ప్రియమైన శాఫో-9

ప్రియమైన శాఫో

రోజులు పొగలు కక్కుతున్నాయి. ఇంత ఎండ ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండలేదని కూడా వార్తలు చెప్తున్నాయి. ఆధునిక భారతీయ నగరాల నిర్మాణంలోనే ఏదో లోపం ఉందనీ, అవి మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా తట్టుకోలేకపోతున్నాయనీ నిన్న ఒక వ్యాసం చదివాను. పగటికీ, రాత్రికీ మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా తగ్గిపోతూ ఉందంటే, భూమి ఒక కొలిమిగా మారిపోతున్నట్టు.

పూర్వకాలపు జపాన్ కవిత్వం చదువుతున్నప్పుడు, వారు వేసవి రాత్రుళ్ళల్లో మంచు పడుతుందని రాస్తారేమిటి అనుకునేవాణ్ణి. కాని పదేళ్ళ కిందట ఒక వేసవి మా రాజవొమ్మంగిలో గడిపినప్పుడు అది కవి కల్పన కాదని అర్థమయింది. అక్కడ మా డాబా మీద పడుకుంటే, ఒక రాత్రివేళకీ,  చంద్రుడూ మేమూ కూడా తడిసిముద్దైపోయాం. అడవి మధ్య ఉన్న ఆ ఊళ్ళో ఆ రాత్రంతా  జపాన్ కవుల్నే తలుచుకుంటూ గడిపేసాను. చెట్లూ, అడవులూ అంతరించిపోతున్నాక, నదీ ప్రవాహాల్లో ఇసుక మేటలు వెయ్యడం మొదలుపెట్టాక, ఎక్కడలేని సిమెంటూ, కాంక్రీటూ తెచ్చి నగరాల్ని నిర్మించుకుంటూపోతున్నాక, పుడమి ఒక ఫర్నేసు కాకుండా ఎలా ఉంటుంది?

కానీ నిన్న సాయంకాలం ఇంకా వేడిచల్లారని నగర వీథుల్లో నడుస్తున్నప్పుడు దూరంగా వైశాఖపూర్ణచంద్రబింబం సాక్షాత్కరించింది. మామూలుగా పూలు పొద్దున్నే పూసినప్పుడు కాంతివిరజిమ్ముతుంటాయి, సాయంకాలానికల్లా రంగు వాడిపోతుంటాయి. కాని చంద్రబింబమనే పువ్వు విరిసేటప్పుడు పేలగా, రంగు తగ్గినట్టుగా, ఆకాశం మీద ఎవరో వెలుతురు మరక వదిలినట్టుగా కనిపిస్తుంది. కాని నెమ్మదిగా రాత్రి గడిచేకొద్దీ ఎక్కడలేనీ కాంతీ కురిపించడం మొదలుపెడుతుంది.

ఆలోచిస్తున్నాను, ఒకే కాలంలో, ఒకే దేశంలో ఈ రెండు విరుద్ధ జీవితానుభవాల్ని ఎలా అర్థం చేసుకోవాలని. ఒకవైపు రగుల్తున్న భూమి, మరో వైపు సుధలు కురిపిస్తున్న ఆకాశం. ఈ భూమినిట్లా మార్చింది మనిషి. అతడి దురాశ, అంధత్వం, అడ్డులేని స్వాతిశయం. బైరాగి అన్నట్టుగా ‘గ్లానిలో అవసానమొందినది ఆ అహంకృత సింహనాదం’. కాని మరోవైపు వేడెక్కుతున్న ఈ లోకంలోనే ఇంకా పరిమళాలు చిందిస్తున్న పూలు, ఇంకా ప్రాణవాయువులు వీస్తున్న చెట్లు,  ఇంకా లోకం పట్ల తన దయావర్షాన్ని కురిపిస్తున్న చంద్రుడు.

ఈ సాంత్వన, ఈ అనునయం, ఈ చల్లదనం వేరే లోకానివా? వీటిని చూస్తున్నందువల్లనే కదా, ఈ జీవితం పట్ల ఇంకా ఆశ నశించడం లేదు! ఇప్పుడు కూడా ఇలా మండుతున్న కాలంలో కూడా ఇటువంటి సౌందర్యాన్ని మేము చూడగలుగుతున్నామంటే, నువ్వు ఆ సముద్రతీర నగరంలో, ఆ చల్లని వేసవిలో మరెంత సౌందర్యాన్ని చూసి ఉంటావో కదా! భవనాల్తో, బంగారంతో, లోహాల్తో, సైన్యంతో సంబంధం లేని సౌందర్యం. అటువంటి అందమేదో చూసి ఉంటావు కాబట్టే, నీ ఉత్ప్రేక్షల్లో  కూడా ఒక అద్వితీయ మార్దవత్వం కనిపిస్తుందన్నాడు ఒక అలంకారికుడు.

నీకు అయిదారు శతాబ్దాల తర్వాత, కవిత్వ శైలి గురించి రాస్తూ, డెమిట్రియోస్ అనే గ్రీకు లాక్షణికుడు తన పుస్తకం On Style (De Elocutione) లో సాధారణంగా హాస్యనాటకాల్లో మనకి కలిగే ఆహ్లాదం ఉత్ప్రేక్ష ల్లోంచి పుడుతుందని చెప్తూ, అరిస్టోఫేన్స్ లాంటి రచయితల్ని ఉదాహరించాడు.  కానీ హృదయాన్ని సుకోమలంగా స్పృశించే ఉత్ప్రేక్షలు నీవని చెప్తూ ఈ వాక్యం  ఉదాహరించాడు:

ఈ ఒక్క పోలిక మాత్రమే అతణ్ణుంచి మాకు దొరికింది. Fragment 156  గా మేము దాచుకున్న ఈ వాక్యశకలాన్ని, ఆ లాక్షణికుడు, ఈ ఉత్ప్రేక్షకోసం ఎత్తి రాసుకున్నాడు. అతడు తన పుస్తకంలో దాచుకున్న నెమలీకలాగా ఈ వాక్యం భద్రంగా ఉండిపోయింది. కానీ, దీని చుట్టూ ఎంత పెద్ద ప్రపంచం మాకు అందకుండా పోయింది! సంగీతవాద్యంకన్నా మరింత సంగీతజనకమనీ, బంగారాన్ని మించిన బంగారమనీ నువ్వు దేన్ని ప్రశంసిస్తున్నావో మాకెప్పటికీ తెలియకుండా పోయింది. అది నీ బిడ్డ చిరునవ్వునా లేక అనక్టోరియా చూపులా లేక ఏజియన్ సముద్రం మీంచి వీచే గాలులా లేక మైటిలెని నగరం మీద కురిసే వెన్నెలా?  

నిన్న వైశాఖపున్నమి చంద్రుణ్ణి చూస్తూ ఈ వాక్యమే పదే పదే తలుచు కున్నాను. ఏమి? ఆ చంద్రుడే ఎందుకు కాకూడదు?

Far sweeter-singing than a lute,
More golden than all gold.

ఆ లాక్షణికుడు దీన్ని hyperbole అన్నాడుగాని, మా సంస్కృత లాక్షణికులు దీన్ని వ్యతిరేక అలంకారం అన్నారు. ‘ఉపమేయం’ అంటే దేన్ని పోలుస్తున్నామో అది, ‘ఉపమానం’ అంటే దేనితో పోలిక తెస్తున్నామో, ఆ పోలికని మించి ఉండటం అన్నమాట. దీన్ని ‘ఉపమేయ ఉత్కర్ష’ అని కూడా అన్నారు. అంటే ఏ ఉపమానం కూడా ఆ ఉపమేయాన్ని పోల్చడానికి సరిపోదన్నమాట.

జయదేవుడి గీతగోవిందంలో ఈ వ్యతిరేకాలంకారం చాలాచోట్ల కనిపిస్తుంది. తమ ఇష్టదైవాన్ని తమకి తెలిసిన ఏ ఉపమానంతోనూ పోల్చలేమనే భావన  భక్తికవుల్లో పదే పదే వినిపిస్తుంది. పూర్వకాలపు సంస్కృత కవులు శృంగార రసమయంగా కవిత్వం చెప్తున్నప్పుడు కూడా తమ ప్రేయసిని వర్ణించడానికి  ఉపమానాలు చాలటం లేదనడం మనకి కనిపిస్తుంది. ‘కావ్యాలంకార సూత్రవృత్తి’లో సంస్కృత అలంకారికుడు వామనుడు దీనికొక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఆ శ్లోకం ఎక్కడుందా అని వెతికితే విద్యాకరుడి ‘సుభాషిత రత్నకోశం’ లో కనిపించింది.

కవి తన ప్రేయసితో అంటున్నాడు: ‘నీ చూపుల ముందు కలువపూల వనం కూడా తక్కువనిపిస్తోంది, కొత్తగా ఊరుతున్న తేనెలు కూడా కొంచెమనిపిస్తున్నాయి, గొప్ప రససంపదగా చెప్పదగ్గ అమృతాన్ని చూస్తే నవ్వబుద్ధేస్తోంది, సోమరిగా వాలుతున్న నీ తీపి వాలుచూపుల నెపాన నిన్ను కోరుకునేవాళ్ళ మనసుల్లో విషాన్ని నింపిపెడుతున్నావు’ అని.

తన ప్రేయసి చూపుల ముందు అమృతం కూడా నవ్వులపాలవుతుందనే ఈ అతిశయోక్తి అందంగానే ఉంది. ఎందుకంటే, ఇక్కడ కవి అమృతాన్ని తన ప్రేయసి చూపుల్తో పోలుస్తున్నాడు కాబట్టి. కానీ నీ వాక్యంలో, నువ్వు ‘వీణానాదం కన్నా మంజులతరమనీ, పసిడికన్నా మించిన పసిడికాంతి’ అనీ దేన్ని పోలుస్తున్నావో మాకు తెలియలేదు కాబట్టి, నీ వాక్యం మరింత శోభాయమానంగా ఉంది. దీన్ని ఉదాహరించిన లాక్షణికుడు దీన్నిట్లా ఉపమేయం లేకుండా భద్రపరచడంతో మా మనసుల్లో ఎన్నటికీ ఆరని ఒక దీపం వెలిగించి వెళ్ళిపోయాడు.

ఎందుకంటే, ఇటువంటి పోలికనే  నువ్వు నీ మొదటి కవితలో చెప్పావు, కొందరు అందాన్ని సైన్యంలోనో, నౌకల్లోనో, అశ్వాల్లోనో చూస్తారు, కాని నిజమైన అందం చూసే చూపుల్లో ఉంది, తాను ప్రేమించినవాడికోసం సమస్తం వదిలిపెట్టి వెళ్ళిపోగలిగిన హెలెన్ మనస్సులో ఉంది అని చెప్పావు. నిజమే, అనక్టోరియా చిరునవ్వులో, ఆమె నడకలో, ఆమె వదనం మీద పడే తొలిసూర్యకాంతిలో నువ్వు సౌందర్యాన్ని చూస్తున్నావని కూడా చెప్పావు. కాని సంస్కృత కవి లాగా, నువ్వు చూస్తున్న సౌందర్యమంతా నీ ప్రేయసిలోనే చూస్తున్నావని చెప్పి ఉంటే అది వేరే సంగతి. కానీ నీ బిడ్డ గురించి చెప్తున్నప్పుడు కూడా మొత్తం లిడియాదేశమంతా ఆమె ముందు సరితూగదన్నావు. ఇదే, నీలో నన్ను సమ్మోహితుణ్ణి చేసే అంశం.

నువ్వు చూస్తున్న అందం ఒక స్నేహితురాలికో, నీ బిడ్డకో, లేదా యాపిల్ తరువుల్ని చుట్టి ప్రవహించే శీతల ప్రవాహపు మర్మరధ్వనికో పరిమితం కాదు. నిజానికి ఏదో ఒకదానిలోనే అందాన్ని చూసేవారు తక్కిన ప్రపంచ సౌందర్యానికి అంధులైపోతారు. నీకన్నా చాలా శతాబ్దాల తర్వాత, రొమాంటిక్ కవులు అనుభవించిన అవస్థ అదే. వాళ్ళకి జీవితంలోని సత్యం, సౌందర్యం, అర్థం, ఆనందం అన్నీ తమ ప్రేయసికే పరిమితమైపోయాయి. ఆ ప్రేయసిలేని ప్రపంచం వారికి శుష్కంగానూ, శూన్యంగానూ, నిరర్థకంగానూ కనిపించింది. కానీ, వారు తమ ప్రేయసిలో చూస్తున్న సౌందర్యం నిజానికి తాము తమ స్వేచ్ఛలో, తమ మనసులో పొంగులెత్తుతున్న ఉత్సాహవార్ధిలో అని గమనించి ఉన్నట్లయితే, ఆ సంతోషాన్ని లోకమంతటా చూసి ఉండేవారు.

ఏదో ఒక మనిషిలోనో, స్థలంలోనో, నమ్మకంలోనో మాత్రమే సౌందర్యం చూడటం విగ్రహారాధన లాంటిది. దానికదే ఒక religion. కానీ నీకులాగా ఆ సౌందర్యం తనలోనే ఉందని గుర్తుపట్టినప్పుడు, సుందరమైనవి సుందరంగా గోచరించడమే కాదు, సామాన్యమైనవి కూడా సుందరంగా గోచరిస్తాయి. వాటిని చూస్తే ‘బంగారాన్ని మించిన బంగారం లాగా’ కనిపిస్తాయి.

మా దేశంలో మధ్యయుగాల భక్తికవుల్లో రెండు రకాల కవులుండేవారు. ఒకరు సగుణభక్తి కవులు. వారికి భగవంతుడు ఏదో ఒక రూపంలోనో, నామంలోనో కనిపించేవాడు. అందుకని వారు ఆ నామరూపాల్ని గట్టిగా పట్టుకుని ఉండేవారు. కాని మరో తరహా భక్తి కవులున్నారు. నిర్గుణ భక్తి కవులు. కబీరు లాంటివాళ్ళు.  వారు అనంతభుజాలున్న భగవంతుణ్ణి నాలుగు భుజాలు మాత్రమే ఉన్నవాడిగా చూడటానికి ఇష్టపడలేదు. ఈ రెండు స్రవంతుల్నీ టాగోరు అద్భుతంగా మేళవించుకున్నాడు. భగవంతుణ్ణి ఒక రూపంలోనో, ఒక నామంలోనో మటుకే చూడలేమన్న మెలకువ ఆయన నిర్గుణ భక్తి కవులనుంచి తెలుసుకున్నాడు. అదే సమయంలో సగుణభక్తికవుల్లాగా, భగవంతుడి manifestation ని ఈ బయటి ప్రపంచంలో, కళ్ళతో చూడాలనుకున్నాడు, చెవులారా వినాలనుకున్నాడు. అందుకని మెరుపులో, మేఘంలో, ప్రభాతాన కొలనులో విరిసిన పుష్పంలో, రేవులో నవ్యపురుషుడెవరో వాయిస్తున్న వీణానాదంలో, అర్థరాత్రి తలుపు తట్టిన అతిథిలో- ప్రతి ఒక్కచోటా ఆయన ఆ దివ్య సౌందర్యాన్ని పోల్చుకున్నాడు. ఇది దాదాపు మీ paganism లాంటిది.

అయితే టాగోరు ప్రకటించిన ప్రేమ నీ ప్రేమలాగా limb-loosening కాదు. రోజంతా పనిచేసుకున్నాక, సాయంకాలం నీ ముందు హాజరై, ప్రశాంతంగా ఒక పక్కన కూచోడం లాంటిది. ఈ ప్రపంచ ఉత్సవంలో, తన వంతు వాద్యం తాను వాయించాక, ఇక మౌనంగా సెలవుతీసుకోవడం లాంటిది. కానీ నీ కవిత్వం నిమిషం కూడా విరామం లేని జలపాతం లాంటిది. ఎప్పటికీ, చివరికి ప్రవాసంలో ఉన్నప్పుడు కూడా జీవితమధ్యంలోనే ఉండాలనే ఉత్సాహతరంగం అది. టాగోర్ ఆ ఉత్సవంలో మౌనంగా పాల్గొంటే, నువ్వే ఆ ఉత్సవమే ప్రవహిస్తున్నావు. ఆయన సౌందర్య దర్శనంలో ఈషద్విరాగం ఉంది. కాని నీ సౌందర్య దృష్టిలో సంపూర్ణ సంలీనత ఉంది. అందుకనే  నీ కవిత్వం నాకు మరీ ఇష్టమనిపిస్తుంది. బహుశా మా భారతీయ కవులందరిలో, ఒక ఆండాళ్, ఒక మీరా, ఒక అక్కమహాదేవి, ఒక కమలాదాస్, ఒక రేవతీదేవి- వీళ్ళంతా ఈ విషయంలో నీలాంటివాళ్ళే. కాబట్టే వాళ్ళ కవిత్వం చదువుతున్నప్పుడు ‘తంత్రీవాద్యం కన్నా మధుర తరంగా’ వినిపిస్తూ ఉంటుంది.

అందుకనే నీలాంటి వాళ్ళకి జీవితం ఒకవేపు పొగలు చిమ్ముతున్నా మరో వైపు సుధలు కురిపిస్తూ ఉంటుంది. ఆ రసార్ణవాన్ని పోల్చడానికి మాకు తెలిసిన ఏ ఉపమానాలూ చాలవనిపిస్తుంది.


Featured image photography courtesy: Vijay Jeedigunta

2-5-2026

2 Replies to “ప్రియమైన శాఫో-9”

  1. ఎంత అదృష్టం చేసుకున్నాయో ఈ నా కళ్ళు…మీ ఈ సువర్ణాక్షరాల్ని ఒక్క అక్షరమూ వదలకుండా అత్యంత శ్రద్ధగా చదువుతూ ఆనందం పొందేందుకు.
    మీకు నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading