
మానవసంబంధాల్లోని, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లోని సంక్లిష్టతల్ని తెలుగు కవిత్వం ఎక్కువగా పట్టుకోలేకపోయిందని అనుకుంటాను. ఆ పని కథకి వదిలిపెట్టింది. తెలుగు కవిత్వంలో అయితే పూర్తి అలౌకిక ప్రేమకవిత్వం భావకవిత్వంలోలాగా. లేదా నాజూకైన ప్రేమ కవిత్వం. స్త్రీపురుషుల మధ్య వికసించే ప్రేమలోని సౌందర్యమయ, కాంక్షామయ, బీభత్సమయ పార్శ్వాల్ని కవిత్వంగా మలిచిన కవులు తెలుగులో చాలా తక్కువ. అటువంటి కవితలు కూడా వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ సంపుటంలో దాదాపు మూడవ వంతు కవితలు అటువంటి సంక్లిష్టమయ ప్రేమానుభవానికి అక్షరరూపం ఇవ్వడానికి ప్రయత్నించిన కవితలు. ఆ తరువాత మళ్ళా పునర్యానంలో ఒక అధ్యాయం, నీటిరంగుల చిత్రంలో ఒక అధ్యాయం అటువంటి ప్రేమ కవిత్వానికి కేటాయించాను. ఆ కవితలమీద ఎవరూ దృష్టి పెట్టినట్టులేదు, వాటిగురించి మాటాడింది కూడా లేదు.
అటువంటి కవితల్లో నబకోవ్ రాసిన ‘లొలిత’ నవల చదివినప్పటి నా అనుభూతిని ఇలా రాసిన ‘లోలిత’ కవిత కూడా ఒకటి:
లోలిత
తామరతూడులు ఆ బాహువులు నా బాహువుల్లో
ఆ ఆంతరంగిక విషాదాగ్ని నా ప్రచండదేహమండలమంతటా
ఆ చంచల నేత్రాలు
ఆ పవిత్ర మోహవీక్షణాలు..
ప్రేమించడమంటే బలంగా కావిలించుకుని చంపుకోవడం.
అశ్లీలమైన ఆ దివ్య ఊరువుల మధ్య వర్షించే నిష్కళంక దయావృష్టిలో
అల్లిబిల్లిగా అల్లుకున్న ప్రాచీన కేశతమస్సు
నీ వేళ్ళ రహస్యమధురోష్ణతలో
గిగిలగిలలాడే ఆ సీతాకోక చిలుక ఒణుకులో
స్పర్శ ఒక ఆరని జ్వాల.
ప్రేమించడమంటే వేళ్ళకొసల్తో స్వర్గాన్ని తాకి చూడటం.
పాలుగారే చెక్కిళ్ళు, పసినేత్రాలు
నీవు ప్రేమించిన ప్రతి పడతీ నీ తల్లి, నీ తనయ
కనుకనే ఆ లేతరొమ్ముల ఎదట
నీవొక చిన్నబిడ్డగా
నీ బుల్లిపెదవులతో మారాం చేస్తావు.
వివిక్త ప్రసన్న్నంగా ఆ నా బంగారు తల్లి నిన్ను దయతలచగా
ఆమెను నిలువెల్లా హత్య చేసి నువ్వు పునరుజ్జీవిస్తావు. ..
ప్రేమించడమంటే ఎంతో పుణ్యం చేసుకున్న ఒకే ఒక్క పాపం.
(వ్లదిమీర్ నబకొవ్ ‘లోలిత’ ను స్మరిస్తూ)
1991
LOLITA
Those lotus stalk arms are entwined in mine.
That inner fire of misery spreads my entire being
Those restless eyes and those lustful, sacred looks…
Love means killing each other with a deep embrace.
Streams of taintless mercy flow forth from holy profane thighs.
Primordial darkness engulfs the hair there.
In the sweet-ardour of your fingertips, the butterfly quivers.
Touch is a flame that never burns out.
To love is to touch heaven with your fingertips.
The pink cheeks, childlike eyes
Whenever you loved a girl, she became your mother and daughter.
You insist, like a child, on touching her tender breasts with your tiny lips.
When the divine child reveals her grace only to you,
It is as if you kill her, and then resurrect yourself.
To love is to commit the one and only pious sin.
(Remembering Lolita of Vladimir Nabokov)
16-8-2022