జీవన శిల్పి-25

కేశవ సుత అనే ఒక మరాఠీ కవి గురించి సాహిత్య అకాడెమీ ఒక మోనోగ్రాఫు వెలువరించింది. దాన్ని సదాశివ గారు తెలుగులోకి అనువదించారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు 83-84 ప్రాంతంలో ఆ పుస్తకం చదివాను. అందులో చివర కేశవ సుత కవితలకు సదాశివ గారి తెలుగు అనువాదం నన్ను ఆకట్టుకుంది. కానీ ఆయన గురించిన వివరాలు మొదటిసారి తెలిసింది మాత్రం ఫణికుమార్ గారి ‘గోదావరి గాథలు’ పుస్తకం ద్వారానే. 92 లో నేను ఉట్నూరులో చేరగానే మొదట చేసిన పనుల్లో అదిలాబాదు వెళ్ళి సదాశివ గారి దర్శనం చేసుకోవడం కూడా ఒకటి. కేశవసుత కవిత్వానికి ఆయన చేసిన అనువాదంలోంచి నాకు గుర్తున్న పంక్తులు ఆ రోజు  నేను గటగటా వినిపించాను. ఆయన ముగ్ధులైపోయారు. ఆ మా మొదటి సమావేశంలోనే  హిందుస్తానీ సంగీతం గురించి ఆయన నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. ఆ ముచ్చట ఆయన ‘యాది’ లో ప్రస్తావించారు కూడా. అప్పణ్ణుంచీ సదాశివగారికి నా హృదయంలో ఒక సమున్నత స్థానాన్నిచ్చుకున్నాను. ఉర్దూ, పారశీక కవిత్వాల పట్ల అంత సాధికారికతతో ప్రసంగించగల వక్త, హిందూస్తానీ సంగీతం గురించి అంత తల్లీనంగా మాట్లాడగల రసజ్ఞుడు తెలుగులో మరొకరు పుట్టలేదు.

గురూజీ తో ఈ సంభాషణలు మొదలుపెట్టినప్పుడు మొదటిరోజునే ఆయన సదాశివగారు తన ఆలోచనలకీ, అభిప్రాయాలకీ గీటురాయి అని చెప్పారు గుర్తుంది కదా! గురూజీ తనకన్నా వయసులో చిన్నవారైనప్పటికీ సదాశివ గారు గురూజీని తనతో సమానంగానే భావించేవారు, గౌరవించేవారు. సాధారణంగా అలాంటి చిన్నపట్టణాల్లో ఉండే ఇద్దరు సమ ఉజ్జీల మధ్య అంత పరస్పర గౌరవం, నిష్కపటమైన ఆత్మీయత కనరావడం మామూలు విషయం కాదు.

ఆ రోజు గురూజీతో కలిసి నేను సదాశివగారి దగ్గరకి వెళ్ళినప్పుడు  నాతో పాటు, మరికొందరు మిత్రులున్నారు. వారు ఎవరో నాకు గుర్తు లేదు. సంభాషణలు వింటుంటే హైదరాబాదు నుంచి కూడా ఆ రోజు ఒకరిద్దరు అక్కడికి వచ్చినట్టుగా కూడా ఉంది. వారెవరో  కూడా నాకు గుర్తులేదు. అయితే గురూజీ మొదటినుంచీ  సంభాషణలు ఆశిష్ కోసం హిందీలోనే చేస్తున్నారు కాబట్టి, ఆ రోజు సదాశివ గారిని ప్రశ్నించే  పని కూడా ఆశిష్ తీసుకున్నట్లుగా ఉన్నాడు. ఆ రోజు మాతో పాటు హిందూ పత్రిక స్థానిక విలేకరి, గురూజీ మిత్రుడు హర పాల్ సింగ్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. కాబట్టి ఆ కంఠాల్ని బట్టి వారిని ఊహిస్తూ ఆ సంభాషణని పునర్నిర్మించే ప్రయత్నం చేశాను. సంభాషణలో ఆద్యంతం గురూజీ తో పాటు  నేనూ, సదాశివ గారి అబ్బాయి కూడా శ్రోతలుగానే ఉన్నాం.

కుశలప్రశ్నలు పూర్తయ్యాక, ఆశిష్ సంభాషణకు తెరతీసాడు:

ఆశిష్: సదాశివగారూ, గురూజీ గురించి మీరేదైనా మాట్లాడితే వినాలని ఉంది.

మరొక మిత్రుడు : మీకు గురూజీ ఎప్పటినుంచి తెలుసు?

సదాశివ: మనం ఎవరి ఇంట్లో కూచున్నామో వాడు నా నడిపి కొడుకు. వాడూ, గురూజీ ఒకే యీడువాళ్ళు. అంటే నా పెద్ద కొడుకుకన్నా గురూజీ చిన్నవాడు. నా నడిపికొడుకుతో అతనికి ఈడూ జోడూ. అందుకని తరచూ ఇక్కడికి వస్తుండేవారు. అక్కడ మా పాత ఇల్లుండేది. ఆ అంగణం చాలా విశాలంగా ఉండేది. ఎవరొచ్చినా అక్కడ కూర్చునేవారు. గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకునేవారు. నేను నా కోసం ఒక చిన్న గది నిర్మించుకున్నాను. ఆ గదికి తలుపులేమీ లేకుండా ఎప్పుడూ కుల్లాగా ఉండేది. రిటైరయ్యాక అక్కడ కూర్చుని రాసుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు గురూజీ చెప్పే మాటలు వింటుండేవాణ్ణి. అవి చాలా లోతైనవిగా అనిపించేవి. ఈ అబ్బాయి బాగా చదువుకున్నాడు, బాగా ఆలోచిస్తాడు. అందరూ రవి అని పిలిచేవారు. నేను ‘గురూజీ, మీ మాటలు నాకు కూడా కొంచెం వినిపిస్తూండండి. అక్కడే పిల్లల్తో కూర్చుని మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు నా దగ్గరకి కూడా వచ్చి కూచోండి ‘ అనేవాణ్ణి. అప్పుడు గ్రహించాను. ఈయన మాటలు ఎంత లోతైనవి, ఎంత సత్యమైనవి. ఆ తర్వాత తెలిసింది ఆయన వడోదరాలో టెక్నికల్  కాలేజిలో చదువుకున్నారని. చదవడం ఎవరైనా చదువుతారు. కాని చదివిన తరువాత, తన చుట్టుపక్కల వాతావరణం మీద ఒక దృష్టి ఉంచి, ప్రతి వస్తువునీ ఒక సౌందర్యదృష్టితో గుర్తించడం, దాని గురించి ఆలోచించడం, ఒక నిర్ణయానికి రావడం ఆదీ ఈయన ప్రత్యేకత! చదువుకున్నవారంతా అలా చేయలేరు. .చాలాసార్లు నాకు ‘ఇప్పుడు గురూజీ రావాలి, రాకపోతే ఏదో వెలితిగా ఉంటోంది’  అనిపించేది. ఎప్పుడైనా పిలిచి ‘మీ ముచ్చట్లు చెప్పండి’ అని అడిగేవాణ్ణి. మనం ఎన్నో విషయాలు చూస్తాం, మర్చిపోతాం. కానీ, (గురూజీ వైపు తిరిగి) ‘మీ దిమాగ్ లో అన్నీ అలాగే ఉన్నాయి. ఒక సినిమారీలులాగా ప్రెజెంట్ చేస్తుంటారు’. ఆ జ్ఞాపకశక్తి చాలా గొప్పది. చాలా అద్భుతమైన జ్ఞాపకశక్తి. ఆయన బుద్ధి తీక్ష్ణత గురించి కూడా నేను తరచు అందరికీ చెబుతుంటాను. సంస్కృతంలో అమరకోశంలో బుద్దికి కొన్ని పేర్లున్నాయి. అందులో ప్రతి ఒక పేరుకూ ఒక నిర్వచనం ఉంటుంది. బుద్ధిని ‘నవ నవ ఉన్మేష శాలినీ ‘ అన్నారు. అంటే బుద్ధి అనేది ప్రతి క్షణం కొత్త చిగుళ్ళను అంటే కొత్త ఆలోచనలనిస్తుంది. ఆయన బుద్ధి అంత ప్రఖరమైనది, అంత తీక్ష్ణమైనది. ఎలాంటి ప్రశ్న వేసినా సరే, వెంటనే ఆలోచించి సమాధానం ఇచ్చేవారు. వెనకడుగు వేసేవారు కాదు. ఆయన బుద్ధి ఈ వయసులో కూడా అంతగా సహకరిస్తోంది. అందుకే ఆయన మాటలు అందరికీ అంతగా నచ్చుతాయి. ఆయన పాత మాటలే చెప్తుంటారు. కానీ అందరికీ అవి ఎంతో కొత్తగా అనిపిస్తాయి. కొత్త పద్ధతిలో చెప్పడం ఆయనకి తెలుసు. ఆయన ఒక ప్రొఫెషనల్ రైటర్ కాకపోయినా, రాస్తే చాలా మంచి రైటర్ అవుతారు, చాలా అందంగా రాస్తారు. ఆయన భాష కొంచెం అగ్గడ్ బగ్గడ్ తెలుగే అయినప్పటికీ చాలా మంచి శైలిలో రాస్తారు. హిందీలో కూడా చాలా బాగా రాస్తారు. ఇంగ్లిషుతో మాత్రం ఆయనకు పడదు. ‘ఆ ఫరంగి భాష నాకు వద్దు’ అంటారు. ఆయన దగ్గర ఇంగ్లిషులో కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాల్లో సారాంశమంతా ఆయనకు తెలుసు. మనం చదువుకుంటాం. కాని ఆయన చదవకుండానే అందులో ఏముందో చెప్పేస్తారు. అంతటి ప్రఖర బుద్ధి ఆయనది. కేవలం ఆ బుద్ధి వల్లే నేను ఆయన్ని అంతగా గౌరవిస్తాను. అది చాలా తీక్ష్ణమైనది. ఆలోచించడం- సమాజంలో చాలామంది మనుషులుంటారుగానీ ఆలోచించేవారు చాలా తక్కువ. కేవలం తెలుసుకోవడం వల్లనే పని అవ్వదు. ఆలోచించాలి. ఇదిలా ఉంది, ఇలా కాకపోతే ఎలా? ఇది ఎందుకిలా ఉంది? దీని కారణం ఏమిటి? నగరంలో ఎందుకిలా ఉంది? గ్రామంలో ఎందుకిలా ఉంది? ఈ ఆలోచనా విధానం వల్లనే ఆయన మాటలు వినడానికి అంత ఆసక్తికరంగా ఉంటుంది. రోజురోజుకీ ఆయన్ని కలిసేందుకు ఎంతోమంది మేధావులు, బుద్ధి జీవులు వస్తున్నారు. దాంతో ఆయన బుద్ధి ఇంకా వికసిస్తోంది. మామూలు మనుషుల్తో ఆయన కూర్చోరు, కేవలం పెద్ద పెద్ద మేధావులతోనే కూర్చుంటారు.

ఆ: ఈయన ఏవైతే విషయాలు చెప్తారో అవన్నీ తాను చూసినవి అని చెప్తారు. మీరైతే చాలాకాలంగా ఈ పట్టణంలోనే ఉంటున్నారు. ఇవన్నీ చూస్తున్నారు. మరి ఆయనచెప్పేవన్నీ ఆ రోజుల్లో ఉండేవా?

స: ఉన్నవే. ఆయన ఏం చెప్పినా  నిజమే చెప్తాడు. ఎందుకంటే, సాక్ష్యం ఇచ్చేవాణ్ణి నేనున్నాను కదా, ఎనభై నాలుగేళ్ళ వాణ్ణి.

ఆ: అవును

స: నిజమే, అప్పుడుండేవి. అప్పుడుండేవి కానీ, అప్పట్లో వాళ్ళు ఆ కోణంలో చూసారో లేదో, ఆ విధంగా అర్థం చేసుకున్నారో లేదో తెలియదు గానీ, ఇప్పుడు ఆయన మనకు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అలానే ఉండేది, ఈయన చెప్తున్న కారణం వల్ల అలా ఉండేదనిపిస్తుంది.

ఆ: అంటే చాలమంది అడుగుతుంటారు, ఆయన చెప్పే మాటల రెలవన్స్ ఏమిటి? ప్రామాణికత ఏమిటి అని. ఎందుకంటే శాస్త్రంలో లేదుకదా, ఆయన తన జీవితం నుంచే నేర్చుకున్నారు  కదా, ఇవన్నీ.

స: సమాజ వ్యవస్థ గురించి శాస్త్రంలో అంతగా రాయలేదు కదా.

మరొక వ్యక్తి : గురూజీ థాట్ ని ఎలా ఆచరణలోకి తీసుకురాగలం?

ఆ: అవును, సదాశివ గారూ, ఇంకో విషయం కూడా మేమంతా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఇక్కడికి చాలామంది వస్తారు, మాట్లాడటానికి, వినడానికి. వినడానికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత అడుగులు పడవు. దీని తర్వాత ఏం చేయాలి? కథలాగా ఊరికే విని వదిలేయాలా? లేక దీంతో మనమేదైనా చెయ్యగలమా? ఈ విషయంలో మేమేం చెయ్యాలో కొంచెం చెప్పండి.

భార్గవ్ రామ్ : నేనూ అదే అడగాలనుకుంటున్నాను. గురూజీతో మీరు ప్రాచీన వ్యవస్థల గురించి ఇన్ని విషయాలు చెప్తారు కదా, మరి మనం ఇప్పటి రోజుల్లో ఒక గ్రామాన్ని మోడల్ గా తయారుచేయలేమా  అనడిగితే, మోడల్ కాదు, మ్యూజియం తయారు చేయొచ్చు అంటారు గురూజీ (అంతా నవ్వులు) కాబట్టి నా  ప్రశ్న ఏమిటంటే, ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఒకవేళ మనం సమాజాన్ని అలా తయారు చేయలేకపోతే, దీనివల్ల లాభమేమిటన్నది ప్రశ్న.

స: ప్రయత్నం ఏదైనా చెయ్యవచ్చు. గురూజీకి కూడా తెలుసు, ఆయన చెప్తున్న విషయాలకు విరుద్ధంగా ప్రపంచం నడుస్తోందని.

ఆ: అవును.

స: కష్టం. కష్టమే కానీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలా చేయాలంటే, చేయొచ్చు, కాని ఎవరైనా పిచ్చివాళ్ళు పది పదిహేనుమంది దొరికితే, చేయొచ్చు. చిన్న స్థాయిలో సాధ్యం కావచ్చు.

ఆ: అవును.

స: చిన్న స్థాయిలో అన్నీ సాధ్యమే. పెద్ద పెద్ద నగరాల్లో అవకపోవచ్చు కానీ చిన్న స్థాయిలో, మన పల్లెలు ఎలా ఉంటాయో చూడండి, ఆ పల్లెల్లో, మన పల్లెల్లో ఎవరైనా ఇలాంటి పిచ్చివాళ్ళు పదిమంది కలిస్తే, చేయవచ్చు. అన్నీ చెయ్యవచ్చు. చేసి దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత  ఒక అంచనాకు రావచ్చు. అప్పుడు  ప్రచారం వేరుగా ఉంటుంది. ‘మేము అనుభవపూర్వకంగా చూసాం. ఇలా సాధ్యమే’ అని చెప్పొచ్చు. ఇప్పుడు గురూజీ దగ్గర ఈ ప్రాక్టికల్  విషయం లేదు. ఆలోచిస్తారు, చెప్తారు, కానీ ఆచరణలో పెట్టడం సాధ్యమేనా, అవుతుందా అంటే సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎవరైనా ప్రయత్నిస్తే, కొందరు ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ప్రయత్నిస్తే అవ్వొచ్చు. అయిన తర్వాత అనుభవంతో చెప్పొచ్చు, మేం చేసి చూసాం అని. ఎందుకంటే ఏది మంచిదో అది అందరికీ నచ్చుతుంది. మనకు వినడానికి బాగుంది అంటే చేయడానికి కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే, గందరగోళం చాలా ఉంది. కాలం పరుగెడుతోంది. ఇందంతా సాధ్యమేనా అని ఆలోచిచడం మొదలుపెడితే అడుగులు వెనక్కి పడతాయి. ఆ సమయంలో గురూజీ కూడా ఏమీ చేయలేరు (అంతా నవ్వులు). అయితే ధైర్యం చెప్తారు. ‘చెయ్యండి, ఇది నా అభిప్రాయం, నా ఆలోచన, చెయ్యండి’ అని. చేసేవాళ్ళు కూడా దొరుకుతారు. ఇంతకీ మీ పేరేమిటి?

భా: భార్గవరామ్.

స: ఎక్కణ్ణించి వచ్చారు?

భా: హైదరాబాద్.

స: ఎందుకు వచ్చారు?

భా: రికార్డు చేయడానికి.

స: రికార్డు చేయడానికా లేక ఆయన మాటల్లో ఏదైనా అనందం ఉందా?

భా: ఆనందం ఉంది, ఆనందం పొందాను.

స: అచ్ఛా! ఆయన మాటల్లో ఆనందం పొందేవాళ్ళు కొద్దిగా పిచ్చివాళ్ళయ్యారు కదా!(అంతా నవ్వులు) ఇలాంటి వాళ్ళు కొందరు దొరికితే చాలు. ఎందుకు వస్తారు సార్ ఎవరి మాటలైనా వినడానికి జనాలు అంత దూరం నుండి? ఎందుకు వస్తారు? ఏదో ఉంది. ఏదో ఉంది కాబట్టే వస్తారు, ఏదో జరగబోతోంది అని. ఆ నమ్మకం, ఆ ఆశ మనకు ఉంది. ఏదో ఒకటి జరుగుతుంది దీనివల్ల. జరగనివ్వండి, జరిగే వరకు సాగనివ్వండి. ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు, ఆయన ధైర్యాన్ని దెబ్బతీయాల్సిన అవసరం లేదు.

ఆ: అవును.

స: సాగనివ్వండి. ఆయనైతే ఏదో లాభం ఆశించి చేయడం లేదు కదా ఇది. ఆయన ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు, వారానికొకసారి రావడం అలవాటు. ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చారు. అందరినీ ఒప్పించి వచ్చారు. అందరూ ఆయన మాటలు విన్నారు. అంగీకరించారు. వచ్చి ఆయన కాళ్ళు మొక్కి సంతోషం వ్యక్తం చేస్తారు. ‘వెళ్ళి వచ్చాను సార్, చాల దూరం, చాలా మంది విన్నారు నా మాటలు, చాలా మంది అంగీకరించారు ‘ అని చెప్తారు. వినే మాటలే ఇవి. అంగీకరించే మాటలే. అలాగే ఎవరో వచ్చారు, ఎవరో చెప్తే ఇద్దరు ముగ్గురు స్త్రీలూ, ఇద్దరు ముగ్గురు పురుషులూ వచ్చారు. ‘మనకైతే ఏమీ అర్థం కావడం లేదు సార్ ఏం చెప్తున్నారు అనేది’ అని అన్నారు. ఎందుకు వచ్చారు వీరు? రావాల్సింది కాదు. ఏ దైనా అర్థమైతే చుప్ చాప్ గా వెళ్ళిపోండి. ఇటూ అటూ ప్రచారం చెయ్యాల్సిన అవసరం లేదు. అలా కూడా వస్తారు కొందరు. ఏదో తమాషా ఉన్నట్టుంది కదా, అని చూడటానికి వస్తారు. అది తప్పు. అలా రాకూడదు. కానీ ఈయన ఎక్కడికైతే వెళ్తున్నారో, ఎవరెవరైతే ఈయన దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆయన మాటల్లో ఎంత బరువు ఉంది, ఎంత సత్యం ఉంది అని చూడటానికే వస్తున్నారు. మీకేమనిపిస్తుంది (అక్కడ ఉన్న మరొక వ్యక్తి కేసి చూస్తూ) మీకు తెలుగు రాదా?

ఆ వ్యక్తి: తెలుసు, తెలుసు, నేను తెలుగువాడినే.

స: మీకేమనిపిస్తుంది?

ఆ వ్యక్తి: ఆ పాత విషయాలన్నీ వింటూంటే నాకు చాలా బాగా అనిపిస్తుది.

స: పాత విషయాలన్నీ వింటుంటే, మళ్ళీ ఆ పాతరోజులు వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. చాలా గొప్ప విషయం అది.

ఆ వ్యక్తి: అంతే.

స: నిరాశతో నిండిపోయిన మనసులకు ఒక నూతన ఉత్సాహం, ఆశ కలిగించడం అనేది చాల గొప్ప విషయం. అన్నిటికన్నా ముందు, అదొక్కటే గొప్ప విషయం, ఏం జరగకపోయినా.

ఆ వ్యక్తి: అవును.

ఆ: అచ్ఛా. గురూజీని ఇంకొకటి అడగాల్సింది ఏమంటే, అక్కడ ఆశ్రమంతో పాటు ముందు ముందు ఇంకేమైనా చెయ్యవచ్చా?

స: ఆశ్రమం. ..

ఆ: ఆశ్రమం గురించి గురూజీ మూడు నాలుగు విషయాలు చెప్తారు చేయడానికి. ఒకటి కళాశ్రమం గురించి ఏం చెప్తారంటే, ఆయన చెప్తున్న విషయాలు ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో అలాగే సాగుతోంది. పెద్ద బస్తీలు అయిన చోట బంద్ అయింది. అందుకని డాక్యుమెంటేషన్ గురించి చెప్తారు. ఎక్కడెక్కడ అలాంటివి వున్నాయో దాన్ని డాక్యుమెంట్ చెయ్యమని చెప్తారు. అలా ఇంకా ఏమేం చెయ్యాలి? మనలాంటి వాళ్ళు ఉంటే, కొంచెం ఆలోచన పెట్టి సమయం ఇచ్చి చేయాలనుకుంటే, ఏం చేయాలి? మీ ఉద్దేశ్యంలో?

మరొక వ్యక్తి: అంటే ఇంకా ఏమేమి చెయ్యవచ్చు? ఆయన వెళ్ళి అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అక్కడక్కడ అవి విని దీని గురించి ఏదైనా చేద్దామని అలోచన మొదలుపెట్టారు.

స: ఆ ఆలోచన వాళ్ళు చెయ్యాలి.

ఆ: అంటే ఇక్కడ మేమున్నాం కదా, ఇలాంటి పని చెయ్యాలని మాకు ఇష్టం ఉంది కదా. ఇంకా ఏమేమి చేస్తే మంచిదని మీరు భావిస్తున్నారు? అంటే ఉదాహరణకి డాక్యుమెంటేషన్ కావచ్చు. ..

స: డాక్యుమెంటేషన్ ఎలాగూ కావాలి.

ఆ: అలాంటివి ఇంకేమైనా మీరు సలహా ఇస్తారా?

స: నడిచేది నడవనియ్యండి. నడుస్తుంది ఇంక. ఆయనకు అంత గౌరవం ఉంది. రాజశేఖరరెడ్డి సిబ్బందిలో  ఒక ఐఏఎస్ ఆఫీసరు ఉండేవారు.

హర్ పాల్ సింగ్ : సుబ్రహ్మణ్యం.

స: అవును. సుబ్రహ్మణ్యం. ఆయన అప్పుడప్పుడు నా దగ్గరకి వచ్చేవారు. ఇక్కడ కలెక్టరుని కలవడానికి వచ్చేవారు. ఆయనది కలెక్టరుకన్నా పెద్ద ఆఫీసరు హోదా. సెక్రటరీ. అందుకని కలెక్టరు తన కారు తీసుకుని వచ్చేవారు. సుబ్రహ్మణ్యం రాగానే ‘రవిశర్మను పిలవండి’ అనేవారు. కారు పంపి రవిశర్మను పిలిపించేవాణ్ణి. రవి శర్మ వల్లనే కొమరం  భీమ్  సినిమా తయారైంది, సుబ్రహ్మణ్యం గారు అనుకోవడం వల్ల. గురూజీ కూడా అందులో పనిచేసారు.

ఆ: గురూజీ కూడా పనిచేసారా అందులో?

స: అవును. ఆర్ట్ డైరక్టరుగా పనిచేసారు. నేను చూడలేదు గానీ నా పేరు చూసాను. అందులో ఉంది. రిలీజ్ అవడానికి పర్మిషను దొరకలేదు. అయితే నన్ను సెవెంత్ క్లాస్ కోసం టెక్స్ట్ బుక్ రాయమన్నారు గవర్న్ మెంటు వాళ్ళు, చాలా క్రితం. అందులో నేను కొమరం భీమ్  పాఠం రాసాను. కొమరం భీమ్  ఎవరు? ఏం చేసారన్నది రాసాం. మేం చదువుకునేటప్పుడు విన్నాం. చూసాం కూడా ఆయన చనిపోయిన తర్వాత.

ఆ: అచ్ఛా.

స: నేనలా పాఠం రాసాను. ఆ తర్వాత అల్లం రాజయ్య అని చాలా పెద్ద ఫేమస్ నావలిస్ట్ ఉన్నారు. అల్లం రాజయ్య, సాహు అనే ఆయన ఇన్ ఫర్మేషన్ తీసుకువస్తే, అల్లం రాజయ్య ఒక నవల రాసారు. అందరూ కలిసి  ఆ సినిమా తీసారు. అందులో కొమరం భీమ్  వేషం వేసిన హీరో భూపాల్ రెడ్డి, వచ్చి నా దగ్గర కూర్చునేవాడు చాల సేపు. ఆ పాత్ర గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి.  సినిమా తీయడానికి ముందే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. చిన్న గది ఊండేది. ముందే చెప్పానుకదా, తలుపుల్లేని గది. అన్నీ తెరిచి ఉండేవి. ఇక్కడికొచ్చి కూర్చునేవారు. ఎలా తీయాలి ఎలా తీయాలని చాలాసేపు చర్చిస్తూ ఉండేవారు. ‘మీరు చూసే ఉంటారు కదా, ఎలా ఉండేవారు? ఆయన హావభావాలు, మీసాలు ఎంత పొడవుండేవి, ఎలా ఉండేవి- అన్నీ అడిగేవారు. చెప్పాను, విన్నారు. ఈ సార్ దగ్గరికి రావడం వల్లే మాకు ఇంత నాలెడ్జి దొరికింది లేకపోతే మేం ఏం చేసేవాళ్ళమో ఏం తీసేవాళ్ళమో అని చెప్పారు. ఆ తర్వాత కలెక్టరుగారు తిరకాసు చేసారు. తలపాగా వాళ్ళని సూటెడ్ బూటెడ్ గా తయారుచేసారు. .. అందులో గురూజీ ఉండేసరికి ఆ మాత్రం మంచిగా వెళ్ళింది.

ఆ తర్వాత అనాహత నాదం గురించి కొంత చర్చ జరిగింది. పొద్దున్నే గురూజీ కబీరు దోహాలు వినిపిస్తుంటే ‘అనహద్’ అనే మాట దొర్లిందనీ, దాని అర్థమేమిటని అడిగితే, ‘సదాశివ గారికి దగ్గరకి వెళ్తున్నాం కదా, ఆయన్నే అడగండి’ అన్నారట గురూజీ. అందుకుని అనాహతనాదం మీదా, షట్చక్రాల మీదా కొంత చర్చ జరిగాక, ఆశిష్ సదాశివగారిని అడిగాడు:

ఆ: మీ ఎక్స్ పీరియన్స్ లో అదిలాబాదు గురించి మీ అనుభవాలు వివరించండి.

స: దేని గురించి?

ఆ: ఏవైనా జనరల్ విషయాలు.

స: అదిలాబాదులో ఉండే కొన్ని వేలమందిలో ఎటువంటి ఎక్స్ పీరియన్స్ ఉందో నాకూ అలాగే ఉంటుంది. నేనేమీ ప్రత్యేకమైన మనిషిని కాను కదా. గురూజీని అడగాల్సిన ప్రశ్న నన్నడిగారు. మనకు ఆ సంతోషం ఉంటుంది. దాని గురించి నేనేమీ చెప్పలేను. అలా చెప్పడానికి ఏమీ లేదు. గురూజీ కూడా చెప్పరు తన గురించి. ఒక అనుభవం, కిషన్ సింగ్ చావ్డా గారు, కొంచెం చదువుకున్న మనిషి, ఆ రోజుల్లో రాజులూ,మహారాజులూ ఉండేవారు కదా. ఇద్దరు ముగ్గురు మహారాజుల దగ్గర సెక్రటరీగా పనిచేసారు. గురూజీలాగే ఆయనది కూడా చురుకైన బుద్ధి. రాజుల కోసం గాయకుల్ని పిలవడం, విద్వాంసుల్ని పిలవడం, వాళ్ళ సభలు- ఇవన్నీ రాసారు. దానివల్ల మన హిందుస్తాన్ లో ఎన్ని కళలుండేవి, ఎంత మంది కళాకారులుండేవారు, వాళ్ళ ప్రదర్శన ఎలా జరిగేది, ఎవరెవరు ఆదరించేవారు మొదలైనవన్నీ రాసారు. ఆ రాజులు, మహారాజులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ముచ్చట లేదు. గవర్న్ మెంటు ఎక్కడ ఆదరిస్తుంది? ఆయన రాసినవనీ నిజమైన కథలు. కల్పిత కథలు కావు, సంస్మరణలు, వాళ్ళ జ్ఞాపకాలు. నేనూ అవే రాస్తుంటాను. అయితే ఈ అనుభవాలు అందరికీ రావు. నా రచనలో, నా శైలిలో చదివించే గుణం ఉండటానికి ముఖ్యమైన కారణం ఒకటి నాకు తెలుసు, చాలామంది చెప్పారు, ఏంటంటే, ‘యాది’ అని రాసాను. ఎనభై నాలుగేళ్ళ జీవితంలో కనీసం నా డెబ్భై ఏళ్ళ అనుభవాలు అయితే ఉంటాయి. యాదిని ఉత్సాహంగా చదువుతున్నారు. ఎక్కడో మారుమూల ఆంధ్ర ప్రాంతం నుంచి  కూడా ఉత్తరాలు రాస్తుంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు దాని గురించి. ఆ శైలి ఉంది నా దగ్గర. దానికి ఒక కారణం చెప్తాను సార్, చెప్తే ఏమో పెద్దరికం అనుకుంటారు. ఏమిటంటే, ప్రపంచంలో అంతా మంచే లేదు, చెడు కూడా ఉంది, ఉంది కదా. ..

ఆ: అవును, ఉంది.

స: అందరూ  మంచివాళ్ళే లేరు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నా అదృష్టవశాత్తూ ఏ మంచివాళ్ళని కలిసానో వాళ్ళ గురించే ప్రస్తావన ఉంది.  నేను చూసిన ప్రపంచం అది. ‘చెప్పదగినవి మాత్రమే చెప్పారు మీరు’ అంటారు. కొందరు చెడును గురించి కూడా చెప్తూ మంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పాఠాలు చెప్తారు. అదేమీ పనిచేయదు. అంతే కదా. ‘మనకు ఎదురైన మంచిని పంచుదాం అనుకున్నారు మీరు’ అని అంటారు. అవును దాని వల్లనే యాదికి అంత డిమాండ్ వచ్చింది. అలాగే సంగీతం గురించి నేను బాగా విన్నాను. అనుకోకుండా నా జీవితంలో సంగీతం బాగా దొరికింది నాకు. నేను విన్నదంతా మిగతా వాళ్ళు కూడా వినాలి. ఇంతకు ముందు చెప్పినట్టుగా నాది పంతులు మనస్తత్వం. టీచరుగా నాకు మంచి పేరుంది. నేను తెలుగు చెప్పాను. హిందీ చెప్పాను. ఉర్దూ చెప్పాను. టీచర్ గా నాది చాల మంచి ఎక్స్ పీరియెన్స్. అయితే, నవలలు, నాటకాలు రాసేవాళ్ళకు సృజనాత్మకత ఉండాలి. నాకు అదంతా ఏమీ లేదు. ఇదుగో, నేను ఒక హీరాబాయిని విన్నాను. చాలా గొప్ప సంగీతం. ఆ రాగం ఏదో పాడింది. విన్నాను. ఈ ముచ్చట నేను మీకు చెప్తాను. అంతే, అది పంతులు మెంటాలిటీ. అది ఎక్కడిదో లేనిపోనిది కాదు. నా అనుభవానికి వచ్చిన దాన్నే నేను చూసినట్టు, నేను అనుభవించినట్టు, నేను భావించినట్టు, నేను ఆలోచించినట్టు మీ ముందు పెడతాను. మీకు ఇష్టమైతే చదువుతారు. లేకపోతే లేదు. నా పుస్తకాలన్నీ సంగీతం గురించి రాసిన పుస్తకాలే. ఫార్సీ, హిందీ, మరాఠీ సాహిత్యాల గురించి పెద్ద పెద్ద పుస్తకాలు రాసాను కదా. అవన్నీ ఇంతే. నేను చదివినవి ఇవి, చాలా గొప్పవి. ఫార్సీలో మౌలానా రూమీని చదివాను. అమ్మో, చాలా గొప్ప కవి. మరాఠీలో పు.ల. దేశ్ పాండే ని చదివాను. అబ్బో, చాలా గొప్పవాడు. చాలా బాగా రాస్తాడు. ఇట్లా. ఇంక హిందీలో అయితే చెప్పనవసరం లేదు. అందరూ గొప్పవాళ్ళే. మా గురూజీకి మహాదేవి అంటే చాలా ఇష్టం.

ఆ: మహాదేవి. ..

స: అవును, మహాదేవి వర్మ.


ఇక్కడితో ఈ సంభాషణ రికార్డు పూర్తయిపోయింది. ఆ తర్వాత ఏమి మాట్లాడుకున్నామో గుర్తులేదు. కాని ఇన్నేళ్ళ తరువాత వింటుంటే, ఒక సంగతి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అటు గురూజీ, ఇటు సదాశివగారూ ఇద్దరూ కూడా తామేదో కొత్తగా రచించామని గాని, లేదా రచించాలని గానీ ఉత్సాహపడ్డవాళ్ళు కారు. తమ జీవితాల్లో తాము ఏ సౌందర్యాన్ని చూసారో దాన్ని తమ చుట్టూ ఉన్నవాళ్ళతో పంచుకోడానికి ఉత్సాహపడినవాళ్ళు. అందులోనూ కేవలం తాము చూసిన మంచిని మాత్రమే. తాము చూసిన చెడు గురించి, ఆంతరంగికంగా కూడా, ఎప్పుడూ ఎవరితోనూ ప్రస్తావించనివారు.

మరొకటేమంటే, ఇద్దరూ కూడా స్మృతికర్తలు. స్మృతిసంరక్షకులు. కాళిదాసు మేఘసందేశంలో అప్పటి గ్రామాల్లో ఉదయన కథాకోవిదులైన గ్రామవృద్ధులుండేవారని చెప్తాడు. ఆ గ్రామవృద్ధులు ఉదయినుడి గురించి ముచ్చటించుకుంటున్నట్టుగా, ఒకప్పటి ఆదర్శ జీవన స్మృతుల్ని నెమరేసుకుంటూ, తరం నుంచి తరానికి కొన్ని విలువల్ని అందిస్తూ ఉండేవారు. నేను రాజమండ్రిలో గోదావరి ఒడ్డున, అటువంటి ఉదయన కథాకోవిదుల్ని, సాహిత్యరంగంలో చూసాను. వారి మాటలు విన్నాను. అలానే అదిలాబాదులో ఈ ఇద్దరు పెద్దమనుషులూ తమ అనుభవానికి వచ్చినదాన్ని  నలుగురికీ పంచుతూ వచ్చారు. వారి ఆ స్మరణలో జీవితం పట్ల అపారమైన ప్రేమ ఉంది, సత్యసంధత ఉంది, సౌందర్య ఉపాసన ఉంది. అందుకనే నేనొకప్పుడు సదాశివ గారి గురించి రాస్తూ ఆయన్ని ‘సంస్కృతి నిర్మాత’ అని అన్నాను. ఇప్పుడు ఆ మాట గురూజీ గురించి కూడా చెప్తున్నాను.

‘మంచి అన్నది పెంచుమన్నా’ అని అన్నాడు మహాకవి. మంచిని పెంచడం, పెంపొందించడం ఇలానే చెయ్యాలనుకుంటాను. ఒక హంసలాగా తమ జీవితమంతా నీళ్ళనుంచి పాలని వేరు చేస్తూ గడిపిన ఆ ఇద్దరు మహనీయులూ నాకు తెలుసననీ, నా జీవితంలో కొంత సమయమేనా, వారి సన్నిధిలో కూకోగలిగాననీ అనుకుంటూ ఉంటేనే నాకెంతో పులకింతగా ఉంది.

ఇందులో సదాశివ గారు ప్రస్తావించిన కొమరం భీమ్  సినిమా గురించి, ఆ తర్వాత జరిగిన సంగతులు కూడా మీతో పంచుకోవాలి. పి.సుబ్రహ్మణ్యంగారు 1987-89 మధ్యకాలంలో ఉట్నూరు ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసారు. ఆయన సాహసించి ఐ.టి.డి.ఏ తరఫున కొమరం  భీమ్  మీద సినిమా అయితే తీసారుగానీ, ఆ ఫిల్ముని ప్రాసెసింగ్ చేయించి, థియేటర్లలో విడుదల చేయించేలోపే బదిలీ మీద వెళ్ళిపోయారు. దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శిగా చేరాక మళ్ళా ఆ విషయం మీద దృష్టి పెట్టారు. ఆ ఫిల్మును ప్రాసెసింగ్ పూర్తి చేయించి లాబ్ నుంచి బయటకు విడిపించి థియేటర్లలో విడుదలకు కావలసిన బడ్జెటు విడుదల చేయించడం, అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు సంపాదించే క్రమంలో నేను నా వంతు కర్తవ్యం నెరవేర్చాను. మొన్నటిదాకా తెలంగాణా ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పి.శాంతికుమారి గారు మా కమిషనర్ గా ఉన్న కాలంలో ఫిల్మ్ డెవలప్ మెంటు కార్పొరేషన్ ద్వారా ఆ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ప్రముఖ రచయిత, బాలసాహిత్యకారుడు భూపాల్ రెడ్డి కొమరం భీమ్  గా నటించాడు. దానికి గురూజీ ఆర్ట్ డైరక్టరుగా పని చేయడం తెలుగు సినిమా అదృష్టం.

27-6-2026

4 Replies to “జీవన శిల్పి-25”

  1. చాలా ఆసక్తికరమైన, ఆలోచింపచేసిన సంభాషణ ఇది. సదాశివ గారు ఎన్ని విషయాలు ఎంత ఆనందిస్తూ చెప్పారో అనిపించింది.

    సదాశివ గారు గురూజీ జ్ఞాపకశక్తి, పరిశీలనా దృష్టి, చూసిన వాటిని తిరిగి సులభగ్రాహ్యంగా చెప్పగలిగే శక్తి గురించి అమరకోశం లోని నవ నవోన్మేష శాలినీ పదాన్ని ఉటంకిస్తూ బుద్ధికి ఇచ్చిన నిర్వచనం, గురూజీ ప్రఖర బుద్ధి తీక్ష్ణతను ఎంత అద్భుతంగా ఆవిష్కరించిందో! పాత విషయాలనే సరికొత్త పద్ధతిలో చెప్పగల గురూజీ శైలి సదాశివ గారిలో కూడా ఉందనిపించింది..

    పది మంది పిచ్చివాళ్ళు దొరికితే చిన్న స్థాయిలో అన్నీ సాధ్యమే అన్న సదాశివ గారి మాటలు.. హా.. ఏం జరుగుతుందిలే.. అనుకుంటూ బద్ధకం తోనూ.. నిరాశతోనూ ఏమీ చెయ్యకుండా కాలం వెళ్లబుచ్చే వాళ్లకు ఎంతో ధైర్యాన్నిచ్చే సత్యం. సమాజాన్ని మార్చలేకపోయినా, ఆ నమ్మకాన్ని, ఆశను సజీవంగా ఉంచడం కూడా ఒక గొప్ప కార్యమే.

    ఈ విషయాలు తెలుకోవడం వలన ఉపయోగం ఏమైనా ఉంటుందా.. అని అడిగేవారికి ఆయన చెప్పిన ఈ సమాధానం నాకెంతో నచ్చింది..
    “నిరాశతో నిండిపోయిన మనసులకు ఒక నూతన ఉత్సాహం, ఆశ కలిగించడం అనేది చాల గొప్ప విషయం. అన్నిటికన్నా ముందు, అదొక్కటే గొప్ప విషయం, ఏం జరగకపోయినా.”

    ఈ భాగం చదివాకా గురూజీ గారి మీద గౌరవం మరింత పెరిగింది.

    లోకంలోని చెడును పక్కన పెట్టి, కేవలం తాము చూసిన సౌందర్యాన్ని, మంచిని మాత్రమే సమాజానికి పంచడం మీరు చెప్పినట్టు ఒక హంసలాగా తమ జీవితమంతా నీళ్ళనుంచి పాలని వేరు చేస్తూ గడిపిన గురూజీ, సదాశివ గార్ల లాంటి వల్ల తప్ప ఇతరుల వల్ల సాధ్య పడదు. ఆ ఇద్దరు మహనీయులూ మీకు తెలుసననీ, మీ జీవితంలో కొంత సమయమేనా, వారి సన్నిధిలో గడపగలిగారనీ అనుకుంటూ ఉంటేనే మీకెంత పులకింతగా ఉందో మీరు రికార్డ్ చేసి అక్షరీకరిస్తున్న ఈసంభాషణలు చదువుతుంటే మాక్కూడా అలాగే ఉంది.

    ఈ సంభాషణకు మీ పరిచయ, ముగింపు వాక్యాల వల్ల, కేవలం గురూజీ గారి గురించి మాత్రమే కాక, సదాశివ గారి గురించి, వారి యాది, ఇతర పుస్తకాల గురించి చాలా విషయాలు తెలుసుకో గలిగాను.. అలాగే కొమరం భీమ్ సినిమా నేపథ్యం, దాని వెనుక ఉన్న ఆనాటి ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం గారి కృషిని, మీ వంతు కర్తవ్యాన్ని కూడా జోడించడం వల్ల ఈ జీవనశిల్పి ఇరవై ఐదవ భాగానికి మరింత పరిపూర్ణత చేకూరింది.

    కృతజ్ఞతాభివందనాలు భద్రుడు గారు.

    1. చాలా సంతోషం సార్! ఒక మనిషి ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయేటప్పుడు ఏమి మూట కట్టుకొని వెళతాడో గానీ వదిలి పెట్టేవి మాత్రం ఇటువంటి జ్ఞాపకాలే, ఇటువంటి సుమ పరిమళాలే. మీ సహృదయ స్పందనకు నమోవాకాలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading