జీవన శిల్పి-27

గురూజీ ఆ తర్వాత దానికి కొనసాగింపుగా నాణేల గురించీ, పోలీసు పటేల్ వ్యవస్థ గురించీ, పురోహిత వ్యవస్థ గురించీ చాలానే చెప్పారు. కానీ నా దృష్టి వాటి మీద లేదు. ఆయన ప్రధానంగా శిల్పి. ఇంతవరకూ ఆయనతో శిల్పశాస్త్రం గురించి ఏమీ మాట్లాడించలేదు. కానీ ఆయనతో పరిచయమైన కొత్తలో ఆయన తాను చేసిన శిల్పాల్ని చూపిస్తూ వాటి వెనక ఉన్న తన భావనల్ని వివరించడం నాకూ బాగా గుర్తుంది.

అందుకని శిల్పకళా గురించి కూడా నాలుగు మాటలు చెప్పమని అడిగాను. గురూజీ నాకేసి సాలోచనగా చూసారు. తక్కినవన్నీ ఆయన చూసినవీ, విన్నవీ. కానీ శిల్పశాస్త్రం ఆయన స్వయంగా చదువుకున్నది. గురుముఖతః అభ్యసించింది కూడా. కాబట్టి చెప్పడం మొదలుపెడితే మొత్తం శాస్త్రమంతా ఒక వాక్ప్రవాహంగా వెలువడుతుందని ఆయనకు తెలుసు. నాలాంటి ఒక ప్రాథమిక శ్రోతకి ఎంత చెప్పాలో, ఎంత చెప్తే నేను గ్రహించగలనో, అంత మాత్రమే చెప్పడమెలా అని ఒకటి రెండు క్షణాలు ఆలోచించినట్టున్నారు. అప్పుడు చుట్టూ చూసారు. రోజూ ఆయన కూర్చునే గురుస్థానం పక్కన నటరాజ విగ్రహం కనబడింది.

దాన్ని చూపిస్తూ ‘ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఇదొక శిల్పం. దీన్ని ఎంత చేసినా దీన్ని ‘శిల్పం’ అనే అంటారు కదా, ‘బొమ్మ’ అనరు. బొమ్మను ఇంత పెద్దగా చేసినా అది ‘బొమ్మ’ గానే ఉంటుంది. బొమ్మలను ఏమంటారు? ఆటబొమ్మలు. ఆటబొమ్మలు అంటారు. అక్కడ గీత గీసినా అది ఆటబొమ్మే. ఇది గీత చేసినా ఇది శిల్పమే. ఆటబొమ్మను శిల్పం అనరు. బొమ్మను శిల్పం అని పిలవరు. దానికి దాని శైలి ఉంటుంది, దానికి దాని పద్ధతి ఉంటుంది, అవునా?’ అని అన్నారు. ఇంకా చెప్పడం మొదలుపెట్టారు:

‘పిల్లలు చాలా బొమ్మలు తయారుచేసేవాళ్లు. తమంతట తామే చాలా బొమ్మలు, వాయిద్యాలు చేసేవాళ్లు. బొమ్మలు చాలా చేసేవాళ్లు, సొంతంగా తయారుచేసుకునేవాళ్లు. ఇవన్నీ మనిషిని, ముఖ్యంగా పిల్లాడిని చాలా యాక్టివ్‌గా ఉంచేవి. మందకొడిగా తయారుచేసేవి కావు. వాడు ఎప్పుడూ అందులోనే నిమగ్నమై ఉండేవాడు, వాడి బుర్ర పనిచేస్తూనే ఉండేది. సృజనాత్మక పనులు.  ఎందుకంటే సృజనాత్మకత అనే పదాన్ని మనం అప్పట్లో వాడలేదు.’

‘మన దగ్గర రెండు మూడు పదాలుండేవి కావు. కాంపిటిషన్, క్రియేటివిటి అనే రెండు పదాలు మనదగ్గరుండేవి కావు. క్రియేట్ చెయ్యడానికి మనమెవరం? సృష్టికర్త ఒక్కడే కదా. మనం సృష్టికి ప్రతిసృష్టి చేస్తాం. తిరిగి రచిస్తాం. కానీ మనం సృష్టికర్తలం అని చెప్పుకోలేం. అవును. మనం శోధించగలం. ఆవిష్కరించగలం. కానీ సృష్టికర్త అని మాత్రం పేరు పెట్టుకోలేం. శోధన ఉంది. ఆవిష్కరణ ఉంది. కానీ అదంతా ఈ సృష్టిలో భాగమే.

‘అందుకే మన దగ్గర ఏ కళాకారుడూ తనని తాను సృష్టికర్తగా భావించేవాడు కాడు. శిల్పశాస్త్రంలో ఒక వర్ణన ఉంది- నరనారాయణులు బ్రహ్మని అడిగారు. నువ్వు ఎలాగైతే సృష్టిస్తావో, అలా సృష్టించడంలోని ఆనందం మేమెలా పొందాలి? సృష్టించడంలో ఉండే ఆనందం మాకు కూడా తెలియాలి కదా. మరి ఆ ఆనందాన్నెలా పొందగలం అని అడుగుతారు.  ఆ సమయంలో విష్ణుధర్మోత్తర పురాణంలో చిత్రసూత్రం గురించిన వర్ణన వస్తుంది. ఆ సూత్రమిలా చెప్తుంది-’

‘ఇవి చిత్రకళకుండే ఆరు అంగాలు. వీటి ద్వారా నువ్వు సృష్టికి ప్రతిసృష్టి చెయ్యగలవు. సృష్టించడంలోని ఆనందాన్ని పొందగలవు అని. చిత్రకళకు సంబంధించిన చాలా సమాచారం విష్ణుధర్మోత్తర పురాణంలో మనకు లభిస్తుంది. అలాగే శిల్పకళ గురించి కూడా మనదగ్గర చాలా శాస్త్రాలున్నాయి. మయవాస్తు, కాశ్యప శిల్ప సూత్రం, సమరాంగణ సూత్రధార, అపరాజిత పృచ్ఛ, మానసోల్లాస, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణం,  విశ్వకర్మీయం- ఇలా చాలా గ్రంథాలున్నాయి. మూర్తి విజ్ఞానం గురించి అంతా మనకు వీటిల్లో లభిస్తుంది.’

‘దేవాలయాలు ఎలా నిర్మించాలి అనేదాని గురించి ఈ శాస్త్రాల్లో చాలా అందంగా వర్ణించారు. శాస్త్రాలకు శాస్త్రాలే తయారయ్యాయి. మనదగ్గర మూడు ముఖ్యమైన దేవాలయ శైలులున్నాయి. ద్రావిడ, వేసర, నాగర. ద్రావిడ అంటే దేని అధిష్టానం చతురస్రాకారంలో ఉంటుందో అది. నాగర అంటే పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉండేది. దేని బేస్ గుండ్రంగా ఉంటుందో అది వేసర. పల్లవ కూడా ఒకటి ఉంది, అది రాళ్ళవల్ల ఒక శైలిగా మారింది. వీటిల్లో మళ్ళీ చాలా ఉపశైలులు వచ్చాయి.’

‘మూలం ఈ మూడే. ఆ తర్వాత శిల్పకళ, నిర్మాణ కళ వేరువేరుగా, రకరకాలుగా మారాయి ప్రతి చోటా. సోంపుర శైలి ఒకటుంది, హేమాద్ పంతు ఉంది, ‘రూపమండన’ ప్రకారం మండన శైలి ఒకటుంది. ఆ విధంగా వాళ్ళు తమ తమ శైలుల్ని రూపొందించుకున్నారు. ఇప్పుడు బేలూరు, హళేబీడు శైలి ఒకటి ఉంది. ఇందులో శరీరం కంటే అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. చాలా అలంకారాలు చేసారు. ఖజురహో శైలి ఒకటి ఉంది. అందులో అలంకారానికి కాకుండా శరీర సౌష్టవానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఆ శిల్పాల్లో శరీరాన్ని చాలా అందంగా ఆవిష్కరించారు. ప్రతి ఒక్క శైలిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ శైలిని చూసి మనం అది ఏ యుగానికి చెందిందో గుర్తించవచ్చు. ఏ కాలంలో నిర్మించారో చెప్పవచ్చు. ఏ యుగంలో తయారైంది, చోళయుగంలో ఎలా ఉంది, పల్లవ యుగంలో శిల్పమెలా ఉంది చెప్పవచ్చు.’

‘వీటన్నిటిలో మనకు మూడు పెద్ద ప్రతీకలున్నాయి. సత్యం, శివం, సుందరం- వీటికి మూడు చిహ్నాలున్నాయి. సత్యానికి, కళలో చిహ్నం, చతురస్రం. ఎక్కడ వేసినా  చతురస్రం చతురస్రమే. శివానికి త్రిభుజాకారం చిహ్నం.  ఎక్కడ వేసినా ఒక కోణం పైకి ఉంటుంది. సౌందర్యానికి చిహ్నం వృత్తం. ప్రతి ఒక్క దేవాలయంలోనూ ఈ  మూడింటినీ  ఉంచుతారు.

‘ఈ మూడు చిహ్నాలమీదా  మళ్ళీ దేవతలున్నారు. సత్యానికి ప్రతీక విష్ణువు. శివానికి ప్రతీక శివుడు. ఆయన మూర్తులన్నీ త్రిభుజాకారంలోనే అమర్చి ఉంటాయి. సుందరానికి ప్రతీక బ్రహ్మ. ఆ మూర్తి పూర్తి గుండ్రంగా ఉంటుంది. ఆయన చుట్టూ తలలు, గుండ్రటి పద్మం, గుండ్రటి కమండలం, గుండ్రని రుద్రాక్షలు, అన్నీ గుండ్రంగానే ఉంటాయి ఆ మూర్తి మొత్తం. ఆయనే సృష్టికర్త.’

దేవాలయాలు నిర్మించేటప్పుడు శిలాపరీక్ష చాలా ముఖ్యమైంది.

అంటే శిల ఎలా ఉండాలంటే అందులో ఏ లోహం గుణాలూ ఉండకూడదు.

ప్రాసాదం నిర్మించాలన్నా, భవనం నిర్మించాలన్నా, దేవాలయం నిర్మించాలన్నా, ఏది నిర్మించాలన్నా దాన్ని శాస్త్రం ప్రకారమే నిర్మించాలి, అది మనుష్యుడి రూపమైనా, పశుపక్ష్యాదుల రూపమైనా సరే.

రాయి ఎలా ఉండాలంటే, కఠినంగా, అందంగా ఉండాలి. అందులో సువాసన కూడా రావాలి. అలాంటి శిలను చూసి, దాన్ని పరీక్షించాలి.

రాయిలో కాంస్యం, లోహం లేదా ఏ ఇతర లోహం యొక్క లక్షణాలు కానీ, గుణాలు కానీ ఉండకూడదు. అలాంటి శిలను వెతికి, దానితో ప్రతిమను తయారుచేయాలి. అది ఎలాంటి రంగుల్లో ఉండాలంటే..

పావురం రంగులో, తుమ్మెద రంగులో—నలుపు రంగులో, పెసల  రంగులో, మినుముల రంగులో, మరియు ఘృత పద్మాభ—నెయ్యి రంగులో ఉండే శిలలతో ప్రతిమలను తయారుచేయవచ్చు. కానీ అందులో లోహ గుణం ఉండకూడదు.

‘చాలా మంచి రోజు చూసి, సుముహూర్తం చూసి, గ్రహాలన్నింటినీ శాంతింపజేసి, ఆ సమయంలో ప్రతిమ, గృహ లేదా కాష్ఠాది కర్మలను ప్రారంభించాలి. ప్రతిమ కోసం శిలలో లోహ గుణం ఎందుకు ఉండకూడదు అంటే,  అలాంటి శిల దొరకడం చాలా కష్టం, వెతకాలి ఆ శిల. ఎలా గుర్తిస్తారు? గుర్తించగలరు, గుర్తిస్తారు’

‘శిలలో స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం అని మూడు ఉంటాయి. శిలకు కూడా బాల్యావస్థ, తరుణావస్థ, యువావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ ఉంటాయి. శిలలకి కూడా  నిద్రావస్థ, జాగ్రదావస్థలు కూడా ఉంటాయి. ఇవన్నీ గుర్తించాల్సి ఉంటుంది, గుర్తించగలరు. దీని కోసం చాలా అనుభవం కావాలి. ఆచార్యులతో కలిసి ఉండి వీటిని గుర్తించవచ్చు, థియరీ చదివితే ఎవరూ గుర్తించలేరు. ఇది అనుభవం.’

‘ఏ శిలలో అగ్ని గుణం, జలగుణాలతో పాటు నాదం ఉంటుందో, ఆ మూడు గుణాలు సమానంగా ఉంటే అది పుల్లింగ శిల. స్త్రీలింగ శిలలో నాదం తగ్గిపోతుంది. అగ్ని ఉంది, జలం ఉంది, కానీ నాదం అంతగా ఉండదు, అది స్త్రీలింగ శిలగా భావిస్తారు. నపుంసకలింగ శిలలో ఈ మూడు గుణాలూ ఉండవు. అగ్ని గుణం లేదు, జల గుణం లేదు, నాదం లేదు, అప్పుడది నపుంసకలింగ శిల.’

‘పురుషుడి ప్రతిమను ప్రతిష్ఠిస్తుంటే, దాని పీఠం స్త్రీలింగ శిలతో తయారవుతుంది. శక్తి లేదా దేవి ప్రతిమ అయితే, దాని పీఠం పుల్లింగ శిలతో తయారవుతుంది. దేవాలయం మొత్తం నపుంసకలింగ శిలతో నిర్మించాలి. అందులో స్త్రీలింగ లేదా పుల్లింగ శిలలు వాడకూడదు, అది నపుంసకలింగ శిలతోనే నిర్మితమవుతుంది.’

‘ఇందులో పిల్లల దశ, యవ్వన దశ మొదలైనవన్నీ గుర్తిస్తారు. బాల్యావస్థలో ఉన్న శిలతో ప్రతిమను తయారుచేయకూడదు, తరుణావస్థ లేదా ప్రౌఢావస్థను చూస్తారు. అలాగే  ఆ శిల ఉత్తర-దక్షిణంగా ఉందా, లేదా తూర్పు-పడమరలుగా ఉందా అని చూస్తారు. పెరుగుతున్న చెట్టును రివర్స్‌లో చెక్కడం ఎలాగైతే కష్టమో, శిలలో కూడా అలాగే ఉంటుంది.’

‘రాతిలో కూడా దాన్ని గ్రెయిన్స్ బట్టి చెక్కాల్సి ఉంటుంది. చెక్కలో అయితే సులభంగా తెలుస్తుందిగానీ, రాతిలో తెలియడం కష్టం. రాయిని తీసేటప్పుడే అది ఏ దిశలో పడి ఉందో చూడాలి, అప్పుడు సులభంగా తెలుస్తుంది. కానీ జాగ్రదావస్థలో ఉన్న శిలని వాడకూడదు. ప్రతిమను తయారుచేసేటప్పుడు అది నిద్రావస్థలో ఉండాలి. నిద్రావస్థ, జాగ్రదావస్థ ఎలా అంటే- వాతావరణంలో కొన్ని మార్పులు జరిగేటప్పుడు శిలలు పెరిగే సమయం ఉంటుంది. శిలలు తమంతట తాము పెరుగుతాయి.  చాలాసార్లు వాటి పెరుగుదల ఆగిపోతుంది. అవి పెరుగుతున్నప్పుడు జాగ్రదావస్థలో ఉన్నట్టు. అది తెలుస్తుంది. వాటి ఎదుగుదల ఆగినప్పుడు నిద్రావస్థలో ఉన్నట్టు.’

‘కాబట్టి లోహ రహితమైన శిలని చూడాలి. దానితో ప్రతిమను తయారుచేసిన తర్వాత మూడునెలలపాటు నీళ్ళల్లో ఉంచాలి. దాన్ని జలాధివాసం అంటారు. ఆ తర్వాత మూడు నెలలు ఎండలో, మూడు నెలలపాటు మూలికల రసంలో ఉంచాలి. రకరకాల మూలికల రసంలో దాన్నుంచాలి. ఏ రాతిలో లోహగుణాలు లేవో అది ఆ రసాలన్నింటిని తనలోకి పూర్తిగా పీల్చుకుంటుంది. అప్పుడు ఆ ప్రతిమ, ఆ శిల ఒక ఔషధంలా తయారవుతుంది. ఆ రాతిలోకి మూలికలరసం ప్రవేశించి అదొక మందులా మారుతుందన్నమాట.’

‘దాన్ని దేవాలయాల్లో ప్రతిష్ఠించేటప్పుడు అందులో ఉన్న అగ్నిగుణ తత్త్వానికి బలం చేకూరుస్తారు. దాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. దాన్ని ప్రతిష్ఠించే ముందు  దానికింద అధిష్టానంలో పాదరసం పోస్తారు. ఆ బేస్ అందులో మునిగిపోవాలి. ఎందుకంటే కిందనుంచి ఎలాంటి కీటకాలుగానీ, బాక్టీరియా గాని అందులోకి ప్రవేశించకూడదు. ఆ తర్వాత ఆ ప్రతిమను నిలబెడతారు.’

‘ఆ ప్రతిమను అభిషేకం చేసిన నీటిని తీర్థంగా ఇచ్చేటప్పుడు ఒక మంత్రం చదువుతారు- ‘అకాల మృత్యు హరణం సర్వవ్యాధి వినాశనం’ అని. అంటే అది అకాల మృత్యువును హరించేదీ, వ్యాధుల్ని నయం చేసేది అని, అంటే అది ఒక మందు అన్నమాట. ఏ శిలనైతే ఔషధమయం చేసారో, దాని అభిషేక జలం మందే కదా.’

‘పూర్వకాలంలో ఈ మూర్తులు తయారైనప్పుడు ప్రజలు దేవాలయంలో గర్భగుడి వరకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ శిల వెనక భాగం నుంచి కొద్దిగా ముక్కలు విరగ్గొట్టుకుని తెచ్చుకునేవాళ్ళు. సుత్తీ, ఉలీ పట్టుకెళ్ళి చిన్నముక్క కొట్టి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే దాన్ని అరగదీసి మందులా చేసి తాగించేవాళ్ళు. అలా మొదలయ్యింది. అందుకే చాలా మూర్తులకి వెనకభాగం ఉండదు. తమిళనాడులో చాలా దేవాలయాల్లో మూర్తులకు వెనకభాగం కనిపించదు. ఆ తర్వాత అందరికీ గర్భగుడిలోకి వెళ్ళడం నిషేధించారు. చాలాసార్లు శిలాశాసనాల్ని కూడా జనాలు అరగదీసి తాగేసేవాళ్ళు. అలా చాలా శాసనాలు కూడా అంతమైపోయాయి. అవి కూడా మందు అని వాళ్ళు నమ్మడం వల్ల వాటిని అరగదీసి తాగేయడం వల్ల.

‘ఇందులో రాతిమూర్తులు తయారుచేయడం ఒకటి, లోహమూర్తులు రెండోది. లోహంతో, చెక్కతో, రత్నాలతో కూడా ప్రతిమలు తయారవుతాయి. వాటికంటూ ప్రత్యేకనియమాలున్నాయి-’

‘ఏ  మూర్తినైతే తయారుచేసి వందేళ్ళకు పైబడిందో అది విరిగిపోయినా సరే పూజించడానికి యోగ్యమైందే. దాన్ని తొలగించకూడదు. వంద ఏళ్ళ లోపు మూర్తి అయితే విరిగితే దాన్ని మార్చేయాలి. ఎందుకంటే దాన్ని తయారుచేయడం చూసినవాళ్ళుంటారు. తయారుచేసేవాళ్ళుంటారు కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు. అంతకంటే పురాతనమైన మూర్తి అయితే దాన్ని తొలగించకూడదు.’

‘అదే దారు, లోహమూర్తులు విరిగితే వాటికి సంస్కారం చెయ్యవచ్చు. వాటిని కలపవచ్చు. కానీ శిలామూర్తికి సంస్కారం చెయ్యడానికి ఉండదు. అష్టలోహమయీ మూర్తి- ఎనిమిది లోహాలతో, తొమ్మిది లోహాలతో, ఐదు లోహాలతో తయారయ్యే మూర్తులకు వాటికంటూ ప్రత్యేక గుణాలుంటాయి. ఎనిమిది లేదా తొమ్మిది లోహాలతో మూర్తిని తయారుచేసేవాడికి, జాగ్రత్తగా లేకపోతే, కుష్టురోగం వచ్చే అవకాశం ఉంటుది. ఆ లోహాల్ని కరిగించేటప్పుడు వచ్చే గ్యాసెస్ ప్రభావం వల్ల రకరకాల వ్యాధులు రావచ్చు.’

‘కానీ అదే ఆ అష్టలోహ, నవలోహ మూర్తి అభిషేక జలం తాగడం వల్ల కుష్టు వ్యాధి నయమవుతుంది. తయారుచేసేటప్పుడు అది వ్యాధికి కారణం కావచ్చు, కాని ఆ తర్వాత వ్యాధిని నయం చేసేది కూడా అదే. కాబట్టి ఈ మూర్తుల్లో లోహం, మట్టి, రాయి, చెక్క-ఇలా అన్ని రకాల మూర్తులూ ఉన్నాయి.వాటికి నిష్పత్తులు ఉన్నాయి. ఏకతాళ, ద్వితాళ, త్రితాళ, పంచతాళ, అష్టతాళ-ఇలా.’

‘ఎనిమిది తాళాలలో పార్వతి ప్రతిమ తయారవుతుంది, తొమ్మిది తాళాలలో మిగిలిన దేవతల ప్రతిమలు. తాళం అంటే ఏమిటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు (చేత్తో కొలిచి చూపిస్తూ) ఒక తాళం. పది తాళాలలో రాముడి ప్రతిమ, జైన ప్రతిమలు తయారవుతాయి.’

‘11 తాళాలలో స్కందుడు (కుమారస్వామి), హనుమంతుడి ప్రతిమలు తయారవుతాయి. 12 తాళాలలో వేతాళుడి ప్రతిమ, 13 తాళాలలో రాక్షసుల ప్రతిమలు, 14 తాళాలలో దైత్యుల ప్రతిమలు తయారవుతాయి. అసురులు వేరు, దైత్యులు వేరు, రాక్షసులు వేరు, దానవులు వేరు. అందరూ వేర్వేరు. మయుడు దానవుడు, బలి చక్రవర్తి దానవుడు, రావణుడు అసురుడు, మారీచుడు రాక్షసుడు, హిరణ్యకశిపుడు దైత్యుడు. వీరందరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, అందరూ ఒక్కటే కాదు.’

‘రావణుడిని అసురుడు అంటారు. మారీచుడు రాక్షసుడు. అసురులు చాలా బలవంతులు, మాయావులు కాదు. రాక్షసులు మాయావులు, వాళ్లు మాయతో రూపాలు మారుస్తారు. అందుకే రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్లాడు—నువ్వు లేడి గా మారు అని. మారీచుడు రాక్షసుడు కాబట్టి రూపం మార్చగలడు, రావణుడు రూపం మార్చలేడు, కేవలం వేషం మార్చగలడు. కాబట్టి రాక్షసులు మాయావులు.’

‘దైత్యులు, దానవులు చాలా బలవంతులు, వాళ్లకు శస్త్రవిద్యలపై చాలా పట్టు ఉండేది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు దైత్యులు. బలి చక్రవర్తి దానవుడు. దైత్యులలో దయాదాక్షిణ్యాలు ఉండవు. ‘హిరణ్యాక్షుడు’ అంటే—హిరణ్యం అంటే భూమి, ధనం, దేనిపై అయితే కన్ను పడి ఉంటుందో వాడు హిరణ్యాక్షుడు. వీళ్లకు దానం చేయడం రాదు, కేవలం దోచుకోవడం, దాచుకోవడం తెలుసు. దానవులు అలా కాదు, బలి దానవుడు, వాడు దాచుకోవడంతో పాటు దానం చేయడానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాడు, కానీ దైత్యులు దానాన్ని నమ్మరు. అయితే  తపస్సు అందరూ చేస్తారు, దైత్యులు, దానవులు, అసురులు అందరూ తపస్సంపన్నులే, సాధన చేసేవాళ్లే, ఆ సాధనా బలంతోనే ఇవన్నీ చేసేవాళ్లు.’

‘శిల్పశాస్త్రంలో వీరందరి ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. యక్షులు వేరు, గంధర్వులు వేరు, కిన్నెరులు వేరు. వీళ్లంతా దేవతా గణాలు. కింపురుషులు వేరు, నారదుణ్ణీ,  తుంబురుణ్ణీ కింపురుషులుగా భావిస్తారు. కిన్నరులు, యక్షులు, గంధర్వులు చాలామంది ఉన్నారు, వీళ్లంతా దేవతలలో భాగం.’

‘వీరి ప్రతిమల నిష్పత్తులు కూడా శిల్పశాస్త్రంలో వేర్వేరుగా ఉన్నాయి, చాలా అందంగా చెక్కుతారు వీటిని. రాక్షసుడు అయినా సరే చాలా అందంగానే ఆవిష్కరిస్తారు. జైన ప్రతిమలు పది తాళాలలో తయారవుతాయి, హనుమంతుడు, చండిక 11 తాళాలలో, దైత్యులు 14 తాళాలలో- ఇలా ఉన్నాయి. వినాయకుడు పంచతాళంలో తయారవుతాడు. వినాయకుడికి మన దగ్గర 32 రూపాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ రూపాలు కూడా ఉన్నాయి. బాలగణపతి, తరుణగణపతి, భక్తగణపతి, వీరగణపతి, క్షిప్రగణపతి, క్షిప్రప్రసాదగణపతి, ఉద్దండగణపతి, ధుండిగణపతి, మహాగణపతి, లక్ష్మీగణపతి, సింహగణపతి- ఇలా 32 రూపాలు ఉన్నాయి.’

‘ఆ తర్వాత మయూరేశ్వరుడు, ధూమ్రకేతుడు- ఇలా 16 గణపతులు వేరే ఉన్నారు. వినాయకుడు కేవలం పార్వతీదేవి కుమారుడే కాదు, కశ్యపుడి కొడుకు కూడా. ధూమ్రకేతు గణపతి కశ్యపుడి కొడుకు, ఆయన వాహనం గుర్రం, ఆయన చేతిలో డాలు, కత్తి ఉంటాయి. మయూరేశ్వరుడి వాహనం నెమలి. అలాగే ‘ప్రాచ్య గణపతి’ అని ఒకరు ఉన్నారు, ఆయన ఆసనం కపాలం, కపాలమే ఆయన అలంకారం. ఈ విధంగా వినాయకుడికి చాలా రూపాలు ఉన్నాయి.’

‘అర్క గణపతి’ అని ఒకరు ఉంటారు. తెల్ల జిల్లేడు మొక్కకు 33 ఏళ్ల పాటు నీళ్లు పోస్తే, 33 ఏళ్ల తర్వాత దాని వేర్లలో తనంతట తాను వినాయకుడి ఆకారం తయారవుతుంది. దాన్ని తెచ్చి పూజిస్తారు, పుష్య నక్షత్రం రోజు దాన్ని తీసి పూజిస్తారు, అది అర్క గణపతి. జిల్లేడు అంటే అర్క. ‘గణపతిని’ అని ఒక రూపం ఉంది, ఇవన్నీ తాంత్రిక రూపాలు. దీని తొండం స్త్రీ రూపంలో ఉండి, తల వినాయకుడిలా ఉంటుంది. ఈ విధంగా వినాయకుడికి చాలా రూపాలు ఉన్నాయి. శిల్పశాస్త్రంలో వీటి గురించి చాలా చక్కగా వివరించారు. ‘

‘ప్రతిమను తయారుచేసేటప్పుడు ఎవరి ప్రతిమను తయారుచేస్తున్నారో చూస్తారు. రాముడి ప్రతిమ అయితే ‘ద్విభంగిమ’ లో, కృష్ణుడి ప్రతిమ ‘త్రిభంగిమ’ లో, విష్ణువు ప్రతిమ ‘సమభంగిమ’ లో తయారుచేస్తారు. కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే—మాయ వంకరగా ఉంటుంది, కాబట్టి దాన్ని వంకరగానే జయించాలి అని, అందుకే ఆయన మూర్తులన్నీ త్రిభంగిమలోనే ఉంటాయి, తిన్నగా ఉండవు. రాముడు మర్యాదా పురుషోత్తముడు, ఆయన ప్రతిమ ద్విభంగిమలో ఉంటుంది. ఇవన్నీ వాటి లక్షణాలు.’

‘మరి వీళ్ల శరీరం ఎలా తయారవుతుంది అంటే- ముఖం అండాకారంలో, ముక్కు సూటిగా, కళ్లు చేపలాగా లేదా పక్షిలాగా, కనుబొమ్మలు విల్లులాగా, జుట్టు సింహం జూలులాగా, చెవులు నెమలిలాగా, పెదవులు పద్మంలాగా, గడ్డం మామిడి జీడిలాగా, గొంతు శంఖంలాగా, చేతులు ఏనుగు తొండంలాగా, వక్షస్థలం ఎద్దులాగా, నడుము సింహంలాగా, అరచేయి తమలపాకులాగా- ఈ విధంగా అన్ని లక్షణాలు కలగలిపి ఒక ప్రతిమను తయారుచేస్తారు మన దగ్గర. శిల్పశాస్త్రంలో దీని గురించి చాలా అద్భుతమైన విధానం ఉంది.’

‘ప్రతిమల పరిమాణం గురించి కూడా నియమాలు ఉన్నాయి. ఒక అంగుళం నుంచి 12 అంగుళాల వరకు ఉన్న ప్రతిమను ఇంట్లో పూజించవచ్చు, అంతకంటే పెద్దది కాదు, దాన్ని ‘చల ప్రతిమ’ అంటారు. ఎందుకంటే ఇల్లు మారాల్సి వచ్చినా, దాన్ని వెంట పట్టుకెళ్లవచ్చు. పెద్దదైతే ప్రాణప్రతిష్ఠ చేసినదాన్ని తీసుకెళ్లలేము కదా. ఒకవేళ ఇల్లు అమ్మాల్సి వస్తే, ఆ ఇల్లు వేరే సంప్రదాయం వాడు కొంటే ఆ మూర్తిని ఏం చేస్తాడు? అందుకే ఇంట్లో 12 అంగుళాల వరకే ఉండాలి. 12 అంగుళాల నుంచి తొమ్మిది హస్తాల పొడవు వరకు ఉన్న ప్రతిమను దేవాలయాల్లో ప్రతిష్ఠించాలి, దానికోసం దేవాలయం ఉండాలి. పది చేతుల నుంచి 24 చేతుల వరకు ఉన్న ప్రతిమను దేవాలయం లేకుండా కూడా పూజించవచ్చు, దానికోసం ఎంత పెద్ద ఆలయం కడతారో కదా! అది దేవాలయం లేకుండా కూడా పూజించవచ్చు.’

‘మన శిల్పశాస్త్రంలో ప్రతిమలకు, దేవాలయాలకు సంబంధించిన చాలా స్పష్టమైన నియామకాలు, ప్రమాణాలు ఉన్నాయి. శివుడిలో కూడా ‘లింగం’ లో చాలా రకాలు ఉన్నాయి, 365 రకాల లింగాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కో పేరు ఉంది. అందులో ‘అనంత లింగం’ అని, గుండ్రటి లింగం అని, ‘స్వయంభూ లింగం’ అని ఉన్నాయి. నర్మదా నదిలో లభించేవి స్వయంభూ లింగాలు, వాటిని ‘బాణలింగాలు’ అని కూడా అంటారు. బాణాసురుడు చాలా లింగాలను నదిలో వేశాడని చెప్తారు, అందుకే వాటిని బాణలింగాలు అంటారు. స్వయంభూ లింగాలు వేరు, బాణలింగాలు వేరు. కాకతీయుల కాలం నాటి లింగాలు పైభాగం తిన్నగా కట్ చేసినట్టు ఉంటాయి, వాటిని ‘అనంత లింగాలు’ అంటారు, అవి అనంతత్వానికి ప్రతీకలు.’

‘ఇంకా ‘రసలింగాలు’ అని ఉన్నాయి, ఆలంపూర్‌లో ఉన్నవన్నీ రసలింగాలే, అవి మూలికల రసాలతో తయారుచేసినవి. ఇవి కాక 12 ‘జ్యోతిర్లింగాలు’ ఉన్నాయి, వాటి శిలలు, పద్ధతులు వేరు. ఈ విధంగా రసలింగాలు, జ్యోతిర్లింగాలు  ఉన్నాయి. శిల్పశాస్త్రంలో వీటన్నింటి గురించి చాలా అద్భుతమైన వివరణ ఉంది.

‘దేవాలయాల నిర్మాణం శిఖరం నుంచి కిందటి వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. దేవాలయాల్లో మళ్లీ శిఖరం నుంచి కిందటి వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది-’


గురూజీ అక్కడితో ఆపేసారు. బహుశా తన మాటల్లో శాస్త్రం ఎక్కువ ప్రస్తావనకు వస్తున్నదని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ శిల్పిగా గురూజీ శాస్త్రాన్ని ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారో అంతగానూ  ఆ పరిమితుల్ని దాటి తన భావనలకు రూపురేఖలు కల్పిస్తూనే ఉన్నారు. గొప్ప కళాకారుల లక్షణమే అది.

ఒకసారి నేను ఆశ్రమంలో అడుగుపెట్టేటప్పటికి, ఆ ముందురోజో ఎప్పుడో, పోతపోసిన విగ్రహం బయటికి తియ్యడం కోసం మూసబద్దలుగొడుతూ ఉన్నారు. నా ఎదురుగానే ఆ విగ్రహాన్ని బయటకు తీసారు. అది కంచు విగ్రహం అనుకుంటాను. దానిలో ఒక అద్వితీయమైన మెరుపు కనిపిస్తూ ఉంది. కోశం నుంచి బయటపడ్డ సీతాకోకచిలుకలాగా ఉంది అది. అలా ఒక మూసనుంచి ఒక విగ్రహం  బయటకు తీస్తుండగా చూడడం నా జీవితంలో  అదే మొదటిసారి. చిన్న విగ్రహం.  జానెడో లేదా ఒకటిన్నర జాననో  పొడవు ఉండి వుండవచ్చు. అప్పుడే తల్లికడుపునుంచి బయటపడ్డ శిశువుని జాగ్రత్తగా రెండుచేతుల్లోకీ తీసుకున్న మంత్రసానిలాగా ఆ మూర్తిని పరికిస్తున్నారు. ఎన్ని కానుపులో చూసినప్పటికీ, ప్రతి ఒక్క ప్రసవం ఎదటా ఆశ్చర్యంగా కళ్ళప్పగించే దాయీ లాగా చూస్తున్నారు. ఆ చిన్ని విగ్రహానికి రెండు తలలు కనిపిస్తున్నాయి. ‘ఇదేమిటి? రెండు తలలున్నాయి?’ అనడిగాను.

‘ఈయన అగ్ని’ అని సుప్రసిద్ధమైన వేదమంత్రం వినిపించారు:

అప్పటికి అగ్నిసూక్తాలు నేను చదవకపోలేదు. అరవిందుల అనువాదం కూడా చదివి ఉన్నాను. కాని రెండు శీర్షాలతో కూడిన ఆ చిన్ని అగ్నిప్రతిమను చూసినప్పుడు నాకు నిజంగా అగ్నిదేవత సాక్షాత్కారమైనట్టు అనిపించింది. ఒక ముఖం భూమివైపూ, మరొక ముఖం ఆకాశం వైపూ ఉన్న ఆ దేవత ఏకకాలంలో ప్రాణప్రదాతగానూ , లయకారుడుగానూ కనిపించాడు.

అది శాస్త్రప్రమాణాల ప్రకారం ఆయన చేసిన శిల్పం. అదే ‘చాముండ’ అని ఆయన చేసినదే మరొక శిల్పం ఉంది. అందులో ఎముకలు తప్ప మరేమీ కనిపించని దేహంతో వెనక్కి వాలి, ఆ దేవత ఈ క్షణమో, మరుక్షణమో ఎదుటివాళ్ళమీద విరుచుకుపడేదిలాగా కనిపిస్తుంది. అత్యంత భీకరాకృతి. కాని ఆ మూర్తిని చూడగానే మనలో భయం కన్నా కూడా ఒకలాంటి ఆరాధన తలెత్తుంది. ‘ఏమిటి గురూజీ ఈమెలో విశేషం?’ అనడిగాను. ‘ఆకలితో మాడిపోతున్న ప్రజల క్రోధానికి ఆమె ప్రతీక. ఆకలిగొన్న నిరుపేదలు ఆగ్రహిస్తే అదిగో అటువంటి శక్తి ప్రభవిస్తుంది’ అన్నారు గురూజీ. అది పూర్తిగా ఆయన దర్శనం. ఏ శిల్పశాస్త్రమూ ఊహించలేని దేవత ఆమె.

చాలా సార్లు ఆయన నటరాజు గురించి చెప్తూ ఉంటే అదంతా ఒక కవిత విన్నట్టుగా ఉంటుంది. ఇంతకుముందు ఒక సంభాషణలో ఆయన చెప్పారు కూడా. మొదటిసారి ఆ వివరణ విన్నప్పుడు నేను పరవశించిపోయి, కనబడ్డవారందరికీ చెప్తూ  వచ్చాను. అలానే ప్రసిద్ధ కథకుడు త్రిపురతో కూడా చెప్తే ‘అందులో కొత్తగా చెప్పిందేముంది? ఆనందకుమార స్వామి ఎప్పుడో రాసిందే కదా ఇది’ అని అన్నారు. ఆ మాట నాకు ములుకులాగా గుచ్చుకుంది. కుమారస్వామి రాసిన పుస్తకం The Dance of Shiva: Fourteen Indian Essays (1918) సంపాదించి చదివినదాకా మనశ్శాంతి లేకపోయింది.  అలాగే సుప్రసిద్ధ ఫ్రెంచి శిల్పి అగస్ట్ రోడే కూడా అపారమైన పారవశ్యంతో నటరాజు పైన రాసింది చదివాను. నాకు అర్థమయిందేమంటే, నటరాజు రసజ్ఞులందర్నీ ఒక్కలానే సమ్మోహితుల్ని చేస్తాడని, కానీ ఒకరికి  కనిపించినట్టుగా మరొకరికి కనిపించలేదని!


Featured image: Chamumda, Sculpture by Ravindra Kumar Sharma, pc: Apurv Sharma, Adilabad

30-6-2026

2 Replies to “జీవన శిల్పి-27”

  1. శుభోదయమండి…
    గురూజీ ఒక జ్ఞాన జలపాతం.
    ఎన్నో జ్ఞానామృత ధారలను తనలో మోసుకొస్తూ నిరంతరం ప్రవహిస్తున్న ఆ జలపాతం నుండి, మీరు ప్రతిరోజూ అందిస్తున్న చిన్న గుల్లితో కొద్దికొద్దిగా ఆ జ్ఞానామృతాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాను.
    ప్రతి గుక్కెడు నా ఆలోచనలను విశాలపరుస్తూ, నా జీవితానికి ఒక కొత్త వెలుగును గోచరింపజేస్తోంది.
    ధన్యవాదములు సర్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading