శాఫోకి ఉత్తరాలు

శాఫో  గ్రీసు చరిత్రలో ప్రాచీన యుగానికి చెందిన కవయిత్రి. క్రీ.పూ.630-570 మధ్యకాలంలో జీవించిన ఆమె అటు హోమరీయ యుగానికీ, ఇటు గ్రీసు చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణించే అయిదో శతాబ్దానికీ మధ్యకాలానికి చెందింది. ఆమె గురించి తలుచుకోగానే అయిదు అంశాలు స్ఫురిస్తాయి.

మొదటిది, ఆమె కవయిత్రి. అంత ప్రాచీన కాలానికి చెందిన కవయిత్రులెవరూ మనకి చరిత్రలో కనిపించరు. ఋగ్వేదకాలానికి చెందిన కొందరు ఋషులు స్త్రీలు లేకపోలేదుగానీ, వారు మంత్రద్రష్టలు. తమని తాము కవులుగా చెప్పుకున్నవారు కారు. కానీ దాదాపు పదివేల పంక్తుల మేరకు తొమ్మిది పుస్తకాల్లో గ్రంథస్తమైన ఆమె కవిత్వంలో ఇప్పుడు మనకి మిగిలినవి ఆరేడువందల పంక్తులు మాత్రమే. ఇప్పటికి దొరికిన సుమారు రెండువందల శకలాల్లో, పూర్తి గీతం ఒక్కటే దొరికింది. అసంపూర్ణ గీతాలు మూడు దొరికాయి. తక్కినవన్నీ ఒకటీ లేదా రెండు పంక్తులు, ఒకటి లేదా రెండు పదాలు. అంటే ఆమె మొత్తం కవిత్వంలో మూడు నుంచి ఏడు శాతం మాత్రమే, అది కూడా శకలాలు శకలాలుగా లభ్యమవుతూ ఉంది.

ఈ fragmentariness ఆమె కవిత్వంలో ఏకకాలంలో మనల్ని ఆకర్షించే అంశమూ, అస్థిమితానికి లోను చేసే అంశమూ కూడా. గత రెండుమూడు వందల ఏళ్ళుగా ఆ శకలాల్నే ఎందరో కవులు అనువదిస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా గత శతాబ్ది మధ్యకాలం నుండీ, మరీ ముఖ్యంగా, ఇరవై ఒకటో శతాబ్ది  మొదలయ్యాక, ఆ శకలాల ఆధారంగానే ఎంతో పరిశోధన, ఎన్నో వాదోపవాదాలు, ఎంతో ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ శకలాలు వాటికవే గొప్ప ఆకర్షణ. ఎందుకంటే పూర్తి కావ్యం చదివినప్పుడు, శ్రోత లేదా పాఠకుడు ఒక passive spectator గా మాత్రమే ఉంటాడు. శకలాలు చదివినప్పుడు, పాఠకుడు ఒక collaborator గా మారతాడు. ఆ ఖాళీల మధ్య ఉన్న మౌనాన్ని, తన అనుభూతితో పూరించుకునే ప్రయత్నం చేస్తాడు.

రెండో అంశం, ఆమె కవిత్వం, హోమరీయ కవిత్వానికన్నా పూర్తిగా భిన్నమైంది. హోమర్, హెసియోద్ వంటి కవులు జాతి, రాజ్యం, యుద్ధం, కుటుంబం, విధ్వంసం, పగ, ప్రతీకారం, సామాజిక సంబంధాలు వంటి అంశాల మీద ఐతిహాసిక కవిత్వాన్ని నిర్మించారు. కాని గ్రీకు చరిత్రలో archaic  అని పిలిచే తదనంతర కాలానికి చెందిన అల్కేయస్, ఆర్కిలోకస్, శాఫో వంటి కవులు మొదటిసారిగా వ్యక్తి అనుభవాన్నీ, వ్యక్తి అనుభూతినీ, వ్యక్తుల అంతరంగాన్నీ, తమ రహస్య, ప్రత్యేక, నిర్దిష్ట ఆకాంక్షల్నీ, ఆశాభంగాల్నీ కవిత్వంగా రాయడం మొదలుపెట్టారు. గ్రీకు లాక్షణిక కారులు మొదటి తరహా కవిత్వాన్ని epic అనీ, రెండో తరహా కవిత్వాన్ని lyric  అనీ అన్నారు. లిరిక్ అంటే lyre అనే తంత్రీ వాద్యానికి అనుగుణంగా గానం చేసే కవిత్వం. దానికి శాఫోనే ఆద్యురాలు అని చెప్తారు. ఇక epic తరహా, lyric తరహా రెండు కవిత్వాలూ drama లో కలిసి కనిపిస్తాయి. తదనంతర ఐరోపీయ కవిత్వాన్నీ, ఆధునిక ప్రపంచ కవిత్వాన్నీ ఈ మూడు ధోరణులూ గాఢాతిగాఢంగా ప్రభావితం చేసాయి. కాబట్టి ఒక విధంగా ఈరోజు ప్రపంచంలో కవిత్వం రాస్తున్న ప్రతి ఒక్క కవీ, హోమర్ కి ఎంత ఋణపడి ఉంటాడో, శాఫోకీ అంతే ఋణపడి ఉంటాడు.

మూడో అంశం, శాఫో తన కవిత్వంలో ప్రేమ, మనుషులు దేహాల ద్వారా ప్రకటించే భావోద్వేగాలు, ప్రేమికులు తాము ప్రేమించినవారి సాంగత్యాన్నీ, వారు పక్కనలేకపోవడాన్నీ రెండింటినీ తీవ్రంగా అనుభూతి చెందటాన్నీ చిత్రించినప్పటికీ, అందులో ముఖ్యంగా స్త్రీలు స్త్రీల పట్ల చూపించే భావోద్వేగాలకి పెద్దపీట వేసినందువల్ల, ఆమె  కవిత్వం తర్వాతి కాలంలో, ముఖ్యంగా మధ్యయుగాల యూరోపులో నిరాదరణకీ, అవజ్ఞకీ గురయ్యింది. ఎంత నిరాదరణకి గురి కాకపోయుంటే, ప్రాచీన కవులు అంతగా ప్రస్తుతించిన ఆ కవిత్వం మనకి లభ్యం కాకుండా పోతుంది! హోమర్ రెండు ఇతిహాసాల్తో పాటు గీతాల్నీ, ప్లేటో, అరిస్టాటిల్ రచనల్నీ భద్రపరిచిన ప్రపంచానికి శాఫో తొమ్మిది పుస్తకాల్నీ భద్రపరచడం నిజంగా అసాధ్యమా? అయితే గత శతాబ్దం నుంచీ ఫెమినిస్టు దృక్పథాలు బలపడుతున్నకొద్దీ, ఆమె పేరుమీదా, ఆమె పుట్టిపెరిగిన ప్రాంతం మీదా నిందార్థకంగా ఏర్పడ్డ Sapphic, Lesbian అనే పదాలు నేడు కొత్త గౌరవానికీ, కొత్త చూపుకీ నోచుకుంటున్నాయి.

నాలుగో అంశం, ఆమె జీవితచరిత్రలోని ఒక ముఖ్యమైన ఘట్టం. అదేమంటే, ఆమె కొంతకాలం తన జన్మభూమికి, అంటే లెస్బోస్ ద్వీపానికీ, తాను పెరిగిన మిటిలేనీ నగరానికీ దూరంగా సిసిలీలోని సిరక్యూజ్ నగరంలో తలదాచుకోవలసి వచ్చింది. కాని అక్కడి పౌరులు ఆమెని ఆదరించి, తర్వాత రోజుల్లో ఆమె గౌరవార్థం ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారని చెప్తారు. కాబట్టి, తన జీవితకాలంలో రాజకీయ కారణాలవల్ల ప్రవాసానికి పోవలసి వచ్చిన మొదటి కవి కూడా శాఫోనే.  అలాగని ఈ ప్రవాసం లో ఉన్నది కేవలం ఒకచోటునుంచి మరో చోటుకి వెళ్ళడం కాదు. అది ఉష్ణమండల వాతావరణంలో పూలు పూచే తీగని ధ్రువప్రాంతాలకు తీసుకుపోయినట్టు. అందులోనూ అటువంటి ప్రవాసి కవి అయితే, ఆ వేదన చెప్పనలవి కానిది. తన మూలాలనుంచి దూరమైన ప్రతి ఒక్క భావుకుడికీ శాఫో ప్రవాసంలో తనదైన వేదన ఎంతో కొంత కనిపిస్తుంది.

అయిదో అంశం, మరింత లోతైనది. ఇప్పటిదాకా పాశ్చాత్య నాగరికతకీ, తాత్త్వికతకీ ఆధారస్తంభాలుగా గౌరవానికి నోచుకున్న గ్రీకు తత్త్వవేత్తలు సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ లు తమ తాత్త్విక ప్రపంచంలో స్త్రీలకి చోటులేకుండా చేసారనే ఒక మెలకువ. మొత్తం పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి ఆధారశిలగా పరిగణించే ప్లేటో సంభాషణలు ఎంతసేపూ గ్రీకు నాగరిక, విద్యాధిక, పురుష ప్రపంచానికి మాత్రమే చెందినవనీ, అందులో స్త్రీలకీ, బానిసలకీ, పనివాళ్ళకీ, విదేశీయులకీ చోటులేదనీ ఆధునికానంతర రచయితలు గుర్తుపట్టారు. ఆధునికానంతర పరిభాషలో చెప్పాలంటే అందులో other కి చోటులేదు.  ప్లేటో నిర్మించిన విశ్వంలో స్త్రీహృదయానికి తావులేదు. కాని  ప్లేటో నిర్మించిన ఆ కట్టడంలో కన్నా శాఫో పదిలంగా అల్లుకున్న పొదరింటి గడ్డిపోచల్లోనే మనకి ఒక ఆశ్రయానికి ఇప్పుడు ఆధారం దొరుకుతున్నది.  కాబట్టి ప్లేటోతో మొదలైన ఏకపక్ష పాశ్చాత్య విశ్వానికి ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నప్పుడు శాఫో కవిత్వం ఆ other కి ఒక ప్రతీకగా, ఒక నిరంతర మానవీయ సుజల స్రవంతిగా కనిపిస్తున్నది.

ఇలా ఆధునికానంతర చింతకులు ఒక ప్రత్యామ్నాయ చరిత్రను నిర్మించడానికి తన శకలాల్ని అందిస్తున్న శాఫో అదేకాలంలో, చరిత్ర సరిహద్దుల్ని దాటిన, స్త్రీపురుష భేదాల్ని దాటిన, పాశ్చాత్య, ప్రాచ్య సంస్కృతుల్ని దాటిన ఒక రసమయ ప్రపంచానికి కూడా సదా తలుపులు తెరిచి ఉంచుతున్నది. కాబట్టే, ఎప్పుడో 2600 ఏళ్ళ కింద ఎక్కడో లెస్బోస్ లో జీవించిన శాఫో ఇక్కడ నన్ను కూడా స్పందింపచేస్తూ ఉన్నది.

ఆమె కవిత్వానికి  Anne Carson చేసిన అనువాదం  If Not, Winter (2002) ఇరవయి ఏళ్ళ కిందట  చదివినప్పుడు ఆ కవిత్వం, ముఖ్యంగా, ఆ శకలాల్లోని ellipses నన్ను ఎంత అస్థిమిత పరిచాయంటే నాకు వెంటనే శాఫోకి ఉత్తరాలు రాయాలనిపించింది. మొదట్లో ఒక అస్పష్టమైన తలపుగా ఉన్నది కాస్తా, ఆ కోరిక, ఏళ్ళు గడిచేకొద్దీ మరింతబలపడుతూ వచ్చింది. మూడేళ్ళ కిందట, Aaron Poochigian చేసిన అనువాదం  Sappho, Stung with Love: Poems and Fragments (2015) చదివాక శాఫో జీవితం ఆధారంగా ఒక నవల రాద్దామనిపించింది. అందుకని ఈ మూడేళ్ళుగానూ శాఫో గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆమె గురించి మరింత తెలుసుకుంటూనే ఉన్నాను. ఆమె గురించిన ఎన్నో పరిశోధనలు తిరగేస్తూనే ఉన్నాను.

కాని, ఇప్పుడు ఆమె మీద నవల రాయడం కన్నా, ఆమెకి ఉత్తరాలు రాయాలనే బలంగా అనిపిస్తున్నది. రేపటినుంచీ ఆమెకి  పోస్టు చేయబోతున్న ఉత్తరాలు మీవి కూడా అని అనుకుంటున్నాను. అందుకని co-correspondents గా మిమ్మల్ని కూడా ఈ epistolary conversation కి ఆహ్వానిస్తున్నాను.


Featured image: The Time of Sappho, by John William Godward, 1904, courtesy: wikimediacommons

17-4-2026

18 Replies to “శాఫోకి ఉత్తరాలు”

  1. మీరు రాయబోయే ఉత్తరాలకు నాందీ ప్రస్తావనగా శాఫో కాలం , వ్యవస్థ, అవస్థ మొదలైన అంశాలు చాల స్పష్టంగా తెలియజేసారు. ఎంతో అధ్యయన స్ఫూర్తి ఉంటే గాని ఇంత చక్కని వ్యాసం వెలువడదు . అది మీకు వెన్నతో పెట్టిన విద్య.

  2. ఎదురు చూస్తూ ఉంటాను. నమస్సులు

  3. తెలుగులో సాహిత్యలోకంలో మీరు మాత్రమే చేయగల, చేస్తున్న గొప్ప సాహిత్య కృషి సర్ ఇది.
    ప్రతీ తెలుగు పాఠకుడూ విద్యార్థి లా మారిపోతారు ఇక్కడ. 💐🙏

    శాపో కి రాసే ఉత్తరాలు చదవడం ఎంత అదృష్టమో…

  4. మీరు వ్రాసే ప్రతి అక్షరం మాకు కూడా చేరుతుంది అన్నయ్య

  5. ఆహా మరో కొత్త కవితా ప్రపంచం లోకి వేలు పట్టి నడిపించి తీసుకెళ్లి మరీ వివరించబోతున్నారన్న మాట.. ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తాం..

  6. Wow, Anne Carson పేరు చూడగానే మిమ్మల్ని తల్చుకుని ఇటు వస్తున్నాను. What a lovely co incidence.. మీరు ఇరవయ్యేళ్ల క్రితం చదివిన పుస్తకాన్ని, ఉత్తరాలు రాయాలన్న తలంపుని ఈ ఏడు తీర్చుకున్నారు. And.. Anne gets Nobel this year … Can’t wait to read your note on her poetry tomorrow ❤️❤️..రాస్తున్నారు కదా 😊

    Congratulations to the fantastic reader in you and thank you so much for writing for us ❤️

  7. A few lines of the poetry of Anne Carson

    “It’s good to be neuter.
    I want to have meaningless legs.
    There are things unbearable.
    One can evade them a long time.
    Then you die.”

    “My personal poetry is a failure.
    I do not want to be a person.
    I want to be unbearable.
    Lover to lover, the greenness of love.
    Cool, cooling.
    Earth bears no such plant.
    Who does not end up a female impersonator?
    Drink all the sex there is.
    Still die.
    I tempt you.
    I blush.
    There are things unbearable.
    Legs, alas. Legs die.
    Rocking themselves down,
    crazy slow,”

    It is beyond my comprehension whether this can be called poetry.

    (Excerpt taken from web for review purpose.)

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading