నేను తిరిగిన దారులు-22

ఆదిమానవుడూ పూర్ణమానవుడూ

1

శ్రమణజీవితఫలం

భోపాల్‌కి సాంచి చాలా దగ్గర. గంటన్నర ప్రయాణం. ప్రశాంతమైన మధ్యప్రదేశ్ గ్రామాల మధ్యనుంచి విదిశ వెళ్లే రహదారిమీద సాంచి ప్రయాణం. విదిశ అనే పేరు వినగానే జీవనానంద దాస్ ‘వనలతాసేన్’ను వర్ణిస్తూ ‘విదిశలో ఆలుముకున్న చిక్కని చీకట్లలాగా ఆమె కురులున్నాయ’న్న మాటలు గుర్తొచ్చాయి.

పొద్దుటిపూట తొమ్మిదిగంటల ఎండ. ఇంకా మాఘమాసపు మంచులో దిగంతాలు తడుస్తూనే ఉన్నాయి. మేం వెళ్తున్న దారిలో ఒకచోట మైలురాయి మీద కర్కాటరేఖ అనిరాసి ఉంది. నేను కర్కాటకరేఖను దాటుతున్నానని తెలియగానే నాకేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. నేను బండి ఆపమని చెప్పి దిగి ఆ ఊహాజనిత రేఖమీద కొన్ని క్షణాలు నిల్చొన్నాను. సాంచి మధ్యప్రదేశ్ లో  రాయిసెన్ జిల్లాలో ఉన్న ఒక మామూలుగ్రామం. ఊళ్లో అడుగుపెట్టినప్పుడు కూడా నీలో ఏ విశిష్ట సంవేదనలూ కలగవు. ఏదో ఒక మామూలు గ్రామంలో అడుగుపెడుతున్నట్టే అనిపిస్తుంది. సాంచిస్థూపం అక్కడికి దగ్గరలో ఉన్న కొండమీద ఉందని తెలిసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యమనిపించింది. నేనంతదాకా చూసిన బౌద్ధచైత్యాలు అమరావతి, నాగార్జునకొండ, ఘంటశాల వంటివి నేలమీదనే నిర్మించిన చైత్యాలు. కాని ఇది కొండమీది చైత్యమనగానే ఆసక్తి కలిగింది.

నెమ్మదిగా కారు కొండ మలుపులు తిరుగుతూ పైకెక్కుతుండగా అప్పుడప్పుడే లేత చిగుళ్లతో రంగులు పోసుకుంటున్న మాఘమాసపు అడవి మధ్య ఆ కొండ సాక్షాత్కరించింది. చుట్టూ లేతాకుపచ్చని నీలపుకాంతిలో పొలాలు, నేల, నింగి కలగలిసి ఒక నీటిరంగుల పూత నా ముందు ప్రత్యక్షమయ్యింది. నాకు తెలియకుండానే నాలో ఏదో ప్రశాంతభావన ఉదయించడం మొదలయ్యింది. కారు పార్కింగ్ ప్లేస్ లో  ఆపుతూ డ్రైవరు కొద్దిగా దగ్గరలో కనిపిస్తున్న చైత్యాన్ని చూపిస్తూ ‘అదిగో అదే సాంచి’ అన్నాడు. పొద్దుట పదిగంటల ఎండ వెలుతురులో నా ముందు ఆ స్థూపం ప్రత్యక్షం కాగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. నేను పరుగుపరుగున ఆ ప్రాంగణం దగ్గరికి పోయి నిల్చొన్నాను. నా ముందు ధ్యానమూర్తి అయిన బుద్ధుడు ప్రత్యక్షమయినట్టే ఉంది. మనకెంతో పరిచితమైన ధ్యానబుద్ధప్రతిమలో ఏదో విశేషముంది. ఆ బుద్ధమూర్తిని చూస్తునప్పుడు మనలో ఏదో ఒక అనిర్వచనీయభావన మేల్కొంటుంది. ఆ భావన ఎటువంటిదో సుప్రసిద్ధ జర్మన్ కవీంద్రుడు రిల్కే మాటల్లో నాకు మొదటిసారిగా బోధపడింది.

‘బుద్ధుడు’ అనే పేరిట రిల్కే రాసిన ఆ కవిత దానికదే ఒక బుద్ధశిల్పంలాంటిది. ఆ కవితకు బైరాగి చేసిన అనువాదంలోని కొన్ని వాక్యాలు నా మనసులో మారుమోగాయి:

బుద్ధప్రతిమలానే సాంచిస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్టుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్టుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. నేను ఆ స్థూపం ఎదుటకు పోయి తూర్పుతోరణం దగ్గర నిలబడగానే తలలేని ఒక భగ్నబుద్ధమూర్తి నాకు కనబడింది. కాని నాకు ఆ విగ్రహం అపరిపూర్ణంగా కనిపించలేదు. బహుశా ఆ మొత్తం సాంచి స్థూపమంతా ఆ మూర్తి నష్టశిరస్సుకి ప్రత్యామ్నాయంగా భాసిస్తున్నదేమో అనిపించింది. దాదాపు మూడువందల అడుగుల ఎత్తున కొండమీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలోనూ కూడా అత్యంతసురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 10వ శతాబ్దం దాకా దాదాపు 1300 ఏళ్లపాటు ఈ స్థూపం ఎందరో బౌద్ధభిక్షువులకీ, బౌద్ధమతాభిమానులకీ, బౌద్ధసాంఘికులకీ ఆశ్రయంగా నిలబడుతూ వచ్చింది.

ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖసంఘటనతోటీ సాంచికి సంబంధం లేదు. బుద్ధుడు తన జీవితకాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనాయాత్రికుడు జువాన్ జాంగ్ భారతదేశంలో తానుచూసిన ప్రతిఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో సవివరంగా నమోదుచేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. అయినా కూడా, బుద్ధపాదస్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్ధనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచి చరిత్రలో నిలబడింది. సాంచి గురించి మనకు తెలుస్తున్న మొదటి ప్రస్తావన సింహళబౌద్ధ గ్రంథాలైన ‘మహావంశం’, ‘దీపవంశం’ ల ద్వారా తెలుస్తోంది.

అవి చెప్పేదాన్ని బట్టి అశోకుడు మౌర్యచక్రవర్తి కాకముందు ఉజ్జయినిలో రాజప్రతినిధిగా పరిపాలన సాగిస్తున్నప్పుడు ఇప్పటి విదిశకు చెందిన ఒక వర్తకుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు దేవి. ఏళ్ల తరువాత అతడి కుమారుడు మహేంద్రుడు విదిశలో ఉన్న మహారాణి దేవిని చూడడానికి వెళ్లినప్పుడు ఆమె విదిశగిరి దగ్గర తాను నిర్మించిన బౌద్ధారామానికి అతణ్ణి తీసుకువెళ్లి చూపించినట్టుగా ఆ గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి.

బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండని చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండమీద రాస్తే నలుగురూ చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకనే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండమీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. తన అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు.

అయితే సాంచి మౌర్యసామ్రాజ్యవైభవాన్ని కూడా దాటి బతికింది. మౌర్యసామ్రాజ్యం పతనమయ్యాక కొద్దికాలం ఇబ్బంది పడ్డప్పటికీ ఆ తరువాత వచ్చిన శుంగవంశపు కాలంలో ఆ నిర్మాణం మరింత విశాలమైంది. ఆ కాలంలో అశోకుడు నిర్మించిన స్థూపాన్నిపెద్దది చేయటం, చుట్టూ పిట్టగోడ, మెట్లు, హర్మిక నిర్మించడం జరిగింది. ఈ సారి ఆ స్థూపాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే పని శాతవాహనుల వంతయింది. వాళ్ల కాలంలోనే ఈనాడు మనం చూస్తున్న తోరణాలు నిర్మాణమయ్యాయి.

మధ్యలో కొన్నాళ్లు మాల్వాప్రాంతాన్ని పరిపాలించిన క్షత్రపుల కాలంలో సాంచి నిర్మాణాలు ఆగిపోయినప్పటికీ, క్షత్రపుల్ని ఓడించి గుప్తులు అధికారంలోకి రాగానే మరొక వికాసతరంగం మొదలయ్యింది. గుప్తులు పెద్దఎత్తున మధురనుంచి బౌద్ధశిల్పాల్ని తయారుచేయించి సాంచికి తరలించారు. నెమ్మదిగా సాంచిలో కూడ స్థానికముద్రతో కూడిన ఒక శిల్పరీతి రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. ఇక హూణులు దండయాత్ర చేస్తున్న రోజుల్లో యశోధర్ముడు మిహిరకులుణ్ణి ఓడించడంతో సాంచి సురక్షితంగా నిలబడింది. తిరిగి మళ్లా హర్షుడి కాలంలో సాంచి మరొకసారి వైభవం చవిచూసింది.

సాంచి ఎప్పటినుంచి నిర్జనంగా మారిందో స్పష్టంగా తెలియదు. 13వ శతాబ్దపు తరవాతి కాలానికి చెందిన నిర్మాణాలేవీ ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడనుండి బౌద్ధభిక్షువులు నెమ్మదిగా తరలిపోయారు. అందుకు స్పష్టంగా చెప్పగల కారణాలేవీ లేవు. తిరిగి మళ్లా 1818లో ఈస్టిండియా కంపెనీకి చెందిన జనరల్ టేలర్ ఈ శిథిలాల్ని కనుగొనేదాకా సాంచి భారతచరిత్రలో ఒక విస్మృతపదం. 1822లో భోపాల్లో ఉన్న అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంట్ కెప్టెన్ జాన్సన్ మొదటిస్థూపాన్ని బహిర్గతం చేసేటప్పటికి సాంచి మళ్లా తన పూర్వరూపం చూపించడం మొదలయ్యింది.

అయితే సాంచిని ఇప్పుడున్న రూపంలో మనం చూడడానికి కారకులైనవాళ్లు అలగ్జాండర్ కన్నింగ్హామ్, కెప్టెన్ ఎఫ్.జి. మైసే, మేజర్ కోల్ ముఖ్యంగా సర్ జాన్ మార్షల్. సాంచిలో స్థూపాలు సురక్షితంగా బయటపడటంతో పాటు, దుర్భరమైన నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అశోకుడు స్థాపించిన స్తంభాన్ని స్థానికజమీందారు ముక్కలు చేసి చెరుకుగానుగుగా మార్చుకున్నాడు!

సాంచిస్థూపం నిర్మాణంలో చతురస్రాకారంగా ఉండే ఒక మేధి, దానిచుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగాఉండే మెట్లు, దానిపైన గుమ్మటంలాగా ఉండే ఒక అండం, పైన బుద్ధుడి త్రిశరణాలను సూచించే ఒక ఛత్రవలి కనిపిస్తాయి. స్థూపం వ్యాసం 36.6 మీటర్లు, ఎత్తు ఛత్రవలిని తీసేస్తే 16.46 మీటర్లు. కాని ప్రస్తుతమున్న స్థూపం పూర్వస్థూపంలో సగం మాత్రమే ఉంటుంది.

ఈ స్థూపంచుట్టూ నిర్మించిన తోరణద్వారాలు ప్రధాన ఆకర్షణ. ఇవి శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డాయని ఇందాకనే చెప్పాను. ఈ తోరణాల నిండా బౌద్ధజాతక కథలనుంచి, బుద్ధుడి జీవితం నుంచి, బౌద్ధ మతచరిత్రనుంచీ ఇంకా ఇతరత్రా విషయాలనుంచి అపురూపమైన శిల్పాలు పొదగబడ్డాయి. చరిత్రకారులు సాంచిశిల్పకళ అంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గదేమీ రూపొందలేదనీ ఈ శిల్పాలు కూడా మధురనుంచి తెచ్చుకున్నవేనని చెప్తారు. అందువల్ల సారనాథ్ వంటి తక్కిన బౌద్ధక్షేత్రాలతో పోల్చదగ్గ శిల్పసౌందర్యం ఇక్కడ కనిపించడం లేదంటారు. కాని సాంచిలో చుట్టూ అడవి, ఆకాశమూ ఏర్పరచిన ప్రశాంతనేపథ్యం, బౌద్ధభిక్షువులు శతాబ్దాలపాటు పరిరక్షించుకున్న ప్రార్థనామయవాతావరణాల వల్ల ఇక్కడి శిల్పాలు కొత్తసౌందర్యంతో మెరిసిపోతున్నట్టుగా నాకనిపించింది.

నేను పిచ్చివాడిలా ప్రదక్షిణంగా, అప్రదక్షిణంగా ఆ స్థూపం చుట్టూ అటూఇటూ తిరుగుతూ, నా చేతుల్లోకి చిక్కుతున్నట్టే చిక్కి మరుక్షణమే జారిపోతున్న ఆ అపురూపమైన ప్రశాంతి ఎటువంటిదో బోధపరచుకునే ప్రయత్నం చేశాను. ఇది ఎటువంటి జీవితప్రయత్నాలకు సార్థక్యంగా, సత్ఫలితంగా లభించగల కానుక అయిఉండవచ్చునని ఆలోచించాను. బుద్ధుడి దీర్ఘసంభాషణల్లో ‘సామంజఫలసుత్త’మనే అందమైన, ఆలోచనాపూరితమైన సంభాషణ ఉంది. నాకా సంభాషణ గుర్తొచ్చింది.

ఒకప్పుడు ఒక కార్తీకపున్నమిరాత్రి మగథచక్రవర్తి అజాతశత్రు రాజగృహంలో తన ఇంటిమేడమీద వెన్నెల్ని చూస్తూ, ఇంత అందమైన రాత్రి, ఎవరైనా ఒక వివేకవంతుడి సన్నిధికి పోయి కూర్చుంటే ఆయన చెప్పే మాటలు వింటే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అటువంటి వివేకవంతుడు ఎవరన్నా ఉన్నారా అని తన మంత్రుల్ని ప్రశ్నిస్తాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి గురించి చెప్తారు. కాని జీవక కుమారబచ్చ అనేవాడు అప్పట్లో తన మామిడితోటలో విడిదిచేసిన బుద్ధుడి గురించి చెప్తాడు. అప్పుడు అజాతశత్రువు బుద్ధుణ్ణి చూడటానికి వెళ్లి ఆయనతో సంభాషణకు పూనుకుంటాడు. ఆ రోజు అతడు బుద్ధుణ్ణి అడిగిన ప్రశ్న శ్రమణజీవితఫలమేమిటని. శ్రమణ జీవితఫలమేమిటో బుద్ధుడు అతనికి ఆ సూక్తంలో ఎన్నో పార్శ్వాలలో, ఎన్నో ఉదాహరణలతో ఎంతో వివరంగా చెప్తాడు.

అది చదివినప్పుడు నాకర్థమైందేమిటంటే, శ్రమణజీవితమంటే, బుద్ధుడు పదే పదే చెప్తున్నదేమిటంటే ఒక మనిషి సామాజిక నిశ్రేణిలో భాగంగా ఉండకుండానే, ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థతాలూకు బానిసత్వం నుండి బయటపడి అదే సమయంలో తనకూ, సమాజానికీ కూడా ఎంతో ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించవచ్చునని చెప్పడం.

ఒక ఇంటిమీద నిల్చొన్న మనిషి కింద రహదారులమీద మనుషులు అటూఇటూ తిరుగుతూ, ఇళ్లల్లోకి వస్తూవెళ్తూ ఉండడాన్ని చూస్తూ ‘మనుషులు ఇలా ఇళ్లల్లో ప్రవేశిస్తున్నారు, ఇలా బయటికి వెళ్తున్నారు, ఇలా వీథుల్లో నడుస్తున్నారు, ఇలా నాలుగురోడ్ల కూడళ్ల దగ్గర చేరుతున్నారు’ అని అనుకున్నట్టే మృత్యువు గురించీ, మనుషుల ప్రవేశాలగురించీ, నిష్క్రమణలగురించి కూడా ఆలోచించడానికి వీలవుతుందన్నాడాయన. ఈ అడవిలో, ఈ కొండమీద ఈ స్థూపందగ్గర నిల్చొన్నప్పుడు మనుషుల జననమరణాల్ని చాలా మామూలువిషయంగా భావించగల అంతర్దృష్టి సునాయాసంగా ఒనగూడుతుందని పించింది.

సాంచిస్థూపం దగ్గరే సింహళబౌద్ధశాఖకు చెందిన ఒక ఆరాధనామందిరం కూడా ఉంది. అక్కడ బౌద్ధసాహిత్యం, బుద్ధప్రతిమలు, బొమ్మలు అమ్మే షాపు కూడా ఉంది. అక్కడ బుద్ధుడి టెర్రకోట ప్రతిమ ఒకటీ, కొన్ని బొమ్మలూ కొన్నాను. మిత్రుడు గంగారెడ్డికోసం ఒక బుద్ధుడి బొమ్మ జ్ఞాపికగా తీసుకున్నాను. ఆ పక్కనే సారిపుత్త, మొగ్గలాయనుల స్మారకమందిరం కూడా ఉంది. బుద్ధుడితో ఎన్నో అంశాలమీద మాట్లాడించి ఆయన నోటివెంట చక్కటి మాటలు వినే అవకాశమిచ్చిన శిష్యులువాళ్లు. అది చూసినప్పుడు ‘మహాపరినిబ్బాణసుత్త’లో బుద్ధుడికీ, సారిపుత్తుడికీ మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తొచ్చింది.

ఒకప్పుడు నలందాలో పావారికుడి మామిడితోటలో బుద్ధుడు విడిది చేసినప్పుడు సారిపుత్తుడు ఆయనను చూడడానికి వచ్చి నమస్కరించి ‘మీలాగా జ్ఞానోదయం అయిన బ్రాహ్మణుడు కానీ, శ్రమణుడుకానీ గతంలో లేడు, నేడు లేడు, భవిష్యత్తులో లేడు’ అన్నాడు. అప్పుడు బుద్ధుడు ‘నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు. నీకు గతంలో ఉన్న బుద్ధులు కనిపించారా, భవిష్యత్తులో ఉన్న బుద్ధులు కనిపించారా, లేదా కనీసం ఈ బుద్ధుజ్జెన అర్థం చేసుకున్నావా?’ అని అడిగాడు. ఆ ప్రశ్న నిజంగానే కష్టమైన ప్రశ్న. అందుకు సారిపుత్తుడు ఏం సమాధానమిస్తాడా అని ఆసక్తిగా చదివాను.

సారిపుత్తుడు అన్నాడుకదా, ‘అయ్యా నాకు నిజంగానే భూతభవిష్యత్వర్తమానాల బుద్ధుల గురించి తెలుసుకునే జ్ఞానం లేదు. కాని నాకు ధర్మతాత్పర్యం తెలుసు. ధర్మాన్వయజ్ఞానముంది. నేను ఒకేఒక్క ద్వారమున్న పెద్ద కోట దగ్గర నిలబడ్డ ద్వారపాలకుడిలాంటివాణ్ణి. ఆ కోట గోడకుండే సందుల్లోంచి ఏ ప్రాణులు బయటకొస్తున్నాయో లోపలికి పోతున్నాయో నేను చూడలేకపోయినా, ఆ మహాద్వారంలోంచి ఎవరు బయటికిపోతున్నా, లోపలికొస్తున్నా నాకు స్పష్టంగా కనబడుతుంది’ అన్నాడు. ఎటువంటి సమాధానం!

అక్కడ కొద్దిసేపటికి ఎక్కడినుండో బౌద్ధయాత్రికుల సముదాయమొకటి చేరుకుంది. వాళ్లకి కొందరు బౌద్ధభిక్షువులు ఆ స్థూపం గురించి చెప్తున్నారు. అక్కడంతమంది మనుషులు చేరినప్పటికీ అప్పటిదాకా నేను అనుభవిస్తున్న ప్రశాంతిలో ఏమాత్రమూ భంగం కనరాలేదు. అసలాప్రశాంతిని మనుష్యసమూహాలు, పశుపక్ష్యాదులు భంగపరచలేవని నాకనిపించింది.

‘సామంజఫల సుత్తం’లో శ్రమణజీవితంలో ఉండే వివిధ రకాల ప్రయోజనాల గురించి చెప్తూ, బుద్ధుడొకమాట అన్నాడు. ముఖ్యంగా ఆ జీవితం పనికిమాలిన సంభాషణలకి దూరంగా ఉండే జీవితమన్నాడు. ఆ జీవితంలో ‘రాజుల గురించీ, దొంగల గురించీ, మంత్రుల గురించీ, సైన్యాలగురించీ, భయాల గురించీ, తిండి గురించీ, తాగుడు గురించీ, వస్త్రాలగురించీ, శయ్యల గురించీ, హారాల గురించీ, అత్తరుల గురించీ, బంధువుల గురించీ, వాహనాల గురించీ, గ్రామాలగురించీ, నగరాల గురించీ, దేశాల గురించీ, స్త్రీల గురించీ, నాయకుల గురించీ’ చేసే అనవసర సంభాషణ ఉండదన్నాడు. ‘దాని గురించీ దీని గురించీ ఊహాగానాలు ఉండవ’న్నాడు.

ఇంతకీ నేడు మనం మన మన కార్యస్థానాల్లో, మన సమాచార, వార్తా ప్రసారమాధ్యమాల్లో, మన సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేస్తున్నదేమిటి? ‘రాజుల గురించీ, దొంగల గురించీ’ లోకాభిరామాయణం చేస్తుండటమే కదా! బహుశా శ్రమణజీవితఫలం ఎలా ఉంటుందో సాంచి ఒక సజీవ ఉదాహరణగా, కొండమీద నిర్విరామంగా వినిపిస్తున్న ‘సామంజఫల సుత్తం’ లాగా కనిపించింది నాకు.

అసలు మనం ఇట్లాంటి స్థలాలకి ఎందుకు వెళ్లాలి? టాగూర్ ఒకచోట రాస్తాడు. మనం ఇట్లాంటి స్థలాలకు వెళ్లినప్పుడు మనం మనలోని పరిమిత జ్ఞానాలనుంచీ, సంకుచితదృక్పథాల నుంచి బయటపడతామనీ, అపరిమితమైనదాంతో, గంభీరమైనదాంతో, శాశ్వతమైనదాంతో మనని మనం అనుసంధానించుకుంటామనిన్నీ.

మనుషులు జీవితాల్లో అవకాశాలకోసం వెతుకులాడే పరుగునుంచి కొద్దిసేపైనా పక్కకుతిరిగి ఇటువంటి తీరికవేళలకోసం, సోమరివేళలకోసం ప్రయత్నాలు చేయాలన్నాడాయన. ఈ మాటలాయన తన జపాన్ పర్యటన సందర్భంగా రాసిన మాటలు. నిజంగానే బషో యాత్రావర్ణనలు చదివినతరువాత, వాటిని తెలుగులోకి తెచ్చిన తరువాత నాకు కూడా ఇట్లాంటి సోమరివేళలకోసం వెతుకులాట మొదలయ్యింది.


The Primordial Man and the Perfect Man

1

The Fruit of the Shramana Life

Sanchi is close to Bhopal—a drive of merely an hour and a half. The road toward Vidisha winds through the tranquil, unhurried villages of Madhya Pradesh. The very name Vidisha instantly summoned the lines of Jibanananda Das describing Banalata Sen: her hair like the deep, impenetrable dark of an ancient night in Vidisha.

The morning sun of nine o’clock had begun to warm the air, though the horizons still remained moist with the mist of the month of Magha. Along the route, my eye caught a milestone marked: Tropic of Cancer. The realization that I was crossing the Tropic of Cancer stirred a strange, wondrous sensation within me. Asking the driver to pull over, I stepped out and stood for several moments upon that imaginary coordinate.

Sanchi is an ordinary village nestled in the Raisen district of Madhya Pradesh. Stepping into the settlement awakens no extraordinary sensation; it feels like entering any common countryside hamlet. Learning that the great Stupa of Sanchi rested atop an adjacent hill came with a touch of surprise. The Buddhist shrines I had encountered until then—Amaravati, Nagarjunakonda, Ghantasala—were all raised upon flat riverine plains. But the thought of a hill-sanctuary immediately piqued my curiosity.

As the car wound slowly up the ascending bends, the hill unveiled itself amid a late-winter forest just beginning to flush with the tender hues of new sprouts. Around us, fields, earth, and sky melted together in a pale emerald and sapphire luminescence, spreading out like a wash of fresh watercolors. Unawares, a deep, pervasive serenity began to settle over my mind.

Pulling into the parking lot, the driver pointed toward the nearby monument: “Look there, that is Sanchi.”

As the great stupa manifested before me in the ten o’clock morning light, an unspeakable awe overcame my senses. I hurried toward the open terrace and stood motionless. It felt as though the Buddha himself, absorbed in samadhi, had materialized before my eyes.

There is an elusive transcendence in the familiar image of the seated, meditating Buddha. Looking upon that form, an indefinable stillness awakens within. The true nature of that feeling was first revealed to me through the lines of the great German poet Rainer Maria Rilke. Rilke’s poem Buddha is itself an enduring sculpture in verse:

Like that sculpted Buddha, the Stupa of Sanchi seemed to hearken to some primordial, timeless proclamation, meditating upon that wordless testament in an atmosphere of extraordinary silence and absolute peace.

Stepping directly before the stupa, I halted near the Eastern Gateway (Torana), where a weathered, headless Buddha image met my eyes. Yet the statue did not strike me as broken or incomplete. Rather, it seemed as if the entire hemisphere of the great stupa rose above it as a luminous, cosmic substitute for the lost head.

Erected upon a hilltop rising nearly three hundred feet, this monument remains the most intact and complete Buddhist stupa in all of India. Like the Word of the Buddha, it stands unshaken by the abrasions of time. From the third century BCE to the tenth century CE—for nearly thirteen hundred years—this sanctuary offered shelter to generations of monks, devotees, and the living Sangha.

The marvel is that Sanchi bears no direct connection to any principal event in the historical life of Gautama Buddha. The Master never set foot upon this hill during his earthly ministry. Xuanzang, the seventh-century Chinese pilgrim who chronicled every sacred Buddhist site across India with scrupulous precision, did not devote a single line to Sanchi. Yet, even without the physical touch of the Buddha’s feet, Sanchi endures in history as a terrain consecrated through the unbroken prayers of shramanas and the enduring presence of the Sangha.

The earliest historical account of Sanchi reaches us through the Sri Lankan chronicles, the Mahavamsa and Dipavamsa. According to these records, while Ashoka was serving as viceroy at Ujjain before ascending the Mauryan throne, he married Devi, the daughter of a merchant from Vidisha. Years later, when their son Mahendra journeyed to Vidisha to seek the blessings of Queen Devi, the chronicles recount that she led him up to the serene hilltop monastery she had founded upon Vidishagiri, showing him the sanctuary she had raised.

Perhaps Ashoka, journeying between Vidisha and Ujjain in the third century BCE, caught sight of this hill rising out of the wilderness. No one in this land knew better than Ashoka precisely upon which cliff or boulder to inscribe words of awakening so that all who passed might read. It was as though that visionary eye belonged to Ashoka alone. When he first beheld this height, a Buddhist stupa must have already taken shape before his inner eye. And that very stupa he had envisioned within, he caused to be raised upon this summit, so that the entire land might look upon it.

Yet Sanchi outlived the splendor of the Mauryan Empire. Though it suffered a brief eclipse with the fall of the Mauryas, the site expanded under the succeeding Shunga dynasty. During that era, the core brick stupa built by Ashoka was encased and enlarged, and the stone balustrade (vedika), the terrace stairs, and the crowning square railing (harmika) were added.

Later, the task of bringing supreme grace to the monument fell to the Satavahanas. It was in their time that the magnificent gateways (toranas) we behold today were raised.

Though construction at Sanchi halted for an interval under the Western Kshatrapas who ruled Malwa, a fresh wave of creative flourishing surged the moment the Guptas defeated them and assumed power. The Guptas commissioned Buddhist sculptures on a vast scale from Mathura and transported them to Sanchi. Gradually, a distinctive sculptural idiom bearing local inflections began to take root on the hill itself. Later, during the dark days of the Huna invasions, when Yashodharman defeated Mihirakula, Sanchi stood secure. Under King Harsha, Sanchi once again tasted imperial glory.

Precisely when Sanchi turned into a deserted solitude remains unknown. No architectural trace dating past the thirteenth century is to be found upon this hill. The monks drifted away by degrees; for what exact reasons, history leaves unsaid. Until General Taylor of the East India Company stumbled upon these overgrown ruins in 1818, Sanchi remained a forgotten syllable in the annals of India. In 1822, when Captain Johnson, the Assistant Political Agent in Bhopal, breached and exposed the great stupa, Sanchi began to reveal its ancient countenance once more.

Yet we owe the resurrection of Sanchi in its present form to Alexander Cunningham, Captain F. C. Maisey, Major J. B. Cole, and, above all, Sir John Marshall. Alongside the miraculous survival of these monuments, heartbreaking truths also came to light. Most grievous of all: a local landlord had broken the Ashokan pillar into fragments to use as the roller of a sugarcane press!

The architectural anatomy of the Great Stupa reveals a low cylindrical base (medhi), stairs leading up to an elevated circumambulatory terrace (pradakshina-patha), a massive hemispherical dome (anda), and, atop the harmika, a triple stone umbrella (chhatravali) symbolizing the Three Jewels—the Buddha, the Dharma, and the Sangha. The diameter of the stupa spans 36.6 meters, and its height, excluding the crowning parasol, measures 16.46 meters. Yet the present hemisphere is only half the grandeur of the original conception.

The four cardinal gateways (toranas) surrounding the stupa remain its crowning glory. As mentioned earlier, these were raised during the Satavahana era. Every surface of these gateways is encrusted with exquisite relief carvings illustrating episodes from the Jatakas, the life of Gautama Buddha, early Buddhist lore, and the vibrant life of the times. Art historians often remark that Sanchi developed no truly distinct school of stone sculpture of its own, asserting that these reliefs were heavily informed by the artistic workshops of Mathura, and thus lack the rarefied refinement found at sites like Sarnath. Yet to my eyes, against the serene backdrop wrought by forest and sky, and within the contemplative atmosphere guarded for centuries by the monks, these sculptures gleam with an entirely fresh and living beauty.

Wandering like a restless seeker—moving clockwise and counter-clockwise around the great drum—I tried to lay hold of that rare, elusive tranquility that seemed to brush my hands only to slip away the next instant. I wondered what manner of human endeavor could bear such peace as its ultimate fruit.

My mind turned to that luminous, profoundly reflective dialogue among the Long Discourses of the Buddha: the Sāmaññaphala Sutta.

Once, on a full moon night in the month of Kartika, King Ajatashatru of Magadha stood upon the upper terrace of his royal palace at Rajagriha, gazing upon the sea of moonlight. He thought: On such a radiant night, how wonderful it would be to sit in the presence of an enlightened sage and listen to his words!

He turned to his ministers and asked if there was any such wise master. Each councilor praised a different teacher of the day. But Jivaka Kumarabhacca spoke of the Buddha, who was then lodging in his mango grove.

Ajatashatru set forth to meet the Buddha and engaged him in discourse. The question he posed to the Blessed One that night was simple and profound: What is the visible fruit of the shramana’s life? In that noble sutta, the Buddha unfolds the answer to him through myriad facets, rich parables, and luminous detail.

Reading that sutta, what became clear to me—what the Buddha reiterated time and again—is that to embrace the life of a shramana is to discover that one need not remain a cog in the social hierarchy; one can slip the bonds of that graded, ladder-like subjugation and, in that very liberation, live a life profoundly fruitful both to oneself and to the world.

He offered a vivid image: just as a man standing upon the terrace of a tall mansion looks down at people walking the thoroughfares, moving in and out of their dwellings—observing, “Here they enter their houses, here they emerge; here they walk the streets, here they gather at the crossroads”—so too can the awakened mind look upon death, observing the entrances and exits of mortals with dispassionate clarity. Standing beside this stupa on this forested hill, one feels that the insight to view human birth and death as ordinary, natural passages comes almost without effort.

Beside the Great Stupa stands a temple belonging to the Sri Lankan Buddhist tradition (the Mahabodhi Society). Nearby is a small shop offering Buddhist literature, replicas, and figurines. I purchased a terracotta icon of the Buddha and a few small keepsakes, selecting one miniature Buddha as a memento for my friend Gangareddy.

Right adjoining it stands the memorial shrine dedicated to Sariputta and Moggallana—those two foremost disciples whose penetrating inquiries had drawn forth so many profound discourses from the Master’s lips. Standing before their resting place, an encounter between the Buddha and Sariputta in the Mahaparinibbana Sutta surfaced in my mind.

Once, when the Blessed One was residing in Pavarika’s mango grove at Nalanda, Sariputta came before him, bowed low, and declared with fervent conviction: “Lord, such faith have I in the Blessed One that I believe there never was, nor will there ever be, nor is there now, any recluse or brahmin more deeply enlightened than the Blessed One.”

The Buddha listened, and then probed: “Vast and noble are your words, Sariputta; a bold lion’s roar have you uttered! But tell me: have you known all the Buddhas of the past with your own mind, understanding their virtue, their wisdom, and their release?”

“No, Lord,” Sariputta answered.

“And have you known all the Buddhas yet to arise in the future?”

“No, Lord.”

“Then at least, Sariputta, do you comprehend this present Buddha—my own mind, my conduct, and my wisdom—in its entirety?”

“No, Lord.”

A formidable interrogation indeed! I remember reading the passage with eager suspense, wondering how the disciple would answer.

Then Sariputta answered: “Lord, I do not possess the encompassing knowledge to read the minds of the Buddhas of past, future, and present. Yet I know the drift and compass of the Dhamma. I am like a gatekeeper stationed at the single gate of a mighty border fortress with high, unbroken walls. Though I cannot trace every crevice in the stones or see what tiny creatures crawl through the cracks, I know with absolute certainty that every large creature that enters or departs that citadel must pass through that one gate alone.”

What an answer! What sheer brilliance of insight!

A short while later, a party of Buddhist pilgrims arrived from afar. Several monks began explaining the history and meaning of the stupa to them. Yet despite the influx of people, the deep calm I had been resting in suffered not the slightest tremor. It struck me then that this kind of stillness is incorruptible—no press of human crowds, no stir of beasts or birds can ever disturb it.

In the Sāmaññaphala Sutta, while enumerating the fruits of the ascetic life, the Buddha observed that above all, such a life remains completely sheltered from base, idle talk (tiracchāna-kathā). In that life, one finds no frivolous chatter:

“Talk about kings, about robbers, about ministers; talk about armies, about terrors, about battles; talk of food, drink, clothing, and beds; talk of garlands, perfumes, and jewels; gossip of kinsmen, of vehicles, of villages, towns, and cities; talk of women and of heroes; speculation about what is and what is not.”

And yet, what are we consumed with today in our workplaces, across the news cycles, and throughout our social media feeds? Is it not an unending carousel of idle chatter about “kings and robbers”?

To my eyes, Sanchi presented itself as a living embodiment of the shramana’s visible fruit—a Sāmaññaphala Sutta sounding without pause upon a solitary hill.

Why, after all, must we journey to such places?

Tagore wrote somewhere that when we step into these ancient landscapes, we break free from our small, insular certainties and narrow perspectives, yoking ourselves once more to the infinite, the solemn, and the everlasting. He insisted that mortals, pausing in their relentless race for worldly ambition, must actively carve out such unhurried interludes—cherished hours of idle, contemplative leisure.

He penned those reflections during his journey to Japan. And truly, after reading the travel sketches of Bashō, and after rendering them into Telugu, I too found myself perpetually searching for just such sacred, contemplative hours.

19-9-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading