One Hundred Years of Multitude

అట్టాడ అప్పల్నాయుడు రాసిన ‘బహుళ’ (2020) చదివాను. కాళీపట్నం రామారావుగారికి అంకితం ఇచ్చిన ఈ నవల తెలుగు సాహిత్యానికి కళింగాంధ్ర సాహిత్యం ఇచ్చిన అపూర్వమైన కానుక అనిపించింది.

2

ఉత్తరాంధ్ర జిల్లాలుగా పిలవబడే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతాన్ని కళింగాంధ్ర అని కూడా పిలుస్తారు. ఒడిస్సా లోని దక్షిణప్రాంతంలోని కొన్ని జిల్లాలు కూడా చారిత్రికంగా కళింగాంధ్ర కిందకే వస్తాయి. ఆంధ్ర దేశ చరిత్రలో కూడా కొన్ని సార్లు పిఠాపురందాకా, కొన్ని సార్లు రాజమండ్రిదాకా కూడా కళింగరాజ్యంగా ఉండేది. స్థూలంగా చెప్పాలంటే ఛత్రపురం నుంచి పిఠాపురందాకా కళింగాంధ్ర అనిచెప్పవచ్చు.

ఇప్పటి కళింగాంధ్రలో దాదాపు కోటిమంది ప్రజలున్నారు. పది పన్నెండు నదీపరీవాహక ప్రాంతాలున్నాయి. అపారమైన అటవీ సంపద, ఖనిజ సంపద ఉంది. సుదీర్ఘమైన తీరరేఖ ఉంది. కాని భౌగోళికంగా సుసంపన్నమైనప్పటికీ, రాష్ట్రంలోనే అత్యంత బీదరికం నెలకొన్న చోటు కూడా ఇదే అని చెప్పవచ్చు. జనాభాలో దాదాపుగా 85 శాతం గిరిజనులు, దళితులు, వెనుకబడిన కులాల వారు ఉన్నారు.

చరిత్రలో కళింగాంధ్రకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అది మహాసామ్రాజ్యాల ఆధిపత్యాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. దాన్ని లొంగదీసుకోవడంకోసమే అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంగతి మనకు తెలుసు. సముద్రగుప్తుడు దండయాత్రలు చేసిన సంగతి కూడా మనకు తెలుసు. కానీ పదిహేనో శతాబ్దంలో కళింగ గాంగులు, పదిహేడో శతాబ్దంలో జైపూరు రాజులు మరోసారి తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఆధునిక కాలంలో ఒరిస్సా అటు బెంగాల్‌ ప్రెసిడెన్సీలోనూ, కళింగం ఇటు మద్రాస్‌ ప్రెసిడెన్సీలోనూ భాగమయ్యాక, తిరిగి 1936 లో ప్రత్యేక ఒరిస్సా ప్రావిన్సు ఏర్పడేదాకా, ఈ ప్రాంతం రెండు ప్రెసిడెన్సీలకీ అంచుల్లోనే ఉండిరది. ఏ ప్రాంతమైనా రాజధానికి దూరంగా ఉన్నప్పుడు అది అశాంతికి కేంద్రబిందువు కావడం సహజం. అందులోనూ అట్టడుగువర్గాలవారు, ముఖ్యంగా గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్న కళింగాంధ్ర ప్రాంతం బ్రిటిష్‌ పాలనాకాలంలో నిరంతరం అశాంతికి లోనవూతూనే ఉండేది.

