
అయిదవ రోజు: రెండవ సంభాషణ
ఇక్కడికి వచ్చాకే మాకు గాంధీజీ అర్థమయ్యారు
గురూజీతో నాలుగు రోజుల పాటు రోజంతా మాట్లాడుతూ ఉన్నాకూడా ఆయన చెప్పవలసినవి ఇంకా ఉన్నాయనే అనిపిస్తూ ఉంది. ఆయన్ని ఇప్పటిదాకా శిల్పశాస్త్రం గురించి ఏమీ అడగనే లేదు, మన ప్రాచీన విద్యావ్యవస్థ గురించి కూడా ఆయనదగ్గర్నుంచి తెలుసుకోవలసింది చాలా ఉంది. అయితే గురూజీని నేను ఫలానా విషయం చెప్పండి అని దేనిగురించీ అడక్కుండా ఆయనకి ఏది తోస్తే అది చెప్పనివ్వు అనుకున్నాను. కానీ ఆయన మనసులో ఒక ప్రణాళిక ఉందని అర్థమవుతూ ఉంది. మొదటిరోజు ఆయన తన జీవితప్రయాణం గురించి చెప్పారు. రెండో రోజు ప్రజల గురించి, పరస్పరం ఆధారపడ్డ ప్రాచీన గ్రామాల గురించీ చెప్పారు. అలా ఒక వరస క్రమం ఉంది. కాబట్టి అయిదవరోజు కూడా ఆయన ఏం చెప్తారా అని ఆసక్తిగా నేను నా చేతుల్లో టేప్ రికార్డరు పెట్టుకుని కూచున్నాను.
గురూజీ చెప్పడం మొదలుపెట్టారు:
‘నిన్న శివదత్ గారు వచ్చారు కదా, కనకమల్ గాంధీ వాళ్ళు. ఆయన అన్నారు, ‘మేము గాంధీజీ గురించి చాలా చదువుతూనే ఉన్నాం, కానీ గాంధీజీ చెప్పిన విషయాలు ఇక్కడికి వస్తేనే అర్థమవుతాయి’ అని. శివదత్ గారి మాట కూడా ఇదే, ‘ఇక్కడికి వచ్చాకే మాకు గాంధీజీ అర్థమయ్యారు’ అని. నేనన్నాను, ‘నేనైతే గాంధీని ఎప్పుడూ చదవలేదు. లెనిన్‌ను చదవలేదు, మార్క్స్‌ను చదవలేదు, ఏ సంఘానికి చెందిన ఏ గురూజీ రాసిన విషయాల్నీ చదవలేదు’ అని. వీటన్నింటికీ సంబంధించిన ఏ పుస్తకమూ చదవలేదు. నేను చూసింది మాత్రమే నేరుగా చెప్తున్నాను. నేను స్వయంగా చూసినదాన్ని, ఆ విషయాన్ని ఎలాగైతే అర్థం చేసుకున్నానో, అదే చెప్తున్నాను , అంతవరకే.’
ఈ సందర్భంగా నాకో మాట గుర్తొస్తోంది. ఒకసారి దలైలామా బృందానికి చెందిన ఒక రిన్ పోచే కళాశ్రమం సందర్శించాడట. ఆయన ఆశ్రమంలో జరుగుతున్న పని చూసి, గురూజీ చెప్తున్న విషయాలు విని, ‘హింద్ స్వరాజ్ లో ఏముందో ఇక్కడా అదే ఉంది’ అని అన్నాడట. గురూజీ ఆ మాట నాకు చెప్తూ ‘ఏముంది సార్ హింద్ స్వరాజ్ లో? నేనైతే చదవలేదు’ అని అన్నారు. నేను నవ్వి ‘ఇక్కడేముందో హింద్ స్వరాజ్ లో కూడా అదే ఉంది’ అని అన్నాను!

గురూజీ కొనసాగిస్తున్నారు: ‘ఇప్పుడు ఉదయం మనం మాట్లాడుకున్నదంతా, ‘పూర్ణమదః పూర్ణమిదమ్’ అనేదాని ప్రకారం ఒక జీవనశైలి. మనకున్న ఒక జీవనశైలి గురించిన ఊహ. ఆ విషయాలన్నింటినీ సమాజంలో ఆచరణలోకి తీసుకురావడానికి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కేవలం అర్థం చేసుకుంటే సరిపోదు కదా? ఆచరణలోకి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయాలంటే, దాని డిజైనింగ్ ఎలా ఉండాలి? అలాంటి సౌందర్య దృక్పథాన్ని పెంపొందించాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? వ్యయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే, ఆ పాత ఆలోచనలను వదిలేసేలా మనసును సిద్ధం చేయడానికి ఏం చేయాలో చూడాలి. వదిలేయాలి, సమకూర్చుకోకూడదు.’
‘మన ఆర్థిక వ్యవస్థ అంతా వ్యయం కోసమే ఉండేది, ఆదాయం కోసం కాదు. ఈ రోజు మనకున్న పథకాలన్నీ కేవలం ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసమే ఉన్నాయి. ఈ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్‌లు ఏవైనా సరే, ఇంకేవైనా సరే, అవన్నీ ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికే నడుస్తున్నాయి. వెయ్యి రూపాయలు సంపాదించేవాడు పదివేలు సంపాదించేవాడు కావాలనే మన ప్రభుత్వాల ప్రయత్నాలు. అతడు హిందుస్తాన్‌లో ఎక్కడికైనా వెళ్లనివ్వండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లనివ్వండి, అతని సంపాదన పెరగాలని. కానీ మన దగ్గర ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎప్పుడూ వ్యవస్థలు తయారు చేయలేదు, ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడూ చింతించలేదు. టెక్నాలజీ బలంతో, కళల బలంతో ప్రతి ఒక్కరి ఆహార వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆహార వ్యవస్థ, గౌరవ వ్యవస్థ, రక్షణ కల్పించారు. ఆహారానికి పక్కా రక్షణ ఇచ్చారు, గౌరవ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు వాళ్లు. ఇక మనిషికి అంతకంటే ఇంకేం కావాలి? ఇంతకంటే ఏం కావాలి?’
‘ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం అంటే, ఆర్థిక పరిస్థితిని ఎందుకు పెంచాలి? ఎందుకోసం కావాలి అది? అవసరాలు తీర్చుకోవడానికే కదా. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని ఎందుకు మెరుగుపరచాలి అంటే, అవసరాలు తీర్చుకోవడానికి. ఇప్పుడు ఆ అవసరం ఏంటి, ఎవరికి ఏది అవసరమో మనం ఆలోచించాల్సి ఉంటుంది. అది ఏంటి, ఎవరికి ఏది అవసరం?’
‘ఎప్పుడైతే ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే అతనికి అన్నీ దొరుకుతాయో, అప్పుడు అంతకంటే ఎక్కువ చింత ఎవరికీ ఉండదు, బయటి ప్రపంచం గురించి. కాబట్టి అతనికి ప్రతి సౌకర్యమూ ఎంతవరకు అవసరం? ఎలాంటిది కావాలి? ఈ రోజు సౌకర్యం గురించి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే ఈ రోజు అతనికి తన 20 కిలోమీటర్ల పరిధిలోనే బతకాలని లేదు. అతడు ఎక్కడెక్కడికో వెళ్లి బతకడానికి ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాడు, రకరకాలుగా బతకడానికి ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాడు. ఎక్కడైనా సరే వెళ్లి బతకాలి, అదొక జీవన ప్రమాణం.’
‘కానీ ఈ రోజు సౌకర్యాలకి పరిమితి అంటూ ఏమీ లేదు. ఒక రకంగా ఇక్కడొక ఆట నడుస్తోంది. ఒకవైపు సామాన్య ప్రజలు, ఒకవైపు గవర్నమెంట్, మరో వైపు కార్ఖానాలు. ఈ పారిశ్రామిక వేత్తలందరి నినాదం ఒకటే- భారతదేశ పారిశ్రామికీకరణ, ఆధునీకరణ జరగాలంటే ప్రజల ఆర్థిక పరిస్థిని మెరుగుపరచాలంటారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు కార్ఖానాల్లో తయారయ్యే వస్తువుల్ని కొనే స్థితిలో లేరు. అందుకే ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. ఆర్థిక పరిస్థితి మెరుగైతేనే కార్ఖానా వస్తువులు కొంటారు. కార్ఖానా వస్తువులు కొంటేనే భారతదేశ పారిశ్రామికీకరణ జరుగుతుంది. భారతదేశ ఆధునీకరణ జరుగుతుంది. అదీ వారి ఆలోచన.’
‘ఇప్పుడు ఎవరైనా వెయ్యి రూపాయలతో సంతోషంగా బతుకుతున్నాడనుకోండి. అతని సంపాదన పదివేలు చేస్తే అతడేం చేస్తాడు? వేపపుల్లతో పళ్ళు తోముకునేవాడు దాన్ని పక్కన పడేసి కోల్గేట్ కొంటాడు. మామూలుగా ఒకటి రెండు జతల బట్టలతో రోజులు గడిపేవాడు పది జతల బట్టలు కొంటాడు. మామూలు చెప్పులు వేసుకునేవాడు భారీ భారీ బూట్లు కొంటాడు. ఇదే కదా చేస్తాడు? ఎవరైతే కార్ఖానా వస్తువులు కొనలేరో, ఇప్పటి నిర్వచనం ప్రకారం వాళ్ళు పేదవాళ్ళు.’
‘ఒకప్పుడు గ్రామాల్లోనే టెక్నాలజీ అంతా ఉన్నప్పుడు, గ్రామాల్లోనే ఉత్పత్తి అంతా ఉన్నప్పుడు ప్రతి వస్తువూ చాలా సులభంగా దొరికేది కదా. ప్రతి ఒక్క వస్తువూ అతని ఇంటికి సరైన సమయానికే వచ్చేది. ఇదంతా మనం ఇంతకుముందు వివరంగా చెప్పుకున్నాం. అవసరాల కోసమే అయితే, ఏ వస్తువుల అవసరమైనా సరే, చాలా తక్కువగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం. అందుకని గ్రామాల కార్ఖానాలు నడవడం కోసం ప్రజలు వాటిని ఉపయోగించేలా ఒక పద్ధతి తయారుచేసుకున్నారని కూడా చెప్పాను. 49 సంస్కారాలూ, 2000 వ్రతాలూ వాళ్ళకొక లోకల్ మార్కెట్ లాంటివి. ఆ లోకల్ మార్కెట్ స్థిరంగా ఉండటంకోసం ఆ సంస్కారాలు ప్రతి ఒక్కరూ చేయాల్సిందే అని ఉండేది, ఏ జాతివాడైనా, ఎవరైనా సరే. అతడు ఎప్పుడు సంస్కారాలు చేసినా ఆ గ్రామంలో ఉన్న కారీగర్ల సమాజం నుంచి ఒకటో, రెండో,అయిదో వస్తువుల వరకూ ఉపయోగించవలసిందే. ఇది మనం ఖర్చు చేసే పద్ధతి. అతడు కోటీశ్వరుడైనా, బీదవాడైనా సరే, అందరూ సమానమే.’
‘ఈ రోజు పత్తి గ్రామం లోనే ఉంది. దాన్నుంచి గింజలు వేరు చేసే సాధనంతో గింజలు వేరు చేసేవారు. నూలు వడికేవాళ్ళు. పరుపులు, బిస్తర్లు కుట్టేవాళ్ళు వాటిని ఊళ్ళోనే కుట్టేసేవారు. ఎక్కణ్ణుంచో రవాణా చేసి తీసుకు రావలసిన పనిలేదు, లేదా ఎక్కడికో పపించవలసిన అవసరమూ లేదు వాళ్ళకి. ఆ వస్తువులన్నీ ప్రజలకు చాలా సులభంగా, చాలా చౌకగా లభించేవి. ఈ రోజు ఒక వస్తువు కావాలంటే, ఉదాహరణకి కాటుక కావాలంటే, ఆ డబ్బా బొంబాయి నుండి వస్తుంది. అది ఇక్కడికి వచ్చి అయిదు రూపాయలకి అమ్ముడవుతుంది. లేదా పది రూపాయలు. అక్కడ అది ఎంతలో తయారై ఉంటుంది? అక్కడ ఎంతలో తయారైనా కూడా, దాని డబ్బా, ప్యాకింగ్, ఆ ప్యాకింగ్ పైన ఇంకో డబ్బా, దానిపైన రాసి ఉన్నదంతా ప్రింటింగ్, ఇవన్నీ అయ్యాక పది రూపాయలకి దొరుకుతోంది. అదే గ్రామంలోనే కాటుక తయారుచేసుకునేటప్పుడు ప్రతి ఇంటికీ ఒక వెరైటీ కాటుక ఉండేది. ఒకరు వేపపుల్లల్తో చేసేవారు. ఒకరు గోమూత్రంతో చేసేవారు. చాలా రకాల కాటుకలుండేవి. ఇవన్నీ ఎవరికివ్వాలి? ఎవరికి అమ్మాలి? ఇంటికోసమే కదా తయారుచేసుకునేది. దానికి అంత జబర్దస్త్ ప్యాకింగ్ చెయ్యాల్సిన అవసరం ఏముంది? మామూలుగా ఒక కొబ్బరిచిప్పలో వేసి పెట్టుకునేవారు. దాన్ని తయారుచేయడానికి పెద్ద కార్ఖానా ఏమీ అక్కర్లేదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారుచేసుకునేవారు. దాన్ని నెలలతరబడి, ఏళ్ళ తరబడి దాచుకోవాలని ఏమీ లేదు. ఒక వారానికి సరిపడా చేసుకునేవారు, అయిపోయాక మళ్ళీ చేసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ దుకాణాల అవసరం ఏముంది? గ్రామంలో ఎక్కడా దుకాణాలుండేవి కావు. ఈ రోజుకీ గ్రామాల్లో దుకాణాలు చాలా తక్కువగానే ఉన్నాయి కదా. ఆ కాలంలో అయితే అసలే లేవు. ప్రతి ఇల్లూ ఒక కార్ఖానానే’
‘అయితే మన దగ్గర వ్యాపారం లేదా? ఉండేది. రెండు పద్ధతుల్లో నడిచేది. ఒకటి సార్థవాహుల ద్వారా. వాళ్ళు భూమార్గం ద్వారా వెళ్ళేవారు. రెండోది జలమార్గాల ద్వారా. గ్రామానికి అవసరమైన వస్తువులన్నీ తయారయ్యాక, మిగిలిన సమయంలో ప్రజలు కూర్చుని అందమైన వస్తువులు తయారు చేస్తూ ఉండేవారు. అది కూడా అమ్మడానికనే కాదు. సంతోషంగా తయారుచేసుకునేవారు. దానికి ఎంత సమయం పట్టినా సరే. అందుకే చాలా అందమైన వస్తువులు తయారయ్యేవి. అవి బయటదేశాలకు వెళ్ళేవి. అందుకే నేనెప్పుడూ ఒక మాట చెప్తాను. ‘వైశ్య’ అనేది వర్ణం, జాతి కాదు అని.’
‘గ్రామంలో కార్ఖానాలు నడిపే అన్ని జాతులవాళ్ళు- కంసాలి కావచ్చు, నేతపనివాళ్ళు కావచ్చు, రంగులు తయారుచేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే గ్రామానికి అవసరమైనవన్నీ తయారుచేసాక మిగిలిన వాటితో అందమైన వస్తువులు తయారుచేసేవారు. వాళ్ళల్లోంచి ఒక బృందం, ‘సరే, గ్రామానికి అవసరమైనవన్నీ ఉన్నాయి, కానీ గ్రామాన్ని సమృద్ధం చెయ్యాలి కదా’ అనుకునేవారు. అందువల్ల నేతపనివారినుండి ఒక బృందం, అలా ప్రతి ఒక్క వృత్తిపనివారినుండి ఒక బృందం బయలుదేరి, ‘పదండి, బయట అమ్మి వద్దాం’ అనుకునేవారు. ఇప్పటికి కూడా చాలా కార్యక్రమాల్లో అటువంటి ట్రయినింగులు ఇస్తూనే ఉన్నారు. ఏ వృత్తిపనివారి సమాజం నుంచి వారి వస్తువులు అమ్ముకోగలిగే ఒక బృందాన్ని తయారుచెయ్యాలని. మార్కెటింగు వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఈ బృందంలో అడ్వర్టైజ్ చేసే వాడు ఒకడుండాలి. అందులోనే మార్కెట్ చూసేవాళ్ళూ , అందులోనే ప్యాకింగ్ ఎలా చేయాలో చూసేవారూ కూడా ఉండాలి. ఆ కాలంలో సమాజం కూడా అలాగే చేసుకుంది. ఎవరైతే హుషారుగా ఉండేవారో, ఎవరికైతే బయట తిరగడం ఇష్టమో, వాళ్ళు ఆ సామాన్లు సమకూర్చుకుని బయలుదేరేవారు. చాలా పెద్ద బృందం అది. చుట్టుపక్కల చాలా గ్రామాల ప్రజలు తమ వస్తువులు తీసుకుని బయలుదేరేవారు. దాంతోపాటు వాళ్ళు తమ పూర్తి రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునేవారు. తినడానికి, తాగడానికి ఏర్పాటు చేసుకునేవారు. పిల్లలు కూడా వస్తారు. ఎందుకంటే ఒకసారి బయలుదేరితే తిరిగి రావడానికి రెండుమూడేళ్ళు పడుతుంది. అటువంటి బృందాల్నే సార్థవాహులు అనేవారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళేవారు. ఆఫ్గనిస్తాన్ దాటి ఈజిప్టు దాకా వెళ్ళేవారు. నడిచి వెళ్ళగలిగినంత దూరం వెళ్ళేవారు.’
‘ఇక రెండో వ్యాపారమంతా సముద్రమార్గం ద్వారా సాగేది. అరబ్బు దేశాలకీ , సముద్రతీర ప్రాంతాలకీ వెళ్ళేవారు. వాళ్ళు ఎక్కువగా సముద్రతీరప్రాంతాల్లో దొరికే వస్తువులు, సుగంధ ద్రవ్యాలు తీసుకుని బయలుదేరేవారు. భూమార్గం ద్వారా వెళ్ళే కారీగర్లు ఒక రాజ్యం నుండి మరో రాజ్యపు సరిహద్దుల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ టాక్సు ఉండేది. ఆ టాక్సు ఎలా ఉండేదంటే, ఎన్ని ఎడ్ల బరువు వెళ్తోంది లేదా ఎన్ని బండ్లు వెళ్తున్నాయి అన్నదాన్ని బట్టి. బండ్లలో ఏమి వెళ్తోంది అనేదానిమీద కాదు, ఎన్ని బండ్లు వెళ్తున్నాయి అనేదానిమీదనే ఉండేది. దాన్ని చెల్లించి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేవారు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేవారు. వచ్చేటప్పుడు వెండి తీసుకువచ్చేవారు. ఎందుకంటే మన హిందుస్తాన్ లో వెండి లేదు. బంగారం లభించింది, కానీ తక్కువే. వజ్రాలు, ముత్యాలు, రత్నాలు చాలా లభించాయి కానీ వెండి లేదు. తాము తీసుకువెళ్ళిన సామాన్లన్నీ అమ్మేసి వెండి తెచ్చుకునేవారు. వచ్చి ఆ కారీగర్లందరికీ ఆ వెండి పంచేసేవారు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచేక, ఆరునెలలో, ఏడాదినో గడిచేక, మళ్ళీ అందరి దగ్గరనుంచీ వస్తువులు సమకూర్చుకుని మళ్ళీ బయల్దేరేవారు. ఇది వాళ్ళ వ్యాపార పద్ధతి. దేశంలోనే చాలా వస్తువుల వ్యాపారం నడిచేది. పాదరసం అంతటా దొరకదు. లేదా కొన్ని వస్తువులు అంతటా దొరికేవి కావు. తమలపాకులు అన్ని ప్రాంతాల్లోనూ తమదైన వెరైటీలో ఉండేవి. కాని వక్కలు, లవంగాలు, యాలకులు, డ్రై ఫ్రూట్లు అన్నీ అంతటా పండవు కదా. ఆఫ్గనిస్తాన్ లో డ్రై ఫ్రూట్లు చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా ప్రజలకు కావాలి కాబట్టి ఈ వ్యాపారమంతా లంబాడాల చేతుల్లో ఉండేది. లంబాడాలు పెద్ద పెద్ద సమూహాలుగా ఉండేవారు. వారు ఆఫ్గనిస్తాన్ నుండి కన్యాకుమారి వరకూ ఆ వస్తువులన్నీ తీసుకుని బయలుదేరేవారు. ప్రతి ప్రాంతంలోనూ వారి తండాలు ఆగేవి. ఆ ప్రాంత ప్రజలు ఎవరికి ఏది అవసరమైతే అది తీసుకునేవారు. కాని ఆ తండాలు మాత్రం నిరంతరం కదులుతూనే ఉండేవి. ఎక్కడ ఆగితే అక్కడ తమ దుకాణం పెట్టుకునేవారు, సంతలాగా. ఒకటి రెండురోజులుండేవారు. మళ్ళీ ముందుకు సాగేవారు. వాళ్ళకు ఇచ్చేది కూడా ఎలా ఉండేదంటే, వాళ్ళతో పాటు చాలా మంది ఉండేవారు, చాలా పశువులుండేవి. వాళ్ళేమీ వెండీ, బంగారమూ అడిగేవారు కాదు. పశువులకి మేత కావాలి, మాకు తినడానికి కావాలి అనేవారు, అదే తీసుకునేవారు.’
‘టిబెట్టునుండి ఉన్ని అమ్మడానికి వచ్చేవారు. అది తీసుకొచ్చి ఒక ప్రాంతంలో కూర్చుని రెండుమూడురోజుల పాటు బేరసారాలు సాగించేవారు. రేటు నిర్ణయించేవారు. బేరమాడటం అంటారు దాన్ని. నాలుగైదు రోజులపాటు మంచి విందులు జరిగేవి. ఈ గ్రామస్థులు వారికి భోజనం పెట్టేవారు. వారు కూడా గ్రామస్థులకి తమ పద్ధతిలో విందు ఇచ్చేవారు. ఆ తర్వాత రేటు నిర్ణయించేవారు. ఒకసారి రేటు ఖరారయ్యాక, ఇక ఆ ప్రాంతమంతా అదే రేటుకు అమ్ముతారు. తమ ఉన్ని ఇచ్చి అందుకు బదులుగా బెల్లం తీసుకునేవారు, ధాన్యం అడిగేవారు. తమకు అవసరమైనవన్నీ తీసుకువెళ్ళేవారు. ఉన్ని ఉత్పత్తి చేయడానికి పెద్ద కార్ఖానాలు పెట్టవలసిన పనిలేదు కదా. గొర్రెల నుంచి వస్తుంది. గొర్రెల్ని చేత్తో తయారు చెయ్యాల్సిన పనిలేదు కదా, మిషన్లలో తయారయ్యేవి కావు కదా. వాటంతట అవే పెరుగుతాయి. వాటిని పెంచాలి. చూసుకోవాలి. ఆ ఉన్ని కత్తిరించి తీసుకురావాలి. ఇప్పుడు మనం ఉత్తరాంచల్ వెళ్తే పాతవాళ్ళు ఈ విషయాలు చెప్తున్నారు.’
‘వాళ్ళు వెళ్ళేటప్పుడు రాజ్యాల సరిహద్దు దగ్గర టాక్స్ ఉండేది. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు పన్ను ఎన్ని గాడిదల బరువు, ఎన్ని ఎడ్ల బరువు, ఎన్ని ఎడ్లబండ్ల బరువు అన్నదాన్ని బట్టి ఉండేది. కానీ ధరంపాల్ గారి దగ్గర ఉన్న రిపోర్టుల ప్రకారం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇది తల్లకిందులైంది. వారు తమ పరిధిలో ప్రతి 28 కిలోమీటర్లకీ ఒక సుంకం వసూలు కేంద్రం ఏర్పాటు చేసారు. బరువుని బట్టి కాదు, వస్తువుల్ని బట్టి టాక్స్ వెయ్యడం మొదలుపెట్టారు. ఈ బండ్లలో ఏమి వెళ్తోంది? బంగారు వస్తువా? మట్టివస్తువా? ఎన్ని బట్టలున్నాయి మొదలైనవన్నీ వాళ్ళు బయలుదేరేముందే పూర్తి లిస్టు తయారుచెయ్యాలి. ఆ లిస్టు చూపించాక, బండ్లలో నింపాలి, ముద్ర వెయ్యాలి. మళ్ళీ 28-30 కిలోమీటర్లు వెళ్ళగానే మళ్ళీ విప్పాలి, మళ్ళీ చూపించాలి. అప్పుడు ఆ ప్రక్రియలో లంచగొండితనం మొదలయ్యింది. ఎందుకంటే ‘ఎవరు విప్పుతారు? ఎవరు చూస్తారు భయ్యా? తీసుకో భయ్యా’ అని లంచాలు ఇవ్వడం మొదలయ్యింది. అలా మొదలు కాకుండా ఎలా ఉంటుంది? ఎన్నని విప్పి చూస్తారు వాళ్ళు కూడా? ఒకటా? రెండా? వేలకొద్దీ బండ్లు.’
‘దాంతో ఆ వస్తువుల ధర బయటికి వెళ్ళేసరికి చాలా పెరిగిపోయేది. ఇన్ని చోట్ల టాక్స్ కట్టి వెళ్ళాలి అంటే ఆ వస్తువుల ధర చాలా పెరిగిపోతుంది కదా. అందువల్ల బయటి ప్రాంతాల వాళ్ళు దాన్ని కొనలేకపోయేవారు. దాంతో ఆ మార్కెట్ తగ్గిపోవడం మొదలయ్యింది. సహజంగానే తగ్గిపోతుంది కదా. అలా బయటి వ్యాపారం బంద్ అయ్యాక, ఆ వ్యాపారం చేసేవాళ్ళంతా గ్రామాలకి వచ్చి దుకాణాలు పెట్టుకుని కూర్చున్నారు.’
‘మన దగ్గర టాక్స్ లు ఉండేవి కావు. ఉన్నా చాలా తక్కువ టాక్స్. మన శాస్త్రాల ప్రకారం రాజు ఎంత వసూలు చెయ్యాలనేదానికి ఒక పద్ధతి ఉండేది. దానికి నియమాలుండేవి. రెండుమూడురకాలుగా. ఒక పద్ధతి ప్రకారం రాజు సూర్యుడిలాగా టాక్స్ వసూలు చెయ్యాలి. సూర్యుడు ఎలాగైతే అన్నిచోట్లనుండీ నీటిని గ్రహిస్తాడో, అలా గ్రహించి, సమయం వచ్చినప్పుడు దాన్ని వర్షించాలి. సూర్యుడలా నీటిని గ్రహించడం వల్ల అన్నీ చనిపోవు కదా. వర్ధిల్లుతాయి.
రెండోది భ్రామరి. అంటే తేనెటీగలాగా. ఒక భ్రమరం ఎలాగైతే ప్రతి ఒక్క పువ్వునుండి రసాన్ని గ్రహిస్తుందో రాజు కూడా అలానే పన్ను వసూలు చెయ్యాలి. తేనెటీగలు రసాన్ని గ్రహించడం వల్ల పువ్వులు అంతమైపోవుకదా, పైగా వర్ధిల్లుతాయి కూడా. మూడోది గోచరి. అంటే ఆవులాగా అన్నమాట. ఆవు చూడండి, ఇక్కడ మేస్తుంది, అక్కడ మేస్తుంది. అంతా ఒకేసారి తుడిచిపెట్టేయదు కదా. రాజు కూడా ఆ విధంగానే టాక్స్ వసూలు చెయ్యాలి.’
‘ఈ మూడు పద్ధతుల్లోనూ రాజు పన్ను వసూలు చేసేముందు ప్రజల్ని ఎంతగా సమృద్ధం చెయ్యాలంటే, పన్ను కట్టడంలో ప్రజలకి దుఃఖం ఉండకూడదు. నువ్వు ఆవు పాలు పితకడమంటే ఆవుని శోషింపచెయ్యడం కాదు. ఆవుకి కడుపునిండా మేతవేసిన తర్వాత, దాని పొదుగునుండి పాలు అవే కారుతుంటాయి. ఆ సమయంలో నువ్వు పాలు పితుక్కో. అది ఇస్తుంది, సులభంగా ఇస్తుంది. ఎందుకు తన్నుతుంది? కాని తనని శోషింపచేస్తున్నారు అని అనిపించిందా అప్పుడు గందరగోళం మొదలవుతుంది. అందుకే మన దగ్గర టాక్స్ విధానం చాలా తక్కువగా ఉండేది. ఎంత తక్కువ అంటే 16 వ భాగం అంటే ఆరు శాతం అన్నమాట. 100 బస్తాలు పండితే ఆరు బస్తాలు రాజుకివ్వాలి. నారుమడి భూములైతే పన్నెండు బస్తాలివ్వాలి. అది రాజుకు కట్టే పన్ను. అది కూడా ధాన్యం రూపంలోనే ఉండేది. కొన్నిచోట్ల వృత్తిపనివారి మీద కూడా పన్నులు వేసిన వర్ణనలు కనిపిస్తాయిగాని, చాలా తక్కువ అది. ఏ కారీగర్లయితే వ్యాపారం చేస్తున్నారో, బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నారో వారి మీద కొద్దిపాటి టాక్స్ వర్ణన కనిపిస్తుంది.’
‘1818 లో మొదటిసారి ఇళ్ళమీద టాక్స్ వేసారు బనారస్ లో. చాలా పెద్ద గొడవ జరిగింది దాని మీద. 1818లో కమ్మరులూ, వాళ్ళూ, వీళ్ళూ చాలా పెద్ద గొడవ చేసారు. బ్రిటిష్ వాళ్ళ పద్ధతి ఏమిటంటే, ముందు టాక్స్ వేస్తున్నట్టు ప్రకటించు. ప్రజలు గొడవచేస్తారు. ఆ తర్వాత అందులో గొడవ చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళను లొంగదీసుకో. ప్రజలు సర్దుకుంటారు. టాక్స్ కట్టడానికి మానసికంగా సిద్ధపడతారు. ముందు గొడవచెయ్యనివ్వు ‘టాక్స్ వేస్తున్నారు, టాక్స్ వేస్తున్నారు’ అని. జనం గొడవ చేస్తారు. ‘టాక్స్ కట్టం, ఎలా బతుకుతాం?’ అని గొడవ చేస్తారు. ఆ తర్వాత ఏడాదికో, రెండేళ్ళకో మానసికంగా సిద్ధపడతారు. ఆ తర్వాత చట్టం చెయ్యి, ఇస్తారు. ఇవే పద్ధతులు ఇప్పటికీ నడుస్తున్నాయి. మొదటిసారి ఇండ్లమీద టాక్స్ పడింది. రెండేళ్ళు చాలా గొడవలు జరిగాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఒప్పుకున్నారు.’
‘బనారస్ లో పడవల మీద టాక్స్ వేసారు. పడవల మీద ఒకప్పుడు మన దగ్గర ఎలాంటి టాక్స్ లేదు. మన దగ్గర తమ తమ ప్రాంతాల్లో ఆ ఊరి వాళ్ళూ , ఈ ఊరివాళ్ళూ కలిసి పడవల గురించి ఏర్పాటు చేసుకునేవారు. నది దాంటిచేవాళ్ళని ఏర్పాటుచేసేవారు. అతని దగ్గర ఏమీ తీసుకునేవారు కాదు. బనారస్ లో గంగ దాటి రోజూ వెళ్ళాల్సిన వాళ్ళుంటే వాళ్ళు సంవత్సరానికి ఇంత అని ఏదో ఏర్పాటు చేసుకుని ఉంటారు. అప్పుడు అంతా సాఫీగా నడిచేది. మరి పడవల మీద టాక్స్ వెయ్యగానే, బ్రిటిష్ వాళ్ళు అక్కడ బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి మీదనుంచి ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆ కాలంలో ప్రజలు పైసానో రెండు పైసలో ఇచ్చి పడవలమీదనే నది దాటేవారు. కాని ఎవరూ బ్రిడ్జి మీంచి వెళ్ళడం లేదని బ్రిటిష్ వాళ్ళు పడవల మీద టాక్స్ వేసారు. టాక్స్ వెయ్యగానే 4000 పడవలు బంద్ అయిపోయాయి. జనం బ్రిడ్జి మీద వెళ్ళడం మొదలుపెట్టారు. 4000 పడవలు అంటే అర్థం 8000 కుటుంబాలు. అన్ని కుటుంబాలు ఒక్కసారిగా నిరుద్యోగులయ్యారు. మరి వాళ్ళు ఏం చెయ్యాలి? కొందరిని సూరత్ తీసుకువెళ్ళారు. అక్కడ బట్టలమిల్లులుండేవి. కొందరు ఎక్కడెక్కడో నౌకరీలో కుదురుకున్నారు. కొందరు దొంగలుగా మారిపోయారు. ఆ విధంగా మన దగ్గర ఒక్కో వృత్తినీ దెబ్బతీస్తూ వచ్చారు.’
‘అంతకంటే ముందు మనదగ్గర ఇన్ని టాక్స్ లు లేవు. ప్రజల మీద టాక్స్ లు లేవు. రాజులు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న నియమమూ లేదు. రాజుల వైపునుండి చట్టాలు రావడం, వాటిని గ్రామాల్లో కొట్టికోట్టి అమలు చెయ్యడం ఇవేమీ లేవు. గ్రామవ్యవస్థల్లో రాజు అస్సలు జోక్యం చేసుకునేవాడు కాడు. ‘మీ గ్రామం మీది, మీ నీరు, మీ అడవి, మీ భూమి మీవి. మిమ్మల్ని మీరు ఎలా క్రమబద్ధం చేసుకుంటారో అలా చేసుకోండి’ అనేవాడు. జనం తమ సంగతి తాము చూసుకునేవారు. ఏవైనా పంచాయతీలు ఉంటే, ఏ సమస్యలైనా గ్రామంలో పరిష్కారం కాకపోతే, అలాంటి సమయంలో రాజు దగ్గరకి వెళ్ళేవారు. అది కూడా చాలా తక్కువగా జరిగేది. రాజు తాలూకు ఒక ధర్మం, ఎవరూ దేశద్రోహానికి పాల్పడకుండా చూడటం. అందుకని సరిహద్దు గ్రామాల్లో తమ పట్టు, నిఘా ఖచ్చితంగా ఉంచేవారు. దానికోసం ఒక వ్యవస్థను ఏర్పాటుచేసేవారు. అంతే తప్ప రాజులు మన దగ్గర సైన్యాలను పెద్దగా పోషించలేదు. ఏవైనా కోటలు కడితే, వాటి రక్షణకోసం కొందరిని పెట్టేవారు. వారికి కూడా ధాన్యమే వేతనంగా చెల్లించేవారు.’
‘ఇక్కడొక సామెత ఉంది కాద- రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని. రాజు దగ్గర సొమ్ము అయితే దేవాలయ నిర్మాణంలో ఖర్చయ్యేది లేదా ఒక కోట కట్టాలంటే అందులో ఖర్చయ్యేది. ఆ విధంగా రాజుల ధనం పూర్తిగా రాళ్ళకే ఖర్చయ్యేది. సామాన్య ప్రజలకంటూ తమ తమ వ్యవస్థలుండేవి. రక్షణలుండేవి. అవన్నీ వారు చూసుకునేవారు. అందుకే హిందుస్తాన్ లో దుకాణాలుండేవి కావు, మరో వైపు మజ్ దూర్, అంటే, కూలీ అనేవాడు ఎప్పుడూ లేడు. కూలి పని ఎవరు చేస్తారు? అందరికీ తమ తమ పనులున్నాయి కదా. తమ పని వదిలేసి వాళ్ళు కూలిపనికి ఎందుకు వెళ్తారు? కడుపునిండా తినడానికి లేకపోవడంటూ ఏమీ లేదు. పనులున్నాయి, ఇంట్లో తిండి ఉంది. అందుకే వ్యవసాయంలో కానీ, మరెక్కడాగానీ ఎవరూ కూలిపనికి వెళ్ళేవాళ్ళు కాదు.’
‘వాళ్ళలో వాళ్ళకు కొన్ని పద్ధతులుండేవి. ‘నేస్తం కట్టు ‘లాంటిది. వాళ్ళల్లో వాళ్ళకు వ్యవస్థలుండేవి. వ్యవసాయం చేసే సమాజం అంటే కున్బీ సమాజం ఉండేది. చేనేతపనివాళ్ళని సర్వనాశనం చేసాక వాళ్ళు కూడా వ్యవసాయంలోకి వచ్చేరు. హిందుస్తాన్ లో అన్నింటికంటే పెద్ద సంఖ్య నేతపనివారిదే. చాలా పెద్ద సంఖ్య అది. 1945 తర్వాత వీళ్ళంతా నాశనమైపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వాళ్ళు తమ మగ్గాలకు నిప్పుపెట్టేసి తక్కినవాళ్ళకు చెప్పారు ‘ఏం పని లేదు, అడవి నరకండి, భూమి చేసుకోండి’ అని. అప్పటిదాకా వ్యవసాయం చేసుకునే కున్బీ సమాజంలో పన్నెండు ఉపజాతులుండేవి, వాళ్ళు తమ గ్రామం కోసం అన్నీ చాలా అందంగా సమకూర్చుకునేవారు. మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూలిపనిచేసేవారు కాదు. పొలాల్లో కూలిపనిచేసేవారు కాదు. కానీ వాళ్ళ కోసం పనిముట్లు తయారుచేసేవారు. టెక్నాలజీ మొదలుకుని అన్నీ తయారుచేసేవారు. దానికి బదులుగా వాళ్ళకి అన్నీ లభించేవి. పొలాల్లో కూలిపని అన్న మాటే లేదు. ఎందుకంటే ఒక్కో కుటుంబమే అంత పెద్దగా ఉండేది. డెబ్భై-ఎనభై మంది దాకా ఉండేవారు, కొన్నిసార్లు వందమంది కూడా. అంత పెద్ద పెద్ద కుటుంబాలు ఏం చేస్తాయి? కాబట్టి అందరూ పొలంలోనే ఉండేవారు. ఇంతకంటే ఎక్కువ మంది కూలీల్ని ఈ రోజు కూడా ఎవరూ చేలల్లో పెట్టరు కదా?’
‘ఒకవేళ ఎవరైనా వెనకబడిపోతే, ఏ కారణం వల్లనైనా చేసుకోలేకపోతే, అందరూ కలిసి చేసుకునేవారు. ఈ రోజుకూ ఈ ప్రాంతంలో ఏముంది? పటేల్ ఉంటాడు, గ్రామప్రజలంతా ఒకరోజు పటేల్ చేలో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నడుస్తున్న పద్ధతి. గ్రామమంతా వెళ్ళి అతని చేలో పనిచేస్తే ఎంత మంది కూలీల్ని పెట్టి ఆ పని చేయించాలో అంత పనీ చాలా సులభంగా అయిపోతుంది కదా. మరి పటేల్ దగ్గరికి పనిచేయడానికొచ్చారంటే అందరికీ భోజనం పెట్టాలి. గ్రామమంతటికీ భోజనం పెట్టాల్సి వచ్చేది ఆ రోజు. అదొక ఫంక్షన్ లాగా సాగేది. అందుకే పటేల్ భయపడుతూ ఉంటాడు ‘వద్దు భయ్యా, ఇప్పుడు మా చేలో ఏ పనీ వద్దు’అని. ‘ముందు నేను ఏర్పాట్లయితే చేసుకోవాలి కదా అందరికీ తినిపించడానికి ‘ అని. ‘ఆ తర్వాతే రండి’ అని చెప్పేవాడు.
‘ఇలాంటి చాలా రకరకాల పద్ధతులుండేవి. సత్రాలుండేవి మనకి. దేవాలయ సత్రాలుండేవి. వచ్చేపోయేవాళ్ళంతా అక్కడే బసచేయాలి. ఇళ్ళల్లో బసచేయాలి, ఆ ఏర్పాట్ల గురించి ఇంతకు ముందు చెప్పాను కదా, ఇక్కడ్ భీంసేరి లో ఎలా జరిగేదో చెప్పాను కదా. మరి అటువంటప్పుడు హోటళ్ళ అవసరం ఏముంటుంది? భోజనమైతే దొరుకుతోంది కదా సులభంగా. అందుకే మనదగ్గర హోటళ్ళు, లాడ్జీలు ఎప్పుడూ తయారు కాలేదు. సత్రాలుండేవి, చాలా పెద్ద పెద్ద సత్రాలుండేవి. ఆ సత్రాల్ని వైశ్యస్త్రీలు నడిపేవారు. రాజుల భార్యలు కూడా సత్రాలు నడిపేవారు. పూర్వకాలపు గ్రంథాల్లో వర్ణనలు చూస్తే ఒక్కో సత్రం ఎంత పెద్దదిగా ఉండేదంటే, అక్కడకి ఎవరైనా గర్భిణీ స్త్రీ వస్తే, ఆమె ప్రసవ సమయం వస్తే, మూడు నెలల వరకు ఆమెకు అక్కడే ఏర్పాట్లు ఉండేవి. బిడ్డకి మూడు నెలలు వచ్చాకనే అక్కణ్ణుంచి వెళ్ళడం. అంటే మూడు నెలలకి సరిపడా ఏర్పాట్లు అక్కడ చేసేవారు. ఒకవేళ, బిడ్డ పుట్టాడు, కాని తల్లి చనిపోయింది, అయినవాళ్ళెవరూ లేరనుకోండి, ఆ బాధ్యత ఆ సత్రమే తీసుకునేది. ఆ బిడ్డకి పద్ధెనిమిదేళ్ళ వయస్సు వచ్చేవరకూ ఆ సత్రం అతణ్ణి పెంచేది. అతడు ఏ సమాజానికి చెందినవాడో ఆ సమాజపు విద్యలన్నీ నేర్పుతూ పెంచేవారు.’
‘ఇప్పుడైతే ఇవన్నీ లేవు, వేస్ట్ ఖర్చు అని బంద్ చేసేసారు. బ్రిటిష్ వాళ్ళే వీటిని మూసేసింది. తన ఆధీనంలో ఉన్న ఒక సత్రం మూసేస్తే, అక్కడి రాజు బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరం రాసాడు, ఏడుస్తూ రాసాడు: ‘దీన్ని మీరు వేస్ట్ ఖర్చు అనుకుంటున్నారు. కాని ఇది హిందుస్తాన్ కి చాలా అవసరం’ అని. కానీ అంతం చేసేసారు. కాబట్టి గమనించవలసిందేమంటే మన దగ్గర వ్యయం కోసం ఒక వ్యవస్థ ఉంటే దానం కూడా అందులో ముఖ్యంగా ఉండేది-’
ఈ ప్రసంగమంతా గురూజీ టాక్స్ వ్యవస్థ మీద దృష్టి పెట్టారని అర్థమవుతూనే ఉంది కదా. ప్రజలు ఆరుశాతం మాత్రమే, అది కూడా పంట దిగుబడిని బట్టి పన్నుకట్టే ప్రాచీన కాలం నుంచి, ఇప్పుడు ఆదాయపు పన్నుతో పాటు, పొద్దుణ్ణుంచి రాత్రిదాకా కొనుక్కునే ప్రతి ఒక్క వస్తువు మీదా 18 శాతం పన్నుకట్టే కాలానికి వచ్చాం. హింద్ స్వరాజ్ లో గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం ఇది ఆధునిక నాగరికత వల్ల దాపురించిన దుఃస్థితి. వలసపాలన రోజుల్లో మనల్ని బానిసత్వంలోకి నెట్టింది బ్రిటిష్ వాళ్ళ సైనికశక్తికన్నా కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఆధునిక నాగరికత అనేదే గాంధీజీ ఆ పుస్తకమంతా వాదిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన తన పుస్తకాన్ని ‘severe condemnation of ‘modern civilization’ అని అభివర్ణించారు.
ఆ పుస్తకంలోనే Why India lost?’ అనే అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా రాసారు: ‘The English have not taken India; we have given it to them. They are not in India because of their strength, but because we keep them.’ మనం ఆధునిక నాగరికతకు బానిసలుగా ఉన్నంతకాలం బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినా, పరిపాలించకపోయినా మన బానిసత్వంలో ఎటువంటి మార్పూ ఉండదనే ఆయన భావించారు.
అలాగని ఆయనగానీ, గురూజీగాని భారతదేశం తిరిగి ఆ పాతకాలానికి వెళ్ళాలని చెప్తున్నారనుకోను. దానికి ప్రత్యామ్నాయం గ్రామస్వరాజ్యంలోనూ, వికేంద్రీకృత ప్రజాస్వామిక వ్యవస్థలోనూ, అన్నిటికన్నా ముఖ్యం మనుషులు తమ జీవనశైలిని సంస్కరించుకోవడంలోనూ ఉందనే వారిద్దరూ చెప్తున్నారు. ఉదాహరణకి ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్ యుద్ధ కాలంలో గాంధీజీ ఉండి ఉంటే ఏమని ఉండేవారు? మనం చమురు మీద పెడుతున్న ఖర్చు తగ్గించుకుందామని చెప్పేవారు. అనవసరమైన ప్రయాణ వ్యయాన్ని తగ్గించుకొమ్మని చెప్పేవారు. వ్యక్తులు విడివిడి ప్రయాణసాధనాలు వాడేకన్నా సామూహికమైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించుకొమ్మని చెప్పేవారు. అవి చెయ్యలేకపోతున్నాం కాబట్టే, మన దేశం అంతర్జాతీయమైన ఒత్తిడులకి ఎలా తలొగ్గుతున్నదో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం.
29-6-2026


పూర్వకాలంలో taxation గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు గురూజీ. పన్నుల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఎన్ని కళలు, వృత్తులు నాశనం అయ్యాయో చదువుతుంటే చాలా బాధగా అనిపించింది.
“ఒక రిన్ పోచే కళాశ్రమం సందర్శించాడట. ఆయన ఆశ్రమంలో జరుగుతున్న పని చూసి, గురూజీ చెప్తున్న విషయాలు విని, ‘హింద్ స్వరాజ్‌లో ఏముందో ఇక్కడా అదే ఉంది’ అని అన్నాడట. గురూజీ ఆ మాట నాకు చెప్తూ, ‘ఏముంది సార్ హింద్ స్వరాజ్‌లో? నేనైతే చదవలేదు’ అని అన్నారు. నేను నవ్వి, ‘ఇక్కడేముందో హింద్ స్వరాజ్‌లో కూడా అదే ఉంది’ అని అన్నాను!”
ఈ conversation తమాషాగా ఉన్నా, ఇన్నాళ్లుగా గురూజీ గురించి మీరు చెప్తున్న విషయాలు చదువుతూ ఉండడం వల్ల ఈ మాటల్లోని depth అర్థమవుతోంది.
It is amazing that Guruji and Gandhiji had such similar ideas about how modernization affected local economies, artisans and people’s lives. And to know that both were committed to protecting traditional skills and knowledge. Great minds think alike!! 🙏🏽
రాజు సూర్యుడిలా, భ్రమరం లాగా, గోచరి లాగా పన్ను ఎందుకు, ఎలా వసూలు చేయాలో చెప్పిన విధానం చాలా బాగుంది. మళ్ళీ ఇటువంటి concepts ని అర్థం చేసుకుంటే ఏమైనా మంచి మార్పులు వస్తాయేమో!!
“ప్రతి ఇల్లూ ఒక కార్ఖానానే” అన్న గురూజీ మాటలను మళ్లీ flashback కి వెళ్లి ఆలోచిస్తే, ఎంతో నిజమని నా కాస్తంత అనుభవంలోనే అనిపించింది. మా ఊళ్లో ఇంట్లోనే ఆముదం తయారు చేసుకునేవారు. పసిబిడ్డలకు పెట్టే బొట్టు గురూజీ చెప్పినట్లుగానే ఇంట్లోనే తయారు చేసి కొబ్బరి చిప్పలో పోసి వాడుకునేవారు. కందులు, రాగులు, మిరపకాయలు, మినుములు, ఒడ్లు, వేరుశనగ, కూరగాయలు, సమస్తమూ పండించుకునేవారు. చెరుకు పండించి బెల్లం తయారు చేసేవారు. మర్రి, మోదుగ ఆకులతో విస్తర్లు కుట్టి వాడుకునేవారు. దాదాపు ప్రతి ఇంట్లోనూ పాడి ఉండేది. ఉప్పు తప్ప మిగిలిన వస్తువులు కొన్నట్లు నాకు గుర్తు లేదు.
You bring up a very important point about what Guruji and Gandhiji have been talking about, Sir:
“అలాగని ఆయనగానీ, గురూజీగాని భారతదేశం తిరిగి ఆ పాతకాలానికి వెళ్ళాలని చెప్తున్నారనుకోను. దానికి ప్రత్యామ్నాయం గ్రామస్వరాజ్యంలోనూ, వికేంద్రీకృత ప్రజాస్వామిక వ్యవస్థలోనూ, అన్నిటికన్నా ముఖ్యం మనుషులు తమ జీవనశైలిని సంస్కరించుకోవడంలోనూ ఉందనే వారిద్దరూ చెప్తున్నారు.”
I feel it is very important to understand this correctly, especially today, Sir.
They are talking about understanding the values behind that way of life and the systems people before us created that worked successfully for centuries and possibly learn and apply lessons learnt in today’s world.
🙏🏽
ఎంత బాగా విడమర్చి సారాంశాన్ని వెన్నలాగా బయటికి తీస్తున్నారు! మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
ఈ సంభాషణ రికార్డు చేయడం కోసం మీరు టేప్ రికార్డర్ చేతిలో పట్టుకుని గురూజీ ముందు కూర్చున్న దృశ్యం కళ్ళ ముందు ఒక్క చిన్న ఫ్లాష్ లాగా మెదిలింది భద్రుడు గారు. శివదత్ గారు, కనకమల్ గాంధీ గారు ఆశ్రమానికి వచ్చి మేము గాంధీజీ గురించి చాలా చదువుతూనే ఉన్నా.. గాంధీజీ చెప్పిన విషయాలు ఇక్కడికి వస్తేనే అర్థమవుతాయనడం, దానికి సమాధానంగా ‘నేనైతే గాంధీని ఎప్పుడూ చదవలేదు. లెనిన్‌ను చదవలేదు, మార్క్స్‌ను చదవలేదు, ఏ సంఘానికి చెందిన ఏ గురూజీ రాసిన విషయాల్నీ చదవలేదు… వీటన్నింటికీ సంబంధించిన ఏ పుస్తకమూ చదవలేదు. నేను చూసింది మాత్రమే నేరుగా చెప్తున్నాను. నేను స్వయంగా చూసినదాన్ని, ఆ విషయాన్ని ఎలాగైతే అర్థం చేసుకున్నానో అలాగే , అంతవరకే చెప్తున్నానడం నిజంగా చాలా ఆశ్చర్య పరుస్తోంది. పుస్తకాలు చదవకుండా, ఏ
సిద్ధాంత గ్రంథాల చట్రంలో ఇరుక్కోకుండా, ఇతరుల భావజాలాల ఉచ్చులో బిగిసిపోకుండా కేవలం లోకాన్ని, సమాజాన్ని, తను పుట్టి పెరిగిన గ్రామాన్ని, అక్కడ మనుషులను, వారి శ్రమను గమనించిన వాళ్ళకే ఇటువంటి తాత్వికత అవగతమవుతుందేమో.
గురూజీ సమాధానాన్ని సమర్థిస్తూ
దలైలామా బృందానికి చెందిన రిన్ పోచే కళాశ్రమం సందర్శించిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చెయ్యడం చాలా బాగుంది . ఆయన ఆశ్రమంలో జరుగుతున్న పని చూసి, గురూజీ చెప్తున్న విషయాలు విని, ‘హింద్ స్వరాజ్ లో ఏముందో ఇక్కడా అదే ఉంది’ అంటే గురూజీ ఆ మాట మీకు చెప్తూ ‘ఏముంది సార్ హింద్ స్వరాజ్ లో? నేనైతే చదవలేదు’ అని అడిగినప్పుడు ‘ఇక్కడేముందో హింద్ స్వరాజ్ లో కూడా అదే ఉంది’ అని మీరనడం గురూజీ తలపెట్టిన జీవన యజ్ఞంఈ దృష్టి లో ఎంత గొప్పదో మీరు చెప్పకుండానే సుస్స్పష్టమయ్యింది.
ఆధునిక ప్రభుత్వాలు, నేటి అర్థిక శాస్త్రవేత్తలు కేవలం మనిషి ఆదాయాన్ని పెంచడం, వెల్ఫేర్ స్కీమ్ ల ద్వారా డబ్బు పంచడం, ప్రణాళికలు, ప్రాజెక్టులు మొదలెట్టడం చూస్తుంటే, మన ప్రాచీన వ్యవస్థ ఆదాయం కోసం కాదు, వ్యయం కోసం నడిచిందని, అప్పటి లభ్యమైన టెక్నాలజీ బలంతో, కళల బలంతో ప్రతి ఒక్కరి ఆహార వ్యవస్థను ఏర్పాటు చేశారనీ, ఆహారానికి పక్కా రక్షణ ఇచ్చారనీ, అన్ని వృత్తుల వారికీ గౌరవ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారనీ తెలుసుకుంటుంటే ఎంతో గర్వంగా అనిపిస్తున్నా ఇండిపెండెన్స్ వచ్చాకా కూడా బ్రిటిష్ వారి ఇన్ఫ్లుయెన్స్ తో బానిస భావం వదలకుండా బాగా బతకడం అంటే బాగా సంపాదించడం అనే పరిస్థితికి ఎదిగామో లేక దిగజారామో అర్థం కావట్లేదు.
ఇరవై కిలోమీటర్ల స్థానిక పరిధిలోనే మనిషికి అన్నీ లభించినప్పుడు, అతనికి బయటి ప్రపంచం గురించిన ఆరాటంగానీ, అశాంతిగానీ ఉండేవి కావు. కానీ ఈ రోజు కార్ఖానాల (పరిశ్రమల) వస్తువులు అమ్ముడుపోవడం కోసం, మార్కెట్ మాయాజాలం మనుషులకు కృత్రిమ అవసరాలను ఎలా సృష్టిస్తోందో గురూజీ చెప్పిన వేపపుల్ల, కోల్గేట్ ఉదాహరణ అద్భుతంగా ఉంది. మన ప్రాచీన గ్రామాల్లో ప్రతి ఇల్లూ ఒక కార్ఖానాగా వర్ధిల్లిందని, బొంబాయి నుండి ప్యాకింగ్ డబ్బాల్లో వచ్చే కాటుక కంటే, ఇంట్లోనే కొబ్బరిచిప్పలో చేసుకునే సహజమైన కాటుకే నాడు ప్రతి ఇంటా ఉండేదని చెప్పడం.. నేను పుట్టిన పల్లెటూరులో అవన్నీ చూసిన రోజులు గుర్తు చేశాయి.
గ్రామాల్లో అవసరాలు తీరాక, మిగిలిన సమయంలో కేవలం ఆనందం కోసం అందమైన కళాఖండాలను సృష్టించి, వాటిని భూమార్గాల ద్వారా ఆఫ్గనిస్తాన్, ఈజిప్ట్ దాకా తీసుకెళ్ళిన ‘సార్థవాహుల’ గురించి, జలమార్గాల ద్వారా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసిన వారి గురించి గురూజీ ఇచ్చిన వివరణ అద్భుతం. నాకు సార్థవాహులు అనే కొత్తపదం కూడా తెలిసింది.
వ్యాపారం చేసి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు భారతదేశంలో లేని ‘వెండిని’ తెచ్చి కారీగర్లందరికీ సమానంగా పంచేవారని, అలాగే లంబాడాలు తండాలు తండాలుగా నిరంతరం కదులుతూ డ్రై ఫ్రూట్స్, వక్కలు, లవంగాలు వంటి వస్తువులను దేశవ్యాప్తంగా సంతల రూపంలో పంచుతూ, బదులుగా కేవలం పశువుల మేత, తమకు అన్నం మాత్రమే ఆశించేవారని చదువుతుంటే—నాటి వ్యాపారం వెనుక లాభార్జన కంటే పరస్పర సహకారం, మానవత్వం ఎంతగా ఉండేవో అర్థమవుతుంది. టిబెట్ నుండి ఉన్ని తేవడం, గ్రామస్తులతో కలిసి ఐదు రోజుల పాటు విందులు చేసుకున్నాకే బేరసారాలు ముగించి రేటు ఖరారు చేయడం ఎంతటి సంస్కారవంతమైన వ్యాపార శైలో కదండీ భద్రుడు గారు! ఏమయిపోయాయండి ఆ రోజులు.. ఎలా మాయమైపోయాయి.. తలుచుకుంటేనే ఎంత బాధగా ఉందో.
ఇంక మన శాస్త్రాల ప్రకారం రాజులు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా పన్నులు ఎలా వసూలు చేసే వారో.. బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రతి 28 కిలోమీటర్లకూ ఒక సుంకం కేంద్రం పెట్టి, వస్తువులను బట్టి పన్ను వేయడం వల్ల మన సమాజంలో లంచగొండితనం, అవినీతి పెరిగి
ఒక అద్భుతమైన వ్యవస్థ ఎలా తల్లకిందులైందో గురూజీ మాటల్లో ఎంతో హృద్యంగా వ్యక్త పరిచారు.
బనారస్ లో ఇళ్ళ మీద పన్ను వేయడం (1818), గంగ నదిపై బ్రిడ్జి కట్టి, పడవలపై పన్ను వేయడం వల్ల 4,000 పడవలు మూతపడి, 8,000 పడవల కుటుంబాలు ఒక్కసారిగా నిరుద్యోగులై దొంగలుగా, మన దేశంలో ‘కూలి’ అనే పదమే లేని కాలం నుండి, ఎన్నో వృత్తులను వ్యూహాత్మకంగా దెబ్బతీసి వాళ్లను
కూలీలుగా మార్చేసిన వృత్తాంతం చదువుతుంటే గుండె తరుక్కుపోతోంది .
చివర్లో హిందూ స్వరాజ్ పుస్తకంలో Why India lost?’ అనే అధ్యాయంలో గాంధీ గారన్న ‘The English have not taken India; we have given it to them. They are not in India because of their strength, but because we keep them.’ మాటలను Quote చేస్తూ మీరు చెప్పినట్టు మనం ఆధునిక నాగరికతకు బానిసలుగా ఉన్నంతకాలం బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినా, పరిపాలించకపోయినా మన బానిసత్వంలో ఎటువంటి మార్పూ ఉండనే ఉండదు.
మరొక అద్భుతమైన జీవన శిల్పి భాగాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు భద్రుడు గారు.
ఒక రచయిత రాసిన రచనకు ఇంత సవివరమైన స్పందనను అందించడం ఎంతో ఔదార్యం. మీ ఉదార హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.