యక్షప్రశ్నలు

Reading Time: 3 minutes

124

ఒక ప్రక్రియగా పొడుపుకథల గురించి ఆలోచిస్తూ ‘యక్షప్రశ్నలు’ మరొకసారి చదివాను. ఒక మహేతిహాసంలో ఆ సంఘటనని ఆ విధంగా conceive చేయగలగిన భారతకారుడి ప్రజ్ఞకు మరోసారి నిలువెల్లా నివ్వెరపోయాను. గొప్ప సాహిత్యం మనకి ప్రతి సారీ కొత్తగా కనిపించినట్టే, యక్షప్రశ్నలు కూడా మళ్ళా మరోసారి కొత్తగా కనిపించి కొత్త ఆలోచనలు నాలో సుళ్ళు తిరిగేయి.

మహాభారతంలో యక్షప్రశ్నలతో వనపర్వం ముగిసిపోతుంది. అప్పటిదాకా కామ్యక వనంలో గడిపిన పాండవులు, ద్వైత వనానికి రాగానే ఒక బ్రాహ్మణుడు తన అరణి పోయిందని చెప్పడం, ఆ అరణి ని వెతకడంకోసం పాండవులు అడవిలో తిరుగాడటం, అలసి దాహార్తికి లోనవ్వడం, దగ్గరలోనే ఉన్న నీళ్ళ కొలనునుంచి నీళ్ళు తెమ్మని ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్ళనీ పంపడం,అక్కడ యక్షుడి మాటలు వినకుండా ఆ నలుగురూ కొలనులో దిగి మరణించడం, చివరికి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిన ధర్మరాజు యక్షుడి ప్రశ్నలు జవాబివ్వడం, యక్షుడు ప్రీతి చెంది ఆ తమ్ముళ్ళు నలుగురినీ బతికించడం, రానున్న అజ్ఞాత వాస కాలంలో వాళ్ళనెవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేలాగా వరం ఇవ్వడం అందులో కథ.

పొడుపుకథలు ఒక వ్యక్తి లేదా జాతి శైశవం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో ఎదుర్కొనే ప్రశ్నలనుకుంటే, వాటి ప్రయోజనం ఒక జాతి ఒక మనిషిని తన మనిషిగా, అంటే తన social code ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మసులుకునే మనిషిగా రూపొందించుకోవడం. అందుకని సాహిత్యవేత్తలు తమ కథానాయకులు ఒక సంక్షోభానికి లోనై దాన్ని దాటే క్రమంలో పొడుపుకథల్ని కూడా వాడుకుంటూ వచ్చారు. ‘ఈడిపస్’ ని ‘స్ఫింక్స్’ అడిగిన పొడుపుకథ అటువంటి ఉదాహరణ.

భారతకారుడు కూడా అటువంటి ఒక సందిగ్ధ సమయంలో, తన కథానాయకుడు పూర్తి మనిషిగా పరిణమించే ఒక సంధిదశలో యక్ష ప్రశ్నల్ని వాడుకున్నాడు.

భారతంలో ధర్మరాజు కథానాయకుడైతే, ధృతరాష్ట్రుడు ప్రతినాయకుడు. భారతయుద్ధం కురుక్షేత్రమైదానంలోనూ, ధృతరాష్ట్రుడి అంతరంగంలోనూ ఒక్కసారే జరిగింది. అతడి మనసులో తన పిల్లల పట్లా, తన తమ్ముడి పిల్లల పట్లా ఉన్న భేదభావమే వైరంగా మారి సంగ్రామంగా పరిణమించింది. కాని అటువంటి భేదభావమే తన తల్లి పిల్లలపట్లా, తన పిన్ని పిల్లలపట్లా ధర్మరాజుకి లేదని ఎట్లా నమ్మడం? మాయాజూదం జరుగుతున్నప్పుడు, తన తమ్ముళ్ళను పణంగా పెట్టినప్పుడు ధర్మరాజు మొదట సహదేవుణ్ణి పణంగా పెట్టాడని ఎట్లా మర్చిపోవడం? కాని ఆ తర్వాత అతడు పన్నెండేళ్ళు వనవాసం చేసాడు. తన పూర్వీకులైన రాజుల, ఋషుల,వీరుల కథలు వింటూనే అరణ్యవాసం పూర్తి చేసాడు. ఆ ప్రవాసమూ, ఆ కథలూ అతడి అంతరంగాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేసాయనడానికి గుర్తుగా యక్షప్రశ్నల్ని సంధించాడు రచయిత. ఆ యుద్ధంలో, ఆ అంతరంగ యుద్ధంలో చెక్కుచెదరకుండా నిల్చొని ధర్మరాజు యుధిష్ఠిరుడు కాగలిగాడు.

ఆ పొడుపుకథల్లో తన కాలం నాటి social code కి అనుగుణంగా ఒక పాత్రగా యుధిష్టిరుడు సాధించిన ఉత్తీర్ణతని వివరిస్తూనే, ఆ జవాబుల్లో భారతకారుడు తన దృక్పథాన్ని కూడా చొప్పించడం నన్నెంతో ఆశ్చర్యపరించింది.

తన కాలం నాటి యుగధర్మాన్ని ప్రతిబింబించే ప్రశ్నలు అడగడంలో భారతకర్త వైదిక, అవైదిక సంప్రదాయాలు, రెండింటికీ, చెందిన ప్రశ్నల్ని ఏరుకున్నాడు. వైదిక సంప్రదాయంలో పొడుపుకథలు ‘బ్రహ్మోద్య’ ల రూపంలో ప్రసిద్ధాలు. బ్రహ్మోద్య అంటే బ్రహ్మన్ గురించిన సంభాషణ. శ్రౌత కర్మల్లోభాగంగా, ముఖ్యంగా, అశ్వమేధ యాగం అయిపోయాక ఋత్విక్కుల మధ్య జరిగే మాటలపోటీలవి. వాటి ప్రయోజనం యాగశ్రమ నుంచి కొంత ఊరటనివ్వడమని కొందరు భావిస్తే, అంతకన్నా విశిష్ట ప్రయోజనముందని కొందరు అభిప్రాయపడ్డారు. అటువంటి బ్రహ్మోద్యలు ఋగ్వేదంలో, వాజసనేయి సంహితలో, శతపథ బ్రాహ్మణంలో, తొలి ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తాయి.

ఉదాహ్రణకు, యక్షప్రశ్నల్లో ఈ నాలుగు ప్రశ్నలూ స్పష్టంగా యజుర్వేద మంత్రమే.

కీంస్విదేకో విచరతే జాత: కో జాయనే పున:
కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహత్.

( ఒక్కరే సంచరించేదేవరు? ఒకసారి పుట్టేక మళ్ళా పుట్టేదెవరు? శైత్యానికి మందు ఏది? ఏది గొప్ప విత్తడం?)

కాగా

కింస్విత్ సుప్తం న నిమిషతి కింస్విజ్జాతం న చోపతి
కస్యస్విద్ హృదయం నాస్తి కింస్విద్ వేగేన వర్ధతే.

(నిద్రపోతున్నా కళ్ళు మూయనిదేది? పుట్టేక కూడా కదలనిదేది? హృదయం లేనిదేది? వేగం పెరిగే కొద్దీ మరింత పెరిగేదేది)

లాంటి ప్రశ్నలు జనబాహుళ్యం నుంచి, అవైదిక జాతుల పొడుపుకథలనుంచి తెచ్చుకున్నవి.

ఆ రెండు సంప్రదాయాల్నీ మేళవించుకుని రచయిత స్వయంగా రూపొందించిన పొడుపుకథలు కొన్ని. ఉదాహరణకి:

కింస్విత్ ప్రవసతో మిత్రం కింస్విన్మిత్రం గృహే సత:
ఆతురస్య చ కిం మిత్రం, కింస్విన్మిత్రం మరిష్యత:

(దూరదేశంలో ఉన్నవాడికి మిత్రుడెవరు? ఇంట్లో ఉంటున్నవాడికి మిత్రుడెవరు? ఎవరు రోగికి మిత్రుడు? మరణిస్తున్నవాడికి మిత్రుడెవరు?)

మృత: కథం స్యాత్ పురుష: కథం రాష్ట్రం మృతం భవేత్
శ్రాద్ధం మృతం కథం వా స్యాత్ కథం యజ్ఞో మృతో భవేత్.

(ఒక మనిషి మృతుడని ఎప్పుడంటాం? ఒక రాజ్యం మరణించిందెప్పుడు? ఒక శ్రాద్ధం ఎప్పుడు మరణిస్తుంది? ఒక యజ్ఞం మరణించిందని ఎప్పుడంటాం)

ఇటువంటివి మొత్తం 123 ప్రశ్నలు. అన్నింటికీ యుధిష్టిరుడు సంతృప్తికరంగానే జవాబిచ్చాడు. ఇక్కడితో యక్షప్రశ్నలైపోయాయనుకుంటాం. కాని ఆ తరువాతి ప్రశ్న అతి కీలకమైన ప్రశ్న. అతడి జవాబులకి సంతోషించి అతడి తమ్ముళ్ళల్లో ఒకణ్ణి బతికిస్తానని చెప్తూ యక్షుడు ఆ ఒక్కరూ ఎవరో కోరుకోమంటాడు. ఈ 124 వ ప్రశ్నకి తాను నకులుడు బతకాలని కోరుకుంటున్నాని ధర్మరాజు ఇచ్చిన సమాధానం నిజానికి counter riddle.

చివరి ప్రశ్న, 125 వ ప్రశ్న. ‘నీ తమ్ముళ్ళల్లో నువ్వు నకులుడినే ఎందుకు బతికించమని కోరుకుంటున్నది?.’ ఈ ప్రశ్నని ఎదుర్కొనే ధర్మరాజు యుధిష్టిరుడిగా మారాడు. తన ధర్మశీలం లోకప్రసిద్దమనీ, అన్ని ధర్మాల్లోకి అనృశంసత, అంటే ఇతరులని బాధపెట్టకపోవడం అత్యుత్తమ ధర్మమనీ, అందుకని తాను నకులుడు బతకాలని కోరుకుంటున్నానీ జవాబిచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఆ కొలను ఒడ్డున అప్పటిదాకా ఒక సూక్ష్మ కురుక్షేత్రం సంభవించిందనీ, ఆ జవాబుతో ధర్మరాజు ఆ యుద్ధంలో విజేతగా ఉత్తీర్ణుడయ్యాడనీ చెప్పవచ్చు.

కానీ భారతకారుడి దృష్టి యుద్ధం పట్లా, జయాపజయాల పట్లా, తన కాలంనాటి యుగధర్మానికి అనుగుణంగా తన పాత్రలు ఉత్తీర్ణులు కావడం పట్లా లేదు. అతడిలో గాఢమైన నిర్లిప్తత ఉంది. ఆ నిర్లిప్తత పదే పదే యుధిష్ఠిరుడి నోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా.

చూడండి:

కో మోదతే, కిమాశ్చర్యం క: పంథా: కా చ వార్తికా
మమైతాం శ్చతుర:ప్రశ్నాన్ కథయిత్వా జలం పిబ.

(ఏది సంతోషం? ఏది నిజమైన ఆశ్చర్యం? ఏది దారి? ఏది వార్త? నేనడిగిన ఈ నాలుగు ప్రశ్నలకీ జవాబిచ్చి అప్పుడు నీళ్ళు తాగు)

అన్న ప్రశ్నకు యుధిష్ఠిరుడి నోట భారతకారుడిచ్చిన జవాబులు చూడండి:

‘ ఓ వారిచరమా, నెత్తిమీద ఏ అప్పూ లేకుండా, సొంత ఇంటికి దూరం కాకుండా, దొరికిన నాలుగు కూరగాయలతోటీ పొద్దుటి వేళ తన ఇంట్లో ఎవడు ఇంత అన్నం ఉడకబెట్టుకుని తింటాడో వాడిదే నిజమైన సంతోషం.’

‘ఈ లోకంలో అనుదినం అసంఖ్యాకంగా ప్రాణులు యమలోకానికి పోతూనే ఉన్నాయి. అదంతా చూస్తూ కూడా మనుషులు తమ జీవితాలు శాశ్వతం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యమేముంటుంది చెప్పు?.’

‘ఇక దారి అంటావా? తర్కమూ,సిద్ధాంతాలూ ఇదీ అని దేన్నీ నిశ్చయంగా చెప్పలేకపోతున్నాయి. వేదాల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. ఇతడు చెప్పేదే సత్యమని ఏ ఒక్క ఋషి మాటల్నీ మనం నమ్ముకోలేకపోతున్నాం. సత్యం ఎవరికీ చిక్కకుండా గుహలో దాక్కున్నట్టుంది. కాబట్టి , పెద్దవాళ్ళూ, మంచివాళ్ళూ ఏ తోవన నడిచారో అదే దారనుకుంటాన్నేను.’

‘ఇక వార్త ఏమిటంటావా? చెప్తాను విను. ఈ ప్రపంచమనే పెద్ద బాననిండా గొప్ప అజ్ఞానం. మహామోహం. దీనికి సూర్యుడు మంటపెడుతున్నాడు. రాత్రింబవళ్ళు కట్టెలు, లోపల ఉడికేదాన్ని కలయతిప్పడానికి మాసాలూ, ఋతువులూ గరిటెలు. ఈ బానలో పోసి కాలం ప్రాణులన్నిటినీ ఉడకపెడుతున్నది,మహానుభావా, ఇదే నేను చెప్పగలిగిన వార్త.’

ఏమి ప్రశ్నలు, ఏమి జవాబులు? ఇంకా నా గుండె అదురుతూనే ఉంది.

11-12-2015

Leave a Reply

%d bloggers like this: