
డిసెంబర్ 18. మధ్యాహ్నం రెండు గంటలు. ఎంతసేపు ఎదురుచూసినా రాని పనివాడి కోసమూ, గుర్రబ్బండి కోసమూ చూసి చూసి విసుగొచ్చి, నా చిత్రలేఖన సామగ్రి చేతబట్టుకుని, ఆ ఎర్రటి దుమ్ములో, డిసెంబర్ దినాల వెచ్చని ఎండలో మహాత్మాజీ బస చేయబోయే ఇంటి వైపు నడిచాను. గతంలో చీకట్లో ఒకే ఒక్కసారి ఆ ఇల్లు చూశాను. ప్రధాన రహదారి నుండి చీలే ఒక సన్నటి సందు; ఖద్దరు బట్టలు కట్టి, గుండెలమీద మెరిసే రంగురంగుల ఖద్దరు నక్షత్రాల బ్యాడ్జీలు ధరించిన ఉత్సాహవంతులైన యువకులు సైకిళ్లమీదా, కాలి నడకనా నన్ను దాటుకుంటూ వెళ్తున్నారు; ఎవరినీ దారి అడగాల్సిన పని లేకపోయింది. ఇంటి ముఖద్వారం దగ్గర జనసమూహం వేచి ఉంది; వారిని బయటే నిలువరించడానికి గేటు దగ్గర ఖద్దరు వాలంటీర్లు కాపలా కాస్తున్నారు. నేను లోపలికి అడుగుపెట్టాను, అందరి కళ్లల్లోనూ ప్రశ్నార్థకమైన చూపులు—గాంధీజీని చూడటానికి ఒక తెల్లజాతి స్త్రీ రావడమా? అదీ ఒక మేమ్ సాహెబ్ తన వస్తువులు తన చేతుల్తో తనే స్వయంగా మోసుకురావడమా! రెండు వింతలూ ఒక్కచోటే !
వరండాలో కొందరు యువ వాలంటీర్లు విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. వారు నన్ను చూసి వెంటనే లోపలికి తీసుకెళ్లారు. గాంధీకి ఆతిథ్యం ఇస్తున్న ఇంటి యజమాని నన్ను స్వాగతించి ఒక గదిలోకి తీసుకువెళ్ళారు. ఆ గది చూడబోతే యూరోపియన్ శైలికి మరీ అధ్వాన్నమైన అనుకరణలాగా ఉంది.
‘సి.ఆర్.దాసు గారి సోదరి ఇక్కడే ఉన్నారు; మీరు ఆమెను కలవాలనుకుంటున్నారా? ఆమె గాంధీజీకి సేవ చేయడానికి వచ్చారు’ అన్నారు. (1922లో రక్తపాతం జరుగుతుందన్న భయంతో గాంధీ చలించిపోయి ఉద్యమనావ చుక్కాని వదిలేసినప్పుడు, జాతీయ నౌకను నడిపించిన గొప్ప బెంగాలీ స్వరాజ్య నాయకుడే సి.ఆర్.దాస్).
ఎంతో సంతోషంతో ఆ ఇంటి యజమాని వెంటే లోపలి ప్రాంగణంలోకి అడుగుపెట్టాను. స్త్రీలకీ సేవకులకీ మాత్రమే ప్రవేశముండే ఆ అంతఃపుర ప్రాంగణంలో, కలకత్తా నుండి రాత్రింబవళ్లు ప్రయాణించి మరీ వచ్చిన ఆ మహిళ ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఇంటి యజమాని కుటుంబానికి చెందిన స్త్రీలు ఆ ఇంటినుంచీ, ఆ తోటనుంచీ పూర్తిగా తప్పుకున్నారు, ఒక్క స్థానిక మహిళ కూడా అక్కడ లేదు. ఊర్మిళా దేవి చుట్టూ అరడజను మంది ఉత్సాహవంతులైన మగవాళ్ళు నిలబడి ఉన్నారు. కానీ ఏ పనీ చేతగాని నిస్సహాయులు. వాళ్ళు ఆమె ఏమి చెప్తే అది మాత్రమే చేస్తూ ఆమె అడిగిన వస్తువులు తెచ్చి అందిస్తున్నారు. ఒక అంగవస్త్రమూ, జంధ్యమూ మాత్రమే ధరించిన ఒక బ్రాహ్మణ వంటవాడు వంటగది లోపలికీ బయటకీ తిరుగుతున్నాడు.
ఊర్మిళాదేవి తాటాకు చాపమీద కూర్చుని ఉన్నారు; నడి వయసు మహిళ. విధవా వస్త్రాలు ధరించి ఉన్నారు. కత్తిపీటమీద కూచుని తన కాలి వేళ్లతో అదిమిపెట్టి కూరగాయలు తరుగుతున్నారు. నేనూ కూడా పక్కన నేలమీద కూర్చున్నాను, మా మధ్య సంభాషణ మొదలైంది. ఆమె కలకత్తా నుంచి రాత్రంతా ప్రయాణించి పొద్దున్నే ఐదింటికి ఊళ్ళో దిగి స్నేహితుల ఇంట్లో బస చేశారు.
‘ఆయన్ను దర్శించుకుని, సేవ చేద్దామని వచ్చాను. తక్కిన భక్తులు పూరీకో, వారణాసికో, రామేశ్వరానికో వెళతారు. నేను మాత్రం ఏడాదికి ఒక్కసారైనా మహాత్మాజీని కలవడానికి వెళతాను; నా వార్షిక తీర్థయాత్ర అదే!’ అన్నారు.
నేను నాదగ్గరుండే చిన్న చాకుతో బంగాళాదుంపల తొక్క తీయడం మొదలుపెట్టాను; ఆమె ఆ దుంపల్ని తన కత్తిపీట మీద కాగితంలా పలుచగా తరుగుతూ పోయారు. నేను ఎంత ప్రయత్నించినా కూడా, వేగంలో పశ్చిమ దేశంమీద తూర్పు దేశానిదే పైచేయి అయింది! నేను నవ్వుతూ ఈ దేశానికి మొదటిసారి వచ్చినప్పటి నా అనుభవాలు చెప్పుకొచ్చాను. పశ్చిమ దేశాల అతితెలివితో నేను వంటింటినిండా బల్లలు నింపడానికి ప్రయత్నించింది చెప్పాను. కానీ, నా పాశ్చాత్య ఆవిష్కరణలేవీ భారతదేశపు సరళమైన సాంప్రదాయిక పనిముట్ల సామర్థ్యానికి సరితూగవని ఎలా గ్రహించానో కూడా చెప్పుకొచ్చాను. ఇంట్లోనూ, వంటింట్లోనూ పనిచేసే సేవకుల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప నా సంస్కరణలు మరెందుకు పనికి రాకుండా పోయాయని చెప్పాను. ఇద్దరం నవ్వుకున్నాం.
తాను కూడా రైలు దగ్గరకు వెళ్లి మహాత్మాజీకి స్వాగతం పలకాలని ఊర్మిళాదేవి ఎంతో అనుకున్నారు; ఆయన బస చెయ్యబోయే ఇల్లు దారిలోనే ఉండటంతో ఒక్కసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చారు.
‘తీరా చూస్తే ఇక్కడ పనులేవీ మొదలుపెట్టనేలేదు, ఏదీ సిద్ధంగా లేదు’ అని చెప్తూ, చుట్టూ ఉన్న అసమర్థులైన మగవాళ్ల వైపు జాలిగా చూస్తూ, ‘ఈ మగవాళ్లు స్నానాలకు వేణ్ణీళ్ళు పెట్టాలని కూడా ఆలోచించలేదు, వంట పనులైతే అస్సలు మొదలుపెట్టలేదు’ అన్నారామె.
‘ఏ ఒక్క స్థానిక మహిళ కూడా పనులు చక్కబెట్టడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటు’ అన్నాను నేను ఆవేశంగా. ‘కలకత్తా నుండి వచ్చిన మీరు ఇక్కడి పరదా పద్ధతిలోని మూర్ఖత్వం, కఠినత్వం ఊహించను కూడా ఊహించలేరు!’
అందుకు ఊర్మిళా దేవి, ‘బాధాకరమైన విషయమేమిటంటే, గాంధీజీ ఆయన బృందమూ పొద్దున్న తొమ్మిదింటికే బాలేశ్వర్ నుంచి బయలుదేరారు; బయలుదేరే ముందు వాళ్లేమీ తిని ఉండరు. అందుకని నేనేం చేయగలను? స్టేషన్కు వెళ్లడం మానుకుని, మీరే చూస్తున్నారు కదా, నేరుగా పనిలో కూర్చుండిపోయాను’ అన్నారు.
