ప్రియమైన శాఫో-8

ఇప్పుడు వైశాఖమూ, దాంతో పాటే భరించలేని ఎండా రెండూ కూడా ఏప్రిల్లోకి చొచ్చుకుని వచ్చేసాయి. ఒకప్పుడు ఈ రోజులకోసం ఎంద ఎదురుచూసేవాళ్ళం. ఏప్రిల్ చివరి వారమంటే వేసవి సెలవులు మొదలయ్యేవి. ఆ రోజుల్లో వేసవి ఒక చలివేంద్రంలాగా ఉండేది. మా ఊళ్ళో ఉండటమే మాకో సమ్మర్ కేంప్ లాగా ఉండేది. వసంతకాలపు ఆ అడవుల్లో, ఆ కొండవారన, ఆ తాటిచెట్ల తోపుల్లో, ఆ చింతచెట్ల నీడల్లో ఊరికినే ఎగురుతూ, తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ- మేము నేర్చుకున్నదేమైనా ఉందంటే, అదిగో, అప్పుడే, ఆకాశం కప్పుగా పుడమి మొత్తం పరిచిపెట్టిన పాఠశాల అది. అక్కణ్ణుంచి ఎంతదూరం వచ్చేసాను! ఇప్పుడు రోజంతా ఏసీ పెట్టుకుంటే తప్ప కూర్చోలేనంత వేడి. బయట మామిడిచెట్టుమీద మామిడికాయలు ఎండని పీలుస్తుంటాయి. ఒకప్పుడు ఆ కాయల కోసం ఎన్ని సాహసాలు, ఎన్ని దొంగతనాలకు పాల్పడ్డామని! నాకనిపిస్తోంది, వాతావరణంలో వచ్చిన ఈ మార్పు చూస్తే, నాకే కాదు, భూమి కూడా తన శైశవానికి దూరమైపోయిందా అని. ఈ పిల్లలకి ఏ జ్ఞాపకాలివ్వగలుగుతాం? వీళ్ళకి వేసవి అంటే భరించలేని ఈ వేడి, రోజంగా వీచే వడగాడ్పులే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయా?

ఆలోచిస్తుంటే, మా కవిత్వంలో కూడా, కవులు రాసుకున్న తమ బాల్య జ్ఞాపకాలు కాకుండా పిల్లల గురించి రాసుకున్న కవిత్వం మాత్రం ఏ మేరకుంది? పిల్లలగురించీ, బాల్యం గురించీ ఏవో సాధారణంగా అందరికీ తట్టే ఊహలు కాదు, తమ పిల్లల గురించి, వాళ్ళ నవ్వుల గురించి, అల్లరి గురించి, ఆటల గురించి రాసుకున్న కవిత్వమేదైనా ఉందా? ఎవరో ఒకరో ఇద్దరో రాసి ఉండకపోలేదుగానీ, పిల్లల గురించిన కవిత్వం చాలా తక్కువ. పిల్లల కోసం రాసిన కవిత్వం మరీ తక్కువ. తమ పిల్లలు, పెద్దయ్యాక ఏదో ఒకటి కావాలనే దాని మీద, మా సమాజంలో తల్లిదండ్రులు పెట్టే ధ్యాస, ఇప్పుడు తమ కళ్ళ ఎదట వాళ్ళు కదలాడుతుండగా, ఆ బాల్యాన్ని ఆ అపురూప క్షణాల్ని మాటల్లో పెట్టుకోడం మీద ఉండనే ఉండదు.

ఇక పిల్లల కోసం రాసిన కవిత్వం ఏదేనా ఉందా అని ఆలోచించాను. అంటే బాలగేయాలు, బాలసాహిత్యం లాంటి మూసలో రాసేవి కావు, పిల్లల మానసిక ప్రపంచంలోకి ప్రవేశించడం కోసం రాసే కవిత్వం. పిల్లల్తో మాట్లాడటానికి, వాళ్ళ కబుర్లు వినడానికి తమని తాము మానసికంగా అర్హుల్ని చేసుకోడానికి రాసుకునే కవితలు- ఇదుగో, టాగోరు రాసుకున్నాడే, ఇలాంటి కవిత:

టాగోర్, ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఒక single parent. కాని తన భార్య అకాలంగా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాక, తన అయిదుగురు పిల్లల్నీ టాగోరే స్వయంగా సాకాడు. కాని వాళ్ళల్లో మళ్ళా ఇద్దరు పిల్లలు, రేణుక, రాణి అని పిలిచేవారు ఆ అమ్మాయిని, ఆమె కూడా ఏడాది తిరక్కుండానే తల్లిని చేరుకుంది. ఇద్దరు మగపిల్లల్లోనూ, శమీంద్రనాథ అనే పిల్లవాడు, శమి అని పిలిచేవారు, తల్లి పోయిన మరో అయిదేళ్ళకు తాను కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక పెద్దమ్మాయి మాధురీలత, బేలా అని పిలిచేవారు, ఆమె కూడా ఆకాలంగానే టాగోర్ ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది.

తన భార్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక, టాగోర్  పిల్లల్ని తీసుకుని ఆల్మోరా వెళ్ళినప్పుడు, ఆ పిల్లలకోసం కవిత్వం రాసాడు, వాళ్ళు వినడానికి కథలు చెప్పాడు. అలా చెప్పిన కథలు నా చిన్నప్పుడు ‘పసిపాపల దరహాసం’ పేరిట తెలుగులో వచ్చిన ఒక అనువాదం చదివాను. ఆ నా పసితనంలో, టాగోరు, ఆ కథలు నాక్కూడా చెప్పినట్టే ఉండేది. నిజానికి ఆ కథలే నాలోంచి ఒక కవినీ, రచయితనీ మేల్కొల్పినవి. ఆ కథల్లో మరీ ముఖ్యంగా ఒక కథ నా కథే అనిపిస్తుంది. చిన్నప్పుడు మా అమ్మకీ నాకు మధ్య నడిచిన కథ. చూడు:

ఈ కథ చదివినప్పుడల్లా నాకు మా ఊళ్ళో, ఆ తాటాకుల ఇంట్లో, ఆ వంటగదిలో, ఆ చీకట్లో, మట్టిపొయ్యి పొగ ఊదుతూ మట్టి పొయ్యి వెలిగించే మా అమ్మనే కనిపిస్తూ ఉంటుంది. ఇన్నేళ్ళ తరువాత కూడా నేనేడో కొత్త సౌందర్యం చూసానని ఒక కవిత రాసి ప్రపంచం ముందుపెట్టినప్పుడు ప్రపంచానికి దాన్ని చూసి పట్టించుకునే తీరిక ఉండదు. బహుశా నేను చూస్తున్న సౌందర్యం స్థానంలో వాళ్ళకి ఒక మామూలు పక్షి ఈక కనిపిస్తూ ఉండవచ్చు. కాని ఎవరేనా ఆ కవిత చదివి ‘ఎంత అద్భుతంగా ఉంది’ అన్నారనుకో, అప్పుడు మళ్ళా నా కళ్ళల్లోకి వెలుగు వస్తుంది. ఈ ప్రపంచపు ఇంద్రజాలం సమస్తం మళ్ళా వచ్చి నన్ను చేరుతుంది.

నిన్న సగం దాకా రాసి ఆగిపోయిన ఉత్తరం, మళ్ళా ఈ పొద్దున్నే, మొదలుపెట్టాను.

‘ఈక’ చిన్నప్పుడు చదివిన కథ అయితే, చాలా ఆలస్యంగా చదివిన టాగోర్ కవిత ‘జేతే నహీ దిబొ’. అప్పటికి టాగోర్ కి ముఫ్ఫై ఏళ్ళుంటాయి. ఎస్టేట్ వ్యవహారాల బాధ్యత నెత్తిన పడింది. ఆ పనులు చూసుకోవడం కోసం దూరప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది.  రోజులతరబడి ప్రయాణాల్లోనే గడపవలసి వచ్చేది. అటువంటి పనిమీద ఒక శరత్కాల మధ్యాహ్నం ఇంటినుంచి బయలుదేరబోతున్నాడు. భార్య మొత్తం సామాన్లు సర్దిపెట్టింది. నౌకర్లు హడావిడి పడుతున్నారు. బయట బండి సిద్ధంగా ఉంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక, ప్రయాణానికి టాగోర్ గుమ్మం బయట అడుగుపెట్టగానే, అక్కడ అతడి పెద్ద కూతురు మాధురీ లత, నాలుగేళ్ళ పిల్ల, కనబడింది. ఆ చిన్నబిడ్డ గుమ్మం దగ్గరే కూచుని ఉంది. తండ్రిని చూస్తూనే ‘నిన్ను పోనివ్వను’ అంది.

‘నిన్ను పోనివ్వను ‘. ‘జేతే నహీ దిబొ ‘

ఆ ఒక్కమాట అతణ్ణి నిలువెలా కుదిపేసింది. ఆ ఒక్కమాట పట్టుకుని 176 పంక్తుల సుదీర్ఘమైన కవిత రాసాడు. 1892 లో రాసిన కవిత. కాని మరొక పాతికేళ్ళ తరువాత ఆ బిడ్డ అకాలంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రి ఆమెతో ‘నిన్ను పోనివ్వను’ అని అనలేకపోయాడు. ఆ తర్వాత ఆమె ఎప్పుడు గుర్తొచ్చినా ఆ నాలుగేళ్ళ బేలానే ఆయన కళ్ళ ముందు కదలాడుతూనే ఉండేదనిపిస్తుంది నాకు.

ఎందుకు రాస్తున్నాను ఇందంతా? ఇదుగో, నీ యీ కవిత, మొత్తం కవిత కాదు, ఒక శకలం Fragment 132 చదవగానే, నాకిదంతా గుర్తొచ్చింది. నువ్వు నీ బిడ్డ గురించి రాసుకున్న మాటలు:

నిజానికి , ఈ కవిత చదవగానే అన్నిటి కన్నా ముందు నాకు మరీనా స్వెతయేవా గుర్తొచ్చింది. ఆమె బిడ్డలు గుర్తొచ్చారు. కానీ శాఫో, ఈ ఉదయాన్నే నాకు నీ మనసు కష్టపెట్టాలని లేదు. ఈ మాటల్లో నీ సంతోషమంతా కనిపిస్తోంది. మైటిలెనిలో నువ్వు గడిపిన మొదటి రోజులు, ఆ బంగారు దినాలు గుర్తొస్తున్నాయి. అందుకనే టాగోరుని తలుచుకున్నాను, వాళ్ళమ్మాయి బేలాని తలుచుకున్నాను, మా అమ్మని తలుచుకున్నాను, ఆ కొండకింద పల్లెలో గడిచిన నా బాల్యాన్ని తలుచుకున్నాను. మరీనా గురించి మరోసారి మాట్లాడుకుందాం.

1-5-2026

16 Replies to “ప్రియమైన శాఫో-8”

  1. అందరికీ relatable బాల్యం, Tagore పాపాయి కవిత, heartbreaking జేతే నహీ దిబొ కవిత, అమ్మకీ బిడ్డకీ మధ్యన నడిచిన ఈక కథ, శాఫో తన బంగారు తల్లి మీద రాసుకున్న కవితా శకలం!!
    Very beautiful, Sir!

  2. నాకు మా ఊళ్ళో, ఆ తాటాకుల ఇంట్లో, ఆ వంటగదిలో, ఆ చీకట్లో, మట్టిపొయ్యి పొగ ఊదుతూ మట్టి పొయ్యి వెలిగించే మా అమ్మనే కనిపిస్తూ ఉంటుంది-మీ మాటలు సర్.
    ఇది చదివి దుఃఖం ఆపుకోలేక ఏడ్చాను.

    ఎందుకు చదువుతున్నాను ఇందంతా?
    ఇదుగో, నీ యీ కవిత, మొత్తం కవిత కాదు, ఒక శకలం Fragment 132 చదవగానే, నాకిదంతా గుర్తొచ్చింది. నువ్వు నీ బిడ్డ గురించి రాసుకున్న మాటలు:
    నాకో బిడ్డ ఉందినా బంగారుతల్లి బంగారంలిడియా మొత్తంసరితూగదు నా బిడ్డకి.
    కన్నీళ్ళు ధారా పాతంగా.
    నా కూతురి కోసం వివాహం చేసుకుని వెళ్తుంటే ఒకకవిత రాశాను.

    ఆ కళ్ళు!!

    * మా అమ్మాయి వివాహం జరిగాక అత్తవారింటికి భర్త చెయ్యి పట్టుకుని వెళ్తున్న వేళ )

    ఆ కూన కళ్ళు బెదిరిపోతున్నాయి.
    అమ్మ వైపు దీనంగా చూస్తూ.
    లాలన గా మౌనరాగం సాగుతుంటే
    మాటలు ఉండవక్కడ.
    మీటుతున్న హృదయ ప్రకంపనలు మాత్రమే
    ఆనంద విషాద రాగాల్ని కలగలిపిన
    ఆరోహణాల్ని, అవరోహణల్ని వినిపిస్తాయి.

    భరోసా స్పర్శ కాలానికి చిక్కి కాస్తంత పట్టుతప్పినప్పుడు కూన కళ్ళల్లో
    బెదురుచూపులు మూగభాష చెప్తాయి.

    కలత బారిన మనసుతో మసకేసిన కనులతో పశ్చిమతీరం వైపు చూపి
    జోడు తోడునొకటి అమ్మలా కలగలిపి
    శలవు తప్పదంటే కూన కళ్ళలో బెదురు.

    ఒక్కసారి తాకి తనిదీరక మరొక్కసారి చూసి
    సాగి ఆగి పరుగున రాబోయి చటుక్కున
    వెనుతిరిగి సాగుతుంటే
    కూనకళ్ళల్లో బెదురు అదురు.

    అమ్మ ఎప్పుడూ వెన్నంటి ఉండదనే సత్యం
    కాలం చెప్తూనే ఉంటుంది.
    ఆరోహణ మాధుర్యపు మమకారం వెల్లువై పొంగితే
    అవరోహణ జాలువారి కరుణామృతం కురిపించే తీరుతుంది.
    అమ్మ ఎన్నెన్ని రూపాలు ధరిస్తుందో కదా?
    కాలమెంత సాగినా!!

    మీకు మనసారా వందనాలు.

  3. శాఫో ప్రపంచం మెలమెల్లగా నన్ను లాక్కుపోతోంది. Beautiful letters sir. Enjoying each and eveyone.

  4. ఏదైనా పోగొట్టుకోవచ్చును. కాలం చేజారితే తిరిగి రాబట్టుకోలేము. అపురూపమైన బాల్యం, అమాయకమైన బాల్యం మనకు తెలిసేలోగా మాయమయ్యే బాల్యం కాలంబారిన పడినా మన మనస్సులలో చిరంజీవిగానే ఉంటుంది. కానీ మనలో కొందరే దాన్ని మధురాక్షరబధ్ధం చేయగలరు. అందరమూ కవులం కాలేము కదా.

    నాబాల్యం నన్నెన్నడూ విడిచిపోలేదు. ఏదోరకంగా నాలో నిత్యం తొంగిచూస్తూనే ఉంది. ఉద్యోగం చేస్తున్న కాలంలో కూడా కాస్త అందంగా కనిపించినవి – లోకందృష్టిలో కేవలం పనికిమాలినవే ఐన – చిన్నాచితకా వస్తువులు నా ఆఫీస్ కప్ బోర్డులో బోలెడు ఉండేవి. ఖాళీ సమయాల్లో వాటితో ఆడుకోవటం కూడా చేసేవాడిని. అదొక స్ట్రెస్ రిలీఫ్ ఎంగేజ్ మెంట్ క్రింద ఉండేది నాకు. ఏమిటిది చిన్నపిల్లవాడిలా అని మామేనేజర్ సేన్ గుప్తా నవ్వేవాడు. కాని నాకైతే బాగుండేది. చాలా.

    మీరన్నది నిజం. తెలుగుసాహిత్యంలో బాల్యాన్ని కవిత్వీకరించటం ఎక్కువగా కనిపించదు. ఇతరభాషాసాహిత్యాల విషయం తెలియదు. మనకు బాలసాహిత్యమూ అట్టేలేదు. ఈకొరతలు తీరితే బాగుంటుంది.

  5. మరోసారి
    మా అమ్మను
    మా ఇంటి వంటగదిలో దృశ్యాలను
    నా కళ్ల ముందు ఆవిష్కరించారు.
    అమ్మ ప్రేమ
    బాల్యం తాలుకా జ్ఞాపకాలు
    వేసవి శలవులు
    ఆనందంగా తాటి తోపుల్లో
    మామిడి తోటల్లో గడిపిన
    మధుర క్షణాలు గుర్తుకు వచ్చాయి
    ఇప్పుడు ఆ బాల్యం నేటి పిల్లలకు దక్కడం లేదు కదా!
    కాంక్రీట్ అరణ్యాల్లో
    ఒంటరిగా ఏ.సి గదుల్లో
    అంతర్జాలమే ప్రపంచంగా గడుపుతున్న
    కోట్ల మంది చిన్నారులను చూస్తే
    బాధేస్తుంది.
    మీ జ్ఞాపకాలు మళ్లీ
    మళ్లీ చదువుకున్నాను.
    చాలా మనసు దొంతరలను చీల్చుకుని
    నా గతం లోకి తీసుకెళ్లాయి.
    🙏

  6. ఆహా.. శాఫో రాసిన ఒక చిన్న కవితా శకలాన్ని పట్టుకుని ఠాగూర్ కవితని, కథల్ని మా హృదయాల్లోకి చొచ్చుకు పోయేలా చేశారు భద్రుడు గారు. ఇంతకుమునుపు వీటి గురించి నాకు తెలీదు. ఇక ముందు మాత్రం మర్చిపోలేనంత హృద్యంగా చెప్పారు మీ మాటల్లో. నా బాల్యం లో , మా పిల్లల బాల్యం, వాళ్ళ పిల్లల బాల్యం, మా తాతయ్య, బామ్మల వల్ల తెలిసిన మా తల్లి , తండ్రుల బాల్యంలో ఎవరికివారు చేసిన అమాయకపు చేష్టలన్నీ ఒక్కసారి కాళ్ళ ముందర కదలాడాయి. పొయ్యి దగ్గర వంట చేస్తున్న దృశ్యం చదువుతుంటే రాజమండ్రిలో, రాజోలు లో మా అమ్మ వంట చేసిన రోజులే గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి.

    మీరు “ఈ కవిత చదవగానే అన్నిటి కన్నా ముందు నాకు మరీనా స్వెతయేవా గుర్తొచ్చింది. ఆమె బిడ్డలు గుర్తొచ్చారు. కానీ శాఫో, ఈ ఉదయాన్నే నాకు నీ మనసు కష్టపెట్టాలని లేదు.” అంటూ వదిలెయ్యడం వలన ఇప్పుడు ఆ స్వేతయేవ ఎవరో.. ఆ కవిత ఏమిటో తెలుసుకునే వరకు ఇవాళ నిద్దర పట్టదు.

    మీరన్నట్టు “పిల్లలగురించీ, బాల్యం గురించీ ఏవో సాధారణంగా అందరికీ తట్టే ఊహలు కాదు, తమ పిల్లల గురించి, వాళ్ళ నవ్వుల గురించి, అల్లరి గురించి, ఆటల గురించి రాసుకున్న కవిత్వమేదైనా ఉందా? ” అని ఆలోచిస్తే నా మటుకు నాకు ఆవు వ్యాసం టైప్ లో శాస్త్రిగారు Little Soldiers సినిమా కోసం రాసిన పాటలు, మనసంతా నువ్వే సినిమాకి రాసిన “తూనీగా తూనీగా.. ” పాటలు స్ఫురించాయి. కానీ ఆ పాటలు కూడా పాతికేళ్ల క్రితం కదా ఈ మధ్య కాలం లో కదా అన్న విషయం కూడా వెంటనే గుర్తొచ్చింది.

    BTW, ఈక కథ చదువుతుంటే Whitman కవిత “There was a child went forth every day..” లో ఆవిష్కరించిన ఇలాంటి ఎన్నో భావచిత్రాలే నా ఆలోచనల్లో మెదిలాయి.

    ఆ కవిత ప్రారంభిస్తూ రాసిన ఈ లైన్లు చూడండి..

    There was a child went forth every day,

    And the first object he looked upon and received with wonder or pity or love or dread, that object he became,

    And that object became part of him for the day or a certain part of the day . . . . or for many years or stretching cycles of years.

    తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ చిన్న పిల్లాడు తను చూసే ప్రతి వస్తువులోనూ తనే ఉన్నట్టు అనుభూతి చెందుతున్నాడట. ఆ తూనీగలోనూ, ఆ ఈకలోనూ, ఆ వెన్నెల నీడలోనూ పిల్లలు వెతుక్కునే ఆశ్చర్యం, ఆప్యాయత, ఆత్మీయతలను పెద్దయ్యాక వస్తువుల వ్యామోహంలో పడి కోల్పోతున్నామన్న సంగతి తెలిసి అదేదో తెలియని బాధ కలిగింది

    మరోసారి మమ్మల్ని మా బాల్యపు తోటల్లోకి, జ్ఞాపకాల ఇంద్రధనుసుల్లోకి తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు భద్రుడు గారు.

    1. మీ స్పందన వల్ల నా ఉత్తరం మరింత శోభించింది. ఈ స్పందన కు మరింత విశ్వవ్యాప్త ప్రతిధ్వని లభించింది. హృదయ పూర్వక ధన్యవాదాలు సార్!

  7. చిన్న అంశాన్ని తీసుకొని ప్రపంచ సాహిత్య సారం మొత్తాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు.
    నా అనుభవం- రెండేళ్ళ వయసున్న మా మనుమడు వాకంగ్ లో కనిపించిన చిన్న రాయిని జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకరావడం వాడు నిద్ర పోయే సమయంలో ఆ రాయిని వాళ్ళ అమ్మా నానలు తీసి బయట వేస్తుంటే నేను కించిత్ బాధకు లోనయ్యేవాన్ని….

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading