
కొత్తకోట శ్రీనివాసరావు శ్రీకాకుళానికి చెందిన యువకుడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎమ్మే చేసారు. మూడేళ్ళ కిందట ఆయన నాకు ఫోన్ చేసి నా కథల మీద డాక్టరల్ పరిశోధన చేస్తున్నట్టుగా చెప్పారు. అప్పుడు, అంటే 2023 మార్చిలో, నా కథల సంపుటం వెలువడుతున్నప్పుడు ఆ సమావేశానికి ఆయన్ని ఆహ్వానించేను. ఆ పుస్తకం ఒకటి ఆయన చేతుల్లో పెట్టాను.

మొన్న ఆయన రీసెర్చి గైడు ఫోన్ చేసి శ్రీనివాసరావుకి డాక్టరేట్ అవార్డు చేస్తున్నట్టుగా చెప్తూ ఆ సర్టిఫికేటు వాట్సప్ లో నాకు పంపించారు.
నాకు చాలా సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. సంతోషమెందుకంటే నా కథలమీద ఒక యువకుడు పరిశోధన పత్రం సమర్పించి డాక్టరేట్ పొందడం. కానీ అలా ఆ యువకుడితో పరిశోధన చేయించి డాక్టరేట్ అవార్డు చేయడానికి కారణం ఎవరై ఉండవచ్చునో నా ఊహకి అందలేదు.
కాని ఇప్పటికి తెలిసింది, డా.శ్రీనివాస రావుతో ఈ పనిచేయించింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులైన జర్ర అప్పారావు అని.

ఆచార్య జర్ర అప్పారావు
అప్పారావు పాడేరు కు చెందిన అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి. ఆయన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మే, పి.ఎచ్.డి చేసి, చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ప్రొఫెసరుగా ఎదిగారు. 2011 నుంచి ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన పర్యవేక్షణలో 85 మంది డాక్టరల్ పరిశోధనలు చేసారు. అయిదుగురు ఎం.ఫిల్ పరిశోధనలు చేసారు. మరో ఇద్దరు పి.ఎచ్.డి, ఎం.ఫిల్ పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన 36 పత్రాలు సమర్పించారు. దాదాపు అరవై దాకా పత్రాలు ప్రచురించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వెలువరించే ఆంధ్ర సాహితి పత్రికకి సంపాదకులుగా ఉన్నారు.
నా మిత్రులు చాలామంది విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లుగా, వైస్-ఛాన్సలర్లుగా పనిచేస్తున్నారు. కాని ఈ నాలుగు దశాబ్దాల్లో ఎవరికీ కూడా నా సాహిత్యం మీద ఒక ఎం.ఫిల్ పరిశోధన కూడా చేయించవచ్చునని అనిపించలేదు. అలాంటిది, ఏకంగా ఒక
డాక్టొరల్ పరిశోధన చేయించడానికి ఈ గిరిజన ఆచార్యుడు కారణమని తెలిసినప్పుడు నాకు పాడేరులోని మోదకొండమ్మవారు మనసులో మెదిలారు.
మొన్న వారు ఫోన్ చేసినప్పుడు, వారు కూడా గురుకుల పాఠశాలల విద్యార్థి అనీ, నా గురువుల్లో కొందరు వారికి కూడా గురువులనీ తెలిసింది. అంతేకాదు, ఆయనకి మా నాన్నగారి గురించి కూడా తెలుసని తెలిసింది. ‘మీ నాన్నగారు గిరిజనులకోసం ఎంతచేసారో మా ఊళ్ళల్లో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం’ అని ఆయన అంటున్నప్పుడు నా హృదయంలో చెప్పలేని అనుతాపం కలిగింది. మా నాన్నగారు తన జీవితమంతా గిరిజనులు చదువుకోవాలని ఎంతగా తపించిపోయేవారో గుర్తొచ్చింది. తన కరణీకంలో ఉన్న గ్రామాల్లో , 1975 లో, బోయపాడులోనూ, తాళ్ళపాలెం లోనూ ఆశ్రమపాఠశాలలు తెరిచినప్పుడు ఆయన పొందిన సంతోషం అంతా ఇంతా కాదు. మా ఇంటికి ఏ బంధువులొచ్చినా ఆయన ఆ స్కూళ్ళకి తీసుకుపోయి చూపించేవారు. ఆయన ఆ స్కూళ్ళ గురించి చెప్పే మాటలు విన్నవాళ్ళకి వాటిని ఆయన నడుపుతున్నట్టే అనిపించేది. గిరిజన దేవతలకి ఆ సంతోషం అర్థమయింది కాబట్టే, గిరిజన ఆశ్రమ పాఠశాలల్ని చూసే బాధ్యత మూడున్నర దశాబ్దాల పాటు నాకు అప్పగించారు.
అందుకని మొన్న ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఆ మాటే ఆయనతో చెప్పాను. నాతో మాట మాత్రం కూడా ప్రస్తావించకుండా ఒక ప్రతిభావంతుడైన పరిశోధక విద్యార్థిని ఎంచుకుని వారితో ఆయన నా కథలమీద డాక్టరేట్ చేయించడం నాకు మొత్తం గిరిజన దేవతలు, గిరిజన సమాజం అందించిన కానుకగా అనిపించింది.
కొత్తకోట శ్రీనివాసరావు, ఇప్పుడు డా.కొత్తకోట శ్రీనివాసరావు, ఈ మధ్య డి.ఎస్.సిలో ఎంపికై శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ గా చేరారని తెలిసింది. వచ్చేనెలలో వారి వివాహం అని కూడా తెలిసింది.
ఆ ఆచార్యుడికీ, ఈ ఉపాధ్యాయుడికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ గిరిజన దేవతలు వారిద్దరినీ సదా అనుగ్రహిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
22-4-2026
PS: పై వ్యాసానికి స్పందనగా శ్రీ అప్పారావు గారు నాకు పంపిన సందేశం:
పూజ్యశ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి ( IAS ) సాహిత్యం మీద పరిశోధన చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మహానుభావుడికి ఆదివాసీ ప్రాంతానికి విడిదీయరాని అనుబంధం ఉంది ఈ మహనీయుడు ఆదివాసీల గుండెల్లో గూడేల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. చిన్నప్పటినుండి ఆదివాసీలతో కలయ తిరిగిన మహనీయులు. ఆదివాసీల యొక్క కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, బాధలు,సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యం మీద, ఆదివాసీల పైన జరుగుతున్న దోపిడీ పైన అపార అనుభవం ఉన్నటువంటి రచయిత. ఆదివాసీల సంస్కృతిని అతి దగ్గరగా చూసినటువంటి రచయిత, ఈతరం మానవతా వాది. ఆదివాసీల అదృష్టం కొద్దీ పాడేరు ఐటిడిఏ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేసి, శ్రీశైలం ఐటీడీఏలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసి వేలాదిమంది అమాయక ఆదివాసీ బిడ్డలను చదువుకు దగ్గర చేసిన గొప్ప విద్యావేత్త.
ఏమి రాసామో అది వస్తువు ఎలా రాసామో అనేది శైలి అని పెద్దలు చెప్పారు. ఇక్కడ పూజ్య శ్రీ చినవీరభద్రుడు గారు తీసుకున్నటువంటి వస్తువు ఆదివాసీల జీవితం, వారి కుటుంబ జీవనం,సామాజిక ఇతివృత్తాలుతో పాటు మరెన్నో సామాజిక అంశాలు ఉన్నాయి. సామాజిక స్పృహ ఉన్న రచయిత. ఈయన కథలు మనసుకు ఏమరుపాటు గాని కంటికి రెప్పపాటు గాని రానివ్వని గుణం ఉంటుంది. ఒకేసారి కూర్చొని కథ ఆసాంతం చదివించే గుణం ఉంటుంది. ఈయన కథల్లో ఆరంభం అద్భుతంగా ఉంటుంది. కథా గమనం వేగంగా ఉంటుంది. ముగింపు మహా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా విసుగుబాటు లేకుండా చిక్కనైన రచనా పాటవంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. చివరకు ఆలోచనలను రేకత్తించే విధంగా ఈయన రచనలు ఉన్నాయి.
ఇంతటి గొప్ప రచయిత సాహిత్యం పైన పరిశోధన చేయించడం నా అదృష్టంగా భావిస్తూ ఆ మహనీయుడు నిండు నూరేళ్లు, హాయిగా, సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఇంకా ఎన్నో కథలు, కవిత్వం, నవలలు,పాటలు రాయాలని ఆదివాసీ గ్రామదేవతలు మోదకొండమ్మ, బోడకొండమ్మ, కోరాలమ్మ, జాకరమ్మ, మత్స్య దేవత, మాడుగులమ్మ వెన్నెలమ్మ, రాకేశమ్మ, రాచకొండమ్మ, కొత్తమ్మ, సింగారాలమ్మ తల్లి, మారెమ్మ తల్లి, నూతమ్మ తల్లి, లింగేరమ్మ తల్లి, నీలమ్మ తల్లి, బాపనమ్మ తల్లి, దారకొండ దారాలమ్మ తల్లి మొదలైన ఆదివాసీ గ్రామదేవతలను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
మహాశయా తమ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అమాయక ఆదివాసీల పైన నా పైన ఉండాలనీ ఆశీస్తున్నాను. తమ సాహిత్యం పైన పరిశోధన చేసిన (కొత్త కోట శ్రీనివాసరావు) పరిశోధకుడు మంచి వ్యక్తి,ప్రేమగల మనిషి,పెద్దల ఎడల, గురువుల పట్ల గౌరవం, వినయ విధేయతలు కలిగిన ఉత్తమోత్తమ విద్యార్ధి. కుటుంబం పట్ల బాధ్యతాయుతమైన కుటుంబ సభ్యుడు. ఈ డాక్టర్ కొత్తకోట శ్రీనివాసరావు ను నిండు మనస్సుతో ఆశీర్వదించండి మహాశయా!
ఇట్లు
తమ విధేయుడు
ఆచార్య జర్రా అప్పారావు
తెలుగు శాఖాధిపతి
ఆంధ్రవిశ్వకళాపరిత్తు


ఆహా.. చదువుతుంటే ఎంత సంతోషంగా అనిపించిందో.. మీ నాన్న గారి గురించిన మీ మాటలు కళ్ళు తడి చేసాయి. మీ కథలకి సముచిత సత్కారం. మీకు శుభాభినందనలు. జర్ర అప్పారావు గారికి ధన్యవాదాలు. వీలైతే కొత్తకోట శ్రీనివాసరావు గారు తన డాక్టరేట్ కోసం సమర్పించిన ఆ పరిశోధనా పత్రాలను చదవాలని చాలా కుతూహలం గా ఉంది.. ముఖ్యంగా రాముడు కట్టిన వంతెన కథ గురించి
తప్పకుండా సార్!
తెలుగు సాహితీ సుమాలు ధన్యవాదాలు అందరికి🙏🙏
ధన్యవాదాలు సార్!
మీ కథలపై పరిశోధన చేసిన శ్రీనివాస్ రావు, రీసెర్చ్ గైడ్ గా ఉన్న అప్పా రావు గారికి అభినందనలు. మీ రచనా వైశిష్ట్యం అందనంత ఎత్తు లో ఉందనే వారి వినయపూర్వక మాట వాస్తవం. ఈ సందర్భంలో వేములవాడ సాంబ కవి *లోభసంహరం* రచనపై పరిశోధన చేసిన విష్ణు వందన గారు గుర్తుకొచ్చారు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
చాలా సంతోషం సార్, ఏమీ ఆశించని మీ కృషికి, దేవుడు యిచ్చిన ఫలితంగా భావిస్తున్నాను
చాలా సంతోషం శ్రీనివాస్!
మీలాంటి పెద్దలు, గురువుల ఆశీర్వాదం పొందడం నా పూర్వజన్మ సుకృతం… మీ కథలపై పరిశోధన చేసినందుకు నేను నిజంగా అదృష్టవంతుణ్ణి… మీ కథల్లో ఉన్న కుటుంబ విలువలు, సామాజిక అంశాలు నేటి సమాజంలో ఒక మనిషి సమున్నతంగా జీవించడానికి దోహదపడతాయి. మీ రచనా వైశిష్ట్యం నా పరిశోధనా దృష్టికి ఏ మాత్రం అందనంత ఎత్తులో ఉంది.
మీ సాహిత్యంపై పరిశోధనకు నాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ… మీ డా. కొత్తకోట శ్రీనివాసరావు.
హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీనివాస్!
అభినందనలు సర్ . మీ రచనల మీద ఇంకా విస్తృతమైన పరిశోధనలు జరగాలి. ఒక కొత్త మానవీయ సమాజం రూపొందాలంటే మీ ఆలోచనల స్థాయికి అనేక మంది ఎదగాలి.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్¡
అభినందనలు సర్ మీకు మరియు డా కొత్తకోట శ్రీనివాస రావు గారికి. ఒక గొప్ప సందర్భం. శుభాకాంక్షలు సర్
ధన్యవాదాలు సార్!
ఇది మొదటిది. ఇంకా ఎన్ని రావాల్సి వుందో చినవీరభద్ర సాహిత్యం మీద! అనేక అభినందనలు!
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
చాలా చాలా సంతోషం కలిగింది.
ధన్యవాదాలు
చాలా మంచి వార్త. మీ కథల మీద , రచనల విస్తృత స్థాయిలో పరిశోధన జరగాలి సార్… ఇదే మొదటి మెట్టు… శుభాభినదనలు సార్…
హృదయపూర్వక ధన్యవాదాలు సంజయ్!
ఒక మహోన్నత వ్యక్తియై యున్న , తమ మ
హోన్నత రచనల పరీమళాన్ని గ్రోలి ,
తెలుగు నేల పరవశాన దేలి యాడ ,
గింజు కొన నేల ‘ కుమతులు ‘ కేలు సాచి ?
ధన్యవాదాలు సార్!
శుభాభినందనలు సర్
ఒక సాహిత్యకారుడికి తన సాహిత్యకృషి పైన తన జీవితకాలం లోనే సఫలీకృత మైన అధ్యయనం జరగటం కన్నా పొందదగిన గొప్పపురస్కారం ఉండదు. మీ సాహిత్యకృషీవలత్వం ధన్యత చెందింది. మనఃపూర్వకశుభాభినందనలు. మీరు మరింతగా సముచితసత్కారాలు పొందుదురు గాక.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ప్రేమ, దయ ,జాలి,కరుణ ,మానవత్వం పరిమళించిన మహనీయుడు పూజ్య శ్రీ చిన్న వీరభద్రుడు (IAS) గారు ఎందరో అమాయక ఆదివాసులను బుద్ధి జీవులు గా మేధావులుగా తయారుచేసి ఈ సమాజానికి అందించిన విద్యావేత్త భారతదేశంలో ఉన్న 12 కోట్లు మంది ఆదివాసులు తరఫున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 32 లక్షల మంది ఆదివాసీలు తరుపున ధన్యవాదాలు. ఏమిచ్చి ఆ మహనీయుల ఋణం తీర్చుకోగలం ఆ మేధావి సాహిత్యం పై పరిశోధన చేసి ఆ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయడమే ప్రస్తుత మా కర్తవ్యం.. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది సామాజిక ప్రతిబింబమే సాహిత్యం ఏ సమాజ హితాన్ని కోరి ఆ మహానుభావుడు సాహిత్యాన్ని సృష్టించారో ఆ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని పరిశోధించి పరిశీలించి సిద్ధాంత గ్రంథాలను రూపొందించి సమాజానికి ఆ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని తెలియ జేయవలసిన (పరిశోధకులుగా ఆచార్యులు గా ) బాధ్యత మా మీద ఉంది తప్పకుండా గౌరవనీయులు పూజ శ్రీ చినవీరభద్రుడు గారి సమగ్ర సాహిత్యం పరిశీలన అనే అంశం మీద పరిశోధన చేయించి ఆదివాసులకు శ్రీ చినవీరభద్రుడు గారు ఆ మహనీయుని తండ్రి గారు మరియు సోదరి చేసిన సేవలకు రుణం తీర్చుకుంటాం.. వేదుల హిమబిందు అనే పరిశోధకురాలు శ్రీ చినవీరభద్రుడు గారు సోదరి సాహిత్యం పై సిద్ధాంత గంధం సమర్పించారు త్వరలో మౌఖిక పరీక్ష కూడా నిర్వహించబోతున్నాం ఆ పరిశోధకురాలికి పిహెచ్ డి పట్టా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అధికారులు త్వరలో అందించనున్నారు అని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను ఆ కుటుంబం అంటే మాకు అందరికీ గుండె నిండా ప్రేమ అపారమైన గౌరవం ఆ కుటుంబం చల్లగా ఉండాలి ధన్యవాదాలు ఆచార్య జర్రా అప్పారావు తెలుగు శాఖాధిపతి ఆంధ్రవిశ్వకళాపరిత్తు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
మీరచనలు ప్రజారణ పొంది, పరిశోధనలకు కూడా ఉపయోగ పడడం వాటి ప్రామఖ్యతను, విలువను చాటి చప్తున్నాయి. అభినందనలు.
ధన్యవాదాలు సార్!
You are of the living example of a government employee can make a difference is lives of so many people , not just by doing the job right but also writing so many experiences and stories and inspirational articles and poems. Wish more people read and discuss and understand your thoughts and writings sir. God bless you. Take care.
Thank you so much Santosh for your warm wishes!