
ప్రియమైన శాఫో
ఈ ఋతువంతా ఇట్లానే నా కన్నా ముందే కోకిల నిద్రలేస్తుంది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న నగరసరోవరంలో అల్లరిపిల్లవాడు గులకరాళ్ళు విసురుతున్నట్టు పొద్దున్నే కూయడం మొదలుపెడుతుంది. ఆ కూత వెనకనే వలయాలుగా వలయాలుగా ప్రకంపనలు నగరాకాశమంతా విస్తరిస్తాయి. ఆ అలల వలయాలకు గొంతొచ్చినట్టుగా కోకిల కూజితాలు నా కిటికీ దాకా వచ్చి నన్ను తాకుతుంటాయి. ఇక నిద్రపట్టదు.
పూర్వం తెల్లవారుతుందంటే, కొత్త రోజు మొదలవుతుందంటే చాలా ఆత్రుతగానూ, ఆందోళనగానూ ఉండేది. నా ఉద్యోగ జీవితం అలాంటిది. ఏదో కథలో చెప్పినట్టు నా గుండెని నా ఇంట్లోనే భద్రంగా ఒక మూల వేలాడదీసి, బయటి ప్రపంచంలో అడుగుపెట్టేవాణ్ణి. కాని ఆ గుండె అక్కడ పడుండేది కాదు. చిన్న కుక్కపిల్లలాగా నేనెక్కడివెళ్తే అక్కడికే వచ్చేసేది. ఒక చిన్న మాట, ఒక చిన్న భావన, అంతదాకా ఎందుకు, ఎవరేనా తమ కనుబొమ ఇంత ముడుచుకున్నా కూడా నేను చాలా అస్థిమితమైపోయేవాణ్ణి. ఎప్పుడో చాలా ఏళ్ళ కింద ఒక ఇంటర్వ్యూలో రేఖ చెప్పిన ఒక మాట నాకు గుర్తుండిపోయింది. తాను సెట్ మీదకు వెళ్తే, ప్రతి ఒక్కరూ తనని సంతోషంగా స్వాగతించాలనే కోరిక తనలో చాలా బలంగా ఉండేదట. అలా జరక్కపోయినా పర్వాలేదు, కాని ఎవరేనా, చివరికి ఒక లైట్ బాయి అయినా తనని చూసి పలకరింపుగా తలపంకించకపోతే, తనకేదో కోల్పోయినట్టు ఉండేదట.
అంటే ఈ ఇంటర్వ్యూ, ఇలస్ట్రేటెడ్ వీకీ కోసం ప్రితిష్ నంది చేసినట్టు గుర్తు, కాబట్టి, నలభయ్యేళ్ళ కిందటి మాట, అప్పటికింకా రేఖలో పసితనమింకా పదిలంగా ఉంది కాబట్టి, ఆమె ఈ మాటలు నిస్సంకోచంగా పంచుకుందిగానీ, నిజానికి ఇది అందరి అనుభవమూ అనే అనుకుంటాను.
అవును, మనలో ప్రతి ఒక్కరికీ మనల్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని ఉంటుంది. మనం వాళ్ళకి చాలా ముఖ్యమన్నట్టుగా భావించాలని ఉంటుంది. మన మాటలు, మన నవ్వులు, మనం రాసే అభిప్రాయాలు, మనం పంచుకునే ఇష్టాలు- ప్రతి ఒక్కటీ వారికెంతో ముఖ్యమన్నట్టుగా వారు మనతో చెప్పాలనిపిస్తుంది. ఈ దాహానికి కారణమేమై ఉంటుందా అని ఒకప్పుడు నేను చాలా చాలా ఆలోచించాను. బహుశా ఇది మన అస్తిత్వానికి, మన ఉనికికి మనం ఎప్పటికప్పుడు కోరుకుంటున్న నిర్ధారణనా అని కూడా అనుమానించాను. సరే, ఇదేమిటో అర్థం చేసుకోడానికి తత్త్వ శాస్త్ర గ్రంథాలు తిరగెయ్యడం కూడా మొదలుపెట్టానని చెప్తే నువ్వు నవ్వుతావు.
కొన్నేళ్ళ కిందట, పారశీక కవిత్వం విస్తారంగా చదవడం మొదలుపెట్టాక, ఒకరోజు ఒక పుస్తకం నా చేతుల్లోకి వచ్చింది. love’s Alchemy: Poems from the Sufi Tradition (2006) పారశీక కవిత్వం నుంచి David Fideler, Sabrineh Fideler అనే ఇద్దరు సహచరులు చేసిన అనువాదం. అందులో ప్రసిద్ధ సూఫీ కవులవి ఒక్కొక్కరివీ నాలుగైదు కవితలున్నాయి. కొన్ని రోజుల పాటు అది నాకు పారాయణ గ్రంథంగా ఉండింది.
ఆ కవితలు పదే పదే చదవగా నాకో సంగతి బోధపడటం మొదలుపెట్టింది. అదేమంటే, మనం ప్రతి ఒక్కరం ప్రేమించాలనీ, లేదా అంతకన్నా ఎక్కువగా ప్రేమించబడాలనీ కోరుకుంటూ ఉంటాంగానీ, నిజంగా ప్రేమ ఎదురైతే, మనం అక్కణ్ణుంచి పారిపోతాం. ప్రేమానుభవం ఒక rite of annihilation. అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా మనల్ని మనకి లేకుండా చేసే ఒక దహనోత్సవం. అందుకనే అందులో ఇరాకీ అనే ఒక సూఫీ కవి ఇలా అంటున్నాడు:
The first step in love
is losing your head
సాధారణంగా ప్రేమకథల్లోనూ, ప్రేమ కవిత్వంలోనూ ఆత్మసమర్పణ, సర్వసమర్పణ లాంటి పదాలు వాడుతుంటారుగాని, ఆ కవులకీ, రచయితలకీ ఆ మాటల అంతరార్థం నిజంగా తెలీదు. నిజానికి అలా సమర్పించుకున్నప్పుడు, అన్నింటికన్నా ముందు అనుభవానికొచ్చేది, మన ego ధ్వంసమైపోవడం. నీ ప్రేమికుడో, నీ ప్రేమికురాలో నీకు నిజంగా ఇవ్వగల మొదటి బహుమతి అది. అందుకనే, అబూ సయ్యద్ అబిల్ ఖయర్ రాసిన ఈ కవిత నేను నా హృదయంలో పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఆయనిలా అంటున్నాడు:
పవిత్రయోధుడు అమరత్వానికి ఎదురేగుతాడు
కాని ప్రేమయోధుడిది దాన్ని మించిన స్థితి.
చిట్టచివరదినాన తీర్పు తీర్చేరోజున
ఈ రెడూ ఒక్కలాగా లెక్కకొస్తాయా?
పవిత్ర యోధుణ్ణి శత్రువు సంహరిస్తాడు
కాని ప్రేమయోధుణ్ణి వధించేది ప్రేమికుడే.
గమనించవలసిందేమంటే, ఇది ఒకరివైపు నుంచి మాత్రమే చదివే కవితకాదు. ఇద్దరి వైపు నుంచీ చదాల్సిన కవిత. ప్రేమలో పడ్డాక ఇద్దరూ పరస్పరం ప్రేమనిహతులవుతారు.
కాని సమస్య ఎక్కడొస్తుందంటే, మనం ఎవరినన్నా ప్రేమించగానే, వాళ్ళ ఇష్టాయిష్టాలతో మనల్ని కబళించేస్తున్నారేమో అని భయం మొదలవుతుంది. అప్పుడు మనకి మనల్ని, మరీ ముఖ్యంగా, మన వ్యక్తిత్వాల్ని కాపాడుకోవాలన్న ఆందోళన మొదలవుతుంది. అందుకనే ఆ మనుషులు , ప్రేమప్రభవించేవేళ ధగధగలాడుతూ కనిపించేవాళ్ళు, నాలుగు రోజులు తిరక్కుండానే, వెలవెలబోతూ కనిపిస్తారు.
ఆ పుస్తకంలోనే, మరో కవి ఇలా అంటున్నాడు:
My head was full, overflowing with conceit-
I was staggering, drunk-
wasted on the wine
of my imagined greatness.
But you have made me low-
it brought humility.
It freed me
from having
to worship
myself
ప్రేమ విషయంలో దాదాపుగా ప్రతి ఒక్కరి అనుభవం ఇలాంటిదే. కాని ఈ సంగతి నీకు బాగా తెలుసు. తెలుసని ఈ Fragment 33 చదివేక బాగా అర్థమైంది. ఈ శకలాన్ని మొదటిసారి Aaron Pucchigian అనువాదంలో ఇలా చూసాను:
Since I have vast my lot, please, golden-crowned
Aphrodite, let me win this round
అప్పుడు ఆ పుస్తకంలో ఆ వాక్యం పక్కన love: gambling అని రాసుకున్నాను.
Anne Carson కూడా దాదాపుగా ఇలాంటి పదాలే వాడారుగాని, ఆమె అనువాదంలో కూడా lot అనే మాట కూశాక, ‘వంతు’ అనే అర్థం చెప్పుకున్నాను.
if only I, O goldcrowned Aphrodite
could win this lot
కాని ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు నువ్విట్లా జూదపరిభాషలోనో, లేదా chance అనే అర్థంలోనో మాట్లాడతావని నేననుకోలేను. అందుకని ఈ వాక్యాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే, ఇక్కడ lot అనే పదం గ్రీకులో κλᾶρον, klaron అంటే అసలైన అర్థం ‘భాగ్యం’ అని తెలిసింది . అప్పుడు ఈ వాక్యాన్నిలా అనువదించాలి:
ఓ కనకకిరీటధారీ, ఆఫ్రొడైట్
ఈ సారన్నా ఈ ప్రేమభాగ్యం నాకుదక్కితే. ..
‘భాగ్యం’ అదీ సరైన పదం. ప్రేమించడం ఒక భాగ్యం. ప్రేమించబడటం మరింత భాగ్యం. అది కష్టపడి చదుకుని ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవటమో లేదా నాలుగురాళ్ళు కూడబెట్టుకోవడమో కాదు. అసలు మనకి తెలిసిన ఏ ప్రాపంచికార్థంలోనూ కూడా దాన్ని వివరించలేం. అదొక grace. అలాగని నేను దీన్ని మరీ ఆధ్యాత్మిక భావజాలంతో ముడిపెట్టాలనుకోవడం లేదు. ఆ మాటకొస్తే, grace చాలా దైనందినంగా, చాలా ప్రాపంచికపరిభాషలో నిత్యం మనకు తారసపడుతూనే ఉంటుంది, కాని దాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అంతే.
రోజూ నేను ఈవెనింగ్ వాక్ కి మా కాలనీలోనే ఒకటిన్నర వీథుల్లో తిరుగుతాను. మా కాలనీ వీథిని ఆనుకుని పూలమార్కెట్ వెనకగోడ. ఆ గోడకవతల రాశులు రాశులుగా పూలు పోసి అమ్ముతుంటారు. అవి మార్కెట్టుకి వచ్చేటప్పటి కే, తమ తాజాదనాన్నీ, పరిమళాల్నీ పోగొట్టుకుని ఉంటాయి. అయినా కూడా ఏదైనా లవలేశం మిగిలి ఉంటే, ఆ మార్కెట్టుని ఆవరించే దళారీల చెమటవాసన, ఆటోల, ట్రక్కుల, మోటారు సైకిళ్ళ డీసెల్ వాసనలో అది కూడా కొట్టుకుపోతుంది. . అలాంటిది, మొన్న ఒకరోజు అతికోమల పరిమళం ఒకటి, ఏ జన్మల్లోనో, ఎప్పుడో నాకు తారసపడ్డ సూక్ష్మసుగంధం నన్ను ఆ దారిన ఆపేసింది. అదెక్కణ్ణుంచి వస్తుందో వెంటనే పోల్చుకోలేకపోయాను. పూలమార్కెట్టులోంచైతే కాదని నాకు తెలుసు. మరెక్కణ్ణుంచి? ఎవరింటిలోంచో ఏ సన్నజాజినో అయి ఉండాలనుకున్నాను. కాని, కాదు, అది సన్నజాజి కూడా కాదు. అప్పుడు అక్కడ ఆగిపోయి కొంతసేపట్లానే నలువైపులా గాలించేక, అప్పుడు తెలిసింది, ఆ పూలమార్కెట్టు గోడని ఆనుకుని పెరిగిన చెట్టుకొమ్మల్లోంచి వ్యాపిస్తున్న శిరీషకుసుమసుగంధమని. ఆ పేశలకుసుమ మసృణసుగంధం, ఆ సువాసన నన్నట్లా తాకడమే కదా grace అంటే.
అదే చెప్తున్నావు నువ్వు ఈ కవితలో, ఆఫ్రొడైట్ ను వేడుకుంటున్నావు, ఈసారైనా ఈ భాగ్యం నాకు దక్కేలా చూడని. నీ దృష్టిలో ప్రేమ ఒక అనుగ్రహం. అది పోరాడి సాధించేది కాదు, పారాడి నిలబెట్టుకునేదీ కాదు. అది నిలువెల్లా వణికిపోతూ, మన చేతుల్లోని కాఠిన్యానికి ఆ శిరీష కుసుమదళాలు ఎక్కడ కందిపోతాయోనన్నంత ఆతృతగా, వినయంగా, మోకరిల్లి మరీ మన జీవితాల్లోకి తెచ్చుకోవలసింది.
మామూలుగా మనుషులు ఒకసారి ప్రేమిస్తే, అది ఒక జీవితకాలానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నట్టుగా భావిస్తారు. Life-long commitment అనుకుంటారు. కానే కాదు, ప్రేమ ఒక అనుక్షణసంపాదన. ఎప్పటికప్పుడు నీ శిరసు సమర్పించి మరీ యాచించవలసిన దేవతాప్రసాదం. అందుకనే, నువ్వు ఆఫ్రొడైట్ ని యాచిస్తున్నావు. నీకు తెలుసు. ప్రేమ తటస్థించడం గొప్ప విషయం కాదు, తీరా అది మనకి తారసిల్లిన సమయానికి మనం సిద్ధంగా ఉండటం మరింత ముఖ్యం. ఏమరుపాటులేకుండా ఉండటం ముఖ్యం. అతిథిని ఇంట్లోకి రమ్మని పిలిచి తీరా ఆ సమయానికి ఆ గుమ్మానికి అడ్డంగా మనమే నిలబడిపోకుండా ఉండటం.
ఈ మాటలు రాస్తున్నప్పుడు నాకు చాలా ఏళ్ళ కిందట చదివిన ఒక కథ గుర్తొస్తోంది. ‘ఎదురు చూస్తున్న ముహూర్తం’. పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన కథ. ఇప్పటి పాఠకులే కాదు, పాత తరం పాఠకులు కూడా ఆ కథ ఎంతోమంది చదివి ఉండరు. కాని గొప్ప కథ. ఆ కథలో శాంత అనే ఆమె ఉంటుంది. ఆమె జీవితమంతా ఒక అద్భుతం జరగబోతుందని ఎదురుచూస్తూ ఉంటుంది. నిజానికి తాను ఎదురు చూస్తున్నది దేనికోసమో ఆమెకే స్పష్టంగా తెలియదు. అది ప్రేమ కోసమా? అద్దంలో చూసుకున్నట్టుగా తన అంతరంగంలోకి చూడగలిగే ఒక సహచరుడికోసమా? కానీ తీరా అటువంటి ముహూర్తం రానే వచ్చినప్పుడు ఆమెకి దాన్ని గుర్తుపట్టలేకపోతుంది. అనుమానంతో, భయంతో, తడబాటుతో తలుపులు మూసేసుకుంటుంది.
ప్రేమ అనుక్షణ జాగరూకత. మనల్ని మనం కబళించుకోకుండా చూసుకోవడం. మన petty self మన larger self ని తినేయకుండా జాగ్రత్తపడటం. అప్పుడు మన జీవితాల్లోకి ప్రవేశించిన ప్రేమికుడో, ప్రేమికురాలో తన larger self ని తన వెంట తెచ్చుకుని మన larger self తో సంగమిస్తారు. అందుకనే కమలాదాస్ అంది:
When you learn to swim
Do not enter a river that has no ocean
To flow into. ..
ఎదురుచూస్తున్న ముహూర్తం (1949) కథ ఇక్కడ చదవ్వొచ్చు. https://kathanilayam.com/story/36689
6-5-2026


“ప్రేమించడం ఒక భాగ్యం. ప్రేమించబడటం మరింత భాగ్యం. అది కష్టపడి చదుకుని ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవటమో లేదా నాలుగురాళ్ళు కూడబెట్టుకోవడమో కాదు. అసలు మనకి తెలిసిన ఏ ప్రాపంచికార్థంలోనూ కూడా దాన్ని వివరించలేం.” నూటికి వెయ్యి పాళ్ళు కరెక్ట్. శాఫో కి రాసిన మీ పదమూడవ ఉత్తరం నన్ను చాలా కదిలించింది భద్రుడు గారు.
మీరు పోస్టు మొదట్లో చెప్పినట్టు ప్రేమించిన కొత్తల్లో ప్రేమికులు అటెన్షన్ కోసం తహతహ లాడినా అది పొజెసివ్నెస్ గా మారితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం.. రేఖ గురించిన అటెన్షన్ సీకింగ్ ఇన్సిడెంట్ చదువుతుంటే ఇవాళే ఏకబిగిని చదివిన మీ రాజమండ్రి డైరీ లో రేఖ క్యాలెండర్ ఇన్సిడెంట్ కి కనెక్ట్ అయ్యా..
ఈ పోస్టు పుణ్యమా అని పాలగుమ్మి పద్మరాజు గారి గొప్ప మనస్తత్వ విశ్లేషణ కథ చదివే భాగ్యం కలిగించారు. అసలు ఆ క్యారెక్టర్ కి శాంత అని పేరు పెట్టడం..
ధన్యవాదాలు.
అవును కదా! ఆమె పేరు శాంత. నాకు తట్టనే లేదు!
“ప్రేమ ఒక అనుక్షణసంపాదన“
The Sufi idea of love as self-annihilation – “కాని ప్రేమయోధుణ్ణి వధించేది ప్రేమికుడే.“
Love is grace.
Lovely love letter, Sir 😊🙏🏽
Thank you for sharing పాలగుమ్మి పద్మరాజు గారి కథ.
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!