జీవన శిల్పి-3

గురూజీ ఇంకా చెప్పడం కొనసాగించారు. ‘దూద్ రాం నాయన రామచందర్. ఆయన గొప్ప కళాకారుడు. బాగా బలిష్టుడైన మనిషి. గట్టీ కుస్తీ సాధన చేసినవాడు. కుమ్రం భీం లడాయీలో తాను కూడా పాల్గోవాలని వెళ్ళాడు. కాని జోడేఘాట్ దగ్గరికి చేరుకునేటప్పటికి కుమ్రం భీం మరణించారని తెలిసింది. ఇక వెనక్కి వచ్చేసాడు. చాలా గట్టి మనిషి, బలశాలి, గొప్ప పనిమంతుడు.’

‘నేనొక రోజు ఆయనతో కొన్ని వస్తువులు తయారుచేయించాను. అవి పోతపోసినప్పుడు ఎంత సుందరంగానో వచ్చాయి. కానీ పోత పోస్తున్నప్పుడు బీటలువారాయి. ఆ పోత అంతా ఒక్కసారిగా పగిలిపోయింది. కాని అవి చూడ్డానికైతే  చాలా అందంగా ఉన్నాయి. ‘కాకా, ఇవి చూడ్డానికి నాకు చాలా అందంగా కనిపిస్తున్నాయి. వీటిని నేను అట్టేపెట్టుకుంటాను’ అని అన్నాను. కానీ ‘గురూజీ, ఇవి ఎవరన్నా చూస్తే ఓజాల జాతి గౌరవం పోతుంది’ అని ఒక సుత్తి తీసుకుని ఆయన వాటిని ఫటాఫట్ పగలగొట్టేసారు. ‘వీటిని చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారు? ఏ బేవకూఫ్ ఓజా వీటిని చేసిచ్చాడు మీకు అనరా? దానివల్ల ఓజా గౌరవం పోతుంది. అందుకే నేను వీటిని మీకివ్వాలనుకోవడం లేదు’ అని వాటిని పగలగొట్టేసి ఆ తర్వాత మళ్ళా వేరే వస్తువులు తయారు చేసి ఇచ్చాడు.’

‘అలా ఉండేవారు ఆ మనుషులంతా. నిశ్చింతగా, ఉల్లాసంగా. ఆయన అప్పుడప్పుడు బైబిలు కూడా చదివేవాడు. ఆయనకి అది ఫాదిరీలు ఇచ్చారు. గీత కూడా చదివేవాడు. రామ్ చందర్ బలశాలి కదా. అందుకని అదీ ఇదీ అన్నీ చేసేవారు. ఒకరోజు నేను అక్కడ కూర్చుని ఉన్నాను. అప్పుడు జుబ్బాలు వేసుకున్న ఫాదిరీలు వచ్చారు. వాళ్ళు ఆయన్ని కూడా మోకాళ్ళ మీద కూచోబెట్టి బైబిలు చదివించారు. ఆ చదవడమయ్యాక , నేనక్కణ్ణుంచి బయల్దేరాను. ‘కాకా, వెళ్ళొస్తాను భాయీ’ అన్నాను. ‘ఈయనెవరు?’ అనడిగారు వాళ్ళు. ‘మా మనిషి’ అన్నారు ఆ ఊరి జనం. ‘ఏం పనిచేస్తుంటాడు?’ అనడిగితే ‘మాలాగా పనులు చేస్తుంటాడు. పోతపనిచేస్తుంటాడు. విగ్రహాలు తయారు చేస్తాడు’ అని చెప్పారు. అప్పుడు వాళ్ళు నన్ను కూడా ‘కూచో, కూచో’ అన్నారు. నేను కూడా ఆ దుప్పటిమీద వాళ్ళ పక్కనే కూచున్నాను.

‘అప్పుడు వాళ్ళు ‘నువ్వు కూడా విగ్రహాలు తయారుచేస్తావా? దేంతో తయారు చేస్తావు?’ అనడిగారు. ‘రాతితో చేస్తాను, కర్రతో చేస్తాను’ అని చెప్పాను. ‘అవునా, అవి తయారుచేసేటప్పుడు, వాటిమీద కూచుని తయారు చేస్తావు కదా, వాటిని కాళ్ళతో పట్టుకుని తయారు చేస్తావు కదా’ అన్నారు. ‘అవును. వాటిమీద కూచునే పనిచేస్తాం. ఒక్కోసారి వాటిమీద ఉమ్ముతాం కూడా. అలాగే నడుస్తుంది మరి’ అని అన్నాను. ‘మరి నువ్వు  దేనిమీద కూచుని పనిచేస్తావో మళ్ళా దాన్నే పూజిస్తావు కదా’ అనడిగారు. ‘అవును. అందరూ అలాగే చేస్తారు. మేము కూడా అలానే పూజిస్తాం’ అని అన్నాను. ‘మరి అలాగ పూజ చెయ్యవచ్చా?’ అని ప్రశ్నించారు. ‘భయ్యా, అలా చేయవచ్చో లేదో మాకు తెలియదు. పెద్దవాళ్ళకు తెలుసు. వాళ్ళు చేస్తారు కాబట్టి మేం కూడా చేస్తుంటాం’ అని అన్నాన్నేను.

అప్పుడు వాళ్ళు నాకు ఉపదేశం ఇవ్వడం మొదలుపెట్టారు. చాలా పెద్ద ఉపదేశమే ఇచ్చారు. నేను కూడా విన్నాను. ఆ తర్వాత మెల్లగా అన్నాను ‘నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా?’.

‘హాఁ అడుగు’ అన్నారు వాళ్ళు.

‘మీరు మతం కోసం బయల్దేరారా లేక మానవత కోసం బయల్దేరారా?’ అనడిగాను.

వాళ్ళు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.

అప్పుడు వాళ్ళు ‘మేం మతం కోసం బయల్దేరాం’ అన్నారు. ‘మానవమతం కోసమైతే ఇవన్నీ వచ్చాయి. కానీ మీరు కేవలం యేసు కోసం వచ్చారు. అవునా, కాదా?’ అని అన్నాను. అప్పుడు చాలా చర్చ జరిగింది. ‘వాళ్ళ దేవుడు చెక్కతో తయారుచేసిన భీమన్న కదా. వాడు ఏమిస్తాడు? మంటలో పడేస్తే కాలిపోతాడు కదా’ అని వాళ్ళంటే, ‘అందులో తేడా ఏముంది? వీళ్ళ దగ్గర ఒక చెక్క ఉంది. మీ దగ్గర రెండు చెక్కలున్నాయి కదా, (అంటే సిలువ అన్నమాట), కాలిస్తే అది కూడా కాలిపోతుంది, ఇదీ కాలిపోతుంది. వీళ్ళు ఒక్క చెక్కనే దేవుడిగా నమ్ముతున్నారు. అది వాళ్ళిష్టం. అలానే నడవనివ్వండి. ఏమవుతుంది?’ అని అన్నాను.

వాళ్ళు వెళ్ళిపోయాక ఆ మొత్తం ఊరిజనమంతా నన్ను సాగనంపడానికి ఏరోడ్రోం దాకా వచ్చారు. ‘గురూజీ, వీళ్ళు రోజూ వచ్చి మమ్మల్నిలానే విసిగిస్తుంటారు. ఈ రోజు మీరు మమ్మల్ని కాపాడారు. లేకపోతే మా ప్రాణాలు తోడేసి ఉండేవారు’ అన్నారు.

ఇలాంటి ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఆ రామ్  చందర్ మొదలైనవాళ్ళ దగ్గర కూడా మేం చాలా పనులు నేర్చుకున్నాం. కానీ ఓజాల్లో ఒక సంగతి గమనించాను. రామ్  చందర్ బలశాలి, ఆయనకు చదవడం కూడా  వచ్చు. మంచి కళాకారుడు. దూద్ రాం శారీరికంగా అంత బలిష్ఠుడు కాడు. కానీ చాలా మంచిమనిషి. అతనికి  చదవడం రాదుగానీ, కబీరు దోహాల్లాంటివి చాలా గుర్తుందేవి. ఆయనకి మనుషుల్తో  అనుబంధాలు పెంచుకోవడం ఇష్టం. స్నేహాలు కలుపుకోవడం ఇష్టం. కానీ దూద్ రాం కొడుకు అటు బలిష్ఠుడూ కాడు, పనిమంతుడూ కాడు, ఇటు మనుషుల్తో కలుపుగోలుతనం పెంచుకునేవాడూ కాడు. వాళ్ళల్లో అంతా రివర్స్ అవుతోంది.’

‘వాళ్ళ తాతలూ గట్రా చదువుసంధ్యలు తెలిసినవాళ్ళు. ఉర్దూ, పార్శీ చదివేవారు. గోండుల్లో వాళ్ళు ముకాశీలుగా, అంటే, గ్రామపెద్దలుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు ఉర్దూ చదువుకుని, ఊరి లెక్కలు తీసుకుని గుర్రాలమీద పట్వారీ దగ్గరికి వచ్చేవారు.’

‘ఆ ముకాశీలకి ఉర్దూ వచ్చు. ఉర్దూ చదవగలరు. వాళ్ళు ఆ సమాజానికి కర్తా, ధర్తా కూడా. గోండుల్లో ఒక పద్ధతి ఉంది. ఒకవేళ ఎవరేనా ఎవర్నేనా చెప్పుల్తో కొడితే, ఆ కొట్టినవాడికి ఏమీ కాదు కాని, ఆ దెబ్బతిన్నవాడికి మాత్రం దిష్టితీస్తారు. వాడికి గుండు చేయించి, ఏదో ఒక పూజలాంటిది చేయిస్తారు. ఆ కార్యక్రమం అంతా ఈ ముకాశీలే చేయిస్తారు.’

‘ఇదేమిటిది’ అనడిగాను మేం వాళ్ళని. దానికి వాళ్ళు మాకో ఉదాహరణ చూపించారు. ఒక ముకాశీ ముందొక రాయి తీసుకొచ్చి దాన్ని మొదట తక్కెడలో తూచారు. దాని బరువు ఎంతో చెప్పారు. అప్పుడు దాన్ని చెప్పుల్తో కొట్టారు. అలా కొట్టాక మళ్ళా దాని బరువు తూచారు. అప్పుడు దాని బరువు పెరిగిపోయింది! ఆ తర్వాత దానికి శుద్ధి చేసారు. దిష్టి తీసారు. ఆ ప్రక్షాళన తర్వాత మళ్ళా దాన్ని తూచి చూస్తే, అప్పుడు దాని బరువు ముందు తూచినప్పటి బరువుతో సరిగ్గా సరిపోయింది!’

‘ప్రక్షాళన తర్వాత ఇలానే జరుగుతుంది’ అని చెప్పారు వాళ్ళు. కాని వాస్తవమేమిటంటే, దెబ్బలు తిన్న తర్వాత మనసులో పుట్టే కోపం, ద్వేషం- ఆ కోపాన్ని ఖతం చెయ్యడానికి ఇదొక పద్ధతి. మనిషి లోపల పగ తీర్చుకునే భావం ఉండకూడదని అలా చేస్తారు. ఈ ప్రాంతంలో వంశపారంపర్య శత్రుత్వమంటూ లేదు. చిన్నప్పణ్ణుంచీ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం కదా, ఇక్కడ పగా, శత్రుత్వాలు మాకెప్పుడూ కనిపించలేదు.’

‘ఎంత పెద్ద జగడమైనా సరే, ఇక్కడ ఎక్కువ రోజులు నడవదు. వేరే చోటైతే  ఆ పగ తరతరాల పాటు కొనసాగుతుంది. కానీ ఇక్కడలా కాదు. ఇక్కడ గొడవపడ్డవాడు ఆ గడప దాటి బయటకు వెళ్ళగానే తాను గొడవపడ్డానన్న సంగతే మర్చిపోతాడు. ఇక్కడ శత్రుత్వం లేదు. ఈ మాతృభూమి వైరభూమి కాదు. అందుకే ఇక్కడ పరస్పర కలహాలూ, వంశపారంపర్య శత్రుత్వాలు లేవు. ఇదంతా ఈ భూమి గుణమే.’

‘ఈ ఇలాకాలో శత్రుత్వం లేదంటే ఇక్కడ పౌరుషం లేదని కాదు. ఇక్కడ గొడవలుపడతారు, పోరాడతారు. కానీ పగ లేదు. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఊషన్న తాత అని ఒక ముసలాయన ఉండేవాడు. ఆయనకు ఒకామెతో పెద్ద గొడవయ్యింది. ‘ఫో, నీ ముఖం చూడను’ అని ఆమె అంటే, ‘ఫో, నేను కూడా నీ ముఖం చూడను, నువ్వు చచ్చిపో ‘ అనేసాడు. ఆమె వెళ్ళిపోయింది. కొన్నాళ్ళ తరువాత ఈయనకు టైఫాయిడ్ వచ్చింది. ఇక్కడ దాన్ని మజ్ఞా అంటారు. ఆ మజ్ఞాకి మందు ఆ ఆడమనిషి మాత్రమే ఇవ్వగలదు. ఊషన్న అనారోగ్యంతో ఉన్నాడనీ,  చచ్చిపోబోతున్నాడని, తెలియగానే ఆమె వెంటనే వచ్చింది. ‘అరే, ఊషన్న, నిన్నెలా చావనిస్తానురా? ఒకవేళ నువ్వు చచ్చిపోతే, నేనెవరితో గొడవపడాలి?’అని అంటూ మందు నూరి, తినిపించి, అతడికి నయమయ్యేలా చూసింది. హ్హ. హ్హ. (నవ్వుతూ) ‘నువ్వు చచ్చిపోతే నాతో గొడవపడేవాడు ఎవడు?’ అనే ఆ స్వభావం ఇక్కడిది.

‘ఇక్కడ ఎవరిలోపలా వైరభావం లేదు. కొన్ని విషయాలుంటాయి, ఎవరినైనా భరించలేకపోవడం అనేది వేరే సంగతి. కాని పగ మాత్రం లేదు. అందుకే ఈ ప్రాంతంలో వంశపారంపర్య శత్రుత్వాల గురించి ఎప్పుడూ వినబడదు. వేరే చోటైతే అవి తరతరాలపాటు నడుస్తాయి కదా. ఇక్కడలాంటిదేమీ లేదు. ఇక్కడి ప్రజల స్వభావం అటువంటిది. ఈ ముకాశీలూ వగైరా అలా  దిష్టి తీసి మనసులో ఉన్న పగ తీసి పారేసేవారు.’

‘ఇక్కడెవరికైనా చెడ్డ కలలు వచ్చాయనుకోండి. ఏదైనా భయంకరమైన కల వస్తే ఎవరికైనా వెళ్ళి చెబితే, ‘అరే, అలాంటి కల మంచింది కాదు, కాని ఈ రోజు ఏం వారం? ఈ రోజు మంగళవారం. మంగళవారం నాడు అలాంటివేమీ కావు. పైగా అది శుభమే అవుతుంది’ అని చెప్పేవారు. ఎప్పుడైనా మనిషి మనసులో కొంచెం అటూ ఇటూ అవుతున్నాడనిపిస్తే మనవాళ్ళు ఇలాంటివి చేసి ఆ పరిస్థితి పూర్తిగా చక్కదిద్దేవారు.’

‘ఇవన్నీ నేనిక్కడ చాందాలో కూర్చుని తెలుసుకున్నవి. ( చాందా అదిలాబాదు కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరు. ఇప్పుడు శివారుగ్రామంగా మారిపోయింది.) చాందా మొత్తానికి మొత్తం చాలా పెద్ద ప్రాంతం. ఇప్పటికి రెండువేల ఏళ్ళ కితం అనుకోండి. నాలుగో శతాబ్దంలో చంద్రపురి అనే పేరుతో పెద్ద కేంద్రం ఉండేది. ఇక్కడ జైనులు చాతుర్మాస్యం గడిపేవారని నమ్ముతారు. వర్షాకాలం ముగిసిపోగానే ఈ అడవి దాటి వెళ్ళేవారు. జైనులు ఎప్పుడూ కాలినడకనే నడిచేవారు. ఇలా జైనులు చాతుర్మాస్యం గడిచే ఈ సంప్రదాయం మాలిక్ కాఫూర్ సమయంలో ధ్వంసమైందని చెప్తారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనానిగా అతడు వరంగల్ మీద దండెత్తే సమయంలో దీన్ని నాశనం చేసి వెళ్ళాడు.’

‘మేము ఏదైనా గ్రామానికి వెళ్తే, దాని ఇతిహాసం గురించి అడిగేవాళ్ళం. ఆ ఊరి ప్రత్యేకత ఏమిటి, దాని చరిత్ర ఏమిటి తెలుసుకోవాలనుకుంటాం. చంద్రపురికి లేదా చాందాకి తనదైన చరిత్ర ఉంది. అదే చిట్టాల్ బోరీ అనే పేరు ఎందుకొచ్చిందంటే, అక్కడ ఇనుము తయారయ్యేది. ఇనుము తయారుచేసేటప్పుడు బయటకి వచ్చే వ్యర్థపదార్థాన్ని చిట్లం అంటారు. ఆ చిట్లం అక్కడ అంతా వ్యాపించి ఉంది. దాని మీదనే గ్రామం వెలిసింది. అందుకే అది చిట్టాల్ బోరీ అయింది. ‘

‘ఇక ఇక్కడ మోరల్ గుట్ట అని ఉంది. అక్కడ మేకులు తయారయ్యేవి. ఇక్కడ చాలా ఊళ్ళు చెట్లపేరుతో ఉన్నాయి. మామిడిచెట్లు ఎక్కువగా ఉండే చోటు మామిడిగూడ. అలాగే యాపల్ గూడ. వేపచెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే అది యాపల్ గూడ. మేడిచెట్లు ఎక్కువగా ఉండే అది మేడిగూడ. ఇలా ఎక్కడ ఏ చెట్లు ఎక్కువగా ఉంటే ఆ చెట్లపేరుమీదనే ఊళ్ళు ఏర్పడ్డాయి. పిప్పల్ ధరీ అంటే పీపల్, అంటే రావిచెట్టు, మీద ఏర్పడిందన్నమాట.’

‘కొన్ని కొండలపేర్ల మీద కూడా ఉన్నాయి. ఇక చంద్రపురి, జైనథ్, జైనథ్ అంటే జైననాథ్, అక్కడ తీర్థంకరుల విగ్రహాలుండేవి. ఇలా నాలుగో, ఐదో శతాబ్దం దాకా ఈ ప్రాంతమంతా జైనులదీ, జైనసమాజానిదీను. పదకొండో శతాబ్దందాకా అనుకోవచ్చు, జైనుల ప్రభావం ఉంది. ఆ తర్వాత ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు బలపడ్డాయి. అప్పటిదాకా ఇక్కడ మొత్తం జైనసమాజమే ఉండేదనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.’

‘ఇక్కడ ఉన్న మందిరాలన్నీ జైనమందిరాలే. జైనమందిరాల్లో గర్భగృహం, అర్ధమండపం, మండపం ఉంటాయి. ఇక్కడి గుడులన్నిటిలోనూ ఇది కనిపిస్తుంది. జైనథ్ మందిరం, సదర్ పూర్ మందిరం, దుర్వాసాంగ్డీ, వెలారా, చనాఖా, ఇంకా సైద్పూర్, సాంగీ, చించుఘాట్, ఝురీ- ఇక్కడ రెండుమూడు వాగులున్నాయి. ధామన్ ఝరీలో గుడి ఉంది. ఇక్కడ ఝురిలో గుడి ఉంది. ఈ గుడులన్నీ నాలుగు, ఐదు శతాబ్దాల్లో కట్టినవి. చాలా విశాలమందిరాలు. ఒకప్పుడు జైనులవి. ఈ ప్రాంతంలో ఊళ్ళన్నీ ఎక్కువగా మూడువైపులా కొండలూ, ఒకవైపు నదీ ఉండేలా చూసుకుని వాటి మధ్య వెలిసాయి. అప్పట్లో అఖాడా వఖాడా నడిచే కాలంలోనే, ఈ మందిరాల్నీ, ఈ రక్షణ అంశాల్నీ అధ్యయనం చేసాను.’

‘ఇక్కడకి వచ్చి చాందాలో  కూచుని విగ్రహాలు తయారు చేసేవాణ్ణి. మొత్తం డ్రాయింగు చేసేవాణ్ణి. స్కెచింగు చేసేవాణ్ణి. దాదాపు నెలన్నర రోజులు అక్కడే గడిపేవాణ్ణి. ఎండాకాలంలో పొద్దున్నే రొట్టెలు మూటగట్టుకుని వెళ్ళిపోయి, తిరిగి, సాయంకాలానికి వచ్చేవాణ్ణి. శిల్పకళ అధ్యయనం అక్కడ చాలా బాగా చేసాను. ‘

‘హైదరాబాదులో చదువంతా ఆధునిక విద్య. ఆ చదువులో మొదట రెండేళ్ళలో అంతా కలిసే ఉండేది. ఆ తర్వాత నేను శిల్పకళ అంశం ఎన్నుకున్నాను. అందులో స్టిల్ లైఫ్ చేయడం, లైఫ్ స్టడీ, కాంపొజిషన్ మొదలైనవన్నీ ఉండేవి. మోడల్ ని నిలబెట్టి వాడి బొమ్మ తయారుచెయ్యడం, లేదా కొన్ని వస్తువులు చూసి బొమ్మలు గియ్యడం, ఇవన్నీ ఆధునిక చదువుల పద్ధతులు. మళ్ళీ క్రియేటివ్ వర్క్ పేరుతో ఏదో ఒకటి చేయడం, సృజనాత్మకంగా పనిచేయడం.’

‘హైదరాబాదులో చదువుకునేటప్పుడు, మా లెక్చరర్లు, ఉస్మాన్ అహ్మద్ సిద్దిఖీ, మార్తాండరావు కులకర్ణి, ఎక్కా యాదగిరిరావు, షేక్ పీరాన్, నేను వెళ్ళగానే గంటా గంటన్నర పాటు ముచ్చట్లు పెట్టేవారు. నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినేవారు. మా ముచ్చట్లు ముగిసాక పని మొదలు పెట్టేవాళ్ళం.’

అంటే విద్యార్థి చెప్పే ముచ్చట్లు వినడానికి గురువులు కనిపెట్టుకుని ఉండేవారన్నమాట! బాగానే ఉందే అనుకున్నాను. గురూజీ ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకో సంగతి గుర్తొచ్చింది. ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాల కోసం అర్హుల్ని ఎంపికచేసే కమిటీ సమావేశం జరుగుతోంది. ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. అందులో కళారంగంలోపురస్కారానికి గురూజీ పేరు ప్రతిపాదించాను. కానీ ఒకామె నాకు అడ్డుపడి ఆయనకి ఆ అవార్డు ఇవ్వకూడదని వాదిస్తూ ఉంది. ఇంతకీ ఆమెకి గురూజీ అంటే ఎవరో తెలీదు. బహుశా ఆ అవార్డుకోసం మరొక మనిషి ఆమె మనసులో ఉండి ఉండవచ్చు. కానీ ఆ రోజు యెక్కా యాదగిరిరావుగారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. ఆయన నా ప్రతిపాదనని చాలా బలంగా సమర్థిస్తూ గురూజీ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పడం నాకు గుర్తొచ్చింది.

గురూజీ ఆ ముచ్చట్లింకా కొనసాగించారు:

‘నాకు మధ్యాహ్నభోజనం ఉస్మాన్ సాబ్, కులకర్ణి సాబ్ ఇద్దరూ పట్టుకొచ్చేవారు. హైదరాబాదులో చదువుకునేటప్పుడు ఇంట్లో వంటావార్పూ ఎవరు చేసిపెడతారు?  అందుకే చిక్కడ పల్లిలో ఒక వెంకటేశ్వర  మందిరానికి వెళ్ళేవాణ్ణి. అక్కడ హారతి సమయంలో నేను బాగా గంటవాయించేవాణ్ణి. అక్కడి పూజారులు అది గమనించారు., వాళ్ళకీ నాకు మధ్య పరిచయం ఏర్పడింది. వాళ్ళు నాకు చాలా చక్కటి ప్రసాదం పెట్టేవారు. అదే నాకు నాస్తా అయిపోయేది. దధ్యోజనం, పులిహోర,శనగలు, ఆ ప్రసాదం గొప్ప రుచిగా ఉండేది. ఆ ప్రసాదం తిని కాలేజికి వెళ్ళేవాణ్ణి. మధ్యాహ్నభోజనమైతే ఆ లెక్చరర్లతోనే అయిపోయేది. ఒక్కోసారి ఉస్మాన్ సాబ్ అండా వండా తెస్తే, నా పక్కన కూచుని, ‘శర్మ సాబ్, ఈ రోజు నీకు ఖానా లేదు, నువ్వు కులకర్ణి సాబ్ దగ్గర తిను’ అని సరదాగా అనేవారు.

హైదరాబాదులో కాలేజి నుంచి బయలుదేరాక, అక్కడ కొండమీద బిర్లా మందిరం కడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళేవాణ్ణి. అక్కడి కారీగార్లంతా రాజస్తాన్ నుంచి వచ్చినవాళ్ళు. ఆ మందిరం పాలరాయితో కడుతున్నారు. ఆ  రాయి మన ప్రాంతపు రాయి కాదుకదా, ఆ పాలరాయి పని నేర్చుకునేదెప్పుడు అనుకునేవాణ్ణి.’

‘అందుకని నేనక్కడికి వెళ్ళి వయసులో పెద్దవాడైన ఒక కారీగార్ తో పరిచయం పెంచుకున్నాను. నేను వెళ్ళగానే ఆయన నాకు సుత్తీ, ఉలీ ఇచ్చేవాడు. రెండుగంటల పాటు చక్కగా ఆ రాతిచెక్కడం చేసేవాణ్ణి. పాలరాయి చెక్కడం వేరు, గ్రానైట్ చెక్కడం వేరు. రెండింటికీ వాడే సుత్తీ, ఉలీ కూడా వేరువేరు. పాలరాతిమీద దెబ్బ నేరుగా వెయ్యలేము. అంతా వాలుగా పడాలి. ఆ సుత్తిలోపల సీసం నింపి ఉంటుంది. ఆ రాతిమీద దెబ్బ మరీ గట్టిగా పడకూడదు. ఒకవేళ ఆ దెబ్బ నేరుగా లోపలకీ తగిలితే, ఆ తర్వాత దాన్ని ఎంత పాలిష్ చేసినా ఆ గుర్తు కనబడుతూనే ఉంటుంది. అది మాయం కాదు. అందుకే సీసంతో నింపిన సుత్తుల్తో మెల్లగా పనిచేయాలి. అక్కడ నేనా పని చాలా నేర్చుకున్నాను.’

‘అక్కణ్ణుంచి మళ్ళీ లిబర్టీ దాకా వచ్చేవాణ్ణి. అమెరికా పంపడం కోసం అక్కడొక మందిరం తయారవుతుంటే, తమిళనాడు నుంచి వచ్చిన కారీగార్లు అక్కడ గ్రానైట్ మీద పనిచేసేవారు. గ్రానైట్ చాలా కఠోరమైన రాయి. అక్కడ పెరుమాళ్ళు అని ఒకాయన పరిచయమయ్యాడు. ఆయనకు తెలుగూ, హిందీ రెండూ రావు. కానీ మా మధ్య మంచి దోస్తానా ఉండేది. ఆయనతో నాకు మహాబలిపురంలో పరిచయమైంది. ఇక్కడ నన్ను చూడగానే గుర్తుపట్టేడు. దాంతో ఆయన దగ్గర గంటా రెండు గంటల పాటు గ్రానైట్ మీద పనిచేసేవాణ్ణి. ఇలా ఏకకాలంలో రెండు విభిన్నమైన రాళ్ళమీద పనిచేసేవాణ్ణి.’

‘ఆ తర్వాత చిక్కడపల్లికి వచ్చి, అప్పుడప్పుడు సంస్కృతం నేర్చుకోడానికి, యూనివెర్సిటీ దారిలో ఉన్న ‘సురభి’ అనే చోటుకి వెళ్ళేవాణ్ణి. వాళ్ళు హోలీ రోజే పరీక్షపెట్టారు. ‘పండగరోజుల్లో పరీక్షా విరీక్షా ఏమిటి?’ అని వాళ్ళతో గొడవపడి వచ్చేసాను. ఆ తర్వాత వెళ్ళలేదు. అలా సంస్కృతం చదువు ఆగిపోయింది. కానీ నాకు సంస్కృతం నేర్చుకోవాలని చాలా జిజ్ఞాస ఉండేది. ఎందుకంటే, మన శిల్పశాస్త్రం వగైరాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మన ప్రతి ఒక్క విషయం సంస్కృతంలోనే ఉంది.’

‘మన దగ్గర ఎన్ని గ్రంథాలున్నాయో మీకు తెలుసా? తంజావూరు లైబ్రరీలోనే దాదాపు నలభై వేల గ్రంథాలున్నాయి. అక్కడ మూల తాళపత్రాలున్నాయి. కానీ వాటిని ముట్టుకోనివ్వరు. కేవలం దూరం నుంచే చూడాలి. వాళ్ళు వాటిని అనువాదం చెయ్యనివ్వరు. జిరాక్సు తియ్యనివ్వరు. అవి అలా పడి ఉండి నాశనమైపోతున్నాయి. కనీసం మైక్రో ఫిల్ము కూడా తీయడం లేదు. అలా ఏమీ చెయ్యనివ్వకపోవడం ఒక దుర్గుణం. అవి అలానే నాశనమైపోతాయి.’

‘ఆ నలభై వేల గ్రంథాలూ కేవలం ఆధ్యాత్మిక విషయాలే కావు కదా. అందులో ఎన్నో శాస్త్రాలున్నాయి. మన దగ్గర ‘మావత్ శాస్త్ర’ అంటే ఏనుగుల శాస్త్రం కూడా ఉంది. ఏనుగును ఎలా వశం చేసుకోవాలి, దానికి వచ్చే జబ్బులేమిటి, చికిత్స ఎలా చేయాలి, ఏనుగులకు ఏ భాష అర్థమవుతుంది- ఇవన్నీ అందులో చాలా లోతుగా రాసి ఉన్నాయి. నాకనిపిస్తుంది, ప్రతి ఒక్క కారీగార్ కి ఇలాంటి ఒక శాస్త్రం ఉండి ఉండాలి. అందుకే సంస్కృతం నేర్చుకోవాలన్న తపన ఉండేది. ఆ సంస్కృతం నేర్చుకోవాలంటే, గ్రంథలిపి కూడా తెలియాలని మా ఆచార్యులు చెప్పారు. ఎందుకంటే ఆ గ్రంథాలన్నీ ఆ లిపిలోనే రాసి ఉన్నాయి.’

‘ఇలా నేను రకరకాల పనులు చేసాను. చూసాను. నేను నాలుగో ఏడాదిలో ఉన్నాను. చదువు ఇంకో ఏడాది మిగిలి ఉంది. అప్పుడొక రోజు ఉస్మాన్ సిద్ధిఖీ నాదగ్గరకొచ్చారు.  వచ్చి,’శర్మాజీ, మీరు చాలా బాగా పనిచేస్తారు. మీరు చేసే పని నాకు నచ్చుతుంది. చాలా మంచిపని. చాలా బాగుంటుంది, కాని నాకైతే ఒక కోరిక ఉంది’ అని అన్నారు.

‘చెప్పండి సాబ్, ఏమిటది?’ అనడిగాను.

ఆయనన్నారు కదా: ‘చివరికి ఒక గీత గీసినా ఇది శర్మ గీసిన గీత అని ప్రజలు అనుకోవాలి’ అని.’

‘నేను ఆ రోజు చాలా ఆలోచించాను. అసలు మనం చేస్తున్నాం? అందరూ చేసేదే మనమూ చేస్తున్నాం. ఏం చూసామో, ఏది విన్నామో, ఏది చదువుకున్నామో అదే కదా చేస్తున్నాం. దాన్ని దాటి బయటదైతే మరేమీ చెయ్యడం లేదుకదా. మనిషి కల్పన కూడా అంతే. ఏది చూసాడో, విన్నాడో,చదువుకున్నాడో దానికన్నా భిన్నంగా వేరే ఏమీ చెయ్యలేడు కదా.’

‘అంతే. అక్కడితో నా పని ఒక్కసారిగా ఆగిపోయింది. కాలేజిలో పని ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తర్వాత పనీగినీ ఏమీ చెయ్యలేదు. హైదరాబాదులో బాగా తిరిగాను. పాతబస్తీలో చాలా హవేలీలు ఉండేవి. అక్కడ బాగా చెక్కపని ఉండేది. అక్కడ చాలా డ్రాయింగ్ చేసేవాణ్ణి. చాలా పరిజ్ఞానం సేకరించేవాణ్ణి. కానీ మనసులో ఎప్పుడూ ఒక అశాంతి ఉండేది. అసలు ఏం పని చేయాలి? ఏం జరగాలి? అని.’

‘అప్పుడు రెండు ప్రశ్నలు పుట్టాయి. ‘సృజనాత్మకమైన పని దేన్నంటారు?’ అది మొదటి ప్రశ్న. ‘కళ అంటే ఏమిటి?’ రెండో ప్రశ్న.

హైదరాబాదులో రామకృష్ణ దాస్ అని ఒక మిత్రుడుండేవాడు. నేను ఆయనతో కలిసి చాలా పనులు చేసాను. ఆయన చిక్కడపల్లి గుళ్ళో కలిసాడు. అప్పట్లో నాకు ఎటువంటి ఠికానా ఉండేది కాదు. రామకృష్ణదాసూ నేనూ కలిసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పని నేర్చుకునేవాళ్ళం. ఆయన అంతకు ముందు మ్యూజియంలో పనిచేసేవారు. అక్కడ నౌకరీ ఎందుకుపోయిందో తెలియదు. బౌద్ధశిల్పకళ గురించి ఆయనకు చాలా పరిజ్ఞానం ఉండేది. ఆయన నటరాజ రామకృష్ణతో కలిసి భరతనాట్యం నేర్చుకునేవారు.’

‘ఆయనతో కలిసి నేను చాలా పనులు చేసేవాణ్ణి. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న క్రిష్టల్ బార్, సికిందరాబాదులోని కొన్ని హోటళ్ళు, గార్డెన్ రెస్టారెంట్- వీటి సీలింగు మేమే చేసాం. పెద్ద పెద్ద పైకప్పులు అలంకరణ చేసాం. చాలా హోటళ్ళలో పనిచేసాం. సినిమా సెట్టింగుల పనులు కూడా చేసాం. బేటా! సినిమా సెట్టింగు పనులంటే కుక్కబతుకే! అంతా జల్దీ జల్దీగా పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా పాపం ఎక్కడేనా దూరి నిద్రపోతే, వాణ్ణి కాళ్ళతో తన్ని లేపుతారు. ‘చల్, పని చెయ్యి!’ అంతా ఫటాఫట్ చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా సెట్టింగు పనులు కూడా దాస్ సాబ్ తో కలిసే చేసాను.’

‘ఒకసారి హైదరాబాదులో హరిజన్ మహాసభ జరగాల్సి ఉంది. తెలుగు మహాసభలు అయిపోయాయి. ఆ తర్వాత హరిజన్ మహాసభలు మొదలవ్వాలి. దాని కోసం దాస్ సాబ్ కి మూడు విగ్రహాలు తయారుచేయాల్సిన ఆర్డరు దొరికింది. అంబేద్కర్, సంజీవయ్య, గాంధి-మూడు విగ్రహాలు తయారు చెయ్యాలి. గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలైతే ఆరురోజుల్లో తయారైపోయాయి. వాటిలో పెద్దగా ఏమీ ఉండదు.’

‘ఇక ఇప్పుడు సంజీవయ్య గారి విగ్రహం చెయ్యాలి. ఫొటోలూ గట్రా తీసుకుని కర్రలతో అచ్చులు గట్టి- అచ్చులతో కట్టిన కర్రచట్రం ఉండటం వల్ల కిందభాగం కనిపించేదికాదు. పెద్ద పెద్ద నిపుణులు, మేధావులు వచ్చేవారు. ముఖం తయారు చెయ్యాలి కదా. ‘దాస్ సాబ్! ఇటు కొంచెం పెట్టండి, అటు కొంచెం తియ్యండి. ఇటునుంచి తియ్యండి’ అని సలహాలిచ్చేవారు. అలా చేస్తూ చేస్తూ ఆ ముఖం తయారయ్యింది. లైక్ నెస్ అయితే వచ్చేసింది, అచ్చం ఆయనలానే కనిపిస్తోంది, కానీ, ఎప్పుడైతే ఆ కర్ర చట్రం విప్పేసామో, అప్పుడు చూస్తే ఆ తల కండరాల దగ్గర, భుజాల దగ్గర సమానంగా ఉంది. అంటే మెడలేనట్టుగా తల భుజాలమీద కూచున్నట్టు వచ్చింది!’

‘అరే! ఇప్పుడేం చెయ్యాలి? దీనికేదన్నా పూస్తే అది మోటాగా అయిపోతుంది. చాలా కష్టం మీద దాన్నెలాగో ఒకలాగ సరిచేసాం. దాన్ని సరిచేసి విగ్రహాలు  పెట్టే చోటికి తీసుకెళ్ళగానే పెద్ద పంచాయితీ మొదలయ్యింది. ‘జగ్ జీవన్ రాం విగ్రహం ఎందుకు లేదు? అది లేకపోతే దీన్ని కూడా పెట్టనివ్వం’ అని అన్నారు.’

దాంతో మళ్ళా రాత్రికి రాతి జగ్ జీవన్ రాం విగ్రహం డ్రాయింగ్ గట్రా, పెయింటింగ్ గట్రా తయారుచేసాం. రాత్రికి రాత్రి తయారుచేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. ఇలాంటి రకరకాల పనులు చేసాం. చిత్రమైన పనులు, అడ్డదిడ్డం పనులు.

‘రాయల్ సినిమా హాలు కడుతున్నప్పుడు, అందులో విగ్రహాల ఆర్డరు మా షేక్ పీరా సాబ్ తీసుకున్నారు. దాంతో మేం కూడా పనిచెయ్యడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ చాలా పెద్ద విగ్రహాలు తయారవుతున్నాయి. అక్కడ పైకెక్కి పెద్ద చెక్క చట్రం మీద పనిచేయాలి. మాకు అంతగా అలవాటులేని పని. అయినా సరే, ఆ చెక్క చట్రం మీద ఎక్కి పనిచేసేవాళ్ళం.’

‘అలా పనిచేసేటప్పుడు వెనక్కి జరక్కూడదు. ఒకరోజు నేను మెల్లమెల్లగా వెనక్కి జరుగుతున్నాను. అక్కడ ఒకామె కూచుని ఏదో రుద్దుతోంది. ఆమె నా కాళ్ళు పట్టుకుంది. ‘ఆగు, ఆగు, చచ్చిపోతావురా’ అని అరిచింది. నేను వెంటనే కిందకి చూస్తే- ఆ హాల్లో పెట్టడం కోసం ఏ కుర్చీలు తెచ్చిపెట్టారో, అవన్నీ బోర్లించి పెట్టి ఉన్నాయి. అలా తిరగెయ్యడం వల్ల వాటి సూది అంచులు పైపైకి ఉన్నాయి. అరే బాప్ రే! నేను కనుక కిందపడి ఉంటే, బేటా, వాటిమీద పడి ఉండేవాణ్ణి. అవన్నీ వంట్లోకి దిగబడిపోతే ఎలా ఉండి ఉండేది! నా ప్రాణం గజగజలాడింది. ఆ తర్వాత నేనెప్పుడూ పైకెక్కి పనిచెయ్యలేదు. అలా చెయ్యడానికి ఆ పని అలవాటు ఉండాలి కదా.’

‘బద్రీ విశాల్ పిత్తీ గారి కూతురి పెళ్ళి సమయంలో అలంకరణకి దాస్ సాబ్ కి ఆర్డరు దొరికింది. చాలా పూలతో చెయ్యాల్సిన అలంకరణ. మొత్తం స్టేజి పూలతో అలంకరించే పని మేమే చేసాం. ఇలా రకరకాల పనులు చేసాం. కానీ నా మనసులో మాత్రం ఎప్పుడూ ఒకటే ఆలోచన సుళ్ళు తిరుగుతుండేది. అసలు కళ అంటే ఏమిటి? సృజనాత్మకత అంటే ఏమిటి? అని.’


Ravindra Kumar Sharma profile and Kalashramam photography: Sardar Harpal Singh, Adilabad

4-6-2026

16 Replies to “జీవన శిల్పి-3”

  1. చివరిగా అద్భుతమైన ప్రశ్నలు. తమరే సారి అయిన సమాధానం చెప్పగలరు. సర్. నమస్సులు

  2. My god!! ఎవరు వీరు!
    వీరు నేర్చుకోని విద్య లేనట్లుంది!!
    Amazing people in his life!!
    🙏🏽

  3. మహానుభావులు. ఎన్ని కళలు నేర్చారో ? గ్రానైట్ శిల్పాన్ని చెక్కడానికి , పాలరాతి శిల్పాన్ని చెక్కడానికి  తేడా విపులంగా చెప్పారు. ఈ  మధ్యనే నేను చిత్రాలు గీయడానికి బిర్లా మందిరం వెళ్ళినపుడు అవి ఎలా చేశారో కదా అని ఆశ్చర్య పోయాను. గురూజీ గారి చేయి వాటిపై పడే ఉంటుంది. కళలో సృజన ఎలా వస్తుంది? కళాకారుడి మదిలో  ఎప్పుడో ఒకప్పుడు ఉదయిందే ప్రశ్న . కాకపోతే అందరూ దాన్ని పట్టించుకోరు . పట్టించుకొని , సమాధానం వెతికే వాళ్ళు , ఇదిగో ఇలాంటి మహానుభావులు !! 
     ” చివరికి ఒక గీత గీసినా ఇది శర్మ గీసిన గీత అని ప్రజలు అనుకోవాలి ” . ఇది ఒక గీతా వాక్యం నిజంగా .. చదవగానే అంతర్మథనం మొదలవుతుంది…. 

    1. నేనొక తెలుగు అధ్యాపకున్ని…నా మిత్రుడు అదిలాబాద్ లో తెలుగు అధ్యాపకుడు. గత మూడు సంవత్సరాలుగా ఆదిలాబాద్ వెళుతూనే ఉన్నాను. మీరు చెప్పిన ప్రదేశాలు అన్ని తిరుగుతూనే ఉన్నాను. ఆ పుణ్యభూమిలో ఇలాంటి గొప్పవారు ఉన్నారని తెలుసుకోవడం సంతోషం. నాకు కూడా ఇలాంటి తాత్విక చింతన సజ్జన జీవితాలను పరామర్శించడం ఇష్టం. గతంలో మీరు ఒక బాబా గారి గురించి కూడా రాసినట్టున్నారు ఈ ప్రాంతం ఆయనే.

      1. ధన్యవాదాలు. మీరు కళాశ్రమానికి వెళ్లి రండి నేను ఇంతకుముందు రాసినది పట్నాపూర్ లో ఉండే ఫూలాజీ బాబా గురించి.

  4. ఎవరండీ బాబు.. ఈ మహానుభావుడు.. సకల కళా వల్లభుడు.. సకల విద్యా పారంగతుడు…

    “అక్కణ్ణుంచి మళ్ళీ లిబర్టీ దాకా వచ్చేవాణ్ణి. అమెరికా పంపడం కోసం అక్కడొక మందిరం తయారవుతుంటే, తమిళనాడు నుంచి వచ్చిన కారీగార్లు అక్కడ గ్రానైట్ మీద పనిచేసేవారు.” నా ఉద్దేశం ప్రకారం ఇది ప్రస్తుతం అమెరికా లోని పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన మందిరం అయ్యుండాలి..
    ఆయన చెయ్యి చిక్కడపల్లి లో క్రిస్టల్ బార్ సీలింగ్ కట్టడంలో కూడా ఉందంటే చాలా హ్యాపీ గా ఉంది. నా ఇంజనీరింగ్ చదివిన నాలుగేళ్లలో ఆ సీలింగ్ కింద ఎన్నో సార్లు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ మళ్ళీ గుర్తొచ్చింది. రాయల్ థియేటర్ లో శంకరాభరణం సినిమా చూసాను. మేము 1972 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో అడుగు పెట్టాము. అప్పుడు నౌబత్ పహాడ్ ఇంకా ఉండేది. దాన్ని పడగొట్టి బిర్లా మందిర్ కడుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్లినట్టు గుర్తు.. మీ గురూజీ సంభాషణల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు మరుగున పడ్డ మా జీవిత శకలాలు కూడా వెలికి తీయగలుగుతున్నాం.

    గురూజీ “‘అప్పుడు రెండు ప్రశ్నలు పుట్టాయి. ‘సృజనాత్మకమైన పని దేన్నంటారు?’ అది మొదటి ప్రశ్న. ‘కళ అంటే ఏమిటి?’ రెండో ప్రశ్న.” అన్నారన్నారు.. ” రెంటికీ సమాధానం ఈ సంభాషణలలో చాలా సులభంగా వెతుక్కోవచ్చు..

    ధన్యోస్మి భద్రుడు గారు.

  5. ఒక పెద్ద వయసు వ్యక్తి అంటే ఒక గ్రంధాలయం అంటారు. ఈ గురూజీ గారు వందల గ్రంధాలకు నెలవు.విశ్వనాధ సత్యనారాయణ గారి నవలల్లో ఇలాటి వారిని గురించి చదివాను. వారు ఒకో పనిలో నిష్ణాతులు.ఈయన ఒక్కరే బోలెడు పనుల్లో ప్రవీణులు. తెలుగు వాజ్ఞ్మయానికి తరిగిపోని నిధి ఈ మీ లైవ్ స్ట్రీమ్…చైతన్య ప్రవాహం! మీకు నమస్సులు.గురూజీకి పాదాభివందనం.ఔను కళ అంటే ఏమిటి? సహజ సంపూర్ణత్వం.అది ఎలా ఉంటే అలానే ఉండే సౌందర్యం.ఇది నేననుకున్నది. మరి గురూజీ మాట కోసం ఎదురు చూస్తుంటానండి.

  6. కళాశ్రమం గురూజీ గారి వంటి మహనీయులు తమ జీవితాన్ని కేవలం జీవించలేదు; ఒక సందేశంగా మలిచారు. అందుకే వారి అనుభవాలు, ఆలోచనలు, ఉపదేశాలు ఒక వ్యక్తి జ్ఞాపకాలుగా కాక, సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయి.

    ఆయన చెప్పిన ప్రతి అనుభవం వెనుక ఒక జీవనసత్యం కనిపిస్తుంది. ఆయన పంచుకున్న ప్రతి ఆలోచన వెనుక ఒక సాధన, ఒక తపన, ఒక ఉన్నత దృక్పథం దర్శనమిస్తాయి.

    అటువంటి కారణజన్ముని అంతరంగాన్ని, ఆలోచనలను, అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ఈ అవకాశం నిజంగా ఒక వరం; ఒక ప్రేరణ; ఒక జీవితపాఠం.

    ఈ అమూల్యమైన అనుభూతిని పొందడానికి అవకాశం కలిగించిన మీకు ధన్యవాదములు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading