కొన్ని కలలు కొన్ని మెలకువలు-34

కొన్ని కలలు కొన్ని మెలకువలు పుస్తకం పూర్తయింది. ఆ పుస్తకానికి దాదాపు ఇరవై పేజీల ముందుమాట కూడా ఒకటి రాసుకున్నాను. ఆ ముందుమాటని ముందే మీకు పరిచయం చెయ్యడం కన్నా ఇప్పుడు పరిచయం చేస్తే బాగుంటుందని ఇలాగ అందిస్తున్నాను.


ముందుగా కొన్ని మాటలు

సాహసనావికుడు

సాహసనావికుడు సింద్‌బాద్ సముద్ర ప్రయాణం కథల్ని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సముద్రం మీదకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ సింద్‌బాద్‌కి అది మామూలు ప్రయాణంగా ఉండేది కాదు.

అతని అదృష్టమో, దురదృష్ణమో తెలియదు కానీ ప్రతి ప్రయాణమూ మొదలైన కొంతకాలం దాకా బాగానే ఉండేది. అంతలో అనూహ్యంగా ఏదో పెద్ద విపత్తు వచ్చి పడేది. ప్రయాణిస్తున్న నౌక కూలిపొయ్యేది. తన సమస్త ఆధారాన్నీ, సహ ప్రయాణీకుల్నీ పోగొట్టుకుని ఆ నావికుడు ఏది చేతికి దొరికితే దాన్ని ఊతంగా ఎక్కడికో ప్రాణాలు అరచేత పట్టుకుని ఈదుకుపొయ్యేవాడు. తనకి తెలియని ఏ ప్రమాద ద్వీపానికో తేలేవాడు. కొన్నిసార్లు బానిసగా, కొన్నిసార్లు దీనంగా, కొన్నిసార్లు కొనప్రాణంతో కాలం గడపవలసివచ్చేది.

ఇంతలో మళ్లా ఎక్కణ్ణుంచో ఏదో రత్నాలలోకం నుంచి పిలుపు అందేది. కలలో కూడా ఊహించలేని వజ్రాలరాసులు అతని ముందు ప్రత్యక్షమయ్యేవి. వాటిని మూటగట్టుకుని సాగరతీరానికి చేరగానే స్వదేశానికి పోయే ఓడ ఏదోఎక్కణ్ణుంచో ఎదురయ్యేది. అతన్ని స్వదేశానికి తీసుకుపొయ్యేది. వెళ్లినప్పటికన్నా మరింత సంపన్నుడిగా తిరిగి వచ్చిన సింద్‌బాద్ బాగ్దాద్ నగరంలో ప్రతి ఒక్కరినీ ఊరించే, ఉద్వేగానికి లోను చేసే వీరుడిగా కనపడేవాడు.

కొన్నాళ్లు గడిచేవి. తన ప్రయాణంలో అనుభవించిన బాధల్నీ, బానిసత్వాన్నీ సింద్‌బాద్ నెమ్మదిగా మరచిపోయేవాడు. ఆకలితో, దాహంతో, ప్రాణభయంతో రోజులకి రోజులు గడిచేవన్న జ్ఞాపకాలు వెనకబట్టేవి. మళ్లా సముద్రం ఊరించేది. ప్రశాంతమైన తన ఇంటివాకిలి, ముచ్చట్లు చెప్పుకునే తన వీథి అరుగు అతనికి మొహం మొత్తేవి.

చూసిన అనుభవాలకన్నా చూడని అనుభవాల ఊహలు మత్తెక్కించేవి. నిలవలేకపోయేవాడు. ఉన్నదంతా ఊడ్చి అమ్మి మళ్లా సముద్రప్రయాణానికి సాహసించేవాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అతని మీద అపార సాగర మట్లా ఏడుసార్లు వల విసిరింది.

ఇప్ప్పుడు ఈ ప్రశాంత ఉదయాన్న ఈ శరత్కాల సూర్యకాంతి, రేడియోలో వినిపిస్తున్న పాతపాటలు, మహత్తరమైన దేశదేశాల కవిత్వం. వీటి మధ్య కూచున్న నన్ను కూడా సింద్‌బాద్ లాగా నా పూర్వప్రయాణాలు తమ జ్ఞాపకాలతో ముంచెత్తుతున్నాయి. అయితే నేను చేసిన ప్రయాణాలు ఏ భౌతిక సాగరాల మీదా చేసినవి కావు. అవి విద్యారంగంలో చేసిన ప్రయాణాలు. భూమ్మీది సప్తసాగరాల్లోనూ ఉన్న రత్నాలరాసులకన్నా విలువైన రత్నాల్ని తనలో ఇముడ్చుకున్న విద్యాసముద్రం మీద నేను చేసిన ప్రయాణాలు.

సింద్‌బాద్ ప్రయాణాల్లా నా ప్రయాణాలు కూడా నష్టలాభాల ఉయ్యాల్లో ఊగులాడినవే. వాటిలో సాహసం ఉంది, దీనత్వం ఉంది, అవమానాలున్నాయి, వైఫల్యాలున్నాయి. హృదయభంగాలున్నాయి. కానీ, ప్రతి వైఫల్యం వెంటనే ఆత్మసంతృప్తి అనే మహత్తర సంపద నా మీద నిలువెల్లా వర్షించడాలూ ఉన్నాయి. ప్రతి ప్రయాణం ఒక ప్రయోగం. ప్రతి ప్రయోగవేళా, ఇదే చివరి ప్రయోగమనీ, ఇక విద్యారంగం జోలికి పోకూడదని నాకై నేనెన్నో బాసలు చేసుకున్న రోజులూ ఉన్నాయి.

సముద్రపు తలపు సింద్‌బాద్‌ని నిలవనివ్వట్టు, ప్రేమలో పడ్డవాళ్లు ప్రేమ బాధని, గుండెకోతని భరించలేక ఇక ఒకరినొకరు ఎన్నటికీ చూడకూడదని ఎన్నో ఒట్లు పెట్టుకున్నప్పటికీ, మళ్లా వాళ్ల తలపు రాగానే ఒకరినొకరు చూడటానికి తపించి కొట్టుకుపోయినట్టు విద్యారంగం కూడా నన్నట్లానే ఒదిలిపెట్టలేదు.

2

నాకెన్నో కలలు

ఆలోచిస్తుంటాను, ఎందుకు నన్నిట్లా విద్యారంగం పిలుపులు నిలవనివ్వకుండా తల్లకిందులు చేస్తూ ఉంటాయా అని. బహుశా, నా కలలే అందుకు కారణ మనుకుంటాను. ఎన్ని కలలు, ఎన్ని కలలు.  

విద్యగురించి తలచుకుంటే నాకెన్నో కలలు. ఎప్పటినుంచి ఈ కలలు నాలో రూపుదిద్దుకున్నాయో నాకు తెలియదు. బహుశా, పచ్చని పూలపర్వతాల మధ్య నీలి మేఘాల నీడన, లేగదూడల పక్కన నేను పుట్టిన ఆ పురాతన గిరిజన గ్రామంలో మా వజ్రమ్మపంతులమ్మగారు నాకు బైబిల్ కథలూ, మహాభారతం కథలూ చెప్తున్నప్పుడే, నా మనసుకేదో ఊహాస్వర్గం రేఖామాత్రంగానన్నా బోధపడి ఉండాలేమో.

ఎప్పుడు, ఏ మహనీయ మానవ ప్రేమికుడయినా తన సోదరమానవాళి కోసం ఏదన్నా చెప్తున్నప్పుడు నన్నా కలలే మళ్లా ముంచెత్తుతాయి. అవి గాంధీజీ వాక్యాలు కావచ్చు. లేదా ఎమిలిలో రూసో వాక్యాలు కావచ్చు. ఆ మాటలు మదర్ మాట్లాడినవయినా, కృష్ణమూర్తి మాట్లాడినా, ఫాలో ప్రయరీ మాట్లాడినా అందులో నాకు కనిపించేది, వాళ్ల దృక్పథభేదాలు కాదు . ప్రాయికంగా, అసలన్నిటికన్నా మొదట వాళ్ల విద్య గురించి ఏదో ఒకటి మాట్లాడటం, అలా వాళ్లు విద్య గురించి మాట్లాడకుండా ఉండలేకపోవడం, వాళ్లనట్లా ముందుకు నెట్టి మాట్లాడించిన వాళ్ల ఉద్వేగం, వాళ్ల కలలు, అవే, ఆ కలలే నా కలల్నీ నాలో మేల్కొల్పుతుంటాయి.

మనిషి తన తోటి మనిషికి ఎన్నో విలువైన ఉత్పత్తులు, కాన్కలు, ప్రోత్సాహాలు ఇవ్వవచ్చు గాక. కాని అన్నిటికన్నా విలువైనది అతడు తన తోటి మనిషికి ఇవ్వగలిగేది విద్య మాత్రమే. ఇక్కడ విద్య అంటే పుస్తకాలు కాదు. పరిజ్ఞానం కాదు. ఏదో ఒక నైపుణ్యం, సంపాదనా సామర్ధ్యం కానే కాదు. అన్నిటికన్నా మిన్న. మనిషి తన తోటి మనిషికి అందించగలిగేది తన ఆత్మిక సారాంశాన్నే.

అది పక్షి తన తోటి పక్షికి రెక్కలతో ఎగరడం నేర్పినట్టుగా, పులి తన బిడ్డకి పంజా విసరడం నేర్పినట్టుగా, మనిషి తన అమూల్య సారాంశాన్ని తన మానవత్వాన్ని, తను ఏ మూలాధారం వల్ల తనని తాను మానవుడిగా గుర్తిస్తున్నాడో ఆ అత్యంత మౌలిక సారాంశాన్ని తన తోటి మనిషికి అందిస్తాడు. దాన్నే విద్య అంటున్నారు గాంధీజీ. ఆ అందించేదాన్ని ఎలా అందించాలన్న దాన్లో ప్రాంతీయ, జాతీయ వైవిధ్యాలూ, విశేషాలూ ఉండవచ్చు గాక. కానీ, అందుతున్న సారాంశం మాత్రం ఒక్కటే.

సృష్టిలో వివిధ జీవులు వాటి అస్తిత్వసారాంశాన్ని, మౌలిక జీవలక్షణాన్ని తమ సంతతికి అందించడంలోనూ, మనుషులు తమ సంతతికి అందచేస్తున్న జ్ఞానం లోనూ ఒక ముఖ్య వ్యత్యాసం ఉంది. తక్కిన ప్రాణులు తమ సంతతికి అందించేది నైపుణ్యం మాత్రమే. అది జీవించడానికి, వాటి మనుగడకు అవసరమైన నేర్పరితనం మాత్రమే. దానిలో విద్య లేదు. అది బహుముఖీనం కాదు. ఏకముఖీనం మాత్రమే.

దీన్నే టాగోర్ తన ‘రెలిజియన్ ఆఫ్ మాన’ లో చక్కగా వివరిస్తాడు. ఆయన అనేదేమంటే సాలీడు తన సంతతికి యుగాలుగా గూడు అల్లడాన్నీ, తేనెటీగ తేనె కూడబెట్టడాన్నీ నేర్పుతూ వస్తున్నాయి. ఆయా నైపుణ్యాల్లో, సృష్టిలో, వాటిని మించినవి లేవు. కాని యుగాలుగా, పరిణామ క్రమంలో సాలీడు గూడు కట్టుకోవడానికీ, తేనెటీగ తేనెపట్టు పెట్టడానికీ మాత్రమే పరిమితమయి పోయాయి. ఆ నైపుణ్యాల నుంచి అవి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యగలిగింది లేదు. తమ జాతి జీవలక్షణం అని చెప్పదగ్గ నైపుణ్యాల కన్నా భిన్నమైన నైపుణ్యాల్ని అవి నేర్చుకున్నది లేదు.

కాబట్టి తక్కిన జీవుల్లో జీవి నుంచి జీవికి అందుతుండేది కేవల నైపుణ్యం. వాటి మనుగడకు విశ్వస్థితిలో వాటికొక ఉనికిని కల్పించి పెట్టే ప్రత్యేక నైపుణ్యం. కాని మనిషి సంగతి అట్లా కాదు. ఇక్కడ అందేది కేవలం నైపుణ్యం కాదు. కేవల దేహదారుఢ్యమో, లేదా కేవల మానసిక సామర్ధ్యమో కాదు. వాటిని మించినది. దాన్ని గాంధీజీ ఆత్మవిద్య అన్నారు. బహుశా కాంట్ వంటి మేధావి దాన్ని మానవహేతుశీలత అనవచ్చు. లేదా మరొకరు మరొకటి అనవచ్చు. అది మనిషి నుంచి మనిషికి అందడానికి అక్షరాస్యత తప్పనిసరిగా ఉండాలని లేదు.

అనేక అక్షరపూర్వ సమాజాలు, ఆదిమసమాజాలు తమ సంతతిని ఉత్తమ సాంఘిక జీవులుగా తీర్చిదిద్దడానికి అక్షరాలతో నిమిత్తం లేకుండానే ఒక అత్యుత్తమ జీవిత విధానాన్ని రూపొందించుకున్న ఉదాహరణలు మానవపరిణామ శాస్త్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. విద్య అంటే ఒక తరం మరొక తరానికి జీవన సంస్కృతిని అందించడం. ఆ సంస్కృతి కేవలం అనుకరణ వల్ల అందేది కాదు. అది కేవలం నైపుణ్యం కూడా కాదు.

అది జీవించడంలోని ఆనందాన్ని అనుభవించడాన్ని నేర్చుకోవడం. విద్య అంటే నేర్చుకోవడమెట్లానో నేర్చుకోవడమేనని మహనీయ విద్యావేత్తలంతా చెప్తూ వచ్చిందిందుకే. విద్య పిల్లవాడిలోని ఆత్మకి శిక్షణ నివ్వాలనీ, అది అతనికి లోవెలుగుని వికసింపచేయాలనీ గాంధీజీ అనడంలోని ఉద్దేశమిదే. విద్య పిల్లవాడిని ప్రపంచ కేంద్రంలోకి తీసుకుపోగల మహత్తర ఉపకరణమనీ, సంస్కృతి అనీ గుర్తించడంతో చాలదు. అది మహనీయ మానవానందమని కూడా మనం గుర్తించాలి.

ప్లేటో ‘సింపోజియం’ లేదా షేక్స్పియర్ ‘కింగ్ లియర్’ నాటకాన్నో చదవడంలో లేదా జపనీయ చిత్రకళనో, ఆఫ్రికన్ ఆదిమజాతుల దారు శిల్పకళనో, భారతీయ భరతనాట్యాన్నో చూడగలిగి, ఆనందించగలగడం జీవితకాల విద్యార్ధికి, మాత్రమే సాధ్యపడుతుంది. ఆ ఆనందానికి కేవల వ్యక్తి మనుగడకు అవసరమైన నైపుణ్యం చాలదు. అది తననీ, ఎదటిమనిషినీ కూడా కలుపుకుని సామరస్యపూర్వకంగా తమకై తామొక ప్రపంచాన్ని నిర్మించుకోగల సంస్కృతి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది.

విద్య గురించి తలచుకున్నప్పుడల్లా నాకు తోచే కలలివే : మనుషులందరూ, సృష్టిలోని మహత్తర వైభవశీల అంశాలన్నిటిపట్లా ఆకర్షితులు కాగలగాలి. వాళ్ల ప్రతి ఒక్క కదలికలోనూ తోటి మానవుడి పట్ల అపార సహానుభవం తొణికిసలాడాలి. వారి జీవితాల మీద మేల్కొనే ప్రతి ఉదయమూ ఒక ఉపనిషత్ ప్రార్ధన కావాలి. వారి సాయంకాలపు వ్యాహ్యాళి థోరో రచనను తలపించాలి.

వారు గడిపే ప్రతి ఒక్క క్షణం, తలపు, మాట, చేత ఒక శివానందలహరి కావాలి. అన్నిటికన్నా ముందు, తాము జీవిస్తున్నందుకు, తమ చుట్టూ ప్రపంచంలో పూలతోటలు, సెలయేళ్లు, నీలిమబ్బులు, తూనీగలు, ప్రేమకవితలు, పిల్లలనవ్వులు పొంగి పొర్లుతున్నందుకు వారు మహానంద పరవశులు కావాలి. ప్రతి ఒక్కరిలోనూ నిద్రాణంగా ఉన్న లోవెలుగును వారి వారి అభివ్యక్తికి అనుగుణంగా ప్రపంచ సంగీతంలో గొంతుకలపాలి.

అది అక్షరాస్యత వల్ల సాధ్యమయితే అక్షరాస్యత వల్ల కానివ్వండి. లేదా మౌఖిక ప్రసారం వల్ల సాధ్యమయితే మౌఖిక ప్రసారం వల్ల కానివ్వండి. అది మాంటిస్సొరి పద్ధతిలో పాఠశాల ఆవరణలో సాధ్యపడితే పాఠశాలల ద్వారానే రానివ్వండి, లేదా శాంతినికేతనంలో మాదిరి మాఘమాసపు మామిడితోటల నీడన వికసించవలసి ఉంటే అట్లానే కానివ్వండి, లేదా పురాతన ఏథెన్సు నగరవీథుల్లో తన శిష్యులతో నడుస్తూ బోధించిన సోక్రటీస్ మార్గమే కానివ్వండి, అది ఏ రీతిన ఒనగూడిందన్నది కాదు, అది తోటిమానవుý ఆత్మనే మేరకు వికసింపజేసిందన్నది ముఖ్యం.


Before We Begin

The Adventurous Navigator

In our childhood, many of us read the tales of Sindbad the Sailor. For those who venture out to sea, a voyage is rarely a routine affair, but for Sindbad, it was always extraordinary.

Whether by luck or fate, every journey he undertook began serenely enough. Yet before long, a sudden calamity would strike: his vessel would founder, leaving him stripped of his companions and resources. Clinging desperately to whatever debris floated within reach, he would swim for his life, eventually washing ashore on some unknown, perilous island. There, he was forced to endure captivity, hardship, and the sheer fight for survival.

Yet invariably, a call would reach him from a realm of unimaginable wealth. Piles of diamonds would materialize before him. Gathering these treasures, he would reach the coast just as a homeward-bound vessel appeared on the horizon to carry him back to Baghdad—where he would reappear as an intriguing, legendary figure, far wealthier than when he had departed.

As time passed, Sindbad would slowly forget the agonizing trials of his voyage—the days spent starving, parched, and facing death. The peaceful routine of his home and the familiar banter on his street corner would begin to feel suffocating.

The allure of the unknown proved far more intoxicating than the memory of past suffering. Unable to stay put, he would liquidate his possessions and set sail once more. Not once, not twice, but seven times the boundless ocean cast its net over him.

Sitting here on this serene autumn morning, bathed in soft sunlight, listening to vintage songs on the radio and reading world poetry, I find myself flooded by memories of my own past voyages—much like Sindbad. Yet my journeys were not undertaken across physical seas. They were voyages across the vast ocean of education—a realm containing treasures far more precious than all the jewels scattered across the world’s seven seas.

Like Sindbad’s voyages, my journey swung constantly between gain and loss. It held adventure, humiliation, failure, and heartbreak. Yet following every defeat, a profound sense of inner fulfillment poured over me.

Every field initiative was an experiment. During each trial, there were days when I swore to myself that this would be my final effort—that I would step away from the education sector forever.

Yet just as the call of the sea refused to let Sindbad rest, and just as lovers—unable to bear the grief of separation—swear never to meet again only to be drawn back together by an irresistible yearning, the world of education refused to let me go.

The Dreams of Education

I often reflect on why the call of education continues to upend my life, refusing to let me rest. I believe the answer lies in my dreams—so many dreams.

I do not know when these visions first took root within me. Perhaps it was in the ancient Adivasi village where I was born—nestled amidst lush, flower-laden mountains, under the shade of blue clouds, beside young calves—where our teacher, Vajramma Pantulamma, narrated stories from the Bible and the Mahabharata, offering my young mind its first faint glimpse of an ideal world.

Whenever a visionary lover of humanity speaks on behalf of their fellow human beings, those same dreams flood my consciousness anew. Whether reading Mahatma Gandhi or Jean-Jacques Rousseau’s Émile, whether listening to the Mother, Jiddu Krishnamurti, or Paulo Freire, I do not focus on their differences in perspective. What moves me above all is their shared imperative to speak on education—their inability to remain silent about it—and the intense passion that impels them to articulate their dreams. It is their vision that continually awakens my own.

A person may offer their fellow human beings valuable gifts, material goods, or practical encouragement. Yet the most precious gift one can bestow is education. By education, I do not mean textbooks, formal credentials, or vocational skills designed merely for earning a livelihood. Far above these, education is the offering of one’s spiritual essence (atmika saramsam).

Just as a bird teaches its fledgling to soar, or a tigress teaches her cub to hunt, a human being passes on their most precious essence—their shared humanity, the fundamental core by which one recognizes oneself as human. This is what Gandhi termed true education. While regional, cultural, and national methods of delivery may vary, the core essence being imparted remains universal.

There is a fundamental difference between how animals pass on basic survival instincts to their young and how humans transmit knowledge to future generations. Animals pass on mere survival skills—one-dimensional techniques necessary for biological existence. There is no true education in this process, nor is it multifaceted.

Rabindranath Tagore illustrates this distinction beautifully in The Religion of Man. He notes that for millennia, spiders have woven webs and bees have gathered honey with unmatched precision. Yet across evolutionary history, spiders remain confined to web-building and bees to hive-making. They have not taken a single step beyond these hardwired instincts, nor have they acquired capacities outside the fixed traits of their species.

In the animal kingdom, therefore, what passes from generation to generation is mere survival technique. With human beings, however, the transmission is vastly different. What is passed on is not mere physical strength or mental agility, but something far deeper—what Gandhi called Atma-vidya (knowledge of the Self), what Immanuel Kant described as human rationality, and what others might term moral consciousness. Literacy is not even a strict prerequisite for this transmission.

Anthropology offers countless examples of pre-literate and indigenous societies that cultivated profound cultural traditions to raise their children into ethical community members entirely without written scripts. Education, in its truest sense, is one generation passing a living culture to the next—a culture transmitted not through passive imitation or mechanical skill, but through learning to experience the joy of living. This is why great educators have consistently maintained that education is learning how to learn.

This was precisely Gandhi’s conviction: that education must train the child’s soul and awaken an inner light. It is not enough to view education as a powerful tool for social mobility or cultural integration; we must recognize it as a supreme source of human joy.

To read Plato’s Symposium or Shakespeare’s King Lear, to appreciate Japanese painting, African wood carving, or Indian Bharatanatyam, requires the sensibility of a lifelong student. For such appreciation, mere functional skills are insufficient. It demands a cultivated mind capable of building a harmonious world in communion with others.

Whenever I reflect on education, these are the dreams that stir within me: that all human beings might be drawn to the beauty of creation; that empathy for one’s fellow human beings should animate every action; that every morning should feel like an Upanishadic prayer; and that an evening walk should evoke the reflective depth of Henry David Thoreau.

I dream that every thought, word, and deed might become a wave of supreme joy (Sivananda Lahari)—that individuals might feel profound gratitude for the vibrant world around them, with its blooming gardens, flowing streams, blue skies, dragonflies, love poetry, and children’s laughter. Each person should be enabled to harmonize their dormant inner light with the broader symphony of human expression.

Whether this awakening is achieved through formal literacy or oral traditions; whether it unfolds through Montessori methods within a structured classroom, beneath mango groves in Santiniketan, or along the streets of ancient Athens where Socrates walked with his disciples—the specific mechanism matters little. What truly matters is the extent to which it enables the human soul to blossom.



Featured image: Socrates teaching in Athens, pc: https://www.greece-is.com

14-8-2026

3 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-34”

  1. విద్య అంటే ఒక తరం మరొక తరానికి జీవన సంస్కృతిని అందించడం. ఆ సంస్కృతి కేవలం అనుకరణ వల్ల అందేది కాదు. అది కేవలం నైపుణ్యం కూడా కాదు.

    అది జీవించడంలోని ఆనందాన్ని అనుభవించడాన్ని నేర్చుకోవడం. విద్య అంటే నేర్చుకోవడమెట్లానో నేర్చుకోవడమేనని…

    సార్వత్రిక విద్య గురించి అమూల్యమైన పుస్తకం ఇది.

  2. ఈ series లో మీ అనుభవాలన్నీ చదివిన తర్వాత ఈ ముందుమాట చదవడం మరింత meaningful గా వుంది సర్.

    “విద్య గురించి తలచుకున్నప్పుడల్లా నాకు తోచే కలలివే : మనుషులందరూ, సృష్టిలోని మహత్తర వైభవశీల అంశాలన్నిటిపట్లా ఆకర్షితులు కాగలగాలి. వాళ్ల ప్రతి ఒక్క కదలికలోనూ తోటి మానవుడి పట్ల అపార సహానుభవం తొణికిసలాడాలి. వారి జీవితాల మీద మేల్కొనే ప్రతి ఉదయమూ ఒక ఉపనిషత్ ప్రార్ధన కావాలి. వారి సాయంకాలపు వ్యాహ్యాళి థోరో రచనను తలపించాలి.

    వారు గడిపే ప్రతి ఒక్క క్షణం, తలపు, మాట, చేత ఒక శివానందలహరి కావాలి. అన్నిటికన్నా ముందు, తాము జీవిస్తున్నందుకు, తమ చుట్టూ ప్రపంచంలో పూలతోటలు, సెలయేళ్లు, నీలిమబ్బులు, తూనీగలు, ప్రేమకవితలు, పిల్లలనవ్వులు పొంగి పొర్లుతున్నందుకు వారు మహానంద పరవశులు కావాలి. ప్రతి ఒక్కరిలోనూ నిద్రాణంగా ఉన్న లోవెలుగును వారి వారి అభివ్యక్తికి అనుగుణంగా ప్రపంచ సంగీతంలో గొంతుకలపాలి.”

    Beautifully said, Sir. ఎంత గొప్ప కలలు!!

    ఆ కలలను నిజం చేయాలన్న మీ తపన, చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఈ సిరీస్‌లో అడుగడుగునా కనిపించాయి.
    🙏🏽🙏🏽🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading