
Ravindrakumar Sharma: Photography by Sardar Harpal Singh
‘కుమ్మరి ఏం చెప్పాడో అరవిందుడూ అదే చెప్పాడు‘
మొదటి రోజు: మొదటి సంభాషణ
కళాశ్రమం. అదిలాబాదు ఊరు చివర కలెక్టరు బంగ్లాకి ఆవల గురూజీ నిర్మించిన ఒక ఆశ్రమం. కొత్త కుమ్మరి వాడ అంటారు దాన్ని. మట్టిపనీ, వెదురుపనీ, అడవీపనీ, ఇంకా అంతరించిపోయే ప్రమాదం ఉన్న మరెన్నో చేతివృత్తుల్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో రవీంద్రకుమార శర్మ ఏర్పాటుచేసారు దాన్ని. వైశాఖమాసపు ప్రభాతాన ఆ అశ్రమంలో అడుగుపెట్టాను. దక్కను పీఠభూమిలో ఎత్తైన ప్రాంతంలో ఉన్నందువల్లా, చుట్టూ అడివి కావడం వల్లా అదిలాబాదులో ఎండ తాపం ఎక్కువగానే ఉంటుంది. కానీ కళాశ్రమం కప్పులు గూనపెంకుతో కట్టినవి కావడం చేత ఆ ఎండ తీవ్రత తెలియదు. అదిలాబాదు మట్టి ప్రత్యేకమైన మట్టి. అక్కడ కుమ్మరలు తయారుచేసే రంజన్లలో నీరుచాలా చల్లగా ఉంటుంది. అటువంటి మట్టితో తయారు చేసిన గూన పెంకులతో కట్టిన కప్పు అది. ఈస్టిండియా కంపెనీ బంగళాల కళ్లదనం దాని ముందు నిలబడదు. అంతకన్నా పూర్వకాలపు కట్టడాల్ని తలపిస్తూ, ఎత్తుగానూ, లోపల చల్లగానూ ఉండే మందిరం అది.
ఆ ఆశ్రమంలో గురూజీ ఉంటున్న చిన్న కట్టడం కాక, రెండు పెద్ద కట్టడాలున్నాయి. ఒకటి కళాశ్రమం మొదలుపెట్టిన రోజుల్లో కట్టింది. పూర్వకాలపు మండువా ఇల్లులాగా ఉంటుంది. అందులో అరుదైన కళాకృతులూ, మృణ్మయపాత్రలూ, లోహపాత్రలూ, విగ్రహాలూ, నకాషీ పటచిత్రాలూ, వెదురువస్తువులూ లాంటివన్నీ ఉంటాయి. ఆ మధ్యలో అగ్నిదేవుణ్ణి ప్రతిష్ఠించినట్టుగా ఒక కొలిమి ఉంటుంది. ఆ మందిరానికి బయట గుమ్మం మీద కర్టెన్ క్రీపర్ ఒకటి నిండుగా అల్లుకుని ఉంటుంది.
మొదట కట్టిన ఆ మండపానికి ఎదురుగా కొత్తగా ఒక పెద్ద మందిరం కట్టారు. ఒక బౌద్ధారామంలాగా ఉండే ఆ మందిరానికి పైన గూనకప్పు, కింద అలికిన మట్టి అరుగులు. చుట్టూ చిన్న పిట్టగోడ. దానికి పైన ఎటువంటి గోడలూ, తలుపులూ లేకుండా బార్లా తెరిచిపెట్టిన ఇల్లులాగా ఉంటుంది ఆ హాలు. అది గురూజీ ప్రార్థనామందిరం. ఉత్సవాలు జరిగినప్పుడు అతిథులు అక్కడే సమావేశమవుతారు. గురూజీ సంభాషణలు నడిచే చోటు కూడా అదే. రాత్రయ్యాక, అతిథులు విశ్రమించే శయనాగారమూ అదే. దాని వెనక వెదురుపొదలు, గన్నేరు పూలమొక్కలు, చింతచెట్లు, టేకుచెట్లు. ఆ మందిరానికి ఎదట ఒక చిన్న ముంగిలి. అందులో ఇసుకపోసి ఉంటారు. కొన్ని కుర్చీలు కూడా వేసి ఉంటారు. ఆ ముంగిలి చుట్టూ వేపచెట్లు, పారిజాతాలు. సాయంకాలం కాగానే గోష్ఠి మందిరంలోంచి ఆ ముంగిలికి జరుగుతుంది. ఊళ్ళోంచో లేదా పొరుగూరినుంచో ఎవరో ఒకరు గురూజీని కలుసుకోడానికి వచ్చి అక్కడ కూచుంటారు. కొందరు వస్తూ ఉంటారు, కొందరు వెళ్తూ ఉంటారు. కాని గురూజీ సంభాషణలు విరామం లేకుండా నడుస్తూనే ఉంటాయి. ఆ ముంగిలి ఒక పక్కగా గోశాల.
ఆ పొద్దున్నే గురూజీతో కలిసి ఆ హాల్లో కూచున్నాను. ఆయన చిన్న మడతకుర్చీలాంటిదానిలో కూర్చున్నారు. పక్కనే ఒక కేన్ మోడా ఉంటే నేను దాని మీద కూచున్నాను. గురూజీ కుర్చీపక్కనే చిన్న బీడీపాకెట్టు. ఆయన ఒక బీడీ తీసి ముట్టించారు. ఒకసారి పొగపీల్చి వదిలి, ‘చెప్పండి సార్’ అన్నారు.
నేను ఆయనతో మాట్లాడించడానికి వస్తున్నానని అంతకు ముందే చెప్పాను. ఆయన్ని ఏదో ఒక ప్రశ్న అడిగితే చాలు, ఆ సంభాషణ ఒక ప్రవాహం లాగా పొంగిపొర్లుతుందని తెలుసు. కానీ ఎక్కడ మొదలుపెట్టాలి? మా సంభాషణల్ని ఏ రీతిలో నడుపుకోవాలి? ఖలీల్ జిబ్రాన్ సుప్రసిద్ధ రచన The Prophet నా మదిలో ఉంది. ఆర్ఫలీజు నగరంలో పన్నెండేళ్ళు గడిపాక అల్ ముస్తఫా తన స్వదేశం తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. అతణ్ణి స్వదేశానికి తీసుకుపోయే ఓడ వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ పట్టణ పౌరులు ఆయనతో చివరిగా సమావేశమవుతారు.వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కో అంశం మీద ఆయనతో మాట్లాడిస్తారు. ప్రేమ, పెళ్ళి, పిల్లలు, ఇలా ఇరవై ఆరు అంశాల మీద మాట్లాడిస్తారు. నేను కూడా నా సంభాషణలు ఆ రీతిన కొనసాగించనా?
