మరొకసారి అడవిదారుల్లో

ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.

గిరిజన సాహిత్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన, భాషా సాహిత్యాల మీద సాహిత్య అకాడెమీ విశాఖపట్టణంలో 26, 27 వ తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ఒక భాషా ప్రాంతానికి చెందిన గిరిజనుల సాహిత్యం మీద ఒక సదస్సు నిర్వహించడం అకాడెమీ చరిత్రలోనే ఇది మొదటిసారి అని విన్నాను. ఆ సదస్సులో సమాపన ప్రసంగం చేసే గౌరవం నాకు లభించింది.