ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు ఒక కవిని ఇంటికి వెళ్ళికలుసుకుంటే ఆ రోజు ఆకాశంలో ఎగిరి వచ్చినట్టుంటుంది. ఒక చిత్రకారుణ్ణి అతని స్టూడియోలో కలుసుకుని వస్తే గరుత్మంతుడిలాగా నాక్కూడా ఇంత అమృతాన్ని దొంగిలించి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది.
భగ్నదేవతావిగ్రహం
ఎవరో అన్నారు, సంగీతాన్ని అనుకరించి మాత్రమే నేర్చుకోగలమని. బహుశా ఆ మాట కవిత్వకళకి కూడా వర్తిస్తుంది. నా మటుకు నేను కొందరు కవుల్ని నమూనాలుగా పెట్టుకునే కవిత్వసాధన చేస్తూంటాను. అట్లాంటి కవుల్లో జర్మన్ కవిశ్రేష్టుడు రేనర్ మేరియా రిల్కె (1875-1926)ని ముఖ్యంగా చెప్పుకోవాలి.