స్థానిక పరిస్థితుల గురించీ, నా గురించీ ఊర్మిళా దేవి ఆరా తీశారు. గాంధీని ఒక రేఖాచిత్రం గీయాలనే చాలా గట్టిగా అనుకుంటున్నానని ఆమెతో చెప్పాను.
‘ఓహ్, మీరు గీస్తే చాలా బాగుంటుంది! ఇప్పటిదాకా ఎవరూ కూడా ఆయనదొక మంచి బొమ్మ గియ్యనే లేదు. కానీ దేశమంతా ఆయన అధ్వాన్నమైన బొమ్మలతో నిండిపోయింది’ అన్నారామె. అయితే మా పక్కనే నిలబడి ఉన్న ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ: ‘గాంధీ మౌనవ్రతంలో ఉంటారు కదా—ఆయన దగ్గరకు ఎలా వెళ్లగలం?’ అన్నారు.
‘దానికేముంది, ఫరవాలేదు’ అంటూ ఊర్మిళ కల్పించుకున్నారు. ‘మనం ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనేమీ పట్టించుకోరు. కాకపోతే ఆయన మాట్లాడరు, అంతే. ఆయన ఎంతో అద్భుతమైన మనిషి, ఎలాంటి పరిస్థితుల్లోనూ మౌనాన్ని వీడరు. చివరకు నవ్వినా సరే శబ్దం లేకుండా నిశ్శబ్దంగానే నవ్వుతారు!’ అన్నారు.
కూరగాయలు తరగడం పూర్తయింది. తరిగిన కూరగాయల ముక్కల్ని గంపలకెత్తి వంటగదిలోకి తీసుకెళ్లారు. నేను నవ్వుతూ, ‘ఒక సైన్యానికి సరిపోయేంత తిండిలా ఉంది, గాంధీజీ అవసరాలు చాలా పరిమితమని విన్నానే!’ అన్నాను.
‘ఆయన అవసరాలు పరిమితమే, మీరాబాయి అవసరాలూ అంతే! ఆమె దాదాపు మరో మహాత్మాజీయే! వారిద్దరూ పాలూ, పండ్లమీదే జీవిస్తారు. కానీ వాలంటీర్లకు భోజనం కావాలి కదా; ఆయన చుట్టూ ఎప్పుడూ ఎంతోమంది ఉంటారు, ఎందరో ఆశ్రితులుంటారు’ అన్నారామె.
ఊర్మిళా దేవీ, నేనూ లేచి గాంధీ కోసం సిద్ధం చేసిన గది వైపు నడిచాం. వరండా స్తంభాలకు అప్పుడే వేసిన తారు తాలూకు తాజా నలుపు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. పై భాగానికి దట్టమైన కాషాయ రంగూ, పైకప్పుకీ లోపలి భాగాలకీ మిరుమిట్లు గొలిపే తెలుపు రంగూ వేశారు. నేను నవ్వుతూ ఆమెకు అది చూపించాను.
‘ఈ ఇంటిని ఎలాంటి భూకంపం ముంచెత్తిందో చూశారా? అంతా సరికొత్త రంగుల్తో పరిశుభ్రంగా మెరిసిపోతోంది. ప్రజలు సాధారణంగా తమ ఇళ్ళెలా ఉన్నాయో పట్టించుకోరు; మరకలు పడ్డ గోడల్నీ, పోగైన చెత్తనీ, పూలమొక్కలు లేని ముంగిళ్లనూ గమనించరు. నాకెంతో బాధ కలిగించే విషయాల్లో ఇదొకటి. గొంతు చించుకుని చెప్పి చూశాను, లాభం లేకపోయింది. ఇదంతా వాళ్ల కళ్లకు కనిపించాలంటే ఒక మహాత్మాజీ రాక జరగాల్సిందే. అదీ కేవలం ఒక్క రోజు కోసమే! ఈ ఒక్క సందర్భం కోసం మగవాళ్లు ఎక్కడెక్కడి నుంచో ఖద్దరు బట్టలు తవ్వి తీయడం, కొనడం, అప్పు తెచ్చుకోవడం మీరు చూడాలి. సాధారణంగా అసలు ఖద్దరే కట్టని వాళ్లూ ఈ రోజు వీటిని కడుతున్నారు. అలా ఖద్దరు ధరించడం ద్వారా మహాత్మాజీని గౌరవిస్తున్నామని వారి భావన. కానీ ఆయన లాంటి వ్యక్తి ఇలాంటి ఒక్క రోజు ఆడంబరం కంటే, వారి హృదయాల్లో నిజాయితీ, చిత్తశుద్ధీ నిరంతరం చూడాలనుకుంటారని నాకు అనిపిస్తోంది’ అన్నాను.
‘అసలు వాళ్లు ఖద్దరు ధరించకపోవడమే మంచిదని గాంధీజీ భావిస్తారని నేను ఘంటాపథంగా చెప్పగలను’ అన్నారు ఊర్మిళా దేవి ఆత్రుతగా. ఒక రాజకీయ నాయకుడు అన్న మాటల్ని గాంధీజీ స్వయంగా నవ్వుతూ ఉటంకించిన విషయం నాకు గుర్తొచ్చింది: ‘ఆంగ్లేయులకు కోపం తెప్పించడానికి కౌన్సిళ్లకూ సభలకూ ఖద్దరు కట్టుకుని వెళ్లడం, మీకు కోపం తెప్పించడానికి మీ దగ్గరకు మిల్లు బట్టలు కట్టుకుని రావడం కంటే నాకు ఆనందాన్నిచ్చేది మరొకటి లేదు’ అని ఆ నాయకుడు గాంధీతో అన్నాడట! ఇక్కడి చాలామంది ప్రజల వైఖరి కంటే ఆ వైఖరినే ఎంతో నయం!
గాంధీజీ కోసం ఆ గది భారతీయ సంప్రదాయ పద్ధతిలో సిద్ధం చేశారు: నేలమీద మందపాటి తివాచీలు, మధ్యలో పరిచిన స్వచ్ఛమైన తెల్లటి దుప్పటిమీద కొన్ని గుండ్రటి గట్టి దిండ్లు తప్ప మరేమీ లేవు. ఇంటి యజమాని ముందుకొచ్చి, కంగారుగా ఊర్మిళా దేవి వైపు కింద నేలవైపు చూపించారు. దిండ్ల గలేబులు ఖద్దరే, దుప్పటీ ఖద్దరే, పైన పరిచిన తివాచీ కూడా ఖద్దరే. ‘కానీ అన్నింటికంటే కింద పరిచిన ఈ తివాచీ మాత్రం విదేశీది!’ అన్నారాయన.
‘గాంధీజీ ఇలాంటివి పట్టించుకోరు! ఆయనకు ఆడంబరాలూ, అదనపు ప్రయాసలూ అక్కర్లేదు’ అన్నారు ఊర్మిళా దేవి. యజమాని ఊపిరి పీల్చుకుని పక్కకు వెళ్లారు.
ఏదైనా ఎమర్జన్సీ కోసమా అన్నట్టు గదిలో ఒకే ఒక్క కుర్చీ ఉంది. ఊర్మిళా దేవి నాతో ‘మీరు వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి. ఆయన కోసం ఇక్కడే ఎదురుచూద్దాం’ అన్నారు.
నేను బూట్లు విడిచిపెట్టి, ఆమె పక్కనే నేలమీద కూర్చున్నాను. మా సంభాషణ సాగుతూనే ఉంది. ఆమెకు గాంధీజీ గురించి చాలా తెలుసు. ఆ కొద్దిసేపటి పరిచయంలోనే ఆమె సి.ఆర్.దాస్ సోదరి అనే పరిచయం దాటి నాకెంతో చేరువయ్యారు. నిజాయితీపరురాలు, ఆకర్షణీయురాలు. ఆమె ఎంతో సమర్థురాలైన స్త్రీ. ఆమెతో స్నేహం చెయ్యాలనిపించింది నాకు.
మోటారు శబ్దం వినిపించింది. గాంధీజీ మెట్లు ఎక్కుతుండగా చూడటానికి మేము సరిగ్గా సమయానికే వరండాలోకి వచ్చాం. కాస్త పొట్టిగా, సన్నగా, బక్కపలచగా ఉన్న మనిషి. బక్కచిక్కిన కాళ్లు బయటకు కనిపించేలా తెల్లటి ఖద్దరు అంగవస్త్రం కట్టారు; భుజంమీద ఒక నూలు వస్త్రమూ, దాంతో పాటు ఒక ఉన్ని శాలువా కప్పుకున్నారు. చేతిలో ఒక నల్లటి పెట్టె పట్టుకున్నారు.
గాంధీజీ రూపం వికారంగా ఉంది. గుండు గీయించుకుని చిన్న పిలకతో మొరటుగా ఉన్న తల, ముందుకు పొడుచుకొచ్చిన ఎరుపు-నీలం రంగు పెదవి, ఊడిపోయిన పళ్ల సందులు, దాదాపు లంబకోణంలో పొడుచుకు వచ్చిన పెద్ద చెవులు. కానీ ఆయన చిరునవ్వు చూడగానే మాత్రం ఆయన నాకెంతో అందంగా కనిపించారు—ఎంతటి దయార్ద్రభరితమైన, విశాలమైన, మధురమైన చిరునవ్వు! చుట్టూ ఉన్న జనం నుండి ఆయన వైపు వెల్లువెత్తుతున్న భక్తిప్రపత్తుల తరంగాన్నీ, ఆయన్నుండి పెల్లుబుకుతున్న అపారమైన తేజస్సునూ, కరుణామృత ధారనూ మాత్రమే నేను అనుభవపూర్వకంగా గ్రహించగలిగాను.
తోటా వరండా జనంతో నిండిపోయాయి; వాళ్లంతా మౌనంగా దగ్గరకు వచ్చి, వంగి, ఆయన పాదధూళి తాకారు.
ఆయన మా వైపు చూసి ఊర్మిళా దేవిని గుర్తుపట్టారు. ఎంతో ఆత్మీయమైన చిరునవ్వుతోనూ, కళ్లలోని వెలుగుతోనూ ఆమెను నిశ్శబ్దంగానే పలకరించారు. నన్ను ఆయనకు పరిచయం చేశారు. తెల్ల ముఖానికి తగ్గట్టు ఏదో ఒక ఇంగ్లీషు పేరుంటుందని అనుకున్నారేమో, ఆయన కళ్లల్లో ప్రశ్నార్థక భావం కనిపించింది. ఆయనకు మళ్లీ నా పేరుచెప్పారు: ‘శ్రీమతి సారంగధర్ దాస్’. ముఖంలో మరో మనోహరమైన చిరునవ్వు మెరిసింది; నేరుగా నా కళ్లల్లోకి చూస్తూ ఒక ఆప్యాయమైన చూపు చూశారు.
ఆయన వెనకనే మేమా గదిలోకి వెళ్లాం. నేను ఊర్మిళతో గుసగుసగా: ‘మీరాబెహెన్ రాలేదా?’ అని అడిగాను. ‘ఆమె రెండో మోటారులో వస్తున్నారు’ అన్నారామె.
అందరిలోనూ ఎంతో ఉత్సాహం ఉంది, కానీ నిశ్శబ్దంగా, అణచిపెట్టిన వెలుగుతో కూడిన ఒక భక్తిభావం అది. వారి సామాన్లు గదిలోకి చేర్చడానికి పదుల సంఖ్యలో చేతులు ముందుకు చాచాయి; మామూలు రోజుల్లో మామూలు సమయాల్లో చిన్నపాటి సూటుకేసు కూడా బంట్రోతు చేత మోయించే చేతులవి!
గదిలోకి రాగానే మహాత్మాజీ వెంటనే నేలమీద కూర్చున్నారు, ఆయన పక్కనే ఊర్మిళా దేవి కూర్చున్నారు. తన పక్కనే కూర్చోమని ఆమె నాకు సైగ చేశారు. ఆమె ఎలాంటి సంకోచం లేకుండా ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి, ఆయనతో ఎంతో చనువుగా, ఆత్రుతగా మాట్లాడుతూ కలకత్తా మిత్రుల గురించీ, వారి కార్యకలాపం గురించీ చెప్పడం మొదలుపెట్టారు. గాంధీజీ వింటూ చిరునవ్వుల్తోనూ, తల పంకిస్తూనూ మౌనంగానే సమాధానమిస్తూ వచ్చారు.
ప్రజలు వస్తున్నారు, ఆయన పాదాలు తాకి నమస్కరిస్తున్నారు, రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఇతరులకు దారి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ భక్తీ, ఆరాధనా, ఆనందమూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నిమిషం తిరక్కుండానే గాంధీజీ అప్పటిదాకా తను చేతుల్లోనే పట్టుకుని వున్న ఆ విచిత్రమైన నల్లటి పెట్టెను నిశ్శబ్దంగా తెరిచారు; లోపలి ఇత్తడీ, ఉక్కు లోహాల తతళ కనిపించింది. ఆ సన్నటి చేతులు కంపిస్తూనే ఆ పెట్టెలోంచి అటూ ఇటూ ఏదో లాగాయి. ఒక చెక్క మీట పైకి లేచింది, కొన్ని ఉక్కు కడ్డీలు విచ్చుకున్నాయి. నా కళ్ల ముందే ఒక రాట్నం ప్రత్యక్షమైంది. ఆ పెట్టె కున్న సొరుగులోంచి గాంధీజీ ఒక కండెనీ, ఆకుపచ్చని ఖద్దరు చుట్టనీ బయటకు తీశారు. దాన్ని ఒళ్లో పెట్టుకున్నారు; అందులో మృదువైన, అప్పటికే దూది ఏకిన సన్నటి ఏకులున్నాయి. మరో నిమిషంలో, ఆయన చేతుల్తో సన్నని నూలు వడుకుతుండగా ఆ రాట్నం చేసే మృదువైన ఝుంకార నాదం ఆ నిశ్శబ్దాన్ని నింపేసింది.
సమయం ఒక్క నిమిషం వృథా కాలేదు, ఎలాంటి పటాటోపం లేదు. అత్యంత సహజత్వం. ఒక కొత్త నగరంలో, ఒక అపరిచిత గృహంలో, అప్పటిదాకా అలసట పెట్టిన రైలు ప్రయాణం నుంచి అక్కడికి చేరుకున్న రెండు నిమిషాల వ్యవధిలోనే గాంధీ నిశ్శబ్దంగా తన పనిలో మునిగిపోయారు; తన ప్రగాఢ విశ్వాసాన్ని ఆచరణలో చూపించడం మొదలుపెట్టారు.
అంతటి ఏకాగ్రతా, అంతటి అచంచల సంకల్పమూ ఉన్న వ్యక్తి, తలచుకుంటే తన చేతి రాట్నం తిప్పినంత సులభంగా అశేష జనసందోహాన్ని తన వైపు తిప్పుకోగలగడంలో ఆశ్చర్యమేముంది! కొత్తదనం, పరాయితనం, జనసందోహాం—ఆయనకివేవీ పట్టలేదు, అసలు ఆయన దృష్టిలో వాటికి ఉనికే లేదు. యావత్ విశ్వాన్నీ ఆయన తన చేతిలో ఇముడ్చుకున్నారు!
అప్పుడు ఆ గదిలోకి ఒక పొడవాటి యూరోపియన్ మహిళ అడుగుపెట్టారు; ఆమె పూర్వకాలపు భారతీయ శైలిలో, గాంధీజీలాగా నిరాడంబరమైన తెల్లటి ఖద్దరు వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆమె ఒక రవికె వేసుకున్నారు; అది రొమ్ము భాగాన్ని మాత్రమే కప్పి, వెనుక వీపు భాగం మొత్తం దారాలతో ముడివేసి ఉంది; నడుము భాగం ఖాళీగా కనిపిస్తోంది, పైట చెంగు కదిలినప్పుడల్లా నగ్నమైన వీపు కనిపిస్తోంది. పైట చెంగు అంటే ఒక ఆరు గజాల చీర; దాన్ని లంగా మాదిరిగానూ, పైట మాదిరిగానూ కలిపి కట్టుకున్నారు. ఆమె స్వదేశపు మహిళలుగాని ఆ వస్త్రధారణ చూస్తే భయంతో నోరువెళ్ళబెడతారు. కాని ఆమె ఎలాంటి బిడియం లేకుండా ఎంతో హుందాగా నడుచుకుంటూ వచ్చారు. ఆమె ఎవరని పక్కవారిని అడగవలసిన పనే లేదు; ఆమెనే మీరాబెహెన్.
నేను మళ్లీ ఆమె వైపు చూశాను. సాంద్రమైన ఆకృతితో ఆమె వదనం దాదాపు ఒక పురుషుడి ముఖంలా ఉంది; ఒక వితంతువులానో, సన్యాసినిలానో ఆమె జుట్టు పూర్తిగా గుండు చేయించుకోవడంతో ఆ ముఖ కవళికలు మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దట్టమైన నల్లటి కనుబొమ్మలూ, తీక్షణంగా వంపు తిరిగిన ముక్కు, మేధాసంపన్నమైన నుదురు, మొరటైన చర్మం- ఆమె గాంధీతో మెల్లగా ఏదో మాట్లాడి మళ్లీ బయటకు వెళ్లిపోయారు. నేను కూడా ఆమె వెనుకే వెళ్లాను.
‘మిస్ స్లేడ్, నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మొన్న రాత్రి కమిటీ వాళ్లు నన్ను మీతో మాట్లాడమన్నారు. నేను గాంధీని ఒక రేఖాచిత్రం గియ్యాలనుకుంటున్నాను’ అన్నాను.
‘అదెంతమాత్రం కుదరని పని’ అని ఏమాత్రం తడుముకోకుండా సూటిగా జవాబొచ్చింది. ‘ఆయనైతే అస్సలు ఒప్పుకోరు. ఆయనకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు, పైగా ఆయన అనారోగ్యంతోనూ, తీవ్రమైన అలసటతోనూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఆయన కూర్చుని తమకి పోజు ఇవ్వాలని ఎవరూ ఆశించకూడదు’ అన్నారామె.
‘నిజమే, ఆయన కూర్చుని పోజు ఇవ్వాలని నేనూ ఆశించడం లేదు, ఆయన తన పనిలో తాను కూర్చుని ఉండగానే నా వంతు బొమ్మ నేను గీసుకుంటాను’ అన్నాను.
‘లేదు, మనం ఆయన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ రేపేమన్నా వీలవుతుందనిపిస్తే ఈ రోజు పొద్దుపోయాక ఆయన్నే అడిగి, మీకు కబురు పంపుతాను’ అన్నారామె.
ఎందుకో ఆమెలో కనిపించిన ఆ ఇంగ్లిషు వాళ్ళ ముక్కుసూటిదనమూ, ‘మీలాంటి వాళ్ళు మా రాజుగారి కేసి చూడకూడదు’ అన్నట్టున్న ఆ ముఖ కవళికలూ నాకు నచ్చలేదు. కానీ అక్కడి నుండి వెళ్లిపోకుండా, తిరిగి గదిలోకి వచ్చి ఊర్మిళా దేవి పక్కనే కూర్చున్నాను. అదను చూసుకుని, మీరాబెహెన్ విధించిన ఆఖరి హెచ్చరిక గురించి ఆమె చెవిలో గుసగుసగా చెప్పాను.
‘నువ్వాగు, వెళ్లొద్దు!’ అంటూ ఆమె మళ్లీ గాంధీజీ వైపు తిరిగారు. కాసేపటి తర్వాత ఆమె ఆయనతో కబుర్లు చెబుతున్నట్టుగా: ‘మిసెస్ దాస్ మీ బొమ్మ గీయాలనుకుంటున్నారు; ఆమె చిత్రకారిణి. మీ చిత్రం ఒకటి ఉంటే చాలా బాగుంటుంది’ అన్నారు.
గాంధీ మా ఇద్దరి వైపూ చూసి, నవ్వి తలూపారు. నేను ఆ అవకాశం అందిపుచ్చుకున్నాను. ‘మహాత్మాజీ, ఈ ఒక్క అవకాశం కోసమే నేనెన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. గీసుకోవచ్చా?’ అన్నాను.
మరో చిరునవ్వు, మరోసారి తల ఊపు. నేనప్పటికే నా చిత్రకళా సామగ్రి ఒక చిన్న బల్ల మీద సర్దిపెట్టుకుని ఉన్నాను. ఆయన అంగీకారం ఇవ్వగానే ఆ బల్ల అంచులకి వీపు ఆనిస్తూ నేలమీద కూచున్నాను. మెరుపువేగంతో చార్ కోల్ తో డ్రాయింగు గియ్యడం మొదలుపెట్టాను. కాసేపటికి మీరాబెహెన్ లోపలికి వచ్చి, నేను అప్పటికే పని మొదలుపెట్టి ఉండటం చూసి విపరీతంగా ఆశ్చర్యపోయారు.
‘ఓహో, అప్పుడే మొదలుపెట్టేశారా! కాని మీ పనికి అనుమతి తీసుకున్నారనే అనుకుంటున్నాను!’ అన్నారు.
‘అనుమతి లేకుండా నేనెందుకు గీస్తాను?’ అన్నాను నేను కాస్త చిరాగ్గా, గొంతు తగ్గించినా కాస్త గట్టిగానే నొక్కి చెబుతూ, ఒకింత గర్వం నాలోనే అనుభవిస్తూ. కానీ గాంధీ సన్నిధి నాకు నా అల్పత్వం గుర్తుచేసి వెంటనే సిగ్గుపడేలా చేసింది. నిజానికి మీరా బెహెన్ ప్రయత్నాలు కూడా గాంధీజీని శ్రమపెట్టకూడదనీ, ఇబ్బంది పెట్టకూడదనే కదా. ఈలోపు ఇద్దరు పిల్లలు లోపలికి వచ్చారు; బహుశా ఇంటి యజమాని పిల్లలై ఉంటారు. వాళ్లు గాంధీ పాదాల దగ్గర నేలమీద నుదురు ఆనించి నమస్కరించి, నిశ్శబ్దంగా నా కుడిపక్క కూర్చున్నారు. పెద్ద కళ్లతో, నోరెళ్లబెట్టి, అమితాసక్తితో నా చిత్రలేఖనం గమనించడం మొదలుపెట్టారు.
ఊర్మిళ బయటకు వెళ్లారు. ఒకరిద్దరు వచ్చి వెళ్లారు. ఒక యువకుడు కనురెప్ప వాల్చకుండా గాంధీ వైపే చూస్తూ నిశ్చలంగా కూర్చున్నాడు. వాతావరణమంతా ప్రశాంతత ఆవరించింది. రాట్నం ఆగకుండా తిరుగుతోంది, కాగితంమీద నా చార్ కోల్ పెన్సిలు సన్నటి శబ్దంతో కదులుతోంది, పిల్లలు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
గాంధీ తనలో తాను లీనమై కూర్చున్నారు. ఆయన తల కాస్త పక్కకు తిప్పడంతో నేను ఆయన ముఖం గియ్యలేకపోయాను. కానీ ఆ నిశ్శబ్దాన్ని ఏ విధంగానూ భంగపరచడానికి నాకు మనసొప్పలేదు. ఆయన దేహాకృతినీ, ఆ రాట్నాన్నీ గియ్యడంతోనే సరిపెట్టుకున్నాను. దాదాపు ఇరవై నిమిషాల పాటు మా చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆలోచించడానికి కూడా తీరిక లేనంతగా నేను పనిలో మునిగిపోయాను; కానీ ప్రతి ఒక్క గీతనీ అన్వేషిస్తున్న కొద్దీ ఆ గదిలోనూ, నా అంతరంగంలోనూ ఒక నిశ్శబ్దమూ, పరవశమూ ఆవరించాయి. ఎంతటి హృద్యమైన, మహోన్నతమైన సరళత్వం!
(ఇంకా ఉంది)
11-10-2026


మహనీయుని మనోహర స్మృతి యెన్ని సార్లు చదివినా, యెంత మంది రచయితలు రాసినా పాఠకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
హృదయపు లోతుల్లోకి నిశ్శబ్దంగా చొరబడుతున్న యీ శతాబ్దపు “మాంత్రికుడి” చిరునవ్వు ను ప్రవహింపచేస్తున్న చినవీరభద్రుడి కలం గొప్పతనం నేను ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర లేదు…..
శ్రీనివాస జీవన్ సంగాని, విజయవాడ
చాలా చాలా సంతోషం జీవన్! మీరు ఇది చదువుతుండడం చాలా సంతోషం.
Frieda Hauswirth గారి perspective నిజంగా ప్రత్యేకంగా ఉంది. India తో ఆమెకున్న అనుబంధం, ఒక విదేశీయురాలిగా ఆమె చూసిన సమాజం, అందులో తన position and privilege గురించి ఆమె observations ఒక unique view ని చూపిస్తున్నాయి.
భారతీయ సంస్కృతిలోనూ, గాంధీజీ ఆలోచనల్లోనూ ఆమెకు నచ్చిన అంశాలను మెచ్చుకుంటూనే, మనుషుల ప్రవర్తనలోని contradictions ని కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా record చేశారనిపించింది.
గాంధీజీ కోసం మాత్రమే ఇళ్లను శుభ్రం చేసి decorate చేయడం, ఖద్దరు ధరించడం వెనక ఉన్న hypocrisyని ఎత్తి చూపడం, స్త్రీలపై పరదా పద్ధతి విధిస్తున్న restrictions ని ప్రశ్నించడం, గాంధీజీ రూపాన్ని కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా వర్ణించి, ఆయన చిరునవ్వులో కనిపించిన అందాన్ని చెప్పడం ఆమె writing లోని నిజాయితీని చూపిస్తున్నాయి.
Her writing, in your excellent translation, is so vivid and engaging that we feel as if we are witnessing those events ourselves, Sir. 🙏🏽
చాలా చక్కగా పట్టుకున్నారు. ఆమె చాలా నిజాయితీగా ఉన్నదున్నట్టుగా రాయడంతో మనం గాంధీని చాలా దగ్గరగా చూసినట్లు అనిపిస్తున్నది.