
అయిదవ రోజు: మూడవ సంభాషణ
ప్రతి ఒక్క వృత్తికారుడూ ఒక సంపూర్ణ విద్యావంతుడు
ఆ రోజు పొద్దున్న సదాశివ గారి దగ్గరికి వెళ్ళాం కాబట్టి మా సంభాషణలకి మధ్యాహ్నం మాత్రమే సమయం దొరికింది. ఆ మధ్యాహ్నమంతా గురూజీ మాట్లాడుతూనే ఉన్నారు. సాయంకాలమవుతూ ఉంది. ఆయన అలిసి పోయి ఉంటారు కాబట్టి మర్నాడు మాట్లాడుకుందాం అనుకున్నాను. కానీ ఆయన లో అలసట కనిపించడం లేదు. అప్పటికి సాయంకాల శ్రోతలు కూడా కొంతమంది చేరారు. మేమంతా వేపచెట్టు నీడకి చేరాం. ఎదురుగా ఒక నది ప్రవహించడం లేదు తప్ప నాకు తక్కిన దృశ్యమంతా సబర్మతి ఆశ్రమంలో కూచున్నట్టే అనిపించింది.
గురూజీ గొంతు సవరించుకున్నారు. ‘మనకి మూడు భావనలున్నాయి, దేవుడు, మనిషి, దానవుడు అని. ఎవరైతే మనకు అన్నీ ఇస్తాడో కానీ తిరిగి మననుంచి ఏదీ ఆశించడో వాడే దేవుడు. ఆయన ముందు మనమేదైనా పెడితే ‘నేను దీన్ని తీసుకోను’ అనని వాడు కూడా. ఎవరైతే ఇతరులనుంచి తీసుకుంటాడో, అలాగే తిరిగి మళ్ళా వాళ్ళకిస్తాడో వాడు మానవుడు. ఎవడైతే ఇతరులనుంచి తీసుకుంటాడుగానీ తిరిగి ఏమీ ఇవ్వడో వాడు దానవుడు. అందుకే సూర్యదేవుడు, చంద్రదేవుడు, వాయుదేవుడు,అగ్నిదేవుడు, చివరికి కుక్కదేవుడు, గాడిద దేవుడు- అన్నింటా దైవత్వాన్ని చూసాం. ఎందుకంటే అవి మనకి ఏదో ఒకటి ఇస్తున్నాయి. కాని మననుంచి ఏదీ ఆశించడం లేదు. ఆ తర్వాతే మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్యదేవోభవ అని చెప్పుకున్నాం, ఇవన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి. ఎందుకంటే వీరెవరూ మనల్ని ఏమీ అడగరు.’
‘ఏ రోజైతే తల్లి బిడ్డతో ‘నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసాను, నీ కోసం ఇంత చేసాను, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు?’ అనడిగితే, అలా రెండు మూడుసార్లు అడిగాక, కొడుకు ఏమంటాడు? ‘సరే, ఎంత ఖర్చయిందో చెప్పు, లెక్కకట్టి ఇచ్చేస్తాను’ అంటాడు. కాబట్టి ఆమె అడగనంతవరకే ఆ దైవత్వం ఉంటుంది. అలానే గురువు కూడా మననుండి ఏమీ ఆశించనంతవరకే దేవుడితో సమానం. ఏ రోజైతే ఆయన డబ్బూ, ఫీజూ ఆశించడం మొదలుపెడతాడో ఆ రోజుతో దైవత్వం పోయింది. అందుకే టీచర్ ని ఎవరూ దేవుడు అనడం లేదు. ఎందుకంటే అక్కడ వ్యాపారం వచ్చేసింది. ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు, ఊరికే చేయడం లేదుకదా.’
‘కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సమాజంలో అందరికంటే గొప్పవాడు రైతు కావాలి. ఎందుకంటే అన్నం కంటే విలువైంది ఇంకేముంది? కానీ సమాజానికి అన్నం పెట్టే ఆ రైతువర్గానికి ఎప్పుడూ అహంకారం రాలేదు. వాళ్ళు చాలా సాధారణంగా బతికారు. తాము ఎంత ముఖ్యమైనవాళ్ళయినా సరే, సమాజంలో ఎవరినీ అణచివేయాలని చూడలేదు. చాలా సరళమైన జీవితం గడిపారు. ఈ సరళత్వం, ఈ వినయం వారిలో ఎలా సాధ్యపడ్డాయి? ఇప్పుడు మనం కొద్దిగా చదువుకున్నాసరే, ఎంతో అహంకారం చూపిస్తాం.’
‘మన పూర్వీకుల విద్యలో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి: శీల, సమాధి, ప్రజ్ఞలు. వాటివల్లే మనిషిలో అంతటి సరళత్వం వచ్చేదేమో. అందుకే మన సమాజంలో ఎంత శక్తిమంతుడైనా సరే, చాలా సాదాసీదాగా బతికాడు. కానీ ఈ రోజు మన చదువుల్లోంచి ఆ సరళత్వం మాయమైపోయింది. ఇప్పటి తరంలో చదువుకున్నవాళ్ళకు రకరకాల విపరీత బుద్ధులు ఉంటున్నాయి. కాని అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా పూర్వం అంత సరళంగా ఎలా జీవించగలిగారో మనం అర్థం చేసుకోవాలి.’
‘ఒకసారి మా ఆవుకి జబ్బుచేస్తే పశువుల డాక్టర్ ని పిలిపించాం. ఆయన వచ్చి చూసి ఆవుకు ఇంజెక్షన్ ఇవ్వడానికి, దాన్ని పట్టుకోడానికి నలుగురు మనుషుల్ని పిలవమన్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ దొరక్కపోవడంతో ‘నలుగురు మనుషులు దొరికినప్పుడు నన్ను పిలవండి, వస్తాను’ అని చెప్పి, చేతులు కడుక్కుని, కుర్చీలో కూర్చుని, టీ తాగి వెళ్ళిపోయాడు.’
‘అదే మా గ్రామంలో ఉండే నాటు వైద్యుణ్ణి పిలిస్తే ఆయన వచ్చి చూసాడు. ఆయన వయసు మళ్ళిన వృద్ధుడు. ఆవుని చూసి ‘దీనికి వాతపెట్టాలి, కాని దానికి కావలసిన ఇనుప సలాక నేను తెచ్చుకోలేదు. అయితే ఇక్కడొక గొర్రెలకాపరి ఉన్నాడు, అతని దగ్గర ఉంటుంది’ అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు గ్రహణం పట్టిన రోజున ఆ సలాకలు తయారుచేస్తారు. జంతువులకు వేరుగా, మనుషులకు వేరుగా వేరు వేరు సైజుల్లో వాటిని తయారు చేసి పెట్టుకుంటారు.’
‘నేను ఆ సలాక తెప్పించాను. ఆ వృద్ధ వైద్యుడు పిడకలు వేసి మంటపెట్టి, దాన్ని వేడి చేసాడు. ఆవును పట్టుకోడానికి దారమ్మట వెళ్తున్న ఒకరిద్దరిని పిలిచాడు. వాళ్ళు వచ్చి సహాయం చేసారు. అప్పుడు ఆవుకి వాతలుపెట్టాడు. తన పని పూర్తయ్యాక నేను ఆయన్ని కుర్చీలో కూర్చోమంటే ఆయన కిందనే కూచున్నాడు. ‘లేదు గురూజీ, ఇక్కడే బాగుంది’ అన్నాడు. నేను ఆయనతో ‘అన్నం తిని వెళ్ళండి’ అని చెబితే, ఆయన ‘నేనిప్పుడు అన్నం తినకూడదు’ అన్నాడు. ఎందుకంటే ‘నేనిప్పుడే ఒక జీవానికి వైద్యం చేసాను కదా, మరి అన్నమెలా తింటాను? అది మన ధర్మం కాదు’ అన్నాడు.
‘కాబట్టి ఇక్కడ విద్యకి, ఇప్పటి చదువులకి ఉన్న తేడా ఇదే. ఆ పల్లెటూరి వైద్యుడు ఎంతో విజ్ఞానం ఉన్నవాడైనా సరే ఎంతో సరళంగా ఉన్నాడు. తాను చేసిన పనికి ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు. ఎవరికైనా సహాయం చేసినప్పుడు దానికి బదులుగా ఏమీ ఆశించకూడదనేది ఆనాటి నియమం.’
‘ఒకసారి మా ఊరి వైద్యుడికి కలెక్టరుగారి ఇంటినుండి పిలుపు వస్తే, నేను కూడా వెళ్ళాను. ఆయన కలెక్టరుగారికి నాడిపరీక్ష చేసి, మందులిచ్చారు. ఆ తర్వాత కలెక్టరుగారి భార్య ‘టీ తాగుతారా?’ అనడిగితే, నేను తాగుతానన్నాను, కానీ వైద్యుడు తాగనన్నాడు. ఎందుకని అడిగితే ‘నేనిప్పుడే మందులిచ్చాను కదా, టీ ఎలా తాగుతాను? మందు ఇవ్వడానికి ముందైతే తాగేవాణ్ణి. కానీ మందు ఇచ్చాక, నా ధర్మం ప్రకారం నేను ఏమీ తీసుకోకూడదు. మీ బండిలో కూడా వెళ్ళను. నడుచుకుంటూనే వెళ్తాను’ అన్నాడు. చివరికి మేమిద్దరం నడుచుకుంటూనే వెనక్కి వచ్చాం.’
‘ఇలాంటి సరళత్వం, వినయం మనుషుల్లో ఎలా సాధ్యపడ్డాయి? మన విద్యలో ఉన్న ఆ గొప్పదనం ఏమిటి?’
‘మనూరి మఠంలో రథోత్సవం జరిగేటప్పుడు ఆ రథం దగ్గర సమాజంలోని ప్రతి ఒక్క వృత్తిపనికీ, ప్రతి ఒక్క కులానికీ సంబంధించిన ప్రతినిధి ఖచ్చితంగా ఉండాల్సిందే. నకాశీ పనిచేసేవారు, వడ్రంగులు, దర్జీలు, కుమ్మరులు, చర్మకారులు, చాకలి, మంగలి ప్రతి ఒక్కరూ అక్కడ ఉండేవారు. రథాన్ని తాడుతో కట్టే బాధ్యత కుమ్మరులదే. వాళ్ళ మహిళలు రథం కోసం పూలహారాలు తయారుచెయ్యడం, కూరగాయలు కొయ్యడం, బియ్యం బాగుచెయ్యడం వంటి పనులన్నీ చేసేవారు. ఇవన్నీ అయిదారురోజులపాటు ఘనంగా సాగేవి.’
‘రథం పరిస్థితి పూర్తిగా పర్యవేక్షించి లోపాలుంటే సరిచెయ్యడం వడ్రంగి బాధ్యత. దర్జీ రథం మీదకెక్కి కూర్చుని రథం శిఖరానికి సరిపడా బట్టలు కుట్టి అలంకరించేవాడు. ఆ తర్వాత చర్మకారులు వాద్యాలు వాయిస్తూ రథం ముందు నడిచేవారు. చాకలి కుంభంపోసే ప్రక్రియ చూసుకునేవాడు. మేదరి ఒక పెద్ద చాప తెచ్చి రథం కింద వేసి దానిమీద ఒక తెల్లనివస్త్రం పరిచేవాడు. దానిమీద పసుపు కలిపిన అన్నం పెద్దకుప్పగా పోసేవారు. ఆ అన్నం కుప్పమీద పిండిప్రమిదల్లో దీపాలు పెట్టేవారు. మంగళి దివిటీలు పట్టుకుని నడుస్తుంటే, ఆ వెలుగుతోనే ఆ దీపాలు వెలిగించేవారు. నకాశీ పనివారు దేవునికి చామరాలు వీస్తుండేవారు. బెస్తవారు మఠానికి సంబంధించిన సాంప్రదాయిక చిహ్నాలు పట్టుకుని ఊరేగింపుగా ముందు నడిచేవారు.’
‘ఇలా అందరూ కలిసి చాలా వైభవంగా ఊరేగింపు సాగించేవారు. రథం చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరూ నిలబడ్డాక, మఠాధిపతి తరఫున అక్కడున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేవారు. ప్రతి ఒక్కరికీ తలపాగా చుట్టి, దుశ్శాలువా కప్పి, తిలకం దిద్ది సన్మానించేవారు. సమాజంలోని అన్ని వర్గాల పెద్దలకు అక్కడ సమానంగా మర్యాద జరిగేది. ఈ విధంగా రథోత్సవంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ముడిపడి ఉండేది.’
‘ఎవరైనా సన్న్యాసం తీసుకోవాలనుకుంటే దానికి ముందు ఒక ముఖ్యమైన నియమం ఉండేది. సన్న్యాసం స్వీకరించబోతున్న వ్యక్తి ఊళ్ళో ఉన్న వృత్తిపనివారందరి ఇళ్ళకూ వెళ్ళి తాను సన్న్యాసం తీసుకోబోతున్నాననీ, ఆ కార్యక్రమానికి వచ్చి తనని ఆశీర్వదించమనీ స్వయంగా పిలవాలి. సఫాయి పనిచేసే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు సన్న్యాసికి ఒక చేట, బంగారు ఆభరణం సమర్పించే ఆచారం ఉండేది.’
‘అలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒక చోట చేరినిలబడినప్పుడు, సన్న్యాసం తీసుకోబోయే వ్యక్తి అందరి ముందు నిలబడి క్షమాపణలు వేడుకునేవాడు. అందరికీ చేతులు జోడించి ‘నేను సన్న్యాసం స్వీకరిస్తున్నాను, మీరందరూ నన్ను క్షమించండి’ అని వేడుకునేవాడు. అతను వారి ముందు నిలబడి చెప్పేవాడు: ‘నేను గనుక గృహస్థుడిగా ఉండి ఉంటే, నా జీవితాంతం మీతోనే కలిసి ప్రయాణించేవాణ్ణి. కానీ ఇప్పుడు నేను సన్న్యాసం స్వీకరిస్తున్నాను కాబట్టి మీతో నా బంధం ఇక్కడితో తెగిపోతుంది. ఆర్థికపరంగా, వృత్తిపరంగా నా వల్ల సమాజానికి కొంత నష్టం జరగవచ్చు, ఆ నష్టానికి నన్ను క్షమించండి’ అని ప్రార్థించేవాడు.’
‘అలా అతను క్షమాపణలు అడిగినప్పుడు, అక్కడ ఉన్న ప్రతి వృత్తిపనివాడూ తన వంతుగా సన్న్యాసికి ఒక వస్తువును కానుకగా ఇచ్చేవారు. మేదరి దండం ఇచ్చేవాడు. చర్మకారుడు కూర్చోడానికి మృగచర్మం ఇచ్చేవాడు. వడ్రంగి చెక్కపాదుకలు సమర్పించేవాడు. భిక్షాటన కోసం దర్జీ ఒక జోలె కుట్టి ఇచ్చేవాడు. నేతకార్మికుడు వస్త్రాన్నిచ్చేవాడు. గొర్రెలకాపరులు కంబళినిచ్చేవారు. కుమ్మరి భిక్షాపాత్ర లేదా కమండలాన్నిచ్చేవాడు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్క వర్గంవారూ తమ వృత్తికి సంబంధించిన ఒక వస్తువు అతనికిచ్చి ఆశీర్వదించేవారు. ‘సరే, మాకు నీమీద ఎటువంటి ఫిర్యాదూ లేదు. నువ్వు మమ్మల్ని క్షమాపణ కోరావు. అదే మాకు పెద్ద గౌరవం. నీ ఇష్టప్రకారం నువ్వు సన్న్యాస జీవితం సాగించు’ అని వీడ్కోలు పలికేవారు. అంటే సమాజం అనుమతించాకనే ఎవరైనా సన్న్యాసిగా మారడానికి వీలుండేది.’
‘నేను చాలాసార్లు మనవాళ్ళతో చెప్తుంటాను- మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేయించాలి. పిల్లవాడితో క్షమాపణ చెప్పించాలి. ‘నేను ఇప్పుడు చదువుకోడానికి స్కూలుకి వెళ్తున్నాను. అక్కడ చదువుకున్నాక మిమ్మల్ని తిట్టడం నేర్చుకుంటాను. ఇకనుంచీ మీరు తయారుచేసిన ఏ వస్తువూ నేను ముట్టుకోను, వాడను, ఉద్యోగంలో చేరాక కార్ఖానా వస్తువులు మాత్రమే వాడడం మొదలుపెడతాను. కాబట్టి నన్ను ముందే క్షమించండి’ అని పిల్లవాడితో క్షమాపణ చెప్పించి మరీ స్కూల్లో జాయిన్ చేయాలి అంటూ ఉంటాను.’
‘విద్య అంటే ఏమిటి? మనదగ్గర మూడు ఋణాల గురించి భావిస్తారు- దేవ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం. మనిషి ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడు కావాలి. తను నిత్యం చేసే పూజ ద్వారా, భక్తి ద్వారా దేవ ఋణం నుంచి విముక్తుడవుతాడు. మనం ఎలాగైతే జన్మించామో అలాగే మనం కూడా పెళ్ళి చేసుకుని సంతానం కనాలి, పెద్దల పిండ ప్రదానం, పితృకార్యం చెయ్యాలి. అప్పుడు పితృ ఋణం నుంచి విముక్తులమవుతాం. మనం మన గురువుల నుంచి ఏ విద్యనైతే నేర్చుకున్నామో ఆ విద్యని శ్రేష్ఠుడైన ఒక శిష్యుణ్ణి వెతికి అతనిలో ప్రవేశపెట్టాలి. అప్పుడు ఋషి ఋణం నుంచి విముక్తులమవుతాం. విద్యని ముందుతరాలకి అందించాలి. తన దగ్గరే ఉంచుకుని చనిపోకూడదు. కాబట్టి ఆ ఋణాన్ని అన్నింటికంటే పెద్ద ఋణంగా భావించారు. ఆ ఋణం ప్రజలకి తీర్చాలి.’
‘కాబట్టి ఒక చేతివృత్తివాడు ఈ మూడు ఋణాల నుంచి సహజంగానే విముక్తుడయ్యేవాడు. అవునా? ఈ ఋణాలు తీర్చడం కోసం అతను ఇల్లు వదిలి పారిపోవాలనుకోడు. అసలు అతనికి ఆ ఊహనే వచ్చేది కాదు. తన ఇంట్లో ఏ పూజాపద్ధతి ఉందో సహజంగానే అదే చేసేవాడు. ఏ దేవుణ్ణి నమ్మాలో నమ్మేవాడు. ఎలా చేయాలో అలా చేసేవాడు. ఆ తర్వాత తన తండ్రిమొదలైనవాళ్ళనుంచి ఏ విద్యలు నేర్చుకున్నాడో, పెళ్ళి చేసుకుని పిల్లలు పుట్టాక, వారికి ఆ విద్యనివ్వడం మొదలుపెట్టేవాడు. అలా ఆ మూడు ఋణాలనుండి అతను విముక్తుడైపోయేవాడు, తనంతట తానుగా. కానీ ఎక్కడైతే శాస్త్రాలు తెలిసినవారున్నారో వారు ప్రజలకోసం ఈ మూడు ఋణాలనుంచి విముక్తులు కావడానికి బలవంతంగా ప్రయత్నించవలసి వచ్చేది. ఎందుకంటే వారు చదివి, చదివి, ఏం చదివారో గానీ, వారి బుర్ర అటూ ఇటూ అయిపోయేది- వేదాంతం గీదాంతం చదివి ‘లేదు, నేను పెళ్ళి చేసుకోను, సంసారం చేయను, త్యాగం- అని మాట్లాడేవారు. కాబట్టి వారిని ఈ ఋణాలనుంచి విముక్తుడు కావడానికి ఇదంతా మాటిమాటికి గుర్తుచేయాల్సి వచ్చేది. ‘నువ్విది చెయ్యాల్సిందే భయ్యా, లేక పోతే కుదరదు’ అని.’
‘మన దగ్గర విద్య, అంటే తన ఇంటివిద్య ఏదైతే ఉందో, దాన్ని తన ఇంట్లోనే సహజంగానే సులభంగా నేర్చుకునేవాడు పిల్లవాడు. అతని ఇంటికంటే పెద్ద విద్యాలయం ఇంకేమీ ఉండేది కాదు. అక్కడ ప్రతి ఒక్క టెక్నిక్ అతనికి తెలుసు. అక్కడే ఆ టెక్నిక్, ఆ రా- మెటీరియల్, దాంతో వస్తువులు తయారుచెయ్యడం, దాని కళాకృతి, దాని మార్కెటింగ్ సిస్టం- అతనికి సులభంగా దొరికేది. పూర్తిగా దొరికేది. దానికోసం మరెక్కడికో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవలసిన అవసరం లేదు. ఒక చేతివృత్తి కుటుంబానికి చెందిన తండ్రి ఏదైనా గ్రామానికి సామాను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, పిల్లవాడు వెంట వెళ్ళేవాడు. తన తండ్రి ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ప్రజలు ఇతనితో ఎలా ప్రవరిస్తున్నారు, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి- అందంతా చూసి తనంతట తానుగా నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఆ పని తాను కొనసాగించాలి. అదొక బంధం, ఒక సంబంధం. దాన్నతను నిర్మించుకుంటూ వెళ్ళేవాడు. అలానే పరిచయాలు కూడా పెంచుకుంటూ వెళ్ళేవాడు. ఆ ప్రజలు కూడా ఇతనితో పరిచయం పెంచుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఇతని తండ్రి తర్వాత ఇతనే మన ఇంటికి ఈ సామాన్లు పట్టుకుని రాబోతున్నాడని. కాబట్టి అద్భుతమైన బంధాల్ని ఏర్పరచుకునే మనస్తత్వం ఉండేది. అతడెప్పుడూ అహంకారంతో, గర్వంతో లేదా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు కాడు.’
‘ఇక అక్షరజ్ఞానంతో కూడుకున్న విద్యల వరకూ వస్తే, తమ సొంత శాస్త్రాలు చదువుకునే విద్య ని చాలా సార్లు ఈ జాతిపురాణాలు చెప్పేవారు తమ సంతానానికి స్వయంగానే నేర్పించేవారు. వారికి సొంతలిపులుండేవి, సొంత భాషలుండేవి, రహస్యభాషలుండేవి. సాధారణ ప్రజలముందు వారు తమ రహస్యభాషలోనే మాట్లాడుకునేవారు. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఉదాహరణకు చాలాసార్లు జాతరలలో, మేళాలలో దుకాణాల్లో చూస్తాం కదా, నగలు అమ్మే ఒతారీలు వస్తారు. వారు సాధారణ ప్రజలతో మరాఠీ మాట్లాడతారు. కానీ మనం ఒకచోట ఈ వస్తువు ఎంతకిస్తున్నావు అని అడిగామనుకో. అప్పుడతను ఒక ధర చెప్తాడు. ఆ ధర చెప్పాక, నువ్వు ‘లేదు లేదు 25 రూపాయలకి ఇవ్వు ‘ అంటావు, అతను ‘లేదు, లేదు, ఎక్కువలో ఎక్కువ నేనింతకి ఇవ్వగలను’ అని చెప్తాడు. ‘లేదు, ఇంతకైతే మాకు వద్దు’ అని మనం చెప్తే, వీరు తమ భాషలో ఇతరదుకాణాల వారికి చెప్పేసేవారు. ‘ఈ వస్తువుకి ఇంత ధర చెప్పాను’, అని. అప్పుడు మనం వేరే దుకాణాల దగ్గరకి వెళ్తే వారు కూడా అదే ధర చెప్పేవారు, లేదా అంతకంటే ఎక్కువ చెప్పేవారు. కాబట్టి వారు తమలో తాము ఒక రహస్యభాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే డక్కలి వాళ్ళకి కూడా తమ రహస్యభాష ఉండేది.’
‘ఇదంతా జ్ఞానమే, ఇదంతా విద్యనే. కానీ కొన్ని లెక్కలకోసం, ప్రపంచజ్ఞానం కోసం ఏ చదువులైతే ఉన్నాయో, ఆ చదువులు ఉండేవి. వాటిని చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళేవారు కూడా. కానీ ఆ చదువు నేర్చుకోడానికి చాలాకాలం పట్టేది అని నేననుకోవడం లేదు. పాణిని కాలంలో విద్య ఎలా నడిచేదంటే, నువ్వు ఒక గురువు దగ్గరికి వెళ్ళావు విద్యనేర్చుకోడానికి, అతను నీకు నేర్పిస్తున్నాడు- అయితే అప్పుడది నీ ప్రతిభమీద ఆధారపడి ఉండేది. నువ్వెన్ని రోజుల్లో అది గ్రహించగలవని. ఒకవేళ నువ్వది ఒక నెలలోనే నేర్చుకోగలిగితే, ఆ నెల తర్వాత వెళ్ళిపోవాలి. ఒకవేళ ఒక ఏడాది పట్టేటయితే, ఒక ఏడాది వరకు అక్కడ కూర్చో. కానీ అందరికీ ఇన్నేళ్ళ పాటు తప్పనిసరిగా కూర్చోవాలనే నియమం ఏమీ లేదు.’
‘కానీ ఇప్పుడు చూడండి- పదో తరగతి వరకూ అందరూ కూర్చోవాల్సిందే. నేను వెళ్ళే స్కూల్లో ఒక వైష్ణవ పిల్లవాడుండేవాడు, ముస్లిం పిల్లవాడు ఉండేవాడు. మిగిలిన వాళ్ళు కోలాం పిల్లలు. వైష్ణవుల పిల్లవాడు ఒకసారి చెప్పగానే గ్రహించేవాడు. చాలాసార్లు నాకు కూడా అర్థం చేయించేవాడు. శిల్పశాస్త్రం చెప్పేటప్పుడు నేనిలాగే ‘వేదాంగుళే’, ‘గుణాంగుళే’- అంటే అర్థమేమిటో చెప్పేవాడు. వేదాంగుళం అంటే నాలుగు అంగుళాలు, గుణాంగుళం అంటే మూడంగుళాలు అని చెప్పేసేవాడు. ఎందుకంటే వాటిని రోజూ తన ఇళ్ళల్లో వింటూనే ఉంటాడు కదా.’
‘అదే ముస్లిం పిల్లవాడు నాలుగు సార్లు చెప్తే గ్రహించేవాడు. కాని ఈ కోలాం పిల్లలున్నారే వారికి నలభై సార్లు చెప్పినా గ్రహించేవారు కాదు. ఎందుకంటే వారి గ్రహణశక్తి వేరే దిశలో ఉండేది. ఈ దిశలో కాదు. ప్రతి ఒక్కరికి సొంత గ్రహణశక్తి ఉంటుంది. ఒకరు ఒక వస్తువుని సులభంగా గ్రహిస్తే, మరొకరు మరొక వస్తువుని సులభంగా గ్రహిస్తారు. కోలాం పిల్లలు చూడండి. ఇక్కడ కూర్చుంటారు. ఒక కీటకం ఎక్కడో శబ్దం చేస్తోంది, ఏ చెట్టుమీంచో. ఈ పిల్లవాడు ఆ శబ్దం విని వెళ్తాడు, దాన్ని పట్టుకొస్తాడు. ఈ పని వైష్ణవుల పిల్లవాడు చెయ్యలేడు. అసలు అటువంటి శబ్దం వస్తోందని అతనికి తెలియనే తెలియదు. కాబట్టి పిల్లలకి వారి వారి సొంత గ్రహణశక్తి ఉంటుంది.’
‘జ్ఞాపకశక్తి పెంచాలి. విన్న విషయం గుర్తుంచుకోవాలి. అది గుర్తుండకపోతే మళ్ళీ చదవలేడు. కానీ జ్ఞాపకశక్తి పూర్తి అవసరం మనకి వేదపండితుల విషయంలోనే అవసరమయ్యేది. ఎందుకంటే వారు వేదాల్ని పూర్తిగా గుర్తుంచుకోవలసి వచ్చేది. కానీ మిగిలిన సమాజాల వారు తమకు అవసరమైన కొన్ని కొన్ని విషయాలు, శాస్త్రాలు మాత్రమే గుర్తుంచుకోవలసి వచ్చేది. శిల్పాచార్యుడు తన శిల్ప శాస్త్రం గుర్తుపెట్టుకోవలసి వచ్చేది. అది కూడా ఎంత అవసరమో అంత మాత్రమే గుర్తుపెట్టుకునేవాడు. ఎందుకంటే నిరంతరం అదే పని చేస్తాడు కాబట్టి. దాన్నే నిరంతరం చదువుకుంటూ, చేసుకుంటూ గుర్తుంచుకునేవాడు. స్కూళ్ళు గురువుల ఇళ్ళల్లోనే నడిచేవి. అక్కడ పదిమందికన్నా, ఇరవై మందికన్నా ఎక్కువ మంది ఉండేవారు కాదు. అంతకన్నా ఎక్కువమందిని ఉంచలేరు కూడా. ఒక విషయానికి సంబంధించిన ఒక గురువు ఉన్నాడు, అతని దగ్గర ఎన్ని రోజులు కూర్చుని నేర్చుకోగలడో అంత నేర్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వేరొక గురువు దగ్గరికి వెళ్ళిపోయేవాడు.’
‘ఇప్పుడు మన స్కూళ్ళల్లో ఎన్ని విద్యలైతే నేర్పిస్తున్నారో అవన్నీ సాధారణ ప్రజల విద్యలు. ఆర్కిటెక్చర్ సాధారణ ప్రజలది, ఇంజనీరింగ్ సాధారణ ప్రజలది, లెదర్ టెక్నాలజీ సాధారణ ప్రజలది, టెక్స్టైల్ సాధారణ ప్రజలది- సాధారణ ప్రజల విషయాలు వాళ్ళనుండి లాక్కుని మళ్ళీ వారికే నేర్పిస్తున్నారు. అంతే కదా. అంతకంటే ఎక్కువేమీ కాదు. కాబట్టి ఏ విషయాలైతే ప్రముఖమైనవని భావిస్తున్నామో, ఇంజనీరింగ్, లా, అర్థశాస్త్రం, వైద్యశాస్త్రం- వీటినే కదా చాలా ముఖ్యమైన సబ్జెక్టులుగా భావిస్తున్నాం, ఇవి మన దగ్గర ప్రతి ఒక్కరికోసం ఉండేవి. ఏదో ఒక మనిషి ఏదో ఒక సబ్జెక్టు చదివి మాస్టర్ అవడం కాదు, ప్రతి ఒక్కరూ ప్రతి విషయం చదవాల్సిందే.’
‘ఉదాహరణకి, మన దగ్గర ప్రతి జాతివాడూ వైద్యుడే. ఎవరి దగ్గర మందుల్లేవు. వైద్యం ఎవరికి తెలియదు? ఉదాహరణకి ఒక చేతివృత్తి పనివాడున్నాడు, వెదురు పనిచేసే వాడనుకోండి. వెదురు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని వెరైటీల వెదురు ఉంది- ఆ సమాచారం అతనికి తెలిసి ఉండాలి. వెదురుతో ఎన్ని మందులు తయారవుతాయి, అవి ఏ జబ్బుల నివారణకి ఉపయోగపడుతుంది అనే విషయంలో అతనే వైద్యుడు. వెదురు ఇంజనీరింగ్ అతనికి తెలుసు. వెదురుకు సంబంధించిన జ్యోతిష్యం, ఖగోళ సమాచారం అతనికి తెలిసుండేది. ఎందుకంటే ఒక మనిషి సన్న్యాసం స్వీకరిస్తుంటే, అతని చేతిలో ఏ నక్షత్రంలో నరికిన వెదురు ఇవ్వాలో అతనికి తెలుసు. ఎందుకంటే రేపు ఆ సన్న్యాసి చేతిలో కనీసం నలభై ఏళ్ళు నిలబడాలి ఆ దండం. కాబట్టి ఏ నక్షత్రంలో నరకడం వల్ల వెదురుకు పురుగుపట్టదో అతనికి తెలుసు. దాని సమాచారం అతనికే ఉండేది. అలానే వెదురుకు సంబంధించిన పూర్తి అర్థశాస్త్రం, మార్కెటింగ్ సిస్టమ్ కూడా అతని చేతిలోనే ఉండేవి. వెదురుకు సంబంధించిన న్యాయ విజ్ఞానం కూడా అతనే చూసుకునేవాడు. చట్టం కూడా వారిదే ఉండేది.’
‘అలాగే చర్మకారుడు కూడా. చర్మంతో ఎన్ని మందులు తయారవుతాయి, కొమ్ముతో ఎన్ని తయారవుతాయి, అది ఏ జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది, వాటికి సంబంధించిన వైద్యుడు అతడే. అలాగే చర్మానికి సంబంధించిన జ్యోతిష్య జ్ఞానం కూడా అతనికి ఉండేది. అలానే వడ్లవాళ్ళు కూడా, కమ్మరులు కూడా. అలా ప్రతి జాతి మనిషీ మన దగ్గర వైద్యుడిగా ఉన్నాడు. మరి వారికి జబ్బుచేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కొన్నిసార్లు గడ్డలవుతుంటాయి. ఆ గడ్డలకి మందిచ్చేవాడు చర్మకారుడు. ఆ అవసరాన్ని బట్టి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మన దగ్గర ప్రతి ఒక్క మనిషి వైద్యుడు, ప్రతి ఒక్క మనిషి కళాకారుడు, ప్రతి ఒక్క మనిషికీ ఇంజనీరింగ్ తెలిసి ఉండేది. అంటే ప్రతి మనిషి జీవనవిధానంలోనూ ప్రతి ఒక్క విద్య ఉండేది. ఇంత సమానమైన చదువు బహుశా ఈ కాలంలో ఎవరూ ఊహించలేరు కూడా.’
‘చిన్న చిన్న గురుకులాల్లోనే ఈ సమాచారమంతా నేర్చుకునేవారు, చదువుకునేవారు. చాలు. అంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి? ఉదాహరణకి, ఘోటుల్ గురించి మీరు వినే ఉంటారు, బస్తర్ లో ఉంది. ఇప్పుడు ఆ ఘోటుల్ గురించి చాలా చెడ్డగా రాసారు. అదీ ఇదీ అని రాసారు. కాని ఒక ఘోటుల్ ఎలా నడుస్తుందో నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూసాను. నాకు చాలా నచ్చింది ఆ పద్ధతి. అక్కడ యువతీ యువకులు రాత్రి బసచేస్తారు. అబ్బాయిలూ, అమ్మాయిలూ ఉంటారు కాబట్టి, కొత్వాల్ ఉంటాడు, అతని నిఘా ఉంటుంది. గ్రామంలోని పెద్దలంతా తమ విద్యలు ఆ పిల్లలకి నేర్పుతారు. ఉదాహరణకి అందరికీ వాద్యాలు వాయించడం రావాలి. కాబట్టి వాద్యకారుడు అందరికీ ఢోలు వాయించడం నేర్పిస్తాడు. ఆ గ్రామంలోని వైద్యుడు అందరికీ ఆయుర్వేదం గురించి చెప్తాడు. తమ గ్రామానికి, తమ జాతికి ఉన్న చరిత్ర గురించి వారికి చెప్తారు. వేట నేర్పిస్తారు, అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇద్దరూ వేటాడటం నేర్చుకోవాలి. ఆ విధంగా అక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విద్య నేర్చుకుంటారు. చాలా సులభంగా నేర్చుకుంటారు. ఏడాది, ఏడాదిన్నరలోపు ఎవరైనా అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చేసుకోడానికి సిద్ధమైతే పెళ్ళు కూడా చేస్తారు. ఆ ఘోటుల్ లో వాళ్ళ సహాధ్యాయిలంతా కలిసి వారికొక ఇల్లు నిర్మించి ఇస్తారు. తమ ఇల్లు ఎలా కట్టుకోవాలో వారికి నేర్పిస్తారు. తమ ఇల్లు, తమ వేట, తమ చరిత్ర, తమ ఆయుర్వేదం, తమ నృత్యం- ఇవన్నీ ఒక్కచోట నేర్చుకోవడం కన్నా మించిన మంచి విద్యావ్యవస్థ ఇంకేముంటుంది?’
‘అలాగే శస్త్ర విద్య. గ్రామగ్రామానా అఖాడాలుండేవి. శస్త్రవిద్యలు నేర్చుకోడానికి పూర్తి ఏర్పాట్లు ఉండేవి. కుస్తీపోటీలు మొదలుకుని కత్తి తిప్పడం దాకా ప్రతి జాతివాడూ, ప్రతి ఒక్క వ్యక్తీ నేర్చుకునేవారు. ఇంక ప్రత్యేకంగా మిలటరీ ఏమిటి? సమాజమే ఒక మిలటరీగా ఉండేది. రాజులు మన సైన్యాన్ని పోషించలేదు. సమాజంలోని ఒక భాగమే తనని తాను సైన్యంగా భావించేది. అది తమ తమ సమాజాలతో కలిసి పనిచేసేది. ఉదహారణకి రంగారేవాళ్ళు బట్టలకు రంగులు వేస్తారు. పట్కర్ వారు బట్టలు నేసే పని చేస్తారు, సమగార్ వారు చర్మం పని చేస్తారు. ఈ విధంగా వారు తమ తమ సమాజంలో తమ పని తాము చేసుకుంటారు. కానీ తమను తాము క్షత్రియులుగా భావిస్తారు. యుద్ధం చేసే సమయం వస్తే వీరందరూ వెళ్ళిపోయేవారు. అందరూ వెళ్ళేవారు. అంతే తప్ప రాజులు వాళ్ళని ఒక సైన్యంలాగా నియమించి, పోషించి, ప్రతి రోజూ పరేడ్ , సలామీ– ఇవేవీ అంతగా ఉండేది కాదు. అందువల్లనే మన రాజులు విధించే పన్ను చాలా తక్కువగా ఉండేది. ముస్లిం రాజులు వారికన్నా పెద్ద పెద్ద సైన్యాల్ని పోషించారు, కాబట్టి వారికన్నా ఎక్కువ పన్ను తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వారికన్నా మరింత పెద్ద పెద్ద సైన్యాల్నీ, మరింత బలమైన సైన్యాల్నీ పోషించారు.’
‘పూర్వం గ్రామంలో చాలాసార్లు కూర్చున్నచోటనే జ్ఞానం లభించేది. డక్కలవాడు వస్తున్నాడు, మూడు వేదాలు, మూడు పురాణాలు చెప్తున్నాడు, సింధీలు వస్తున్నారు, భాగవతం చేసి పౌరాణిక కథలు చెప్తున్నారు. ఈ జాతిపురాణాలు చెప్పే వారంతా ఆ జాతి కూర్చున్నచోటకే పోయి వేదమూ, పురాణమూ చెప్పేవారు కదా. ఇదొక పద్ధతి. చాలాసార్లు ఒక్కొక్క సమాజంలో ఎవరైతే చాలా జ్ఞానవంతులున్నారో, వారి దగ్గరకే పిల్లల్ని పంపేవారు. ఉదాహరణకి మన దగ్గర ఒక ముసలాయన ఉండేవాడు. పేరయ్య. అతను చాల మంచి కంచె కొట్టేవాడు. కంచె కొట్టడమంటే ఏమిటో తన దగ్గర నుండి నేర్చుకోవాలని అనేవాడు. ఏ కంచె ఎలా కొట్టాలి, ఎలా అమర్చాలి, అతణ్ణుంచి నేర్చుకొమ్మని తల్లిదండ్రులు పిల్లల్ని పంపించేవారు. అతను కంచె కొడుతుండేవాడు, వీరు చూస్తుండేవారు. అది చాలా పెద్ద విద్య కదా, కంచె కొట్టడం, దంత కంచె కొట్టడం, గొట్టి కంచె కొట్టడం, రేగి కంచె కొట్టడం, ఏ కంచె ఏ భాగంలో పెట్టాలి, అది పెట్టేటప్పుడు ఎక్కడెక్కడ పనికొస్తుంది, ఆ లెక్క చొప్పున అది అమర్చుకోవడం కదా. అది అందరికీ రాదు. గొడ్డలి ఇంత పొడవుండాలి, కాడ ఇంత పొడవుండాలి లాంటి లెక్క చూసుకోవాలి. ఇంత పెద్ద గొడ్డలితో కొట్టి కంచె కొట్టగలడా? ఏ కంచెకు ఏ గుణం ఉంటుంది, ఏ కంచె గుచ్చుకుంటే ఏం పెట్టుకోవాలి, ఇవన్నీ అతనికి తెలిసి ఉండేవి. కంచె కొట్టడం దానికై అదే ఒక పూర్తి విద్యగా ఉండేది. అది అంతా కలిసి చూసి నేర్చుకునేవారు. చాలా విషయాలు కలిసే నేర్చుకుంటారు కదా.’
‘వేదాధ్యయనమే తీసుకోండి. వేదం ‘మనం అతని దగ్గర చదివాం’ అని చెప్పేవారు కాదు. వేదం నేర్పించేవాడు కూడా ఆ మాట చెప్పేవాడు కాడు, చదివేవాడు కూడా ఆ మాట చెప్పేవాడు కాడు. ‘మనం అతనితో కలిసి చదివాం’ అని మాత్రమే చెప్పేవారు. ‘దగ్గర చదివాం’ అని కాదు. వేదం చెప్పేవాడూ, చదివేవాడూ కూడా కలిసే చదివేవారు. చేతివృత్తుల పనులుకూడా అంతే, కలిసి జరుగుతాయి. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కాదు, కలిసి నేర్చుకోవాలి. తమ ఉస్తాద్ తో కలిసి నేర్చుకోవాలి. అంతే తప్ప నేను బోర్డుమీద రాస్తాను, నువ్వు అర్థం చేసుకో అనేలా కాదు-‘
అక్కడికి గురూజీ తన ప్రసంగం ఆపారు. కానీ మర్నాడు కూడా ఆయన విద్య గురించీ, గురువు గురించీ, అధ్యయనం గురించీ ఇంకా మరికొన్ని ఆలోచనలు పంచుకోబోతున్నారని అర్థమయింది.
1-7-2026


ఈ సంభాషణ కోసం గురూజీ గొంతు సవరించుకునే ముందర ” మేమంతా వేపచెట్టు నీడకి చేరాం. ఎదురుగా ఒక నది ప్రవహించడం లేదు తప్ప నాకు తక్కిన దృశ్యమంతా సబర్మతి ఆశ్రమంలో కూచున్నట్టే అనిపించింది.” అంటూ ఈ జీవనశైలి 28వ వ భాగం చదివే పాఠకులకి ఒక మంచి సెటప్ ఎరేంజ్ చేశారు. దాంతో గురూజీ సంభాషణలు చదువుతున్నా ఆశ్రమంలో ఆయన ఎదురుగా కూచుని వింటున్నట్టే అనిపించింది భద్రుడు గారు.
గురూజీ దైవానికి, మానవుడికి, దానవుడికి మధ్య ఉన్న వ్యత్యాసానికి ఇచ్చిన వివరణ “ఎవరైతే మనకు అన్నీ ఇస్తాడో కానీ తిరిగి మననుంచి ఏదీ ఆశించడో వాడే దేవుడు. ఆయన ముందు మనమేదైనా పెడితే ‘నేను దీన్ని తీసుకోను’ అనని వాడు కూడా. ఎవరైతే ఇతరులనుంచి తీసుకుంటాడో, అలాగే తిరిగి మళ్ళా వాళ్ళకిస్తాడో వాడు మానవుడు. ఎవడైతే ఇతరులనుంచి తీసుకుంటాడుగానీ తిరిగి ఏమీ ఇవ్వడో వాడు దానవుడు” అని గురూజీ ఎంత అద్భుతంగా విడమరిచి చెప్పారు! అందుకే సూర్య చంద్రులకు, పంచభూతాలకు దైవత్వం ఆపాదించి పూజిస్తూ ఉంటామనుకుంటా. అవన్నీ మనకు నిరంతరం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాయి తప్ప మన్నుంచి ఏమీ ఆశించవు.
మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ తల్లీ, తండ్రి, గురువులను కూడా దైవ సమానులు గా ఎందుకు భావిస్తామో గురూజీ ఉదాహరణలతో మరింతగా అర్థమయింది. అయితే అతిథి దేవో భవ అని కూడా అన్నారుగా.. బహుశా అతిథి కూడా ఏమీ ఆశించకుండా ఏం పెడితే అది తినాలని కాబోలు. మనుషుల తత్త్వం ఒకటి చేసి మరొకటి ఆశించడం అని, దానవుల పని లాక్కూపోయి ఏమీ ఇవ్వక పోవడం అని ఎంత సింపుల్ గా తేల్చేసారో.
ఇక్కడ గురూజీ, తల్లి బిడ్డతో ‘నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసాను, నీ కోసం ఇంత చేసాను, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావని అడగనంతవరకే ఆమెకు దైవత్వం ఉంటుందనడం. చాలా ఔచిత్యం గా ఉంది. ఇలా ఏమీ ఆశించకుండా ఉండే తత్వం గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మా అబ్బాయి నటించిన ఒక సినిమా కోసం రాసిన చాలా ప్రాచుర్యం పొందిన పాటలో కొన్ని పంక్తులున్నాయి.. మీరు వినే ఉంటారనుకుంటాను.
“పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..”
గురూజీ తను ప్రత్యక్షం గా చూసిన తన ఊరి నాటు వైద్యుడి వినయాన్ని, సరళత్వాన్ని గురించి చెప్తూ మన పూర్వీకుల విద్యలో ‘శీల, సమాధి, ప్రజ్ఞలు’ ముఖ్యమైనవన్నారు. నిజంగా ఆ లక్షణాలు ఎంత అవసరం. పశువుల డాక్టర్ నలుగురు మనుషులు లేరని చేతులు కడుక్కుని, టీ తాగి వెళ్ళిపోతే, ఆ వృద్ధ వైద్యుడు మాత్రం వైద్యం చేసి, ‘ఇప్పుడే ఒక ప్రాణానికి చికిత్స చేశాను కదా, నా ధర్మం ప్రకారం నేనేమీ ఆశించకూడదు, తీసుకోకూడదు’ అని అన్నం కూడా తినకుండా, కలెక్టరుగారి బండిని కూడా తిరస్కరించి నడుచుకుంటూ వెళ్ళిపోవడం లాంటి సంఘటనలు గురూజీ చెబుతుంటే ఒళ్ళంతా ఏదో ఒక ఆశ్చర్యానందానుభూతి కలిగింది.
అలాగే సన్న్యాసం తీసుకోబోయే వ్యక్తి ఊరిలోని వృత్తిపనివారందరి ఇళ్ళకూ వెళ్ళి, ‘నా వల్ల సమాజానికి కొంత ఆర్థిక, వృత్తిపరమైన నష్టం జరగవచ్చు, నన్ను క్షమించండి’ అని వేడుకునే సాంప్రదాయం.. ఇవన్నీ ఎప్పుడు, ఎలా అంతరించిపోయాయో.. ఇంక రథోత్సవంలో ఊళ్ళో అన్ని వృత్తులవారినీ సమానంగా గౌరవించడం గురించి చదువుతున్నప్పుడు… వాల్ట్ విట్మన్ (Walt Whitman) తన ప్రసిద్ధ కవిత ‘I Hear America Singing’ లో —”The carpenter singing his as he measures his plank or beam, The mason singing his as he makes ready for work, or leaves off work…” అంటూ ప్రతి వృత్తికారుడి శ్రమను దైవికమైన సంగీతంగా, సామాన్య శ్రామిక వర్గాన్ని, సమాజాన్ని దైవంగా భావించి కీర్తించిన పంక్తులు గుర్తొచ్చాయి.
మీరు తెలుగులోకి ‘ఆత్మోత్సవ గీతం ‘ పేరుతో అనువదించిన వాల్ట్ విట్మ న్ ‘Song of Myself’ లో కూడా సమాజంలో అట్టడుగున శ్రమించే ప్రతి ఒక్క వృత్తికారుడిని కూడా దైవ స్వరూపులుగా భావిస్తూ ఇలా అంటాడు
“The boatman and hatter and wood-cutter share my love and interest,
The plowman in the field, the driver of the wagon, the sweeper in the street…. The black-smith with grimed and hairy chest, the anvil with its ring…” అంటూ ఆ కమ్మరి శ్రమను, కొలిమి శబ్దాన్ని కూడా అద్భుతంగా స్తుతించారు. ఆయా వృత్తుల శ్రమను, వారి నైపుణ్యాన్ని అంతలా గౌరవించే సంస్కృతి మన గ్రామీణ వ్యవస్థలో ఎప్పటినుంచో ఇలా ఒక జీవన విధానంగా ఉందనే విషయాన్ని గురూజీ చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉంది.
ఒకప్పుడు వెదురు పనిచేసేవాడికి, చర్మకారుడికి ఇలా రకరకాల వృత్తుల్లో నిపుణులకు తమ వృత్తికి సంబంధించిన సైన్స్, ఇంజనీరింగ్, జ్యోతిష్యం, వైద్యం అన్నీ తమ ఇంట్లోనే సహజంగా తెలిసి ఉండేవన్న సంగతి గురూజీ చెబుతుంటే నాకంత ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కి మా ఊరెళ్ళినప్పుడు మా ఊళ్ళో అనేక వృత్తుల్లో ఉన్న అలాంటి చాలా మందిని చూసాను.
ఈ సంభాషణలో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏమిటంటే బస్తర్ లోని ఘోటుల్ (Ghotul) వంటి విద్యావ్యవస్థల్లో ఆడ పిల్లలు , మగ పిల్లలు కలసి బతుకు తెరువును, సామాజిక జీవనాన్ని, ఇల్లు కట్టుకోవడాన్ని ఎంతో సులభంగా, ఒకరికొకరు తోడుగా ఉంటూ నేర్చుకునేవారన్న సంగతి. ఘోటుల్ వ్యవస్థ గురించి ఇంటర్నెట్ లో కొంచెం పరిశోధించి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నా
ప్రముఖ బ్రిటీష్-భారతీయ మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ (Verrier Elwin) 1935 నుండి 1942 మధ్య కాలంలో బస్తర్ ప్రాంతంలోని దాదాపు 347 ఘోటుల్‌లను స్వయంగా సందర్శించారట. ఆయన తన సుదీర్ఘ పరిశోధనలను “ది మురియా అండ్ దేర్ ఘోటుల్” (The Muria and their Ghotul – 1947) అనే ప్రసిద్ధ గ్రంథంలో పొందుపరిచారు. ఘోటుల్‌ను ఆయన కేవలం ఒక గిరిజన నివాసంగా కాకుండా, ఒక ‘గిరిజన విశ్వవిద్యాలయం’ (Tribal University) గా పరిగణించారనీ, “ఆధునిక సమాజం సంస్కారం, క్రమశిక్షణ అని దేన్నైతే పిలుస్తుందో, వాటన్నింటినీ ఏ చదువు రాని గిరిజన యువతకు వారి సొంత పద్ధతుల్లో అత్యంత సహజంగా నేర్పించే ఒక అద్భుతమైన విద్యాసంస్థే ఘోటుల్” అని ప్రశంసించారనీ తెలుసుకుంటే ఆహా ఏమి మా భారతీయ గ్రామీణ సంస్కృతి అనిపించింది.
వేదం గాని, వృత్తిపని గాని “ఎవరి దగ్గరో చదివాం” అని కాకుండా “అతనితో కలిసి చదివాం, కలిసి నేర్చుకున్నాం” అని చివర్లో గురూజీ అన్నట్టు ఆయన సంభాషణలు మీనుంచి మేము వింటున్నట్టు కాకుండా మీతో పాటే మేమూ వింటున్న అనుభూతి మాకు కలిగిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు భద్రుడు గారు.
తెల్లవారుజామున సగం నిద్రలో ఈ స్పందన చదివాను. చూడబోతే గురూజీ మీతోటే నేరుగా మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి వృత్తి కళాకారుడు తన వృత్తికి సంబంధించిన ఇంజనీరింగ్, వైద్యం, అర్థశాస్త్రం, ప్రకృతి జ్ఞానం, మార్కెటింగ్, ఇవన్నీ సహజంగానే నేర్చుకునేవాడని గురూజీ చెప్పిన విషయం చదివితే ఎంత సహజంగా మన పాతకాలపు విద్యా వ్యవస్థ వారి జీవితంలో integrated గా నడిచిందో తెలుస్తుంది.
“ఎంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా అంత సరళంగా ఎలా జీవించగలిగారు?” అన్న ప్రశ్న, సమాధానం గా గురూజీ చెప్పిన నాటు వైద్యుడి ఉదాహరణల్లో అద్భుతంగా కనిపించింది. విద్య knowledge and skill building మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని మలిచిన ఒకnatural process గా మన పూర్వీకులు మలుచుకున్నారనిపిస్తుంది.
అలాగే ప్రతి పిల్లవాడి గ్రహణశక్తి వేరు అనే గురూజీ examples తో చెప్పిన విషయాలు కూడా చాలా contemporary గా. ఒకరిని మరొకరితో పోల్చకుండా, ఎవరి ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా నేర్పే విధానం ఆ కాలపు విద్య ఎంత sophisticated గా వుండిందని ఆశ్చర్యం వేస్తుంది.
We lost this somewhere along the way and measured every child with the same scale regardless of their natural ability. Today’s educationalists are discussing different learning styles again for different children and this is a welcome conversation.
This part is aptly titled “ప్రతి ఒక్క వృత్తికారుడూ ఒక సంపూర్ణ విద్యావంతుడు”
Thank you Sir 🙏🏽
Vijay sir’s insights are an added bonus. 🙏🏽