
ప్రియమైన శాఫో
ఇంకా తెల్లవారలేదు. తల్లికన్నా ముందే లేచి తల్లిని నిద్రలేపే చిన్ని శిశువులాగా కోకిల ఆకాశాన్ని పట్టి గుంజుతోంది. పిలుపు వెనక ఆగని పిలుపు. ఆ కూజితాలు వింటూ ఉంటే, పూలకే కనక గొంతు ఉంటే, ఇలానే నిర్విరామంగా పాడుతూ ఉంటాయా అనిపించింది. కొమ్మలు గాలికి ఊగినప్పుడల్లా ఆ పూల గొంతు ప్రకంపిస్తూ ఉంటుంది కదా అనిపించింది.
నీ గొంతు కూడా అట్లాంటిదే. నువ్వెప్పుడో కొన్ని గీతాలు పాడావు. తంత్రీవాద్యం మీద ఆలపించిన పాటలు. ఎన్నో చెదిరిపోయాయి, కాని కొన్ని మిగిలాయి. వాటిలో ఒక పదప్రయోగమో, ఒక అలంకారమో, ఒక అద్వితీయ పదసంయోజనమో, ఏదో ఒకటి నచ్చి ఎవరెవరు వాటిని తమ పుస్తకాల్లో దాచుకున్నారో వాళ్ళ వల్ల మిగిలాయి. అవి తెగిన తంత్రులే. అయితేనేం, వాటిలోని సంగీతం మాత్రం యుగాలుగా అవిచ్ఛిన్నంగా మాకు వినిపిస్తూనే ఉంది. సముద్రతీరంలో దొరికిన చిన్ని శంఖంగుల్లలాగా ఎవరు దాన్ని చెవిదగ్గర పెట్టుకున్నా ఒక మహాసాగరఘోష వినిపిస్తూనే ఉంది.
నీ కవిత్వాన్నిట్లా ప్రేమిస్తున్నవాళ్ళు ఇదంతా ఊహించుకుంటున్నారా, ఆ ఖాళీల చుట్టూ తమ తమ మానసిక ప్రపంచాల్ని చిత్రించుకుంటున్నారా? నిజంగా ఎవరేనా రసజ్ఞుడు, కవిత్వమంటే ఇదీ అని తెలిసినవాడు, ఎవరేనా నీ కవిత్వం చదివి నిజంగానే నీ కవిత్వంలో ఇదంతా ఉందని ఎప్పుడేనా చెప్పి ఉన్నాడా?
ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇలా అడుగుతారని తెలిసే కాబోలు కాలం లాంగినస్ తో నీ కవిత్వం గురించి మాట్లాడించింది.
లాంగినస్!
On the Sublime రాసిన లాంగినస్. రోమన్ సామ్రాజ్యకాలంలో ఉంటూ, వర్జిల్, హొరేస్ లాంటి కవుల్ని చదివి కూడా, సిసిరో లాంటి వక్తల్నీ విని కూడా హోమర్, ప్లేటో లాంటి రచయితల్నీ, డెమోస్థనీస్ లాంటి వక్తల్నే ప్రామాణికంగా పైకెత్తి చూపిన మహాలాక్షణికుడు. పదిహేను శతాబ్దాల పాటు కాలగర్భంలో మరుగున పడిపోయిన ఆయన పుస్తకాన్ని పదహారో శతాబ్దంలో ఎవరో బయటకు తీసారు. ఇక అప్పణ్ణుంచి, ఇప్పటిదాకా, పాశ్చాత్య ప్రపంచంలో కవిత్వం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికీ అది ప్రామాణిక గ్రంథమైపోయింది. మిల్టన్, నియో క్లాసిసిస్టులు, కాంట్, రొమాంటిక్స్, న్యూ క్రిటిక్స్- ఒకరు కాదు, ఆ పుస్తకంలోంచి ఒక్క వాక్యమేనా మననం చెయ్యని ఒక్క సాహిత్యవిమర్శకుడు కూడా నేడు కనిపించడు.
తక్కినవాళ్ళు నీ కవితల్నో, కవితా శకలాల్నో ఎత్తిపెట్టి రాసుకున్నారు, అంతే, లేదా వాటిలో నీ ఉద్వేగానికో, నీ కవిత్వ కళకో సంబంధం లేకుండా కేవలం భాషవల్లనో, వ్యాకరణం వల్లనో తమని ఆకర్షించిన శకలాల్ని రాసిపెట్టుకున్నారు. కాని లాంగినస్ ఒక్కడే, పూర్తిగా కవిత్వదృష్టిలో, నీ కవితనొకదాన్ని దాదాపు పూర్తిగా ఉల్లేఖించాడు. ఇదుగో, ఈ కవిత:
దేవతలకు సమానమనిపిస్తాడు, ఆ అదృష్టవంతుడు
నీ పక్కన కూచుని నిన్నే చూస్తుండేవాడు, అతడి
పక్కనే కూచుని ఆలకిస్తుంటావు, వెండి వెలుగులు
విరజిమ్మేఅతడి మాటల్నీ,
ప్రేమచిప్పిల్లే మృదుమందహాసాన్నీ. ఇదే, ఇదొక్కటే
నా హృదయంలో చెయ్యిపెట్టి మరీ కలచివేస్తుంది
అలా నిన్నొక్క క్షణంపాటు చూసినా మాటలు పెగలక
గుండె గొంతుకి అడ్డుపడుతుంది.
అవును, నా నాలుక తెగిపోతుంది, నా లోపలనుంచి,
లోలోపల దేహాంతరాళంలో నిప్పు రాజుకుంటుంది
కళ్ళముందేదీ కనిపించదు, తరంగాలు విరిగిపడే
చప్పుడుతో నా చెవులు బద్దలవుతాయి.
చెమట కాలువలు కడుతుంది, తీవ్ర ప్రకంపన
నా దేహాంగాల్ని చుట్టబెడుతుంది, హేమంతకాలపు
పచ్చికలాగా వన్నె తగ్గి, మృత్యువు దగ్గరబడ్డట్టు
ప్రేమోన్మాదంలో కుప్పకూలుతాను.
అవును, ఇదంతా పడవలసిందే, నిరర్థకప్రాణినై
నేనిట్లా . ..
ఏమి కవిత ఇది శాఫో! లాంగినస్ ఈ కవిత దగ్గర స్పృహ తప్పిపోయాడంటే ఆశ్చర్యమేముంది? కవిత్వం మనుషుల్ని ఏం చెయ్యాలో అతడు తన పుస్తకం మొదట్లోనే ఇలా రాసాడు:
గొప్ప కవిత్వం మనకి నచ్చచెప్పాలనీ, ఒప్పించాలనీ చూడదు. అది పాఠకుణ్ణి అతనిలోంచి బయటకి లాగేస్తుంది. మెత్తగానూ, లాలనగానూ మాట్లాడే మాటలకన్నా నిన్ను నిశ్చేష్టుణ్ణి చేసే, నిర్ఘాంతపరిచే మాటలు మరింత శక్తిమంతమైనవి. .. అక్కడ గొప్పదనం అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది. హటాత్తుగా సంభవించిన అశనిపాతంలాగా అది తనకన్నా ముందున్నదాన్ని మొత్తం తనతో తీసుకొచ్చి ఆ రచయిత శక్తి సామర్థ్యాల్ని ఒక్క గుక్కలో మనముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది.
దాన్నే ఆయన sublime అన్నాడు. Loftiness అని కూడా అన్నాడు. అంటే వట్టి అందం కాదు, ఉగ్ర సౌందర్యం, చండ సౌందర్యం. మరింత సమగ్రమైన పదం వాడాలంటే ఉదాత్త సౌందర్యం అనాలి. ‘అది వినిపించేది చెవులకి కాదు, ఏకంగా మనసుకి.’ దీన్నే చలం గారు ‘కొత్త రక్తాన్ని కదను తొక్కించే సంగీతం ‘అని అన్నారు మహాప్రస్థానానికి యోగ్యతాపత్రమిస్తూ.
నీ యీ కవిత గురించి లాంగినస్ ఏమి రాసాడో నీకు చెప్పాలి కదా. ఇదుగో, On the Sublime లో, పదో భాగంలో, ఇలా అంటున్నాడు:
. .. కాబట్టి తాను చిత్రించడానికి ఏ అంశాలు చాలా ముఖ్యమైనవో వాటినే ఎంచుకోవడంలో మహోదాత్త సౌందర్యం ఉంటుంది, మరోవైపు, అలా ఎంచుకున్నవాటిని ఒకే మూర్తిగా నేర్పుగా అమర్చే శిల్పసామర్థ్యంలో ఉంటుంది. ఈ రెండింటిలోనూ మొదటిది, అంటే ఏ అంశాల్ని ఎంచుకున్నదో, ఆ ఎంపిక శ్రోతని ఆకర్షిస్తుంది. రెండోది, అంటే, అలా ఎంచుకున్నవాటిని ఏ పద్ధతిలో అమర్చారో ఆ అమరిక ఆకర్షిస్తుంది. ఉదాహరణకి శాఫోని చూడండి, మనల్ని గొప్ప కాంక్ష ముంచెత్తినప్పుడు నిజజీవితంలో మనకేమి సంభవిస్తుందో ఆ భావావేశాల్ని ఆమె జాగ్రత్తగా ప్రోది చేస్తుంది. అలా చేసినప్పుడు ఆమె అసాధారణ కౌశల్యాన్ని మనమెక్కడ చూడగలుగుతాం? అలా మనలో సంభవించే ఆ సహజభావోద్వేగాల్ని ఒకదానికొకటి పొదిగి అమర్చి మనకు చూపించే ఆమె శిల్పవిన్యాసంలో.
అని ఇదుగో పైకవిత, ఉదాహరణగా ఎత్తి చూపించాడు. కాని ఎందుకనో, అయిదో చరణంలో మాత్రం, మొదటి పాదం ఒక్కటే ఎత్తి రాసాడు. అది కూడా పూర్తిగా రాసి ఉంటే, ఈ కవిత మొత్తం మాకు దొరికి ఉండేది. సరే, ఆ కవితనలా ఎత్తి రాసాక, మళ్ళా ఇలా అంటున్నాడు:
ఆమె వాటన్నిటినీ, అంటే అవన్నీ తననుంచి విడివిడిగా, చెల్లాచెదురుగా ఉన్నట్టుగా, తన ఆత్మ, దేహం, చెవులు, నాలుక, కళ్ళు, రంగు- ప్రతి ఒక్కదాన్నీ, ఏకక్షణంలో చేరపిలుస్తున్నది. ఏకకాలంలో పరస్పర విరుద్ధాలుగా ఉన్న భావావేశాల్ని, అంటే ఆ శీతోష్ణాల్ని, తనలో జాగృతంగా ఉన్నవాటినీ, తాను వివశత్వం చెందుతున్నవాటినీ, రెండింటినీ ఒక్కచోట కలుపుతున్నది. ఆ క్షణాన ఆమె మృత్యువు ముంచెత్తినట్టుగా విచకితురాలై ఉన్నది. అందువల్ల ఏదో ఒక్క భావోద్వేగం కాదు, భావోద్వేగాలన్నీ కలగలిసిపోయిన ప్రభావం ఆమెలో కనిపిస్తున్నది. ప్రేమికుల్లో ఇటువంటివన్నీ కలగడం సహజమే గాని, ఇక్కడ, నేను చెప్తున్నట్టుగా, అలాంటి సందర్భాల్లో కలిగే భావోద్వేగాలన్నిటిలోంచీ ఏవి ముఖ్యంగా వర్ణించదగ్గవో వాటిని ఎంచి, ఆమె వాటిని ఒకే భావోద్వేగమూర్తిగా రూపుకట్టించడంతో, అటువంటి అనుభవాన్ని చిత్రించే అద్వితీయ ఖండికగా ఈ కవిత నిలబడుతున్నది..
ఇక్కడ గమనించవలసిందేమంటే, నీలో ఆ భావోద్వేగం కలిగించింది స్త్రీనా, పురుషుడా అన్నదాన్ని లాంగినస్ పట్టించుకోకపోవడం. ఇటువంటి సందర్భాల్లో ఆ పురుషుడితో అంత దగ్గరగా కూచుని మాట్లాడుతున్న ఆ స్త్రీ పట్ల ఈర్ష్య జనించిందని చెప్పి ఉంటే ఈ కవితని ఒక్క లాంగినస్ మాత్రమే కాదు, నీ తర్వాత యుగాలన్నీ నెత్తిన పెట్టుకుని ఉండేవి. కాని ఇక్కడ నిన్నింత విచలితురాల్ని చేసింది ఒక స్త్రీ, పురుషుడు కాడు, కాబట్టే, నువ్విప్పటికీ, సాహిత్యప్రపంచం గొంతులో పచ్చివెలక్కాయగా అడ్డుపడుతూనే ఉన్నావు.
కానీ నా వరకూ చెప్పాలంటే, నువ్విక్కడ స్త్రీ గురించి రాస్తే అది నిందార్హమూ కాదు, లేదా, ఇప్పటి ఫెమినిస్టులు భావిస్తున్నట్టుగా మరింత ఆరాధనీయమూ కాదు. ఇక్కడ నీలో అంత భావసంచలనం కలిగించింది స్త్రీనా, పురుషుడా అన్నదాని పట్ల నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. కావలసింది అలా సంచలించిపోగల అటువంటి హృదయం. లాంగినస్ కి ఆ సంగతి తెలుసు. విరహవ్యథిత అయిన చక్రవాకం ముందు మా మాష్టారు ఎలా మోకరిల్లారో, లాంగినస్ కూడా యీ పద్యం ముందు అలానే మోకరిల్లాడు.
పాఠకుణ్ణి విహాయసంలోకి transport చేసే ఇటువంటి కవిత్వం మా భారతీయ భాషల్లో చెప్పిన కవులు చాలామందే ఈ క్షణాన నాకు గుర్తొస్తున్నారు. కాని ఇదుగో, ఇంత చండ సౌందర్యానుభూతిని ఒక స్త్రీతో పలికించిన కవి ఎవరంటే, నాకు, భాగవతమే గుర్తొస్తున్నది. మరీ ముఖ్యంగా, గోపికా గీతలూ, భ్రమర గీతమూ.
కృష్ణుడితో తమ మనసులో మాట చెప్పుకుంటున్న గోపికా గీతాలు యుగాలుగా భారతీయ కవుల్నీ, భావుకుల్నీ వివశుల్ని చేస్తూనే ఉన్నాయి. సూర్ దాస్ నుంచి పోతనదాకా, మీరా నుంచి ఆండాళ్ దాకా ఆ గోపీ హృదయాన్ని ఎవరికి వారు తమ మాటల్లో తిరిగి చెప్పుకోకుండా ఉండలేకపోయారు. కాని వారిలో ఏ ఒక్కరూ కూడా గోపికలు చెప్పుకున్నట్టుగా తిరిగి చెప్పలేకపోయిన ఒక శ్లోకముంది (10:31:2). చూడు:
శరదుదాశయే సాధుజాత సత్
సరసిజోదర- శ్రీముషా దృశా
సురతనాథ తే- అశుల్కదాసికా
వరద నిఘ్నతో నేహ కిం వధః
(మనసు నీ పట్లనే లగ్నంగా ఉండటమంటే ఏమిటో మాకు తెలియచేసినవాడా! వరాలిచ్చేవాడా! శరత్కాల సరోవరంలో పూసిన తామరపువ్వు కాంతిని కూడా లాగేసుకోగల నీ చూపులు నీవి. జీతం బత్తెం అడక్కుండా నీ సేవలో ఉన్నవాళ్ళం. అలాంటి మమ్మల్ని నీ చూపుల్తో ఊపిరాకుండా చేస్తున్నావే, ఇది వధించడం కాదా!)
ఈ శ్లోకంలో ఉన్న ఈ తీవ్రతని అనువదించడం కష్టమని తెలుసుకాబట్టే, మామూలుగా, చిన్న భావం దొరికినా సీసపద్యం రాసే పోతన్నగారు, ఈ శ్లోకాన్నిట్లా కందపద్యంతో తేల్చేసారు.
శారదకమలోదర రుచి
చోరకమగు చూపువలన సుందర మిమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీరతనొప్పించుటిది వధించుట గాదే!
లాంగినస్ చెప్పిన ప్రమాణాల ప్రకారం చూస్తే నీ కవితలో నువ్వెట్లా పరస్పర విరుద్ధాలైన శీతోష్ణాల్ని ఒక్కచోట అమర్చిపెట్టావో, అలానే ఇక్కడ కూడా ‘శరత్కాలసాధుజాత సరసిజోదరశ్రీ’నీ, ‘అశుల్కదాసికల నిష్కారణ వధ’ నీ ఈ శ్లోకంలో ఇమిడ్చిపెట్టాడు సంస్కృత కవి. కానీ మాకు లేనిదల్లా దీన్ని గుర్తుపట్టగలిగే ఒక లాంగినస్!
నీకిష్టమైన మనిషి పట్ల నీ యిష్టం ప్రాణాంతకంగా ఉండటమంటే ఏమిటో ఆ గోపికలకు తెలుసు, నీకు తెలుసు, పొద్దున్నే ఇలా ఆకాశాన్ని పట్టి గుంజేస్తున్న కోకిలకు తెలుసు.
Featured image photography courtesy by Natalia Sevruk via pexels.com
5-5-2026


అద్భుతమైన భావయానం సార్… Sappho నుంచి Longinus వరకు, అక్కడి నుంచి గోపికల హృదయానుభూతి వరకు భావాల ప్రవాహాన్ని ఎంత అందంగా మిళితం చేసారో, ఆ ఉదాత్త అనుభూతి మనసులో నిలిచిపోతుంది..
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
స్త్రీ, పురుషుల మధ్య కాకుండా, ప్రేమకి దైవత్వాన్ని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ పోస్టు చదివితే తెలుస్తుంది భద్రుడు గారు, మీరు శాఫోకి రాసిన ఈ పన్నెండవ ఉత్తరంలో శాఫో కవిత గురించి లాంగినస్ తన On The Sublime లో చేసిన విశ్లేషణ గురించి ప్రస్తావించిన తీరు. లాంగినస్ నుంచి వ్యాసుడి శ్లోకం, పోతన పద్యం.. ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు తెల్లవారక ముందే మీకు వినిపించిన కోకిల కూజితం నుంచి…
అన్నట్టు ఒక కోయిన్సిడెన్స్:
ఈ పోస్టులో “.అది పాఠకుణ్ణి అతనిలోంచి బయటకి లాగేస్తుంది.” ఈ వాక్యం చదవగానే.. ఈ మధ్య నేను విన్న ఒక సినీ ప్రేమ గీతంలో ” లోలోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నా.. నా లోంచి నన్ను నేను బయటికి తేనా.. ” అంటూ ఒక సినీ గేయ రచయిత రాసిన పంక్తులు స్పురించాయి.. ఆశ్చర్యకరంగా మీరు ఈ పోస్టు పెట్టే ఓ రెండు మూడు గంటల ముందు అదే పాట పాడుకుని ఫేస్బుక్ లో పోస్టు చేశాను. అఫ్ కోర్స్, ఆ పాట బాణీ చాలా నచ్చినందుకనుకోండి.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
సర్, ఇక్కడ మీరింతకు ముందు చెప్పిన limb-loosening love కాదు, Sappho talks about fiercely intense and all consuming, overwhelming love!!
“ ఆకాశాన్ని పట్టి గుంజేస్తున్న కోకిల” 🙏🏽
అవును