
కర్నూల్లో రెండేళ్ళకు పైగా ఉన్నాను. మొదట్లో అడవికి దూరంగా ఉండటం నాకు చాలా వెలితిగా ఉండేది. రోజూ ఏదో ఒక గిరిజనగ్రామానికి వెళ్ళిపోయేవాణ్ణి. పొద్దున్నే మా పాపాజీ కారియరు కట్టి ఇచ్చేది. ఏదో ఒక చెంచుగూడేనికో లేదా సుగాలి తాండాకో వెళ్ళేవాణ్ణి. మధ్యాహ్నం దాకా ఏదో ఒక ఊళ్ళో గిరిజనుల్తో గడిపాక ఎక్కడో ఆశ్రమపాఠశాలలోనో లేదా ఏ చెట్టునీడనో భోంచేసేవాణ్ణి. మళ్ళా మధ్యాహ్నం మరో ఊరికి వెళ్ళేవాణ్ణి. రాత్రికి ఇంటికి వచ్చేవాణ్ణి. కాని అడవికి దూరంగా ఉంటున్నానన్న ఊహ నాలో ఏదో అపరాధ భావం రేకెత్తిస్తూనే ఉండేది. అటువంటి రోజుల్లో రాసిన కవిత ఇది.
ముంచుకొస్తున్న వానలు
అడవుల పైన గ్రామాల పైన కురుస్తున్న వానలు
ధారాపాతంగా వానలు
ఎడతెరిపిలేని వానలు.
చెట్లమధ్య నీ ఇంట్లో
దీపం వెలుతుర్లో
నువ్వు వింటున్న వీణ ఎవరిది?
వయొలిన్ ఎవరిది? వేణువు ఎవరిది?
గర్జిస్తున్న ఫిరంగులు, బాంబులు
చుట్టబెడుతున్న తిరుగుబాటు దళాలు, బావుటాలు
కత్తుల మధ్య వర్షిస్తున్న నెత్తురు
ఆ కొండల మధ్య ఆ ఏటవాలు లోయ అంచుల్లో
తలెత్తిచూసే ప్రభాత పుష్పాలు.
పరాజయం ఒక గాటు
దాన్నుంచి విషం ఒక రహస్యక్రిమిలా నీ రక్తంలో ప్రవేశిస్తుంది
చీకట్లు, భయాలు, ఇంద్రియ సుఖాలు ఆ వెనక.
చలిగాలుల్లో తడిసి ఒణికి
నీ ఇంటితలుపు తట్టే పనిపిల్ల
దాని కళ్ళు చూడు
అడవులపైనుండి ముంచుకొస్తున్న వానలు.
గ్రామాల్ని చుట్టబెడుతున్న వానలు.
ఎడతెరిపిలేని వానలు.
ధారాపాతంగా వానలు.
1991
ENGULFING RAINS
Rains are drowning forests and villages.
Engulfing rains.
Restless rains.
Under the lamplight in your house among the trees,
What music are you listening to?
In what mood? With what melody?
Bombs dropping, cannons roaring
Insurgents fighting, flags fluttering,
Swords clattering.
In the valley on the mountainside
Peeking from the blanket of rain,
The morning flowers.
The wound of defeat is deep.
Poison seeps into your body like a germ.
Darkness, fear, and sensual pleasures follow.
In the cold winds of rainy days,
The maid knocks at your door.
Look into her eyes.
Stream of rains lashing the forests
Devastating rains ravaging the villages.
Relentless rains.
Restless rains.
18-8-2022