మరొకసారి అడవిదారుల్లో

68

ప్రతి ఏటా వైశాఖంలో పాడేరు లో జరిగే మోదకొండమ్మ జాతర ని పోయిన ఏడాదినుంచీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్సవంగా జరుపుతోంది. పోయినసారి ఆ ఉత్సవానికి వెళ్ళాం. ఈసారి కూడా రమ్మని కబురంపిస్తే, ఆ ఆహ్వానం అమ్మవారినుంచి వచ్చినట్టే అనుకుని పాడేరు వెళ్ళాను.

ఇరవయ్యేళ్ళ కిందట నేను పాడేరులో పనిచేసినప్పటికన్నా, ఈ మధ్యకాలంలో ఆ జాతర ఊహించలేనంత పెద్దజాతరగా మారింది. సమ్మక్క-సారక్క జాతరలానే మోదమ్మ జాతర కూడా గిరిజనేతరుల పండగగా మారిపోతున్నదా అనుకునేవాణ్ణి, కాని డా.శివరామకృష్ణ సంకలనం చేసిన ‘మోదకొండమ్మ తుమ్మెదపదం’ (2007)
(http://sakti.in/PDF_Files/modakondamma_thumedapadam.pdf)
చదివాక భద్రాచలం రాముడిలాగా, పాడేరు మోదమ్మ కూడా సంస్కృతీసంగమాన్నే కోరుకున్నదని అర్థమయింది.

గిరిజనసంస్కృతి, పల్లపు సంస్కృతి ప్రాయికంగా విరుద్ధ జీవితదృక్పథాలు. పల్లపుమనిషి చేతిలో కొండజాతి మోసపోతూనే ఉంది. అలాగని, ఆ సంస్కృతుల మధ్య కంచె కట్టలేం. కంచెలాంటి పరిరక్షణలతో గిరిజనుడు దోపిడీకి గురికాకుండా కాపాడాలనే రాజ్యాంగం ప్రయత్నిస్తూ వస్తున్నది. కానీ దోపిడీ ఆగకపోగా మరింత వికృతంగానూ, మరింత తీవ్రంగానూ మారడం కూడా మన కళ్ళముందే జరుగుతున్నది.

సంపర్కాన్ని ఆపలేం. అలాగని గిరిజనుడు గిరిజనేతర శక్తుల చేతిలో దోపిడీకి గురవుతుంటేనూ చూడలేం. ఈ శక్తుల్లో ప్రభుత్వం ఒకసారి అటూ, ఒకసారి ఇటూ కనిపిస్తున్నది. ఈ త్రాసులో ఎటుమొగ్గినా గిరిజనుడికే నష్టం వాటిల్లే పరిస్థితి. ఈ సమస్య ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తున్నదిగానీ, గిరిజనుడికి కొత్తది కాదనీ, ప్రతి తరంలోనూ ఏదో ఒక రూపంలో గిరిజనసంస్కృతి ఈ ప్రశ్న ఎదట నిలబడుతూనే ఉన్నదని మోదమ్మ కథ చెప్తున్నది. దీన్ని అధిగమించాలని కూడా కోరుకుంటున్నది.

డా.శివరామకృష్ణ మాటల్లో చెప్పాలంటే:

‘వర్ణధర్మాల ఉక్కు చట్రం సడలి, పాలకుల ఐశ్వర్యం,-ఆశ్రితుల నైపుణ్యం, బగతల నాయకత్వం, కొండదొరల కష్టజీవితం, మాలల లోకజ్ఞత, కమ్మరుల పనితనం వియ్యమంది ఈ అంతరాలు చెరిగిపోయి, ఎల్లలోకములు ఒక్క ఇల్లు కావలెనని , నిలచిన నింగిదేవతను, తొక్కిన భూదేవతను, ఆ నీడలు తోడులివ్వమంటూ పొలాలు ఊడ్చే పడతులు మాలగంగు, సంజీవరాజుల పెండ్లి పదాలలో కోరుకుంటున్నారు.’

ఆ పదాలు ఎంత అందమైన పదాలు! ఆయన సేకరించిన పాటలో ఈ చరణాలు చూడండి:

‘శరణు శరణు దుర్గాండ్లమ్మలు-మీ చరణాలు తప్పలేను
మీ చరణాలు తప్పినగాని-తుమ్మెదీరో-మీ కరుణాలు తప్పలేను
మీలాంటి కాలము రాగ-తుమ్మెదీరో-మిమ్ము తలచి పాడుతాము
ఓ మరచిన నుడుగులు బాబు-మతియందు గొలువవాలె
తెలియని నుడుగులు బాబు-మాకు తెలియచెప్పవాలె.
తప్పపాడెము తగులపాడెము-తుమ్మెదీరో-కోపచింతలొద్దుబాబు
మామీద దయలుంచుడు-తుమందీరో-మామీద సాయముంచుడు.’

మేం పాడేరు వెళ్ళే ముందురోజు సాయంకాలం విశాఖపట్టణంలో డా.శివరామకృష్ణ మళ్ళా మోదమ్మ కథ అంతా కళ్ళకు కట్టేటట్టు చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు మా మీద ఎంత పనిచేసాయంటే, మేం ఆదివారం పొద్దున్న మోదమ్మ గుడినుంచి పాతపాడేరులో గుడికి వెళ్ళకుండా ఉండలేకపోయాం. అక్కడ, ఇప్పటి తరం గిరిజనులు మర్చిపోయిన ఆ స్థలంలో నిలబడగానే అడవి సంపెంగల సువాసన గుప్పున తాకింది. నాకు అమ్మవారి ఉనికి అనుభవంలోకి వచ్చినట్టనిపించింది.

2

చాలా ఏళ్ళ తరువాత మత్స్యగుండం వెళ్ళాను. ఇప్పుడక్కడ కొత్తగా దేవాలయం, అక్కడ గెడ్డ మీద చిన్న వంతెన, అందమైన వ్యూపాయింట్ కూడా నిర్మించారు. దారిపొడుగునా విరగకాసిన మామిడిచెట్లు, చెట్లమీదనే పండి, కింద నేలంతా రాలినమామిడిపండ్లు. వాటిని చూస్తుంటే, ‘అనేకవర్ణం పవనావధూతమ్ భూమౌ పతతి ఆమ్రఫలం విపక్వమ్’ (రంగురంగుల మామిడిపండ్లు మిగలముగ్గి గాలితాకితే చాలు నేలమీదరాలుతున్నవి) అంటోవాల్మీకి చేసిన గిరివనవర్ణనలే గుర్తొస్తూ ఉన్నాయి.

అక్కడొక గిరిజనుడే శివార్చన చేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఒక దొప్ప ఉంది. నాకొక చెంబుడు నీళ్ళిచ్చి ఆ దొప్పలో పొయ్యమన్నాడు. ఆ నీళ్ళతో శివుణ్ణి అభిషేకించాడు. ఒక మారేడు దళాన్ని ఆ నీళ్ళల్లో తడిపి ఆ దళంతో నా నెత్తిన చిలకరించాడు. ఆ చిరుజల్లు తాకగానే నా అలసట మొత్తం తీరిపోయింది.

దారిపొడుగునా విరబూసిన తురాయిలు. నగరంలోనూ, గ్రామాల్లోనూ ఉండే తురాయిపూలలో ఇంత రాగరక్తిమ కనిపించదు. రోజంతా ఆ తురాయికాంతుల్ని కళ్ళతోనే పుణికిపుచ్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాను.

3

పోయిన ఆగష్టులో అరకులోయ దగ్గర కరాయిగూడ వెళ్ళడం, అక్కడ అలేఖ ధర్మాన్ని అనుసరిస్తున్న గిరిజనుల్ని కలవడం, వారితో మాట్లాడటం మీతో ముచ్చటించింది మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ మహిమధర్మసమాజం ప్రతినిధి కొంబుపాణి బొడొభాయి తమ గ్రామానికి ఒక కమ్యూనిటీ హాలు మంజూరు చెయ్యమని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారిని అడిగితే ఆమె అక్కడిక్కడే మంజూరు చేసేసారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తయింది, మేం వచ్చి చూస్తే తమకి సంతోషంగా ఉంటుందని ఆ గ్రామస్థులు కబురు చెయ్యడంతో, మధ్యాహ్నం ఆ ఊరికి వెళ్ళాం.

ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.

ఆ మధ్యాహ్నం మేమక్కడి దేవాలయం ఆవరణలో కూచుండేటప్పటికే ఆకాశమంతా కృష్ణమేఘసముద్రమైపోయింది. ఆ నల్లనిమేఘాల్లోంచి సూర్యుడి వెలుతురు నీలిరంగుతెరలోంచి జల్లెడపట్టినట్టు అడవిమీద పడుతుంటే, జేగీయమానమైన విద్యుత్కాంతి కనుచూపుమేరంతా పరుచుకుంది. తమకొక సమావేశమందిరం కట్టించి ఇచ్చినందుకు, ఆ గ్రామస్థులు గిరిజనసంక్షేమ శాఖ కమిషనర్ ను దీవిస్తూ ఒక భజనగీతం ఆలపించారు. ఆ శ్రావ్యమంగళ ధ్వని నన్నింకా అంటిపెట్టుకునే ఉంది.

17-5-2013

 

 

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading