
పన్నెండో ఉత్తరం
మనిషిని బాధించేవి మూడు అంశాలు అంటాడు సెనెకా ఒక ఉత్తరంలో: అవి రోగం, వృద్ధాప్యం, బలవంతుడు పెట్టే హింస. కాబట్టి అతడి ఉత్తరాల్లో పదే పదే ఈ ప్రస్తావనలు కనిపిస్తూ ఉండటంలో ఆశ్చర్యం లేదు. పన్నెండో ఉత్తరం ప్రధానంగా వృద్ధాప్యం గురించి. తాను ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళాననీ, అక్కడ తన కళ్ళముందే కట్టిన ఇల్లు పాడుపడిపోవడం చూసాననీ చెప్తూ, ఆ దృశ్యం తనకి కూడా వయసు మీదపడుతున్న విషయాన్ని గుర్తుచేసిందంటాడు. కాని అది తనకు బాధ కలిగించడానికి బదులు తనలో కొత్త సంతోషాన్నే మేల్కొల్పిందని చెప్పడం ఈ ఉత్తరంలో విశేషం.
హెరాక్లిటస్ అన్నాడట. ఏ ఒక్కరోజైనా ప్రతి ఒక్కరోజుకీ సమానం అని. ప్రహేళికలాగా ఉన్న ఈ వాక్యానికి అర్థమేమై ఉండవచ్చు అని కొంత చర్చ చేసి, చివరికి ఏమంటాడంటే, ప్రతి ఒక్కరోజూ ముగిసిపోగానే మనం కూడా మన జీవితం అప్పటికి పూర్తయిపోయిందని అనుకోవాలనీ, ఆ తర్వాత మరొక రోజు మనకి లభిస్తే అది అదనంగా లభించిందని అనుకోవాలనీ అంటాడు.
ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్తాడు. ఒకప్పుడు సిరియా పాలకుడు ఒకడు ప్రతి రాత్రీ తనకి తాను అంత్యక్రియలు జరుపుకునేవాడట. రాత్రి భోజనం పూర్తికాగానే అతడి సేవకులు అతణ్ణి పాడెకట్టి పడగ్గదిలోకి తీసుకుపోతూ ‘మా ప్రభువు తన జీవితం పూర్తిగా జీవించాడు? పూర్తిగా జీవించాడు! అని గ్రీకులో పాటలు పాడేవారట. కాని మనం మరీ అంత దిగజారి మనకి మనం చెప్పుకోనక్కర్లేదుగాని, ఆశా, నిరాశా రెండూ లేకుండా రేపటిదినాన్ని ఎవరు ఆహ్వానిమచగలరో అతడిదే నిజమైన సంతోషమని అంటాడు. ‘నేను జీవించాను ‘అని ఎవరు చెప్పుకోగలరో, అతడికి ప్రతి ఉదయమూ ఒక బహుమానమే అని కూడా అంటాడు.
పదమూడో ఉత్తరం
ఆశలు, భయాలు ఈ రెండింటి గురించి సెనెకా పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. జీవితంలో వాటికవే ఎదురయ్యే సమస్యల తీవ్రతకన్నా, మన భయాలు, ఆకాంక్షలవల్ల అవి మరింత తీవ్రంగా మారతాయని చెప్తాడు. భవిష్యత్తు గురించిన మన భయాలు ఒక్కొక్కప్పుడు ఎంత తీవ్రస్థాయికి చేరుకుంటాయంటే, మనకేమీ కాదులే అని మనం పదే పదే చెప్పుకోవడం మొదలుపెడతాం. దానికన్నా, సరే, నిజంగానే ప్రమాదమే ముంచుకొచ్చిందనుకో, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దాపురించిందనుకో, అయితే ఏమిటట అని మనల్ని మనం ప్రశ్నించుకొమ్మంటాడు. సోక్రటీసు విషపానం చేసాడు, అంతకన్నా ప్రమాదం ఏముంటుంది? కాని అది ఆయన జీవితాన్ని ఎంతో ఉదాత్తంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. అలాగే కేటో ఆత్మహత్యచేసుకున్నాడు. కాని అతడు ఏ కత్తితో తనని తాను పొడుచుకున్నాడో ఆ కత్తి అతణ్ణుంచి లాక్కుని చూడండి, స్వాతంత్య్ర సంరక్షకుడిగా అతడు గడించిన కీర్తిలో అధికభాగం మనం లాగేసుకున్నవాళ్ళం అవుతాము అంటాడు.
ఇక్కడ కేటో గురించి చెప్పాలి. కేటో ఒక రోమన్ సెనెటరు. చిన్నప్పణ్ణుంచీ నిర్మలమైన జీవితం గడిపినవాడు. నిరాడంబరంగా బతికేడు. ప్రజలపక్షం వహించేడు. రోమన్ రిపబ్లిక్ ని నియంతృత్వంగా మార్చడానికి తమలో తాము పోటీపడుతున్న సీజర్ నీ, పాంపేనీ ఇద్దర్నీ ధిక్కరించాడు. తన పాలనకాలంలో ఎందరినో క్షమించిన సీజర్ కేటో ని మాత్రం క్షమిచలేకపోయాడు. అతడి అధికార దాహం అటువంటిది. చివరికి కేటో ను ఖైదుచేసాడు. అతణ్ణి విడిచిపెట్టమని సెనేటు తీర్మానం చేసింది. కాని సీజరు లెక్కచెయ్యలేదు. తన కళ్ళముందు రిపబ్లిక్ నియంతృత్వంగా మారడం తాను చూడలేనని, సహించలేనని, నియంతృత్వంలో బతికే కన్నా, మరణించడం మేలని చెప్పి కేటో తనని తాను పొడుచుకు చచ్చిపోయాడు.
తాను నమ్మిన విలువలముందు తన మర్త్యజీవితాన్ని తృణప్రాయంగా భావించిన కేటో గత రెండువేల ఏళ్ళుగా ప్రజాస్మృతిలో అమరుడిగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా, అమెరికన్ స్వాతంత్య్ర వీరులు కేటో నుంచి పొందిన స్ఫూర్తి అపారం. సెనెకా తన ముందు ఆదర్శంగా నిలుపుకున్న వ్యక్తిత్వాల్లో కేటోది అగ్రస్థానం. అందుకని మనిషి తన అంతఃకరణ చెప్పిన విలువలకోసం నిలబడకుండా, ఎలాగేనా బతకాలి అనుకోవడం మూర్ఖత్వం, అవివేకం అని ముగిస్తాడు తన ఉత్తరం సెనెకా.
పధ్నాలుగవ ఉత్తరం
జ్ఞాని రాజకీయాల్లో పాల్గోవాలా వద్దా? జ్ఞాని యుద్ధం చేయాలా వద్దా అని అడిగితే సమాధానం చెప్పడం సులభం. ఆత్మరక్షణకోసమో, లేదా ధర్మరక్షణకోసమో యుద్ధం చెయ్యకతప్పదని చెప్పవచ్చు. భగవద్గీత ఆ ప్రశ్ననే తలకెత్తుకుంది. కానీ జ్ఞాని రోజువారీ రాజకీయాల్లో పాల్గొనాలా వద్దా? ఈ ప్రశ్న చాలా జటిలమైన ప్రశ్న. రాజకీయాలు జ్ఞాని పని కాదు, అతడు తనలోకి తాను మరలి, తన ఆత్మోన్నతి కోసం ప్రయత్నించడమే మంచిది అని సెనెకా పధ్నాలుగో ఉత్తరంలో చాలా స్పష్టంగా చెప్తాడు. కాని ఇది స్టోయిక్కు ఆదర్శానికి వ్యతిరేకం. మనిషి సామాజిక హితాన్ని కోరుకోవాలనీ, నిరంతరం కార్యశీలుడిగా ఉండాలనీ స్టోయిక్కులు భావించారు. కాబట్టి సెనెకా మాట్లాడుతున్నమాటలు అందుకు భిన్నంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. చివరికి, ఏ కేటోను తాను తన ఆదర్శంగా స్వీకరించాడో, ఆ కేటో గురించి ఇలా రాస్తున్నాడు:
తత్త్వచింతన ప్రశాంత చిత్తంతోటీ, సంయమనంతోటీ చేపట్టవలసిన పని. ‘అలా అయితే మార్కస్ కేటో ని సంయమన శీలి అంటారా? కేటో ఒక అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం గొంతెత్తాడు. అధికారదాహంతో కత్తులు దూసిన ప్రజాప్రతినిధులనుండి తాను వేరుపడ్డాడు. వాళ్ళల్లో కొంత మంది సీజరు మాయలోనూ, మరికొంతమంది పాంపే మాయలోనూ పడితే, కేటో ఆ ఇద్దర్నీ కూడా ఏకకాలంలో ఎండగట్టాడు కదా.’ సరే, అసలు ఆ రోజుల్లో, జ్ఞాని ప్రజావ్యవహారాల్లో తలదూర్చవలసిన అవసరం ఉందా అనుకుని, ఇలా అడగవచ్చు: ‘ఏమంటున్నావు మార్కస్ కేటో? ఇది స్వాతంత్య్రానికి సంబంధించిన ప్రశ్న కాదు. మన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు మట్టిలో కలిసిపోయి చాలా కాలమే అయ్యింది, ఇప్పుడు మనముందున్న ప్రశ్న, సీజరా, పాంపేనా ఎవరు రాజ్యభారం వహించాలన్నది. ఆ తగాదాలో నువ్వెందుకు, కేటో, తలదూరుస్తున్నావు? ఆ గొడవలో ఏదో ఒక పక్షం వైపు నిలబడవలసిన పని నీకేమిటి? అది నీ పని కాదు. నియంతల ఎన్నిక అది. ఎవడు నెగ్గితే నీకేమిటి? వాళ్ళల్లో ఎవడు బలవంతుడో వాడే నెగ్గుతాడు. కాని ఎవడు నెగ్గినా వాడింతకన్నా భ్రష్టుడే అవుతాడు’ అని. కేటో తన జీవితంలో పోషించిన చరమ పాత్ర గురించి ప్రస్తావిస్తున్నాను నేను. కాని అంతకు ముందు రోజుల్లో కూడా రాజ్యాన్ని దోచుకునే పనుల్లో పాల్గోడానికి జ్ఞానులకి అనుమతిలేదు. కాబట్టి కేటో చెయ్యగలిగిందేముంటుంది? కంఠశోష తప్ప? చివరికి మూకలు ఆయన్ని ఎత్తిపడేసి ఆయన ముఖం మీదనే ఉమ్మి ప్రజామైదానం నుంచి బయటకి లాగేసి బలవంతంగా ప్రవాసానికి పంపించారు. మరోసారి సెనేట్ మందిరం నుంచే నేరుగా కారాగారానికి లాక్కుపోయారు.
ఇంత సుదీర్ఘంగా ఈ వాక్యాల్ని ఉల్లేఖించడానికి కారణం ఈ ఆలోచనకి ఇప్పటికీ ఉన్న ప్రాసంగికత ఉండటం వల్లనే. జ్ఞాని రాజకీయాల్లో పాల్గోవాలా వద్దా అన్న ప్రశ్నని ఇప్పటి భాషలోకి తర్జుమా చేస్తే, మేధావులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గోవాలా వద్దా అనే ప్రశ్నగా వినబడుతుంది. జ్ఞాని రాజ్యవ్యవహారాలనుంచి దూరంగా ఉండాలని సెనెకా చెప్పిన మాటలు మనకి రుచించకపోవచ్చుగాని, అత్యధికసంఖ్యాకులైన మేధావులు పోలింగు రోజునాడు బయటికి అడుగుపెట్టక, వోటు హక్కు వినియోగించుకోకుండా చేస్తున్న పని ఇదే కాదా? చివరికి పోలింగు స్టేషన్ కి వెళ్ళి బాలట్ పేపరు చేతుల్లోకి తీసుకున్నాక కూడా నోటా మీద ముద్రనొక్కే వాళ్ళు చేస్తున్నదిదే కాదా?
ఒకవేళ భగవద్గీత యుద్ధ రంగంలో ఒక క్షత్రియుడికి ఉపదేశించింది కాక, ఒక ఆశ్రమంలో బ్రాహ్మణుడికి ఉపదేశించవలసి వస్తే, భగవంతుడు ఏమి చెప్పి ఉండేవాడు? తర్వాత రోజుల్లో వ్యాఖ్యాతలు గీతాసందేశాన్ని దాని సందర్భం నుంచి వేరుచేసి దానికొక సార్వజనీనతని సంతరించే క్రమంలో చెప్పిందేమంటే, గీత స్వధర్మాన్ని పాటించమని చెప్పింది అని. స్వధర్మం అంటే ఏమిటని ప్రశ్నిస్తూ అరవిందులు తన స్వభావానికి అనుగుణంగా మనిషి తాను ఎంచుకునే కర్తవ్యమే అని చెప్పాడు. ఆయన చెప్తున్న స్వభావమూ, స్టోయిక్కులు మాట్లాడుతున్న ప్రకృతీ ఒకటే. అంటే ఏమిటి? నువ్వు ఏమి చేసినా అది నీ స్వభావానికి అనుగుణంగా ఉండాలే తప్ప, మరొకరు చెప్పారనో, లేదా మరొకరు చేస్తున్నారనో, దాన్ని అనుకరించడం కాకూడదు. స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ మరణించడమే మంచిది అని స్పష్టంగా చెప్పింది గీత.
కాబట్టి జ్ఞాని ముందు పరిశీలించుకోవలసింది తన స్వభావం ఏమిటని? కేటో స్వభావరీత్యా అన్యాయాన్ని సహించలేని మనిషి అని ప్లూటార్క్ రాసిన జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. కాబట్టి కేటో అలా కాక మరోలా ప్రవర్తించి ఉండలేడు. ఆ సంగతి సెనెకా కి కూడా తెలుసు. అందుకనే, జ్ఞాని రాజకీయాల్లో పాల్గోవాలా వద్దా అన్న ప్రశ్నకి అతడు ఈ ఉత్తరంలో స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఆ విషయం ముందు ముందు ఉత్తరాల్లో చర్చిస్తానని చెప్పాడు. ఆ తర్వాత 22 వ ఉత్తరంలో ఈ విషయాన్నే చర్చిస్తూ, తిరిగి మళ్ళా సూటిగా చెప్పకుండా, అది ఎప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా, అప్పుడు క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన నిర్ణయం అని అంటాడు.
ఈ ఉత్తరం వరకూ సెనెకా మరీ జాగ్రత్తపరుడిగానే మాట్లాడేడు. సందేహం లేదు. కాని అతడు వేసిన ప్రశ్నలు ఇప్పటికీ కీలకంగానే ఉన్నాయి. ఇప్పటి ప్రజాస్వామ్యంలో జ్ఞాని ఏమి చెయ్యాలి? స్వేచ్ఛకీ, విలువలకీ ఈ ప్రజాస్వామ్యం ఎప్పుడో తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు మనం ఎంచుకొవలసింది ఏ ఇద్దరు అవినీతిపరుల్లోనైనా ఎవరో ఒకరిని. ఎవరిని ఎంచుకున్నా, ఆ అవినీతిపరుడు అధికారం పొందగానే మరింత భ్రష్టుడిగా మారుతున్నాడు. కాబట్టి జ్ఞాని చెయ్యవలసిందేమిటి? ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతుల్ని చెయ్యడం అని చెప్పవచ్చు. కాని ఎవరు చెప్తున్నారు ఆ మాట? పత్రికా సంపాదకుడా? అతడు ముందే అమ్ముడుపోయాడు. యూనివెర్సిటీ అధ్యాపకుడా? అతడసలు పాఠాలే చెప్పడు.
ఇంతకీ ప్రత్యక్ష రాజకీయాలంటే ఏమిటి? ప్రజలదగ్గరికి గడప గడపకీ వెళ్ళడమా? వీథుల్లో తిరగడమా? ధర్నాలూ, రాస్తారోకోలూ చెయ్యడమా? కానీ, రెండు పక్షాలూ అత్యంత అవినీతిమయంగా మారిన కాలంలో, అదంతా సెనెకా చెప్పినట్టుగా వట్టి కంఠశోష కాదా?
బహుశా జ్ఞాని తాలూకు అత్యంత ముఖ్యమైన రాజకీయ కార్యాచరణ నిరాడంబరంగా జీవించడమే అనుకుంటాను. తాను మరిన్ని సౌకర్యాలూ, సంపదలూ కోరుకోకపోవడం ద్వారా అతడు సమాజానికి చాలా బిగ్గరగా సందేశమిస్తున్నాడు. తనని ఆదర్శంగా తీసుకుని తనలాంటి వాళ్ళు మరి నలుగురు తయారైతే అదే చాలు జ్ఞాని అత్యంత శక్తిమంతమైన రాజకీయ కార్యాచరణ చేస్తున్నాడని చెప్పడానికి.
అధికారానికి ఒక విచిత్ర స్వభావం ఉంది. అది ఒక వాతావరణం. ఎంతటి నీతిమంతుడైనా, ప్రజాస్వామికవాది అయినా, ఒకసారి ఆ వాతావరణంలోకి అడుగుపెట్టాక, అతడి ఆలోచనల్లోనూ, ప్రవర్తనలోనూ చెప్పలేనంత మార్పు వస్తుంది. అధికారం సిద్ధించగానే మనిషి చేసే మొదటిపని తన తోటిమనిషినుంచి దూరంగా జరగడం. తనని తక్కినవాళ్ళనుంచి వేరుచేసే చిహ్నాల్నీ, సౌకర్యాల్నీ స్వీకరించడం. ఆ తర్వాత అతడి తాపత్రయం ఇక ఎంతసేపూ వాటిని నిలబెట్టుకోవడం ఎలా అన్నదే.
అంతదాకా అణచివేతకు గురైన సమూహాలకు రాజ్యాధికారన్ని కోరుకోవడం ఒక విమోచనగా అనిపించవచ్చు. కాని, రాజ్యాధికారం సిద్ధించగానే ఆ సమూహాలు మళ్ళా తిరిగి తమకన్నా బలహీనమైన వాళ్ళమీద అణచివేత మొదలుపెడతాయి. ఆ కార్యకలాపాన్ని దగ్గరగా చూసే జ్ఞాని అనుసరించవలసిన దారి ఏది?
కన్ ఫ్యూసియస్, బుద్ధుడు, క్రీస్తు, అరీలియస్, గాంధీ, అరవిందులు, వినోబా ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు. క్రీస్తు చాలా స్పష్టంగా సీజర్ కీ, దేవుడికీ మధ్య గీత గీసిపెట్టాడు. బుద్ధుడు గణతంత్రాలు బలంగా పనిచేస్తే చాలనుకున్నాడు. కన్ ఫ్యూసియస్ తన జీవితమంతా తన మాటలు విని ఆచరణలో పెట్టే రాజు కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు. అరవిందులు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఆ తర్వాత తనలోకి తాను మరలిపోయారు. వినోబా వ్యక్తి సత్యాగ్రాహిగా జీవితం మొదలుపెట్టి, తన వరకూ తాను నిష్కళంక ఆశ్రమవాసానికి పరిమితమైపోయారు. వీరందరిలోనూ ఒక్క గాంధీ మాత్రమే, ఏకకాలంలో ప్రత్యక్షరాజకీయాల్నీ, ఆశ్రమవాసాన్నీ నిర్వహించుకోగలిగాడు.
పదిహేనవ ఉత్తరం
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం గురించి, రాజకీయ అధికారాన్ని సాధించడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మార్గాలు వేరు కావచ్చుగాని, దాదాపుగా అందరి ఆశయం ఒకటే. కాని నాబోటి వాడు, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చాలా దగ్గరగా చూసినవాడు, రాజకీయ అధికారం పట్ల ఎటువంటి భ్రమలూ పెట్టుకోలేడు. సామాజిక అన్యాయానికి రాజకీయ అధికారం ఒక్కటే పరిష్కారం చూపించగలదని నమ్మలేడు. పేదరికం, సామాజిక వివక్షలు చేసే అణచివేతనుండి బయటపడిన వాళ్ళు చాలామంది ఒకసారి ప్రభుత్వాధికారం గాని, లేదా రాజకీయాధికారం గాని సిద్ధించగానే monsters గా మారడం నేను కళ్ళారా చూసాను. ఇంతకాలం దోపిడీకి గురయ్యాము కాబట్టి, ఇప్పుడు దోచుకోవడం నా హక్కు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించడం ఆశ్చర్యం కల్గించదు. ఎందుకంటే, ఆ రాజకీయాధికారం సంస్కారాన్ని నేర్పదు కాబట్టి.
అందుకనే సెనెకా పదే పదే తన ఉత్తరాల్లో నిరాడంబరంగా జీవించవలసిన అవసరం గురించి, ఆశలూ, భయాలూ రెండూ లేని మనఃస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పదిహేనో ఉత్తరంలో దృఢమైన శరీరం, దృఢమైన మనస్సు రెండింటిలో ఏది ఎక్కువ ముఖ్యం అని ప్రశ్నిస్తూ, సహజంగానే ఆరోగ్యవంతమైన మనస్సు ఎక్కువ ముఖ్యమని చెప్తాడు. ఇంకా ఇలా అంటున్నాడు:
ఇదిగో, ఈ అద్భుతమైన ఈ లోకోక్తి చూడు: బుద్ధిహీనుడి జీవితం నిండా భయాలే ఉంటాయి. దానిలో కృతజ్ఞత అన్న మాటకి చోటే ఉండదు. దాని దృష్టి ఎంతసేపూ భవిష్యత్తు మీదనే.’ ఇంతకీ ఈ బుద్ధి హీనుడు ఎవరనుకుంటున్నావు? రాజుగారి ఆస్థానంలో ఉన్న విదూషకులా? కాదు, మనమే. ఎందుకంటే మనం గుడ్డి కోరికల్లో తగుల్కుని ఉన్నాం. వాటిని తీర్చుకోడానికి మనం చేసే పనులు మనల్ని తృప్తిపరచకపోగా మనకి మరింత హాని చేస్తాయి. అసలు మనల్ని ఏదేనా తృప్తి పరచగలదు అనుకుంటే, మనం ఎప్పుడో తృప్తి చెంది ఉండేవాళ్ళం. ఏదీ కోరుకోకపోవడంలో ఉన్న అహ్లాదం ఎటువంటిదో మనం ఆలోచించుకోవడం లేదు. లభించినదానితో తృప్తిచెంది, అదృష్టం మన తలుపు ఎప్పుడు తడుతుందా అని ఎదురుచూడకపోవడంలో ఎంత ఉదాత్తత ఉన్నదో మనకు తెలియడం లేదు. కాబట్టి లుసిలియస్, నీ ఆకాంక్షలు ఇప్పటికే ఎన్ని నెరవేరి ఉన్నాయో నీకు నువ్వు సదా గుర్తుచేసుకుంటూ ఉండు. నీ ముందు చాలా ఆకాంక్షలు ఉన్నమాట నిజమే గాని, నీ వెనక ఇప్పటికే ఎన్ని నెరవేరి ఉన్నాయో అది కూడా పరికించు. ఒకవేళ నువ్వు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే ముందు నీ గతజీవితానికి కృతజ్ఞతలు చెప్పు. ఎంతమందిని దాటుకురాగలిగితే నువ్విక్కడికి చేరుకోగలిగావో ఆలోచించు.
20-12-2022


Seneka mentioned that the three aspects that bothers humans are disease, old age and violence by powerful person. However, in his 15th letter he mentioned that to be happy with what one has without any desires.
Then, why he did not mention desire as one of the aspects that bothers humans alot?
Further, he states that wise men should not involve in politics. In reality, seneka did not live away from politics. Infact, he lost his life due to politics only.
As a stoic, he should not preach without practicing in his real life. However, he mentioned that wise men should not get involved in politics. Please explain..sir
Telugu keyboard is not working..sorry sir