పూర్వపు విశాఖపట్టణం, గంజాం జిల్లాలు మద్రాస్‌ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు 1834 లో పర్లాకిమిడి జమీందారీలో తిరుగుబాటు తలెత్తినప్పుడు రస్సెల్‌ అనే రెవెన్యూ అధికారి ఆ తిరుగుబాటు కారణాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. గిరీజన ప్రాంతాలకు సంబంధించినంతవరకూ ఈస్టిండియా కంపెనీ నేరుగా పాలన చేయకుండా, అలాగని జమీందారుల ఇష్టానికి వదలకుండా స్థానిక కలెక్టర్లకు అధికారాలు బదలాయించడం మంచిదని సలహా ఇచ్చాడు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాల పాలనావసరాల్ని దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టుగా ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని వాళ్ళకి అప్పగించాలన్నాడు. ఆ సిఫార్సుల ప్రకారం 1839లో గంజాం, విశాఖపట్టణం చట్టాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో కంపెనీ పాలన స్థానంలో బ్రిటిష్‌ పార్లమెంటు పాలన మొదలయిన తర్వాత, దాదాపుగా దేశంలోని గిరిజన ప్రాంతాలన్నిటికీ ఇదే తరహా పాలనావిధానాన్ని ప్రవేశపెడుతూ 1874 లో షెడ్యూల్డు జిల్లాల చట్టాన్ని తీసుకొచ్చారు. 1919 లో మాంటేగు-చెమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలు కూడా ఈ విధానాన్నే ధ్రువీకరించాయి. కాని 1922-24 లో సీతారామరాజు తిరుగుబాటు చేసిన దాకా 1874 చట్టానికి నియమనిబంధనలు రూపొందనేలేదు!

1924 లో మద్రాసు ప్రభుత్వం తీసుకువచ్చిన ఏజెన్సీ నియమావళి స్థానిక కలెక్టర్లను ప్రభుత్వ ఏజెంట్లుగా గుర్తిస్తూ, సివిల్‌, క్రిమినల్‌ న్యాయాధికారాల్ని రెవెన్యూ ఉద్యోగులకు అప్పగిస్తూ నేరవిచారణ పద్ధతుల్ని చాలా సరళతరం చేసాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని రచించడానికి పూనుకున్న రాజ్యాంగ పరిషత్తు షెడ్యూల్డు ప్రాంతాల పాలనావిధానాన్ని కొనసాగించాలా వద్దా అని తర్జనభర్జనలు పడి చివరికి ఆ పాలనావిధానాన్ని కొద్ది మార్పుల్తో అయిదవ షెడ్యూలు ఆరవషెడ్యూల్లో పొందుపరిచింది. అంటే మొత్తం దేశంలోని గిరిజన ప్రాంతాలన్నిటికీ ఎటువంటి పాలనావిధానం ఉండాలో కళింగాంధ్ర ప్రాంతమే నిర్ణయించిందన్నమాట!

కాని స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కళింగాంధ్ర ప్రాంతంలోని అశాంతికొనసాగుతూనే ఉంది. 1917 లో మద్రాసు ప్రభుత్వం, 1959 లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో భూమి గిరిజనేతరులు కొనుగోలు చెయ్యకూడదని ఉత్తర్వులు తీసుకువచ్చినప్పటికీ గిరిజనుల భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతూనే వచ్చింది. గిరిజనులు వడ్డీవ్యాపారస్థుల చేతుల్లో దోపిడీకి గురవుతూ తమ భూమిని బినామీలకు అప్పగించుకుంటూ వచ్చారు. ఆ అన్యాయం మీద 1969-71 ప్రాంతంలో పార్వతీపురం గిరిజన ప్రాంతాలు కేంద్రంగా శ్రీకాకుళం తిరుగుబాటు తల ఎత్తింది. దాని పర్యవసానంగా ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు తమభూమిని గిరిజనేతరులకు కూడా అమ్మకుండా 1/70 సవరణ తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల భూబదలాయింపుల్లో ఇటువంటి సవరణ భారతదేశంలో మరే గిరిజన ప్రాంతంలోనూ లేదు!

కళింగాంధ్ర ప్రాంతంలోని గిరిజన భూమిపోరాటాలు, వాటి పర్యవసానాలు ఒక పార్శ్వంకాగా, స్థానిక జమీందారులు, మొఖాసాదారులు, ముఠాదారులు దళితులపైనా, వెనకబడ్డాల్ని కులాలపైనా సాగిస్తూ వచ్చిన అణచివేత మరొక పార్శ్వం. గిరిజనుల భూమిహక్కులకి ఉన్న రాజ్యాంగపరమైన పరిరక్షణ తక్కిన బీద కులాల హక్కులకు నామమాత్రంగా కూడా లేకపోవడంతో ఆ దోపిడీ అనేక రూపాల్లో యథేచ్ఛగా కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా పదిహేడో శతాబ్ది తర్వాత గోల్కొండ, ఫ్రెంచి, బ్రిటిష్‌ వారిపాలనలోకి ఈ ప్రాంతాలు వచ్చినప్పటికీ, స్థానిక అధికారంలో పెద్దగా మార్పు లేనందున కళింగాంధ్ర ప్రాంతంలో స్థానిక పాలనాధికారులు బీద ప్రజలపట్ల నిరాఘాటంగా అణచివేతకీ, పీడనకీ పాల్పడుతూనే వచ్చారు. ఇటువంటి పీడన తెలంగాణా ప్రాంతంలో స్థానిక పాలకులూ, రాయలసీమ ప్రాంతంలో స్థానిక పాలెగార్లూ కూడా చేస్తూ వచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ పీడన చాలా వరకూ సాహిత్యంలో నమోదయ్యింది. కాని కళింగాంధ్రలో గిరిజనేతర నిరుపేద వర్గాల మీద అణచివేత సంస్థాగతమైన రూపు తీసుకుని నడుస్తూ ఉండటాన్ని కళింగాంధ్ర సాహిత్యం పట్టుకోవలసినంతగా పట్టుకోలేకపోయింది.

వ్యక్తులు ఆస్తి కలిగి ఉండటాన్ని రాజ్యాంగం కూడా ఒక హక్కుగా గుర్తించాక, బీదవాడు ఏదో ఒకకారణం వల్ల తన భూమి అమ్ముకోవలసి వస్తే ఆ గ్రామంలోని షావుకారో, అగ్రవర్ణాలవారో, లేదా చివరికి వెనకబడ్డ కులాల్లో కూడా కొద్దిపాటి స్తోమతు ఉన్నవారో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధమే అయిపోయినతరువాత బీద వర్గాలు మరింత నిరుపేద కావడం సహజంగా జరిగే పరిణామమే. ఈ పరిస్థితి చట్టబద్ధమే కావొచ్చుగానీ, న్యాయబద్ధం కాదనే మెలకువతో కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’(1964) కథ రాసారు. దానికి మూలాలు ఆయన అంతకు ముందే రాసిన ‘అప్రజ్ఞాతం(1951) కథలో ఉన్నాయి. అంటే, కళింగాంధ్ర ప్రాంతంలో గిరిజనేతర వర్గాల్లో బీదవాళ్ళు చట్టప్రకారమే భూములు పోగొట్టుకోవడంలోని నైతిక ప్రశ్నల్ని కళింగాంధ్ర సాహిత్యం 1950 దాకా గుర్తించలేదనే చెప్పాలి. కాళీపట్నం యజ్ఞం కథ రాసి మరొక మూడు నాలుగేళ్ళు తిరక్కుండానే శ్రీకాకుళం తిరుగుబాటు తలెత్తడం మనం గమనించాలి. ఆ విధంగా ఆ కథ ఆ ప్రాంతంలోని భూప్రకంపనల్ని ముందే పసిగట్టిందన్నమాట. ఆ తరువాత భూషణం ‘కొండగాలి (1970-75) కథల్లో ఆ ప్రకంపనల్ని మరింత సూక్ష్మంగా నమోదుచేసినప్పటికీ అవి ప్రధానంగా గిరిజన ప్రాంతాల పోరాటానికి సంబంధించిన కథలు. కళింగాంధ్రలోని గిరిజనేతర ప్రాంతాల భూపోరాటాల్ని ఆ స్థాయిలో నమోదు చేసిన కథలు మరొకటిలేకపోవడం ఆశ్చర్యమే కాదు, దురదృష్టం కూడా

ఇదిలా ఉండగా, అంతదాకా గిరిజనేతరులు మాత్రమే భూముల్ని అన్యాక్రాంతం చేసుకుంటూ ఉండగా, రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర భారతదేశ పాలన మొదలయ్యాక, ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా పెద్ద ఎత్తున భూమిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద నీటిపారుదల పథకాలకోసం, పరిశ్రమల కోసం, సెజ్‌ల కోసం ప్రభుత్వం భూమిని చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవడం కూడా ఒకరకమైన అన్యాక్రాంతమే. కాని తక్కిన అన్యాక్రాంత ప్రక్రియలకన్నా ఇది మరింత క్రూరమైన ప్రక్రియ. దీనికి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత ఉండటమే అందుకు కారణం. గత యాభై, అరవై ఏళ్ళల్లో వివిధ నీటిపారుదల పథకాల కింద, పారిశ్రామిక వాడల కింద ప్రభుత్వం చేపడుతూ వచ్చిన లాండ్‌ అక్విజిషన్‌లో ప్రధానంగా బీద, దళిత, గిరిజన కుటుంబాలే తమ భూముల్ని, గ్రామాల్ని పోగొట్టుకుని నిర్వాసితులయ్యారు. కాని ఆ దుఃఖాన్ని, ఆ వేదనని, ఆ విషాదాన్ని కూడా కళింగాంధ్ర సాహిత్యం చెప్పవలసినంతా చెప్పలేకపోయింది.

ఇప్పుడు ఈ లోటునంతటినీ పూరిస్తూ, కళింగాంధ్ర ప్రాంతంలో, ప్రధానంగా గిరిజనేతర ప్రాంతాల్లోని భూమిపోరాటాల్ని చాలా స్పష్టంగా, నిస్సంకోచంగా, శక్తిమంతంగా చెప్తూ అప్పల్నాయుడు ‘బహుళ’ నవలగా వెలువరించడం నిజంగా తెలుగు సాహిత్యానికి ఒక వరమనే చెప్పాలి.

3

దాదాపు నలభయ్యేళ్ళ కిందట నేను కళింగాంధ్ర సాహిత్యం గురించి ఒక ప్రసంగం చేస్తూ ఉత్కళానికి ఒకటే కోణార్క ఉందనీ, కానీ కళింగాంధ్రకి మూడు కోణార్కలు ఉన్నాయనీ, అవి బొబ్బిలి యుద్ధ గాథా, గురజాడ అప్పారావూ, శ్రీకాకుళం తిరుగుబాటూ అని చెప్పాను. కాని నాకు అనాడు తెలియలేదు, గురజాడ అప్పారావుగాని, శ్రీకాకుళం తిరుగుబాటుగానీ కళింగాంధ్ర ప్రాంతంలోని గిరిజనేతర బీద వర్గాల వారి సమస్యల మీద దృష్టి పెట్టలేదనీ, వారి భూపోరాటాల్ని అసలు నమోదుచెయ్యనేలేదనీ. ఆ సమస్యని మొదటిసారిగా మన దృష్టికి తీసుకువచ్చింది కాళీపట్నం రామారావునే. కానీ కాళీపట్నం ఆ సమస్యలోని నైతిక ప్రశ్నల్ని మనముందుంచినంతగా, అక్కడి భూపోరాటాల్ని మనముందుంచలేదు. ఆ బాధ్యత బహుశా కళింగాంధ్ర పూర్వరచయితలందరూ అప్పల్నాయుడుకు వదిలిపెట్టారనుకుంటున్నాను.

ఎందుకంటే అప్పల్నాయుడు ఈ నవల్లో చిత్రించిన సమస్యలు గురజాడ అప్పారావుకన్నా ముందు కాలం నుంచి మొదలయి, కాళీపట్నం తరువాతి కాలానికి అంటే మన సమకాలిక దశదాకా విస్తరించినవి. వందా, నూటయాభై ఏళ్ళ పాటు, స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రపోరాట కాలంలోనూ, స్వాతంత్య్రానంతరమూ కూడా అక్కడ జరుగుతూ ఉన్న అణచివేతనీ, దానిమీద ప్రతిఘటనగా తలెత్తూ ఉన్న తిరుగుబాట్లనీ అప్పల్నాయుడు ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా ఈ నవలలో నమోదు చేసాడు.

ఒకప్పుడు మొఖాసాదారులమీదా, జమీందారుల మీదా రైతులు చేసిన తిరుగుబాట్లు మొదలుకుని నేడు కార్పొరేట్‌ కంపెనీలకు భూములు అన్యాక్రాంతం కాకూడని చట్టబద్ధంగానే చేస్తున్న ప్రతిఘటనలదాకా దాదాపు అయిదు తరాల భూమిపోరాటాన్ని ఈ నవల గ్రంథస్థం చేసింది.

మొఖాసాదారులమీద తిరగబడి, చిత్రహింసలకు గురయి మరణించి, మరణానంతరం ఒక పురాణ పురుషుడిగా మారిపోయిన పెదనారాయుడితో మొదలైన ఈ విప్లవ కుటుంబ కథలో మరొక నాలుగు తరాలు ఉన్నాయి. అంటే కథానాయకుడు రాధేయ మనమడు ప్రభాత్‌ చిన్నపిల్లవాడే అయినప్పటికీ రాధేయ పుట్టిన ఊరు చూడాలని కోరుకోవడం వల్లా, ఆ ఊరిని బొమ్మగా గీసినందువల్లా, ఆ బొమ్మలో గీసినట్టుగా ఆ ఊరు కనిపించడం లేదేమని ప్రశ్నిస్తున్నందువల్లా రేపు ప్రభాత్‌ కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోగలడన్న ఆశ కనిపిస్తున్నది. ఆ విధంగా అది అయిదు తరాల కథ.

4

అప్పల్నాయుడు తన నవల్లో భూమిసమస్యని ప్రధానంగా రైతు కోణం నుంచీ,అది కూడా బీద రైతుల కోణం నుంచీ చిత్రించేడు. అతడు చిత్రించిన పోరాటాలన్నీ భూమి హక్కుకోసం బీదవాళ్ళు చెయ్యకతప్పని పోరాటాలు. కథ సగానికి వచ్చేటప్పటికి, నాకు ఇది ఆత్మకథానాత్మకమేమో అనే సందేహం కలిగింది. నవల చదవడం పూర్తయ్యేటప్పటికి, అప్పల్నాయుడు దాదాపుగా తన కథనే ఈ నవలగా మనముందుంచాడని అర్థమయింది. ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కాక, తన స్వానుభవాన్నీ, తన జీవితాన్ని నడిపిస్తూ వచ్చిన శక్తుల నేపథ్యాన్నీ అర్థం చేసుకుంటూ చెప్పిన కథ కావడంతో ఈ నవలకి అత్యంత విశ్వసనీయత చేకూరింది.

ఇందులో గమనించవలసిందేమటే రచయిత ప్రతిఘటనని ప్రతిఘటనగా, తిరుగుబాటుని తిరుగుబాటుగా, అసమ్మతి ప్రకటనని అసమ్మతి ప్రకటనగానే చూసాడు, చిత్రించాడు. వాటన్నిటినీ విప్లవం అనే ఒక విశాల, విస్తృత విశేషణం కిందకు చేర్చలేదు. ఇది మనం గమనించవలసిన అంశం. చాలాసార్లు ప్రజలు తమ పరిస్థితుల వల్ల తిరగబడతారు. చాలాసార్లు వారుకునేది తాత్కాలిక ప్రయోజనాలూ, ఉపశమనాలే అయి ఉంటాయి. వాటిని ఒక దీర్ఘకాల వ్యూహాత్మక పోరాటంగానూ, వర్గరహిత సమాజం కోసం చేస్తున్న యుద్ధంగా గానూ భావించేటంత పరిజ్ఞానంగాని, చైతన్యంగాని, ఆ అవసరం గాని వారికి ఉండవు. ఆ మెలకువ ఈ నవలలో అడుగడుగునా కనిపిస్తున్నందువల్లనే నేను దీన్ని తెలుగులో వచ్చిన నిజమైన సాంఘిక విమర్శనాత్మక వాస్తవిక రచనగా పరిగణిస్తున్నాను.

