నేను తిరిగిన దారులు-23

ఆదిమానవుడూ పూర్ణమానవుడూ

2

ప్రాగైతిహాసిక మానవుడి స్వర్గం

సాంచి నుండి భోపాల్ తిరుగుప్రయాణం చేస్తూండగా భోపాల్ దగ్గరలోనే భీమ్ బేట్క  గుహలున్నాయని తెలిసింది. ఎప్పుడో పదేళ్లకిందట నేనా గుహల గురించి చదివాను. నా జ్ఞాపకాల లోపలి పొరల్లోకి పోయిన ఆ పేరు, వాటిగురించి చదివినప్పుడు నాలో రగిలిన కుతూహలం మళ్లా ఒకసారి బయటికొచ్చాయి. ఒక్కసారి నా మనసు క్రీ.పూ. 3వ శతాబ్దంనుంచి, క్రీ.శ. 300వ శతాబ్దానికి పరుగులు పెట్టింది. అవును, 300వ శతాబ్దమే. భీమ్ బేట్క గుహలు వింధ్యపర్వతాల్లో నెలకొని ఉన్న గుహాసముదాయం. సముద్రమట్టానికి దాదాపు 2000 అడుగుల ఎత్తున ఉన్న ఈ గుహల్లో తొలి భారతీయమానవుడు నివసించిన జాడలున్నాయి. ఇక్కడ కనీసం 1,00,000 ఏళ్ల కిందటనే మనిషి జీవించిన ఆనవాళ్లున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ గుహల్లో ఆది మానవుడు చిత్రించిన చిత్రాలున్నాయి. ఈ చిత్రాలు కనీసం 30,000 ఏళ్ల నాటివి.

ఇప్పుడు కవితలు రాసే యువకవులు నగరాల్లో కూర్చొని తమ పల్లెటూళ్ల గురించీ, బాల్యం గురించీ, ఎడ్లగురించీ, వ్యవసాయ పనిముట్లగురించి రాస్తున్నట్టే ఒకప్పుడు ప్రాచీనకాలంలో కవులు వాల్మీకి, కాళిదాసు వంటివారు వ్యావసాయిక సమాజంలో భాగంగా కవిత్వం రాస్తూ తమ అరణ్యజీవిత జ్ఞాపకాల్ని కవిత్వంగా రాశారు. ఒకప్పుడు అరణ్యాల్లో వేదగానం చేసిన వేదఋషులు మానవుడు గుహల్లో జీవించినప్పటి జ్ఞాపకాల్ని వేదసూక్తాల్లో (1.163.3, 3.1.9, 10.46.21; 11.5.10, 20.7.1 సూక్తాలు) నిక్షిప్తం చేశారు. ఇప్పటికీ వైదిక, వేదాంత, తాంత్రిక, దార్శనిక పరిభాషల్లో ‘గుహ’ అంటే అత్యంత పవిత్రస్థలం, జీవితరహస్యాలు గోచరించే స్థలం. రానురాను బయటిగుహ లోపలి హృదయకుహరానికి ప్రతీకగా మారిపోయింది. ఐదువేల ఏళ్ల భారతచరిత్రలో వైదిక, బౌద్ధ, జైన, వామాచార దర్శనాలెన్నిటికో గుహలు కేంద్రాలు. ఆత్మదర్శన రహస్యోద్యమ స్థావరాలవి. నేడు మనకు వాక్కులో దివ్యజ్ఞానానికి ఆనవాళ్లుగా మిగిలిన గుహలు నిజంగా ఎలా ఉంటాయో, అక్కడ మానవుడు ఎలా జీవించి ఉంటాడో చూడాలంటే భీమ్ బేట్క వెళ్లాలి.

1870లో స్పెయిన్లో అల్టామీర గుహల్లో ఆదిమమానవుడు చిత్రించిన చిత్రాలు బయటపడటం యూరప్ని కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది. అంతదాకా డావిన్సీ నీ , రాఫెల్ నీ , రూబెన్స్ నీ మాత్రమే ఆరాధిస్తూ వచ్చిన యూరోపియన్ చిత్రకారుణ్ణి పికాసోగా మార్చిన గుహలవి. ఆదిమమానవుడు వస్తుపరంగా మనకన్నా వెనకబడి ఉండవచ్చునేమోగానీ, సాంకేతికంగా, శిల్పదృష్టిపరంగా మనకన్నా ఎన్నో యుగాలముందున్నాడని ఆ చిత్రాలు ప్రపంచానికి చాటాయి. అల్టామీర గుహాచిత్రలేఖనాలు బయటపడ్డ కొద్దిరోజులకే ఫ్రాన్స్ లో , ఆఫ్రికాలో, చైనాలోకూడా ప్రాచీనగుహాచిత్రలేఖనాలు బయటపడ్డాయి. వీటన్నిటిలోనూ ఆఫ్రికన్ గుహాచిత్రలేఖనాలు అత్యంత ప్రాచీనాలు.

అయితే 1957లో ఉజ్జయినికి చెందిన విక్రమ్ విశ్వవిద్యాలయానికి చెందిన వి.ఎస్. వకాంకర్ భీమ్ బేట్క గుహల్లోని చిత్రలేఖనాల్ని బయటపెట్టడంతో భారతదేశ కళాచరిత్ర, మానవభావావేశచిత్రణ ముప్ఫై సహస్రాబ్దాలు వెనక్కి జరిగింది. అయితే భారతదేశంలో గుహాచిత్రలేఖనాల్ని మొదటిసారి 1867లో ఉత్తరప్రదేశ్ లో చూశారు. 1883లో కాక్ బర్న్ అనే అతడు మొదటిసారి భారతీయ గుహచిత్రాలమీద పరిశోధన వెలువరించాడు. కాని భారతదేశంలోని తక్కిన గుహాచిత్రలేఖనాలు అన్నీ ఒక ఎత్తు, భీమ్ బేట్క గుహాచిత్రాలొక్కటీ ఒక ఎత్తు. అందుకనే వకాంకర్ భీమ్ బేట్క ని ‘ప్రాగైతిహాసిక మానవుడి స్వర్గం’గా అభివర్ణించాడు.

యునెస్కో ప్రపంచ వారసత్వసంపదలో భాగంగా భీమ్ బేట్క ను గుర్తించింది. భారతదేశంలో ఈ గౌరవం పొందిన గుహాసముదాయం ఇదొక్కటే. అయితే ప్రపంచంలో దీనితో సమానగౌరవం పొందిన గుహాసముదాయాలు కలహారి ఎడారిలోని బుష్మన్ల గుహాచిత్రాలు, ఫ్రాన్స్ లోని  పాతరాతియుగపు గుహాచిత్రాలు వంటివి మాత్రమే. ఒక మానవనివాసాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కో పది ప్రమాణాలు పెట్టుకుంది. అందులో భీమ్ బేట్క రెండు ప్రమాణాలకు నిలబడుతోందని యునెస్కో చెప్పింది. ఒకటి, ఇక్కడ మానవుడికీ ప్రకృతికీ మధ్య సుదీర్ఘకాలంగా ఒక నిరంతర ఆదానప్రదానం జరుగుతుందన్న నిరూపణ ఉండటం. రెండవది, ఈ ప్రాంతంలో ఇప్పటికీ నివసిస్తున్న ఆదివాసుల జీవనవిధానాన్ని బట్టి గత 300 శతాబ్దాలుగా వేట, ఆహారసేకరణ ముఖ్యవృత్తులుగా వికసించిన ఆర్థికవ్యవస్థ కొనసాగుతూ వస్తున్నది అన్నది.

భీమ్ బేట్క వెళ్లే దారి పొడుగునా రోడ్డుకటూఇటూ పలాశవృక్షాలు. అక్కడక్కడా ఎర్రని మొగ్గలతో కనిపిస్తున్న మోదుగుచెట్లను చూడగానే నేనొక అత్యంత ప్రాచీన భారతీయక్షేత్రంలో ప్రయాణిస్తున్నాననిపించింది. మేం ప్రధానరహదారినుంచి భీమ్ బేట్క గుహలకు మళ్లే కూడలి దగ్గర మధ్యాహ్నభోజనం చేశాం. అక్కడ మధ్యప్రదేశ్ టూరిజంవారు భీమ్ బేట్క గుహల మీద ముద్రించిన సాహిత్యం, కరపత్రాలు ఉన్నాయి. అందులో రాసిన కొద్దిపాటి వివరాలూ ఆవురావురుమంటూ చదివేశాం. ఎంత తొందరగా ఆ గుహల్ని చూస్తానా అన్న ఆతృతతో నాకు కాలం తెలియలేదు. కారు లోపల అడవిదారమ్మట ప్రయాణిస్తూ ఉంటే, నాకు మళ్లా నా జీవితం పొడుగునా సంచరిస్తూ వచ్చిన అడవిదారుల్లో, మరొక అడవిదారినే ప్రయాణిస్తున్న భావన కలిగింది. బహుశా నాలో ఇంకా ఆదిమానవుడు, గుహావాసి సజీవంగా ఉన్నాడనుకుంటాను. అడవి వాసన సోకగానే, కొండగాలి తగలగానే నాలోని ఆ ప్రాచీనమానవుడు సంతోషంగా పైకి లేస్తాడు. గుహలోంచి సింహం బయటికొచ్చినట్టుగా నాలోని భావుకమానవుడు బయటికొస్తాడు.

ఆ మాఘమాసపు ఎండలో చుట్టూ అడవి అంతా ఒక బూడిదరంగు ఊహలాగా ఉంది. డ్రైవరు కారు ఆపి ‘ఇక్కడినుంచి మీరు నడిచి వెళ్లాలి’ అన్నాడు. కిందకు దిగగానే, నేను వింధ్యపర్వతాల్లో అడుగుపెట్టాను అని స్ఫురించగానే, నాకుచెప్పలేని వివశత్వం కలిగింది. ఒకప్పుడు అగస్త్యుడు ఉత్తరం నుంచి ఈ వింధ్య దాటి దక్షిణానికి అడుగుపెట్టాడు. ఆయన తిరిగిమళ్లీ వెళ్లడం కోసం వింధ్య అప్పటినుండీ తలొగ్గి ఎదురుచూస్తూనే ఉంది. కాని వింధ్యాన్ని శాశ్వతంగా అణచడం కోసం అగస్త్యుడు మళ్లీ ఈ దారిన తిరిగి వెళ్లలేదు.

బహుశా, అప్పణ్ణుంచీ, తనను చేరవస్తున్న ప్రతి మానవుడిలోనూ వింధ్య ఒక అగస్త్యుణ్ణి గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుందనుకుంటాను. అందుకనే ఆ పర్వతసముదాయం నన్ను ‘నువ్వు అగస్త్యుడివేనా?’ అని అడిగినట్టనిపించింది. నేను చిరునవ్వుతో ‘అగస్త్యుణ్ణి కాదు, అవిసె చెట్టుని మాత్రమే’ అన్నానా కొండలతో. (సంస్కృతంలో అగస్త్యమంటే అవిసె చెట్టు అని కూడా అర్థం.)

ఇక అప్పటినుంచి సుమారు నాలుగు గంటలపాటు ఆ గుహలంతటా కలియతిరిగాను. ఆ గుహాసముదాయం ఒక ప్రాచీన మెట్రోపోలిస్ లాగా అనిపించింది. భీమ్ బేట్క దాదాపుగా 700 గుహల సముదాయం. అందులో 243 గుహల దాకా భీమ్ బేట్క చుట్టుపక్కల ఉన్నాయి. అవి ఆదిమానవుడి నివాసస్థలాలు. అక్కడ గుహల్లో ఆనాటి మనుషులు చిత్రించిన చిత్రలేఖనాలున్నాయి.

అక్కడ మనిషి పాతరాతియుగపు కాలం నుంచి జీవిస్తున్న సూచనలున్నప్పటికీ ఆ చిత్రలేఖనాల వయస్సు నిర్ధారించడం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. స్వదేశీ పరిశోధకులు ఆ చిత్రలేఖనాలు పాతరాతియుగపు కాలానికి చెందినవని (క్రీ.పూ. 300వశతాబ్దానికి పూర్వం) వాదిస్తుంటే, విదేశీపరిశోధకులు వాటిని చరిత్రయుగానికి (క్రీ.పూ. 50వ శతాబ్దానికి తరువాతవి) అని వాదిస్తున్నారు. అయితే బొమ్మలకు వాడిన పిగ్మెంట్ డిపాజిట్లు, బొమ్మల్లో చిత్రించిన పనిముట్లు, ఆ పనిముట్లు తయారుచేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మొదలైన సాక్ష్యాల్నిబట్టి ఆ చిత్రాలు క్రీ.పూ. 25,000- క్రీ.పూ. 5,000 మధ్య కాలానికి చెందినవిగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఆ కాలాన్ని మధ్యరాతియుగం కాలంగా పేర్కొంటారు. మానవుడి చారిత్రక యుగానికి చెందిన కళలు, సాహిత్యం, మతాల మీద మధ్యరాతియుగం ప్రభావాలే బలంగా ఉన్నాయి. భారతీయసాహిత్యం మీద, మతాలమీద, భారతీయ జీవితదృక్పథం మీద మధ్యరాతియుగ ప్రభావం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

మధ్యరాతియుగంలో భారతదేశం ఐదు ప్రధాన భూభాగాలుగా ఉండేది. వేదాల్లో పంచజనుల ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. ఈ పంచజనుల ప్రస్తావన చాలామంది అనుకునేటట్లుగా ఐదు కులాల ప్రస్తావన కాదు. ఇది మధ్యరాతియుగపు భారతీయజీవితపు జ్ఞాపకాలనుంచి ఉత్పన్నమైన భావన. భారతదేశపు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, మధ్యభాగాలకు చెందిన జనజీవితాన్ని సూచించే మాట అది. అప్పట్నుంచీ, ఇప్పటిదాకా కూడా భారతదేశం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు భాగాలుగా వికసిస్తూ ఉన్న ఏకజాతి, ఏకదేశం, ఏకస్ఫూర్తి. ఈ ప్రతిపాదనకు గంభీరమైన ప్రాతిపదికగా భీమ్ బేట్క గుహలు నిలబడి ఉన్నాయి.

అనేక ప్రాచీన గుహాచిత్రాల్లో, అయితే, మనుషులకి ప్రాతినిధ్యం ఉంది, లేదా జంతువులకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. బహుశా ఈ సమస్య అనాదికాలంనుంచి కళనీ, సాహిత్యాన్నీ కూడా పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికీ మన ఆధునిక, అత్యాధునిక చిత్రకళలో కూడా అయితే ప్రకృతి ఉంటుంది లేదా మనుషులు మాత్రమే ఉంటారు. కాని భీమ్ బేట్క గుహల్లో చిత్రించిన చిత్రాల్లో జంతువులు, మనుషులు కూడా సమానప్రాతినిధ్యం పొందారు. ఆ మాటకొస్తే ఆ చిత్రలేఖనాల్లో కేవలం ప్రకృతి లేదు, కేవలం మనిషి లేడు. ప్రకృతి, మనిషి సమానంగా పాల్గొనే ఒక జీవనక్రతువు మాత్రమే ఉంది. బహుశా ఈ స్ఫూర్తినే ఋగ్వేదం కూడా అనుసరించి ఉంటుందనుకోవచ్చు.

ఋగ్వేదమానవుడి గురించి రాస్తూ రేమండ్ పణిక్కర్ తన ‘వేదిక్ ఎక్స్పీరియన్స్’లో ఈ విషయాన్నే పదేపదే వివరిస్తాడు. కాగా, ఋగ్వేదమానవుడు ప్రకృతీ, మానవుడూ పాల్గొనే ఇటువంటి క్రతువుకి ఆలంబనగా ‘వాక్కు’ని స్వీకరించాడు. అది శబ్దకేంద్రసంస్కృతి. వింధ్యపర్వతాల్లో నివసించిన ప్రాచీన భారతీయుడు ప్రకృతి-మనిషి పాల్గొనే క్రతువుకి ఆలంబనగా చిత్రలేఖనాన్ని స్వీకరించాడు. ఇది చిత్రకేంద్రసంస్కృతి. ఏమైనప్పటికీ ఈ ప్రకృతిపురుష అనాదిఖేల చుట్టూతానే భారతీయ దర్శనాలన్నీ వికసిస్తూ వచ్చాయి. ఒక అనాదిమూలసాంఖ్యదర్శనంలాగా భీమ్ బేట్క గుహాసముదాయం నాకు గోచరించిందనడం అతిశయోక్తి కాదు.

నేనక్కడ సంచరిస్తున్నంత సేపూ ఆ గుహల్లో ఆదిమానవులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నట్టు, తింటున్నట్టూ, పాడుతున్నట్టూ, ఆడుతున్నట్టూ ఊహించుకున్నాను. కింద లోయల్లో రకరకాల వన్యమృగాలు ఘీంకారాలతో, క్రేంకారాలతో అరుస్తూ అటూఇటూ పరుగెడుతున్నట్టుగా అనిపించింది. నా రక్తంలో, ఎక్కడో లోపల నిద్రిస్తున్న 300 శతాబ్దాల కిందటి, అంటే సుమారు 1200 తరాల కిందటి నా పూర్వమానవుల భావోద్వేగాల్ని నా జన్యుస్మృతుల్లోంచి తట్టి లేపే ప్రయత్నం చేశాను. ఆనాటి మానవుడు ఏమి కోరుకుని ఉంటాడు? ఏమి కలగని ఉంటాడు?

మధ్యయుగాల భారతీయ చిత్రకళ గురించి రాస్తూ ఆచార్య సుశీలపంత్ (ద డాన్ ఆఫ్ ఇండియన్ సివిలిజేషన్, సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సివిలిజేషన్, 1999, పే. 216-217) ఇట్లా అన్నాడు:

తిరిగి వెనక్కి వస్తూంటే నాకో మన్వంతరం పూర్తయినట్టనిపించింది. సాంచి పరిపూర్ణమానవుడి పరిపూర్ణప్రజ్ఞానానికి స్మారకచిహ్నమయితే, భీమ్ బేట్క గుహలు ఆదిమమానవుడి ఆదిమ జీవితకాంక్షకు, జిగీషకు నిలువెత్తు సాక్ష్యాలుగా నాకు గోచరించాయి. మానవచరిత్రలో నేనొక పూర్తి అధ్యాయాన్ని ఏకబిగిన చదివేసాననిపించింది.

ఆదివారం ఆంధ్రజ్యోతి, 2011


The Primordial Man and the Perfect Man

2

The Prehistoric Man’s Paradise

While returning from Sanchi to Bhopal, I learned that the caves of Bhimbetka lay just outside the city. A decade earlier, I had read about them. That name, buried beneath inner layers of memory, and the burning curiosity it had once awakened, surged to the surface once more. In an instant, my mind raced from the third century BCE back to the three-hundredth century BCE. Yes—the three-hundredth century before our era.

Nestled within the Vindhyan ranges, rising nearly two thousand feet above sea level, this labyrinth of rock shelters preserves traces of the earliest humans on the Indian subcontinent. Here, unmistakable signs confirm human habitation dating back at least one hundred thousand years. Above all, these shelters preserve paintings drawn by prehistoric humans—works dating back thirty thousand years.

Just as modern young poets sit in bustling cities writing of their ancestral villages, childhoods, bullocks, and farm tools, ancient poets like Valmiki and Kalidasa, composing verse within settled agrarian societies, drew upon deep, collective memories of forest-dwelling life. In an even earlier epoch, the Vedic seers chanting hymns in woodland hermitages deposited memories of the era when man dwelt in caves into the sacred suktas (Rigveda 1.163.3, 3.1.9, 10.46.2; Atharvaveda 11.5.10, 20.7.1). To this day, across Vedic, Vedantic, Tantric, and philosophical traditions, the guha—the cave—remains the most sanctified space, the secret realm where the mysteries of existence unveil themselves.

Over centuries, the physical cave transformed into an enduring symbol for the cavern of the human heart (hridaya-guha). Across five millennia of Indian history, caves served as epicenters for Vedic, Buddhist, Jaina, and esoteric heterodox paths—sanctuaries for the secret quest of self-realization. To understand what those caves were truly like, to witness where divine wisdom first took shelter before entering speech, and to see how humanity lived within those stone wombs, one must go to Bhimbetka.

In 1870, the discovery of prehistoric paintings in the Altamira caves of Spain sent shockwaves not merely through Europe, but across the entire world. They were the very caves that transformed the European artistic consciousness—which until then had venerated only Da Vinci, Raphael, and Rubens—into the vision of Picasso. Those murals announced to the world that while prehistoric man might have been technologically rudimentary in material terms, in graphic sensibility and aesthetic vision he stood ages ahead.

Soon after Altamira, ancient rock art came to light in France, Africa, and China, with the African paintings proving the most archaic of all. Then, in 1957, when Dr. V. S. Wakankar of Vikram University, Ujjain, discovered the rock paintings of Bhimbetka, the history of Indian art and the visual expression of human emotion were pushed back thirty millennia.

Cave art in India had first been recorded in 1867 in Uttar Pradesh, followed by Cockburn’s pioneering 1883 research on Indian rock paintings. Yet all other rock art sites in the country stand on one plane, and Bhimbetka stands peerless on another. It was with good reason that Wakankar christened Bhimbetka “the Prehistoric Man’s Paradise.”

UNESCO inscribed Bhimbetka as a World Heritage Site—the only rock shelter complex in India accorded this singular honor. Globally, only a few complexes, such as the Bushman rock paintings of the Kalahari Desert and the Paleolithic cave art of France, share equivalent stature. UNESCO maintains ten rigorous criteria for declaring a human settlement a World Heritage Site; Bhimbetka met two of them. First, it offers enduring proof of a continuous, intimate dialogue between man and nature spanning unbroken millennia. Second, through the living traditions of the indigenous communities still inhabiting the region, it reveals the survival of a hunting-and-foraging subsistence economy flourishing continuously across three hundred centuries.

Along the road toward Bhimbetka, flame-of-the-forest trees (palasha) lined both flanks of the path. Beholding those moduga boughs dotted with red blossoms, I felt myself traveling through a sacred, primordial landscape of ancient India. We stopped for lunch at the crossroads where the main highway branches off toward the Bhimbetka caves. There, pamphlets and brochures printed by Madhya Pradesh Tourism were available; we devoured the sparse details with eager hunger.

Lost in the yearning to reach the caves as quickly as possible, I lost all sense of passing time. As the car wound deeper along the forest track, the familiar sensation swept over me of journeying along yet another woodland path among the countless forest tracks I have walked throughout my life.

Perhaps the prehistoric human, the ancient cave-dweller, still lives awake within me. The moment the scent of wild forest reaches me, the instant the mountain breeze brushes my face, that primeval man rises joyfully to his feet. Like a lion stepping out from the mouth of its cave, the poet within me steps forth into the light.

Under that late-winter sun of Magha, the surrounding forest drifted like a pale grey reverie.

The driver brought the car to a halt and said, “From here, you must proceed on foot.”

The instant my feet touched the earth, the realization that I had crossed into the Vindhya range surged through me with overwhelming intensity. Once, the sage Agastya had traversed these heights, descending from the north to enter the south. Bound by his command, the Vindhyas bowed their haughty crests, waiting ever since for his return. Yet, to humble the pride of the mountains for all eternity, Agastya never walked back that way. Ever since, perhaps, the Vindhyas gaze upon every traveler who draws near, searching for a trace of Agastya. It felt as though those ancient rocks looked down and asked me: “Are you Agastya?”

With a quiet smile, I answered the crags: “No, I am not Agastya—I am merely an agise tree.” (In Sanskrit, Agastya also denotes the humble Sesbania grandiflora, the humming-tree).

From that moment, I wandered among those shelters for nearly four hours. The labyrinthine complex struck me as an archaic stone metropolis. Bhimbetka comprises nearly seven hundred caves, with some 243 shelters clustered in the immediate vicinity. These were the living abodes of primordial man, their interior surfaces covered with paintings left behind by our forebears.

Though clear traces confirm human presence here from the Lower Paleolithic, determining the precise antiquity of these paintings remains a subject of intense debate. Indigenous scholars argue for an Upper Paleolithic antiquity (prior to the 300th century BCE), while foreign researchers often assign them to historical horizons (after the 50th century BCE). However, based on mineral pigment deposits, the tools depicted, and the stone-working techniques required to fashion them, scholars now broadly situate the paintings between 25,000 BCE and 5,000 BCE—the broad span of the Mesolithic.

It is the Mesolithic consciousness that cast the most enduring foundational shadows across the art, literature, and religions of historical humanity. The profound imprint of this Middle Stone Age upon Indian literature, religion, and the larger Indian worldview is only now being fully brought to light.

During the Mesolithic, the Indian subcontinent was understood as five great geographical and cultural realms. The frequent invocation in the Vedas of the Pancha-janāḥ—the Five Peoples—is not, as commonly assumed, a reference to five social orders or castes. It is an ancient memory rooted in the life of Mesolithic India, designating the communities dwelling across the five compass directions: eastern, western, northern, southern, and central India. From that remote antiquity down to this day, India has flourished as a single people, a single land, and a single spirit across five geographic and cultural zones. The rock shelters of Bhimbetka stand as a monumental foundation for that enduring continuum.

In many prehistoric caves across the world, one finds either the human presence depicted to the exclusion of nature, or animal life painted to the exclusion of man. This dichotomy has haunted art and literature from primordial times. Even in our modern and post-modern painting, canvases tend to be dominated solely by landscape or exclusively by the human figure.

Yet in the rock shelters of Bhimbetka, animals and humans share equal sovereignty. In truth, there is neither isolated nature nor isolated man; there is only a unified, cosmic sacrifice of life in which nature and humanity partake as equal participants.

Perhaps this was the very spirit that animated the Rigveda. Writing on the Rigvedic human in The Vedic Experience, Raimon Panikkar returns repeatedly to this insight. But where the Rigvedic seer adopted Vāc—the sacred word—as the vessel for this cosmic ritual between man and nature, creating a word-centered (shabda-centric) culture, the ancient dweller of the Vindhyas adopted the painted line. His was an image-centered (chitra-centric) culture.

Be that as it may, it is around this primordial play of Prakriti and Purusha that every major stream of Indian philosophical thought subsequently unfolded. It is no exaggeration to say that, before my eyes, the rock shelters of Bhimbetka manifested as an archaic, primordial monument to the root philosophy of Samkhya.

Wandering through those shelters, I envisioned clans of prehistoric humans roaming together in bands, eating, singing, and dancing within the stone chambers. In the valleys below, wild beasts seemed to charge to and fro, filling the ravines with their trumpeting and roaring cries. Deep in my veins, I reached into dormant genetic memories, trying to summon the living emotions of my ancestors from three hundred centuries ago—some twelve hundred generations before my time. What had that ancient human yearned for? What dreams had he harbored in the dark?

Reflecting on Indian rock art in The Dawn of Indian Civilization (Centre for Studies in Civilizations, 1999, pp. 216–217), Prof. Sushila Pant observed:

As I began my journey back, I felt as if an entire epoch—a manvantara—had drawn to a close. If Sanchi rose as a monument to the supreme, awakened wisdom of the Perfect Man, the caves of Bhimbetka stood before me as towering testaments to the primordial life-instinct and unconquerable will to survive of the Primordial Man.

It felt as though I had read through an entire chapter of human history in a single, unbroken breath.

Andhra Jyothi Sunday Supplement, 2011

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading