కళాప్రారంభవేళ

365

మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అడిషనల్ కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు ఇన్నొవేషన్ మీదా, గిరిజనాభివృద్ధిలో ఇన్నొవేషన్ మీదా భోపాల్ లో ప్రశాసన్ అకాడెమీలో ఒక రోజు శిక్షణ ఇవ్వడానికి వెళ్ళాం. ఆ శిక్షణ ముగిసాక శుక్రవారం సాయంకాలం భారత్ భవన్ కి వెళ్ళాం.

ఇదే మొదటిసారి చూడటం. 1982 లో ప్రారంభించిన ఈ సంస్థ ఒక సాంస్కృతిక కేంద్రంగా ప్రఖ్యాతి చెందింది. కానీ, నన్ను వెంటనే ఆకట్టుకున్నది ఆ నిర్మాణ వాస్తు. ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఏదో బరువు దిగిపోయినట్టు గానూ, ఒక తాజాగాలి నిన్ను సాంత్వనగా నిమిరినట్టుగానూ అనిపిస్తుంది. అందుకు ఆ వాస్తును డిజైన్ చేసింది ఛార్లెస్ కోరియా కావడమే. ఇంతకు ముందు ఢిల్లీలో క్రాఫ్ట్స్ మూజియంకి వెళ్ళివచ్చినప్పుడు కోరియా గురించి రాసాను ఆయన భారతీయ గ్రామాల, దేవాలయాల, ఉత్సవకేంద్రాల వాస్తుని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న శిల్పి. ఆ రహస్యాలు మన ఆధునిక ఇంజనీర్లకి అర్థం కానివి. ఒక ప్రాకృతిక క్షేత్రంలో ఇటుకతోనో, సిమెంటుతోనో నిర్మాణం చేపట్టేటప్పుడు, ఆ ప్రాంగణం ఆ ప్రకృతినీ, ఆ ప్రకృతి ఆ ప్రాంగణాన్నీ ఆక్రమించకుండా పరస్పర పూరకాలుగా ఉండేటట్టుగా డిజైన్ చెయ్యడం కోరియా ప్రత్యేకత. భోపాల్ లో ఎగువసరస్సు ఒడ్డున తిన్నెలు, తిన్నెలుగా నిర్మించుకుంటూ వెళ్ళిన ఆ ప్రాంగణంలో ఏ ఒక్క విభాగమూ కొట్టొచ్చినట్టు కనబడదు. నువ్వొక గ్రామంలో ప్రధానవీధిలో నడుచుకుంటూపోతున్న భావనమటుకే కలుగుతుంది.

అక్కడ సాహిత్యం, రంగస్థలం, చిత్రలేఖనం, సంగీతంకార్యక్రమాలు, చలనచిత్ర ప్రదర్శనల పరంపర నెలపొడుగునా నడుస్తున్నట్టుంది. మేం వెళ్ళిన రోజునే సుధీర్ పట్వర్ధన్ చిత్రకళా ప్రదర్శన మొదలయ్యింది.

2
సుధీర్ పట్వర్ధన్ (జ. 1949) ముంబైకి చెందిన చిత్రకారుడు. కమ్యునిస్టు భావజాలం పట్ల నిబద్ధతతో చిత్రకళా తపస్సు కొనసాగిస్తూ వస్తున్న ప్రజాప్రేమికుడు. ఆయన 1970 నుంచి 2018 దాకా చిత్రించిన చిత్రాల్లోంచి ఎంపిక చేసిన వర్ణచిత్రాలు, డ్రాయింగులు, ఎచింగ్ లతో కూడిన ఆ ప్రదర్శనకి ‘హమ్‌సఫర్’ అని పేరుపెట్టారు.

పట్వర్థన్ బొమ్మలు నేను గతంలో అయిదారు మటుకే చూసి ఉన్నాను. కాని,ఒక చిత్రకారుణ్ణి నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఇటువంటి ప్రదర్శన ఒక్కటే సరైన మార్గం. దాదాపు అయిదు దశాబ్దాల సుదీర్ఘ తపస్సులో ఆ చిత్రకారుడి ప్రయాణం ఎలా మొదలయ్యిందీ, ఎలా కొనసాగుతూ వస్తోంది, అతడి మనసు దేని మీద లగ్నమవుతూ ఉంది, ఈ ప్రపంచంతో అతడు తనని తాను ఏ విధంగా engage చేసుకుంటూ ఉన్నాడు వంటివన్నీ ఇలా ఒక గాలరీలో నడిచినప్పుడే స్ఫురించే విషయాలు.

పట్వర్థన్ 1985 లో రాసుకున్నాడట:

‘నేను కళాకారుడిగా జీవితం మొదలుపెట్టినప్పుడే నాకు చిత్రకళ అంటే ఏమిటో స్పష్టంగా ఒక అభిప్రాయం ఏర్పడింది. చిత్రకళ అంటే మనుషుల గురించే’ అని.

ఆ మాటలకి సుదీర్ఘమైన వివరణలాగా ఆ ప్రదర్శనా, అసంఖ్యాకమైన ఉదాహరణల్లాగా ఆ చిత్రలేఖనాలూ కనిపించాయి. మానవాకృతి అతడి ప్రధాన ఇతివృత్తం అన్నది వేరే చెప్పనవసరం లేదు. మానవదేహాలు, ముఖాలు, కళ్ళు మటుకే కాదు, వీథుల్లో, రెస్టరెంట్లలో, రైళ్ళల్లో, ఆఫీసుల్లో, నిర్మాణస్థలాల్లో ప్రతి ఒక్కచోటా పోగుపడే మనుషులే అతడి కావ్యవస్తువు. ఆ మనుషులు ఏకకాలంలో నిర్దిష్టవ్యక్తులుగానూ, స్థలాతీత, కాలాతీత వ్యక్తులుగానూ కూడా కనిపిస్తున్నారు.

A Guide to 101 Modern and Comtemporary Indian Artists (2005) లో అమృతా ఝవేరీ పట్వర్థన్ గురించి రాస్తూ అర్బన్ ప్రాలిటేరియట్ ని, శ్రామికదేహాల్నీ వాటి దారుఢ్యం, దుర్బలత్వం రెండింటితోనూ చిత్రిస్తూ పట్వర్థన్ చిత్రకారుడిగా తన బాధ్యత నెరవేరుస్తూ వస్తున్నాడని రాసింది. కాని ఈ ప్రదర్శనలో ఉన్న చిత్రలేఖనాల్లో శ్రామికదేహమనే కాదు, అసలు మానవదేహాన్నే సంబరంగా జరుపుకోవడం కనిపించింది. అతడికి స్త్రీపురుష దేహాల్లోని వంపులు, కదలికలు, భంగిమలు, నిశ్చలక్షణాలు, సంచలనాలు, ప్రతి ఒక్కటీ ఆరాధనీయంగా కనిపించాయి. ‘నేను మనుషుల్ని చిత్రించకపోతే చిత్రకారుడిగా నా ఉనికిని సమర్థించుకోలేను, అది నా బాధ్యతా, నా నిబద్ధతా కూడా’ అన్నాడట పట్వర్థన్.

నాతో ప్రదర్శన తిలకిస్తున్న నా సహోద్యోగ బృందం ఈ చిత్రలేఖనాల్ని ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలంటారు అనడిగారు. వారికి నేను ‘నోస్టాల్జియా’ అనే చిత్రలేఖనం చూపించాను.ఆ వర్ణ చిత్రంలో మూడింట ఒక భాగం ఒక ఇల్లు, ఆ ఇంటి బాల్కనీలో నిలబడ్డ ఇద్దరు స్త్రీలు, లోపల గదిలో నిద్రిస్తున్న ఒక పురుషుడు, పైన ఒక బాలుడు. ఆ చిత్రం రెండువంతులు సిటీస్కేప్, లాండ్ స్కేప్. ఆ ఇద్దరు స్త్రీలలోనూ కొద్దిగా యవ్వనవతిగా ఉన్న ఆమె నేత్రాలు ఆ చిత్రానికి ఫోకల్ పాయింట్. ఆ నేత్రాలు ఏదో చూస్తున్నాయిగాని, ఆ చూపు ఇక్కడ లేదు. అందులో మాధుర్యమూ, విషాదమూ కూడా కలగలిసిఉన్నాయి. చిత్రలేఖనంలోని ప్రతి ఒక్క అంశమూ, చివరికి గదిలో నిద్రిస్తున్న ఆ పురుషుడి సుప్తనేత్రాలూ, ఆ కూర్చున్న బాలుడు ఇటే చెవొగ్గిన చూపుల్తో సహాప్రతి ఒక్కటీ ఆమె నేత్రద్వయం వైపే చూపిస్తున్నాయి. చిత్రలేఖనమంతా కలయతిరిగినా చివరికి మన చూపులు ఆమె చూపులదగ్గరకే చేరుకుంటాయి. ఆ చిత్రాన్ని ఒక విధంగా ఒక నెరేటివ్ అనవచ్చు. టాగోర్ ‘ఇంటా-బయటా’ లాంటి నవల ఆ బొమ్మ. పందొమ్మిదో శతాబ్దపు నాచురలిస్టు నాటకకర్తల్లాగా అతడు కూడా తన ఇతివృత్తంలోని డ్రామాని ఒక గృహప్రాంగణంలోనే ఆవిష్కరిస్తున్నాడు, కాని, ఆ కథ ఆ ఇంట్లోలేదని కూడా మనకి అర్థమవుతున్నది. ఆ కథ నిజానికి ఆ చిత్రంలోని ఆ ఇద్దరూ స్త్రీలూ అలా నిల్చున్న క్షణంలో కూడా లేదు. అది మరెక్కడో ఉంది. బహుశా గడిచిపోయిన ఏ మధురక్షణమో, లేదా ఏ వియోగమో, ఏ విషాద జ్ఞాపకమో. కాని, ఆ క్షణానికి మళ్ళా ఎప్పుడో సమీప భవిష్యత్తులోనో, సుదూర కాలంలోనో తిరిగిచేరగలమనే ఒక ఆశ కూడా కనిపిస్తున్నది. ఆ ఒక్క చిత్రం చాలు, పట్వర్థన్ ని సమకాలిక అగ్రశ్రేణి చిత్రకారుల్లో ఒకడిగా లెక్కించడానికి.

ఆ చిత్రకళా ప్రదర్శనలో 2000 తర్వాత గీసిన చిత్రలేఖనాల్ని ప్రత్యేకంగానూ, ముందు వరసలోనూ ప్రదర్శించారు. ఆయన చిత్రకళలో epic స్థానంలో lyric ముందుకొస్తున్నదని క్యురేటర్లు వివరిస్తున్నారు. అవన్నీ దాదాపుగా చార్ కోల్ డ్రాయింగ్స్. దేహాలు, మానవాకృతులు, శారీరికభంగిమలు.

అక్కడ సందర్శకులకోసం ఒక బ్రోచర్ అందిస్తున్నారు. అందులో ఆర్. శివ కుమార్ అనే ఆయన An Extraordinary Cohesiveness పేరిట చిన్న వ్యాసం రాసాడు. ఆ వ్యాసంలో చివరి వాక్యాలిలా ఉన్నాయి:

‘ఏళ్ళ మీదట అతడి (సుధీర్ పట్వర్థన్) దృష్టీ, సానుభూతీ దిశలు మార్చుకున్నాయి. ఆధ్యాత్మికంగా అతడు తొలి ఆధునికులైన షె జానె, వాన్ గో లకు, తొలి సాంస్కృతిక పునరుజ్జీవన కాలపు చిత్రకారులకు, ఇంతకుముందుకన్నా కూడా, మరింత సన్నిహితుడయ్యాడు. చిత్రకళ పట్ల అతడి వైఖరిలో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చిత్రకారుల్లానే అతడు కూడా తన పూర్వచిత్రకారులనుంచి ఏ పద్ధతినీ వారసత్వంగా గ్రహించలేదు, కంటికి గోచరిస్తున్నదాన్ని నిజాయితీగా అనువదించడానికి నేర్చుకోవడం మొదలుపెట్టినవాడిలానే కనిపిస్తాడు. ఒక సంప్రదాయ ప్రారంభవేళల్లో కనిపించే కళాకారుల్లాగా, అతడు కూడా ఎప్పటికప్పుడు చూడటమెలానో నేర్చుకుంటూ, చిత్రించడమెట్లానో నేచుకుంటూ తనని తాను నిరంతరం సందేహించుకుంటూ, వినయంగా తనపని తాను చేసుకుపోయే కళాకారుడు. కళలో అధికారాన్ని ప్రదర్శించే వైభవం అతనిది కాదు. కొత్త కళని ప్రారంభించే ఆదిమమానవుల్లాంటివాడు మటుకే.’

3
చిత్రకళా ప్రదర్శన చూసి, ఆ మందిరంలో నడుచుకుంటూ ముందుకుపోయేటప్పటికి బయట ఒక శుభ్రసంగీతాలాపనలాగా సరస్సు కనిపించింది. ఆ సరస్సుని చూడగానే నా అలసట మొత్తం తీరిపోయింది. ‘సంధ్యాసమయాల్లో నీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగు, అది ధ్యానంతో సమానం’ అని పెద్దవాళ్ళు చెప్పారు. కాని, అన్ని జలాశయాలూ అటువంటి మహాశయాన్ని నెరవేర్చేవిగా ఉండవు. కాని, ఆ సాయంకాలం ఆకాశపతాకలాగా సూర్యబింబం దూరంగా అవనతమవుతూ ఉంది, సరసులో ఒకటిరెండు నావలు దూరంగా ఏదో నిశ్శబ్ద సంగీత కచేరీ చేస్తున్నట్టుగా ఉన్నాయి. చెట్లమీద సాయంకాలం గూళ్ళకి చేరుకుంటున్న పక్షుల గృహాగమనవేళల సంభాషణలు మృదువుగా నా మీద రాలిపడుతున్నాయి. నేనట్లానే కొంతసేపు కూచుండిపోయాను. కొంతసేపంటే, కొన్ని క్షణాలే. ఇంతలోనే కథువాబాలిక నా మనసులో ప్రత్యక్షమయింది. నా మనసు వికలమైపోయింది. ఎన్నేళ్ళుగానో మనం నమ్ముతూ వస్తున్న విలువల్ని నలుగురైదుగురు రాక్షసులు ఒక్కసారిగా ధ్వంసం చేసేసారు. కాని నా పక్కనే ఒక కళాకారుడు జీవితమంతా మనుషుల్ని ప్రేమిస్తూ, వాళ్ళ సకలావస్థల్నీ ఇష్టంగా చిత్రించడానికి చేసిన సాధన కూడా ఉందని గుర్తొచ్చింది. మళ్ళా ఎందరు చిత్రకారులు, రచయితలు, కవులు, ప్రజాప్రేమికులు ఎన్నేళ్ళ పాటు శ్రమిస్తే కథువా మన జాతిమీద పెట్టిన కత్తిగాటు మర్చిపోగలుగుతాం!

15-4-2018

arrow

Painting: Nostalgia by Sudhir Patwardhan

Leave a Reply

%d bloggers like this: