
మళ్లీ జనం రావడం మొదలైంది. నా వెనుక ఉన్న కిటికీలోంచి కొందరు మగవాళ్లు నిశ్శబ్దంగా చూస్తున్నారు. మరికొందరు తలుపు దగ్గర గుమిగూడి నాకు వెలుతురు రాకుండా అడ్డుపడ్డారు. గాంధీజీ ధ్యానానికి భంగం కలగకూడదన్న ఉద్దేశంతో చాలా నెమ్మదిగా గొంతు తగ్గించి, కాస్త పక్కకు జరగమని వారిని వేడుకున్నాను. వాళ్లు పక్కకు తప్పుకున్నారు. నేనేదో తనతోనే మాట్లాడుతున్నానని అనుకుని గాంధీ నెమ్మదిగా తల ఎత్తి నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నేను కాదన్నట్టుగా తల ఊపాను; మళ్లీ మా నిశ్శబ్ద కార్యకలాపం మొదలైంది.
ఆ రాతిభవనంలో చలిగా ఉంది. ఆయన తన ఉన్ని శాలువా భుజాలమీదికి లాక్కున్నారు. ఆయన ముఖం ఒక్కటీ తప్ప మిగతా భాగమంతా గీసేశాను. ఒక ఉత్తరాల కట్ట తెచ్చి గాంధీజీ ముందు పెట్టారు. మీరాబెహెన్ అంతకుముందే పరిశీలించిన మరికొన్ని ఉత్తరాలు కూడా తీసుకొచ్చారు. ఆమె ఆయన పక్కన కొద్దిగా పాలూ, ద్రాక్షపళ్ళూ ఉంచారు. ఆయన ఆ ఉత్తరాలు చూసుకుంటుండగా, మీరాబెహెన్ వచ్చి నా భుజం మీదుగా చిత్రంలోకి చూశారు.
‘అన్నింటికంటే కష్టమైన, ముఖ్యమైన భాగాన్ని వాయిదా వేస్తున్నట్టున్నారు!’ అన్నారామె.
‘ఔను, గాంధీజీ మళ్లీ నూలు వడకడం మొదలుపెట్టినప్పుడు ఆయన ముఖాన్ని గీస్తాను. ఆయన తన భంగిమ పూర్తిగా మార్చేశారు’ అన్నాను కాస్త పొడిగా.
‘ఏదేమైనా, మీకు అనుమతి దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది’ అన్నారామె.
నేను ఆమె కళ్లల్లోకి చూశాను; ఆమెలో పూర్తి స్నేహభావం కనిపించింది. ఆమె కొనసాగిస్తూ, ‘ఆయనదొక మంచి చిత్రం వస్తే బాగుంటుంది; ఇప్పటివరకు అలాంటిదేదీ రాలేదు’ అన్నారు.
నేను నా పని కొనసాగించాను. సరిగ్గా ఈ రోజు పొద్దున్నే నేను కొన్ని మొఘల్ చిత్రాలు చూశాను. వాటి ప్రభావం నామీద పడుతోందా? వీలైనన్ని తక్కువ గీతలతో, నీడలు లేకుండా గీయడానికి అన్వేషిస్తున్నాను.
ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చారు. మీరాబెహెన్ ఒక వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చారు. గాంధీజీ తన చెయ్యి ముందుకు చాచారు, ఆ వైద్యుడు ఆయన రక్తపోటు పరీక్షించారు. సమాలోచనలు జరిగాయి. ఆయన ఏమాత్రం శ్రమకి లోనవకూడదనీ, తను కటక్ వచ్చింది ముఖ్యంగా బహిరంగ సభలో మాట్లాడటం కోసం కాబట్టి, ఆ పక్కనే ఉన్న అలకా ఆశ్రమ సందర్శన మాత్రం విరమించుకోవాలని తేల్చారు.
గాంధీజీ స్నానం చేసి విశ్రాంతి తీసుకోవడం కోసం మేమంతా ఒకటి రెండు గంటల పాటు ఆ గది ఖాలీ చేసి బయటకు వచ్చాం.
వరండా నేలమీద ఊర్మిళా దేవీ, దేశాయ్, కొందరు వాలంటీర్లూ, నేనూ పద్మాసనాలు వేసుకు కూర్చున్నాం; పళ్లాల మాదిరిగా పరిచిన తాజా అరటి ఆకుల్లో భోజనం చేశాం. మధ్యాహ్నం తర్వాత మళ్లీ చిత్రలేఖనం మొదలుపెట్టాను.
మీరాబాయి మళ్లీ వచ్చారు. ‘రూపు బాగా వస్తోంది!’ అని ఉద్గారించారు.
ప్రశంసల్నీ, ప్రోత్సాహాన్నీ నేనెంతగా ఇష్టపడతానో! అవి తెలివైనవిగానీ, మొద్దుగానే ఉండనీ ఒకింత పొగడ్త లభిస్తే చాలు నా మనస్సు వికసిస్తుంది! ఈసారి నాకు మరీ సంతోషం వేసింది; ఎందుకంటే మీరాబాయికి గాంధీజీతో ఎంతో సాన్నిహిత్యం ఉంది, ఆమె మెచ్చుకుందంటే ఒక కఠినమైన న్యాయమూర్తి ఆమోదం లభించినట్టే. గాంధీజీ మాటిమాటికీ భంగిమ మార్చేస్తుంటే, తల తిప్పుతుంటే, డజన్ల కొద్దీ కళ్లు నా పనిమీదే దృష్టి పెట్టి నేను గీసే ప్రతి ఒక్క గీతనీ గమనిస్తుంటే బొమ్మ గీయడం ఏమంత సులభం కాదు. పైగా నేనిప్పటిదాకా వేసిన చిత్రాలన్నింటిలోనూ ఇది నాకు చాలా ఆసక్తికరమైంది కాబట్టి, ఇది అద్భుతంగా రావాలని నేను మరీ మరీ కోరుకున్నాను.
గదిలో వెలుతురు తగ్గుతోంది, గాంధీజీ మళ్లీ రాట్నం తిప్పడం మొదలుపెట్టారు. నా పని దాదాపు పూర్తయింది, కానీ మళ్లీ ఆ ముఖాన్ని సరిదిద్దేంత ఓపిక మిగల్లేదు. ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి; గంటల తరబడి నేలమీద నిటారుగా కూర్చోవడం వల్ల ముఖ్యంగా నా కాళ్లు మొద్దుబారిపోయాయి.
మళ్లీ జనం వచ్చారు. మీరాబెహెన్ నా చిత్రాన్ని నిశితంగా పరిశీలించారు. ‘ఆయన రూపం చాలా చక్కగా పట్టుకున్నారు’ అన్నారామె.
ఊర్మిళా దేవి ఆనందంతో, ‘అద్భుతం, ఎంత బాగుందో! ఆ బొమ్మనిప్పుడే పట్టుకుపోవాలనిపిస్తోంది!’ అన్నారు.
‘నిజంగా మీకంతగా నచ్చిందా? నాకు చాలా సంతోషంగా ఉంది. మహాత్మాజీ నుండి ప్రసరించిన స్ఫూర్తినే నాకీ సాయం చేసిందని భావిస్తున్నాను!’ అన్నాను.
గుమ్మం దగ్గరనుంచీ, కిటికీల్లోంచీ జనం ఆ బొమ్మ చూడటానికి ఎగబడ్డారు. వరండా లోంచి హిందీలోనూ, ఇంగ్లీషులోనూ ప్రశంసా వాక్యాలు నా చెవిన పడుతున్నాయి. నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అది కేవలం పొగడ్తల వల్ల వచ్చిన తృప్తి మాత్రమే కాదు; అంతకుమించిన అపారమైన సంతృప్తి! తాము ఆరాధించే నాయకుడి రూపాన్ని నేను నిజంగానే ఆవిష్కరించానని ఆ ప్రజలు అనుకోవడం నాకు గొప్ప విషయంగా తోచింది. కళ గురించి వాళ్లకు ఏమీ తెలియదని నేను సరిపెట్టుకోవచ్చు; కానీ నాకేం తెలుసు? ఎవరికేం తెలుసు? అసలు కళ అంటే ఏమిటి?
పారిస్‌లో ఉండే కళా విమర్శకుల సంగతి పక్కన పెడితే, ప్రస్తుతానికి ఈ ప్రజలను మెప్పించానన్న సంతృప్తి నాకు చాలు!
నేను గాంధీజీ వైపు తిరిగాను. ‘రేపు రావచ్చా?’ అని అడిగాను.
ఆయన సరేనంటూ తలూపారు. మరుసటి రోజు దాకా రాట్నం పెట్టిన చోటు చెరిగిపోకుండా ఉండటానికి, ఊడ్చేవాళ్లు దాన్ని కదిలించకుండా ఉండటానికి సూదీ దారమూ అడిగి తీసుకుని, తివాచీమీద ఆ రాట్నం ఉన్న గుర్తు దగ్గర ఒక కుట్టు వేశాను.
ఉర్మిళా దేవి నా చిత్రం గురించి గాంధీజీతో ఏదో అన్నారు. నేను ఆయన వైపు చూస్తూ: ‘ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల ఇది, దీన్ని పూర్తిగా ముగించాలని ఉంది’ అంటూ నా కృతజ్ఞతలు తెలిపాను. ఆయన నన్ను ఉడికిస్తున్నట్టుగా నవ్వి, ఒక పెన్సిలు తీసుకున్నారు. నా చేతికిచ్చిన కాగితం ముక్కమీద ఆయన ఇలా రాశారు: ‘మరి నాకేం ఇస్తావు?’
ఆయన ఉద్దేశం అర్థం కాక అయోమయంగా మొదట ఆయన వైపూ, తర్వాత మీరాబెహెన్ వైపూ చూశాను. ఆ చిత్రపు నకలు ఏమైనా కావాలని అడుగుతున్నారా అనుకున్నాను. కానీ మౌనంగా ఉండిపోయాను. మీరాబెహెన్ ఆ కాగితం చదివి నవ్వారు: ‘మీ ఏళ్ల నాటి కోరిక తీరింది; ఆయన మీ అభ్యర్థనని అంగీకరించారు. బదులుగా మీరేం ఇస్తారు?’ అన్నారు.
‘ఓహ్, ఏదైనా ఇస్తాను, ఏమైనా సరే ఇస్తాను’ అన్నాను నేను ఆవేశంలో, మాటల ప్రవాహంలో. ఆయన నన్ను కించిత్ చమత్కార పూరితమైన, దయార్ద్రమైన చూపుల్తో చూశారు; ఆ చూపు ముందు నేనొక తెలివితక్కువ పసిపిల్లలా అనిపించాను. మీరాబెహెన్ వెంటనే హెచ్చరిస్తున్నట్టుగా: ‘ఆయన కోరుకునేది ఏమిటో మీకు తెలుసుగా—నూలు వడకడం!’ అన్నారు.
ఎంత నిర్లక్ష్యమైన మాటల ప్రవాహం నాది! ఏనాడూ చేయలేని, చేయబోని వాగ్దానం చేసేశాను! ఆయన మౌనం అడ్డుపడకపోయినా సరే, ఇలాంటి తొందరపాటు వాగ్దానాలు నెరవేర్చమని గాంధీ పట్టుబట్టరని నాకు తెలుసు, అంతటి వివేకి ఆయన.
విచిత్రంగా, ఒక మంచి చిత్రం గీశాననే సంతోషంలోనే ఉన్నప్పటికీ, ఆయన స్థాయి నుండి నేను కిందకు దిగజారిపోయినట్టు అనిపించింది! ఏదో సంజాయిషీ ఇచ్చుకోవాలనీ, వివరించాలనీ అనిపించింది, కానీ మౌనంగానే ఉండిపోయాను. నా వెర్రి వాగ్దానం గురించిన మాటలతో ఆయన ప్రశాంత మౌనానికి ఎందుకు అంతరాయం కలిగించడం?
చేతులు జోడించి నుదుటికి ఆనించి ప్రణామం చేసి, వంగి వీడ్కోలు తీసుకున్నాను.
రేపు పొద్దున్న తొమ్మిదింటికి మళ్లీ రావాలి.
వరండాలో నా చిత్రలేఖనం చూడటానికి జనం వేచి ఉన్నారు. మరిన్ని ప్రశంసలు. గాంధీజీ ప్రయాణించిన మోటారు కారులోనే నన్ను ఎక్కించి సాగనంపారు; నా ఇతర సామగ్రితో ఒక వాలంటీరు నా వెంటే ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచేదాకా అమూల్యమైన ఆ చార్ కోల్ డ్రాయింగు చెరిగిపోకుండా నా చేతుల్లోనే పెట్టుకున్నాను. చివరి వీడ్కోలు పలుకులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి: ‘ఇప్పటివరకు ఏ కళాకారుడూ గీయని విధంగా ఆయన రూపం అద్భుతంగా గీశారు!’
వెన్నమీగడలు మెక్కిన పిల్లిలా మురిసిపోతూ, నాలో నేనే నవ్వుకుంటూ, ఏదో తెలియని ఉద్వేగంతో ఆ సంధ్యాకాంతిలో ఇంటికి ప్రయాణమయ్యాను.
నా డైరీ విశేషాలు ఇంతటితో ముగిశాయి. కానీ ఆ రోజు కేవలం ఆనందోత్సాహాలతోనే ముగిసిపోలేదు. గాంధీ పర్యటన వెనుక ఉన్న ఒక హాస్యాస్పదమైన చీకటి కోణాన్ని కూడా నేను చూడవలసి వచ్చింది. నా మిత్రుడి ఇంట్లో భోజనం ముగిశాక ఒక అనధికారిక సమావేశం జరిగింది. అక్కడ తీవ్రమైన ఆందోళన నెలకొంది. వసూలైన నిధులు ఖర్చులకి ఏమాత్రం సరిపోవడం లేదు! గాంధీ బృందానికి అయ్యే సమస్త ఖర్చులూ, చివరకు తర్వాతి మజిలీ అయిన మద్రాసు (వెయ్యి మైళ్లకు పైగా దూరం) వెళ్లే రైలు చార్జీలతో సహా అంతా ఆ పట్టణమే భరించవలసి ఉంటుందట! శాసనసభలో ఒక రాజకీయ పార్టీకి విప్ గా ఉన్న నా మరో మిత్రుడి ముఖం మరీ చిన్నబోయింది. ఆయన ది గాంధీకి మద్దతు ఇచ్చే పార్టీ కాదు. చిత్తశుద్ధి కంటే కూడా గొప్పల కోసమే అందరికంటే ఎక్కువగా నూరు రూపాయలు చందా ఇస్తానని హామీ ఇచ్చారు. తీరా చూస్తే గాంధీ సొంత అనుచరుల్లోని అత్యంత ధనవంతులు కూడా పది రూపాయలకు మించి ఇవ్వలేదని తెలిసి ఆయనకు తీవ్రమైన ఏహ్యభావం కలిగింది!
వెంటనే కొంతమంది వసూలుదారుల బృందాన్ని ఏర్పాటు చేశారు; మరుసటి రోజు ఉదయం పట్టణమంతా తిరిగి పరిచయస్తుల ఇళ్లకు వెళ్లి వెండి రూపాయలు రాకపోతే కనీసం రాగి పైసలైనా సేకరించాలని నిర్ణయించారు! గాంధీజీ పట్ల ఎంతో భక్తిభావం ప్రకటించే ఈ మేధావులైన పురుషులు, గాంధీజీ యోగక్షేమాలు చూడటానికి మహిళల్ని రానివ్వలేదు గానీ, చందాలు వసూలు చేయడానికి మాత్రం కొందరు స్త్రీలను పంపించారు!
మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో నేను గాంధీజీ వద్దకు వెళ్లాను. ఆయన ఇంకా మౌనవ్రతంలోనే ఉన్నారు; చుట్టూ ఫైళ్లూ, పుస్తకాలూ, కాగితాలూ చెల్లాచెదురుగా పడి ఉండగా తన ‘యంగ్ ఇండియా’ పత్రిక కోసం శ్రద్ధగా రాసుకుంటున్నారు. ఉదయపు ప్రార్థనల కోసం సిద్ధం చేసిన బంతిపూల మాలా, జపమాలా కూడా అక్కడే ఉన్నాయి. నేను నిశ్శబ్దంగా కూర్చుని ఆయన వాటర్కలర్ చిత్రం గీయడం మొదలుపెట్టాను.
కాసేపటి తర్వాత ఆయన పాలు, పండ్లు మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత ఉత్తరాలు చూశారు, సందేశాలు స్వీకరించారు, ఇతరులు చెప్పిన సమాచారం విన్నారు; కానీ కేవలం సైగలతోనో, కాగితం ముక్కలమీద రాస్తో మాత్రమే బదులిస్తూ వచ్చారు.
నిన్నటిలాగే ఒక డాక్టర్ వచ్చి రక్తపోటు పరీక్షించారు. 200! ఒక్కసారిగా కలకలం! బిగ్గరగానూ గుసగుసగానూ తీవ్ర చర్చలు. ఆ పరికరం సరైనదేనా? దాన్ని చివరిసారిగా ఎప్పుడు వాడారు? యాభై వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో ఉన్నది ఇదొక్కటే పరికరమా? లేదు, ఫలానా ఫలానా డాక్టర దగ్గర కూడా ఉండొచ్చు! హడావుడిగా మరో డాక్టర్ని పిలిపించారు, ఆ తర్వాత ఇంకొకరు వచ్చారు. పరిచారకుల్లో గాంధీజీ ఆరోగ్యం పట్ల నిజమైన ఆందోళన కనిపిస్తోంది; నిశ్శబ్దంగా ఉన్న గాంధీజీ మాత్రం వారి ఆందోళన నిండిన చూపులకు ప్రశాంతమందహాసాల్తోనే బదులిస్తున్నారు. సాయంత్రం జరగవలసిన భారీ బహిరంగ సభ రద్దు చేయాలని వారు అనుకున్నారు. (కానీ చివరికి ఆ సభ జరిగింది; గాంధీ అక్కడ ఒక బల్లమీద వేసిన కుర్చీలో కూర్చుని అపార జనసందోహానికి దర్శనమిచ్చారు, మాట్లాడేంత ఓపిక లేకపోవడంతో ఆయన తరఫున మరొకరు ప్రసంగించారు.)
ఆ తర్వాత గాంధీజీ, నేనూ మళ్లీ ఆ నిశ్శబ్ద మందిరంలో కూర్చున్నాం; ఆయన రాట్నం చేసే ఝుంకారమూ, నా పెన్సిల్ చేసే శబ్దమూ తప్ప మరేమీ వినిపించడం లేదు. హఠాత్తుగా తలుపు ముందర ఏదో బలంగా ఊడుస్తున్న శబ్దం వినిపించింది. తీరా చూస్తే, ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి చేతిలో చీపురు పట్టుకుని, ఎవరైనా చూస్తున్నారా అని పక్కచూపులు చూస్తూ ఎంతో శ్రద్ధగా వరండా నేల ఊడుస్తున్నాడు. తనను తాను ఒక విశ్వసనీయ శిష్యుడిగా బాహాటంగా ప్రదర్శించుకుంటున్న ఆ ఉన్నత కులస్తుడిని గాంధీజీ చిన్న చిరునవ్వుతో గమనించారు! సూత్రాల్ని ఉల్లంఘించడం తప్ప మిగతా అన్నింటినీ చూస్తూ, గమనిస్తూ క్షమించే వ్యక్తి గాంధీ. కానీ అంతగా క్షమించలేని ఈ విషయాన్ని నేను ఆ తర్వాత ఒక స్నేహితుడితో పంచుకున్నాను. ‘పైపై మాటలూ, కపట సంస్కరణలూ!’ అన్నాను నేను. ‘అబ్బే, అదేం కాదు’ అంటూ నవ్వుతూ నా హిందూ మిత్రుడు అన్నాడు ‘మీరనుకుంటున్నట్టు ఆ వ్యక్తి జీవితంలో మొదటిసారీ చివరిసారీ చీపురు పట్టడం లేదు. పనివాళ్లను పెట్టుకోలేనంత పిసినారి వాడు; గాంధీ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికీ, జేబుకు డబ్బు మిగలడానికీ పనికొచ్చే ఇలాంటి సంస్కరణలు కొనసాగించడానికి అతడు తప్పకుండా సంతోషిస్తాడు!’
కపటత్వం కూడా గాంధీ ఆధ్యాత్మిక ఆదేశాలకు తలొగ్గుతోందన్నమాట!
మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు, పక్కనే ఉన్న గడియారం ఒకసారి చూసుకుని గాంధీ మాట్లాడటం మొదలుపెట్టారు. గాంధీ వ్యక్తిత్వానికే ప్రతీకగా నిలిచిన సుదీర్ఘమైన ఆ మౌనాన్ని—ఆ ప్రశాంతతనీ ఏకాంతాన్నీ—హఠాత్తుగా ఛేదించడం నాలో ఒక వింత ప్రభావం చూపించింది. కానీ ఆయన స్వరం వినిపించగానే, ఆయనలోని ఎంతో ఆప్యాయమైన మానవీయ గుణాలు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి.
ఆయన మొదట చేసిన పనుల్లో ఒకటి—కాస్త హాస్యమూ నిశ్చింతా మేళవించిన చూపులతో ఒక టెలిగ్రామ్ డిక్టేట్ చేయడం. ఎంతోమంది సమక్షంలోనే అది జరిగింది కాబట్టి, నాకు గుర్తున్నంతవరకు దాన్నిక్కడ రాయడం నమ్మకద్రోహం కాదని భావిస్తున్నాను. తన భార్యకు పంపిన ఆ సందేశంలో, తాను దత్తత తీసుకున్న అంటరాని పిల్ల శాంతిని ప్రేమగా ప్రస్తావిస్తూ, పర్యటన ప్రణాళికలు తెలియజేస్తూ, చివరగా తన ఆరోగ్యం గురించి ఇలా రాశారు: ‘తాజా రీడింగ్ 160, అంతకుముందు రీడింగులు 170 మరియు 200. ఏది కావాలో మీరే ఎంచుకోండి. ముగ్గురు డాక్టర్లు, మూడు పరికరాలు, మూడు రీడింగులు; మీరే నిర్ణయించుకోండి. నేనెప్పటిలాగే ఉత్సాహంగా ఉన్నాను. ప్రేమతో.’
మిగిలిన సమయంలో నా మనసు సగం చిత్రలేఖనం మీదా, సగం ఆయన్ను కలవడానికి వస్తున్న సందర్శకులతో ఆయన జరుపుతున్న చర్చల మీదా ఉంది. తనను విమర్శిస్తున్నప్పుడూ, ఉచిత సలహాలు ఇస్తున్నప్పుడూ కూడా ఆ చర్చల్లో ఆయన సమతుల్యమైన వివేకమూ, సహనమూ, స్పష్టతా ఒక్క క్షణం కూడా లోపించలేదు.
నాకు గుర్తున్న వాటిలో ఒక చర్చ ప్రత్యేకంగా గుర్తుంది. గాంధీ ఒక నిర్దిష్ట ఆలయాన్ని సందర్శిస్తారా అన్నది ప్రశ్న. దానికి సమాధానంగా ఆయన ఇటీవల తనకు ఎదురైన ఒక అనుభవాన్ని (బాలేశ్వర్‌లో అనుకుంటా) ప్రస్తావించారు. ఎప్పటిలాగే సనాతనవాదులతో మాట్లాడుతూ వివక్షలను పక్కనపెట్టమనీ, నిజమైన హిందూమతం ఎవరినీ దూరం పెట్టదనీ ఆయన వాదించారు. కానీ ఆయన ఆ స్థానిక ఆలయానికి వెళ్లలేదు. చివరకు ఆ ఆలయ పూజారుల బృందం వచ్చి, ఆలయాన్ని దర్శించి ఆశీర్వదించాల్సిందిగా వేడుకుంది. తన వెంట తన మిత్రులైన మీరాబెహెన్ (మిస్ స్లేడ్), రెవరెండ్ ఆండ్రూస్‌లను రానిస్తారా అని గాంధీ అడిగారు. కుదరదు, వారు విదేశీయులు కదా అన్నారు పూజారులు. ‘వారు నా సోదరీ సోదరులు; వారిని లోపలికి అనుమతించకపోతే నేను కూడా రాను’ అన్నది గాంధీ ఇచ్చిన అంతిమ సమాధానం. (ఇంకా ఉంది)
11-10-2026


Frieda Hauswirth గాంధీజీ రేఖాచిత్రం గీయాలనే ఉద్దేశంతో వెళ్లినా, అక్కడ తాను చూసిన సంఘటనలను, మనుషుల ప్రవర్తనను నిశితంగా గమనించి రాయడం ద్వారా చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వివరాలను మనకు అందించారు.
Her observations of Gandhiji, his ideals and his efforts to practice them in everyday life, as well as the attitudes and contradictions of the people around him, give us an interesting picture of that time.
అవును. నిజానికి, ఇది కూడా ఒక రేఖాచిత్రమే!