మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-18

Mahatma Gandhi, drawn by Frieda Hauswirth. Charcoal on paper, 45.5 x 38.5 cm 18-12-1927, Cuttack

ఎట్టకేలకు నా చిత్రం పూర్తయింది. అది అందరి చేతులూ మారి గాంధీ చేతికి చేరింది. ఆయన దాన్ని చూశారు; కాస్త బిడియపడ్డారని నాకు అనిపించింది (ఆయన ఎన్నడూ అద్దం చూసుకోరు, ఆయనలో ఏ కోశానా గర్వం లేదు); తర్వాత నా వైపు తిరిగి, ‘నన్ను ఇన్ని గుడ్డల్తో ఎందుకు కప్పేసావు?’ అనడిగారు.

‘గాంధీజీ, ఆ శాలువా మీరప్పుడు వేసుకునే ఉన్నారు!’ అన్నాను. (ఉదయం వేసుకున్న ఆ వెచ్చని దుస్తులు ఆయనప్పటికే తీసేశారు). పక్కనే ఉన్న మీరాబెన్ వైపు ఆయన అనుమానంగా చూశారు, ఆమె నా మాటే నిజమని ధ్రువీకరించారు. చలిగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు అదనపు దుస్తులు కప్పుకున్నారన్న సంగతి కూడా ఆయనకు సరిగ్గా గుర్తులేదని నాకనిపించింది; అనుకోకుండా కప్పుకున్న ఆ వస్త్రాలు చిత్రంలో చాలా ఆడంబరంగా ఉన్నాయని ఆయన భావించారు. కానీ దాని గురించి మరింత చర్చించే ఆసక్తి మటుకు ఆయనకు లేకపోయింది.

దానికి బదులుగా, ఆయన కాసేపు నాతో మాట్లాడారు; నా వివాహం గురించీ, ఒరిస్సా అటవీ ప్రాంతాల్లో నా భర్త చేస్తున్న శాస్త్రీయ వ్యవసాయ ప్రయోగాల గురించీ తెలుస్కోడానికి ఎంతో ఆసక్తి చూపించారు. వాటిగురించి ఎన్నో నిశితమైన ప్రశ్నలడిగారు. ఆ తర్వాత ఆయన కోసం నేను ‘ఏదైనా’ చేస్తానన్న నా వాగ్దానం సరదాగా గుర్తుచేశారు; వెంటనే నూలు వడకడం గురించి మా మధ్య సుదీర్ఘ చర్చ మొదలైంది.

నేను నూలు వడుకుతానా అనడిగారు. బొమ్మ గీయడానికి విరామం దొరికిన సమయాల్లో కదురుతో ఏకుల్తో నేను కాలక్షేపం చేశానని ఆయనకెవరో చెప్పారు. దేశాయ్ నాకు నేర్పడానికి ప్రయత్నించారు కానీ నేనో మొద్దుని.

‘లేదు గాంధీజీ, ఒక సిద్ధాంతంగా నేను దీన్ని నమ్మడం లేదు కాబట్టి నూలు వడకలేను’ అన్నాను. ‘కానీ అన్ని జాతులకూ, అన్ని దేశాలకూ స్వేచ్ఛ ఉండాలన్న ప్రాథమిక భావననైతే నువ్వు నమ్ముతావు కదా’ అన్నారు. అలాంటప్పుడు, కనీసం ఒక ప్రతీకగానైనా పూర్తిగా ఖద్దరు బట్టలే వాడవచ్చు కదా అని అడిగారు.

‘లేదు, ఆ వాగ్దానం కూడా నేను చేయలేను, ఎందుకంటే విదేశీ వస్త్రాలపట్ల వివక్ష చూపడానికి నా దగ్గర కారణమేమీ లేదు. అయితే రాజకీయ కారణాల వల్ల కాకపోయినా, అందమైన అద్దకం నమూనాలు నా కళాదృష్టిని ఆకట్టుకున్నందున నేను చాలావరకు ఖద్దరే వాడుతున్నాను’ అన్నాను.

గాంధీ కళ్లల్లో క్షణకాలం వేదనా, నిరాశా మెరిశాయి; ఆయన దృష్టిలో చేనేతకు ప్రగాఢమైన ఆర్థిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది; ఎవరైనా దాన్ని కేవలం కళాత్మక దృష్టితో మాత్రమే చూడటం ఆయనకు పైపై వ్యవహారంగా, బాధ్యతారాహిత్యంగా అనిపించి ఉండవచ్చు. ప్రగాఢ విశ్వాసాలూ, ధైర్యమూ లోపించడం గురించీ—భారతదేశంలో అలాంటి స్ఫూర్తి కరువవుతోందని విచారిస్తూనూ ఆయన మాట్లాడారు.

మా చర్చ ఒక విధమైన విషాదంతో ముగిసింది; నాలో ఒక విచిత్రమైన అసంతృప్తి మిగిలింది. మేధాపరంగా ఆయన ఆర్థిక ప్రణాళిక నన్ను ఆకట్టుకోలేకపోయింది; ఆధ్యాత్మికంగా ఆయన నాకంటే ఎన్నో లోకాల ఎత్తులో ఉన్నారనిపించింది. సముద్రపు అలలు కొండ అంచుల్ని తాకి ముందుకు సాగిపోయినట్టు, నేనూ ఈ భౌతిక పురోగతి ప్రపంచమూ ఆయనను దాటి వెళ్లిపోతున్నామనిపించింది; సూర్యకాంతిలో అలలు ఒక్క క్షణం మెరిసి శాశ్వతంగా అంతరించిపోతాయి, కానీ ఆ కొండ మాత్రం ఎప్పటికీ నిశ్చలంగా, ప్రశాంతంగా నిలిచే ఉంటుంది.

ఆ రోజు సాయంత్రం చీకటి పడ్డాక, తలుపులు గట్టిగా మూసిన బండ్లు కొన్ని గాంధీ బస చేసిన పెద్ద ప్రాంగణంలోకి వచ్చాయి; బోయీలు లయబద్ధంగా పాటలు పాడుతూ పరదాలు కట్టిన పల్లకీల్ని లోపలికి మోసుకొచ్చారు; ఆ వాహనాల్లోంచి స్త్రీలు దిగారు; తలలు వంచి, ముసుగులు బిగించి, కాళ్ల కడియాలూ చేతి గాజులూ సవ్వడి చేస్తుండగా బయటి గదుల్లో ఉన్న మగవాళ్ల గుంపును దాటుకుంటూ మెట్లెక్కి మీదకు వెళ్లిపోయారు. ఎంతోమంది మగవాళ్లు గుమిగూడిన ఒక ఇంటికి ఇలా ముసుగులు ధరించి రావడం కూడా వారికి ఒక పెద్ద సాహసమే, ఒక నూతన విప్లవమే; ఆ క్షణంలో వారి గుండెలు ఎంతో సంకోచంతో కొట్టుకున్నాయి.

కానీ ఆ మహానుభావుడి దర్శనం కోసమూ, ఆయన దివ్య స్వరాన్ని వినడం కోసమూ మాత్రమే కటక్‌కు చెందిన ఆ మహిళలు పరదా సంప్రదాయపు కథోరమైన కట్టుబాట్లు తెంచుకుని వచ్చారు. వందమందికి పైగా స్త్రీలు ఆ డాబామీద సమావేశమయ్యారు; ఆ వెన్నెల వెలుగులో తమ ముఖాలమీది ముసుగులు తొలగించి,వారు ఆ మహాత్ముని అమృతవాక్కులు ఎంతో ఏకాగ్రతతో విన్నారు—ఒక పరాయి మగవాడి ముందు తమ ముఖాన్ని చూపించడం వారిలో చాలామందికి జీవితంలో అదే మొదటిసారి! మహాత్మాజీ ప్రభావం అలాంటిది; శతాబ్దాలుగా మూతపడి ఉన్న తలుపులను ఆయన తెరిపిస్తారు. ఒక తండ్రిలా మందలిస్తూ, ప్రోత్సహిస్తూ, హితవు పలుకుతూ ఆయన వారితో మాట్లాడారు; పాత సంప్రదాయాల్నీ, కట్టుబాట్లనీ, స్తబ్దతనీ విదిలించి పారెయ్యమనీ, తమ నాలుగు గోడల ఇళ్ల కంటే ఉన్నతమైన గృహం కోసం—భరతమాత కోసం—ఆలోచించమనీ, అనుభూతి చెందమనీ, పనిచేయమనీ వేడుకున్నారు.

తన్మయత్వంతో కూర్చున్న ఈ మహిళల్లో ఎక్కువమంది ఆ రాత్రి గడిచిన తర్వాత, మళ్లీ భయపడుతూ తమ అంతఃపురపు సురక్షితమైన చీకటి గదుల్లోకి జారుకుంటారని నాకు బాగా తెలుసు; కానీ ఆ రాత్రి వారి హృదయాల్లో మీటిన కొత్త తంత్రులు మాత్రం ఇక ఎన్నటికీ మూగబోవు. గాంధీ వాక్కుకున్న మహిమ అలాంటిది.

మేమంతా లేచాం, నేను మరోసారి మహాత్మాజీకి వీడ్కోలు పలికాను; ఏదో ఒక రోజు తన ఆశ్రమానికి రమ్మని ఆయన నన్ను మళ్లీ ఆహ్వానించారు. నేను కృతజ్ఞతలు తెలిపాను, కానీ ఆయన సాన్నిహిత్యం కలిగించిన తీవ్ర స్పృహ వల్ల కాబోలు— అది మాత్రం ఎన్నటికీ జరిగే పనికాదనీ, ఆ మహోన్నత ఆత్మతో నా బంధం అక్కడితో ముగిసిందనీ నా అంతరంగంలో బలంగా అనిపించింది. కానీ వెన్నెల కురుస్తున్న ఆ డాబామీద ఉన్న ముసుగుల స్త్రీల విషయంలో మాత్రం అది నిజం కాదు; వారిలో చాలామంది నాకు పరిచయస్తులే, కొందరైతే సన్నిహితులు కూడా. నా ఏడేళ్ల పరిచయంలో, వారిలో కొందరు సంప్రదాయాలను ఛేదించడానికి వేసిన అడుగులు, మా పాశ్చాత్య స్త్రీలు తమ సొంత సమాజంమీద చూపించవలసిన ధైర్యం కంటే ఎంతో గొప్పవి. నేను దగ్గరున్నా, దూరమున్నా నా ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ వారితోనే ఉంటాయి.

ఈ సంఘటన చూశాక,అసహనంతో ఉండే పాశ్చాత్య ప్రపంచానికి, సంప్రదాయబద్ధమైన ఒక ప్రాచ్య మహిళ ముసుగు తొలగించి బయటకు రావడమంటే ఎంతటి సాహసమో తెలియజెప్పాలని నాకు మరోసారి అనిపించింది. మన పాశ్చాత్యుల్లో ఒకరు వేశ్యావాటికలోకి వెళ్లి, యావత్ ప్రపంచానికి వినబడేలా ‘నేను కూడా ఈ స్త్రీలతో సమానమే!’ అని ప్రకటించడం ఎంతో తీవ్రమైన విషయమో అదంత తీవ్రమైన విషయం!

ఓలివ్ ష్రైనర్ తన అద్భుత స్వప్న వృత్తాంతంలో వర్ణించినట్టు—స్వచ్ఛందంగా మరకలంటిన వస్త్రాలు ధరించి, సమాజం వెలివేసిన తన సోదరిని ఆసరాగా పట్టుకుని భగవంతుని సింహాసనం వైపు సాగే స్త్రీ తాలూకు ధైర్యాన్నీ, ఏకత్వ భావననూ అక్షరాల్లో చిత్రించడం ఒక ఎత్తు; సూర్యుడు కూడా తన ముఖాన్ని చూడలేదన్న మాటే తమకు గొప్ప గర్వకారణమని నమ్ముతూ, తమ తండ్రీ, సోదరుడూ, భర్త తప్ప పరాయి పురుషులెదుట ముఖం చూపేవాళ్లు కేవలం వేశ్యలు మాత్రమేనని నమ్ముతుండే ఒక సంప్రదాయ గృహస్థ మహిళ, వాటన్నింటినీ దాటుకుని బయటకు వచ్చే ధైర్యాన్ని కూడగట్టుకోవడం నిత్య జీవితంలో పూర్తిగా మరొక ఎత్తు!

ఈ అద్భుతాన్ని గాంధీజీ సుసాధ్యం చేస్తున్నారు; స్త్రీల హక్కుల గురించో, స్వేచ్ఛ గురించో, వ్యక్తిగత ఎంపికల గురించో ఉపన్యసించడం ద్వారా కాదు—శతాబ్దాలుగా సేవనూ త్యాగాన్నీ మాత్రమే సౌందర్యంగా నమ్ముకున్న భారతీయ స్త్రీత్వానికి అలాంటి స్వార్థపూరిత భావనలు నచ్చవు; భరతమాత దాస్య విముక్తి అనే ఒక మహోన్నతమైన, నిస్వార్థమైన పరమ లక్ష్యాన్ని వారి ముందుంచడం ద్వారానే ఆయన ఈ మహత్కార్యం సాధిస్తున్నారు.

(అయిపోయింది)

11-10-2026

5 Replies to “మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-18”

  1. చిన్నభద్రుడు గారికి నమస్కారం. అయ్యా, తమరి అన్ని చూసాం చాలా బాగున్నాయి. ఒక్క ఈ దరిద్రుడి గురించి 17 క్షణాలు అన్న దాని గురించి మటుకు నాకు అస్సలు నచ్చలేదు. ఈ దరిద్రుడు చేసినవి అన్నీ మీ కళ్ళకు కనిపించకపోవచ్చు. కానీ వాడు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. నేటి ఈ ప్రపంచంలో ఆధునికమైన ప్రపంచంలో వాస్తవికత అనేది ఎక్కడున్నా కూడా వెతికి వెతికి వెతికి మతి కలుగులో నుంచి ఎలుకను ఎలా పడతారో అట్లా పడుతున్నారు. దయచేసి ఈ దరిద్రుడి గురించి ఇంకా చెప్పి మన భారతదేశాన్ని ఇంకా అగోగతి పాలు చేయడం ప్రయత్నం చేయకండి. ఈ దరిద్రుడి వల్ల ఇప్పటికే దేశం మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా మరి ఈ దరిద్రుడి గురించి మీరు చెప్పకండి దయచేసి. జై హింద్.

    1. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నా బ్లాగ్ చదువుతుండటం నాకు సంతోషమే. కాకపోతే ఈ కాలంలోని చాలామంది భారతీయుల్లానే మీకు కూడా మహాత్ముడి గురించి ఏమీ తెలియదనీ, మీరు చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో, ఆయన నిర్వహించిన పాత్ర గురించి మీకై మీరు తెలుసుకుని ఎటువంటి నిర్ణయానికి రాలేదనీ నాకు అర్థం అవుతోంది. దయచేసి మీ అంతట మీరు మహాత్ముడు తాలూకు పుస్తకాలు స్వయంగా చదివి లేదా ఆయన నిర్వహించిన పాత్ర గురించి సొంతంగా తెలుసుకుని ఒక నిర్ణయానికి రాగలరు.

  2. Freida Hauswirth గీసిన గాంధీజీ రేఖాచిత్రాన్ని చూడటం చాలా బాగుంది. ఆ చిత్రాన్ని చూసి గాంధీజీ చేసిన comment కూడా interesting గా ఉంది.

    గాంధీజీకి చేనేత వెనుక ఉన్న ఆర్థిక, ఆధ్యాత్మిక విలువలు ముఖ్యమైతే, Freida దాన్ని కళాత్మక దృష్టితో చూడటం, గాంధీజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే తన ఆలోచనల దగ్గర రాజీ పడకపోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

    It has been a very enlightening experience revisiting these moments in history, recorded with such honesty by people from different walks of life. They have given us so many interesting insights into the people, society and times they lived in.

    ఇంత విలువైన సంకలనాన్ని గుర్తించి, అనుమతి సంపాదించి, ఇంత engaging గా తెలుగులోకి అనువదించి మాతో పంచుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, Sir. 🙏🏽

    1. మీరు ఈ వ్యాసాలతో కలిసి చాలా దగ్గరగా ప్రయాణిస్తూ మీ స్పందనల్ని ఎప్పటికప్పుడు ఇక్కడ పంచుకుంటూ ఉన్నందువల్ల ఈ వ్యాసాలు మరింత enrich అయ్యాయని నాకు అనిపిస్తున్నది.

  3. There is a tendency especially among some Telugu writers to indulge in excessive praise and hero worship of personalities.

    ” The tendency to over-praise great personalities without objectivity is known as hero worship, hagiography, or the halo effect. This psychological and cultural phenomenon occurs when admiration for an individual’s genuine achievements blinds people to their flaws, mistakes, or systemic advantages.”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading