
నాలుగవ రోజు: ఐదవ సంభాషణ
వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైబ్రరీ
గ్రామాల్లో ఉండే వివిధ రకాల భిక్షాటనా వృత్తుల గురించీ, జానపద కళల గురించీ, కళాకారులగురించీ, వారి జీవన శైలి గురించి గురూజీ చెప్తున్నారు. అందులో భాగంగా గోసాయీల గురించి చెప్పిన తర్వాత బగరీకాల్ సమాజం గురించి చెప్పడం మొదలుపెట్టారు.
‘ఈ తబలాలు, ఈ సంగీత వాద్యాలు తయారు చేసే సమాజం ఉంది కదా, వారిని బగరీ కాల్ అంటారు. ఆ సమాజపు ప్రజల్తో చాలా ముచ్చటగా ఉంటుంది. వారు కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో ఉంటారు. వారి గురించి గోపీకృష్ణ చాలా వివరాలు చెప్తుంటాడు. ఆ బగరీకాల్ ప్రజలు ఒక బృందంగా ఉంటారు. వారు సైకిళ్ళమీద ఊరూరూ తిరిగి వాద్యాలు తయారు చేస్తారు. సాయంకాలానికి తిరిగి ఇంటికొచ్చేటప్పటికి ఒకరు ముప్ఫై రూపాయలు సంపాదించి ఉండవచ్చు, ఒకరు మూడు వందలు సంపాదించి ఉండవచ్చు. కానీ సంపాదించినదంతా ఒక్కచోట పోగేస్తారు. అ తర్వాత దాన్ని కుటుంబాల లెక్కన అందరికీ సమానంగా పంచుతారు. ఆ లెక్కన ప్రతి రోజూ ప్రతి ఒక్క కుటుంబం సంపాదనా కూడా సమానంగా ఉంటుంది. ఇది కూడా ఒక ఆర్థిక వ్యవస్థ. రోజూ సమానపంపిణీ. ఇప్పటికీ అలాగే నడుస్తోంది. గోపీకృష్ణ వీరికి ట్రైనింగ్ ఇచ్చి ఒక షాపు పెట్టించాడు. షాపు పెట్టగానే వారి సమాజంలో పెద్ద గొడవయ్యింది. అప్పుడు గోపీకృష్ణ నా దగ్గరికొచ్చి ఇదంతా చెప్పి, ‘ఇలా అయ్యింది గురూజీ, ఇప్పుడేం చెయ్యాలి?’ అనడిగాడు. ‘ఒక పని చెయ్యి, ఆ షాపు ఆ మొత్తం సమాజానికి చెందిందిగా ప్రకటించు, వాళ్ళు దాన్ని తమ పద్ధతిలో సర్దుకుంటారు’ అని చెప్పాను. అతను తిరిగి వెళ్ళి అలానే చేసాడు. ఆ సందర్భంగా నేనతనికి వివరంగా చెప్పాను: ‘నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఒక అందమైన ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంది. ఆ ఆర్థిక వ్యవస్థను అలానే ఉంచి, దాన్ని అభివృద్ధి చెయ్యాలంటే, ఆ షాపు మొత్తం సమాజానికి అంకితం చెయ్యి. ఎవరు ఎప్పుడు కూర్చోవాలి, మెటీరియల్ ఎలా రావాలనేది వారే నిర్ణయించుకుంటారు’ అని. ఈ రకంగా చాలా సమాజాల స్వంత ఆర్థిక వ్యవస్థలున్నాయి. వీటిని రికార్డింగు చెయ్యాలి. లిపిబద్ధం చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఇవెలా పనిచేస్తున్నాయో వాటి పనిమీద పని చెయ్యాలి.’
‘ఇక్కడున్న ఇలాంటి చాల జాతుల గురించి నేను మీకు పొద్దున్న చెప్పాను. వారి మధ్య అంతా ఎలా నడుస్తున్నదో, అలానే ఈ సంచార జాతులు, ఊళ్ళు తిరుగుతూ పనిచేసే వారి స్వంత ఆర్థిక వ్యవస్థల గురించి చెప్పాను. గోసాయీలు, బగరీకాల్, ఈ వాద్యాలు తయారుచేసేవారు, బహురూపులు, నృత్యనాటికలు ప్రదర్శించేవాళ్ళు- వీరంతా నిరంతరం సంచరిస్తూనే ఉంటారు. ఒకచోట నిలవరు. ఊళ్ళల్లో కూడా బుడబుక్కలవాడు పొద్దున్నే నాలుగ్గంటలకి లేచి డమరుకం వాయిస్తూ బయలుదేరతాడు. అతని జీవనం ఎలా సాగుతుంది? అతను డమరుకం వాయించుకుంటూ ఉంటే సరిపోతుందా? ఈ ప్రజలకు కొన్ని సమయాలున్నాయి. ఆ సమాజాల వాళ్ళకి ఒక ఊళ్ళో ఎన్ని రోజులుండాలో ఒక లెక్క ఉంటుంది. అతను ఉంటాడు, వెళ్తాడు, మరొకడు వస్తాడు, అతడూ వెళ్ళిపోతాడు. ఒకే మనిషి జీవితాంతం అక్కడే ఉండడు. అతడు బయలుదేరే రోజు ఊరంతా తిరిగి తన కోసం సేకరించుకుంటాడు. సేకరించుకుని ముందుకు వెళ్తాడు. ఇంకొకడు ఇక్కడ ఉంటాడు. వేరేవాడి ఏర్పాట్లు కొంచెం చూసిపెట్టి అతను వెళ్తాడు. ఆ వేరేవాడు ఇక్కడ ఉండి ఆ పని కొనసాగిస్తాడు.’
‘గంగిరెద్దుల వాళ్ళు కూడా అంతే. వారు ఎడ్లను తీసుకొస్తారు. వాటికి చాలా మంచి ట్రయినింగ్ ఇస్తారు. ఎలాంటి ట్రైనింగు ఇస్తారో నేను చూసాను. ఆ ఎద్దు కాళ్ళు కట్టి వాటి చెవిలో చాలా బాగా ఒక ముచ్చట చెప్తే అది తల ఊపుతుంది. మళ్ళీ చెప్తే మళ్ళీ తల ఊపుతుంది. దానికి అన్ని సార్లు చెప్పి చెప్పి, ఆ ముచ్చట వినగానే అది తల ఊపేట్టు చేస్తారు. ఇక్కడ మన గిరీష్ ప్రభుణే గారున్నారు. ఆయన ఈ సంచార జాతుల కోసం పనిచేస్తున్నారు. కానీ వారికి ఈ చదువు చెప్పించడం ఏమిటి? వారి విద్యనే ఒక పెద్ద చదువు. నువ్వు ఈ చదువు చెప్పిస్తే వారి సంతానం ఆ ఎద్దుని తీసుకుని బయలుదేరదు. ఎందుకు బయలు దేరుతుంది? కూర్చుంటుంది. తన ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేస్తుంది గానీ, ఎద్దునైతే తీసుకు బయలుదేరదు. ఆ విద్యను కనీసం రికార్డు అయినా చెయ్యండి. ఎద్దులకు ఎలా నేర్పుతారో చూడండి. మనిషికి నేర్పడమే కష్టం, కాని ఎద్దులకు నేర్పుతాడంటే, అది మామూలు ముచ్చటనా? కోతికి నేర్పడం లేదా ఎద్దుకి నేర్పడం- మనుషులే నేర్చుకోలేకపోతున్న కాలంలో ఎద్దు ఎలా నేర్చుకుంటుంది? కానీ గంగిరెద్దులవాళ్ళు నేర్పుతారు. చాలాచోట్ల గంగిరెద్దులవాళ్ళంటే ఒక గౌరవం ఉంది. ఇక్కడ అంతగా లేదుగానీ, కరీంనగర్ వైపు చాలా గౌరవం ఉంది.’
‘ఇక్కడ కాటిపాపోడు ఒకడుంటాడు. అతను స్మశానంలో చితిమీద కూర్చుంటాడు. అతనిదంటూ ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీర్చాలి. అదొక పద్ధతి. అతని ఆకారం చూసి, అతని వేషం చూసి చాలా భయపడతారు. అంత పెద్ద కిరీటం, బుడగ చేతిలో పట్టుకుని, జుబ్బా వేసుకుని గడ్డం, జుట్టూ, ఒళ్ళంతా విబూది పూసుకుని చేతికి పాముని చుట్టుకుని వస్తే అతణ్ణి చూసి భయపడరా? కాని కాటిపాపోడు అలానే వస్తాడు. పాముని చేతికి చుట్టుకుని, బుడగపట్టుకుని, గంట పట్టుకుని వస్తాడు. చాలా శబ్దాలు చేస్తాడు. చాలా విద్యలు చూపిస్తాడు. నోట్లోంచి పెద్ద పెద్ద రాతిగోళాలు బయటకు తీస్తాడు. ఒక గవ్వ నోట్లో వేసుకుని తిప్పుతూ వందగవ్వలుగా చేస్తాడు. అలాంటి చాలా ఆటలు చూపిస్తాడు.’
‘మేమొక సారి చూసాం. ఇదంతా ఏమిటని అడిగాం. ‘ఇదంతా హస్తలాఘవం గురూజీ, మరేమీ కాదు. అంత పెద్ద పెద్ద రాళ్ళు కడుపులోంచి బయటకు తీస్తే నేను బతుకుతానా? చావనూ! నేను మనిషిని కానా? ఇదంతా హాథ్ కీ సఫాయ్’ అన్నాడు. అదంతా ఎలా చేస్తారో మాకు చేసి చూపించాడు. చాలా సుందరమైన విద్య అది. ఇప్పుడు ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. వారి సంతానం ఈ పని చేయడం లేదు. వీలైతే వీరి విద్యని రికార్డు చేయాలి. వారి ఆటలన్నీ రికార్డు చేయాలి. వీళ్ళింక చివరి దశలో ఉన్నారు. వీరు అడుక్కునేవారు కారు. సమాజం వీరి విద్య నడుపుకోడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిపెట్టింది. ఆ వ్యవస్థని రికార్డు చేయవలసిన అవసరం ఉంది.’
‘ఈ రకంగా మన దగ్గర ఎన్నో నృత్యనాటికలు, కథలు నడిచేవి. అలాంటి సమాజాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. వీరు మేళాల్లో చాలా ప్రదర్శనలిస్తారు. ఇళ్ళకు కూడ వచ్చిపోతుంటారు. వివిధ జాతుల పురాణాలు చెప్పేవారు వేరు, వీరంతా వేరు. వీరు వినోదాన్నిస్తారు. ఒకరకంగా ప్రజలకి చాలా సమాచారాన్నిస్తారు. ప్రజా ఉపాధ్యాయుల్లాంటివారు వీరంతా. పూర్వకాలంలో ఎవరూ లైబ్రరీకి వెళ్ళేవారు కారు. లైబ్రరీయే ప్రజల వద్దకు వచ్చేది. కూర్చున్నచోటకే వచ్చి వీరు ఇవన్నీ వినిపించేవారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైబ్రరీ. గ్రంథాలయాల్లాంటివారు. ఆ రకంగా వారి ద్వారా ప్రజలకి గొప్ప జ్ఞానం లభించేది.’
‘శాస్త్రీయ కళలు వేరేగా ఉంటాయి. వాటికి సాధన అవసరం. చాలా సాధన చేయాలి. సంగీతంలో శాస్త్రీయ కళలు చాలా ఉన్నాయి. సంగీతంలో శాస్త్రీయ నృత్యం ఉంది. కానీ దాని వెనుక సాధన ఉంటుంది. భయంకరమైన సాధన చెయ్యాలి. అందుకే శాస్త్రీయ కళలు ఒక సమాజం చెయ్యగల సాధనకు ప్రతీక అని చెప్తుంటాను. ఒక్కో ఊళ్ళో ఎన్ని శాస్త్రాలు తయారయ్యాయో- మామూలు ముచ్చట కాదు కదా, ఇన్ని శాస్త్రాలు తయారు కావడం. అది ఆ సమాజ సాధన. అలాంటి విద్వాంసుల్ని ఆ సమాజం పోషించింది. ఊరు పోషించింది. కాబట్టే అంత సాధన జరిగింది, అన్ని శాస్త్రాలు తయారయ్యాయి.’
‘ఈ కళలు అంతరించిపోవడంలో వాస్తులో వచ్చిన మార్పుల ప్రభావం కూడా చాలా ఉంది. ఇళ్ళు కట్టే డిజైన్ల ప్రభావం కూడా చాలా కారణం. ఇప్పుడు కర్ణాటక సంగీతం ఉంది, హిందూస్తానీ సంగీతం ఉంది. ఊహించండి, ఎర్రకోటలోని దివాన్-ఇ –ఆమ్ లోనో లేదా దివాన్-ఇ -ఖాస్ లోనో కర్ణాటక సంగీతకారుణ్ణి కూర్చోబెట్టి పాడిస్తే ఎలా ఉంటుంది? లేదా ఇక్కడ లేపాక్షిలోనో, మదురై దేవాలయంలోనో హిందుస్తానీ సంగీత విద్వాంసుణ్ణి కూర్చోబెట్టి పాడిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడి కట్టడాలు చెక్కడాలతో ఉంటాయి. అక్కడి స్తంభాల్లోనూ చెక్కడాలుంటాయిగానీ ఒక చెక్కడం ఇక్కడ ఉంటే మరోటి చాలా దూరం వెళ్ళిన తరువాత గానీ ఉండదు. కాబట్టి దాన్నుండి వచ్చే ధ్వని ఆ రకంగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని చెక్కడాలున్నప్పుడు ఆ సంగీతానికి దీన్నుంచి వచ్చే ధ్వని దీనికి అనుగుణంగా వస్తుంది. ఇక్కడ కూర్చుని ఆ రకమైన ధ్వనితీస్తే చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడి దేవాలయాల్లో ఆ చెక్కడాల్ని ఎంతో పనితనంతో నిర్మించారు. ఏ ఒక్క స్తంభమూ కూడా మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కదాని మీద చెక్కడాలుంటాయి. ఆ లెక్కన ఆ సంగీత ధ్వనిలో ఆ కంపనం వస్తుంది. ఇప్పుడు ఆ ఆర్కిటెక్చర్ మారిపోయింది కాబట్టి ఆ సంగీతం దెబ్బతింది. ఈ రోజు సంగీత సభ అంటే ఫలానా ఆడిటోరియంలో కూర్చుని పాడవలసి వస్తున్నది. అందుకని ఆడిటోరియానికి తగ్గట్టుగా ఒక సంగీతం తయారు చేసుకున్నారు అటు హిందుస్తానీ వారూ, ఇటు కర్ణాటక వారూ కూడా. ఎక్కడికి వెళ్ళినా పాడుకునేటట్టుగా డిజైను చేసుకున్నారు. రెండు మూడు గంటల్లో ప్రోగ్రాం అయిపోతుంది. అంతే. ఇప్పుడది ఆడిటోరియం సంగీతంగా మారిపోయింది.’
‘మా దగ్గర ఇద్దరు లెక్చరర్లు ఉండేవారు. చాలా కాలం కిందటి మాట. వాసుదేవ్ అనీ గోడ్సే అనీ ఉండేవారు. వారొకసారి ముంబై దగ్గర ఎలిఫెంటా గుహలు చూడటానికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ- వాళ్ళు పెద్ద కళాకారులు కదా- ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఈ గుహలు తయారయ్యాక వాటి ప్రారంభోత్సవం ఎలా జరిగి ఉంటుంది, ఆ రోజు ఇక్కడి వాతావరణం ఎలా ఉండి ఉంటుంది, జెండాలు ఎలా ఎగురుతుండేవీ, తోరణాలు ఎలా కట్టి ఉండేవీ, వాద్యాలు ఎలా మోగుతూ ఉండేవీ అని ఊహించుకుంటూ ఉన్నారు. అప్పటి ప్రజలు ఎలా ఉండేవారో, వారి వేషభూషలు ఇందులో చెక్కబడి ఉన్నట్టే ఆ దుస్తులు ధరించి ఉండేవారా- ఇలా ఊహించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ బాగా పాడేవారు. అక్కడికి వెళ్ళిన తరువాత గోడ్సేని పాడమన్నప్పుడు ఆయన పాడిన పాట నిజంగా అద్భుతమైన పాట గా ఉండిందట. అలాంటి పాట అప్పటిదాకా ఎవరూ వినలేదట. ఎందుకంటే ఆయన పూర్తిగా ఆ కాలపు ఊహల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి వాతావరణంలో ఎలాంటి స్వరాలు పలుకుతాయో అవే అప్పుడు ఆయన నోటివెంట కూడా వచ్చాయి. ఎందుకంటే ఆయన ఊహల్లో, ఆయన మనసులో ఆ వాతావరణమే పూర్తిగా నిండిపోయింది కదా. దాంతో ఆ పాట చాలా అద్భుతంగా ఉండింది. చాలాసార్లు అలా జరుగుతుంది. ఆ వాతావరణం ఎలా ఉందో దానికి అనుగుణంగా ఉంటుంది.’
‘అదే, ఈ రోజు బయటికి వెళ్తే ఎక్కడ చూసినా ప్లాస్టిక్. డబ్బాలు డబ్బాల ప్లాస్టిక్. ఇటువంటి వాతావరణంలో ఒక కవి వెళ్తుంటే ఇంత గందరగోళంతో కూడుకున్న వాతావరణంలో అతనిలో ఎలాంటి అందమైన భావాలు పుడతాయి? అందమైన కవితకి, అందమైన రచనకి, అందమైన సాధనకి అందమైన వాతావరణం ఉండాలి. చాలా అందమైన వాతావరణం ఉండాలి. దాని డిజైన్ అంతా అందంగా ఉంటేనే అక్కడనుండి ఒక అందమైన మాట వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం.’
‘ఇప్పుడు ఈ వేషం వేసుకుని, శాస్త్రీయ సంగీతం ఆలపించు అంటారు. ఈ వేషం దానికి అనుమతించదు. పాట పెగలదు. ఉదాహరణకి ఒకతను సన్న్యాసి వేషం వేసుకుని ఏవేవో పిచ్చి పనులు చేయలేడు కదా. వేషభూషలకి అటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అతని మానసిక స్థితి మీద దాని ప్రభావం పడుతుంది. ఇలా కూర్చుని శాస్త్రీయ సంగీతం ఎప్పటికీ పాడలేడు మనిషి. దానికి తనదైన వేషం ఉంది, కూర్చునే పద్ధతి ఉంది. అలా కూర్చుంటేనే అది అతని నోటి వెంట వెలువడుతుంది, లేదంటే రాదు.’
‘మా నాన్నగారి పెయిటింగ్ వేసినప్పుడు, జింగరి నక్కాశీల పని నేర్చుకున్నప్పుడు, ఓఝాల దగ్గర పనినేర్చుకుని విగ్రహాలూ, ప్రతిమలూ తయారుచేసినప్పుడు, ఆ కళాకారులు ఎలా కూర్చుంటారు, వాళ్ళ పరికరాలు, పనిముట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా పనిచేస్తారు , పని చేసేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు- ఇదంతా అర్థం చేసుకుని మరీ నేను పనిచేసాను.’
‘నేను పెయింటింగ్ వేసినప్పుడు, రామ-రావణ యుద్ధం పెయింటింగ్ ఒకటి చాలా పెద్దది వేసినప్పుడు, దాన్ని చూసినవాళ్ళు ‘గురూజీ, తాతలాగా చాలా బాగా వేసారు’ అన్నారు. అంటే ఆ పెయింటింగ్ నేను వేసాను గానీ వారి మాట ఏమిటంటే, ఎల్లప్ప తాత తప్ప ఇంకెవరూ అలా వేయలేరని. నాకు అర్ధమయ్యిందేమంటే నేను ఆ శైలిని పట్టుకోవడంలో మాత్రమే విజయవంతమయ్యానని. ఒకవేళ అక్కడ నా గుర్తింపు ఉండి ‘ గురూజీ, మీ పని చాలా బాగుంది ‘ అని ఎవరైనా అని ఉంటే, దాని అర్థం నేను ఆ శైలిని పట్టుకోలేకపోయాననీ, అందులో నా ముద్ర వచ్చేసిందనీ. మనం ఒక శైలికి సంబంధించిన పని చేస్తున్నట్లయితే అక్కడ మన ముద్ర ఏదీ ఉండకూడదు. అక్కడ కేవలం ఆ శైలికి మాత్రమే గుర్తింపు ఉండాలి. ఆ రోజు నేను ఆ పెయింటింగ్ వేసినప్పుడు ‘గురూజీ ఎల్లప్ప తాతలాగా బాగా వేసావు’ అని అన్నప్పుడు నేను ఆ శైలిని పట్టుకోవడంలో విజయవంతమయ్యానని అర్ధమయ్యింది.’
‘నేను ఓఝాల కోసం పనిచేసేటప్పుడు, మొదట్లో, ఒక ఓఝా ఎలా పనిచేస్తాడో పూర్తిగా అలానే పనిచేసాను. ఓఝా కూడా ‘ఇది నువ్వు చేసిన పని కాదు, ఇది ఓఝా చేసేపనే’ అని నమ్మేలా చేసాను. ఆ తర్వాత అందులో చాలా కొత్త డిజైనింగులు చేసాను. అది వారి పనికి దగ్గరగా ఉండేలా, దాన్ని వారు సులభంగా అంగీకరించేలా. నా డిజైన్లు వారి పనికి భిన్నంగా ఉంటే వారు అంగీకరించరు కదా. నేను ముందువారి పనిలాగా పనిచేసి, ఆ తర్వాత డిజైన్లు చేర్చినప్పుడు అది వారికి తమ పనే అనిపించింది.’
‘ఇక్కడ గోడల మీద జడల మైసమ్మ వాల్ పెయింటింగ్ వేస్తారు. భోయీలు అంటే మత్స్యకారుల ఇండ్లల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు గోడల మీద ఆ బొమ్మ వేస్తారు. అందులో మైసమ్మకి పెద్ద పెద్ద జడలుంటాయి. ఆ మైసమ్మ చాలా వింతగా ఉంటుంది. దేవంతోల్లు ఆ జడలమైసమ్మ పెయింటింగ్ వేస్తారు. వాళ్ళనుంచి నేనుకూడా నేర్చుకుని వారి రంగుల తయారీ గట్రా నేర్చుకుని నేను కూడా ఒకసారి ఆ పెయింటింగ్ వేసాను. ఆ తర్వాత దాని ఆధారంగా చాలా పెయింటింగులు వేసాను. అవన్నీ దేవంతోళ్ళు చేసిన పనుల్లాగే అనిపించేవి. నా ఉద్దేశ్యం, ఆ శైలిలో ఆ పెయింటింగ్ ఒక్కటే ఎందుకు వెయ్యాలి? ఎన్నో రకాలు వెయ్యవచ్చు కదా అని. అలానే చేసాను. ఏదైనా ఒక విషయం నేర్చుకునేముందు నేర్చుకునేవాడు ఇంతైనా చేయాలి.’
‘మైనంతో ఒక ఓఝా పనిచేస్తాడు, దేవతాప్రతిమలు తయారుచేసే శిల్పి కూడా పనిచేస్తాడు. కానీ ఇద్దరూ కూర్చునే పద్ధతి, పనిచేసే పరికరాలూ రెండూ వేరేవేరే. పని చేసేది మైనంతోనే. ఓఝా ఇక్కడ పనిముట్టు నూనెలో తడిపి పనిచేస్తాడు. కాని ఈ శిల్పి నూనె వాడడు. పరికరాలు నోట్లో పెట్టుకుని పనిచేస్తాడు. ఇద్దరూ కూర్చునే పద్ధతి వేరు. ఎందుకంటే ఈ శిల్పి ఏ ప్రతిమను తయారుచేస్తున్నాడో అది పూర్తిగా శాస్త్రీయమైంది. దీనికంటూ ఒక ప్రపోర్షన్, ఒక ప్రమాణం ఉన్నాయి. ఇది తయారుచేసేముందు దానికి సంబంధించిన మూర్తి విజ్ఞానం పూర్తిగా అతని మనసులో స్ఫురిస్తుండాలి. అందుకే అతడు పనిమొదలుపెట్టేముందు ఆ మూర్తి విజ్ఞానానికి సంబంధించిన శ్లోకాలు చాలా సార్లు మననం చేసుకుంటాడు. దాన్ని గుర్తు చేసుకున్నాక పని మొదలుపెడతాడు. ఆ పద్దతిలోనే మొత్తం ఆకృతిని తీర్చి దిద్దుతాడు. శిల్ప కళ ఏమంత సులభమైన పని కాదు. కానీ ‘శిల్పవిద్యా సదా శ్రేష్ఠా సర్వదానందదాయికా’. రాతి విగ్రహాల పని ఎంత అందమైన పని అంటే అది ఆ పని చేసే వ్యక్తికి ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే తక్కిన పనులన్నింటిలోనూ మెటీరియల్ ని జోడించడం ఉంటుంది. కానీ ఇక్కడ తీసెయ్యడం ఉంటుంది. రోజురోజుకీ చెక్కుకుంటూపోతున్న కొద్దీ అతనికి ఆనందం వస్తుంది. తక్కినపనులు ఇటువంటివి కావు. అవి వేరే తరహావి.’
‘మెటల్ కాస్టింగ్ కి తనదైన పద్ధతి ఉంది. ఆ టెక్నిక్ పూర్తిగా వేరు. హిందుస్తాన్ లో మెటల్ కాస్టింగ్ టెక్నిక్కులు చాలా ఉన్నాయి. ఓఝాల పని వేరే. శిల్పుల పని వేరే. బనారస్ పోత పని వేరే. నేపాల్ కాస్టింగ్ వేరే. ఇక్కడ రోడ్డుమీద కూర్చుని మెటల్ కాస్టింగ్ చేస్తారు చూడండి, ఇసుకలో నొక్కి, సాండ్ కాస్టింగ్ చేస్తారు. ఇవన్నీ వేరువేరు. ఇలాంటి కాస్టింగ్ మెటీరియళ్ళన్నిటిపైనా మేము చాలా అధ్యయనం చేసాం.’
‘అలానే కంసాలులు చేసే తరహా కాస్టింగు కూడా ఉంది. కమ్మరులు కూడా పోత పోస్తారు. వీరందరి పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. వారి మెటీరియల్ అంతా వేరే తయారవుతుంది. ఓఝా ఏం చేస్తాడంటే- మట్టి, తవుడు కలిపి మట్టి కోర్ తయారుచేస్తారు. దానిమీద ఆవు, దూడ పేడ లేపనం చేస్తారు. దానిమీద మైనం పని చేస్తారు. ఆ తర్వాత పుట్టమట్టి తెచ్చి దాన్ని సన్నగా జల్లెడ పట్టి అందులో ఇసుక కలిపి అది కూడా పూస్తారు. శిల్పులు కూడా మైనంతో పూర్తి ఆకారం తయారుచేసి దానిమీద మట్టిపూత పూస్తారు. చెట్లకింద వానపాములు చేరి మట్టితిని గుల్లగా బిళ్ళలు బిళ్ళలుగా చేస్తాయి కదా, ఆ మట్టి తెచ్చి దాన్ని సన్నగా నూరి దాన్ని ఆ మైనం మీద లేపనం చేస్తారు. పుట్టమట్టి తెచ్చి అందులో దూది కలిపి సన్నగా నూరి దానితో లేపనం చేస్తారు. సాండ్ కాస్టింగ్ కోసం నల్లరేగడి మట్టి వాడతారు. దాన్ని తెచ్చి పదే పదే కడగడం ద్వారా దానిలోంచి సన్నని ఇసుక తీస్తారు. ఇసుకను వెలికి తీసి అందులో ధనియాలు, బెల్లం కలిపి తయారు చేస్తారు. సాండ్ కాస్టింగ్ కోసం కొందరు ఇసుకలో బెల్లం కలిపి నొక్కుతారు. కొందరు చెకుముకి రాళ్ళు తీసుకొచ్చి దాని మీద ఎముకలు పెట్టి వాటిని కాలుస్తారు. కాల్చిన తర్వాత దాన్ని చేత్తో తాకితే చాలా సన్నగా చూర్ణంలాగా అయిపోతుంది. అందులో మళ్ళీ ధనియాలు, ఆముదం నూనె కలిపి దాన్ని కూడా సిద్ధం చేసి దాంతోనూ సాండ్ కాస్టింగ్ చేస్తారు.’
‘మన దగ్గర అచ్చులు తయారు చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. సాండ్ కాస్టింగ్ పద్ధతి వేరే, లోహాల కాస్టింగ్ ది వేరే. ఇసుకలో నొక్కి చెయ్యడం వేరే. పోత పొయ్యడం వేరే కాస్టింగ్ పద్ధతి. ఎన్నో రకాల అచ్చులు, కాస్టింగులు ఉన్నాయి. పేడతో విగ్రహాలు చేసే అచ్చులు వేరే, మట్టి విగ్రహాలు తయారుచేసే అచ్చులు వేరే. వాటిని లక్కతో తయారుచేసేవారు. కొన్ని చెక్కతో తయారు చేసేవారు. ఈ బుక్కా సమాజం ప్రజలు హోలీ సమయంలో హారాలు, కోళ్ళు, చిలకలు, గిలకలు ఇలా పటికబెల్లం హారాలు తయారుచేస్తారు కదా. వాటికి చెక్క అచ్చులుంటాయి. వాటిల్లో చక్కెర పాకం పోసి తీస్తారు. చక్కెరతో చాలా రకాల వస్తువులు తయారు చేయవచ్చు. మొహర్రంలో సోంగర్ రొట్టెలు చేస్తారు. సోంగర్ రొట్టెది కూడా ఒక అచ్చు ఉంటుంది. దానిమీద నొక్కి చాలా డిజైనింగ్ ఉన్న రొట్టె తయారుచేస్తారు. దాన్ని సోంగర్ రొట్టె అంటారు. ఇలాంటి అచ్చులు మన దగ్గర చాలా ఉన్నాయి.’
‘మనవాళ్ళు ప్రతి విషయాన్ని ఎంత సులభంగా చేసుకుంటారంటే మన చుట్టుపక్కలున్న మెటీరియల్ తోటే అంతా సిద్ధమవుతుంది. ఎక్కడినుంచో ఏదో తేనక్కరలేదు. ఇవన్నీ తమ దగ్గరే తయారు చేసుకుంటారు. ఇదంతా చాలా పెద్ద విషయం. చాలా కాలం తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. ఈ అచ్చులు, ఎలా నొక్కి తయారు చేస్తారో, ఇదంతా ఎలా తయారవుతుందో, ఎన్ని రకాల అచ్చులున్నాయో ఇదంతా మేము అధ్యయనం చేసాం. చక్కెరతో చేసేవి, రొట్టెతో తయారు చేసేవి అచ్చులున్నాయి. మిఠాయిలు తయారు చేసే అచ్చులు మొదలుకుని బంగారం పని చేసే దాకా ఉన్న రకరకాల అచ్చులు. వాటిల్లో చాలా అచ్చులు రాతితో చేసినవి ఉంటాయి. చాలా వరకూ మట్టితో తయారుచేసినవి, కొన్ని ఇత్తడివి, కొన్ని చెక్కవి. నాట్యం చేసేటప్పుడు సూర్యచంద్రుల్ని పెడతారు కదా. వాటిని ఇత్తడి అచ్చుల్లో నొక్కి సిద్ధం చేస్తారు-’
గురూజీ ఇలా వివిధ రకాల మానవసమాజాల గురించీ, వారి జీవన శైలుల గురించీ, ఆ జీవన విధానాల్ని నిలబెట్టుకోడానికి వారు నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థల గురించీ మాట్లాడుతున్నప్పుడు, 2010 లో ఆ సంభాషణల్ని రికార్డు చేసినప్పుడు నేను ఆయనలో ఒక ప్రజాకళాకారుణ్ణి మాత్రమే చూసాను. కాని దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఈ సంభాషణలు తిరిగి వింటున్నప్పుడు, వీటిని మీతో పంచుకోడానికి కూచున్నప్పుడు నాకు గురూజీలో ఒక యాంత్రొపాలజిస్టు కనిపిస్తున్నాడు.
Folklore కూడా యాంత్రొపాలజీలో ఒక భాగం కాబట్టి గురూజీ జానపద కళారూపాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, నేను ఆయన్ని యాంత్రొపాలజిస్టుగా పిలవడం లేదు. అది చాలా సామాన్యమైన అవగాహన. కానీ నేను చూస్తున్న కొత్త కోణం వేరే. Ruth Benedict ఒక సుప్రసిద్ధ అమెరికన్ యాంత్రొపాలజిస్టు. ఆమె పేరుమీదుగా చాలామంది ఒక వాక్యం ఉదాహరిస్తుంటారు: The purpose of anthropology is to make the world safe for human differences. అంటే మానవవిజ్ఞాన శాస్త్రం తాలూకు ముఖ్యమైన ప్రయోజనమేమిటంటే, మనుషుల్లో, వారి జీవన విధానాల్లో, సంస్కృతుల్లో వైవిధ్యం ఉంటుందని ప్రపంచానికి తెలియచెప్పడం, ఆ వైవిధ్యాన్ని ప్రపంచం అంగీకరించేలా చేయడం, తద్వారా ఆ వైవిధ్యానికి ఒక రక్షణ కల్పించడం.
ఆ వైవిధ్యం సంస్కృతుల మధ్య తేడాల రూపంలో కనిపిస్తుంది. కానీ మనిషి తనకన్నా భిన్నంగా ఉన్నదాన్ని చూసి చాలా అభద్రతకి లోనవుతాడు. భయపడతాడు. రెండు సంస్కృతులు ఒకదానికొకటి పరస్పరం ఎదురైనప్పుడు, రెండూ కూడా ఒకదాన్ని చూసి మరొకటి భయపడతాయి. అయితే వాటిల్లో దేనిదగ్గర సైనికబలం, ఆయుధ బలం మిక్కుటంగా ఉంటుందో, అది రెండో సంస్కృతిని పూర్తిగా తుదముట్టించడానికి చూస్తుంది. మానవచరిత్ర మొత్తం ఇటువంటి సంఘర్షణల చరిత్రనేగాని, 16-20 శతాబ్దాల మధ్య వలసవాదపు రోజుల్లో ఇది మరింత క్రూరస్థాయికి చేరుకుంది. ఏ స్థాయికి చేరుకుందంటే, శ్వేతజాతి పాశ్చాత్య పురుషుణ్ణి మాత్రమే నిజమైన మానవుడిగానూ , పరిణతి చెందినమానవుడిగానూ, తక్కినవారందరినీ పూర్తిగా పరిణతి చెందని మానవజాతిగానూ భావించేటంత. అటువంటి అంధత్వం నుంచి పాశ్చాత్య ప్రపంచాన్ని మొదట బయటపడవేసింది యాంత్రొపాలజిస్టులే. వారు వివిధ ఖండాల్లో, సముద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదిమజాతుల సంస్కృతిని అధ్యయనం చేసి ఆ ప్రజలు కూడా మానవసమాజాలుగా ఎంత అత్యున్నత స్థాయి సంస్కృతిని రూపొందించు కున్నారో చెప్పినదాకా పాశ్చాత్య ప్రపంచం కళ్ళు తెరుచుకోలేదు. మొత్తం యాంత్రొపాలజీ ఈ విధంగా సాధించిన కృషి మొత్తాన్ని ఈ వాక్యంలోకి కుదించి చెప్తుంటారు.
అయితే, రూత్ బెనెడిక్ట్ సరిగ్గా ఈ మాటలే చెప్పలేదుగానీ, The Chrysanthemum and the Sword (1946) అనే తన పుస్తకంలో ఆమె ఇలా అన్నారు:
The tough-minded are content that differences should exist. They respect differences. Their goal is a world made safe for differences, where the United States may be American to the hilt without threatening the peace of the world, and France may be France, and Japan may be Japan on the same conditions.
ఇక్కడ the tough minded అని ఆమె చెప్తున్నది మానవశాస్త్రజ్ఞుల గురించీ, సామాజిక శాస్త్రవేత్తల గురించీను. గురూజీ మాట్లాడిన ఈ మాటలు వింటుంటే, ఆయన కూడా అటువంటి ధృఢమనస్కుల కోవకి చెందినవాడేనని మనకు అనిపించకుండా ఉండదు.

ఫ్రాజ్ బోవాస్, రూత్ బెనెడిక్ట్, మాలినోవిక్సీ, రాబర్ట్ రెడ్ ఫీల్డ్, క్రోబర్, మార్గరెట్ మీడ్ వంటి మానవశాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా ఆధునిక మానవుడి కళ్ళు తెరిపించారు. అయితే అటువంటి అంధత్వమే ఇక్కడ భారతదేశంలో మరొక రూపంలో కొనసాగుతున్నది. ఆధునీకరణవల్ల మన సమాజంలో విస్తృతంగా పెరిగిన పట్టణీకరణ వల్ల కొత్త నాగరిక సమాజం ఒకటి తయారయ్యింది. వీరికి ప్రాచీన భారతదేశ వ్యవస్థ గురించిగాని, గ్రామాల గురించి గాని, శతాబ్దాలుగా భారతీయ సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చిన విలువల గురించి గానీ ఏమీ తెలియదు. ఈ శతాబ్దం మొదలయ్యేటప్పటికి, ఈ సరికొత్త నాగరిక సమాజం రెండు రూపాలు ధరించింది. వారిలో ఒకరు ఉదారవాదులు. వాళ్ళది ప్రధానంగా వామపక్ష, ప్రజాస్వామిక దృక్పథమేగాని, వాళ్ళకి యథార్థమైన భారతదేశం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇక రెండవ వర్గం ఛాందసవాదులు. వీళ్ళకి భారతదేశ సంస్కృతిలోని బహుళత్వం పట్ల గౌరవం లేదు. వీరు భారతదేశం మొత్తాన్ని ఒకే మతానికీ, ఒకే దేవతామూర్తికీ, ఒకే భాషకీ , ఒకే ఆహారపుటలవాట్లకీ , ఒకేరకమైన ఆర్థిక వ్యవస్థకీ పరిమితం చెయ్యాలని ప్రయత్నిస్తారు. పైకి చూస్తే ఈ ఛాందసవాదులు సంప్రదాయానికీ, ఉదారవాదులు ఆధునికతకీ ప్రతినిధులుగా కనిపిస్తారుగానీ, నిజానికీ ఈ రెండు దృక్పథాలూ కూడా పాశ్చాత్య సమాజపు సామ్రాజ్యవాద ధోరణికి పుట్టిన ఆలోచనా ధోరణులే. కాబట్టే వీరిరువురూ కూడా తమలాగా ఆలోచించని వారిని సహించలేరు. అసహనం ఇద్దరిలోనూ కనవచ్చే ఉమ్మడి లక్షణం.
నవనాగరికభారతదేశపు ఈ పరిమితినే గురూజీ ఎత్తిచూపుతున్నారు. తద్వారా భారతీయ బహుళత్వం తన వైవిధ్యాన్ని నిలుపుకోడానికి అవసరమైన ఒక సురక్షిత సానుకూలత కోసమే ఆయన జీవితమంతా మాట్లాడుతూ వచ్చారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది.
Featured image photography courtesy Apurva Sharma, Adilabad
25-6-2026


గురూజీ సంభాషణల పరంపరలో మరొక అత్యంత ఆసక్తికరమైన ప్రసంగం ఇది. ఎన్ని విషయాలు తెలిసాయో.. నేను ఇంతకు మునుపు చదువుకున్న ఎన్ని ప్రపంచ సాహిత్య అంశాలు గుర్తొచ్చాయో.. మీరు ఈ విధంగా ఈ సంభాషణలు మాకు అందించడం నిజంగా మా అదృష్టం.
బగరీకాల్ సమాజం వాళ్ళు ఊరూరా తిరిగి. ఒకరు ముప్ఫై రూపాయలు, మరొకరు మూడు వందలు సంపాదించినా, సాయంత్రానికి అంతా ఒక్కచోట చేర్చి కుటుంబాల లెక్కన సమానంగా పంచుకోవడం గురించి చదువుతుంటే కార్ల్ మార్క్స్ (Karl Marx) ప్రతిపాదించిన ఫేమస్ థియరీ ‘From each according to his ability, to each according to his needs’ వీళ్ళు ఆయన గురించి ఏమీ తెలియకుండానే అమలు పరిచేశారు కదా అనిపించింది.
ఎలిఫెంటా గుహల్లో లెక్చరర్ గోడ్సే గారు ఆ కాలపు ఊహల్లోకి వెళ్ళి పాడారని గురువుగారు చెబుతుంటే.. గోథే (Goethe) కొటేషన్ “Architecture is frozen music” (శిల్పకళ అనేది ఘనీభవించిన సంగీతం) గుర్తొచ్చింది.
ఇంక గురూజీ నోటివెంట వచ్చిన మాటలో, లేకపోతే మీరిచ్చిన అక్షర రూపమో కానీ ఈ క్రింది వాక్యాల్లో ఎంత భావుకత్వముందో.. చదువుతుంటే ఎంత హృద్యంగా అనిపించిందో మాటల్లో వ్యక్తపరచలేను.
“అందమైన కవితకి, అందమైన రచనకి, అందమైన సాధనకి అందమైన వాతావరణం ఉండాలి. దాని డిజైన్ అంతా అందంగా ఉంటేనే అక్కడనుండి ఒక అందమైన మాట వస్తుంది.”
“ఇప్పుడు ఆ ఆర్కిటెక్చర్ మారిపోయింది కాబట్టి ఆ సంగీతం దెబ్బతింది… ఇప్పుడది ఆడిటోరియం సంగీతంగా మారిపోయింది.”
“శిల్పకళ ఏమంత సులభమైన పని కాదు. కానీ ‘శిల్పవిద్యా సదా శ్రేష్ఠా సర్వదానందదాయికా’. రాతి విగ్రహాల పని ఎంత అందమైన పని అంటే అది ఆ పని చేసే వ్యక్తికి ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే తక్కిన పనులన్నింటిలోనూ మెటీరియల్ ని జోడించడం ఉంటుంది. కానీ ఇక్కడ తీసెయ్యడం ఉంటుంది.”
రాయి లోపల ఉన్న అద్భుత రూపాన్ని అనవసరమైన భాగాలను తొలగించడం ద్వారా బయటకు తీయడమే శిల్పకళ అన్న నిర్వచనాన్ని గురూజీ మాటల్లో వింటుంటే మైఖలేంజెలో (Michelangelo) అన్న ప్రసిద్ధ వాక్యం గుర్తొచ్చింది “I saw the angel in the marble and carved until I set him free.”
ఇంక నన్ను అన్నిటికంటే ఎక్కువ ఆనందింప చేసిన విషయం గురూజీ సంభాషణలలో చోటు చేసుకున్న ఈ ప్రాచీన జానపద కళా రూపాల గురించిన వివరాలు. ఈ భాగంలో వీటిని చదువుతుంటే నాకు ఎందుకో డేజావూ (Deja Vu) ఫీలింగ్ కలిగి.. ఎక్కడో ఇవన్నీ ఇంతకు మునుపు ఇలా కాకపోయినా కొంచెం చదివినట్టుందే అని అనుకుంటుంటే గుర్తొచ్చింది. నేను ఎప్పుడో ఆరేళ్ల క్రితం యూట్యూబ్ లో రోజుకో పద్యం సిరీస్ చేస్తున్నప్పుడు పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం లో 13వ శతాబ్దపు నాటి సమాజంలో ప్రజలను అలరించిన, శివభక్తిని ప్రచారం చేయడానికి వివిధ రకాల జానపద కళాకారులు, పగటి వేషగాళ్లు ప్రదర్శించిన కళా రూపాల వర్ణనలలో ఇటువంటి కళల ప్రస్తావన ఉందన్న సంగతి… సోమనాథుడు ద్విపద ఛందస్సు లో రాసిన ఈ పంక్తులు చూడండి…
“పటుతర గతి నటన పటువులై యాగి
నటు లద్భుతంబుగా నటియించు వారు
బహురూపములు సాగి భక్తుల యెదుట
బహు రూపములు లీల భాసిల్లు వారు…”
భావం: నటనలో అత్యంత నైపుణ్యం కలిగిన నటులు అద్భుతంగా నటిస్తూ, రకరకాల వేషాలు (బహురూపాలు) ధరించి భక్తుల ఎదుట లీలా వినోదాలు ప్రదర్శిస్తున్నారు.
“భారతాది కథల ప్రబంధంబు లనగ
చారు నృత్యంబులు జరపువారలును
జగతిపై బొమ్మలాటల వారు ననగ
బెగడొంద నాడుచు బేర్విడు వారు
కడగి శృంగార వీర రసములు కాగ
నాడుచు బాడెడు నర్తకుల్ తగుల…”
భావం: భారతాది పురాణ కథలను నృత్య రూపంలో ప్రదర్శించేవారు, లోకంలో ఎంతో ఖ్యాతి గాంచిన తోలు బొమ్మలాటలు ఆడిస్తూ జనాలను ఆశ్చర్యపరిచేవారు, శృంగార వీర రసాలు ఒలికేలా పాడుతూ నాట్యమాడే నర్తకులు అక్కడ అలరించేవారు.
“కోలల పాటలు కోలాటములును
లీలమై గొండ్లి సల్పెడు వారలును
వెస డమరుకముల వింతలై యొప్ప
నెసగంగ వాయిద్య మెసయించు వారు…”
భావం: కోలలతో పాటలు పాడుతూ కోలాటాలు ఆడేవారు, అందంగా ‘గొండ్లి’ నృత్యాలు చేసేవారు, డమరుకాలు వాయిస్తూ వింత వింత శబ్దాలతో వాయిద్య విన్యాసాలు చేసేవారితో ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది.
ఇంకా సోమనాథుడు శివరాత్రి మహోత్సవాల సందర్భాన్ని వర్ణిస్తూ, ఆ కాలంలో కళాకారులు దేవుళ్లు, రాక్షసులు, జంతువులు, పక్షులు మరియు సమాజంలోని వివిధ వృత్తుల వారి వైవిధ్యభరిత వేషధారణలు వేసుకుని శివలీలలను, సిరియాళుని కథ, బెజ్జమహాదేవి కథ లాంటి పురాణ గాథలను గ్రామ వీధుల్లో యక్షగానాలు , వీధినాటకాల రూపంలో ప్రదర్శిస్తూ.. వాటి ద్వారానే సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే నీతిని బోధించే వారనీ… మురజలు, మద్దెలలు, కాహళులు, శంఖాలు, డమరుకాలు వంటి అనేక రకాల చర్మ వాయిద్యాలు, ఫ్లూట్ లాంటి వాయు లీన వాయిద్యాలను ఈ జానపద కళాకారులు ఉపయోగించేవారని సోమనాథుడు పేర్కొన్నాడు.
ఈ బసవపురాణం పంక్తులు, గురూజీ గత రెండు మూడు సంభాషణలు చదివిన తరువాత మళ్ళీ చదువుతుంటే 13వ శతాబ్దపు తెలుగు నాట జానపద కళలు ఎంతటి ఉన్నత స్థితిలో ఉండేవో, సోమనాథుడు వాటిని ఎంత సూక్ష్మంగా పరిశీలించాడో 20వ శతాబ్దంలో కూడా రవీంద్ర కుమార్ శర్మ గారు అంతకన్నా సూక్ష్మంగా , నిశితంగా పరిశోధించి మరీ పరిశీలించారనిపిస్తుంది…
“పూర్వకాలంలో ఎవరూ లైబ్రరీకి వెళ్ళేవారు కారు. లైబ్రరీయే ప్రజల వద్దకు వచ్చేది. కూర్చున్నచోటకే వచ్చి వీరు ఇవన్నీ వినిపించేవారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైబ్రరీ. గ్రంథాలయాల్లాంటివారు.” గురూజీ కూడా ఒక నడిచే గ్రంథాలయం కాబట్టే వేల పుస్తకాలు చదివినా కూడా మనం ఆకళింపు చేసుకోలేనంత సమాచారం ఆయన దగ్గర ఉంది.
చివర్లో మీరు ఈ వ్యాసాన్ని రూత్ బెనెడిక్ట్ (Ruth Benedict) ప్రతిపాదించిన ‘The purpose of anthropology is to make the world safe for human differences’ అనే సిద్ధాంతంతో ముడిపెట్టి, గురూజీని ఒక యాంత్రొపాలజిస్ట్‌గా ఆవిష్కరించిన తీరు అద్భుతం. నిజంగా బెనెడిక్ట్ మాటలను మీరు తెలుగులో చెప్పినట్టు “మానవవిజ్ఞాన శాస్త్రం తాలూకు ముఖ్యమైన ప్రయోజనమేమిటంటే, మనుషుల్లో, వారి జీవన విధానాల్లో, సంస్కృతుల్లో వైవిధ్యం ఉంటుందని ప్రపంచానికి తెలియచెప్పడం, ఆ వైవిధ్యాన్ని ప్రపంచం అంగీకరించేలా చేయడం, తద్వారా ఆ వైవిధ్యానికి ఒక రక్షణ కల్పించడం.” ఈ పోస్టు ద్వారా నాకు “The Chrysanthemum and the Sword (1946) అనే మరొక మంచి పుస్తకం పేరు పరిచయమైంది.
గురూజీ సంభాషణలు ఈ విధంగా మీ కొసమెరుపులతో మాకందిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు భద్రుడు గారు.
ఎంతో విలువైన స్పందన. మీరు ఎత్తి రాసినవన్నీ గురూజీ వాక్యాలే. పాల్కురికి సోమనాథుడి రచన నుంచి మీరు తీసుకువచ్చిన ద్విపదభాగాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర రెండింటిలోనూ జానపద కళారూపాల గురించి ప్రస్తావన ఉందనుకుంటాను భద్రుడు గారు. నేను ఉదహరించిన ద్విపద భాగాలు ఆరేళ్ళ క్రితం నోటు చేసుకున్నవి. బసవపురాణం లోవే అనుకుంటున్నా.
భద్రుడు గారు, ఆర్కైవ్ లో వున్న బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర పుస్తకాల కాపీలు చెక్ చేస్తే నేను ఉదాహరించిన ద్విపద పంక్తులు సోమనాథుని పండితారాధ్య చరిత్ర ఐదవ అధ్యాయం — పర్వత ప్రకరణం చివర్లో కనబడ్డాయి. శ్రీశైలంలో శివరాత్రి నాడు శివభక్తులు ఆ కళా రూపాల ప్రదర్శనతో జాగారం చేసే సందర్భంలో వస్తాయి.
ఈ శతాబ్దం మొదలయ్యేటప్పటికి, ఈ సరికొత్త నాగరిక సమాజం రెండు రూపాలు ధరించింది. వారిలో ఒకరు ఉదారవాదులు. వాళ్ళది ప్రధానంగా వామపక్ష, ప్రజాస్వామిక దృక్పథమేగాని, వాళ్ళకి యథార్థమైన భారతదేశం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇక రెండవ వర్గం ఛాందసవాదులు. వీళ్ళకి భారతదేశ సంస్కృతిలోని బహుళత్వం పట్ల గౌరవం లేదు. వీరు భారతదేశం మొత్తాన్ని ఒకే మతానికీ, ఒకే దేవతామూర్తికీ, ఒకే భాషకీ , ఒకే ఆహారపుటలవాట్లకీ , ఒకేరకమైన ఆర్థిక వ్యవస్థకీ పరిమితం చెయ్యాలని ప్రయత్నిస్తారు. పైకి చూస్తే ఈ ఛాందసవాదులు సంప్రదాయానికీ, ఉదారవాదులు ఆధునికతకీ ప్రతినిధులుగా కనిపిస్తారుగానీ, నిజానికీ ఈ రెండు దృక్పథాలూ కూడా పాశ్చాత్య సమాజపు సామ్రాజ్యవాద ధోరణికి పుట్టిన ఆలోచనా ధోరణులే. కాబట్టే వీరిరువురూ కూడా తమలాగా ఆలోచించని వారిని సహించలేరు. అసహనం ఇద్దరిలోనూ కనవచ్చే ఉమ్మడి లక్షణం.
సర్, మీరు పైన చెప్పిన అంశాలు చాలా సృష్టంగా నేడు మనముందు కనిపించే లక్షణాలు…. మార్పు రావాలి, అన్ని జీవిత కోణాలను దర్శించగలగాలి.
ధన్యవాదాలు సార్!
సర్, మీరు గురూజీతో జరిగిన ఈ సంభాషణలు పంచుకోవడం మొదలుపెట్టినప్పుడు “ఎవరా ఈ గురూజీ?” అనే కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. కానీ ఒక్కో భాగం చదువుతున్నకొద్దీ ఆశ్చర్యం మరింత పెరుగుతోంది.
ఇన్ని రకరకాల సమాజాలు, వృత్తులు, కళలు, జీవన విధానాలు, పల్లెలు, ఆర్థిక వ్యవస్థలు, traditional technologies, various skills… ఎన్నెన్నో విషయాలు! The sheer breadth and depth of the topics he covered is simply mind blowing.
వాటన్నిటినీ కలిపే ఒక common thread మాత్రం ప్రతి భాగంలో కనిపించే authentic authority. ఈ authority పుస్తకాల ద్వారా వచ్చిన knowledge కాదు, ఆ సమాజాలతో కలిసి జీవించి, వారితో కలిసి నేర్చుకుని, వారి జీవితాలను దగ్గరగా చూసి, వారికి సేవ చేస్తూ సంపాదించుకున్న లోతైన అవగాహన నుంచి వచ్చినదని స్పష్టంగా తెలుస్తుంది.
“వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైబ్రరీ” అన్న మాటతో, పుస్తకాలలో మాత్రమే జ్ఞానం ఉండదు, మనుషులే నడిచే గ్రంథాలయాలు అని నమ్మి, అంతరించిపోతున్న వృత్తి విద్యలను, కళలను అభిమానించడం మాత్రమే కాదు, వాటిని తెలుసుకుని, నేర్చుకుని, రికార్డు చేసి, భద్రపరచాలన్న మహోన్నతమైన సంకల్పాన్ని జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప ఉద్యమకారులుగా మీ ఈ రచనల ద్వారా గురూజీ గురించి తెలుసుకుంటూ వచ్చాము.
ఈ context లో Ruth Benedict చెప్పిన
“The purpose of anthropology is to make the world safe for human differences.”
అన్న మాటలు, దానికి అనుగుణంగా మీరు చెప్పిన
“తద్వారా భారతీయ బహుళత్వం తన వైవిధ్యాన్ని నిలుపుకోడానికి అవసరమైన ఒక సురక్షిత సానుకూలత కోసమే ఆయన జీవితమంతా మాట్లాడుతూ వచ్చారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది.”
ఈ కోణంలో గురూజీని ఒక anthropologistగా చూడడం నిజంగా a very natural and fitting perspective.
Thank you for bringing this perspective. It gave us a much deeper understanding of Guruji and his life’s work.🙏🏽
Also, Vijay Sir’s comment added beautiful literary and historical connections that enriched this reading experience even more. 🙏🏽
మీ స్పందన కూడా అంతే సాధికారికంగా, అంతే సహృదయంతో ఈ సంభాషణలకు వన్నె దిద్దుతోంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.