అలాగని అటువంటి ప్రతిఘటనల్నీ, పోరాటాల్నీ విడివిడిగా చూడాలనిగానీ, అవి ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో భాగంకావని కానీ నేను చెప్పటం లేదు. కాని ఆ ప్రతిఘటనల్లో పాల్గొంటున్న ప్రజలు వాటిని తమ కాలానికీ, తమ పరిస్థితులకీ, తమ పరిమితులకీ సంబంధించినవాటిగానే చూస్తారు తప్ప తామొక మహాచారిత్రిక సమరంలో పాల్గొంటున్నామని ఆ ప్రతిఘటనలకు పూనుకోరు అని మాత్రమే నేను చెప్తున్నాను. ఈ రెండిరటిమధ్యా భేదం సాహిత్యపరంగా చాలా కీలకం. ప్రతిఘటనల్లో పాల్గొంటున్న మనుషుల పరిమితదృక్కోణం నుంచి కథ చెప్పడం ఆ కథకి ఒక విశ్వసనీయతని సమకూరుస్తుంది. చారిత్రిక గతి తర్కం గురించి అప్పల్నాయుడికి ఒక ఆలోచనాపరుడిగా ఉన్న స్పష్టత, అతడు చిత్రిస్తున్న పాత్రల తత్కాలీన మనఃస్థితితో ఒక రచయితగా జోక్యం చేసుకోకపోవడం మామూలు విషయం కాదు.

ఈ నవల చదువూతున్నంతసేపు నాకు జాన్‌ స్టీన్‌ బెక్‌ రాసిన The Grapes of Wrath (1939) గుర్తొస్తూ ఉంది. నిడివిలో దాదాపు రెండు నవలలూ సమానమే. రెండిరటిలోనూ మనుషులు, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు తమ చేతుల్లో లేని మహాశక్తులేవో తమని నడిపిస్తూ ఉండే ఆ అల్లకల్లోలానికి లోనవుతారు. రెండు నవలల్లోనూ కూడా రచయితలు ప్రధానంగా మనుషుల మీదనే, మనిషిలోని ప్రతిఘటన శీలం మీదనే దృష్టిపెడతారు. స్టీన్‌ బెక్‌ ఒకచోట ఇలా రాస్తున్నాడు:

‘..మీరు మనిషి గురించి ఈ మాట కూడా చెప్పవచ్చు. సిద్ధాంతాలు మారిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, ఆలోచనా శిబిరాలు, తత్త్వశాస్త్రాలు, జాతీయ, మతధార్మిక, ఆర్థిక భావజాలాలు వికసించినప్పుడు, చితికిపోయినప్పుడు, మనిషి ఏదో ఒకటి అందుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు, తొట్రుపడుతూ ఉంటాడు, కొన్నిసార్లు బాధాతప్తుడిగా, కొన్నిసార్లు పొరపాటుగా. ముందుకు అడుగువేసి ఇంతలోనే అతడు వెనకడుగు వేస్తూ ఉండకపోడు, కాని ఆ వెనకడుగు సగం అడుగు మాత్రమే. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలుసని కూడా తెలిసే ఉంటుంది, ఆ సంగతి చెప్తారు కూడా. నల్లటివిమానాలు బజార్లమీద బాంబుల వర్షం కురిపించడం, ఖైదీల్ని పందుల్లాగా చెరసాలల్లో కుక్కిపెట్టి, మరణించినవాళ్ళని దుమ్ములో బురదలో కాలరాచి పారెయ్యడం కూడా మీకు తెలుసు. మీకు ఇది కూడా తెలుసు. అదేమంటే, మనుషులు ఆ అడుగులే గాని ముందుకు వెయ్యకపోతే, తొట్రుపడుతున్నామన్న ఆ బాధ వాళ్ళని సలపరించకపోతే ఆ బాంబులు వర్షించవనీ, ఆ కుత్తుకలు కత్తిరింపబడవనీ. బాంబులు వేసేవాళ్ళు బతికి ఉండీ బాంబులు పడకుండా ఉంటే అది నిజంగా మనం భయపడవలసిన కాలం. ఎందుకంటే మనిషిలోని ఆత్మశక్తీ, పోరాటపటిమా మరణించలేదనే దానికి పడుతున్న ప్రతిబాంబూ సాక్ష్యమిస్తుంది. అలాగే పెద్ద పెద్ద యజమానులు, ఆస్తిపరులు బతికి ఉండీ, సమ్మెలు లేని కాలం ఉంటే ఆ కాలానికి నిజంగా భయపడండి. ఎందుకంటే సమ్మె జరుగుతుంటేనే మనుషులు ముందడుగు వేస్తున్నారని గుర్తు. ఇదిగో, చూడండి, చెప్తున్నాను- మనిషి ఏదో ఒక ఆశయాన్ని నమ్ముకుని దానికోసం నలుగులాడి మరణించని కాలమంటూ ఉంటే ఆ కాలాన్ని చూసి నిజంగా భయపడండి. ఎందుకంటే మనిషి లోని మనిషితనానికి పునాది అటువంటి ఒక ఆశయం కోసం బతకడం, చావడమే. ఈ చరాచర విశ్వంలో మనిషికున్న అద్వితీయత ఇదొక్కటే.’

ఈ పేరాగ్రాఫు ఇంత విస్తారంగా ఉల్లేఖించడానికి కారణం ఇది ఒక రకంగా ‘బహుళ’నవలకి సారాశం అనిపించడమే. దీనికి అనుబంధంగా రావి శాస్త్రి ‘రాజు-మహిషి (1965) నవలలో రాసిన ఒక వాక్యాన్ని కూడా చేర్చాలనుకుంటున్నాను. ఆయనిలా అంటున్నాడు: ‘దైవం, న్యాయం, ధర్మం, సత్యం అన్నీ కూడా మనిషి నిలబడితేనే నిలబడతాయి. వాటికోసం మనిషి నిలబడితేనే అవి నిలబడతాయి’ అని. బహుళ అటువంటి మనుషుల్ని ప్రతి తరంలోనూ అందించిన ఒక కుటుంబం కథ.

5

అలాగని ‘బహుళ’ నవల పరిపూర్ణమైన నవల అని నేను చెప్పలేను. అప్పల్నాయుడు ఎంత నిర్మమత్వంతోనూ, నిర్లిప్త మనఃస్థితితోనూ ఈ కథ చెప్పడానికి ప్రయత్నించినా ఇందులో కూడా కొన్ని పాత్రలు flat characters గా, stock characters గా మిగిలిపోకుండా ఉండలేదు. కొన్నిసార్లు అతడు తన అపోహల్నీ, అపార్థాల్నీ రచనలో చొప్పించకుండా ఉండలేదు. ఉదాహరణకి యాదవుల మీద రాసిన వ్యాఖ్యలు (పే.152). కానీ ఇవి నెరుసులు.

ఇక ఈ నవలలో కథానాయకుడి పేరు గురించి కూడా కొంత ఆలోచన చేయవచ్చు. తన కన్నతల్లి తనను వదిలిపెట్టివెళ్ళిపోతే తన పెంపుడి తల్లి తనని తల్లికన్నా మిన్నగా పెంచి పెద్దచేసినందువల్ల ఆమె పట్ల కృతజ్ఞతతో కథకుడు తనని తాను ‘రాధేయ’ అని పిలుచుకున్నాడని అర్థమవుతూనే ఉన్నది. కానీ ఆ పోలిక అక్కడికి మాత్రమే పరిమితం కాదేమో అనికూడా అనిపిస్తున్నది. తాను ప్రభుత్వ సంస్థల్లోనూ, ప్రభుత్వోద్యోగంలోనూ పనిచేసినందువల్ల తాను పోరాటశిబిరాల్లో సరైన శిబిరంలో నిలబడలేదేమో అనే ఒక అంతర్గత చింత రాధేయని పీడిస్తున్నదా అనే అనుమానం కలగకుండా ఉండదు. కాని చారిత్రిక పోరాటల్లో ప్రాణత్యాగాలు చేసే వీరులకీ, ఆ చరిత్రని ఇతిహాసాలుగా, కథలుగా, కావ్యాలుగా మలిచే సాహిత్యకారులకీ తేడా ఇక్కడే ఉంది. కథకుడు చరిత్రతో పూర్తిగా మమేకం కాడు. కాకూడదని కూడా అంటాను. అప్పుడే అతడికి చరిత్రని, చారిత్రిక పరిణామాల్ని విమర్శనాత్మకంగా చూడగల నిర్మోహం సాధ్యమవుతుంది. ఈ బాధ్యతని నెరవేర్చడంలో అప్పల్నాయుడు చాలావరకూ కృతకృత్యుడయ్యేడనే నమ్ముతున్నాను.

నాకు ఈ రచన పట్ల అసంతృప్తి ఏదైనా ఉందంటే అది ఈ నవల నిడివి మీదనే. ఇది మరొక వెయ్యి పేజీలు విస్తరించి రాయవలసిన కథ. అందుకు కావలసిన అనుభవకోశం అప్పల్నాయుడిదగ్గర ఉంది. ముందుమాటలో శివారెడ్డిగారు రాసినట్టుగా దీన్ని మూడు నాలుగు భాగాలుగా కూడా రాసి ఉండవచ్చు. స్వాతంత్య్రానికి పూర్వపు పోరాటాలూ, స్వాతంత్య్రోద్యమ కాలం, తదనంతర పోరాటాలుగా చిత్రించి ఉండవచ్చు. అలాగే ఇది ప్రధానంగా బాధిత కుటుంబాల దృక్కోణం నుంచి రాసిన రచన. ఆధిపత్య వర్గాలూ, పాలకవర్గాలూ, పాలనాయంత్రాంగం ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తించి ఉంటారో చిత్రించి ఉంటే ఇది ఒక ‘వార్‌ అండ్‌ పీస్’ స్థాయి నవల కాగలిగి ఉండేది.

శివారెడ్డిగారు తనముందుమాటలో ఈ నవల One Hundred Years of Solitude (1967) ను గుర్తు చేస్తున్నదని రాసారు. కానీ ఈ నవల వందేళ్ళ ఏకాంతాన్ని చిత్రించిన రచన కాదు. ఇందులో One Hundred Years of Multitude ఉన్నది. ‘వందేళ్ళ బహుళత్వం’. తెంపులేని బహుళత్వం. మందితనం. మందిపోరాటాలు.

అప్పల్నాయుడు తన సాహిత్యకృషిలో పతాక స్థాయి రచన చేసాననీ, ఇక తన బాధ్యత పూర్తయిందనీ అనుకోకపోతే, దీన్ని తన మొదటి నవలగా భావించి తన నేలతల్లి పోరాటాల్ని మరింత విస్తృతంగా చిత్రించగలిగే, అతడు నా దృష్టిలో కళింగాంధ్రకు నాలువగ కోణార్క కాగలడు.

6-8-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading