
నాలుగవ రోజు: నాలుగవ సంభాషణ
రోజూ పండగే వారికి
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మేం మళ్ళా ప్రార్థనా మందిరంలో కూర్చున్నాం. గురూజీతో సంభాషణ మొదలుపెట్టబోతుండగా, ఆశ్రమం ఎదట రోడ్డుమీద ఒక ట్రాక్టరు వెళ్తూ ఉంది. అది పెద్ద చప్పుడు చేస్తూ ఉంది. మామూలుగా ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతమంతా ఎవరో కుదిపినట్టయింది. అది అక్కణ్ణుంచి దూరంగా వెళ్ళిపోయేటంతవరకూ ఆ చప్పుడు నిశ్శబ్దంగా ఉండే కొలనులోకి రాయి విసిరినట్టుగా కల్లోల పరుస్తూ ఉండింది. ఆ చప్పుడు గాల్లో సద్దుమణిగేటంతవరకూ గురూజీ మౌనంగా ఉండిపోయారు.
అప్పుడు అందుకుని ‘నాదం, నాదం నుండి లయ పుడుతుంది. లయ అంటే మనం ఒకరకంగా అందులో లీనమైపోవడం, కలిసిపోవడం అని అర్థం. ధ్వని వింటూ, ఆ శబ్దానికి అనుగుణంగా మన శరీరాన్ని అందులో లీనం చేసుకోవడమే లయ కావడం. కలిసి పోవడం. ఆ విధంగా మన దగ్గర ఎన్నో జానపద నృత్యాలు ఏర్పడ్డాయి. మనకు జానపద నృత్యాలూ, శాస్త్రీయ నృత్యాలూ అని రెండు రకాలున్నాయి.’ అని చెప్పడం మొదలుపెట్టారు.
ఆయన చెప్తున్న మాటలకి వెంటనే నాకు నిరూపణ దొరికినట్టయింది. ఆ ట్రాక్టరు చేసేది చప్పుడు మాత్రమే. అది నాదం కాదు. అందుకనే అది గురూజీ ధ్యాసని తన వైపు మళ్ళించలేకపోయింది. ఆయన సమాధిని భగ్నం చేయలేకపోయింది. గురూజీ చెప్పడం కొనసాగించారు:
‘జానపద కళకీ, శాస్త్రీయ కళకీ ఉన్న తేడా ఏమిటి? జానపద కళ ప్రకృతిమీద ఆధారపడి ఉంటుంది. చుట్టూ ఉండే పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు, మొక్కలు, నీరు-వీటన్నింటిమీదా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి గుజరాత్ లోని రాస్ ఒక జింక మీద ఆధారపడి ఉంటుంది. లేడిపిల్ల ఎలా గెంతులు వేస్తూ నడుస్తుందో, ఆ నాట్యం కూడా అలానే సాగుతుంది. డాంగ్ ఆదివాసీల నృత్యం నీటిమీద ఆధారపడి ఉంటుంది. అలలు సాగినట్టుగా నడుస్తుంది. లేదా ఇటువైపు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే ఆదివాసీల నృత్యం కూడా నీటిలానే, అలలు కదిలినట్టే నడుస్తుంది. ఇక్కడి కోలాటం గుర్రం మీద ఆధారపడి అశ్వగతిలో నడుస్తుంది. అలానే గోండు గుసాడీల నృత్యం నెమలిమీద ఆధారపడి ఉంటుంది. నెమలి తన పింఛం విప్పి ఎలాగైతే చూపరుల్లో ఒక ఝల్లు కలిగిస్తుందో అలా ఆ నాట్యం మొత్తంలో ఆ పులకింత కనిపిస్తుంది. వాళ్ళు నెమలి ఈకల టోపీ ధరించి ఆ కంపనంతో నాట్యం చేస్తారు. భద్రాచలంలో కూడా ఒక ప్రత్యేక నృత్యం ఉంది. అక్కడ కొమ్ములు ధరించి నాట్యం చేస్తారు. ఒక జంతువులాగా, పక్షిలాగా, పురుషుడు స్త్రీని ఎలా తనవైపు ఆకర్షించాలనుకుంటాడో అలాంటిదంతా అందులో కనిపిస్తుంది. అంటే తన సామర్థ్యం చూపించి ఆకర్షించుకోడం. దీన్నే రిఝానా అంటారు. ఇలా మనకున్న ఈ నృత్యాలన్నీ పశుపక్ష్యాదుల లక్షణాలు కొన్నింటిని తీసుకుని వాటిమీద ఆధారపడి రూపొందాయి. అయితే జానపద కళకీ, శాస్త్రీయ కళకీ మధ్య ఉన్న తేడా ఏమిటి? ఇవి ఎలాగూ వాటి శైలులే. కాని తేడా ఏమిటి? మూలభూతమైన తేడా ఏమిటి?’
‘జానపద కళ సమాజం తాలూకు సామాజికతకి ప్రతీక. ఏ రోజైతే సమాజం విచ్ఛిన్నమవుతుందో ఆ రోజు జానపద కళలు అంతరించిపోతాయి. దీన్నే మరోలా చెప్పవచ్చు: జానపద కళ అంతరిస్తోంది అంటే, సమాజం అంతరించిపోతోందని అర్థం. శాస్త్రీయ కళ ఆ సమాజం తాలూకు సాధనకి ప్రతీక. అది ఆ సమాజం చేపట్టే సాధనకి ప్రతీక. ఆ సమాజం ప్రతి ఒక్క విషయంలో ఎంత సాధన చేసిందో శాస్త్రీయ కళ చూపిస్తుంది.’
‘రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, శాస్త్రీయ నృత్యం ప్రదర్శన కోసం ఉంటుంది. కానీ జానపద విద్యలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం ప్రదర్శన కోసం కావు. శాస్త్రీయ నృత్యాల్లో, శాస్త్రీయ నాటకాల్లో ప్రేక్షకులకు వీపు చూపించడం దోషంగా పరిగణిస్తారు. కళాకారుడు వెనక్కి వెళ్ళాల్సి వచ్చినా వెనుదిరగడు. వెనక్కి అడుగులు వేస్తూ వెళతాడు. అతని ముఖం ఎప్పుడూ ప్రేక్షకుల వైపే ఉంటుంది. అతడు తన హావభావాలన్నీ ప్రదర్శిస్తాడు. కానీ జానపద కళలో వీపు ప్రేక్షకుల వైపు ఉంటుంది. ఆ నాట్యం వృత్తాకారంలో సాగుతుంది. వీపు ప్రేక్షకుల వైపు ఉంటుందంటే అర్థం ఏమిటంటే, వారికి ప్రేక్షకులతో ఎలాంటి సంబంధం లేదని. ప్రేక్షకులు తమని ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేదానితో వారికి పని లేదు. అది తనలో తాను లీనమైపోయే ఒక కళ.’
‘నువ్వు దాని ఆనందాన్ని పొందాలనుకుంటే అందులో ప్రవేశించు. అందులో లీనమై ఆ ఆనందాన్ని అనుభవించు. అందులో పెద్దగా ఏమీ ఉండదు. చాలా జానపద నృత్యాల్లో మామూలుగా ఊగుతుంటారు, తేలికగా అటూ ఇటూ ఊగుతుంటారు. కానీ ఆ తన్మయత్వం వారి సొంతం. వాద్యం మోగుతుంటుంది. మీరు మస్తు ఊగుతుంటారు. చూసేవారికి పెద్దగా మజా రాకపోవచ్చు. కానీ అందులో లీనమైనవాడు, అందులోకి వెళ్ళినవాడు, అందులో తన్మయత్వం చెందుతాడు. కాబట్టి జానపద నృత్యాల్లో, జానపద కళలో తన్మయత్వం చెందించే శక్తి ఉంది.’
‘శాస్త్రీయ విద్యలు అలా ఉండవు. అందులో మనిషి తన్మయత్వం చెందడు. అందులో అతడి ధ్యాస మొత్తం పండితుల వైపే ఉంటుంది- విజ్ఞులు నన్ను ఎలా చూస్తున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారా లేదా అని. శాస్త్రీయ గాయకుడుగానీ, శాస్త్రీయ నర్తకుడు గానీ, శాస్త్రీయ కళాకారుడుగానీ- వారి ధ్యాస సామాన్యప్రేక్షకులమీద ఉండదు. విద్వాంసులు తనని ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేదే అతను చూస్తాడు. వారు తల ఊపితే వీడు సంతోషిస్తాడు. అంటే అతని ధ్యాస విద్వాంసుల వైపే ఉంటుంది తప్ప సమాజం వైపు కాదు. జానపద కళకి పండితులతోగానీ, పండిత సమాజంతోగానీ ఎలాంటి సంబంధమూ ఉండదు. ఆ కళాకారులు తమలో తాము తన్మయత్వం చెందుతారు. వారికి ఎవరితోనూ పనిలేదు. అందుకే వారి వీపు ఎప్పుడూ ప్రేక్షకుల వైపే ఉంటుంది.’
‘ఇలాంటి జానపద నృత్యాలు చాలా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలోనే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిక్కడ అదిలాబాద్ లోనే ఉదాహరణకి, మనకు కోలాటం ఉంది. ఆ తర్వాత గొల్లభామల ఆట. అది కూడా, దాండియాలాగా, కోలలు పట్టుకుని ఆడతారు. దాన్ని కుంటికాల ఆట అని కూడా అంటారు. ఇక గోండుల దండారి వేరేగా ఉంటుంది. కొలాముల దండారి వేరేగా ఉంటుంది. మథుర ప్రజల నృత్యం వేరే. వారు ఒక చేతిలో గుడ్డ, మరొక చేతిలో కోల పట్టుకుని ఆడతారు. వెదురుతో గుర్రాలు తయారుచేసి మురళి ఊదుతూ భిల్లు ప్రజలు నాట్యం చేస్తారు. ఆ నృత్యం వేరే. తప్పెట వాయిస్తూ తప్పెట్ల మీద నాట్యం చేయడం వేరే. ఒగ్గులు కురుమలు. వారు డమరుకం, పిల్లంగోవి వాయిస్తూ చేసే నాట్యం వేరేగా ఉంటుంది. అలానే చర్మకారులున్నారు. వారు వాద్యం వాయించినప్పుడు వారి నాట్యం ఒక భిన్నమైన శైలిలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మొహర్రం సమయంలొ అలావా అంటే అగ్నిగుండం ఆడతారు. ఆ అలావా మనది. అందులో కూడా ప్రజలు బాగా లీనమవుతారు. ఒకప్పుడు కజ్రి నృత్యం ఉండేది. అందులో చిన్న చిన్న కుండలకు గజ్జెలు కట్టేవారు. అలా గజ్జెలు కట్టిన ఘటాల్ని వాయిస్తూ వీరు నాట్యం చేసేవారు. అది కూడా ఒక జానపద నృత్యం. లంబాడాల దగ్గర ధాడీ, ధాలియా అని రెండు ఉంటాయి. ధాలియా డప్పు వాయిస్తూ చాలా అందంగా నాట్యం చేస్తాడు. ఈ రకంగా ఇక్కడ ఎన్నో నృత్యాలున్నాయి. ప్రతి సమాజానికీ ఒక సొంత నృత్యం ఉంది.’
‘కోలాటంలో జడకొప్పులు చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా జడకొప్పులు చూసారా? అందులో ఒక మండపం తయారవుతుంది. తాళ్ళు కడతారు. వాటిని పట్టుకుని ఆడతారు. కోలాటం ద్వారా జడల్లాగా అల్లుకుంటూపోతారు. అలా ఐదురోజులు, ఏడు రోజులు ఆడతారు. ఐదు జడలుగా లేదా ఏడు జడలుగా అల్లుకుపోతారు. ఐదు జడలు వేసి అందులో చివరిరోజు లక్ష్మీజడ వేస్తారు. ఆ రోజు బలిస్తారు. లేదా నల్లనయ్య జడ, కృష్ణుడి జడ వేస్తారు. ఆ రోజు పాయసం నివేదిస్తారు.’
‘ఇదంతా ఒక సంప్రదాయంలాగా ఒక పద్ధతితో ముడిపడి ఉన్నాయి. వారు ఎప్పుడు పడితే ఎప్పుడు ఆడరు. దానికి కొన్ని సమయాలున్నాయి. దాన్ని నిష్ఠగా ఒక పూజలాగా చేస్తారు. దండార్ అనేది నిష్ఠ. వారి సొంతపూజ. సంవత్సరానికి ఒకసారి దండార్ బయలుదేరుతుంది. దానికి దాని పద్ధతులున్నాయి. శ్రావణమాసం వచ్చినప్పుడు మథురలు ఆడతారు. ఆళా ఖండ్ గానం చేస్తారు. కోలాటం దసరా నుండి ప్రారంభమై దీపావళి దాకా సాగుతుంది. అది లక్ష్మీపూజ. ఈ విధంగా ప్రతి నృత్యం ఎక్కడో ఒకచోట ధర్మంతో, మతంతో ముడిపడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా సంప్రదాయాలు ఏర్పడ్డాయి.’
‘ఇక్కడి గోండు ప్రజలు దండారి తీస్తారు. దసరా తర్వాత దండార్ ప్రారంభమై దీపావళి అయిన రెండు రోజుల తర్వాత ముగుస్తుంది. దాని మధ్యలో మూడు నాలుగు రోజుల పాటు ఒక మనిషి గుస్సాడి అవుతాడు. అప్పుడు అతనిలో దేవుడు ప్రవేశిస్తాడని వారి నమ్మకం. ఎవరు పడితే వారు గుస్సాడీ కాలేరు. దానికోసం చాలా మొక్కులు మొక్కుకుంటారు. మొక్కులు మొక్కుకుని మరీ గుస్సాడీ అవుతారు. గుస్సాడిగా ఉన్నతను ఆ నాలుగు-ఐదు రోజులు రాత్రి కూడా నిద్రపోడు. అస్సలు నిద్రపోడు. పైగా చాలా తింటాడు.’
‘ఎంత తింటాడంటే- నేనొక సారి ఇక్కణ్ణుంచి కోసాయి వెళ్ళాను. కోసాయి దండారి ధామన్ ఝరి వెళ్తోంది. వారితో పాటు నేను కూడా ధామన్ ఝరి వెళ్ళాను. దండార్ చూస్తూ వెళ్ళాను. ఊరి బయట వీరు ఆగారు. తమ ఏర్పాట్లు చేసుకున్నారు. ఊళ్ళోకి ప్రవేశించేటప్పుడు ఆ ఊరి ప్రజలు వాళ్ళకి కాళ్ళు కడిగి స్వాగతిస్తారు. ఊళ్ళోకి తీసుకువెళ్ళి గుడ్డలు పరిచి కూచోబెడతారు. ఆ రోజు నడిచి వచ్చిన వారిని నాట్యం చెయ్యనివ్వరు. ఆ ఊరి ప్రజలే నాట్యం చేస్తారు. ఆ రాత్రి భోజనానికి కూచున్నప్పుడు ఆ గుస్సాడీకోసం ఒక పెద్ద పళ్ళెంలో అన్నం నిండుగా ఉంది. అతను ఆ పళ్ళెం నిండా ఉన్న అన్నం మొత్తం తినేసాడు! ఆ తర్వాత మేమంతా కూచుని తింటుంటే మాతో పాటు తాను కూడా తినేసాడు! మా విస్తళ్ళతో పాటు కూర్చుని కూడా అంత అన్నం తినేసాడు. అంతా అరిగించుకుంటాడని వీరు నమ్ముతారు.’
‘అందులో ఇప్పుడు నెమలి ఈకలతో చాలా పెద్ద పెద్ద టోపీలు తయారుచేస్తున్నారు. మునుపు నలభై-యాభై ఏళ్ళ కింత ఇక్కడ ఇంత పెద్ద టోపీలు ఉండేవి కావు. అప్పట్లో జింక పిల్ల చర్మాన్ని తీసి దాంతో టోపీలాగా చేసి అందులో కొన్ని నెమలి ఈకలు పెట్టేవారు. చివరి రోజు దాన్ని వదిలేసేవారు. ఈ నెమలి ఈకల పెద్దపెద్ద టోపీలు తర్వాత కాలంలో వచ్చాయి. దానికి ముందు వెదురుతో చేసినవి ఉండేవి. చాలా అందంగా ఉండేవి. వాటిని చక్కగా ఊపుతూ నాట్యం చేసేవారు. కాని అందులో ముసుగు ఉంటుంది. దాన్ని కోడాల్ అంటారు, అది చెక్కతో చేస్తారు. మోదుగ చెక్కతో చేస్తారు దాన్ని. దాన్ని తయారుచేసేటప్పుడు ఎక్కడి చెక్క పడితే అక్కడి చెక్క తీసుకురారు.’
‘మేము గిన్నెధరి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు ఈ ముచ్చట చెప్పారు: ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడి ఆదివాసుల్లో రెండు పద్ధతులున్నాయి-ఒకటి పూడ్చడం, రెండోది దహనం చేయడం. దహనానికి చాలా ఖర్చవుతుంది. దహనం చేసే సమయంలో వీరు రాత్రంతా దాని చుట్టూ నాట్యం చేస్తారు. చితి తయారుచేసి దాన్ని తగలబెట్టేటప్పుడు అందులో మోదుగ చెక్క కూడా వేస్తారు. దాన్ని కాలనిస్తారు. కోడాల్ కు ఎంత కావాలో అంత చెక్కను మళ్ళీ తీసేస్తారు. దాంతో ఆ ముసుగు తయారుచేస్తారు. ఆ ముసుగు లేదా ఆ కోడాల్ తగిలించుకుని కూడా నాట్యం చేస్తారు.’
‘ఇవన్నీ పూర్తిగా జానపద నృత్యాలు. కానీ వాటితో పాటు ఇక్కడ అప్పుడప్పుడు నృత్యనాటికలు కూడా సాగుతుండేవి. ఉదాహరణకి యక్షగానం ఉంది, భాగవతం ఉంది- అది నృత్యమూ, నాటకమూ కూడా. చిడతల రామాయణం కూడా నృత్యనాటకమే. భాగవతం ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన నృత్యం. అదొక ఆటగా కూడా ఉండేది. భాగవతం అలంకారం తయారు చేసినప్పుడు ఆ అలంకారమంతా చెక్కతోనే ఉండేది. ఆ మనిషిని గోడపక్కన నిలబెట్టి ఒక అండాకారపు గీత గీస్తారు. ఆ లెక్కన అతని అలంకారం తయారవుతుంది, ఒక అండం లాగా. అది బయటకు వచ్చినప్పుడు అందులోంచి పిండమవుతుంది. ఈ అండమూ, పిండమూ, అతడు నాట్యం చేయడం మొదలుపెట్టగానే బ్రహ్మాండం అయిపోతుంది. ఈ అండం, పిండం, బ్రహ్మాండం-అన్నీ ఇందులో ఉన్నాయనేది వారి భావన. అది చాల అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రకాల కథలు అందులో నడుస్తాయి. ఆ భాగవత అలంకారమంతా తేలికపాటి చెక్కతో తయారు చేసుకుంటారు, కిరీటాలూ అన్నీ చాలా అందంగా.’
‘రెండు రకాల భాగవతాలు- ఒకటి రాత్రంతా నడిచేది, రెండోది పగలు నడిచేది. రెండింటి కళాకారులూ వేరువేరుగా ఉండేవారు. భాగవతంతో రాత్రంతా గడిచిపోయేది. కానీ వీరిలో విశేషం ఏమిటంటే ప్రారంభంలో ఉన్న వేగం చివరిదాకా అలానే ఉంటుంది. వారు ఎక్కడా బలహీనపడరు. మైక్ లేకుండా చెయ్యాలి కాబట్టి చాలా గట్టిగా పాడతారు, కానీ అలసిపోరు. ఇప్పుడైతే భాగవతం ఇక్కడ చాలా తగ్గిపోయింది.’
‘చిడతల రామాయణం, భాగవతం లాగా గోండులు కూడా రామాయణం చేస్తారు. వారు కూడా రాత్రంతా చాలా అద్భుతంగా రామాయణం చేస్తారు. ఆ లయ చాలా సుందరంగా ఉంటుంది. భారతం కూడా చేస్తారు కానీ మేము రామాయణం చూసాం. ఒక రాత్రంతా ఒక ఊరిలో ఉండి చూసాం.’
‘ఈ రకంగా ఈ నృత్యనాటికలు కూడా మనదగ్గర చాలా ఉన్నాయి. బుర్రకథ కూడా ఇందులో భాగమే. జంగం ప్రజలు కూడా నాటకం వేసేవారు. వారు కూడా కథ చెప్పేవారు. వారు చేత్తో దివిటీలు పట్టుకుని డక్కి వాయిస్తూ కథ చెప్పేవారు. అనుముల భూమారెడ్డి కథ చెప్పేవారు. ఎప్పుడైతే వర్షాలు పడవో ఆ సమయంలో వర్షాలు పడటం కోసం అనుముల భూమారెడ్డి కథ చెప్తారు. అది ఐదురోజుల గానం.’
‘భూమారెడ్డి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు అని అనుముల భూమారెడ్డి కథ చెప్తుంది. మొదటిసారి వ్యవసాయం చేసినవాడు అతను. నాగలి తయారుచేసి, సింహాలను కట్టి, పామును తాడుగా చేసి ఆ నాగలితో దున్నాడు. దుక్కి దున్నాక ఏం విత్తనాలు వెయ్యాలి అని ఆలోచించి, ఆ మట్టిని తీసుకువెళ్ళి బసవన్న ముందు పెట్టాడు. పొద్దున్నే లేచి చూసేసరికి ఆ మట్టి అనుములుగా మారిపోయింది. అనుములు ఒక పప్పుదినుసు. ప్రపంచంలోనే మొట్టమొదటగా వ్యవసాయం చేసినవాడు కాబట్టి అతని పేరు అనుముల భూమారెడ్డి అయిపోయింది.’
‘అనుముల భూమారెడ్డికి ఐదుగురు కొడుకులు. పెద్దవాడి పేరు వెంకట్ రెడ్డి, రెండోవాడి పేరు మల్లా రెడ్డి, మూడోవాడి పేరు రాజా రెడ్డి, నాలుగోవాడి పేరు ధర్మారెడ్డి, ఐదోవాడి పేరు సోమారెడ్డి—ఐదుగురు కొడుకులు. ఆ పిల్లలు అయిదుగురూ తండ్రితో ‘మేము ఈ భూమండలం చుట్టి వస్తాం, ఎలా ఉందో చూసి వస్తాం’ అని చెప్తారు. వారు యాత్రకి బయలుదేరినప్పుడు వెంకటాద్రి పర్వతం వెంకట్ రెడ్డికి చాలా నచ్చుతుంది. అతను తనకి ఆ స్థలం చాలా నచ్చిందనీ, తనక్కడే ఉండిపోతాననీ, ఇంక ముందుకు రాననీ చెప్తాడు. అక్కడే నిలబడిపోయాడు. దాంతో అతను వెంకటేశ్వరుడు అయ్యాడు. దానికి కొంచెం దూరం వెళ్ళిన తరువాత, శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిన తరువాత ఆ స్థలం మల్లారెడ్డికి చాలా నచ్చుతుంది. తనక్కడే ఉండిపోతానని చెప్తాడు. అతడు మల్లికార్జునుడయ్యాడు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు అన్నదమ్ములూ వేములవాడ రాగానే ఆ స్థలం రాజారెడ్డికి చాలా నచ్చింది. అతను అక్కడే ఉండిపోయాడు. రాజరాజేశ్వరుడయ్యాడు. ఆ తర్వాత ధర్మపురికి వచ్చి ధర్మారెడ్డి నరసింహస్వామి అయ్యారు. ఇక ఇక్కడ, అంటే, అదిలాబాదుజిల్లాలో కుంతాలకి వచ్చి సోమారెడ్డి సోమేశ్వరుడయ్యాడు.’
‘ఇలా ఈ కథ నడుస్తుంది.ఐదు రోజులు చెప్తారు ఈ కథని. ఈ కథ చెప్పాక వర్షం పడుతుందని నమ్ముతారు. ఇలాంటి కథలు చాలా ఉన్నాయిక్కడ. ఇవి ఒక కాలంలో సమాజాన్ని ఏకం చెయ్యడానికి చెప్పిన కథలు. వారు ఒక చేత్తో దివిటీ పట్టుకుని రాత్రంతా ఈ కథ చెప్పేవారు. వాద్యాలు వాయిస్తూ, నాట్యం చేస్తూ చెప్పేవారు.’
‘కథలు చెప్పేవారు చాలామంది ఉండేవారు. జంగం ప్రజలు కూడా కథలు చెప్పారు. మిత్తులయ్యలు కూడా కథలు చెప్పారు. వారు ఖడ్డీ వాద్యం మీద రామాయణం పాడేవారు. పూర్తి రామాయణం. ఆ ఖడ్డీ వద్యం మీద చాలా సుందరంగా రామాయణం పాడతారు. ఇక శారదకాండ్రు ఎలానూ ఉన్నారు. వారి పనే కథ చెప్పడం. శారదకాండ్రుది ఇక్కడ చాలా పెద్ద సమాజం. వాళ్ళని బొబ్బిలోళ్ళు అని కూడా అంటారు. బొబ్బిలి యుద్ధం కథ చెప్తుండటం వల్ల వారికి ఆ పేరు వచ్చింది. వారు చాలా కథలు చెప్పేవారు. ఈ ప్రాంతపు కొన్ని కథలు, ఆరుగట్కరోల్ల కథ, గంగాగౌరి కథ-ఇలాంటివి చాలా చెప్తారు. బతుకమ్మ, బహదూరి కథలు కూడా చెప్తారు. వారినుండి బొబ్బిలి యుద్ధం కథ ఒకసారి పూర్తిగా విన్నాం. ఆ కథలు రాత్రి పూట చాలా సమయం నడుస్తాయి. కొన్ని రోజులదాకా సాగుతాయి. ఒక్క రోజులో చెప్పలేరు. అంత పెద్దకథలు అవి. ఈ విషయాలన్నీ ఎవరూ రికార్డు చేయలేదు. తెలుగు యూనివెర్సిటీ వాళ్ళు చేసారేమో నాకు తెలియదు.’
‘అలాగే ఇక్కడ తోటి సమాజం ఉంది. వాళ్ళు కూడా పూర్తి కథ చెప్తారు. గోండుల మూలం ఎక్కడినుండి ఉందో, అక్కడి నుండి చెప్పడం మొదలుపెడతాడు. దాంతో పాటు వేరే కథలు కూడా చాలా చెప్తాడు. వారి వాద్యం కింకరి. తోటీ ఆ వాద్యం పట్టుకుని అద్భుతంగా పాడుతుంటే, అతని భార్య ఒక డమరుకం లాంటి వాద్యం పట్టుకుని కూర్చుంటుంది. ఇక్కడ భీమ్ రావు అని ఉండేవాడు. తొడసం భీమ్ రావు. ఇప్పుడు లేడు, చనిపోయాడు. అతణ్ణుంచి మేము చాలా వినేవాళ్ళం. చాలా పాడేవాడు. కబీరు దాసు భజనలు చాలా సుందరంగా పాడేవాడు ఆ వాద్యం మీద.’
‘జంగం ప్రజల శైలి వేరేగా ఉండేది. తేలీల యాచక సమాజం ఒకటుంది, వాళ్ళని డాకోత్ అంటారు, వాళ్ళు తమని గవ్వల్తో అలంకరించుకుంటారు. మొత్తం గవ్వలతోనే. ఆ సమాజం శనిమహాత్ముని భక్తులు. వారు నూనె తీసుకుంటారు. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడితే రెండోవాడు దూరంగా నిలబడతాడు. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, ఒక ఐదు రూపాయలిచ్చి, నా పేరు చెప్పి అడిగితే, అంటే, ఇక్కడ నిలబడ్డవాడు చెవిలో నా పేరు ఇది అని చెప్తే, ఇతను అతనికి సైగలు చేస్తాడు. అతను అక్కడినుండి మీ పేరు గట్టిగా చెప్తాడు. ఆ సైగల భాష వారికి బాగా తెలుసు. ఎంత కఠినపదమైనా చెప్పగలరు. మేమొక ఊళ్ళో ఉన్నాం. అక్కడ ఒకతను ఆ సైగలు చేసే అతని చెవిలో ఏదో చెప్పాడు. అవతలి అతను ఆ చెప్పిన పదం ‘అప్రజ్ఞాని’ అని చెప్పాడు! వారికి ఆ విద్య కరతలామలకమైంది. ఎవరెవరో వస్తారు, ఒక రూపాయిస్తారు. నా పేరు చెప్పమంటారు. ఇతను సైగలు చేస్తాడు. వాద్యం మోగుతూ ఉంటుంది. నాట్యం చేస్తూ ఉంటారు. నాట్యం చేస్తూనే సైగలు చేస్తాడు. అవతలివాడు ఆ పేరు చెప్తాడు.’
‘అలాగే బహురూపులు కూడా. బహురూపులు రెండు రకాలు. ఒకరు తుపాకి పట్టుకుని పాడతారు, కంజరి పైన పాడతారు. చాలాసార్లు పోలీసు డ్రెస్సు వేసుకుని తుపాకి పట్టుకుంటాడు. పిట్టల దొర అని కూడా అంటారు. రెండో బహురూపి రకరకాల వేషాలు వేస్తాడు. ఒక రోజు ఒకటి, ఇంకోరోజు మరొకటి. ఒక రోజు బేతాళుడి వేషం వేసుకుని ఊళ్ళో తిరుగుతాడు. ఒకసారి శివుడు అవుతాడు. ఒకసారి అర్థనారీశ్వరుడు అవుతాడు. ఒకదాని వెనక ఒకటి రూపాలు మారుస్తుంటారు. కథలు చెప్పడు, కాని రూపప్రదర్శన చేస్తుంటాడు.’
‘ఇక్కడ ఒకాయన ఉండేవాడు. అతను భోయి సమాజానికి చెందినవాడు. అతణ్ణి దల్లమలగోలు అని కూడా అనేవారు. అతను మొహర్రం పీరీలలాగా మస్తు శాలువాలు కట్టి, చిన్నడప్పు వాయించేవాడు. అందులోనే ఏక్ తార కూడా ఉండేది. నాట్యం చేసేవాడు. చాలా అందంగా నాట్యం చేసేవాడు. మౌలా అలీ, మౌలా ఆలీ అంటూ ఐదురోజులు మొహర్రం కథ చెప్పేవాడు.’
‘వారితో పాటు ఇంకా వేరేవాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, కోయప్రజలు, లేదా శకునం చెప్పేవాళ్ళు. శకున విద్య ఏది? చిలుకపట్టుకుని కూచుంటారు కదా. అది శకున విద్యనే. చిలుకతో జాతకం చెప్పడం, అలాగే ముఖం చూసి కూడా చెప్పడం. ఇక్కడికి ఎలగందల వైపునుంచి చాలా సార్లు చాలామంది వచ్చేవారు. కరీమ్ నగర్ పక్కన ఎలిగందల. అక్కడ వారి మఠం ఉంది. అక్కడనుండి వచ్చేవారు. వారికి ఆ జ్యోతిష్యవిద్య ఎలా వస్తుందనే సమాచారం తెలుసుకోడానికి చాలా సార్లు ప్రయత్నించాను. జ్యోతిష్యపు విద్య ఎరుకలు మహిళలు కూడా చెప్తారు. కోయసమాజపు ప్రజలతో మాట్లాడినప్పుడు, వారు చెప్పిందేమంటే- పిల్లవాడు పుట్టిన తరువాత, ఒక వయసు వచ్చినప్పుడు అతనికి ఈ విద్యనేర్పే సమయం వచ్చినప్పుడు, చాలా మూలికల రసంలో తొమ్మిదిరోజుల పాటు అతణ్ణి ఉంచుతారు. ఆ రసంలో మెడలోతు దాకా కూర్చోబెడతారు. అలా సహజంగానే అతనికి ఈ జ్యోతిష్య విద్య లభిస్తుంది. ఇప్పుడు ఈ రసక్రియకు ఎవరూ సిద్ధపడటం లేదుగానీ, అది ఒక పూర్తి విద్య. దానివల్ల అతనికి జ్యోతిష్య జ్ఞానం కలుగుతుంది. వాళ్ళు భవిష్యత్తు చాలా అద్భుతంగా చెప్తారు. దానికోసం ఎంతో సాధన ఉండేది, ఇంతసమయం ఈ రసాల్లో కూర్చుని గడపాలి అని ఉండేది. వారి గురువులు చాలాసార్లు తాళపత్రాలమీద చిహ్నాలూ, సంకేతాలూ అన్నీ చేసి ఇచ్చేవారు.ఒక గ్రంథం ఉండేది వారిదగ్గర. అది పట్టుకుని వారు తిరిగేవారు, జ్యోతిష్యం చెప్పేవారు.’
‘వాళ్ళతో పాటు గోసాయి ప్రజలుండేవారు. గోసాయి పేరుతోనే తెలుస్తోంది కదా, వీరు ఆవుల స్వాములు. వీరిది చాలా పెద్ద సమాజం. వీరి దగ్గరుండే ఆవులు చాలా అరుదైన రకానికి చెందినవి, ఐదుకాళ్ళవి, ఒక్క కొమ్ముది, ఐదు చన్నులది- ఇలా విభిన్నమైన జంతువులు వీరిదగ్గరుండేవి. అలాంటి పశువులు ఎక్కడున్నా వీరు తీసుకుపోయి పోషించేవారు. అందువల్ల వీరు గోసాయీలయ్యారు. ఆ ఆవుల్ని వారు కాపాడేవారు. వాటిని అంతం కానిచ్చేవారు కారు. కాని ఆవులు మాత్రమే. మాకు వీరి దగ్గర రకరకాల ఆవులు కనిపించాయి. ఒక కొమ్ము ఆవు లేదా రకరకాల కొమ్ములున్న ఆవులు- అవన్నీ వీరిదగ్గరుండేవి. ఈ గోసాయీల గ్రామాలు మునుపు పెద్దపెద్ద గ్రామాలుగా ఉండేవి. ఒకసారి ఈ గోసాయీలతో మాట్లాడుతున్నప్పుడు కర్ణాటకలో వాళ్ళ గ్రామాలున్నాయని చెప్పారు. మీరంతా బయటే ఉంటారు కదా, మరి గ్రామంలో మీ వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాం. గ్రామంలో ఎవరుంటారు? వృద్ధులు, కొందరు ముసలమ్మలు, మహిళలే కదా గ్రామంలో ఉండేది, మరి వారి జీవనం ఎలా సాగుతుంది? వాళ్ళు చెప్పిన విషయమిది: వాళ్ళది మూడు వందల ఇళ్ళ గ్రామం. అలా మూడు గ్రామాలున్నాయి. అక్కడ ఇళ్ళల్లో విడివిడిగా పాత్రలు ఉండవు. మొత్తం గ్రామానికి ఉమ్మడి పాత్రలుంటాయి. రోజూ వంతులవారీగా ఒక్కో ఇంటివారు మొత్తం గ్రామానికి వండిపెట్టాలి. దేశమంతా ఇలా తిరిగి సేకరించినదంతా ఒక రోజు తమ గ్రామానికి వెళ్ళి అందరికీ భోజనం పెట్టి వీరు బయలుదేరతారు. రోజుకు ఒకరి ఇంటి చొప్పున భోజనం జరుగుతుంది. కాబట్టి గ్రామం మొత్తానికి రోజూ వండుకునే చింత లేదు. పొద్దున్న టీ మొదలుకుని రాత్రి భోజనందాకా వంతులవారీగా ఒక్కొక్కరిది బాధ్యత. ఈ రకంగా వారి గ్రామ వ్యవస్థ ఉంది. ఇది కూడా ఒక ఆర్థిక వ్యవస్థ. అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ. ఉప్పూ, పప్పూ కూడబెట్టుకుని దాచుకోవాలనే చింతలేదెవరికీ. సంవత్సరానికి ఒక రోజు ఒకరి వంతు వస్తుంది. ఎగిరి ఎగిరి వండిపెడతారు. రోజూ వండిపెట్టాలన్న చింత లేదు కదా! సంవత్సరానికి ఒకసారి పెట్టాలి, సంతోషంగా పెడతారు. రోజూ పండగే వారికి! రోజూ విందులే. ఇది కూడా ఒక ఆర్థిక వ్యవస్థనే, ఇలా కూడా నడుస్తున్నది. వారు చాలా విషయాలు చెప్పారు. మందుల గురించి కూడా చెప్పారు. ఔషధాల గురించి వాళ్ళ దగ్గర చాలా ముచ్చట్లున్నాయి.’
24-6-2026


ట్రాక్టరు చప్పుడు నిశ్శబ్ద కొలనులో రాయి విసిరినట్టు కల్లోల పరచడం అంటూ మీ ఉపోద్ఘాతంతో మొదలు పెట్టిన ఈ సంభాషణలో గురూజీ చెప్పిన ఎన్నో విషయాలు ఇంతకు మునుపు అసలు చూచాయగా అయినా తెలీదు.. నాకే కాదు చాలామందికి ఆ సంగతులు తెలిసే, తెలుసుకునే అవకాశం లేదని నా అభిప్రాయం. … నాదం-లయల తత్త్వం, జానపద-శాస్త్రీయ కళల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలు, అదిలాబాద్ ప్రాంతంలోని గుస్సాడి, భాగవతం, అనుముల భూమారెడ్డి కథ, డాకోత్ సైగల విద్య, జ్యోతిష్య రసక్రియ, గొల్లభామల కుంటికాల ఆట, గోండుల & కొలాముల దండారి, మథురుల కోలల ఆట, భిల్లుల వెదురు గుర్రాల నృత్యం, కురుమల ఒగ్గు నాట్యం, మొహర్రం నాటి అలావా అగ్నిగుండం, కుండలకు గజ్జెలు కట్టే కజ్రి నృత్యం, లంబాడాల ధాలియా డప్పు నాట్యం, కోలాటంలో ఐదు లేదా ఏడు రోజులు అల్లే లక్ష్మీజడ, కృష్ణుడిజడ లాంటి జడకొప్పుల సంప్రదాయం, దైవత్వంతో, నిష్ఠతో కూడుకున్న పూజ దండార్ పూజ లాంటి వైవిధ్యభరితమైన జానపద కళల గురించి ఎంత సవివరంగా చెప్పారో..
అలాగే ఖడ్డీ వాద్యం మీద రామాయణం పాడే మిత్తులయ్యలు, బొబ్బిలి కథ చెప్పే బొబ్బిలోళ్ళు లేదా శారదకాండ్రు, కింకరి వాద్యంతో గోండుల మూలాలు పాడే తోటి సమాజపు కబీరు భజనలు పాడే భీమ్‌రావు, కోయవాళ్ళకి జ్యోతిష్యవిద్య ఎలా అబ్బుతుంది. గోసాయీల అద్భుతమైన ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ, ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఎప్పుడూ ఎక్కడా చదవని విషయాలు… వీటన్నింటినీ గురించి గురూజీ చెప్పిన విషయాలు ఆకళింపు చేసుకుంటుంటే ఎంతో ఆశ్చర్యం గా ఉన్నప్పటికీ.. ఇవన్నీ నిజమేనా అనే సంశయం కూడా కలుగుతోంది భద్రుడు గారు.
జానపద కళ పూర్తిగా ప్రకృతి మీద, చుట్టూ ఉండే పశుపక్ష్యాదుల మీద ఆధారపడి ఉంటుందని గుజరాత్ లోని ‘రాస్’ లేడిపిల్ల గెంతుల మీద, డాంగ్ మరియు విశాఖ ఆదివాసీల నృత్యాలు నీటి అలల కదలికల మీద, కోలాటం అశ్వగతి (గుర్రం) మీద, గోండుల గుసాడీ నెమలి పింఛం విప్పిన పులకింత మీద ఆధారపడ్డాయని గురూజీ చెప్తుంటే ఈ చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఇలాంటి విశేషాలు గురూజీ లాంటి వాళ్ళు చెబితే ఆ అపార జ్ఞానసంపదకు మీలా ఇలా అక్షర రూపం ఇవ్వకపోతే ప్రస్తుత తరాలకి తెలిసే అవకాశం లేనే లేదు. ఈ పోస్టుల ద్వారా మీరు ఒక బృహత్కార్యం చేస్తున్నారు.
“జానపద కళ సమాజం తాలూకు సామాజికతకి ప్రతీక. ఏ రోజైతే సమాజం విచ్ఛిన్నమవుతుందో ఆ రోజు జానపద కళలు అంతరించిపోతాయి.” శాస్త్రీయ కళ ‘సాధన’కు ప్రతీకైతే, జానపద కళ ‘సామాజికత’కు ప్రతీక. రెండింటి మధ్య ప్రేక్షకుడితో ఉన్న సంబంధాన్ని గురూజీ విడమరిచిన తీరు అద్భుతం.
అయితే శాస్త్రీయ నృత్యంలో ప్రేక్షకుడికి వీపు చూపడం దోషం అయినప్పటికీ కళాకారుడి ధ్యాస ఎప్పుడూ విద్వాంసులు తల ఊపుతారా లేదా అనే పండిత సమాజం వైపే ఉంటుందన్న గురూజీ మాటలతో నేను ఏకీభవించలేకపోతున్నా. చాలా మంది గొప్ప నాట్య కళాకారులు వారి వారి నృత్యంలో పరవిశించి, దాంట్లోనే పూర్తిగా లీనమై పోతారు. అటువంటి ప్రదర్శనలు కొన్ని నేను చూసాను కూడా.
అఫ్ కోర్స్, గురూజీ అన్నట్టు “జానపద కళ ప్రదర్శన కోసం కాదు, అది తనలో తాను లీనమైపోయే తన్మయత్వం. అందుకే జానపద నృత్యంలో వీపు ప్రేక్షకుల వైపు ఉంటుంది, అది వృత్తాకారంలో సాగుతుంది. వారికి ప్రేక్షకులతో పని లేదు; ఆ ఆనందం కావాలంటే అందులో ప్రవేశించి లీనం కావాల్సిందే.”
అలాగే, వర్షాల కోసం పాడే ‘అనుముల భూమారెడ్డి కథ’ నేనెప్పుడూ విననే లేదు. నాగలికి సింహాలను కట్టి, పామును తాడుగా చేసి దున్ని, ప్రపంచంలోనే మొదటి వ్యవసాయం చేసిన ఆ భూమారెడ్డి ఐదుగురు కొడుకులు (వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, రాజారెడ్డి, ధర్మారెడ్డి, సోమారెడ్డి) యాత్రకు వెళ్లి స్థిరపడి… వెంకటేశ్వరుడు, మల్లికార్జునుడు, రాజరాజేశ్వరుడు, నరసింహస్వామి, సోమేశ్వరుడు కావడం ఆ క్షేత్రాలన్నీ ఎన్నో సార్లు వెళ్ళినా ఎప్పుడూ ఎవరూ చెప్పనే లేదు.
ఇంక గవ్వలతో అలంకరించుకునే శనిమహాత్ముని భక్తులైన తేలీల యాచక సమాజం సైగల భాష ద్వారా ఎంత కఠిన పదమైనా నాట్యం చేస్తూనే అవతలి వ్యక్తికి అందించి పలికించడం గురించి చెబుతుంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఆడుకునే “Dumb Charades’ ఆట గుర్తొచ్చింది.
మరొక అద్భుతమైన గురూజీ సంభాషణను అక్షరీకరించి మాకందించినందుకు కృతజ్ఞతాభివందనాలు భద్రుడు గారు.
మీవంటి ఒక్క పాఠకుడు చాలు ఈ సత్కార్యం సఫలం అవుతున్నదని నమ్మడానికి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సమాజంలో ఉండే జానపద కళలు, నృత్యాలు, వాటి ప్రత్యేక శైలుల గురించి చదువుతుంటే మన దగ్గరే ఇన్ని కళలు, ఇన్ని సమాజాలు, ఇన్ని varieties of traditions and their distinct folklore ఉన్నాయని కూడా తెలియదే అనిపిస్తుంది.
బహురూపులు, సైగలతో పేర్లు చెప్పే పద్ధతి, ఒక్కో సమాజానికి ఒక్కో ప్రత్యేకమైన కథలు, జ్యోతిష్య విద్య కోసం మూలికల రసాల్లో రోజులు గడిపే సాధన!! ఒక్కో విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
This conversation is a treasure chest of history, culture, and living traditions.
ప్రతి పేరాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం!!
Sir, to you and Guruji 🙇🏻♀️
ధన్యవాదాలు మాధవీ!