స్వర్గం అంచుదగ్గర

160

చాలా కాలం తర్వాత పాడేరు వెళ్ళాను. వైశాఖమాసపు అడవి. ఒకప్పుడు నేను తిరిగిన దారుల్లో మళ్ళా పూర్వపు రోజుల్ని గుర్తుపట్టుకుంటూ ప్రయాణం. డుంబ్రిగూడ మండలంలో మారుమూల ఒక కోదుపల్లెకు వెళ్ళాం. అక్కణ్ణుంచి అరకు వెళ్ళేటప్పటికి వేసవివాన. అట్లాంటి వాన చూసి ఎన్నేళ్ళయ్యింది. వాన వెలిసాక అనంతగిరికొండలు, ములియాగూడ, గాలికొండ, తైడ లమీదుగా కిందికి.

పాడేరు కొండలమీద ప్రయాణించినప్పుడల్లా ప్రాచీన చైనా కవిత్వంలో ప్రయాణించినట్టుంటుంది. ప్రాచీన చీనా చిత్రలేఖనం ఒకటి మనముందు విప్పి పరుస్తున్నట్టు ఉంటుంది. ఆ అడవిదారుల్లో కొండలమీంచి సాగిపొయే మేఘాల నీటి ఆవిరి, కెరటాల్లాగా కొండలు, ఎర్రటి తురాయిచెట్లు, దూరంగా లోయల్లో అక్కడా అక్కడా కొండపల్లెలు, ఆ ఇళ్ళ కప్పులమీంచి పైకి లేచే వంటపొగ..

కొండల్నీ, లోయల్నీ, నదుల్నీ, వంకల్నీ ప్రాచీన చీనా కవులు ప్రేమించినట్టుగా మరెవ్వరూ ప్రేమించినట్టు కనిపించదు.

ప్రకృతిని హృదయానికి హత్తుకునే క్రమంలో వాళ్ళ కవిత్వంలో చాలా కాలం ముందే రెండు శాఖలు ఏర్పడ్డాయి. ఒకటి, పొలాల్నీ, తోటల్నీ వర్ణించే తియాన్- యువాన్ కవిత్వం. దానికి తావోచిన్ (365-427) ప్రసిద్ధుడు. మరొకటి, కొండల్నీ, నదుల్నీ వర్ణించే షాన్-షుయి కవిత్వం. దానికి షీ లింగ్-యూన్ (385-433) ఆద్యుడు. తర్వాత రోజుల్లో కవిత్వం రాసిన గొప్ప కవులు లిబాయి, దుఫూ, వాంగ్-వీ, బైజుయి,సుషి వంటివారందరిమీదా వారిద్దరి ప్రభావం ఉంది.

ఋషుల్లాంటి ఆ పూర్వకవులకీ,తంగ్ యుగంలోనూ, ఆ తర్వాతా కవిత్వాన్ని శిఖరాలకు చేర్చిన కవులకీ మధ్య సేతువులాంటివాడు మెంగ్ హావో జాన్ (689-740).

పాడేరు నుంచి రాగానే ఆ కొండలూ,ఆ లోయలూ ఇంకా కళ్ళముందే కదలాడుతుండటంతో, మెంగ్ హావో జాన్ కవిత్వం తెరిచాను. కొన్నాళ్ళ కిందట సోమయ్యగారి అబ్బాయి రావెల మనోహర్ అమెరికా నుంచి నా కోసం పంపించిన పుస్తకం : The Mountain Poems of Meng Hao-jan (2004). చీనా కవిత్వానికి ఇటీవలి అనువాదకుల్లో గొప్ప పేరు తెచ్చుకుంటున్న డేవిడ్ హింటన్ చేసిన అనువాదాలు. 65 కవితలతో పాటు హింటన్ రాసిన ఒక చక్కటి పరిచయం, చివరలో వివరణలు కూడా ఉన్నాయి.

మెంగ్ రాసిన కవిత్వం వట్టి ప్రకృతి కవిత్వం కాదు. అది ఒక జీవన వైఖరి. అతడు కొన్నాళ్ళు నగరాల్లో, రాజాస్థానాల్లో జీవించేడు, కానీ అన్యమనస్కంగానే. ఏ కారణం చేత ఆ కొలువు తప్పిపోయినా ఎంతో సంతోషంగా మళ్ళా అడవుల్లోకీ, కొండల్లోకీ పోయేవాడు. అట్లా జీవితమంతా ఎన్నో ప్రాంతాలు తిరిగేడు. తాను తిరిగిన ప్రతిచోటా కళ్ళముందు కనిపిస్తున్న సౌందర్యాన్ని నిర్లిప్త చిత్తంతో పట్టుకోడానికి ప్రయత్నించేడు. అట్లా ఒక క్షణాన్ని ఒక కవితగా బంధించగానే ఆ కవిత చింపేసేవాడు. అట్లా పోయినవి పోగా మిత్రులు భద్రపరచినవి 270 కవితలు మనకి లభ్యమవుతున్నాయి.

వాటిల్లోంచి రెండు కవితలు మీకోసం అందించేముందు మెంగ్ ని తలచుకుంటూ ఇద్దరు గొప్ప కవులు రాసిన రెండు కవితలు కూడా చూడండి:

లీ-బాయి

యాంగ్ చౌ కి వెళ్తున్న మెంగ్ హావో రాన్ కి వీడ్కోలు చెప్తూ

పచ్చకొంగ కొండదగ్గర నా ప్రాణమిత్రుడు
పడమటిదేశానికి వెళ్తున్నాడు
యాంగ్ చౌ ప్రవహిస్తున్నంతమేరా
మలివసంత కాలపు అస్పష్ట పూలకాంతి.

మరకతంలాంటి పచ్చగాలిలో
దూరమవుతున్న ఒంటరి తెరచాప తళుకు
ఇంక అక్కడ మిగిలేందీ లేదు,
స్వర్గం అంచులదాకా సాగుతున్న నది తప్ప.

వాంగ్-వీ

మెంగ్ హావో జాన్ కోసం శోకిస్తూ

నా మిత్రుడెక్కడా కనుచూపుమేరలో లేడు
తూర్పు కి ప్రవహిస్తున్నది హాన్ నది.

ఇప్పుడిక్కడ పూర్వకవులకోసం వెతుక్కుంటే
ఉన్నదలా శూన్యశిఖరాలు, సుదూరప్రవాహాలు.

*

ఈ కవితల్లో భూదిగంతాలదాకా పరుచుకున్న నిశ్శబ్దం, విస్తృత జలరాశీ-వీటిలోనే మెంగ్ హావో జాన్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడతడి కవితలు చూడండి:

జియాండె నది దగ్గర ఒక రాత్రంతా

నావ నెమ్మదిగా ఒడ్డుకి చేర్చి మంచులో లంగరేసాను
సంధ్య, బాటసారిని మళ్ళా ఒంటరితనం ఆవహించే వేళ.

ఆకాశం దూరంగా చెట్లలో విశాలంగా పరుచుకుంది
తేటపడ్డ నదీజల్లాలో చంద్రుడు చేరువగా తేలివస్తున్నాడు.

దు హువాంగ్ కి వీడ్కోలు చెప్తూ

నా స్వదేశం మొత్తాన్ని జలరాశి ఒక్క స్వగ్రామంగా అల్లేసింది
వసంతకాలపు నదీప్రయాణం, ఎటుచూసినా విస్తారం, అస్పష్టం.

రాత్రవుతుంది, తెరచాపలు దింపేవేళకి స్వర్గం అంచుదగ్గర
లంగరేస్తావు, ఆ అంచు నీ హృదయంలో మెత్తగా దిగబడుతుంది.

వసంత ప్రభాతం

వసంతరాత్రి నిద్ర,  తెలీకుండానే ప్రవేశించిన ప్రభాతం
ఉన్నట్టుండి, హఠాత్తుగా, చుట్టూ వేలకలకూజితాలు.

రాత్రంతా చప్పుడు, చెలరేగిన గాలీవానా, రాలిపడ్డ
పుష్పరాశి. చెదిరిపడ్డ సుమాలెన్నో ఎవరికి తెలుసు?

17-5-2016

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading