో ఒకరోజు హటాత్తుగా ఫోన్ చేసి తనకి డి.ఎస్.పి గా ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. చాలా సంతోషమనిపించింది. ఇంకా సర్వీసు ఎంత ఉందీ, ఎస్.పి అయ్యే అవకాశాలు ఎంతున్నాయి లాంటివేవో మాట్లాడుకున్నాం కూడా.

శ్రీరామ్ ! మీకు నివాళి అనే మాటలు రాయలేకపోతున్నాను. మిమ్మల్ని దోర్నాల్లో కలుసుకున్న పాతికేళ్ళ తరువాత మళ్ళా అకస్మాత్తుగా ఎలా కలుసుకున్నామో అలానే మళ్ళా కలుసుకుంటామని ఆశగా ఉంది. మంచి మనుషుల్ని తలుచుకునే కొద్దీ ఆనందం అధికమవుతుందని గురజాడ తన డైరీలో ఒకచోట రాసుకున్నాడు. మిమ్మల్ని ఎప్పుడు తలుచుకున్నా ఒక నిజమైన మనిషిగా, ఒక స్నేహమయస్వభావుడిగా, ఒక సాహిత్యపిపాసిగా మా తలపుల్ని సదా సంతోషమయం చేస్తూనే ఉంటారు. ఇన్నాళ్ళూ ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇప్పణ్ణుంచీ నా హృదయంలోనే ఉంటారు.

12-6-2026

7 Replies to “శ్రీరామ్!”

  1. ఆయనతో పరిచయం లేదు కానీ ఆయన గురించి చాలమంది వివిధ సామాజికమాధ్యమాల్లో చెబుతూంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి సర్.

    తురగా కృష్ణకుమార్

  2. ఎంత గొప్ప వ్యక్తి!! తన వృత్తినీ, ప్రవృత్తినీ ఎంత బాగా మేళవించుకున్నారో!!

  3. ఎందుకు మానవత్వం ఉన్న ఉన్నత వ్యక్తి ఆయుష్షు ఇంత త్వరగా !😭 .నేటి సమాజానికి కావల్సిన వ్యక్తులు. మంచిని పెంచి, పంచే వారు. నేను FB లొ చూడటం ! చూసి, ఆత్మీయులైన శ్రీ రామ్ గారిని శారీరకంగా పోగొట్టుకున్నాం. మీరు రాసినట్లు మనస్సుల్లొ శాశ్వతంగా ఉంటారు. 🙏🙏🙏😭

  4. మీ హృదయపు పూదోటలో పరిమళించే .. శ్రీరామ్ గారి పవిత్ర ఆత్మ కు..ఘన నివాళులు..

  5. అరుదైన మనుషుల అపురూప మనసు ప్రేమమయం, మీ రాతలోని ఆర్ద్రత అచ్చు నవనీతంలా, నమస్సులు మాష్టారూ 🙏.
    శ్రీ రామ్ గారికి నివాళులు 🌺🌺🌺

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading