అనిల్ బత్తుల మధుశాల

(ప్రసిద్ధ కవి, రచయిత, ప్రచురణ కర్త, పాతపుస్తకాల ప్రేమికుడు అనిల్ బత్తుల రాసిన ‘మధుశాలా నుంచి కొన్ని కవితల్ని రిగోబెర్త ప్రభాత ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ పుస్తకాన్ని ఆగస్టు 14 న ఆవిష్కరించిన సందర్భంగా ఆ కవిత్వాన్నీ, అనువాదాన్నీ పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించాడు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగం పూర్తి పాఠాన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను)

మూలానికి వన్నె తెచ్చిన అనువాదం

అనిల్, ప్రభాతా, శరత్, ప్రకృతీ — మిత్రులారా! ఈరోజు మీటింగ్ పెడుతూ అనిల్ నాకు ఫోన్ చేసి, ‘సార్, మీరే మాట్లాడాలి. ఏదైనా పొయెట్రీ మీద మాట్లాడండి’ అన్నాడు. ఏదైనా పొయెట్రీ ఎందుకు? పుస్తకం విడుదల చేస్తున్నారు కదా, మీ  పుస్తకం మీదే మాట్లాడదాం’ అంటే, ఆయన తన పుస్తకం మీద మాట్లాడమని అడగడానికి కొద్దిగా మొహమాటపడ్డట్టున్నాడు. అందుకని ‘పొయెట్రీ మీద మాట్లాడండి’ అన్నాడు. కానీ ఈ పుస్తకాలు రెండూ పంపించమన్నాను, వెంటనే పంపించాడు.

కూర్చుని రెండు పుస్తకాలూ శ్రద్ధగా  చదివాను, మొత్తం చదివాను. కబీరు  ఒక మాట అన్నాడు: ‘సంతలో రత్నం అమ్మకానికి వచ్చింది. రత్న పరీక్షకుడు లేడు, రత్నం గవ్వకి మారిపోయింది’ అని. అంటే రత్నాన్ని పట్టుకోవడానికి రత్న పరీక్షకుడు ఉండాలి. లేకపోతే ఎన్ని రత్నాలు గవ్వలుగా కూడా చెల్లుబాటు కాకుండా పక్కకు పోతున్నాయో మనకు తెలియదు. అలాంటి రత్నాల్లో ఈ ‘మధుశాల’ ఒకటి అని ఈరోజు నాకు అర్థమయింది. ఈయన నాకు ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చాడు ఈ పుస్తకం. నేను రత్న పరీక్షకుడిని అని ఇచ్చి ఉంటాడు, కానీ నేను దాన్ని ఇప్పటిదాకా తెరవడం కూడా తెరవలేదు.

కానీ ఈరోజు ఈ పిల్లవాడి అనువాదం చూడగానే, నాకైతే ఒక విశ్వరూపం చూసినంత సంతోషంగా ఉంది! ఇతను ఒక రత్న పరీక్షకుడిగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇతని ప్రతిభ, ఈయన చేసిన వర్క్— ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మూల కవి కన్నా అనువాదకుడు ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అది కూడా మాట్లాడతాను నేను. కానీ మొదట చెప్పవలసింది  ఏమిటంటే—ఈ అనువాదం  వల్ల మూల  పుస్తకం మీద వెలుగు పడింది.

ఇది అరుదు కాదు. ఎందుకంటే ఇంగ్లిషులో కూడా ఎడ్గార్ అలన్ పో కవిత్వం రాశాడు. విక్టోరియన్ ఏజ్ లో,  అమెరికా వాడైనప్పటికీ, అమెరికా వాళ్ళు కూడా బ్రిటిష్ కవిత్వం నీడలోనే కదా ఉంటారు, వాళ్ళ అబిరుచి నీడలోనే కదా ఉంటారు- అందుకని  ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఫ్రెంచి కవి చార్లెస్ బాదిలేర్ ఎడ్గార్ అలన్ పోని చదవగానే, ఏదో తన కవల సోదరుడు అమెరికాలో పుట్టి పెరుగుతున్నట్టుగా ఆనందపడిపోయి, ఆ కవితల్ని మళ్లీ ఫ్రెంచిలోకి ట్రాన్స్‌ లేట్ చేశాడు. చేస్తే, మనం మోడర్నిస్ట్ పోయెట్స్ అనే ఎలియట్, ఎజ్రా పౌండ్ లాంటి వాళ్ళు ఫ్రెంచిలో ఎడ్గార్ అలన్ పోని చదివి—వాళ్ళు ఇంగ్లీష్ పోయెట్స్, ఇంగ్లీష్ స్పీకర్స్—కానీ తమ  కవిని వాళ్ళు ఫ్రెంచిలో చదివి, ఓహ్! ఇంత గొప్ప కవా! అని మళ్లీ ఇంగ్లీషులో చదివారు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ‘మధుశాల’ అనే పుస్తకాన్ని మనం ఇంగ్లీషులో చదివి, ‘ఓహ్! అనిల్ బత్తుల ఇంత గొప్ప కవా! అని మనం మళ్లీ తెలుగులో చదవడం మొదలుపెడతాం.

అయితే అనువాదకుడు  మొత్తం కవితలు అనువాదం  చేయలేదు. మూలంలో  87  కవితలు ఉంటే, ఈయన 45 దాకా, అంటే  సగం కవితలు అనువాదం చేశాడు. అది ఆయన ఎంపికకు సంబంధించిన విషయం. అయితే , 40 కవితలు చాలు. ఎందుకంటే మన తెలుగులో కొద్దిగా తాపత్రయం ఎక్కువ. మనవాళ్ళు ఇంగ్లిషులో  అనువాదాలు తెస్తే వాండా, నూట యాభై కవితలు అనువాదం చేసి పెడతారు. ఇంటర్నేషనల్‌గా మీరు వెళ్లేటప్పటికి ఒక్కసారికి, మాగ్జిమమ్ ముప్ఫై నలభై కవితల కంటే ఎక్కువ వెళ్లకూడదు. అప్పుడు పాఠకులు దాన్ని చూసిన తర్వాత మళ్లీ అడుగు తారు— ‘ఇంకా ఏముంది? తీసుకురా’ అంటే, అప్పుడు అనిల్ బత్తుల మళ్లీ రాయడమో, పాత పుస్తకాలు మళ్లీ ప్రభాతకి ఇవ్వడమో- అది వేరే కార్యక్రమం నడుస్తుంది.

వండర్. ఈ రెండు వండర్స్‌లో ఏ వండర్ ముందో, ఏ వండర్ తర్వాతో చెప్పడం వేరే విషయం కానీ- మహోపన్యాసం అయితే చేయను నేను, కొన్ని విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

మొట్టమొదటి విషయం ఏంటంటే—ఈ మధుశాల అనే పుస్తకం చదివిన తర్వాత హటాత్తుగా  నాకొక విషయం తట్టింది. తట్టడం అంటే లోపల ఎక్కడో నిశ్శబ్దంగానో, అంతర్లీనంగానో ఏదో ఒక  సూచన ఉండి  ఉంటుంది, అది బయటికి వచ్చింది అన్నమాట. అది ఏమిటంటే—తెలుగులో గురజాడ అప్పారావు మొదలుకొని ఇప్పటిదాకా, కవులు ప్రధానంగా ‘మర్యాదస్తుల కవిత్వం’ రాస్తూ ఉన్నారని నాకు అర్థమయింది. తెలుగు కవుల్లో చాలామంది కవులు తాగుబోతులు. శ్రీశ్రీ గురించి  మీకు తెలుసు, ఆయనే రాసుకున్నాడు. తన బలహీనతల గురించి ఏ ఒక్కటీ దాచకుండా చెప్పుకున్నాడు; తన ఆత్మకథలో రాసుకున్నాడు. కానీ ఆయన అనుకున్నాడు—కవిత్వం రాయవలసి వచ్చినప్పుడు, ఇంకేవో మర్యాదస్తు లైన  పెద్దమనుషుల థీమ్స్ కొన్ని ఉంటాయి— రాజ్యం, విప్లవం, వ్యవస్థ మార్పు, పోరాటాలు, చరిత్రలు… ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, అంటే జెంటిల్‌మన్లీ టాపిక్స్ అన్నమాట! వాటి మీద రాయాలి. ఈ తాగడం , బ్రోతల్స్‌ కి వెళ్ళడము, సిగరెట్లు కాల్చడం— ఇదంతా సమ్ థింగ్ పర్సనల్. ఈ పర్సనల్ విషయాలు పైకి చెప్పేసుకుంటే ఆ పాపం కొంత పోతుంది అనుకున్నాడు, చెప్పాడు. కానీ నాకేమనిపించిందంటే—నీలో ఉన్న ఆ పర్సనల్ యాంగిల్  గురించి నువ్వు లోలోపల మథనపడుతున్నదంతా నువ్వు రాసి ఉంటే నీ కవిత్వం ఇంకా ఎక్కువ శక్తిమంతంగా ఉండేదేమో, నాలాంటి పాఠకుడిని ఇంకా ఎక్కువ కదిలించి ఉండేదేమో అని నాకు అనిపించింది.

ఈ వ్యవస్థను మార్చడం కోసం పొలిటీషియన్లు  ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక చిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా— మీరు జిల్లా పరిషత్తు మీటింగులకో లేదా మండల పరిషత్తు మీటింగులకో వెళ్తే— వాళ్ళ ప్రసంగాలు వింటే అదిరిపోతారు అన్నమాట. వాళ్ళు ఎంత ప్రసంగ కళా నైపుణ్యం సాధించారంటే, కవులు ఎందుకూ పనికిరారు వాళ్ళ ముందు. చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు ఆ పని బాగా చేయగలరు. The political section is much more competent to do that. కానీ కవి చేయవలసింది నాకు ఏమనిపిస్తుందంటే—ఆ ప్రసంగ కళని బద్దలు కొట్టాలి. కవిత్వానికి మొదటి శత్రువు ఎవరంటే ప్రసంగం! ఆ ప్రసంగ కళని బద్దలు కొట్టి ఆత్మ ప్రసంగం, అంతఃప్రసంగం, ఒక సాలిలాక్వి, ఒక డ్రమాటిక్ మోనోలాగ్)— తనతో తను మాట్లాడుకోవడం మొదలుపెడితే, ఆ కవిత్వం నిజంగా మనం ఇంట్లో కూర్చుని ప్రైవేట్‌గా చదువుతున్నప్పుడు—అనిల్ బత్తుల మధుశాల చదువుతున్నప్పుడు ఆ పుస్తకం నాలోంచి ఒక చినవీరభద్రుడిని బయటికి తీసి నా టేబుల్ మీద కూర్చోబెట్టి, ‘చూడు, వాడిని చూడు! నువ్వేనా, గుర్తుపట్టు?’ అని అడుగుతున్నట్టు ఉంటుంది అన్నమాట.

మర్యాదస్తుల తెలుగు సాహిత్యం విషయానికొస్తే వాళ్ళు చాలా విప్లవాలు చేశారు. తెలుగు కవులు మామూలు విప్లవాలు చేయలేదు. ఛందస్సులో చేశారు, విషయంలో చేశారు. తెలుగు సాహిత్య చరిత్ర అంతా విప్లవాల చరిత్రే. ఒకాయన పెద్ద పుస్తకం కూడా రాశాడు, ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అని. కానీ దురదృష్టవశాత్తు ఈ విప్లవాలు మనిషికి సంబంధించినవి కావు, మనిషి అంతరంగానికి సంబంధించినవి కావు. మనిషి తన ముఖాన్ని నిజాయితీగా చూసుకోవడానికి సంబంధించినవి కావు. They speak about something else అనిపించింది నాకు.

అలా కాక మనిషి అంతరంగం గురించి రాసుకున్న కవులు తెలుగులో ఉన్నారా అని ఆలోచిస్తే—నాకు కొద్దిగా లేశమాత్రం పట్టాభి కనిపించాడు, అరలేశమాత్రం శిష్టా ఉమామహేశ్వరరావు కనిపించాడు, చాలా బలంగా వేగుంట మోహన్ ప్రసాద్ కనిపించాడు. ఒక విధంగా చెప్పాలంటే, తెలుగు కవి అలాంటి కవిత్వం రాయడు అంటే, వేగుంట మోహన్ ప్రసాద్ ఉదాహరణ అన్నమాట. అలాంటి కవిత్వం అంటే—చక్కగా మర్యాదస్తుడిగా జీవితం జీవిస్తూ, ప్యాంటు-చొక్కా వేసుకుని, షేవ్ చేసుకుని, ఏదో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటున్న తెలుగు కవి, మోహన్ ప్రసాద్ లాగా రాస్తే  చాలా చక్కగా అపకీర్తికి పాకులాడేవాడి కింద మారుతాడు అన్నమాట. అతని గురించి ఎన్ని కథలైనా ప్రచారం అవుతాయి, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం.

40 ఏళ్ల కిందట మోహన్ ప్రసాద్‌ని మేము ఒక పుస్తకావిష్కరణకి రాజమండ్రి పిలిస్తే మా మిత్రులు, పెద్దలు, శ్రేయోభిలాషులు—’మీకింక ఎవరూ  దొరకలేదా? ఆయన్ని  పిలుస్తున్నారు, అర్ధరాత్రి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లమంటాడో తెలుసునా?’ అని అడిగారు. తెలీదు వాళ్ళకి! మోహన్ ప్రసాద్ అర్ధరాత్రి కాదు, పట్టపగలు కూడా మనల్ని  తీసుకువెళ్లే లోకాలు చాలా ప్రత్యేకమైన లోకాలు. మద్యం అంటే ఏమిటో తెలియని, అటువంటి అలవాట్లు చెవిలో కూడా పడని  మా మాస్టారు శరభయ్యగారు లాంటివాడు మోహన్ ప్రసాద్ మాట్లాడుతుంటే మత్తెక్కిపోయాడు.  కళ్లు ఎర్రబడిపోయాయి ఆయనకి! కాబట్టి మోహన్ ప్రసాద్ తీసుకెళ్లే ప్రపంచం, ఆ లోకాలు చాలా డిఫరెంట్ వరల్డ్స్. కానీ భయపడతాడు, తెలుగు కవి భయపడతాడు—ఎక్కడ ఈ అపప్రథ తెచ్చిపెట్టుకోవడమా అని! ఇప్పుడు కొద్దికొద్దిగా సిద్ధార్థలో ఇటువంటి అభివ్యక్తి కొంత కనిపించింది. అట్లాంటి స్కూల్ ఆఫ్ పోయెట్స్ మరికొందరు కూడా లేకపోలేదు.

కానీ వీళ్లందరిలో కూడా ఈ పుస్తకం చాలా చాలా—ఇన్ ఫ్యాక్ట్ సిగ్గుపడుతున్నాను, ఈ పుస్తకాన్ని నాకు బుక్ ఫేర్‌లో, అప్పుడే కొత్త పుస్తకం వచ్చిందనీ, మాకినీడి  శ్రీనివాస రామ్ బొమ్మ వేశాడని చెప్పి అనిల్ ఇచ్చినా కూడా, పక్కన పెట్టాను నేను. దీనికి కొంత కారణం అనిల్ బత్తులనే! ఎలా అంటే, ‘మధుశాల’ అని పేరు పెట్టడం తప్పు అని నాకు అనిపించింది. ‘చిక్కడపల్లి కల్లు కాంపౌండ్’ అని పేరు పెట్టి ఉండాల్సింది పుస్తకానికి! No, it would have cut across… ఒక కత్తి తీసి సగం మందిని నరికినట్టు ఉండేది అది. అంటే మనకు కూడా ఎక్కడో మన టైటిల్స్‌ లో, మన బొమ్మల్లో ఎక్కడో మనం ఇంకా ఒక మర్యాదస్తుల జీవితాన్ని, ఒక ముసుగుని ప్రేమిస్తున్నామా?

కానీ ఈ కవిత్వం. .. ఈ 48 గంటల లోపు, ఆయన పుస్తకం నాకు వచ్చిన ఈ కొద్ది కాలంలో—బిట్వీన్ 36 టు 48 అవర్స్—నేను ఎంతమంది కవుల దగ్గరకు పోయి పాకులాడానో చెప్పలేను! “ఓయ్! మాకు మీలాంటి కవి మా దగ్గర ఒకడు ఉన్నాడు!” అని. ఎడ్గార్ అలన్ పో గురించి చెప్పాను కదా— ‘ Cursed Poets’  ఉన్నారు ఫ్రెంచ్‌లో. ఎవరాయన? పాల్ వెర్లైన్, చార్లెస్ బాదిలేర్, ఆర్థర్ రింబో— వాళ్ళని Poets Maudits,  cursed poets అంటారు, అభిశప్త కవులు అన్నమాట. ఇక మొత్తం ఉర్దూ-పర్షియన్ సంప్రదాయం అంతా మద్యపాన  సంప్రదాయమే కదా! హాఫిజ్, సాది, రూమి, సనాయ్… ఒకడు కాదు; ఇక మన కవులు మీర్, గాలిబ్… చేతుల్లో మద్యపాత్ర లేని  ఉర్దూ కవి, పారశీక కవి లేడు.

సరే, భారతీయ కవుల్లో నాకు చాలా చాలా దగ్గరగా అనిపించిన కవి ఎవరు అంటే—రాజకీయ పార్శ్వాన్ని పక్కన పెడితే, అనిల్ బత్తుల లాంటి కవి భారతీయ కవిత్వంలో మరొకరి పేరు చెప్పమంటే, ఈ పుస్తకం చదివాక మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే— నామ్‌దేవ్ ధసాల్ కనబడ్డాడు నాకు! చాలా పోలికలు. ఇద్దరికీ— కొద్దిసేపు ఆయన దళిత రాజకీయాలు, ఆయన తాలూకా అంబేద్కరిజం, ఆ పొలిటికల్ ఐడియాలజీ, ఆయన నడిచిన దారి, ఆయన మీద ఉన్న విమర్శలు వాటన్నిటినీ పక్కన పెడితే— ఆయన మొట్టమొదటి పుస్తకం ‘గోల్పీఠా’— గోల్పీఠా అంటే కల్లు కాంపౌండ్ మీదనే! ఆయన పుట్టి పెరిగిన బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఒక మద్య దుకాణం— గుండ్రంగా ఉండే ఒక మద్యం షాపు పేరు గోల్పీఠా. అదే టైటిల్‌గా పెట్టుకుని ఆయన పుస్తకం రాశాడు. ఆ గోల్పీఠాతో మరాఠీ కవితా స్వరూపం మార్చేశాడు, భారతీయ కవితా స్వరూపం మార్చేశాడు ఆయన. ఇదొక గోల్పీఠా! ఆయన గోల్పీఠా అని పేరు పెట్టాడు, మధుశాల అని పెట్టలేదు. నువ్వు కూడా ‘గోల్పీఠా’ అనో, ఇందులో ఒక కవిత ఉంది కదా ‘చిక్కడపల్లి కల్లు కాంపౌండ్’ అనో, అటువంటి పేరు  పెట్టి ఉండాల్సింది.

ఎందుకంటే ఈ కవిత్వం మొదటిసారిగా ఒక కవి తన ఆభరణాల్ని, తన వస్త్రాల్ని—అంటే దేవతా వస్త్రాలని విసర్జించి, ఆనెస్ట్‌ గా, నగ్నంగా తను ఏమిటో, తన ఆలోచనలు ఏమిటో చెప్పిన కవిత్వం. ఇది ప్రేమ కవిత్వమా? హరివంశరాయ్ బచ్చన్ మధుశాలని చదివాను నేను, మా హీరాలాల్ మాస్టారు చదివించారు. ఇది ఆ మధుశాల కాదు, ఇది ప్రేమ కవిత్వం కాదు, కామ కవిత్వం అసలే కాదు. It’s not about naked desire. మరి దేని గురించిన కవిత్వం ఇది? ఇద్దరు మనుషుల మధ్య, ఇద్దరు స్త్రీపురుషుల మధ్య అనాదిగా సంభవించే ఆ ప్రేమ, కామం, రతి, విరక్తి, విరతి… వీటన్నిటి మధ్యలో ఉండేటువంటి సకలావస్థల్లో ఎన్నో కొన్ని అవస్థలనైనా పట్టుకుందామని కవి చేసిన ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అన్నమాట!

ఈ ఆనెస్ట్ అటెంప్ట్‌ లో అతను చాలాసార్లు ఒక రియలిస్ట్ గ్రౌండింగ్ నుంచి—అంటే మనుషులు మనుషులుగా ఉంటూనే సడన్‌గా వాళ్ళు పొగలుగానో, పక్షులుగానో, గాలిగానో, పువ్వులుగానో మారిపోయే ఒక సర్రియల్— సర్రియల్ అంటే మళ్లీ సర్రియలిజంతో పోల్చుకునే పదాలు వాడటానికి I’m quite hesitant about using those words. రియల్, సర్రియల్ అనట్లేదు. ఒక యథార్థంగా మన కళ్ళలోకి కనబడుతున్న వాస్తవం లాంటి వాస్తవంలో నుంచి అతను మరికొన్ని లోకాల్లోకి తీసుకువెళ్తాడు అన్నమాట.

కాబట్టి ఈ కవితల్లో అతను ఎటువంటి అవస్థలని చిత్రించాడు అన్నది చెప్పడానికి రెండు మూడు కవితలు వినిపిస్తాను. మొత్తం ఈ పొయెట్రీ అంతా అతనికి, ఆమెకి మధ్యలో పొయెట్రీ. ఆమె ఒకళ్ళు కావచ్చు, కాకపోవచ్చు… అనేకులు. ఈ అతడు కూడా అనేకుడు అని మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే, మన రిలేషన్స్‌లో, మన సంసార బాంధవ్యాల్లో, ప్రేమలో మనం చాలా కన్సిస్టెంట్‌గా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటాం. నేను ఆ మనిషినే అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం మారుతూ ఉంటాం అన్న విషయాన్ని మనం అంగీకరించం. “లేదు లేదు, అలాగే ఉన్నాను నేను, నా సెల్ఫ్‌ లో ఏ మార్పూ లేదు” అని చెప్తాం. అది కాదు అని చెప్తాడు ఇతను చాలా స్పష్టంగా.

ఈ కవిత చూడండి—

చెడు కలల్ని అమ్మే స్త్రీ

ఆమె కలల్ని అమ్ముతుంది.
చెడు కలల్ని మాత్రమే అమ్ముతుంది,
ఎక్కువ ధరకు అమ్ముతుంది.
మీరు ముక్కున వేలేసుకోవచ్చు—
చెడు కలలు ఎవరైనా కొంటారా అని.

ఒక భార్య లేదా భర్త తమ రక్తసిక్త వివాహ బంధాన్ని తెంపుకోలేక
దుఃఖపు గొడుగు కింద నివసిస్తున్నారు
ఆ ఇంటి గోడల్ని నిరంతరం కన్నీటితో కడుగుతారు
అక్కడ పాటలు నిషిద్ధం
అక్కడ చెట్లు పువ్వులు పూయవు

కలల్ని అమ్మే స్త్రీ ఆ ఇంటికి వచ్చింది
భర్త ఒక కలని కొనుక్కున్నాడు
భార్య ఒక కలని కొనుక్కుంది

భర్త కల పరస్త్రీని రమించడం
భార్య కల తన భర్త పరస్త్రీని రమిస్తుండగా భర్తను చంపడం
కలల్ని అమ్మే స్త్రీ తన డబ్బు పుచ్చుకొని
వడివడిగా వెళ్ళిపోయింది

ఈ కలలు అమ్మే స్త్రీ ఎవరైనా కావచ్చు. మన మొత్తం  ఆర్ట్, మూవీస్, చివరికి మన పొయెట్రీ కూడా ఈ చెడు కలలు అమ్మే పనే చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక పార్శ్వం, ఒక అవస్థ.

ఇంకొకటి—

చిత్రకారుడి ప్రేమగాథ

ఒక చిత్రకారుడు ఇల్లొదిలి దేశదిమ్మరి అయ్యాడు
తనలోని దేశదిమ్మరితనం
ఎప్పుడూ అతడ్ని  నిలకడగా ఉండనిచ్చేది కాదు
అతనికి ఒక వేశ్య స్నేహితురాలు అయింది
రాత్రులు ఆమె విటులతో  అతడు రంగులతో గడిపేవాడు
అతని బొమ్మల్ని చంద్రుడు కిటికీ గుండా దొంగచాటుగా చూసేవాడు
వాళ్ళు ఒకరి మధుపాత్రలోని దుఃఖసారాయిని మరొకరు సేవించేవారు
నగ్న చిత్రాలు గీయాలన్న కోరికను ఆమెకు చెప్పాడు
ఆమె మోడల్‌గా ఉండడానికి అంగీకరించింది
మద్యం తాగుతూ, రమిస్తూ, నగ్న చిత్రాలు గీస్తూ, దుఃఖిస్తూ
విశృంఖలంగా జీవిత సారాయిని  తాగారు

కాలం గడిచింది
అత్యద్భుత నగ్న చిత్రాలని గీశాడు
ఆ బొమ్మలు ఆమెకు బాగా నచ్చాయి
‘పెళ్లి చేసుకుందాం” అంది ఆమె
అతడు మౌనంగా ఉన్నాడు
తరువాతి  రోజు
అతను మాయమయ్యాడు

ఒక పౌర్ణమి రాత్రి
ఆమెకు ఒక బహుమతి అందింది
ఆ పెట్టె తెరిచి చూస్తే
అందులో ఆమె నగ్న చిత్రాలు
అతని ఖండిత కుడి చెయ్యి ఉన్నాయి

ఇది కవిత మాత్రమే కాదు, ఒక కథ; కథ మాత్రమే కాదు, ఒక జీవిత శకలం కూడా! మీ అందరికీ తెలిసే ఉంటుంది—వాన్ గో  ఇట్లానే తన మిత్రుడికో, ప్రియురాలికో  తన చెవి కత్తిరించి కానుకగా పంపిన కథ. చాలా సంతోషంగా, సుఖంగా జీవిస్తున్న పాల్ వెర్లైన్ జీవితంలోకి రింబో అనే ఒక కవి ప్రవేశించిన తర్వాత అతని జీవితం ఎంత అతలాకుతలమైందో మీకు తెలుసు. వాళ్ళిద్దరూ  దెబ్బలాడుకుని, చివరికి వెర్లైన్ ఆ రింబోని కాల్చడానికి ప్రయత్నం చేశాడు, దాంతో అతణ్ణి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అభిశప్త కవులు అంటే ఎందుకు అభిశప్త కవులు? వాళ్ళు తమ జీవితాన్ని యథాతథంగా, ఆనెస్ట్‌ గా జీవించడానికి ప్రయత్నించారు కాబట్టి.

ఈ కవిత చూడండి—

రాత్రి ప్రయాణీకురాలు

ఆమె రాత్రి ప్రయాణీకురాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నిలబడి విటుల కోసం
ఎదురుచూస్తుంది
చంద్రుడు, నక్షత్రాలు, చిక్కటి చీకటి ఆమె నేస్తాలు
బాధల సర్పాలు ఆమెను సర్వదా చుట్టుకొని ఉంటాయి
వెన్నెలను పౌడరుగా, మబ్బుల్ని మల్లెలుగా ధరించి మెరిసే రాత్రి తార
ఆమె

ఒక రాత్రి ఆమె వద్దకు వెళ్ళాను
“వస్తావా?” అన్నాను
“బుడగలు ఉన్నాయా?” అంది
“ఉన్నాయి” అన్నాను.
ఆ రాత్రి
ఆమె నా దుఃఖాన్ని తాగింది
ఆ దేవత నాకు శాపవిమోచనం కలిగించింది.

మరో రాత్రి
దేహాల కోసం దేవులాడే ఈ దగాకోర్
మరో స్టేషన్ లోనో
మరో బస్ స్టాండ్ లోనో
మరో సినిమా హాల్ వద్దో
మరో నక్షత్రం కిందో
మరో రాత్రి ప్రయాణీకురాలి కోసం
వెతుకుతూనే ఉంటాడు

ఇది ఒక ఎక్స్-రే, ఒక MRI స్టేట్‌మెంట్, ఒక స్కాన్ స్టేట్‌మెంట్! ఇది నీదీ, నాదీ, ఎవరి జీవితమైనా  కావచ్చు. మనం ఇలాగే ఉన్నాం. మనం నిజంగా అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటే ఇంతకన్నా భిన్నంగా లేం.

ఈ పొయెట్రీలో మొత్తం కవితలన్నీ కూడా చాలా స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా, అనవసరమైన అలంకారాలు లేకుండా, భేషజాలు లేకుండా, ‘దీన్ని కవితగా మార్చాలి’ అనే తాపత్రయం లేకుండా ఉన్నాయి. బహుశా నేను రాశాననుకోండి, ‘దీన్ని కవితగా ఎలా మార్చాలి, ఎలా చెక్కాలి’ అనే తాపత్రయం ఉంటుంది. ఆ బాధలేమీ లేకుండా సూటిగా, నేరుగా అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు.

ఇంకొక పోయెమ్—

పిరియడ్స్

ఆమె మధువు తాగుతూ ఉంది
“రమిద్దామా?” అన్నాను
“వద్దు, డేట్ వచ్చింది” అంది

తన ఉదర సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి
తన గులాబీ తోటలో పువ్వులు గుత్తులుగా రాలుతున్నాయి
తన శిరస్సులో పక్షులు రణగొణధ్వనులతో అల్లకల్లోలం చేస్తున్నాయి

“ఇంకొంచెం మధువు కావాలా?” అన్నాను
“ప్లీజ్, లీవ్ మీ అలోన్!” అని గట్టిగా అరిచింది
తాబేలులా నా చిప్పలోకి ముడుచుకుపోయి మూల కూర్చుని
మధువు చప్పరించసాగాను

నాకు తెలుసు—ఈ సమయాల్లో ఆమెకు శాంతి అవసరం
నేను లేని తనతో తను మాత్రమే ఉండగలిగే దివ్యశాంతి అవసరం

ఇలాగ రకరకాల అవస్థల్లో… కొన్నిసార్లు అతను ఆమెను హత్య చేస్తాడు, పదే పదే హత్య చేస్తాడు; కొన్నిసార్లు ఆమెను తనకి శాపవిమోచనం కలిగించిన దేవతగా కీర్తిస్తాడు. ఏమైనప్పటికీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే—వాళ్ళిద్దరూ కలిస్తే జీవితం అవుతుంది, ఒకళ్ళు ఒకళ్ళుగా అయితే జీవితం లేదు.

అయితే, ఇది మామూలుగా చదివి ఉంటే ఓకే. కానీ ఈ అనువాదం  చదవగానే నాకు ఏమనిపించిందంటే—ఈ అనిల్ బత్తుల అనే ఆయన ఎక్కడో ప్యారిస్‌లో సూటు, హ్యాటు, బూటు వేసుకుని ఫ్రెంచ్ కవుల మధ్య కనబడి ఉంటే… ‘అరే! ఈయనెవరో మన అనిల్ బత్తులలా ఉన్నాడే!’ అనుకుంటాం. అంటే మనవాడు ఫ్రెంచ్‌లో పలకరించాడు అనుకోండి, ఇంగ్లీషులో మాట్లాడాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇతను ఈ చిన్న పుస్తకంతోటి—ఈ రిగోబెర్తో ప్రభాత అనే పిల్లవాడు—అనిల్ బత్తులని మొత్తం మార్చిపారేశాడు! ఆ పిల్లవాడు నాకు తెలుసు, ఒకటి రెండుసార్లు వసంతలక్ష్మిగారి ఇంట్లో కూడా కలిశాను. ఆయన సినిమా రివ్యూస్ రాస్తాడు. కానీ ఇందులో అతను చూపించిన ప్రతిభ— అందుకని దీన్ని అనువాదం అనడం కరెక్ట్ కాదు, it’s an interpretation! ఆయన ఈ పోయెమ్స్‌ ని ఇంటర్‌ప్రెట్ చేశాడు.

ఎట్లా ఇంటర్‌ప్రెట్ చేశాడు? ఈ మధ్య గాలి నాసరరెడ్డి ఏదో పోయెమ్‌ని వచన కవితగా ట్రాన్స్‌లేట్ చేస్తే, నేను “బాగుంది” అని నా బ్లాగ్‌లో రాస్తే ఎవరో ఇద్దరు పండితులు నన్ను తగులుకున్నారు. “అందులో కవిత్వం ఏముంది? పదాలు విరిచి రాస్తే కవిత్వం అయిపోతుందా? ఒకదాని కింద ఒకటి పేరిస్తే కవిత్వం అయిపోతుందా? ఒరిజినల్ దానిలో లేనిది ఇందులో ఏముంది?” అని అడిగితే, నేను వాళ్లకి ఏం చెప్పానంటే—’ఆ పదాలు విరిచి రాయడం అనే మాట మీరు మాట్లాడటంతోటే మీకు ఆధునిక కవిత్వం గురించి ఏమీ తెలియదని అర్థమవుతోంది. It’s all something about modern aesthetics.’

పదాల్ని విరిచి ముక్కలు చేసి లైన్ కింద లైన్ రాయడంగా కనిపించే వచన కవిత తాలూకు ఛందశ్శాస్త్రం  మన ప్రాచీన ఛందశ్శాస్త్రం కన్నా కఠినమైంది! ప్రాచీన ఛందశ్శాస్త్రాన్ని మనం బట్టీ పట్టొచ్చు—తేటగీతి అంటే ఈ గణాలు ఉండాలి, ద్విపద అంటే ఈ గణాలు ఉండాలి, యతి-ప్రాసలు పెట్టుకుంటే సరిపోతుంది. అందువల్లే గణాలు, యతులు, ప్రాసలు పాటిస్తూ బండెడు చెత్త మనవాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు in the name of poetry! గణాలు, యతి-ప్రాసలు కరెక్ట్‌ గా కుదురుతాయి, అవధానాల్లో చూడండి… మొత్తానికి చెప్తాడు ఏదో రకంగా. కానీ అది కవిత్వం కాదు నాయనా! మనకే తెలుసు.

కాబట్టి ఆధునిక వచన కవితకు సంబంధించి రెండు మూడు అంశాలు చెప్తాను:

కెడెన్స్ (Cadence): ఒక వాక్యాన్ని మనం ఎక్కడ ఆపాలో, ఎక్కడ విరవాలో, ఎక్కడ రిలీఫ్ పాయింట్ ఇవ్వాలో తెలిసి మాట్లాడితే, ఆ కెడెన్స్ నువ్వు పాటించగలిగితే ఒక మామూలు వాక్యంలో కూడా నువ్వు ఒక పొయెటిక్ స్ఫూర్తి తేవచ్చు. ‘నాకు దాహం వేస్తుంది’ అనడానికి, ‘నాకు/ దాహంగా/ ఉంది’ అనడానికి చాలా తేడా ఉంది. పూర్వకాలం మనవాళ్ళు గణాన్ని కెడెన్స్‌ గా పొరపాటు పడ్డారు. గణం వేరు, కెడెన్స్ వేరు. కెడెన్స్ అనేది నీ భావ సంచలనాన్ని, నీ మాటల్లోని సంచలనాన్ని, మాటకు మాటకు మధ్య తీసుకునే ఊపిరిని చూపిస్తుంది. ఎవరికి కెడెన్స్ మీద పట్టు ఉంటుందో అతడు ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడు అనిపించుకోగలుగుతాడు.

బ్రెవిటీ (Brevity): నువ్వు వాక్యాన్ని చెక్కాలి. ఒక వాక్యంలో నుంచి అనవసరమైన పదాలు కాదు, అనవసరమైన అక్షరాలను, పొల్లులను కూడా తీసేయాలి. అంటే ఒక అనలాగ్ ఫైలుని డిజిటలైజ్ చేయడం లాగా నాయిస్‌ పూర్తిగా పరిహరించాలి.

లైన్   బ్రేక్స్ & రిలీఫ్ (Line Breaks & Relief): పదాలు విరిచి ముక్కలుగా పేర్చడం చాలా ముఖ్యం, ఎందుకంటే అది రిలీఫ్. అనాది కాలం నుంచి కూడా కవిత్వానికీ, ఛందస్సుకీ, మనిషి శ్వాసకీ  దగ్గర సంబంధం ఉంది. మనం శ్వాసించే పద్ధతిని బట్టి మన ఛందస్సు ఆధారపడుతుంది. ఆ జాగ్రఫీ తాలూకు శ్వాస విధానాన్ని బట్టి వాళ్ళ ఛందస్సు ఉంటుంది. జస్ట్ బికాజ్ నువ్వు గజల్‌ని తీసుకొచ్చి తెలుగులో రాస్తే గజల్ అవ్వదు, గజల్ లాంటి ఒక గీతం అవుతుంది; సీసపద్యాలు తీసుకెళ్లి పర్షియన్‌లో రాయలేవు. దాన్ని నువ్వు ఇంగ్లీషులోకి అనువదించాలి అంటే—ఈ తెలుగు శ్వాస పద్ధతిని ఇంగ్లీష్ శ్వాస పద్ధతిలోకి మార్చాలి! ట్రాన్స్‌ లేషన్ అంటే ఇది. అంతేతప్ప తెలుగులోని 56 అక్షరాలను 26 అక్షరాలుగా మార్చడం కాదు.

ఉదాహరణకి 13వ శతాబ్దంలో జలాలుద్దీన్ రూమి రాసిన ‘మస్నవి’ అనే ఆరు సంపుటాల లాంగ్ పోయెమ్‌ని నికల్సన్ అనే ఆయన 19వ శతాబ్దంలో చాలా ఫెయిత్‌ఫుల్‌గా యథాతథంగా అనువాదం చేశాడు. పండితులు చదివారు, పక్కన పెట్టారు. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో కోల్‌మన్ బార్క్స్ అనే ఆయన అదే కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. అంటే నికల్సన్ అనువాదాన్నే మళ్లీ అనువాదం చేశాడు. ఓవర్‌నైట్ జలాలుద్దీన్ రూమి ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అయ్యాడు! ఎందుకు? ఏమిటా మహత్యం? నేను నికల్సన్ అనువాదం దగ్గర పెట్టుకుని, ఈయన అనువాదం దగ్గర పెట్టుకుని చదివాను. ఎక్కడా ఆయన మ్యానిపులేట్ చేయలేదు. కానీ చేసిన ఇంద్రజాలం అంతా ఏమిటయ్యా అంటే—కెడెన్స్ మార్చాడు, రిలీఫ్ మార్చాడు. చలం గారు రాశాడే శ్రీశ్రీ గురించి: ‘మన హృదయంలోకి నేరుగా పంపిన నెత్తుటి కాల్వలా అనిపిస్తుంది’ అని, అలా మార్చాడు. అటువంటి ఒక అసాధారణమైన ప్రావీణ్యం ఈ రిగోబెర్తో ప్రభాత చూపించాడు.

ఈ అనువాదకుడు ఇదే వర్క్, ఇదే పద్ధతిలో కంటిన్యూ చేస్తే తెలుగు కవిత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. మిత్రుడా! తెలుగు కవిత్వం నీలాంటి అనువాదకుల కోసం వెతుక్కుంటోంది.

ఇప్పుడు మీకు రెండు పోయెమ్స్ వినిపిస్తాను:

The Missing Nose

Spring has arrived.
When I looked at myself
in the mirror this morning,
I noticed that my nose was missing.

The empty space seemed to mock me.
Last night I dreamt that a house sparrow,
the pet of my dead sweetheart,
bit off my nose and ate it.

I am sure it carried to her grave
where she would wake,
press my nose against hers
and coo sweet nothings.
Today I shall stay at home.

I don’t want to show
my noseless face
to this heartless society.

I know that tonight
in my dream
the house sparrow
will return my nose,

And once again
this spring
a nose flower
will bloom on my face.

దీనికి మూలమైన తెలుగు కవిత—

పిచ్చుక కొరికిన ముక్కు

వసంత ఋతువు వచ్చింది
పొద్దున్నే అద్దంలో చూస్తే నా ముక్కు మాయమయింది
అక్కడ ఖాళీ స్థలం వెక్కిరిస్తుంది
రాత్రి కలలో ఒక ఊరపిచ్చుక నా ముక్కును కొరుక్కుతినింది
అది నా మృత ప్రియురాలి పెంపుడు పిచ్చుక
ఆ పిచ్చుక తాను తిన్న నా ముక్కును తప్పక
మృతప్రేయసి సమాధి వద్దకు చేర్చుతుంది
ఆమె సమాధి నుండి మేల్కొని తన ముక్కును
నా ముక్కుకు రాసి ప్రేమ ఊసులు చెప్తుంది
ఈరోజంతా నేను ఇంట్లోనే ఉంటాను
ముక్కు లేని నా ముఖాన్ని ఈ నిర్దయ సమాజానికి చూపించను.
నాకు తెలుసు—ఈరోజు రాత్రి కలలో
ఆ ఊరపిచ్చుక నా ముక్కు నాకు తిరిగి తెచ్చిస్తుంది
ఈ వసంత ఋతువులో నా ముఖంపై మరలా ముక్కు పువ్వు
పూస్తుంది

ఈ రెండు కవితల అరేంజ్మెంట్ చూడండి. తెలుగు కవిత వాక్యం కింద వాక్యం ఎక్కడా రిలీఫ్ లేకుండా ఒకే గుక్కలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్ అనువాదకుడు దాన్ని స్టాంజాలుగా మార్చాడు. ఈ స్టాంజాల మధ్య రిలీఫ్ ఉంది కదా, ఈ రిలీఫ్ మూల కవి ఇచ్చినది కాదు, అనువాదకుడు ఇచ్చిన రిలీఫ్. ఒక కథకుడు కథ రాస్తే (సునీల్ గంగోపాధ్యాయ ‘ప్రతిద్వంది’ కథ రాస్తే సత్యజిత్ రే సినిమా తీసినట్టు, ఆ డైరెక్టర్ ఇంటర్‌ప్రెట్ చేయడంలో అది సత్యజిత్ రే సినిమాగా మారిపోయినట్టు), ఈ పోయెమ్ రిగోబెర్తో పోయెమ్‌గా మారింది.

అలాగే టైటిల్ చూడండి—’పిచ్చుక కొరికిన ముక్కు’ అనేదాన్ని The Nose that was Bitten by the Sparrow అని రాయకుండా The Missing Nose అని పెట్టాడు. ఆదిత్య ఏమంటాడంటే—’Translation is a series of decisions’ అంటాడు. డ్రైవర్ ట్రాఫిక్‌లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ సాఫీగా బండి నడుపుతుంటే  మనం వెనక నిద్రపోతాం. అతను అన్ని నిర్ణయాలు తీసుకుంటూ బండి నడుపుతున్నాడని మనం గుర్తించం. అలాగే అనువాదకుడు ఈ కవితల్ని అనువదించడంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు.

ఇంకొక కవిత—‘పిరియడ్స్’— ఇందాకా వినిపించాను కదా— ‘ఆమె మధువు తాగుతోంది, రమిద్దామా అన్నాను, వద్దు డేట్ వచ్చింది అంది…’

అనువాదకుడు దీన్నిలా అనువదించాడు:

She was drinking wine.
“Shall we make love?”
I asked.
“No, I am on my period,”
she said.

Pain surged through her belly
like sea waves,
In her rose garden
withered flowers fell in clusters,
In her head
the clamour of birds echoed.

“Would you like another drink?”
I asked.
“Please leave me alone!”
she said.

Like a tortoise
I withdrew into my shell
and sat in a corner
drinking by myself.

I know she needs peace
at such times,
a sacred peace,
without me,
without anyone,
she wants
to be
with herself.

తెలుగులో ఉండే ఆ అలంకార భారాన్ని ఇంగ్లీషులోకి వచ్చేసరికి తగ్గించి తేలికపరిచాడు. ఆదిత్య మాటల్లో చెప్పాలంటే—’అనువాదకుడు అనువాదం పదాలతో చేయడు, పదాల బరువును తూచుకుంటూ చేస్తాడు.’ చివరి రెండు వాక్యాల క్లైమాక్స్‌ ని, ఆ coda లేదా ముక్తాయింపును ఇంగ్లీషులో ఎనిమిది లైన్లుగా చేసి, ఆ ‘దివ్యశాంతి’ (sacred peace) అనే పదాన్ని ముందే పరిచయం చేసి కెడెన్స్‌ ని పెంచాడు. It’s all translation engineering, interpretation engineering!

ఇంకొక చిన్న కవిత:

He and She

She loved trees,
he loved alcohol.
One day
while he sat
on a tree
drinking liquor
she found him.

They began living together.
Now
he loves trees
more than her,
and she loves alcohol
even more.

ఇంత సింపుల్‌గా, ఇంత సూటిగా, బ్యూటిఫుల్ ఇంగ్లీషులో అనువదించాడు. ఆండ్రూ షెల్లింగ్  ‘గాథాసప్తశతి’ని The Cane Groves of River Narmada అని ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు ఆ గాథల్ని  ఎలాగైతే కాంటెంపరరీగా మార్చాడో, ఇతను కూడా ఈ తెలుగు కవితలకు రెక్కలు ఇచ్చాడు.

నిన్న మొన్న ఒక తమిళ పత్రిక కోసం ఒకాయన నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి, “మీ తెలుగులో ఎందుకండీ మంచి అనువాదాలు రావు? తెలుగు కవులు బయటవాళ్ళకి ఎందుకు తెలియరు?” అని అడిగితే నేను చెప్పాను—’తెలుగు కవిత్వం చదవడం రానివాళ్ళు, ఇంగ్లీష్ కవిత్వం చదవడం రానివాళ్ళు, ప్రపంచ కవిత్వంతో సంబంధం లేనివాళ్ళు అనువాదం చేస్తారు కాబట్టి!’ అనువాదం చేసేవాడికి ముందు కవిత్వం చదవడం తెలిసి ఉండాలి. చదివిన కవిత్వాన్ని ముక్కలు చేసుకుని మళ్లీ తన మనసులో అమర్చుకోవాలి. దానికి అతనికి పదాల తాలూకు రంగు, రుచి, వాసన, బరువు తెలియాలి. స్వర్ణకారుడు సున్నితపు త్రాసులో ఒక పూలరేకు లాంటి బంగారు పోగును తూచినట్టు, పదంలో ఉండే అర్థాన్ని తూచి ఆ బరువు పట్టుకోగలిగిన అనువాదకుడు మాత్రమే పోయెమ్‌కి న్యాయం చేస్తాడు.

రిగోబెర్తో ప్రభాత అనిల్ బత్తులకి కేవలం న్యాయం చేయడమే కాదు, కొత్త రెక్కలు ఇచ్చాడు; ఈ కవిత్వానికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మై బెస్ట్ విషెస్ టు యు! ఇది చదివిన తర్వాత మీ పట్ల నాకు అపారమైన గౌరవం కలిగింది. ఇప్పుడు మీ ఇంటికి క్యూ కడతారు, ఫోన్ కాల్స్ రావడం మొదలవుతాయి— Be very choosey. I know you can make gold out of mud, but మంచి కవిత్వాన్ని ఎంచుకోండి, ప్రపంచానికి పరిచయం చేయండి. మీరు ఇలాంటి కవిత్వం ఇంకా రాయండి. ధన్యవాదాలు!

28-8-2026

One Reply to “”

  1. అనిల్ బత్తుల మధుశాల చదివాను. మళ్ళీ చదవాలి.
    ప్రభాత ఇంగ్లీషు అనువాదం కూడా చదవాలి.

    కవిత్వం గురించి, అనువాదం గురించి చాలా గొప్ప ప్రసంగం.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading