గిరిజన సాహిత్యం

69

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన, భాషా సాహిత్యాల మీద సాహిత్య అకాడెమీ విశాఖపట్టణంలో 26, 27 వ తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ఒక భాషా ప్రాంతానికి చెందిన గిరిజనుల సాహిత్యం మీద ఒక సదస్సు నిర్వహించడం అకాడెమీ చరిత్రలోనే ఇది మొదటిసారి అని విన్నాను.

ఆ సదస్సులో సమాపన ప్రసంగం చేసే గౌరవం నాకు లభించింది.

ఆచార్య ఎన్.గోపి అధ్యక్షత వహించిన ఆ సమావేశంలో డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాహిత్య అకాడెమీ కార్యదర్శి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ రవిప్రకాష్ కూడా ఉన్నారు.

నా ప్రసంగంలో ప్రధానంగా మూడు విషయాల గురించి మాట్లాడేను.

మొదటిది, గిరిజన సాహిత్యాల గురించిన గోష్టిని సాహిత్య అకాడెమీ తెలుగు ప్రాంతాల నుంచి ప్రారంభించడంలో ఉండే ఔచిత్యం. ఒకప్పుడు కేంబ్రిడ్జిలో పనిచేసిన మతాచార్యుడు, తులనాత్మక మతగ్రంథాల అధ్యయన శీలి అయిన ఎ.సి.బొకే తన సుప్రసిద్ధ రచన Sacred Books of the World (పెలికాన్, 1954) లో ఋగ్వేదం, అవెస్తాల కన్నా, సుమేరియన్, బేబిలోనియన్, ఈజిప్షియన్ ప్రార్థనాగీతాల కన్నా, రెడ్ ఇండియన్ , ఆఫ్రికన్ ఆదిమగీతాలకన్నా కూడా ప్రాచీనమని చెప్పదగ్గ ఒక మంత్రం గురించి పేర్కొన్నాడు. ‘మేమూ తింటాం/నువ్వూ తిను’ అనే ఆ మంత్రం తెలుగు మంత్రం. నల్లమలలో ఉంటున్న చెంచు తెగ ఏదైనా వేటాడినప్పుడో లేదా ఏ కందమూలాలో సేకరించినప్పుడో, ఆ సేకరించిన ఆహారాన్ని సర్వేశ్వరుడిముందు సమర్పించి, అందులోంచి కొంత భాగాన్ని దేవుడికర్పిస్తూ చెప్పే మాట అది. ‘మేమూ తింటాం/నువ్వూ తిను’.

ఆ ఒక్క మంత్రంలో అన్ని వేదవాక్యాల, అన్ని కమ్యునిష్టు మానిఫెస్టో ల సారాంశమంతా ఉంది. అటువంటి పురాతన మంత్రాన్ని ప్రపంచానికి ప్రసాదించిన జాతి చెంచువాళ్ళు, భాష తెలుగు.

కాని అటువంటి సుసంపన్నమైన చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రాల గిరిజనుల గురించి తెలుగు వాళ్ళూ ఏమీ చెప్పుకోలేకపోవడం,వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది కూడా చాలా స్వల్పం కావడం నిజంగా బాధాకరం.

ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సవర పాటల్ని 1911-14 మధ్యకాలంలోనే గిడుగురామ్మూర్తిగారు సేకరించి ప్రచురించిన తర్వాత కూడా, గోండు పాటల్ని వెర్రియర్ ఎల్విన్ ఇంగ్లీషులోకి అనువదించి ప్రకటించిన తరువాత కూడా, గోండుల పురాణమైన జంగుబాయి కథని హైమన్ డార్ఫ్ పూర్తిగా ఇంగ్లీషులోకి అనువదించి తన Rajagonds of Adilabad లో ప్రచురించిన తర్వాత కూడా, చెంచువాళ్ళ కథల్ని తన Chenchus of Hyderabad State లో ప్రచురించిన తర్వాత కూడా, ఈ సాహిత్యాల గురించి తెలుగు సాహిత్యచర్చల్లోగాని, బయట గాని ఎటువంటి ప్రస్తావనా లేకపోవడం విషాదం.

అందువల్లనే, 2002 లో పెంగ్విన్ సంస్థ కోసం భారతీయ గిరిజన సాహిత్యాలనుంచి ఒక సంకలనం చేసిన జి.ఎన్.దెవి తన సంకలనంలో తెలుగు గిరిజనుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సాహిత్య అకాడెమీ ఈ సదస్సు నిర్వహించడం నాకెంతో ఆశావహంగానూ, స్ఫూరిదాయకంగానూ ఉందని చెప్పాను.

language కీ, dialect కీ మధ్య ఉన్న తేడా గురించి చెప్తూ ఒక విద్యావేత్త, a language is a dialect with an army behind it అన్నాడు. ఆ మాట ఇంగ్లీషు, పోర్చుగీసు, స్పానిష్ వంటి వలసరాజ్యాల భాషలకు బాగా వర్తిస్తుంది. కాని నా దృష్టిలో డయలెక్ట్ ని భాష గా మార్చేది కవులూ, రచయితలే. వెయ్యేళ్ళ కిందట, తెలుగు కూడా గోండీ, కొలామీ, కొండ, కుయి స్థాయిలోనే ఉండేది. కాని వెయ్యేళ్ళ కాలంలో తెలుగు ప్రపంచస్థాయి భాషగా మారడం వెనక కవిత్రయాది కవులు, వీరేశలింగం, గురజాడ వంటి వైతాళికులు ఉన్నారు. గిరిజన భాషల్లో కూడా అటువంటి కవులు ఉన్నప్పటికీ, ఆ కవిత్వాలను ఆదరించే సామాజిక-రాజకీయ నిర్మాణాలు లేకపోవడం వల్ల, వాటి వికాసం మందకొడిగా నిలిచిపోయింది.

ఆ వికాసం త్వరితగతిన జరగాలంటే, బయట భాషల్లోంచి రచనలు గిరిజన భాషల్లోకి అనువాదం కావాలి. ఆ భాషల్లోని కవితలు కథలు తెలుగులోకి, ఇతరభాషల్లోకీ ప్రవహించాలి.

నేనా మాట చెప్తూ, కొన్నేళ్ళ కిందట, నల్లమల గిరిజన యువత సేకరించి ప్రచురించిన చెంచుపాటల సంకలనం ‘గిరిగింజ గిరిమల్లెలు’ నుంచి ఒక పాట వినిపించాను. ఆ పాటలోని సాహిత్యమే కాదు, సామాజిక శాస్త్రం గురించి కూడా ఎంత చెప్పుకున్నా తనివితీరదని చెప్పాను. ఆ పుస్తకాన్ని సాహిత్య అకాడెమీ ఇంగ్లీషులోకి అనువదింపచేస్తే బాగుంటుందని చెప్పాను.

గిరిజన భాషా, సాహిత్యాలు వికసించకపోతే తీవ్ర నష్టం వాటిల్లేది విస్తృత సమాజానికే అని కూడా చెప్పాను. ఎవరు గిరిజనులు? తన సంకలనానికి రాసుకున్న ముందుమాటలో జి.ఎన్.దెవీ గిరిజనుల్ని వాళ్ళ భాష ద్వారా మాత్రమే గుర్తుపట్టగలమని చెప్పాడు. కాని నేనట్లా అనుకోవడం లేదు. గిరిజనులందరినీ, భాష ద్వారా, సంస్కృతిద్వారా గుర్తుపట్టలేం. గిరిజనుడి విశిష్టత అతడిదే అయిన ఒక ప్రాపంచిక దృక్పథంలో ఉంది. అది సామాజికంగా మానవీయం, రాజకీయంగా గణస్వామికం, పర్యావరణరీత్యా అహింసామయం. వెరసి అత్యున్నతం.

ఆ అత్యున్నత, విశాల, ఉదార మానవీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే గిరిజన భాషా సాహిత్యాల గురించి మనకి మరింత తెలియాలి, వాళ్ళా ఆకాంక్షలూ, ఆవేదనలూ వాళ్ళ పాటలద్వారా, కథలద్వారా సామెతల ద్వారా మనం వినగలుగుతాం. అమలినమైన ఆ సంస్కారాన్ని అర్థం చేసుకోగలుగుతాం.

నా సూచనలకి సాహిత్య అకాడెమీ కార్యదర్శి చాలా సానుకూలంగా స్పందించారు. గిరిజనుల పాటల్నీ, కథల్నీ ప్రచురించడానికి సాహిత్య అకాడెమీ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని చెప్పారు. ‘గిరిగింజ గిరిమల్లెలు’ పుస్తకాన్ని ఇంగ్లీషుకన్నా ముందు హిందీలోకి అనువదింపచేస్తే బాగుంటుందనీ, ఆ అనువాదాన్ని సాహిత్య అకాడెమీ ప్రచురించడానికి సిద్ధమేననీ చెప్పారు. గిరిజన భాషలమీద, సాహిత్యాలమీద ఏ సంస్థలైనా కృషి చేయడానికి ముందుకొస్తే వారి భాగస్వామ్యంతో సాహిత్య అకాడెమీ కృషి చెయ్యడానికి సంసిద్ధంగా ఉంటుందని కూడా చెప్పారు.

29-3-2016

Leave a Reply

%d bloggers like this: