
నాలుగవ రోజు: ఆరవ సంభాషణ
ప్రతి ఒక్క రంగుకీ ఒక ఫిలాసఫీ ఉంది
చీకటిపడుతోంది. ఇక సంభాషణలు ముగించి గురూజీకి విశ్రాంతినిద్దామనుకున్నాను. కానీ ఆయనలో అలసట కనిపించడం లేదు. చెప్పవలసింది మరి కొంత ఉందన్నట్టే కనిపిస్తున్నారు. ‘మిగిలింది మళ్ళా పొద్దున్న మాట్లాడుకుందాం’ అని అంటే, ‘లేదు, రేప్పొద్దున్న సదాశివ గారి దగ్గరకి వెళ్దాం. మీరొచ్చారని తెలిసి ఆయన ఇక్కడికి రావాలనుకున్నారు. కాని మనమే వెళ్దాం రేపు పొద్దున్న’ అన్నారు గురూజీ. ‘అందుకని ఈ రోజు చెప్పవలసింది ఇప్పుడే పూర్తి చేసేద్దాం’ అని తన సంభాషణ కొనసాగించారు:
‘మనం సంగీతంలో, నాట్యంలో చూసిన విభాగాలు శిల్పంలో కూడా ఉంటూ వచ్చాయి. చిత్రకళలోనూ లోకశైలీ , శాస్త్రీయ శైలీ రెండూ ఉంటూ వచ్చాయి. మన దగ్గర రకరకాల శైలులున్నాయి. మన దగ్గర శిల్పశాస్త్రాలు దాదాపు 32 ఉన్నాయి. వాట్ల్లో మయవాస్తు, కాశ్యప శిల్ప సూత్రం, విశ్వకర్మీయం, మానసోల్లాసం, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణం, సమరాంగణ సూత్రధార, సోమ పురాణం, రూపమండనం మొదలైనవి ఉన్నాయి. వీటిలో చిత్రకళ ఎలా ఉండాలి, శిల్ప కళ ఎలా ఉండాలి, వాటిల్లో ఏమేమి ఉండాలన్నదాని మీద అద్భుతమైన వర్ణన ఉంది.
రూపభేదాః ప్రమాణాని భావలవణ్యయోజనమ్
సాదృశ్యం వర్ణికాభంగం ఇతి చిత్ర షడంగకమ్
చిత్రకళకి ఆరు అంగాలు చెప్పారు. మొదటిది రూపభేదం తెలిసి ఉండాలి, ఆ తర్వాత భావం, భావానికి అనుగుణంగా భంగిమ అంటే రూపురేఖలు. దానిలో లావణ్యం ఉండితీరాలి. సాదృశ్యం అంటే మనం ఏ వస్తువుని తయారుచేస్తున్నామో అది నిజమైన వస్తువుకి సరిగ్గా సరిపోలాలి. వర్ణికా భంగం అంటే, అందులో వాడే రంగులు, ఆ రంగుల వినియోగం సరిగ్గా ఉండాలి. ఇక ప్రమాణం అంటే ప్రపోర్షన్. అది చాలా ముఖ్యం. ఇదంతా అందులో ఉంటుంది, దానికి అనుగుణంగా రంగులు కూడా ఉండాలి.’
‘రంగుల విషయానికొస్తే మన దగ్గర చాలా రకాల రంగులున్నాయి. ఆ రంగులన్నింటినీ మనవాళ్ళు చాలా సులభంగా తయారుచేసుకునేవారు. ‘కుంకుమ’ ఒక రంగు. బుక్కా ఒక రంగు. గులాల్ ఒక రంగు. తిరుమణి కూడా ఒక రంగు. ఇవన్నీ రంగుల రకాలే. వీటిని తయారు చేసేవాళ్ళని బుక్కా సమాజం అనేవారు. సుద్దమట్టినుండి తిరుమణి తయారుచేసేవారు. దాన్ని వైష్ణవులు నామంగా ధరిస్తారు. అది కేవలం మట్టి మాత్రమే. ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చి విభూతి తయారుచేస్తారు. ఒక బట్టీ ఏర్పాటుచేసి విభూతిని తయారుచేసే ఒక పద్ధతి ఉంది.’
‘కుంకుమ చాలాచోట్ల మొక్కలనుంచి లభిస్తుంది. వాటి పువ్వులు లేదా పండ్లనుంచి దాన్ని తీస్తారు. ఆ మొక్కలకింద ఒక గుడ్డ పరిచి దాలిన పూలనీ, పండ్లనీ సేకరించి వాటితో చేస్తారు. సహజసిద్ధమైన కుంకుమ దొరకనిచోట కుంకుమని సొంతంగా తయారుచేసుకుంటారు. ఎలా? పసుపులో సున్నం కలిపితే కుంకుమ తయారవుతుంది కదా! కానీ వారు సున్నం కలపరు. పసుపులో పులుపు కలుపుతారు. అది నిమ్మకాయ పులుపు కాదు. వెలగపండు, నెల్లికాయ, ఉసిరికాయల పులుపు. వాటి మిశ్రమాన్ని పసుపులో కలపడం ద్వారా అద్భుతమైన కుంకుమ తయారవుతుంది.’
‘పసుపుతో పాటు చాలాసార్లు ఈ ప్రాంతంలో కందిపప్పునుంచి కూడా కుంకుమ తయారుచేసేవారు. ఒక రకమైన గడ్డి ఉంటుంది. ఆ గడ్డిగింజల నుంచి కూడా కుంకుమ తయారవుతుంది. దానితో పాటు సింధూరం అనేది ఒక లోహం. తుమ్మచెట్టుబెరడు, తుమ్మపండ్లతో బుక్కా తయారుచేసి చూర్ణం సిద్ధం చేసేవారు. మిగిలిన చాలా రంగులు మొక్కలనుంచి తయారయ్యేవి. బట్టలమీద వేసే రంగులు మూలికల రంగులే అయి ఉండేవి. కరక్కాయ, దానిమ్మ పండు తొక్కలనుంచి కూడా రంగు తయారుచేసేవారు.’
‘మన దగ్గర గేరు అంటే కావిరంగునే ఎరుపు రంగుగా భావించేవారు. ఒకరకమైన చెట్టు వేర్లనుంచి కూడా ఒకరకమైన ఎరుపు తయారుచేసేవారు. అది అలిజారిన్ తరహాలో ఉంటుంది. నీలిమందు మొక్కలనుంచి నీలం రంగు తయారుచేసేవారు. పువ్వులనుంచి కూడా చాలా రకాల రంగులు తయారయ్యేవి. మోదుగ పూలనుండి, కాచు నుండి కూడా రంగులు తయారుచేసేవారు. అవన్నీ వస్త్రాలమీద అద్దకానికి ఉపయోగించేవారు.’
‘తుప్పుపట్టిన ఇనుప ముక్కల్ని బెల్లంతో కలిపి మూడు రోజుల పాటు నీళ్ళల్లో నానబెట్టేవారు. దాన్నుంచి నల్లటి రంగు తయారయ్యేది. దాన్ని నలుపురంగుకి ఉపయోగించేవారు.’
‘రంగులు తయారుచేయడానికి ప్రతి ఒక్కరైకీ తమదైన ఒక పూర్తి ప్రాసెస్ ఉండేది. దేన్ని ఎలా తయారుచెయ్యాలి, ఎన్నిరోజుల పాటు నానబెట్టాలి అనేది ఉండేది. నీలం రంగుకోసం నీలిమందు మొక్క ఆకుల్ని ఎండబెట్టి, వాటిని నానబెట్టి, దాన్నుంచి రంగుతీసేవారని చెప్పాను కదా. ఆ రంగు ఎలా వచ్చేదంటే, ఆ ఆకుల్ని పెద్దపెద్ద కుండల్లో వేసి గొర్రెల పెంటలో ఆ మట్టికుండల్ని ఉంచేవారు. గొర్రెల పెంట వల్ల ఒక రకమైన ఉష్ణోగ్రత అందులో పుట్టి చాలా గట్టిదైన, మన్నికైన రంగు తయారయ్యేది. కానీ అది ఖచ్చితంగా గొర్రెల పెంటనే అయి ఉండాలి. మేకలుగానీ, ఆవులుగానీ, మరేదీ పనికిరాదు. ఆ గొర్రెల పెంట మధ్యలో ఆ కుండల్ని పెట్టి అందులో ఆకులు నానబెట్టినందువల్ల ఆ నీలం రంగు ఒక ప్రత్యేక పద్ధతిలో తయారయ్యేది.’
ఈలోపు అక్కడున్న శ్రోతల్లో ఒకరు నీలిమందు సాగు గురించి ప్రశ్నించారు. గురూజీ, రంగుల గురించిన తన ప్రసంగం ఆపి, నీలిమందు సాగు గురించి కూడా రెండుమూడు మాటలు చెప్పారు.
‘అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు నీలిమందు సాగు చేయించారు. వాళ్ళకి నీలిమందు అవసరమై బలవంతపు సాగు చేయించారు. నిజానికి మన స్థానిక ప్రజల అవసరాల కోసం గ్రామంలో రంగులు అద్దేవాళ్ళకి అవసరమైన మేరకి నీలి ఆకు అడవుల్లోనో, పొలాల్లోనో సహజంగానే దొరికేది. వాళ్ళు దాన్ని సేకరించి దాచిపెట్టుకునేవారు. కాని బ్రిటిష్ వారు వారికి నీలిమందు అవసరమై ప్రత్యేకంగా నీలిమందు సాగు మొదలుపెట్టించారు.’
‘మనవాళ్ళు నీలిమందు ఎలా వాడేవాళ్ళో తెలుసా? ఇప్పుడు వీళ్ళు నీలిమందుని బిళ్ళల్లాగా గట్టిగా చేసి పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఆకులపళంగానే అలానే ఎండబెట్టి దాచుకునేవాళ్ళు. రంగుకావాలనుకున్నప్పుడు వాటిని నానబెట్టుకుంటే సరిపోయేది. కానీ మన సంస్కృతిలో నీలిరంగుని ఎప్పుడూ శుభప్రదంగా భావించలేదు. నీలిరంగు దుస్తులు ధరించడం నిషేధంగా ఉండేది. ఎందుకంటే నీలిమందు మొక్కకి ఒక ప్రత్యేకత ఉంది. దాని ఆకుల్ని రాత్రిపూట మాత్రమే కోస్తారు. సూర్యోదయసమయానికి ఆ మొక్కలోని రంగంతా కింద వేర్లలోకి వెళ్ళిపోతుంది. ఆకుల్లో రంగు నిలవదు. మళ్ళీ సూర్యాస్తమయం తర్వాతే ఆ రంగు మెల్లగా పైకి వచ్చి ఆకుల్లోకి చేరుతుంది. అందుకే దాని కోత రాత్రిపూట మాత్రమే చేసేవాళ్ళు. కోసిన తర్వాత కూడా చీకట్లోనే, నీడలోనే దాన్ని ఎండబెట్టేవాళ్ళుగానీ దానిమీద సూర్యకాంతి పడకుండా జాగ్రత్త పడేవాళ్ళు. ఏ రంగుకి సూర్యరశ్మిని చూస్తే అంత భయమో దాన్ని మన వంటిమీద ధరిస్తే మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా అనుకున్నారు మన పూర్వీకులు.’
‘ఇది కాకుండా నీలిమందు సాగుమీద నిషేధానికి మరో బలమైన కారణం ఉంది. ఎక్కడైతే నీలిమందు సాగు చేస్తారో, ఆ భూమిలో ఆ తర్వాత పన్నెండేళ్ళ దాకా ఎలాంటి పంటా పండదు. భూమి పూర్తిగా నిస్సారమైపోతుంది. అంతకాలం భూమిని ఖాళీగా వదిలేయవలసి వస్తే ఆ సాగు చేయడమెందుకు? స్థానిక అవసరాలకు కావలసినంత సహజంగా ప్రకృతిలోనే దొరుకుతున్నప్పుడు ప్రత్యేకంగా సాగు చెయ్యడమెందుకు అనుకున్నారు.’
‘ఈ రంగులన్నింటినీ ఉడికించడం, అందులో పటిక వెయ్యడం-రంగు గట్టిగా మారడం కోసం ఈ ప్రక్రియ అంతా నడిచేది. దాన్ని ఎంతవరకూ ఉడికించాలి, ఎంత పటిక వెయ్యాలి అనేది చూకునేవారు. దాన్ని ఉన్నిమీద ఎక్కించడానికి, నూలుమీదనా, లేక పట్టుమీదనా అనేదానికి కూడా ఒక లెక్క ఉండేది. రంగులో మన్నిక తేవడానికి పటిక చాలా ఉపయోగపడేది. ఇలాంటి వస్తువులు, మసాలాలు ఉండేవి, అదొక పెద్ద ప్రాసెస్.’
‘వస్త్రాల రంగులు చెట్ల బెరడునుండి, పండ్లు లేదా పువ్వులనుండి తయారయ్యేవి. కాని చిత్రకళకి వాడే రంగులు, అంటే గోడలమీద గీసే భిత్తిచిత్రాలకి అవసరమయ్యే రంగులు వీటికి భిన్నంగా ఉండేవి. అవి మట్టినుండి లేదా రాళ్ళనుండి తయారయ్యేవి. ఇంగిలీకం, హరితాళం, సింధూరం వంటివి రాళ్ళే. అవి ఆయుర్వేదంలో కూడా ఉపయోగపడతాయి. వాటితో పాటు గేరు రంగు కూడా.’
‘తెలుపు రంగు తయారు చేయడానికి ముగ్గురాయిని మెత్తగా నూరి దాన్నుంచి తయారుచేసేవారు. లేదా చిప్పల్ని నానబెట్టి ఆ తర్వాత వాటిని దంచి మెత్తగా నూరి వాటినుంచి కూడా ఒక రకమైన తెలుపు రంగు తయారుచేసేవారు. ఖడి అనే తెల్లమట్టి రాయి ఉండేది. అది సున్నం కాదుగాని, సున్నంలాగా ఉంటుంది. దాన్ని ఒక మూటలో కట్టి నానబెడతారు. అది నానేక దాన్ని బాగా పిసికి పిసికి దాన్నుంచి తెలుపు రంగు తీస్తారు. సుద్దమట్టి తెల్లగా ఉంటుంది. దాన్నుంచి కూడా రంగు తయారవుతుంది. ఇవన్నీ మట్టినుంచీ, రాళ్ళనుంచీ తయారయ్యే రంగులు. ఆ రంగుల్లో బంక కలిపేవారు. బంక లేదా జిగురు అంటే వేపజిగురు, తుమ్మ జిగురు, లేదా తపసి చెట్టు జిగురు. ఈ మూడు రకాల జిగుర్లనీ వాడేవారు. లేదా సిరస్ కూడా వాడేవారు. కొన్ని రంగుల్లో సిరస్ కూడా కలపవలసి వచ్చేది. సిరస్ ని పూర్వం గ్రామాల్లోనే తయారు చేసుకునేవారు. తోలుముక్కల్ని తీసుకుని వాటిని బురదలో నానబెట్టేవారు. మూడు నాలుగు రోజులు నానిన తర్వాత దాన్ని బట్టీమీద పెట్టి ఉడికించేవారు. దాన్నుంచి ఒకరకమైన రసం వచ్చేది. అది చాలా గట్టిగా ఉండేది. చర్మాన్ని అతికించడానికి పనికొచ్చేది. దాన్ని కూడా రంగుల్లో కలిపేవారు. ఇనుపముక్కలనుండి నలుపు రంగు చేసేవారని చెప్పాను కదా, దాన్ని వస్త్రాల మీద అద్దకంకోసం వాడేవారు.’
‘పెయింటింగ్ కోసం కావలసిన నలుపు రంగుని దీపం మసినుంచి సేకరించేవారు. దీపం వెలిగించి దానిమీద బోర్లించిన గిన్నె లేదా మూత పెట్టి ఆ మసిని పట్టుకుని దానిలో జిగురు కలిపి నలుపురంగు తయారుచేసేవారు. ఆవుమూత్రం నుంచి పసుపురంగు తయారుచేసేవారు. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఆవుమూత్రం నుంచి పసుపురంగు తయారుచేయడం నిషేధించారు. కాని ఆ రంగు పెయింటింగ్ లోకి పనికి వచ్చేది. వస్త్రాలకి కూడా పనికొచ్చేది. ఆవులకి మామిడి ఆకులు తినిపించేవారట. ఆ తర్వాత ఆ గోవులు విడిచే మూత్రం సేకరించిదాన్నుంచి పసుపురంగు తయారుచేసేవారని చెప్తారు.’
‘నీలం రంగుకోసం నీలిమందు మొక్కల ఆకులనుంచి సేకరించేవారని చెప్పాను కదా. నీలిమట్టి కూడా ఉండేది. పూర్వం బెడ్డా నీలి అని దొరికేది. అదొక రాయిలాగా ఉండేది. అదొక నీలం రంగు. ఆకుపచ్చ రంగు విడిగా దొరికేది కాదు. నీలం, పసుపుపచ్చ కలపడంవల్ల ఆకుపచ్చ తయారవుతుంది. ఆకుల ఆకుపచ్చ వేరుగా ఉంటుంది. దాన్ని పెయింటింగ్ లోవాడేవారు కాదు. పెయింటింగ్ కోసం నీలం, పసుపులు కలిపిన మిశ్రమాన్నే వాడేవారు.’
‘ఈ రంగులన్నిటినీ చాలా మెత్తగా నూరేవారు. చాలాసార్లు ఈ రంగుల్ని తయారుచేసి నిలవచేసుకునేవారు. వడియాలు పెట్టినట్టు చిన్న చిన్న వడియాల్లాగా తయారుచేసి ఎండబెట్టి దాచుకునేవారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి పెయింటింగ్ పని మొదలుపెట్టేవారు. మీనియేచర్ పెయింటింగ్ వేయడానికి ఆ రంగుల్ని ఎంత మెత్తగా నూరాల్సి వచ్చేదంటే, ఆ కళాకారుడు లేదా ఆ ఉస్తాద్, అతను ఈ రంగుని ఇలా గోటిమీద రాసేవాడు. రాసి ఇలా తుడిచేవాడు. ఆ గోటిపైన ఉండే సన్నని గీతల్లో ఆ రంగు నిండాలి. అంత మెత్తగా ఆ రంగు ఉండాలి. అప్పుడే అది పనికొస్తుంది మీనియేచర్ చిత్రలేఖనానికి.’
‘రంగు అంత మెత్తగా ఉన్నప్పుడు సన్నని గీతలు గియ్యడానికి ఆ కుంచె ఎలా ఉండి ఉండాలి? ఆ రోజుల్లో బ్రష్షులు మేకగడ్డం కింద ఉండే వెండ్రుకలతో తయారు చేసేవారు. ఇంకా చాలా సన్నని గీతలు గియ్యడానికి ఎలుకచెవిలోపల ఉండే వెండ్రుకలు ఉపయోగించేవారు. ఆ వెండ్రుకల్ని సన్నని పట్టుదారంతో కట్టి కోడి ఈక ఉంటుంది కదా, దాని లోపల ఒక సన్నని రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలోంచి ఈ దారం బయటకి లాగేవారు. ఆ దారాన్ని అక్కడ చుట్టి పట్టుకోడానికి వీలుగా తయారుచేసేవారు. దాంతో ఆ సన్నని గీతలు గీసేవారు. జనపనారతో కూడా బ్రష్షులు తయారుచేసేవారు. పెద్ద పెద్ద పెయింటింగులకీ లేదా పూత పుయ్యడానికి జనపనార బ్రష్షులు వాడేవారు.’
‘గోడమీద మొత్తం తెలుపు రంగువేయాలనుకోండి. అప్పుడు ఆ గోడకి ఆవుపేడతో పూతపూసి, దానిమీద సుద్దమట్టితో తెల్లటి పూత పూసి, ఆ తర్వాత ఖడి వేసేవారు. ఖడి వేసిన తర్వాత దాన్ని రాళ్ళతో రుద్దేవారు. రాళ్ళతో రుద్ది నునుపు చేసిన తర్వాత దానిమీద రేఖాచిత్రం గీసి, ఆమీదట ఈ రంగులు నింపేవారు. రంగులు పూసాక కూడా దాన్ని రాళ్ళతో రుద్దవలసి వచ్చేది. సన్నని గీతలు, పువ్వులు వెయ్యడం లాంటివి నడిచేవి. అలా వేసిన ఒక పటచిత్రం నేను రేపు మీకు చూపిస్తాను. ఆ పద్ధతిలోనే భిత్తి చిత్రాలు కూడా గీసేవారు. విగ్రహాలమీద వెయ్యడానికి కూడా ఇవే రంగులు. అయితే విగ్రహాలమీద రంగులు వేసాక చాలా పనితనం జరిగేది. దాన్ని ఘోటా పని అంటారు. గుడ్డతో బాగా రుద్దేవారు.దానివల్ల ఆ విగ్రహాల్లో ఒక సన్నని తేలిపాటి మెరుపు వచ్చేది. దానిమీద సన్నని లైనింగు వర్క్ చేసేవారు. చాలా అద్భుతమైన, అందమైన పని అది.’
‘ఇప్పటిదాకా వస్త్రాలమీదా, వర్ణచిత్రలేఖనాల్లోనూ వాడే రంగుల గురించి చెప్పాను. కానీ మట్టిపాత్రల మీద వెయ్యడానికి వేరే రంగులుండేవి. మట్టిపాత్రలమీద కావిరంగు వేసేవారు. బింకం అని ఇక్కడ ఒక రాయి దొరుకుతుంది. ఆ రాతిని మెత్తగా నూరి నీళ్ళల్లో నానబెట్టి పాత్రలమీద వేసేవారు. దాంతో కారాగిరి చేసేవారు. అది కాలిన తర్వాత బంగారు రంగులోకి మారుతుంది. నలుపు రంగు పనిచేయాలనుకుంటే కార్లా అనే రాయి దొరుకుతుంది. దాన్ని నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా నూరి దాంతో కారాగిరి చేసేవారు. జబల్ పూర్ ప్రాంతాల్లో తెల్లటి కారాగిరి జరిగింది. అదొకరకమైన తెల్లమట్టి. ఇక్కడ చంద్రాపూర్ పక్కన పాఖాన్ అని ఒకటి దొరుకుతుంది. దాన్ని పాత్రలమీద వెయ్యడం వల్ల మెరుపు వస్తుంది.’
‘ఎద్దు కొమ్ములు లేదా గేదె కొమ్ముల్ని చెక్కినప్పుడు వచ్చే పొడి సేకరించుకుని పెట్టుకుంటారు. చాలాసార్లు మట్టిపాత్రలు కాల్చేటప్పుడు, పాత్రల్ని కాలుస్తున్న సమయంలో, నల్లటి పాత్రల్ని కాల్చేటప్పుడు బట్టీని పూర్తిగా మూసేస్తారు కదా, అది కాలే సమయం వచ్చినప్పుడు ఆ పొడిని భట్టీలో వేస్తారు. దానివల్ల ఆ పాత్రలన్నింటికీ ఒక తేలికపాటి మెరుపుతో పాటు, ఎంతో అందమైన నల్లటి రంగు వస్తుంది.అది శాశ్వతంగా ఉండిపోతుంది.’
‘ఇక లోహాల రంగులు వేరే ఉంటాయి. ఇప్పుడు రాగి విగ్రహం చేసారనుకోండి. దానిమిద రంగు తేవడానికి రకరకాల రసాయన ప్రక్రియలు చేయవలసి వచ్చేది. చాలా సార్లు పూర్తి పసుపు రంగు తేవడానికి, దాన్ని బాగా ఫినిషింగ్ చేసి చింతపండు నీళ్ళల్లో ఉడికించేవారు. దానివల్ల ఒకరకమైన పసుపు రంగు వచ్చేది. కాని ఇలాంటి రంగులు ప్రకృతిలో చాలాకాలం నిలబడవు. విగ్రహాలమీద ఒక కాచు రంగు ఉంటుంది కదా, దానికోసం ఏం చేసేవారంటే, జనం ఎక్కడైతే మూత్రవిసర్జన చేస్తుంటారో, ఆ ప్రదేశంలో ఈ విగ్రహాల్ని పాతిపెట్టేవారు. ఆ మూత్రం వల్ల ఆ విగ్రహాలమీద ఒక ప్రత్యేకమైన రంగు వచ్చేది. అది చాల గట్టిగా నిలబడిపోయేది. లేదా దేవతా విగ్రహాలు తయారుచేసినప్పుడు వాటిని గోశాలలో పాతిపెట్టేవారు. నాలుగు అంగుళాల మట్టికింద పాతిపెట్టినప్పుడు ఆవు మూత్రం వల్ల దానిమీద అద్భుతమైన రంగు వచ్చేది. లోహంపైన మీనాకారీ చేయడం వేరు. కానీ లోహానికే ఆ రంగు తేవడం అనేది వేరే ప్రక్రియ. ఇలా మన దగ్గర చాలా రంగులు తయారయ్యేవి.’
‘మన దగ్గర లక్క రంగులున్నాయి. చాలా వస్తువులమీద రంగులు వేసిన తర్వాత లక్క పూసేవారు. లేదా చాలాసార్లు రంగుని లక్కతో కలిపి వస్తువులమీద పూసేవారు. టర్నింగ్ చేసినప్పుడు ఆ సమయంలోనే దాన్ని పట్టుకుని ఆ రంగుని ఎక్కించేవారు. ఏటికొప్పాకలో ఆ పద్ధతిలోనే రంగులు వేస్తారు. ఆ రంగు వారు ముందే సిద్ధం చేసుకుంటారు. లక్కలోనే రంగు కలిపి ఉంచుతారు. గుజరాత్ లోని సంఖేడాలో కారాగిరి పనిచేసిన తర్వాత దానిమీద లక్క పూస్తారు. అయితే ఈ రెండింటిమీదా లక్క పూత పూయడానికి మొగలిరేకు చాలా అవసరమవుతుంది. అది లేకపోతే రంగు ఎక్కదు. చాలా కష్టమవుతుంది. ఆ ఆకుతోనే రంగు ఎక్కిస్తారు. ఆ ఆకుతోనే దాన్ని పాలిష్ చేస్తారు.’
‘రేపు మీకు చూపిద్దామనుకున్న లక్ష్మీ పెయింటింగ్ లో రంగులన్నీ మేమే స్వయంగా తయారుచేసుకున్నాం. అది వేసి ఆరేడేళ్ళు దాటుతోంది. కాని ఇప్పటికీ అది కొత్తదానిలానే కనిపిస్తుంది. ఆ రంగుల షేడ్ అస్సలు వెలిసిపోలేదు.’
‘చాలాసార్లు విగ్రహాలకి రంగులు వేసిన తర్వాత దానిమీద వార్నిష్ లాంటి లేపనం ఒకటి పూసేవారు. ఆ గచ్చు ఎలా తయారుచేసేవారంటే, గుగ్గిలం, లక్కపొడి, ఆముదం, మట్టినూనె మొదలైనవన్నీ వేసి ఒక కుండలో ఉడికించేవారు. అది ఉడికిన తర్వాత ఒక లేపనంలాగా తయారయ్యేది. అది చల్లారితే గట్టిగా మారుతుంది. కానీ ఎండలో పెడితే కొద్దిగా పల్చబడుతుంది. మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని తీసి విగ్రహంపైన బాగా లేపనం చేసేవారు. ఈ రోజుల్లో వార్నిష్ వేసాక ఎలాంటి మార్పు వస్తుందో అలాంటి మార్పు వచ్చేది. విగ్రహాల్నిగానీ, పెయింటింగులని గానీ దాంతో లేపనం చేసి ఉంచేవారు. అది చాలా కాలం పాటు అలా ఉండిపోయేది.’
‘అలానే ఈ రంగుల్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే దానికి కొన్ని నియమనిబంధనలు ఉంటూ వచ్చాయి. ఎరుపు రంగును మనం ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించలేం. ఎరుపు మనదగ్గర సౌభాగ్యానికి ప్రతీక. పాశ్చాత్యదేశాల్లో ప్రమాదానికి ప్రతీక. అందుకని మనం ఎరుపు రంగుని ఎక్కడ పడితే అక్కడ వాడలేం. సామాన్య ప్రజలు నీలిరంగు దుస్తులు ధరించడం ఒకప్పుడు నిషేధం. పెయింటింగుల్లో నీలిరంగు కేవలం విష్ణుమూర్తికి మాత్రమే వేస్తారు. లేదా విష్ణువు అవతారాలకు వేస్తారు. ఎందుకంటే నీలం రంగు అనంతత్త్వానికి ప్రతీక. మనం అనంతులం కాము కాబట్టి మనకు నీలం రంగు ధరించడం నిషేధంగా ఉండేది.’
‘హనుమంతుడి విగ్రహం చేసినప్పుడు దానికి ఆకుపచ్చ రంగువేస్తారు. ఆకుపచ్చ ఎందుకంటే ఈ ప్రకృతి ఎంత బలశాలినో హనుమంతుడు కూడా అంత బలశాలి. ప్రకృతితో సమానమైన బలసంపన్నుడని చూపించడానికి ఆకుపచ్చ రంగు వేసేవారు. సింధూరం కాదు, ఆకుపచ్చ. సింధూరం హనుమంతుడి గుడుల్లో ఉండే విగ్రహాలకు పూస్తారు. చిన్న సంఘటన కారణంగా హనుమంతుడికి సింధూరం పూసే పద్ధతి వచ్చింది. దాని వెనక పెద్ద రహస్యం ఏమీ లేదు. సీతాదేవి తన పాపిటలో సింధూరం పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడు అదేమిటని అడిగాడు. ఆమె ‘ఇది నా స్వామి క్షేమం కోసం, ఆయన గుర్తు’ అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు: ‘ఆమె అంత కొద్దిగా పెట్టుకుంటేనే స్వామికి అంత మంచి జరిగితే నేను శరీరమంతా పూసుకుంటే నా స్వామికి ఇంకెంత మంచి జరుగుతుందో కదా ‘ అని తన ఒంటినిండా పూసుకుని రాముడి ముందు నిలబడ్డాడు. రాముడు ‘ఇదేమిటి?’ అనడిగాడు. ‘సీత తన స్వామికోసం పాపిట పెట్టుకుంటే, మీరు నా స్వామి కూడా కదా, అందుకని ఒంటినిండా పెట్టుకున్నాను’అన్నాడు. అందుకని గుళ్ళల్లో హనుమంతుడికి సింధూరం పూస్తారు.’
‘సత్త్వ, రజో, తమో గుణ రూపాలైన ఆదిశక్తి విగ్రహం చేసినప్పుడు, దేవి విగ్రహం చేసినప్పుడు, అందులో రంగులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేవి విగ్రహాల్లో ముఖమండలం పసుపు రంగు, వక్షస్థలం తెలుపు రంగు, బాహువులు, జంఘలు నలుపు రంగు, కటి ప్రదేశం ఎరుపు రంగు వేస్తారు. ఆమె మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా ఉన్నప్పుడు మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలు కాబట్టి ఆమె ఎరుపురంగులో ఉంటుంది, మహాసరస్వతి సత్త్వగుణ సంపన్నురాలు కాబట్టి ఆమె తెలుపురంగులోనూ, మహాకాళి తమోగుణ సంపన్నురాలుకాబట్టి ఆమె నలుపురంగులోనూ ఉంటారు. ఈ ముగ్గురూ కలిస్తేనే ఆదిశక్తి, కాబట్టి ఆమెలో మూడు రంగులూ ఉంటాయి.’
‘ఈ రంగులకి తమదైన ఒక తత్త్వం ఉంది. ప్రతి ఒక్క రంగుకీ ఒక ఫిలాసఫీ ఉంది. స్త్రీలకు నీలం రంగు ధరించే హక్కు ఉండేది. కానీ చాలా తక్కువ సమయంకోసం మాత్రమే. వర్ణనల్లో చూడండి. ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినప్పుడు నీలం రంగు చీర ధరించి వెళ్ళిందట. నీలం రంగులో ఉన్న గొప్పదనం ఏమిటంటే అది ఇతరులను ఆకర్షించే రంగు.చాలా కారణాల వల్ల నీలం రంగుని ఒక పరిమితి లోపలనే ఉంచారు. కేవలం అనంతత్త్వాన్ని సూచిండం కోసమే నీలం రంగుని ప్రత్యేకించారు.’
‘మిగతా రంగులన్నీ మన దగ్గర పూజల్లో కూడా ఉపయోగపడతాయి. వాస్తుశాంతి చేసే సమయంలో వాస్తుపురుషుడు ఏర్పడతాడు. అతణ్ణి ఎలా ఏర్పరుస్తారు? అందుకోసం ఒక సర్వతోభద్ర మండలం ఏర్పాటు చేస్తారు. ఒక పీట మీద తెల్లటి గుడ్డ పరిచి, గీతలు గీసి దాన్ని 64 భాగాలుగా విభజిస్తారు. ఆ తర్వాత బియ్యం రకరకాలుగా రంగులు మారుస్తారు. నలుపు, ఎరుపు, పసుపు-ఇలా రకరకాల రంగులద్ది ప్రతి గడిలోనూ దాన్ని నింపుతారు. దానికొక పూర్తి లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే నింపుతారు. నవగ్రహాలకీ విడివిడి రంగులున్నాయి. బియ్యంలో ఆ నవగ్రహాల రంగులు కలిపి నవగ్రహాల్ని తయారుచేస్తారు. ఆ విధంగా బియ్యంలో కలిపిన రంగుల్తో రంగవల్లులు కూడా చిత్రిస్తారు-’
సమయం సరిపోలేదుగానీ, ఈ అంశం మీద గురూజీతో బహుశా ఒక రోజంతా మాట్లాడించి ఉండవలసింది అని ఇప్పుడనిపిస్తోంది. ఆయన రంగుల గురించి వివరిస్తున్నప్పుడు, పైకి చెప్పకపోయినా, ఆయన మనసులో ఒక వరస క్రమం ఉందని తెలుస్తోంది. బహుశా విష్ణుధర్మోత్తర పురాణం మాట్లాడిన అయిదు మూల వర్ణాల గురించీ- శ్వేత (తెలుపు), పీత (పసుపు), విలోహిత (ఎరుపు), కృష్ణ (నలుపు), నీల (నీలం)- ఆయన వరసగా వివరించారనిపిస్తోంది.
ఈ మాటలు ఇప్పుడు మళ్ళా వింటుంటే, ఒక స్కెచ్చిబుక్కూ, కెమేరా పట్టుకుని అదిలాబాద్ పల్లెల్లో తిరగాలని ఉంది. ఇంకా ఆ గ్రామాల్లో, ఆ మఠాల్లో, ఆ భిక్షావృత్తుల వాళ్ళ పటాల్లో, ఆ తిరణాళ్ళల్లో ప్రజలు జరుపుకుంటున్న వర్ణోత్సవాన్ని బొమ్మలుగానో, ఫొటోలుగానో పట్టి బంధించాలని ఉంది. Debra Luker అనే ఒక బ్రిటిష్ మిక్సెడ్ మీడియా చిత్రకారిణి అలానే పర్యటిస్తుంటారు. రాజస్తాన్ అంతటా తిరిగి తాను చూసిన వర్ణవైభవాన్ని The Pigment Trail: Inspiration from the Colors, Textures, and People of India (2024) పేరిట ఒక పుస్తకంగా వెలువరించారు కూడా.

గత కొంతకాలంగా కొత్త తెలంగాణా చరిత్ర బృందం తెలంగాణా అంతా తిరుగుతూ తెలంగాణా ప్రాక్చరిత్రకీ ,చరిత్రకీ సంబంధించిన ఎన్నో అంశాల్ని వెలుగులోకి తెస్తూ ఉన్నారు. ఆలానే కొందరు ఔత్సాహిక చిత్రకారులు కూడా ఒక బృందంగా ఏర్పడి ఈ రంగుల తెలంగాణాని చిత్రాలుగా, ఫొటోలుగా, రీళ్ళుగా, వీడియోగ్రాఫులుగా మనందరితో పంచుకుంటే, అందరికన్నా ముందు గురూజీనే ఎక్కువ సంతోషిస్తారు.
Featured image: Sculpture from Kalashramam, PC: Apurva Sharma
26-6-2026


ఇవన్నీ ఒక మనిషి చెపుతున్న సంగతులు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మా తాతగారు శిల్పి. పై విషయాల్లో రంగుల తయారీగురించి కొన్ని అంశాలు ఆయన చెప్పేవారు. ఈ సీరిస్ చదూతున్నా. ఇంత విస్తృత అవగాహన కలిగిన ఇలాంటి మనుషులు ఉండారా.
ధన్యవాదాలు సార్! మీరు చదువుతున్నారంటే సంతోషం!