గురూజీ తన గురించి పదే పదే చెప్పుకునే మాట ఒకటి నాకు బాగా గుర్తు. జలప్రళయవేళ మనువు కొత్త సృష్టికి కావలసిన పశుపక్ష్యాదుల్నీ, జీవజాల అంకురాల్నీ తన నౌకలో భద్రపరచుకున్న కథ ఉంది కదా. గురూజీ తనని తాను ఆ మనువుతో పోల్చుకునేవారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే ఒక ప్రళయం ప్రపంచాన్ని ముంచెత్తుతున్నదనీ, స్థానిక కళల్నీ, చేతివృత్తుల్నీ, సౌందర్యదృష్టినీ దాన్నుంచి బతికించుకోడం కోసం తన ఆశ్రమాన్నే ఒక నౌకగా మార్చుకున్నాననీ చెప్తూ ఉంటారాయన. అందుకని ఇప్పుడు ఆ సర్గప్రళయాల గురించి ఆయనతో చెప్పించుకోనా?
కానీ నా మనసులో ఉన్న ఫార్మాట్ తో గురూజీని కట్టడిచేయకూడదనుకున్నాను. ఆయనకి తన గురించీ, తాను కాపాడాలని తపిస్తున్న కళల గురించీ, విధ్వంసమవుతున్న సమాజం గురించీ ఏమి చెప్పాలనిపిస్తే, ఎలా చెప్పాలనిపిస్తే, అలానే చెప్పుకుంటూపోతేనే బాగుంటుందనిపించింది. అయితే ముందుగా ఆయన జీవితవిశేషాలు, కుటుంబనేపథ్యం లాంటి ప్రాథమిక పరిచయంతో మొదలుపెడితే బాగుంటుంది అ నిపించింది. ఎందుకంటే, ఇన్నేళ్ళుగా కలుస్తూ ఉన్నా, నేనింతదాకా ఆయన్ని అడగని విషయాలవి.
‘చెప్పండి గురూజీ, మీ బాల్యం గురించీ, మీ కుటుంబం గురించీ ‘ అని అన్నాను, నా చేతుల్లో ఉన్న హాండ్ రికార్డరు బటన్ నొక్కి.
‘అట్లనా ‘ అని నవ్వారు గురూజీ. ‘నేనైతే ఇక్కడే పుట్టాను. ఈ అదిలాబాద్ శతాబ్దాల నుంచీ ఒకతపోభూమి ‘ అని మొదలుపెట్టారు. ఇక ఆ వాక్ప్రవాహానికి నేను అడ్డురాలేదు.
‘ఇక్కడ మఠాలు చాలా ఉండేవి. ఎక్కడ భూమి తపిస్తూ ఉంటుందో అటువంటి ప్రదేశాల్లోనే మఠాలు ఏర్పడతాయి. ఇక్కడ వేసంకాలంలోగాని, మరే ఋతువులో గాని మనిషి కాళ్ళకి చెప్పుల్లేకుండా నడవలేడు. ఇటువంటి నేల ఎక్కడ ఉంటుందో, అక్కడే ఎక్కువగా మఠాలు నిర్మిస్తారు. ఎక్కడ మనుష్యసంచారం ఉండదో, ఎక్కడ నేల తప్తభూమిగా ఉంటుందో అక్కడ మఠాలు కట్టే ఒక విధానం కూడా ఉండేది.’
‘మా పెద్దవాళ్ళంతా పంజాబు నుండి ఇక్కడికొచ్చారు. పంజాబులో ఏ భాగం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉందో అక్కణ్ణుంచి వచ్చారు. డిజ్కోట్ అనే చోటునుంచి. మా వాళ్ళ నమ్మకం ప్రకారం మా అసలు స్వస్థలం మానకో ఘడియాల్. హరిద్వార్ లో పండాల దగ్గర మా వంశానికి సంబంధించిన ఏ ఖాతా నడుస్తుందో, దాని ప్రకారం కూడా మా స్వస్థలం మానకో ఘడియాల్ పేరుమీదనే ఉంది. అయితే మావాళ్ళు ఎప్పుడో తమ యజమానుల్తో కలిసి లాహోరు దగ్గరికి వెళ్ళిపోయారు. లాహోర్ పక్కనే డిజ్కోట్ అనే ఒక ప్రదేశముంది. డిజ్కోట్ అంటే ఒకప్పుడు ద్విజ్కోట్. అది బ్రాహ్మణుల కోట. ద్విజ అంటే రెండోసారి పుట్టినవారు అనే అర్థంలో బ్రాహ్మణుల్ని పిలుస్తారు కదా. ఆ ద్విజ్ కోట్ కాస్తా డిజ్కోట్ గా మారిపోయింది.’
‘ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పడిందో, మా వాళ్ళు అక్కణ్ణుంచి బయటికొచ్చేసారు. చాలా భయంకరంగా బయటపడ్డారని చెప్పాలి. అప్పుడు మా తాతయ్య చెవుల్ని ఉన్న బంగారం కూడా లాగేసుకున్నారు. అల్లరిమూకల దాడుల్లో ఆ కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోయింది. ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయారు. ఆడవాళ్ళొకచోట, మగవాళ్ళొకచోట. అలా అన్నదమ్ములంతా వేరైపోయారు.’
‘అయితే వాళ్ళందరికీ ఒక సంగతి తెలుసు. అదేమంటే నిజాం రాజ్యంలో మా పెదనాన్న ఉండేవారు, లాహోరీ అన్న పేరుతో ఆయన నిజాం రాజ్యంలో రైల్వే ఇంజనీరుగా ఉండేవారు. అప్పట్లో ఆయన రైలు దారి వేయించే పనిచూసేవారు. ఆయన డ్యూటీ డోర్నకల్ లో ఉండేది. పంజాబులో చెల్లాచెదురైపోయిన కుటుంబం మొత్తం నెమ్మదినెమ్మదిగా డోర్నకల్ కి చేరుకున్నారు. అప్పట్లో అది సురక్షితమైన ప్రదేశం కావడంతో మొత్తమంతా అక్కడికి చేరుకున్నారు.’
‘ఈ అదిలాబాదు రైల్వే లైను ఉందే, ఇది మా పెద్దనాన్న వేయించారు. ఇక్కడ విమానాశ్రయం, ఏరోడ్రోం, అది కూడా ఆయన పర్యవేక్షణలోనే తయారయ్యింది. ఎప్పుడైతే మా వాళ్ళంతా తనదగ్గర చేరుకున్నారో అప్పుడు మా పెద్దనాన్న వాళ్ళతో ‘చూడండి,అదిలాబాద్ పెద్ద బస్తీగా మారుతోంది. మీరు అక్కడెలాగేనా బతగ్గలరు. అక్కడికి వెళ్ళండి’ అని చెప్పారు. అసిఫాబాదునుంచి జిల్లా కేంద్రం అదిలాబాదుకి ఎప్పుడు మారిందో అప్పుడిక్కడ కలెక్టరు ఆఫీసు తయారయ్యింది. ఇక్కడ కలెక్టరు ఆఫీసుకి ప్రారంభోత్సవం ఏ ముహూర్తంలో చేసారో, అదే రోజు మా వాళ్ళిక్కడ హోటల్ తెరిచారు. కలెక్టరు ఆఫీసులో కాంటీన్ మొదలుపెట్టారు.’
‘దానిమీదనే వాళ్ళ జీవితమంతా నడుస్తూ ఉండేది. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడ మేము ఇంట్లోనే పుట్టాం. ఆ రోజుల్లో ప్రసవాలు ఇళ్ళల్లోనే జరిగేవి. అప్పట్లో మా వాళ్ళు అద్దె ఇల్లు తీసుకుని ఉండేవారు. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. మేము ఎక్కడ పుట్టామో, ఆ ఇల్లు. ఆ వీథుల్లోనూ, ఆ సందుల్లోనే నా బాల్యం గడిచింది. దగ్గరలోనే పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డునే చాలా ఆడుకునేవాళ్ళం. ఆ గట్టుమీదనే, ఆ గల్లీలోనే నా బాల్యమంతా గడిచిపోయింది.’
‘ఆ గల్లీలో రకరకాల మనుషులుండేవారు. అక్కడ రాధాకిషన్ అని ఒక మార్వాడీ కూడా ఉండేవాడు. వాడు చాలా రంగీలా మనిషి. అదిలాబాద్ కి మొట్టమొదట సైకిలు తెచ్చింది వాడే. వాడు సైకిలు మీద కూచుని తిరుగుతుంటే ప్రజలు ఏదో విచిత్రం చూసినట్టు చూసేవారు, రెండు చక్రాలమీద ఎలా వెళ్తున్నాడు అని!’
‘అప్పట్లో అది పెద్ద వింతే కదా’ అన్నాన్నేను. మా ఊళ్ళో మొదటిసారి మా పక్కింటి చాపా సూర్యనారాయణ కొనుక్కున్న సైకిలు గుర్తొచ్చింది నాకు.
‘అవును’ అన్నారు గురూజీ. ‘ఆ సైకిలు తెచ్చిన మనిషే ఆ తర్వాత కారు తెచ్చాడు, సినిమాహాలు కూడా వాడే తెచ్చాడు. మొదటి సినిమాహాలు విజయలక్ష్మి థియేటరు పేరుతో వాడిదే ఉండేది.వాడికి సంతానం గింతానం ఏమీ లేదు. చాలా రంగీలా మనిషి. ఇవన్నీ అదిలాబాదుకి వాడే తెచ్చాడు. ట్రక్కు కూడా వాడే తీసుకొచ్చాడు. ఆ ట్రక్కు ఆవిరితో నడిచేది. మెల్లమెల్లగా నడిచేది. ఆ తర్వాత చాలాకాలం దాకా అదిక్కడే పడి ఉండేది. చాలాసార్లు అనుకున్నాం దాన్ని ఇక్కడకి తెచ్చి పెట్టుకుందామని, కానీ తీసుకురాలేకపోయాం. చివరికది పాత ఇనుప సామానులో కలిసిపోయింది.’
‘మేం చిన్నప్పుడు చాలా మస్తీ గా గడిపేవాళ్ళం, రెండు అంతస్తుల ఇల్లు. పై భాగంలో మేముండేవాళ్ళం. శారదకాండ్రు తెలుసుకదా, బుర్రకథలు చెప్తారు. వాళ్ళొకసారి బుర్రకథ చెప్పడానికి వచ్చారు. నేను పైనుంచి వాళ్ళని చూస్తూ చూస్తూ కిందపడిపోయాను.నా తల పగిలి పెద్ద దెబ్బతగిలింది. ఇప్పటికీ ఆ సంగతి గుర్తొస్తూ ఉంటుంది, ఆరేళ్ళ వయసులో నేను కింద పడ్డ సంగతీ, నా తలకి దెబ్బ తగిలిన సంగతీను.’
‘ఆ రోజుల్లో అదిలాబాద్ లో పన్నెండు నూనె గానుగలు నడుస్తుండేవి. మేం కూడా నూనె కోసం వెళ్ళేవాళ్ళం అక్కడికి. ఆ గానుగమీద కూచునేవాళ్ళం. నువ్వులు కొంచెం నలిగాక, ఆ తేలీ నాకు ఆ నువ్వులూ, తెలకపిండీ ఇచ్చేవాడు. ఆ నూనె గానుగ మీద కూచుని ఆ దున్నపోతును తోలుతుండేవాళ్ళం.’
‘వాటితో పాటు ఇక్కడ నకాషీ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. ఇక్కడ వాళ్ళని జింజర్ అని పిలిచేవారు. వాళ్ళు చిత్రకళ నగిషీలు చేసేవారు. లద్దాఫ్ అని పిలిచేవాళ్ళు కూడా చాలమంది ఉండేవారు. ఆ రోజుల్లో ఈ చిన్నబస్తీలోనే ప్రతి ఒక్క చేతివృత్తికీ కనీసం ఒక కారీగర్ ఉండేవాడు. అలా బయటికి వెళ్తే మనకి చాలా తెలివిడి కలుగుతుంది. మేమైతే ఏదో ఒక పనిమీద బయటికి వెళ్తూనే ఉండేవాళ్ళం. వెళ్ళక తప్పేది కాదు.’
‘ఆ రోజుల్లో మేం చిన్నపిల్లలుగా ఉండగానే మమ్మల్ని ఒక స్కూల్లో వేసారు. దాన్ని ప్రైవేటు స్కూలనేవారు. అయ్యవార్ల బడి అది. అప్పట్లో కొంతమంది వైష్ణవులు స్కూలు నడిపేవారు. సర్కారీ స్కూళ్ళుండేవి కావు. కొంతమంది మౌల్వీసాహెబ్ లు ఉర్దూ స్కూళ్ళు నడిపేవారు. వైష్ణవులు ఇళ్ళల్లో నడిచే స్కూళ్ళు చాలా చిత్రంగా ఉండేవి. అవి తెల్లవారు జాము నాలిగింటికే మొదలయ్యేవి. నాలుగూ నాలుగున్నరకల్లా పిల్లలు స్కూలుకి పరుగెత్తేవారు.’
‘చాలా సార్లు మాస్టరు సాబ్ మమ్మల్ని తన బొంతలోనే పడుకోబెట్టుకునేవాడు. ‘హేయ్, ఇంత తొందరగా వచ్చేవేంట్రా? సరే, పడుకో’ అనేవాడు. ఆ తర్వాత మాస్టర్ సాబ్ తో కలిసి నడవాలి. అక్కణ్ణుంచి కాలువగట్టుకో, చెరువు గట్టుకో వెళ్ళేవాళ్ళం. మాస్టర్ సాబ్ అక్కడ తుప్పల వెనక ఎంత సేపు కూచుంటాడో పిల్లలు కూడా అంతసేపూ ఏవో ఒక తుప్పల వెనక కూచోవాలి. ఆ మీదట మాష్టర్ సాబ్ లేచి ఒక రాతిమీద కూచుని ముఖం కడుక్కునేవారు. ఆయన ఎంతసేపు ముఖం కడుక్కుంటారో పిల్లలు కూడా అంతసేపూ ముఖం కడుక్కుంటూ కూచునేవారు. ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్నాక ఏదో ఒకటి పాడుకుంటూ అల్లరి చేస్తూ పాఠశాలకి వచ్చేవాళ్ళం. వాళ్ళ ఇల్లే పాఠశాల కదా.’
‘అక్కడ ఆ పాఠశాలలో ఏ చదువు ఉండేదో అది గంటగంటకీ మారే సబ్జెక్టు కాదు. ఏదైనా సరే ఎనిమిదిరోజుల పాటు ఒకటే విషయం, తెలుగైతే తెలుగు, గణితమైతే గణితం, ఏదైనాగానీ, ఆ విషయాన్ని వరసగా ఎనిమిదిరోజుల పాటు చెప్పేవారు. ఇప్పటిలాగా గంటగంటకీ మారే చదువు కాదది.’
‘అలా ఎనిమిది రోజులూ నడిచే ఆ చదువుకి కూడా టైమింగ్ వైమింగ్ కూడా ఉండేది కాదు. మధ్యలో వాళ్ళ చుట్టాలొచ్చారనుకోండి. ఇక కూచుని మాటలు మొదలుపెట్టేవారు. ఆ చుట్టం కూడా చాలా కథలు చెప్తుండేవాడు. కొన్నిసార్లు ఆయన కూడా క్లాసు తీసుకునేవాడు.’
‘అలా మధ్యాహం దాకా గడిచాక, మూడు నాలుగు గంటలకి ఊళ్ళో పెద్దమనుషులు కొందరు అక్కడికి చేరుకునేవారు. ఆ పెద్దమనుషులు రోజూ మాకు పరీక్ష పెడుతూనే ఉండేవారు. ‘ఈ రోజు ఏమి చదివించారు? చెప్పండి. బాబూ చెప్పు, పిల్లడా పద, అరేయ్ గంగారెడ్డి, ఆ పద్యం చదివి వినిపించు, అరే చల్, ఆ ఎక్కాలు అప్పచెప్పు. ..’ ఇలా.
‘వాళ్ళు వచ్చివెళ్ళేదాకా మా మాష్టర్ సాబ్ కి పై ప్రాణాలు పైనే ఉండేవి. వాళ్ళు వెళ్ళాక ఇక ఆ రోజుకి సెలవు. బడి మూసేసినట్టే. ఆడుకోండి, గెంతండి, బాగా అల్లరిచెయ్యండి. అది కూడా ఏ సమయానికి తగ్గా ఆటలు ఆ సమయానికి నడుస్తుండేవి. అన్ని ఆటలూ సీజన్ ప్రకారం నడుస్తుండేవి. ఆటలకి కూడా ఋతువులుండేవి. వర్షా కాలం మొదలయ్యిందంటే, సలాక్ ఆట నడుస్తుండేది. సలాక్ అంటే ఇనుప ఊచ. దానితో ఆడుకునేవాళ్ళు. వేసంకాలమంటే గోళీలు అడుకునేవాళ్ళం. గిల్లీ దండా ఆట కూడా నడిచేది. శ్రావణమాసం మొత్తం మారుగోళ్ళు అంటారిక్కడ, ఆ ఆట నడిచేది. వెదురుబొంగులమీద కాళ్ళు ఆనించి నడిచే ఆట. మారుకాళ్ళు, అంటే రెండో జత కాళ్ళు. ఒక నెల నెలంతా పిల్లాడు ఆ మారుగోళ్ళమీదనే స్కూలుకి వెళ్ళేది. దానిమీదనే చెరువు గట్టుకి వెళ్ళేది. దానిమీదనే రకరకాల ఆటలు నడుస్తుండేవి.’
‘అప్పట్లో మాస్టరు సాబ్ కి ఫీజు ఏముండేది?మాస్టర్ సాబ్ కి పైసా వైసా ఏమీ ఉండేది కాదు. ప్రతి అమావాసకీ, పున్నమికీ చేటలో పప్పు, బియ్యం, పిండి, ఉప్పు, మిర్చి, నూనె, వెల్లుల్లిగట్రా పెట్టి పంపించేవారు. మేము వాటిని పట్టుకెళ్ళి గురుపత్నికి సమర్పించేవాళ్ళం. ఆమె వాటిని వేరువేరుగా తీసి భద్రపరిచేవారు. అది ప్రతి ఒక్క పిల్లవాడూ తీసుకొచ్చేవాడు. అది వాళ్ళకి పదిహేనురోజుల భోజనం.’
‘నవరాత్రి తొమ్మిది రోజులు ఆ పాఠశాలలో ఎంతమంది అబ్బాయిలు చదువుతున్నారో వాళ్ళంతా విల్లూ, బాణాలూ తెచ్చుకుని బాగా పాటలు పాడుతూ బయలుదేరేవారు. మధ్యలో గురుమహరాజ్ నడిచేవారు. ఎంతమంది పిల్లలున్నారో మొట్టమొదట వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళేవారు. ప్రతి ఒక్క పెద్దమనిషీ తన స్తోమతుకు తగ్గట్టుగా వారిని స్వాగతించేవాడు.’
‘అప్పుడు చాలా పెద్దరికంగా చేతులు జోడించి, ఈ ఏడాది మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరగబోతోంది అని అడిగి తెలుసుకునేవాడు. ఒకవేళ మాస్టార్ సాబ్ కూతురి పెళ్ళి ఉందనుకోండి, ‘కూతురి పెళ్ళి ఉంది కదా, మేమున్నాం’ అనేవారు. అంతే. అక్కడికక్కడే తీర్మానమైపోయేది. ఎవరు ఏం చెయ్యాలో నిశ్చయమైపోయేది. ఇక మాష్టర్ సాబ్ నిశ్చింతగా అయిపోయేవారు.’
‘మాకు అమావాసకీ, పున్నమికీ రెండురోజులే సెలవులుండేవి. మేము ఆ స్కూల్లో మూడో తరగతి దాకా చదువుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మరాఠీ స్కూళ్ళు నడుస్తుండేవి, వాటిల్లో చదువుకున్నాం. ఆ తర్వాత హిందీ స్కూల్లోకి వెళ్ళిపోయాం.’
‘నేను విగ్రహాలుగట్రా తయారుచేస్తుండేవాణ్ణి. అదే వాడలో ఉండే నకాషీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా సంగతులు చూస్తుండేవాళ్ళం. మా ఇంట్లో ఆవుండేది. ఆవుని మేపడానికి వెళ్ళినప్పుడు కుమ్మరుల దగ్గరనుంచి మట్టి తీసుకొచ్చేవాణ్ణి. కుమ్మరివాడ చెరువు దగ్గరుండేది. అక్కడ పశువులమందలు జమకూడేవి. వాళ్ళ దగ్గరనుంచి మట్టి తెచ్చుకోవడం, ఆ మట్టితో ఏదో ఒకటి చెయ్యడం, తక్కిన పనులన్నిటితో పాటు ఇదంతా కూడా పక్కపక్కనే నడుస్తుండేది. నాకు చదువుకోడం మీద మనసుండేది కాదు. ఎప్పుడూ విగ్రహాలు తయారు చేస్తూ ఉండేవాణ్ణి.’
‘ఎందుకో తెలియదుగాని, ఎనిమిదేళ్ళ వయసులో లాఠీ చేతుల్లోకి తీసుకున్నాను. నాలుగేళ్ళ పాటు లాఠీ తిప్పడం సాధన చేసాను. రోడ్డుమీద కూడా బాగా కర్రసాము చేసేవాణ్ణి. నాలుగేళ్ళూ రోడ్డుమీదనే సాముగరిడీ నేర్చుకున్నాను. ఆ రోజుల్లో నాకది నేర్పించించడానికి ఎవరున్నారు? ఒక చర్మకారుడుండేవాడు. ఆయన గిడ్డా సార్ గారు. నల్లగా ఉండేవాడు, పెద్ద పెద్ద మీసాలు. ఆయన నాకూ లాఠీ తిప్పడం నేర్పాడు. ఆ తర్వాత చందర్ అనే ఒక భంగీ, ఆయన కూడా నాకు లాఠీ నేర్పించాడు.’
‘ఆ తర్వాత ఆశన్న అని ఒక చర్మకారుడుండేవాడు. ఆయన దగ్గర లాఠీ తిప్పడంలో పెద్ద ఉస్తాద్. ఆయనదగ్గరనుంచి చాలానే నేర్చుకున్నాను. దాంతో లాఠీలో ఉస్తాద్ ని అయ్యాను. నాలుగ్గంటలపాటు ఆపకుండా లాఠీ తిప్పేవాణ్ణి. పన్నెండేళ్ళ వయసు వచ్చేటప్పటికి నలుగురైదుగురు పిల్లలు నా దగ్గర చేరారు. వాళ్ళకి ఆ విద్యనేర్పాను. ఇక ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా ఐదువందల మంది జమయ్యారు. ఆ రోజుల్లో నాకో నియమం ఉండేది, ప్రతి రోజూ ఒక కొత్తమనిషితో పరిచయమయ్యాకనే భోజనం చెయ్యాలనే నియమం పెట్టుకున్నాను. ఆ విధంగా కొన్నేళ్ళల్లోనే చాలామందితో పరిచయమయ్యింది. మా అఖాడా మొదలయ్యింది. పన్నెండేళ్ళ వయసులోనే గురు మహరాజ్ ని అయిపోయాను.’
‘1972 లో చదువుకోడానికి హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. అపటికి నేను ఇంట్లోనే చాలా విగ్రహాలు చేసిపెట్టాను. కాని ఇటువంటి పనులు నేర్పే కాలేజీలు ఉంటాయనీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజి అని ఒకటుంటుందని నాకు తెలియదు. విగ్రహాలు చేసి ఇంట్లో పెట్టుకునేవాణ్ణని చెప్పాను కదా. రోజూ ఒక పిల్లవాడు మా ఇంటిముందు నుంచి వెళ్ళేవాడు. వాడు ఒకరోజు ఆగాడు. హైదరాబాదులో ఫైన్ ఆర్ట్స్ కాలేజి అడ్రస్సు ఇచ్చాడు. ఫారాలు గట్రా తీసుకున్నాం, అడ్మిషను కూడా పూర్తయ్యింది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు నేను ధోవతి కట్టుకుని వెళ్ళాను. ఆరో తరగతిలో ఉండగానే నేను ధోవతి కట్టుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ పైజామా, పాంటూ గట్రా వేసుకోనేలేదు. టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా లుంగీ కట్టుకునే రాశాను (నవ్వుతూ).’
నేను హైదరాబాద్ కాలేజీకి వెళ్లినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఉస్మాన్ అహ్మద్ సిద్దిఖీ, గులాం అలీ, జిలానీ, సయీద్ బిన్ మొహమ్మద్, మాసన్ రావు కులకర్ణి లాంటి పెద్ద పెద్ద శిల్పులు, కళాకారులు కూర్చుని ఉన్నారు. వారు నన్ను చూసి, ఎక్కడి నుంచి వచ్చావు మియా? అని అడిగారు.
‘ఆదిలాబాద్’ అన్నాను.
ఆదిలాబాదా? అక్కడ ప్రజలంతా దిగంబరంగా తిరుగుతారట కదా? అని అడిగారు.
నేనన్నాను, అవును సార్, మీ దాకా ఇంకా ఆ చదువు రాలేదు, అందుకే నేను ధోవతి కట్టుకుని మీ నగరానికి వచ్చాను! (నవ్వుతూ).
‘అక్కడ అడవుల్లో సింహాలు అలా తిరుగుతుంటాయట కదా? అని అడిగారు.
నేను చెప్పాను, ‘అవును, కుక్కల్లాగా వాటిని గొలుసులతో కట్టేసి పెంచుకుంటారు అక్కడ!’ ఇదండీ అప్పట్లో ఆదిలాబాద్ గురించి వారికి ఉన్న ఊహ.
వారు నన్ను ఏమైనా వస్తువులు చేసి తెచ్చావా? అని అడిగితే, నా జేబుల్లో ఉన్న చిన్న చిన్న రాతి విగ్రహాలను తీసి చూపించాను. వారు వాటిని చూసి చాలా సంతోషించారు. ఇంతలో ఒకరు అడిగారు, నీకు ఆటలు ఆడటం వచ్చా? అని. “వచ్చు సార్, లాఠీ, కత్తిసాము, బల్లెం, బరిశే అన్నీ బాగా తిప్పగలను’ అని అన్నాను. వారు నవ్వి, అరే ఆ ఆటలు కాదు మియా, నీకు ఫుట్‌బాల్, క్రికెట్ లాంటివి వచ్చా? అని అడిగారు. ‘అబ్బా! అవి నాకు రావు సార్’ అని చెప్పాను. అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న సయీద్ బిన్ మొహమ్మద్ గారికి కూడా లాఠీసాము వచ్చు. ఆయన అన్నారు, ‘నీకు లాఠీ వచ్చా? నాకు కూడా వచ్చు. మనమిద్దరం కలిసి ఆడుకుందాం, నిన్ను కాలేజీలో చేర్చుకుంటాం’ అన్నారు. ఆ తర్వాత మేము చాలాసార్లు కలిసి లాఠీ ఆడాం.’
‘అక్కడ అడ్మిషన్ దొరికిన తర్వాత కూడా నాకు వెళ్లాలనిపించలేదు. ఇక్కడ ఇంత పెద్ద అఖాడా ఉంది, నేను బయటకు వెళ్తే నా వెనుక ఎనిమిది మంది పిల్లలు లాఠీలు పట్టుకుని నడుస్తారు. అదొక వైభవం. ఇవన్నీ వదిలేసి ఆ హైదరాబాద్ కి చదువుకోవడానికి ఏం వెళ్తాం అనుకున్నాను. కానీ ఆ సమయంలోనే నాకు అరవిందోగారి పుస్తకం ఒకటి దొరికింది. అందులో మొదటి వాక్యం కూడా అదే రాసి ఉంది. ‘నిన్ను నువ్వు గుర్తుపట్టుకునే ఒక మార్గం ఏమిటంటే, నీ లోపల సహజంగా నడిచే విద్య ఏముందో చూడు, ఆ లోపలి విద్య నీకు పరమాత్ముడిచ్చింది అని. ఆ వాక్యం చదవగానే, మా ఊరి కుమ్మరి చెప్పినమాటకి, అరవిందో చెప్పిన మాటకి ఏమీ తేడా లేదని నాకనిపించింది. మా ఊరి కుమ్మరీ నాకు ఆ మాటే చెప్పాడు, అరవిందుడూ ఆ మాటే చెప్పాడు.’
‘నేను కాలేజీ చదువు ముగించుకుని తిరిగి వచ్చాక, ఆ పాత అఖాడా పద్ధతులన్నీ మార్చేసి ఇరవై ఇరవై మందితో చిన్న చిన్న గ్రూపులు చేశాను. ప్రతి ఆదివారం ఒకరి ఇంట్లో కలిసి గీతా పారాయణం చేయడం, గీతా జయంతికి అందరూ ఒకచోట కలవడం లాంటివి చేసేవాళ్లం. ఆ గ్రూపులు ఎంతోమంది పేద పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు సహాయం చేస్తుండేవి. అలా చాలా ఏళ్లు నడిచింది, ఆ తర్వాత నెమ్మదిగా అది కూడా ఆగిపోయింది.’
‘టెన్త్ క్లాస్ తర్వాత చదువుకోకుండా ఖాళీగా ఉన్న రెండేళ్ల కాలంలో నేను సైకిల్ వేసుకుని ఈ ప్రాంతమంతా తిరిగాను. ఎక్కడో ఒకచోట నా పాత శిష్యులు తారసపడుతూనే ఉండేవారు. ఆ తిరుగుడులోనే ఈ ప్రాంతంలో ఉన్న ‘హేమాడ్‌పంతి’ శైలికి చెందిన పురాతన జైన దేవాలయాలను చూడటానికి బయలుదేరాను. పెన్‌గంగా నదికి అటు ఇటు తిరిగి దాదాపు 65 పాడుబడిన, విరిగిపోయిన జైన ఆలయాలను చూశాను. వాటి గురించి చాలా నోట్స్ కూడా రాసుకున్నాను.’
‘అలా తిరుగుతున్నప్పుడు ప్రకృతిలో, పల్లెల్లో ఎన్నో వింతలు కనిపించేవి. ఒకసారి నేను వెళ్తుంటే ఎడ్లబండి తోలే ఒకాయన అన్నాడు, ‘గురూజీ, ఈసారి చాలా భారీ వర్షాలు పడతాయి’ అని. ‘ఎలా చెబుతున్నావు?’ అని అడిగితే. ‘కాకి ముక్కుతో పుల్లను కరిచి తీసుకెళ్తున్న తీరును చూడండి. అది పుల్ల మధ్యలో పట్టుకుంటే వర్షాలు సాధారణంగా ఉంటాయి. ఒక చివర పట్టుకుంటే కరవు వస్తుంది. కానీ అది పుల్లను గట్టిగా కరిచిన విధానాన్ని బట్టి ఈసారి వర్షాలు సమృద్ధిగా ఉంటాయి’ అన్నాడు. పల్లెల్లో ఇలాంటి నమ్మకాలు చాలా ఉండేవి. అలాగే ‘టిట్టిభం’ నీటి కాలువ ఒడ్డున ఎక్కడ గుడ్లు పెడుతుందనే దాన్ని బట్టి వర్షాన్ని అంచనా వేసేవారు. అది కాలువకు దగ్గరగా గుడ్లు పెడితే ఆ ఏడాది వర్షాలు తక్కువని, కాలువకు చాలా దూరంగా ఎత్తైన చోట గుడ్లు పెడితే ఆ ఏడాది వరదలు వస్తాయని చెప్పేవారు. పక్షులకు ప్రకృతి శక్తుల గురించిన అవగాహన ముందే ఉంటుంది కదా.’
‘నాకు విగ్రహాల తయారీ కోసం మంచి రాళ్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవడం కోసం కూడా తిరగాల్సి వచ్చేది. మా ఊళ్లో రాజస్థానీయుల మిఠాయి దుకాణం ఒకటి ఉండేది. అక్కడ ఎప్పుడూ ఒక ముసలి ఠాకూర్ పెద్ద గడ్డంతో, తలపాగా చుట్టుకుని కూర్చునేవాడు. నేను అక్కడ కూర్చుని ఆయన చెప్పే ముచ్చట్లు చాలా వినేవాడిని. ఆ హోటల్ కి చుట్టుపక్కల ఊళ్ల నుంచి రకరకాల మనుషులు వచ్చేవారు. వారందరితో మాట్లాడి, ఎక్కడ ఏ రకమైన రాయి దొరుకుతుంది, ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనే సమాచారమంతా సేకరించేవాడిని. అలాగే మా ప్రాంతంలో మాన నరసింహులు గారి దుకాణం ఉండేది, అక్కడ కూర్చుని కూడా ఎన్నో విషయాలు తెలుసుకునేవాడిని.’
‘అలాగే మన ఆయుధ శాస్త్రం గురించి నేను చాలా అధ్యయనం చేశాను. లాఠీలలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి భుజం సమానంగా ఉండేది, రెండోది చెవి సమానంగా ఉండేది, మూడోది మనకంటే నాలుగు వేళ్లు ఎత్తుగా ఉండేది. ఒక రకం లాఠీకి ఒక వైపు లావుగా ఉండి, రెండో వైపు సన్నగా వస్తుంది, దానిని రెండు చేతులతో పట్టుకుని తిప్పుతారు.’
‘ఇక కత్తుల విషయానికి వస్తే, చంద్రహాస కత్తి, దుధారి (రెండు వైపులా పదను ఉన్నది), ఖాండా, ఖడ్గం, బిచ్చువా (కటారు) లాంటి ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిని తిప్పే పద్ధతులు కూడా వేరుగా ఉంటాయి. పూర్వకాలంలో ధనుస్సులను జంతువుల కొమ్ములను జోడించి చేసేవారు. లేదా ఇనుమును పదే పదే కాల్చి, సాగదీసి చాలా బలమైన ధనుస్సులు తయారుచేసేవారు. ఆ ధనస్సుకు కట్టే నరము ఎలా చేసేవారో తెలుసా? ఎద్దు లేదా గేదె పేగులను ఎండబెట్టి, బాగా దంచి, అందులోని పీచుతో బలమైన తాడు పేని నారిగా కట్టేవారు. కొన్నిసార్లు వెదురు బద్దలను కూడా వాడేవారు.’
‘ధనుస్సును బాణం పెట్టి లాగడం అనేది టీవీల్లో చూపించినట్లు అంత తేలిక కాదు. దానిని కేవలం రెండు వేళ్లతోనే వెనక్కి లాగాలి. ఎవరైతే బాణాన్ని చెవి దాకా లాగగలరో వారే మహా బలశాలురు. అందుకే శ్రీరాముడిని ‘ఆజానుబాహుడు’ (మోకాళ్ల దాకా చేతులు ఉన్నవాడు) అనేవారు, ఎందుకంటే చేతులు పొడవుగా ఉంటే బాణాన్ని ఎక్కువ దూరం లాగవచ్చు, బాణం అంత వేగంగా వెళ్తుంది. బాణం సంధించేటప్పుడు చూపుడు వేలు చాలా ముఖ్యం. బాణం విడిచే వరకు అది దిశ తప్పకుండా పట్టి ఉంచేది ఆ వేలే.’
‘ఒకసారి నేను శ్రీశైలం వెళ్లినప్పుడు అక్కడ కొందరు నాతో అన్నారు, ‘ఇక్కడి చెంచులు చాలా అమాయకులు గురూజీ, వారికి ఏమీ రాదు, అంతా వేస్ట్’ అని. నేను వారిని చూడటానికి వెళ్లాను. వారి దగ్గర విల్లంబులు ఉన్నాయి. నేను వారిని అడిగాను, ‘ఈ బాణాలు ఎవరు చేశారు? అని. వారు ‘మేమే చేసుకున్నాం’ అన్నారు. ‘బాణం తయారు చేయడం వెనుక చాలా పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు. అలాంటిది మీకు ఈ విద్య వచ్చు కదా’ అని నేను అన్నాను. అలాగే వారు వెదురుతో ఒక అద్భుతమైన గంప అల్లారు. అందులో అడవి తేనెను నిల్వ ఉంచుతారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ వెదురు గంపలో నుంచి ఒక్క తేనె చుక్క కూడా కింద పడదు! అంత నిశితంగా అల్లుతారు.’
‘మన దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే.. మనం ఎప్పుడూ ఒక గిరిజనుడి దగ్గరకు వెళ్లి ‘నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు ఏ విద్య వచ్చు?’ అని అడగం. మనమే వాళ్లను ‘ట్రైబల్స్’ అనో, వెనుకబడిన వారనో ముద్ర వేసి మనకు తోచినట్లు మాట్లాడుతుంటాం. కానీ వారి లోపల అపారమైన సాంప్రదాయ విజ్ఞానం దాగి ఉంది.’
‘ఒకసారి మా ఆశ్రమానికి చక్కి, రోలు తయారు చేసే వడ్డెర మహిళ వచ్చింది. నేను ఆమెను అడిగాను, ‘మీ చరిత్ర ఏమిటి? సమాజంలో మీ స్థానం ఏమిటి?’ అని. ఆమె ఎంతో గర్వంగా చెప్పింది: ‘మహారాజ్! ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కులాల కంటే మా వడ్డెర కులమే అత్యంత పెద్దది, శ్రేష్ఠమైనది. మేము ‘మాణిక్యా దేవి’ ని కొలుస్తాం, ఆమె మా కులదైవం’ అని చెప్పింది. ఆ మాణిక్యా దేవి గుడి ఎక్కడ ఉందో తెలుసా?’ అని అడిగితే, ‘అది మాకు తెలియదు సార్’ అంది. నిజానికి ‘మాణిక్యగఢ్’ అనే కోటలో ఆ దేవి ఆలయం ఉంది. వడ్డెరలు తమను తాము ‘బాలనాగమ్మ’ సంతతిగా భావిస్తారు. వారు తమను తాము అంత ఉన్నతంగా చూసుకుంటారు. కానీ బయటి సమాజం మాత్రం వారిని తమకు నచ్చినట్లు తక్కువ చేసి చూస్తుంది. ఈ వివక్ష అంతటా నడుస్తోంది.’
‘మన కరీంనగర్, అదిలాబాద్ ప్రాంతాల్లో ‘మథుర’ అనే ఒక గిరిజన సమాజం ఉంది. వారు తమలో తాము చాలా ఆనందంగా, పద్ధతిగా బతుకుతారు. కానీ ఒకసారి కొందరు సోషల్ వర్కర్లు, లీడర్లు అక్కడికి వెళ్లి, వారి మధ్య లేనిపోని కుల భేదాలు, వర్గ విభేదాలు సృష్టించి వచ్చారు. నేను వారితో అన్నాను, ‘సజావుగా బతుకుతున్న వారి మధ్య మీ రాజకీయాల కోసం ఎందుకు విభేదాలు పెడతారు?’ అని. ఇదంతా నేడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజానికి ప్రతి సమాజం తమ పద్ధతిలో తాము ప్రశాంతంగా జీవిస్తుంటే, ఈ బయటి మనుషులే వెళ్లి వారిని చెడగొడుతున్నారు.’
‘మన ఆయుధాలలో మరొక విశేషం ఉంది. లాఠీలను నిత్యం బలంగా ఉంచడం కోసం మేము వాటికి రోజూ నూనె రాసి, రాత్రి పూట పాల గిన్నెలో పాల కొలతలో నిలబెట్టేవాళ్లం. లాఠీకి పాలు తాగించడం అంటారు దీన్ని. (నవ్వుతూ). ఆ పాలను వెదురు పీల్చుకోవడం వల్ల లాఠీకి అద్భుతమైన వంగుడు గుణం వచ్చేది. ఎంత కొట్టినా అది విరిగిపోయేది కాదు, రబ్బరు లాగా వంగి మళ్లీ పైకి లేచేది.’
‘అలాగే పూర్వకాలపు యుద్ధాలలో ‘సింఘాడ’ అనే ఇనుప ముళ్లను వాడేవారు. అది మూడు లేదా నాలుగు వైపులా ముళ్లు ఉన్న ఒక చిన్న ఇనుప పరికరం. దాని ప్రత్యేకత ఏమిటంటే, దానిని నేలపై ఎటు విసిరినా ఒక ముల్లు మాత్రం ఖచ్చితంగా పైకి నిలబడి ఉంటుంది. శత్రువులు రాకుండా కోట చుట్టూ ఉన్న గడ్డిలో ఈ సింఘాడాలను వేసేవారు. వాటికి ప్రమాదకరమైన విషం పూసేవారు. వాటి భయం ఎలా ఉండేదంటే- ఆ ముల్లు గుచ్చుకుంటే ఏనుగు అయినా సరే అక్కడికక్కడే చనిపోవాల్సిందే. అంతటి భయంకరమైన రక్షణ వ్యవస్థలు మనకు ఉండేవి. నేను మహారాష్ట్రలోని ఒక మ్యూజియంలో ఈ సింఘాడాను స్వయంగా చూశాను.’
‘ఇలా మన ప్రాచీన యుద్ధ విద్యల వెనుక, ఆచారాల వెనుక ఎంతో విజ్ఞానం దాగి ఉంది. నా చిన్నతనంలో నేను వీటిపై చాలా పరిశోధన చేశాను.’
Kalashramam, featured image photography: Sardar Harpal Singh, Adilabad,
2-6-2026


“కానీ ఆ సమయంలోనే నాకు అరవిందో గారి పుస్తకం ఒకటి దొరికింది.” అన్న వాక్యం ఆపింది. అంతా ఆ వయసులో పుస్తకాయ చదివినవారమే కాని. జీవితం దిశానిర్దేశం చేసే పుస్తకాలను ఎందుకు పట్టుకోలేక పోయానా? అనే చింత ఉండిపోయింది.
కొందరు కారణజన్ములు..అంతే.
మీరు ఈయనను కలవడం మా అదృష్టం.
ఇక ముందు ముందు వారినుండి ఎటువంటి విషయాలు వస్తాయో అని ఆసక్తి గా ఉంది. రికార్డెడ్ మెసేజ్ కూడా పెడతా అన్నారు పెట్టండి దయచేసి.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
అద్భుతమైన విషయాలు ఆకర్షణీయంగా చెబుతున్నారు మీరు. ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్!
ఎన్నో తెలుసుకుంటున్నాము. నమస్సులు సర్
ధన్యవాదాలు మేడం!
వీరి గురించి ఎప్పుడూ వినలేదు.
But what a wealth of information, and what an extraordinary life!
And all of this from just the first conversation!! Looking forward to the next conversations!!
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
ఆ పల్లె వాతావరణం, గిరిజన ప్రాంతాల పరిస్థితులు, అక్కడి వృత్తులు, అప్పటి ప్రజల జీవన విధానం.. తెలుసుకుంటుంటే.. ఇప్పటి మన యాంత్రిక జీవనం లో ఏమి కోల్పోతున్నామో.. తెలుస్తుంది సర్..
నా అదృష్టం కొద్దీ ఆ మహానుభావుణ్ణి చూసి ఆయనతో కొంత సేపు గడిపి ఆయన చెప్పిన గ్రామీణ వ్యవస్థలోని అన్ని వృత్తుల వారి సహకార సహజీవనం విని . అలాంటి వాతావరణం గలిగిన మా వెయ్యేళ్ల చరిత్ర గలిగిన వెలిగందలతో పోల్చుకుని మురిసిపోయాను. మళ్లీ ఆ ఆశ్రమం వాతావరణాన్ని కళ్లకు కట్టి చూపిస్తున్నారు. మీకు నమస్సులు.
చాలా సంతోషం సార్!
భద్రుడు గారు, మీకు గురూజీ రవీంద్రనాథ్ శర్మ గారు చెప్పింది యథాతథంగా రాశారో… లేక మీదైన శైలిలో ఆయన చెప్పింది రాసారో తెలీదు కాని, చదువుతుంటే ఆయన ఆశ్రమంలో ఆయన ముందర కూర్చుని వింటున్నట్టునిపించింది. ఎన్ని నూతన విషయాలు, ఎన్ని జీవిత సత్యాలు తెలిసాయో. మీరు మరో మనిషికి మమ్మల్ని హుక్ చేస్తున్నారు…ఈ జీవన శిల్పి సంభాషణలతో..
‘నిన్ను నువ్వు గుర్తుపట్టుకునే ఒక మార్గం ఏమిటంటే, నీ లోపల సహజంగా నడిచే విద్య ఏముందో చూడు, ఆ లోపలి విద్య నీకు పరమాత్ముడిచ్చింది అని. ఆ వాక్యం చదవగానే, మా ఊరి కుమ్మరి చెప్పినమాటకి, అరవిందో చెప్పిన మాటకి ఏమీ తేడా లేదని నాకనిపించింది. మా ఊరి కుమ్మరీ నాకు ఆ మాటే చెప్పాడు, అరవిందుడూ ఆ మాటే చెప్పాడు.’
మీరు మళ్ళీ వీడు ఆవు వ్యాసం టైప్.లో సిరివెన్నెల పేరు ప్రస్తావిస్తున్నాడనుకోకపోతే..
ఆ కుమ్మరి, అరవిందుడు చెప్పిన మాటలకి శాస్త్రి గారు ఒక పాటలో అన్న ఈ మాటలకీ కూడా పెద్దగా తేడా లేదనిపిస్తోంది – “గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టూ..
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు..
నీకు నువ్వు బాసవ్వాలంటే దాని బయట పెట్టు..
రేసు హార్సువై లైఫ్ ను
గెలిచే పరుగు మొదలుపెట్టు..”
ఇక ఈ వ్యాసపరంపర కొనసాగుతున్నంత కాలం మీ జీవన శిల్పి సంవాదం గురించి ప్రతి రోజూ ఎదురు చూస్తూ ఉంటాం..
మీరు చదివాక ఆ పోస్టు చేరవలసిన చిరునామాకు చేరినట్టు.
ఒక మనిషి అనుభవాల ద్వారా ఒక యుగం మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నేను చదవలేదు; ఒక జ్ఞాపక ప్రవాహంలో కొంతదూరం ప్రయాణించాను
ధన్యవాదాలు సార్!
చాలా ఆసక్తికరమైన కథనం. ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
శర్మ గారిని కలసి కొంత సమయం గడిపి కొన్ని సంభాషణలు చేసే అవకాశం నాకు లభించింది. అదృష్టం కదా.
మీ శైలి , శర్మ గారి సమాజ జ్ఞానం మనసుకు హత్తుకు పోయింది.
రెండవ సంపుటికై ఎదురు చూస్తున్నా.
Brigadier P Ganesham
పల్లె సృజన
ganeshpogula@gmail.com
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!