ఆ కవులంతా ఒక సమిష్టి కుటుంబం-1

(శ్రీనాథుడి పైన సంస్కృత కవుల ప్రభావం గురించి మాట్లాడమని అడిగారు మా మాష్టార్ని 1985 లో నరసాపురంలో జరిగిన ఒక జాతీయ గోష్ఠిలో. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం మిత్రులు డా. అరిపిరాల నారాయణరావుగారి సౌజన్యం వల్ల నాకు లభించింది. ఆ ప్రసంగాన్ని ఇన్నాళ్ళకు ట్రాన్స్ క్రైబు చెయ్యగలిగాను. అందులో మాష్టారు అప్పటికప్పుడే తన ధారణలోంచి చదివిన పద్యాల్నీ, శ్లోకాల్నీ, పద్యపాదాల్నీ, శ్లోక పాదాల్నీ గుర్తుపట్టడం దానికదే ఒక classical education అని అర్థమయింది. ముందు ఈ ప్రసంగం వినండి. వ్యాసం మొదట్లోనే ఆడియో ఫైలు రూపంలో ఉంటుంది. దాన్ని మీరు డౌను లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాసం చదవండి. మీ సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా అందిస్తున్నాను.)


మల్లంపల్లి శరభయ్య

శ్రీనాథుడి పైన సంస్కృతకవుల ప్రభావం

A Talk by Mallampalli Sarabhayya on Srinatha

ఏదో నాకు చేతనైనట్టు ప్రసంగించేవాణ్ణి. ప్రాసంగికుణ్ణి గానీ నేను, ఉపన్యాసకుణ్ణి కాను.

అయితే నన్ను సభలకి పిలుస్తున్నారు. సభకు వచ్చిన వెంటనే కొన్ని మర్యాదలు పాటించాలి. నేను నిలబడి మాట్లాడలేను. నిలబడితే నాకు స్ఫురణ ఉండదు. కూర్చుంటే ఏదో తోచినంత వరకు, స్ఫురణ ఉన్నంతవరకు స్థిమితంగా మాట్లాడొచ్చు.

సభలో మాట్లాడేటప్పుడు, ఆ  ప్రసంగ ధోరణిలో వచ్చే మాటలు తప్ప అవి, ఎవరినీ ఉద్దేశించిన మాటలుగా ఉండవు. వ్యక్తులెవరూ ఉండరు మనసులో. ఎవరిని గురించి మాట్లాడుతున్నామో, ఆ కవి యొక్క అనుభావమే నా మనసులో ఉంటుంది తప్ప, ఎదురుగుండా ఉన్నవాళ్లు కనపడరు, పక్కన ఉన్నవాళ్లు కనపడరు. ఇవన్నీ పాతకాలపు లక్షణాలు.

అసలు సభ మొదలుపెట్టేటప్పుడు ఎలా మొదలుపెట్టాలి? సభాధ్యక్షా అని మొదలుపెట్టాలి కదా! కాబట్టి ఇప్పుడు అలా ఆరంభం చేస్తున్నాను. సభాధ్యక్షులకు, ఈ సభలో ఉన్న పెద్దలకి- ఇవాళ చాలా సుదినం. ఏమంటే దీక్షిత దాసు గారి యొక్క సందర్శనం ఇవాళ చేయగలిగాను నేను. వారి ప్రసిద్ధి చాలా చిన్నప్పటి నుంచి వింటున్నప్పటికీ ఎప్పుడూ వారి దర్శన భాగ్యం నాకు కలగలేదు. ఈ నరసాపురం ఎప్పుడూ నేను రాలేదు. అనుకోకుండా ఇవాళ మిత్రులు జీవీ సుబ్రహ్మణ్యం గారు కూడా సభలో నా ఎదురుగుండా కనిపిస్తూ ఉంటే కొంత నాకు ఆత్మప్రత్యయం కలుగుతుంది.

ఈ సభలో మా అన్నగారి శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ శిష్యులు ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు. కాబట్టి నేను చేసే ప్రసంగం ఎలా ఉంటుందంటే, ఇంటి దగ్గర కూర్చుని చేసే ప్రసంగం లాగా ఉంటుంది గానీ సభలో చేసే ప్రసంగంగా ఉండదు. ఎక్కడైనా అలాగే చేయగలను నేను. కాబట్టి ఇందులో ఏదైనా కొన్ని formalities, కొన్ని మర్యాదలు- అవి లోపించినట్లయితే వాటిని క్షమించవలసిందిగా కోరుతున్నాను. నారాయణరావు గారితో చెప్పాను నేను- ఈ సభల్లో నేను misfit,   నన్ను అనవసరంగా ఎందుకు అవస్థ పెడతారంటే, కాదూ  కూడదని ఆయన నిర్బంధించారు.

ఈ సభల ఏర్పాటు చాలా ప్రమాణంగా ఉంది. మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం అన్నది విషయం వేరు. ఇటువంటి organization, ఇటువంటి మర్యాదలు, ఏర్పాట్లు ఒకసారి చూచి సంతోషించడం కూడా చాలా చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను.

సరే, ఇదేమిటి? తెలుగు భాషా సాహిత్యాల మీద ఇతర భాషా సాహిత్యముల యొక్క ప్రభావాన్ని వివరించడానికి ఏర్పాటు చేసినటువంటి సభ. ఇదొక చట్రం. ఈ చట్రంలో నేను ఇమడాలి. అందుకోసం దానికి అనురూపమైనటువంటి subject నా దగ్గర్నుంచి వాళ్ళు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది.

యథార్థానికి శ్రీనాథుని సాహిత్యం మీద సంస్కృత కవుల ప్రభావము. ఇది తిరగేస్తే ఏమవుతుంది? శ్రీనాథుణ్ణి ప్రభావితుణ్ణి చేసిన సంస్కృత కవులు అవుతారు. ఉపన్యాసం ఇప్పుడు సంస్కృత కవుల మీద చెప్పాలా? శ్రీనాథుని మీద చెప్పాలా?

ఏదో చేతనైనంతగా చేస్తాను. ఈ సభలో కూర్చోవడం అంటే అందులో ఇంతమందికి ఎదురుగుండా కూర్చోవడం అంటే, అందులో వాళ్ళు నిర్ణయించిన విషయానికే stick up అయి మాట్లాడాలంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టుగా ఉంటుంది నా ప్రాణం.

ఈ ఆధునిక ఉపన్యాస లక్షణం ఏమిటంటే, పద్యాలు ఉదాహరించడం ఇప్పుడు fashion కాదు. పద్యాలు లేకుండా మాట్లాడాలి. దానికి అలవాటు పడ్డవాణ్ణి కాను నేను. ఏవో కొన్ని విషయాలు చెప్పినప్పటికీ, నా ఉపన్యాసంలో analysis ఉన్నప్పటికీ, total effect ఎలా ఉంటుందంటే, ఏవో పద్యాలు చదివాడు, వెళ్ళిపోయినాడు, పాయింట్లు ఏమున్నాయి  అంటారు. ఆ ఉపన్యాసం prepare అవ్వటం ఉండదు. ఇవాళ ఈ విషయాలు మాట్లాడాలి, ఇది మాట్లాడాలి అని. మన హైదరాబాద్ లో కూడా సుబ్రహ్మణ్యం గారు ఉన్న సభలో చెప్పాను దీనికి ఒక ఉపక్రమం ఉండదు, ఒక ఉపన్యాసం ఉండదు. ఈ కార్యకర్తలు కుర్రవాళ్ళు వాళ్ళకి పాపం తెలియదు, నన్ను అవస్థ పెట్టారు అని కూడా చెప్పాను.

సరే, ఇప్పుడు ఇంతకీ ఏమిటంటే, ఇప్పుడు చదివిన పద్యంలో తెలుస్తోంది కదా! సంస్కృత కవుల యొక్క ప్రభావం. తెలుగు పద్యం అంటారు దీన్ని. తెలుగు పద్యమా ఇది?

సంహార విక్షేపములని, తొండం చాపటం, తొండం ముడుచుకోవటం…

శ్రీనాథునిది ఈ పద్యం, హరవిలాసంలోనిది.

పద్యానికి అర్థం చెబితే చాలా ఆలస్యం అవుతుంది. ఈయన ఉజ్జీవింపజేశాడు అని అలంకార శాస్త్రం చదువుకున్నవాళ్ళు చెబుతారు, నాకు అలంకార శాస్త్రం తెలియదు. ఈ రోజుల్లో మరి ఉపన్యాసాల్లో పద్యాలు చదవడం fashion కాదు. పద్యంతో కానీ నా మనస్సేమో విచ్చుకోదు. పద్యాలు చదువుతూ ఉంటే కొత్త భావాలు అప్పటికప్పటికీ తోస్తూ ఉంటాయి, కొత్త విషయాలు తోస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి వికసించడానికి, బుద్ధిని వికసింపజేయటానికి అదేమవుతుందది? ఆ పూర్వ కవుల యొక్క వాణి ఉండేదే ఉద్భోధకం అవుతుంది, కారణం అవుతుంది, ఉద్భోధకం అవుతుంది.

ఇప్పుడు…

శ్రీనాథుని పద్యమేమో అనుకుంటాం, కానీ ధూర్జటిది పద్యమిది.

ఇది రామకృష్ణునిది.

ఇది పెద్దన గారిది.

ఆ శ్రీనాథుని యొక్క- దాన్ని వీళ్ళు basis గా తీసుకుని, దాన్ని ఆధారంగా తీసుకుని దానిమీద వాళ్ళ వాళ్ళ ప్రత్యేక ప్రత్యేక శైలులను వాళ్ళు నిర్మించుకున్నారు, ప్రధానంగా ప్రబంధ కవులు.

ఈ ప్రబంధ కవుల మీద శ్రీనాథుని ప్రభావం కాదయ్యా ఇవాళ నిన్ను మాట్లాడమన్నది, శ్రీనాథుని సాహిత్యం మీద సంస్కృత కవుల ప్రభావం కదా అని ప్రశ్నార్థకం కనిపిస్తుంది మీ ముఖాల్లో అప్పుడే నాకు.

తాను చదివిన సంస్కృత  కవులందరినీ చెప్పాడు ఇందులోనూ. అంటే వాళ్ళ లక్షణాలన్నీ ఆయన కవిత్వంలో ఉంటాయన్నమాట, ఆయనే చెప్పాడు.

అన్నాడు.

నైషధం తెలుగు చేశాడు కాబట్టి అవన్నీ ఉంటాయి. Reckless గా చేసినా హరవిలాసంలో కుమారసంభవం తెలుగు చేశాడు. నైషధం చేసినంత శ్రద్ధగా చేయలేదు అతడు. నైషధం ఎందుకు చేశాడు? కాళిదాసుని చేయొచ్చు కదా! కాళిదాసుని చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి syllable  వ్యంజకంగా ఉంటుంది. కాబట్టి వాటికి తగినటువంటి వాడు వాడు కానీ . కాళిదాసుని తెలుగు చేస్తే వెంటనే పరాజయం కనిపిస్తుంది. శ్రీనాథుడు కావచ్చు, ఆ సంగతి వేరది. అందువల్లనే

అలాగే కాశీఖండంలో ఏం చేశాడు? మయూరుని యొక్క సూర్య శతక శ్లోకాలు మళ్ళీ రాశాడు, తెలుగులో మళ్ళీ రాశాడు, అనువాదం చేయటం కాదు, ఆ శ్లోకాలు సీసాల్లో బిగించాడు. అది కాక అతనికి, ఆ శ్రీనాథుడు అనే అతనికి, స్వపరభేదం లేదు. స్వపరభేదం లేదంటే ఘరానా దొంగ అన్నమాట.

అల్పాల్ప కవులు ఎవరైనా వాడితే గ్రంథ చౌర్యం అంటాం. శ్రీనాథుడు వాడితే ఆ మాట అనటానికి మనకి గుండె డువ్వా! ఇంకో సంగతి ఏమిటంటే, అల్ప కవులు వాడినప్పుడు వెంటనే భేదం తెలుస్తుంది. వాడు ఎంతవరకు అనుకరించాడో అంతవరకు దేదీప్యమానంగా ఉంటుంది, తర్వాత వాడి రంగు బయటపడుతుంది కదా! శ్రీనాథుడిదైతే వాడిది శతతంత్రి అయినటువంటి వీణ. ఎవరితోనైనా శ్రుతి కలుస్తుంది. వాళ్ళ దగ్గరనుంచి తీసుకోవడం ఎలా ఉంటుందంటే, వాళ్ళని ఏదో అనుగ్రహించినట్టుగా ఉంటుంది గానీ వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసినట్టుగా ఉండదు.

వాళ్ళ భాషానిగుంభనములు ఆయన తీసుకోవడం ఎలా ఉంటుందంటే, వాళ్ళకొక certificate ఇచ్చినట్టుగా ఉంటుంది గానీ, చాతకాక తీసుకున్నట్టుగా ఉండదు.

ఇందులో ఏమిటి? కీలక శబ్దం ఏమిటి?

మహా భావుకుడు అసలు ప్రధానంగా. Creative artist కాదు శ్రీనాథుడు.

ఆ భవభూతి శ్లోకంలో గద్గదనదద్గోదావరీ అన్నది తనకి చాలా ఇష్టం. తీసి బిగించేశాడు అంతే.

ఎలా స్థాపితం చేశాడో ! ఆ వెనకా ముందు-

సొంతం చేసుకున్నాడన్నమాట. ఆ సంస్కృత కవుల్లో ఎక్కడ ఒక మనోహరమైనటువంటి భావం ఉంటుందో, ఒక విలక్షణమైన పదబంధం ఉంటుందో, దాన్ని వెంటనే పుణికి  తీసుకుంటాడు. తీసుకుంటే తీసుకున్నట్టు కనపడదు. వాళ్ళు చెప్పిన దానికంటే ఇతను చెప్పిందే బాగా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. పట్టుకోవడం కూడా కష్టం. వాడు ఎక్కడినుంచి ఏమి తీసుకొచ్చాడో పట్టుకోవడం కూడా చాలా కష్టం.

అని మయూరుని శ్లోకం.

ఎలా ఉంది? నువ్వా నేనా  అన్నట్టుగా ఉంది.

ధ్వజపట పవనాందోళితేందూని… ఆ స్రగ్ధరలో ఆ ఒక్క పాదాన్ని తీసుకుని దాన్ని మధ్య cut-off చేసి, రెండు సీస పాదాలు రాశాడు. అంతకంటే ప్రౌఢంగా రాశాడు.

ఆ భావం చెప్పడం అలాగనే… ఓహో! నీకేం తెలుసును , నేను చెబుతాను విను అని మయూరుణ్ణి challenge చేసినట్టుగా ఉంది.

అదే…

తెలుగు కవి కదా! ‘శాతస్యామా లతాయాః పరశురివ. . .’ అంటే ‘చిరుసాన పట్టించి  చికిలి  చేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు. ..’ దానికీ  సమర్థుడే, దీనికీ సమర్థుడే. ఆ కవిత్రయం తెలుగు వేరు, శ్రీనాథుని యొక్క తెలుగు వేరు.

ఆ పద్యాన్ని భ్రష్టు  పట్టింఛి ఏదో అర్ధాలు చెబుతారు గానీ, ఆ శ్రీనాథుని ఒక పద్యానికి ఇవాళ చాలా భావుకులు, బుద్ధిమంతులు ఉన్నారు కాబట్టి నాకు తోచిన అర్థం ఒకటి చెబుతాను. ఏ పద్యానికి? దీనికి కాదు, చదవ బోయే దానికి.

అని గానీ, ఈ క్షోణిన్ నినుబోలు సత్కవులు లేరు ఈనాటి కాలంబునన్ అని కాదు…

Reader యొక్క level ని బట్టి పద్యం యొక్క అర్థం కూడా పెరుగుతూ ఉంటుంది. మనతో పాటు పద్యం పెరుగుతూ ఉంటుంది. మనం కిందికి పోతే పద్యం కూడా కిందికి పోతూ ఉంటుంది. ఈ పద్యం చూసిన వెంటనే అందరూ ఏదో అతని గురించిన కథలు వాటిని బట్టి స్త్రీలోలత్వమో ఏదో అంటుంటారు. నాకు అలా తోచదు.

గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు అన్నాడు. గంధసారం అంటే మంచి గంధం. ఘుసృణం అంటే కుంకుమపువ్వు. ఈ గంధసారం దక్షిణాపథానికి symbol. మలయ పర్వతం south లో ఉంది కదా! ఘుసృణం కుంకుమపువ్వు కాశ్మీర దేశానికి.  కాశ్మీరజం అని దానికి పేరు దానికి. నేను ఇలా అనుకుంటాను, మరి బుద్ధిమంతులు ఏమంటారో నాకు తెలియదు గానీ, ఏమనుకుంటారో నేను ఊహించలేదు గానీ… ఈ గంధసారం తెలుగు భాషకు ప్రతినిధి. ఆ ఘుసృణమేమో సంస్కృత భాషకు ప్రతినిధి. కాబట్టి ‘గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారం’ అంటే సంస్కృతాంధ్ర భాషా ప్రభుత్వము అన్నమాట.

అధ్యక్షించేవి ఏవి? ప్రౌఢ సాహిత్యములు అధ్యక్షించేవి. సాహిత్యములు అక్కడ ఎలా అధ్యక్షిస్తాయి? ఎక్కడ? దక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ వక్షోజద్వయమునందు అధిష్టించేవి గంధసార ఘుసృణములు అవుతాయి గానీ, ప్రౌఢ సాహిత్యములు కావు కదా!

ఏమంటున్నాడు? భవదీయ ప్రౌఢ సాహిత్యములు అక్కడ అధివసిస్తున్నాయి. ఈ ప్రౌఢ సాహిత్యములు ఎటువంటివి? గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారాన్ని- గంధసారం అంటే మంచి గంధము, ఘుసృణం అంటే కుంకుమ పువ్వు. అంటే తెలుగు మంచి గంధం లాగా ఉంటుంది. మంచి గంధం యొక్క పరిమళ తరంగముల మాదిరిగా ఉంటుంది. ఆ దేదీప్యమానమైనటువంటి కుంకుమ పువ్వు ఉందే అది  చాలా ఓజస్వితా లక్షణం కలది, అదేమో సంస్కృత భాషకది ప్రతినిధి.

కాబట్టి ఇలా అనుకుంటాను దాని గురించి నేను.

నేను ఎంతసేపు మాట్లాడను అసలు? అయిపోయిందేమో టైము?

(ఇంకా ఒక అరగంట సమయం ఉందని ఎవరో అన్నారు)

ఇంకా గంటసేపు మాట్లాడినా ఇదే గొడవ. అంతకంటే ఇంకేముంది?

(ఇంకా ఉంది)


Featured image: Kondaveedu ruins

26-9-2026

8 Replies to “ఆ కవులంతా ఒక సమిష్టి కుటుంబం-1”

  1. ఒకసారి సదాశివగారు కాగజ్ నగర్ వచ్చారు. .సి. ఎస్ . రాంబాబు మామగారు పెద్దాడ వెంకటేశ్వర్లు గారింటికి. మాటల సందర్భంలో వెంకటేశ్వర్లు గారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక ప్రసిద్ధ హిందూస్తానీ గాయకుని పేరు చెప్పి వారి కచేరీ విన్నాను అనగానే తనకంటే వయసులో చిన్నవాడైన వెంకటేశ్వర్లు గారికి పాదాభివందనం చేసారు . ఇది చదవగానే నాకు మీకు పాదనమస్కారం చేయాలనిపించింది. 🙏

  2. Sir, మాష్టారు గారి ప్రసంగం వింటూ, మీరు ఎంతో శ్రద్ధగా transcribe చేసిన ఈ ప్రసంగ పాఠాన్ని చదువుకున్నాను. నేను చదివిన మీ రచనల్లోనూ, నేను విన్న మీ ప్రసంగాల్లోనూ మాష్టారు గారిని ఎంతో అభిమానంతో, వినమ్రతతో తలుచుకోవడం చాలా సార్లు చూశాను. మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేసిన మాష్టారు గారి ప్రసంగాన్ని ఇలా వినే అవకాశం మాకు కల్పించినందుకు చాలా చాలా thanks.

    “ఈ ఆధునిక ఉపన్యాస లక్షణం ఏమిటంటే, పద్యాలు ఉదాహరించడం ఇప్పుడు fashion కాదు.”
    మాష్టారు గారు అలవోకగా పద్యాలు ఉదహరిస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. I think this should be an evergreen feature in talks of this nature, and should never go out of fashion.

    మాష్టారు గారు పద్యాల ఉదాహరణల ద్వారా చెప్పిన శ్రీనాథకవి మీద సంస్కృత కవుల influence, how beautifully he owned their ideas and phrases అన్న point నాకు అర్థమైంది. మీ మేఘసందేశం ప్రసంగాల్లో మీరు చెప్పిన కాళిదాస కవి వాల్మీకి కవి నుంచి influence అయి తీసుకున్న పదబంధాలు, ideas గురించి కూడా గుర్తు వచ్చింది.

    కానీ మాష్టారు గారు ఉదహరించిన పద్యాలు, వాటి వెనక ఉన్న సంస్కృతం references, ఇంకా details about poets referenced and their works వంటి layers నాకు పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం, ఈ ప్రసంగం మీదే మీరొక series of talks చెయ్యాలి. 🙏🏽

    1. మీరు ఈ ప్రసంగం విన్నారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి గోదావరి తీరం! ఎక్కడి కాలిఫోర్నియా! సహృదయ పారవశ్యానికి సముద్రాలు అడ్డు కాదు.

    2. నేను మీ స్పందనకు పొద్దున్నే నా ధన్యవాదాలు చెప్పాను. కానీ ఆ ప్రతిస్పందన ఇక్కడ కనిపించడం లేదు. మీరు మాస్టారి ప్రసంగం విన్నారంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఆయన వాక్కు, మీరు వినడం ద్వారా, ప్రాక్పశ్చిమాల్ని ఒక్క గుక్కలో చుట్టినట్టయింది.

  3. అద్భుతమైన ప్రసంగం
    ఒక్కో వాక్యం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. మీ గురువులు శరభయ్యగారిని చూసే అదృష్టం నాకు మీ వల్లనే కలిగింది. గొప్ప ప్రసంగాన్ని వినేఅవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు.

  4. ఆహా.. ఎంతటి గొప్ప నిధిని వెలికి తీశారు.. మాష్టారు గారు ప్రసంగం వింటుంటే కలిగిన ఆనందం మాటల్లో వ్యక్త పరచలేను.. అసలు ప్రిపేర్ అవ్వకుండా అప్పటికప్పడు అలా ఫ్లో లో గొప్ప గొప్ప పద్యాలు శ్లోకాలు ఎలా ఉదహరిస్తారండీ? రెండు మూడు సార్లు విన్నా తనివి తీరలేదు. అందులో ప్రసంగంలో మొదలు పెట్టిన విఘ్నేశ్వర స్తుతి పద్యం గురించి నేను పెద్ద వ్యాసమొకటి రాసానేమో ఆ పద్యానికి ప్రభావితమై ఉద్భవించిన రాయల కాలం నాటి పద్యాలగురించి తెలుసుకోవడం భలే అనిపించింది. ఇంక మీరు ట్రాన్స్క్రైబ్ చేసిన ప్రసంగ పాఠం వల్ల ఆ శ్లోకాలు, పద్యాలు హాయిగా మళ్ళీ చదువుకుని, ఆలపించుకోగలిగాను.. ఇంక ఈ పద్యాలు, శ్లోకాలు మరింత ఆకళింపు చేసుకోవాలి.. నాకు చాలా ఇష్టపడి చేసే పని కల్పించారు. ప్రసంగం రెండవ భాగం కోసం ఎదురు చూస్తూ.. మీకు మరోసారి ధన్యవాదాలు భద్రుడు గారు..

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading