
నాకు తెలీకుండానే నా చిన్నతనంలోనూ, నా పూర్వకాలపు జీవితంలోనూ నాకు లభించిన గొప్ప అదృష్టాలు ఒక కొండపల్లెలో పుట్టి పెరగడం, కొన్నాళ్ళు ఒక నది ఒడ్డునా, మరికొన్నేళ్ళు అడవుల్లోనూ ఉద్యోగాలు చెయ్యడం.
మా ఊళ్ళో మా జీవితం ఏ రోజూ మా ఇంటికి మటుకే పరిమితమైంది కాదు. పట్టుమని వంద ఇళ్ళు కూడా లేని ఆ చిన్న గ్రామం మొత్తం ఒక ఇల్లులాగా ఉండేది. ప్రతి ఒక్క ఇల్లూ ఆ ఇంట్లో గదుల్లాగా ఉండేవి. పొద్దుణ్ణుంచి రాత్రి దాకా ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్ళివచ్చినట్టు ఆ ఇళ్ళన్నీ చుట్టబెడుతూ ఉండేవాళ్ళం.
ఇక ఊరికి ఆ చివర ఏరూ, మరో చివర చాపరాయిగా పిలిచే కొండవాలూ, ఊరి లోతట్టులో లొద్దుగా పిలుచుకునే అడివీ మమ్మల్నెప్పుడూ పిలుస్తూ ఉండేవి. మా ఊరునించి లోపలకి మరీ మైలు దూరం కూడా లేని వణకరాయి గ్రామం దాకా, మా ఊరు దాటి, ఏరు దాటి జాగరాలమ్మ గుడిమీంచి కాకరపాడు వెళ్ళే మలుపు దాటితే కనిపించే టేకు ప్లాంటేషను దాకా ఒకసారేనా చుట్టి వచ్చేవాళ్ళం. ఇక మా ఊరిమీంచి అడ్డంగా పొలాలమ్మట, అడవి దారిన నడుచుకుంటూ పోతే వచ్చే తాళ్లపాలెం గ్రామం మాకొక స్వప్నసీమ.
అక్కడ కొన్నాళ్ళ పాటు మాకో రెండెకరాల పొలం ఉండేది. తర్వాత రోజుల్లో మా నాన్నగారు ఏజెన్సీ లాండ్ ట్రాన్స్ఫర్ రెగులేషన్స్ అమలు చెయ్యడంకోసం గిరిజనేతరులతో పోరాటం మొదలుపెట్టాక అన్నిటికన్నా ముందు చేసిన పని ఆ రెండెకరాలూ ఆ ఊళ్ళో గిరిజనుడికి అప్పగించెయ్యడం. ఏజెన్సీ చట్టాల ప్రకారం ఆ ప్రాంతంలో భూమి అంతటికీ గిరిజనుడే మొదటి హక్కుదారు అనేది ఒక ప్రాథమిక సూత్రం. అలా ఆ భూమి అప్పగించడానికన్నా ముందు, అంటే 1975-76 కన్నా ముందు, నా మరీ పసితనపు జ్ఞాపకాల్లో, ఆ చిన్న పొలంలో పండిన వరిచేను కోతలప్పుడు మా నాన్నగారు మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్ళిన రోజులు నా మదిలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. బహుశా అప్పుడు నాకు పదేళ్ల లోపే ఉండి ఉండవచ్చు. మా ఊరినుంచి తాళ్ళపాలేనికి బహుశా నాలుగైదు మైళ్ళ దూరం అయి ఉండవచ్చు. కాని ఆ ఊరు నడిచే వెళ్ళామనీ, నడిచే వచ్చామనీ నాకు గుర్తుంది. ఆ దారి పొడుగునా ప్రతి ఒంపూ, ప్రతి మలుపూ, ప్రతి గట్టూ నాకు ఇప్పటికీ గుర్తు. అలాగే ఎప్పుడేనా మా ఊరినుంచి రాజవొమ్మంగి నడిచివెళ్ళినా, లేదా నడిచి వచ్చినా అది కూడా అపురూపంగానే ఉండేది నాకు.
ఒక మనిషి చెయ్యగల పనులన్నిటిలోనూ అడవిదారుల్లో నడుచుకుంటూపోవడాన్ని మించి అద్భుతమైన సంతోషాన్నివ్వగల పనులు ఆట్టే లేవని చెప్పగలను. నేను రాజమండ్రిలో పనిచేస్తున్న కాలంలో కూడా ఎప్పుడు వీలు దొరికినా మా ఊరు వెళ్ళిపోతూ ఉండేవాణ్ణి. కాని నిజంగా అడవిదారుల నడక ఎలా ఉంటుందో నేను గిరిజనసంక్షేమశాఖలో చేరాకనే గ్రహించాను. నా ట్రయినింగులోనూ, నా మొదటి పోస్టింగులోనూ కూడా పార్వతీపురం అడవుల్లో నేను తిరిగినట్టు తిరిగినవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చనుకుంటాను. అప్పట్లో మా ఐటిడీఎ కింద ఉన్న ముఖ్యమైన ఎనిమిది మండలాల్లోనూ ప్రతి మారుమూల కొండకీ పోయి వచ్చేవాణ్ణి. ఆ రోజుల్లో గిరిజనాభివృద్ధి అంటే కొండలెక్కడమే. అంతదాకా ఏ అధికారీ వెళ్ళి చూడలేదని చెప్పుకునే ఊళ్ళు పోయి చూసి రావడమే గొప్ప ఘనకార్యంగా ఉండేది.
గుమ్మలక్ష్మిపురం మండలంలో గొయిపాక, బీరుపాడు, బబ్బిడి, కురుపాం మండలంలో జరడ, టొంపలపాడు, పొడి, సొబ్బ, జియ్యమ్మవలస మండలంలో కొండచిలకం, తామరఖండి జమ్ము, పెదతోలుమండ, కొమరాడ మండలంలో నయా, జాకూరు, ఎండభద్ర, సాలూరు, మక్కువ మండలాల్లో చోర, కొదమ, కొటియా, సామంతభద్ర, మూలతాడివలస, పాచిపెంట మండలంలో బడ్నాయికవలస, సరాయివలస, ఏటగానివలస, మిలియాకంచూరు, మోదుగ- మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆ కొండలూ, ఆ గ్రామాలూ ఇంకా నా కళ్ళముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ అడవిగాలి, ఆ ఎండుటాకులు, ఆ కుంభవృష్టులూ ఇంకా నా చుట్టూ హోరెత్తుతూనే ఉన్నాయి ఉన్నాయి.
ఆ తర్వాత కూడా మరెన్నో కొండప్రాంతాల్లో పనిచేసానుగాని, పార్వతీపురం అడవుల్లో తిరిగినట్టు ఎక్కడా తిరగలేదు. శ్రీశైలంలో పనిచేస్తున్నప్పుడు యెర్రగొండపాలెం మండలం పాలుట్ల, పన్నలబయలు, గుట్టలచేను గ్రామాలకి ఒక్కసారి మాత్రమే నడిచి వెళ్లివచ్చినట్టు గుర్తు. తక్కినసార్లు ఐటిడీఎ డ్రైవర్లు ఏదో ఒక రకంగా ఫోర్ వీలు తో పైకి ఎక్కించి దింపేవారు. పాడేరు, ఉట్నూరు అడవుల్లో కూడా జీపు పోలేని దారులూ, గ్రామాలూ ఉండేవి కావు. కనీసం నా ఉద్యోగానికి సంబంధించినంతవరకూ.
ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత, ఈ పుష్యమాసపు అపరాహ్ణాన, హైదరాబాదులో ఈ అద్దె ఇంట్లో మేడమీద కూచొని ఈ వాక్యాలు టైపు చేస్తుంటే, ఆ నా గడిచిపోయిన జీవితపు ఆ అడవులూ, ఆ గ్రామాలూ, ఆ దారులూ, ఆ కొండలూ ఒక కలలాగా తోస్తున్నాయి. సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది. ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి’ అని. మనుషులు తాము చేసుకున్న పుణ్యం క్షీణించాక మర్త్యలోకంలోకి వచ్చిపడతారని దానికి అర్థం. నేనెంత భాగ్యం చేసుకుంటే ఆ అడవిదారుల్లో, ఆ కొండవాలుల్లో ప్రయాణించేనో తెలుసుకునేలోపే ఆ జీవితానికి మళ్లీ చేరలేనంత దూరంగా వచ్చేసాను.
అలాంటి మరొక జీవితం రాజమండ్రిలో గోదావరి ఒడ్డున గడిపిన కాలం. మామూలుగా ఏ నది ఒడ్డున ఉన్న ఏ పట్టణంలో జీవించినా, ఒక్కరోజు కూడా ఆ నది ఒడ్డుకు పోయి కూచోకపోయినా, అతడు ఆ నది ఒడ్డున జీవించాడు అని చెప్పుకుంటాం. కాని రాజమండ్రిలో నా జీవితం అలా కాదు. నేను నిజంగానే గోదావరి ఒడ్డున కూడా కాదు, గోదావరి గట్టుమీదనే జీవించాను. అటు వేణుగోపాలస్వామీ, ఇటూ ఉమామార్కండేయస్వామీ కొలువు తీరిన చోట కొవ్వూరు లాంచీల రేవు దగ్గర గోదావరి గట్టుదగ్గరే అయిదేళ్ళ పాటు నా సాయంకాలాలు గడిచాయి. పక్కనే సదనంలో మా చెల్లెళ్ళిద్దరు చదువుకుంటూ ఉండేవారు. సదనానికి పక్కనే సమాచారం ఆఫీసు. ఆ మేడమీద శరభయ్యగారు ఉండేవారు. అక్కడ ఆ గట్టుమీద మిత్రులంతా కలుసుకునేవాళ్లం. సాయంకాలం అయిదింటికో, ఆరింటికో అక్కడ చేరుకున్నవాళ్ళం చాలాసార్లు రాత్రి పదింటిదాకా, పదకొండుదాకా, ఒక్కోసారి తెల్లవారేదాకా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయేవాళ్లం. కవిత్వం, కవిత్వం, కవిత్వం తప్ప మరో ప్రస్తావన ఉండేది కాదు. మళ్లా అట్లా నది ఒడ్డున సాయంకాలాలు గడిపిన కాలం నా జీవితంలో మరొకటిలేదు. రెండు మూడేళ్ళ కిందట విజయవాడలో ఉన్నప్పుడు ఫెర్రీదగ్గరికో, గొల్లపూడి ఘాట్ దగ్గరకో అప్పుడప్పుడు పోయి కూచునేవాణ్ణిగాని, ఆ మిత్రులేరి? ఆ కవితలెక్కడ?
ఈ రోజు నాకు మా నాన్నగారు పదే పదే గుర్తొస్తున్నారు. ఆయన జీవితమంతా నడకలోనే గడిచింది. ఆయన నడిచిన దూరాల్ని ఒకదానికొకటి కలుపుకుంటూ పోతే బహుశా ఈ భూమండలాన్ని ఆయన మూడు సార్లు చుట్టి వచ్చినట్టవుతుందేమో. కాని చివరిరోజుల్లో మా అమ్మ ఆరోగ్యం బాగులేక, ఆయన మాతో పాటు హైదరాబాదులో ఉండవలసి వచ్చినప్పుడు ఎంత కొట్టుమిట్టాడిపోయారని! అది కూడా కొన్ని నెలలే. ఇక్కణ్ణుంచి వెళ్ళిపోడానికి నాతో ఎంత యుద్ధం చేసారని! వాళ్ళు మళ్ళా ఆ అడవికి వెళ్ళిపోతే వైద్యసదుపాయం దొరకదని నేను ఆయన్ని వెళ్ళనివ్వకపోతే చిన్నపిల్లవాడిలాగా మారాం చేసారు! చివరికి ఆయన సంకల్పం ముందు నేను ఓడిపోక తప్పలేదు. కాని ఒక మనిషి స్వస్థత మందుల్లోనూ, హాస్పటళ్ళలోనూ లేదనీ, అది అతనికి ఏ తావుల్లో సంతోషం చేకూరితే ఆ తావుల్లో తిరగడంలోనే ఉంటుందనీ, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాకగానీ నాకు తెలిసి రాలేదు!
తన ఒంటిమీద ఏ సర్జనూ కత్తిగాటు పెట్టకుండా బతకడానికి ఆయనకు బలమిచ్చింది ఆయన నడకేననీ, ఆ కొండగాలిలో, ఆ అడవిదారుల్లో తిరగడమేననీ, ఒకసారి వాటికి దూరంగా జరిగేకనే ఆయన అస్వస్థులయ్యారనీ ఇప్పుడు చెప్పగలను. తిరిగి మమ్మల్నందరినీ పక్కకు నెట్టి మా ఊరికి వెళ్లిపోయాక ఆయనలో జీవితం ఒక్కసారి గుప్పున వెలిగింది. ఆ మరుక్షణమే ఆరిపోయి ఉండవచ్చుగాక, కాని ఆ శ్వాస ఆ కొండగాలిలో కలిసిపోయిందనీ, ఇక ఆయనకి మళ్ళా ఈ మర్త్యలోకానికి తిరిగి రావలసిన పనిలేదనీ తెలియడమే నావరకూ నాకొక ఈశావాస్య ఉపనిషత్తు.
ఎందుకిదంతా రాస్తున్నాను? ఈ మధ్య ఒక యువమిత్రుడు తన పర్యటనల గురించిన వ్యాసాలు పంపించి నన్ను చదివి చెప్పమని అడిగాడు. అవన్నీ అతడు అడవిబాటలమ్మట, కొండదారులమ్మట, వాగులమ్మట, వంకలమ్మట చేసిన ప్రయాణాలు, చేపట్టిన నడకలు. అవి చదువుతుంటే ఒకప్పుడు నేనూ ఇట్లానే నడిచే భాగ్యం పొందానుకదా అని గుర్తొచ్చింది.
ఆ వ్యాసాలు చదివాక అతడికి నా అభిప్రాయం రాస్తో హెన్రీ డేవిడ్ థోరో రాసిన ఒక వాక్యం గుర్తుచేసాను. తన సుప్రసిద్ధ వ్యాసం Walking (1862) లో థోరో రాసుకున్నాడు: It requires a direct dispensation from Heaven to become a walker అని. ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఒక మనిషి రోజూ తనకి నచ్చే చోటకి నడుచుకుంటూపోయి రాలేడు.
ఏ కొన్ని నెలలో తప్ప ఆ దైవానుగ్రహం ఆయనకు జీవితమంతా ఉండిందని మా నాన్నగారికి వెంటనే చెప్పాలని చాలా గట్టిగా అనిపిస్తోంది.
1-2-2024


అవును, నడక ఒక అపురూపమైన వరం. మనం జీవిస్తున్నట్టు తెలిసేది, మనలో మనం జీవించేది నడుస్తున్నప్పుడే. నడక ఎంతో ఇష్టమైన మహాకవి అజంతాతో కలసి నడిచిన రోజులు, రాజమండ్రి రోజులు గుర్తొచ్చాయి మీరు రాసింది చదువుతుంటే 🙏❤
ధన్యవాదాలు సార్
Elaine V.Emans Unwritten Registry poem
గుర్తు తెచ్చింది సార్. బాగా నచ్చిన మీట ఊరంతా ఒక ఇల్లులాగా ఉండేది. నిజం నేను మానఊళ్లో గడిపిన పదహారేళ్లు రోజూ ఊరంతా తిరగడమే గాక మైలుకెక్కువే దూరంపోయి రోజూ మంచినీళ్లెత్తుకు వచ్చేవాళ్లం. మనసులో ఉన్న రూపం చిత్రించగలిగే సాంకేతిక పరికరం గనుక ఎవరైనా కనిపెట్ట గలిగితే ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయిన 70 ఏళ్ల కిందటి ఊరిని యథాతథంగా చూపించగలనన్నంత నమ్మకముంది. కరీంనగర్ లో కాలేజీ రెండు మైళ్ల దూరం నాలుగు సంవత్సరాలు నాలుగు మైళ్లు కాలేజీకి , సాయంత్రం రెండు మూడు మైళ్లు వాహ్యాళికి నడిచే వాళ్లం. ఈ పోస్టు చూడగానే ఆపుకోలేకపోయాను ఆ ముచ్చట మీకు తెలుప కుండా.
అవును సార్! మనందరి జీవితాల్లోనూ అటువంటి కాలం ఒకటి ఉండేది.
మీ నాన్నగారికి aa ఆవిషయం తెలుసు. అందుకే పట్టు పట్టారు. ఒక అడుగు కూడా పడని కాలంలో నడక గురించి చదవటం దానిలో మమేకం అవటం కూడా సంతోషంగానే ఉంది. ధన్యవాదాలు. మరిన్ని కవిత్వపు నడకల కోసం ఎదురు చూస్తూ , సాయి పద్మ
నాకు పరిచయమైన అత్యంత సహృదయుల్లో మీరూ ఒకరు. మీకు ఎప్పుడూ మంచి జరగాలనే ఒక తలపు నా మనసులో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.
నడకే జీవితం కొందరికి.. నడక అవసరం అందరికీ.. లేచి నడిచే అవకాశం భగవంతుడు ఇవ్వడం ప్రతి రోజూ ఒక పునర్జన్మ… మీ గురించి, మీ నాన్న గారు గురించి చాల బాగ చెప్పారు సార్..
ధన్యవాదాలు సార్
Simply Superb Narration Bhadrudu Garu. మీరు వర్ణించిన విధానం నన్ను కూడా అక్కడ విహరింప చేసింది.. చిన్నప్పుడు, బహుశా పదేళ్ల లోపే అనుకుంటాను. అత్తిలి నుంచి, రేలంగి నుంచి మా అమ్మమ్మ గారి వూరికి పొలాల మధ్యన , పంటకాలవల ఒడ్డున, బల్లకట్ల మీద మూడు నాలుగు మైళ్ళు నడిచి వెళ్లిన రోజులు , రాజోలు శివకోడు ఊర్ల మధ్య నడకలు గుర్తు కొచ్చాయి. ఇప్పటికీ అలాంటి ప్రకృతి మధ్య నడక మహా ఆనందం నాకు. కానీ మొన్ననే ఇక్కడ హవాయి లో వున్న మేము ఒక అద్భుతమైన బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫాల్స్ మధ్యలో ఓ రెండు గంటల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి ప్రకృతిలో మమేకమయిపోయినా గాని బాల్యం లో నడచిన ఆ ద్రోవలో దొరికిన అవ్యక్త ఆనందాన్ని చేరుకోలేక పోయాను. మీ అనుభూతుల్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అంత గొప్పగా వ్యక్తీకరించ లేని వాణ్ణి కాబట్టి మీ రాతల్లో మా మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకుని ఆనందిస్తున్నా..
మీ సహృదయ స్పందనకు హృదయపూర్వక నమోవాకాలు.
🤦♂️Fogg(Gas) is moving everytime in India.. ఇది మా కర్మ.. ఎంతో అదృష్టవంతులు మీరు 🙏
ధన్యవాదాలు
మీలాంటి వారి మధ్య నడవడము కూడా ఒక దైవనుగ్రహమే 🙏
ధన్యవాదాలు సార్
పని కోసం నడక, పని లేని నడక అని రెండు ఉన్నాయని మీ వ్యాసం చదివితే అర్ధం అయ్యింది. బాల్యం లోనూ ఉద్యోగ జీవితంలోనూ పని కోసం చేసిన నడక మీది.ఇప్పుడు చాలామంది చేసేది పనిలేని నడక. ఇది ఆరోగ్యాన్నివ్వచ్చేమో కానీ ఆనందాన్ని ఇవ్వడం లేదు.
ఒక మంచి ఆలోచన ఇచ్చిన మీ వ్యాసానికి మీకు కృతజ్ఞతలు.
నడవడం బరువైన ఓ పాఠకురాలు
ధన్యవాదాలు మేడం
ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఒక మనిషి రోజూ ఇలా తనకి నచ్చే రచనలు చదివే భాగ్యానికి నోచుకోలేడు. మీరు మాకు అయాచితంగా దేవుడిచ్చింది వరం భద్రుడు గారూ నిత్య జ్ఞానదాతా సుఖీభవ!
హృదయపూర్వక నమస్కారాలు!