జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-2

మనం రాసుకున్న నెరేటివ్‌ ప్రకారం కందుకూరి వీరేశలింగంతో తెలుగునాట ఆధునిక చైతన్యం మొదలయ్యింది. గురజాడ అప్పారావుతో సాహిత్య సంస్కారం బలపడింది. రాయప్రోలు సుబ్బారావుతో భావకవిత్వ యుగం మొదలయ్యింది. చివరికి ముద్దుకృష్ణ వైతాళికుల్లో కూడా గురజాడ దేశభక్తి, రాయప్రోలు జన్మభూమి గీతాలు తప్ప పైన పేర్కొన్న గీతాలేవీ కనిపించవు. కానీ నిశితంగా చూస్తే, వీరేశలింగానికీ, గురజాడకీ తర్వాతా, భావకవిత్వానికి ముందూ కవిత్వం నిప్పులు చిమ్మిన కాలం ఒకటుంది. అది ఆధునిక భారతదేశ చరిత్రలో సంస్కరణవాద యుగానికీ, గాంధీయుగానికీ మధ్య ఉండే ఒక ప్రత్యక్ష రాజకీయ దశ. అందులో వందేమాతరం ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, బెంగాల్‌ నుంచి తిరునెల్వేలిదాకా కొనసాగిన టెర్రరిస్టు బలిదానాలూ ఉన్నాయి.

తెలుగు సాహిత్యంలో ఆ దశ ఎప్పుడు మొదలయ్యిందో మనం సులువుగా గుర్తుపట్టవచ్చు. అది బిపిన్‌చంద్ర పాల్‌ రాజమండ్రి వచ్చినప్పుడు 1907 లో ఏప్రిల్‌ 19 న చిలకమర్తి ‘భరతఖండంబు చక్కని పాడియావు’ పద్యం చదివిన రోజున మాత్రమే కాదు, ఆ ఏడాదే మే 9 న లాలా లజపత్‌ రాయ్‌ అరెస్టయినప్పుడు ‘చెరసాలల్‌ పృథుచంద్రశాలలె యగున్’ అని చిలకమర్తి మరో పద్యపరంపర చదివినప్పుడే కాదు, అంతకన్నా సూక్ష్మమైన సందర్భం మరొకటుంది. ఆ యేడాదే వీరేశలింగం పురమందిరంలో నాళం కృష్ణారావు ఖుదీరాంబోస్‌ చిత్రపటం తగిలించిన రోజు కూడా. వీరేశలింగంగారి స్వీయచరిత్ర మూడవప్రకరణంలో ఆ వైనం మనల్ని నివ్వెరపరుస్తుంది. ఆ పటాన్ని అక్కడనుంచి తీసెయ్యమని వీరేశలింగం చెప్పినా కూడా నాళం కృష్ణారావు ఆ పటాన్ని అక్కడే ఉంచినందుకు ప్రభుత్వం వీరేశలింగాన్ని సంజాయిషీ అడిగింది. నాళం కృష్ణారావుని ఏమీ చెయ్యలేక, వీరేశలింగం  ఆ పురమందిరంతో సంబంధం తెంచుకున్నాడు.  జాతీయవాద రాజకీయోద్యమంతో సంస్కరణ ఉద్యమం  తెగతెంపులు చేసుకున్న ఘట్టం అది.

గురజాడ అప్పారావు సంగతి చూద్దాం. పందొమ్మిదో శతాబ్ది తెలుగు సాహిత్యంలో కాంగ్రెసు ప్రస్తావన చేసిన ఏకైక రచయిత ఆయన. 1892 లో ప్రదర్శించిన కన్యాశుల్కం మొదటికూర్పులో రెండవ అంకంలో వెంకటేశంతో మాట్లాడుతో తాను బండివాడితో నేషనల్‌ కాంగ్రెసు గురించి రెండు ఘంటలు లెక్చరు ఇస్తే వాళ్ల ఊరు హెడ్‌ కాన్‌ స్టేబుల్‌ని ఎప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు అంటాడు గిరీశం. కాంగ్రెసు ఏర్పడ్డ ఏడేళ్ళకే ఒక తెలుగు నాటకరచయిత ఇటువంటి సూక్ష్మదృష్టి కనబరచడం అబ్బురమేగాని,  స్థానికజీవితం క్షాళితం కాకుండా జాతీయస్థాయి రాజకీయోద్యమాలు సాధించగలిగే మార్పు చాలా తక్కువనే ఒక నిరాసక్తత కూడా ఇందులో ఉందని గుర్తించాలి. అప్పుడు కాంగ్రెస్ పట్ల అటువంటి నిరాసక్తతని కనపరిచినవాడే తిరిగి  కాంగ్రెసు మీద ఒక కవిత రాసాడు.  1908 లో జరిగిన మద్రాస్‌ కాంగ్రెస్‌ సభలో కాంగ్రెస్ నాయకులు గట్టిగా నోరుమెదపలేకపోతున్నారనీ, వాళ్ళని ద్వీపాంతరం పంపిస్తారని భయమేమో అంటో ఎద్దేవా చేసిన ఆ కవితని గురజాడ ఇంగ్లిషులో రాసాడు. ఆ కవితలో వినిపిస్తున్న అవహేళనకు మురిసిపోయి శ్రీ శ్రీ దాన్ని తెలుగు చెయ్యకుండా  ఉండలేకపోయాడు.

కాని గురజాడకి తెలియనిదేమంటే, మద్రాసు కాంగ్రెస్‌ 1908 డిసెంబరులో జరగడానికి ఆరునెలల ముందే 1908 జూలైలో, ఒక తెలుగు రచయిత, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని చెండాడుతూ తెలుగులోకి రాసిన సంపాదకీయాలకు గాను రాజద్రోహ నేరం మీద మూడేళ్ళ కఠిన కారాగారశిక్షకి గురయ్యాడు. ఆ ఉదంతం గురించి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రాసుకున్న ఈ మాటల్ని మీకు పూర్తిగా చదివి వినిపించాలని ఉంది. ఆయనిలా అంటున్నాడు:

”మా కేసు విచారణ చేసిన న్యాయమూర్తి కెర్షాన్షు ఒక పార్శీ పెద్ద. నా యందు ఎనలేని దయగలవాడాయెను. దానికి కారణము ప్రాసిక్యూషను వారు నా దురాలోచనలను రుజువు చేయడానికి సాక్ష్యముగా తెచ్చిన నా ‘శివాజీ ఉత్సవపు టుపన్యాసము’. ప్రాసిక్యూటరు దానిని చదివి వినిపిస్తుంటే న్యాయమూర్తికి పరవశము కలిగిపోయింది. అతడు నన్ను నిర్దోషిగా ప్రకటించి విముక్తుణ్ణి చేస్తాడేమో యని మాకే భయం కలిగింది. అట్లా వదిలిపెడితే పోలీసువారు వేరే కేసుపెట్టి అయిదేండ్లు శిక్ష వేయింపిస్తారని మా భయం. కాబట్టి కెర్షాన్సుగారు తేలికగా శిక్ష వేయడమే మేలనే సూచన ఆయనకు అందింది. ఆయన నాకు ఆరునెలలు సింపిల్‌ ఖైదు విధించెను. గవర్నమెంటు అంగీకరిస్తుందా? ఎక్కువ శిక్షకొరకు హైకోర్టుకు అపీలు పెట్టింది. న్యాయమూర్తులైన జస్టిస్‌ బెన్‌ సన్‌, మిల్లరులు నా ఖైదును మూడేండ్లు కఠిన శిక్షకు పెంచారు. నా యందు దయచూపిన జడ్జి కెర్షాన్సు ముప్పుతిప్పలు పడవలసి వచ్చెను. సర్కారు ఉద్యోగమే మానుకుని బారిస్టరుగా వుండిపోవలసి వచ్చెను. అట్టి ఉదారహృదయుణ్ణి నేను విస్మరింపగలనా? విస్మరించవచ్చునా?”

ఈ వాక్యాలు చదివినప్పటినుంచీ జడ్జిని కూడా పరవశుణ్ణి చేయగల ఆ వ్యాసం చదవాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాను. కాని అదిప్పటికీ నాకు లభ్యం కానేలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం మన సాహిత్య చరిత్రనే జాతీయోద్యమకారుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించదని చెప్పడానికి. గురజాడ కాంగ్రెస్‌ మీద రాసిన కవితను మనకి అందించిన సాహిత్యచరిత్రకారులు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సంపాదకీయాల్ని ఎందుకు అందించలేకపోయారు?

మీకు తెలుసా? ఈ రోజు సాహిత్య అకాడెమీ ఇలా ఒక గోష్టి నిర్వహించినట్టే, మహాత్ముడు కూడా ఒకసారి భారత జాతీయోద్యమ కవుల్తో సబర్మతి ఆశ్రమంలో ఒక గోష్టి నిర్వహించారని? గురజాడ రాఘవశర్మ ఆ సందర్భం గురించి ఇలా రాస్తున్నారు:

‘గాంధిగారొకనాడు జాతీయగీతముల రచయితల సమావేశము యేర్పరచి, సబర్మతి ఆశ్రమమున వివిధ రాష్ట్రములతో పాటు గరిమెళ్ళను కూడా పిల్వగా గరిమెళ్ళ హాజరైరి. గాంధిగారి ఆజ్ఞానుసరణి యెవరి పాట వారు పాడి వినిపించారు. గరిమెళ్ళ స్వీయ వీరావేశ గేయమొకటి పాడి ‘దీనికి బహుమతి ఒక సంవత్సరము శ్రీకృష్ణ జన్మస్థానము లభ్యమైనది’ అన్నారు. అనగా గాంధిగారు నమ్మలేదు… సాక్ష్యము ధృవమైన తరువాత నమ్మక తప్పలేదు, అంతియె కాదు. గాంధిగారు తారస్థాయినందుకొన్న ఆ పాట విని ఆశ్చర్యచకితులై మిగతా కవిగణమునకు సలహానిచ్చినారు, ఈ బాణిలో మీరందరు కూడా గేయములు వ్రాయుడని. అది మన గరిమెళ్ళకు గాంధిగారిచ్చిన యోగ్యతాపత్రము.’

శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం ఇచ్చిన యోగ్యతాపత్రం గురించే మనకు తెలుసుగాని, గరిమెళ్ళకు గాంధీ ఇచ్చిన ఈ యోగ్యతాపత్రం గురించి తెలియనే లేదు.

కాని కాలం జాతీయోద్యమ కవుల పక్షానే నిలిచింది. తర్వాత రోజుల్లో తిరిగి మళ్ళా ప్రజలు తమ సాంఘిక, రాజకీయ అసంతృప్తిని, అసమ్మతిని ప్రకటించడానికి గరిమెళ్ళ బాటనే పట్టారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండులు మొదలుకుని గద్దర్‌ దాకా కూడా తెలుగులో ఒక అవిచ్ఛిన్న గేయకారపరంపర కొనసాగుతూ వస్తున్నదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

సాహిత్య చరిత్రలో జాతీయోద్యమ సాహిత్యానికి లభించిన నిరాదరణ కవిత్వానికి మాత్రమే పరిమితం కాదు. మాలపల్లి నవల పట్ల కూడా మనం చూపించవలసినంత గౌరవం చూపించలేదనే అనుకుంటున్నాను. తెలుగు వికీపీడియాలో మాలపల్లి నవల గురించిన వ్యాసం రాసిన రచయిత ఎవరోగాని, ఆయన ఆ నవల ప్రాముఖ్యతను అన్ని పార్శ్వాల్లోనూ అద్భుతంగా పట్టుకున్నాడు. తెలుగులో అభ్యుదయ సాహిత్యం అంటూ మొదలయ్యింది ఆ రచనతోనే అని రాసాడాయన. అంతేకాదు, ఈ నాడు మనం చర్చించుకుంటున్న వర్ణం, వర్గం, జెండర్‌ లాంటి మౌలిక అంశాల పట్లా ఆ నవల్లో జరిగిన చర్చ ఇంతదాకా తెలుగులో మరే పుస్తకంలోనూ మనకి కనిపించదు. ఎన్‌. జి. రంగా దాన్ని వార్‌ అండ్‌ పీస్‌ తో పోల్చదగ్గ నవల అని అన్నారట. కాని వార్‌ అండ్‌ పీస్‌ లో లేని పాటలు మాలపల్లిలో ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఆధునిక ప్రపంచ సాహిత్యంలో మాలపల్లి లాంటి నవల లేదని చెప్పవచ్చు. అందులో సంగదాసు పాడిన తత్త్వాలు, తక్కెళ్ళ జగ్గడి బోధలు సరిగ్గా గరిమెళ్ల తరహా గీతాలు. అందుకనే ఆ నవలని నాటకీకరణ చేసిన నగ్నముని తన నాటకాన్ని తక్కెళ్ళ జగ్గడి గీతంతోటే ఎత్తుకున్నాడు. ఆ పాటలు వాటికవే ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా గుర్తించదగ్గవి. గురజాడ ముత్యాలసరాలకు ఏ మాత్రం తీసిపోని కవిత్వం అది. కాని ఎవరేనా ఇప్పటిదాకా మాలపల్లిలోని పాటలమీద ప్రత్యేకంగా విశ్లేషణ చేసి ఉన్నారా? నాకు తెలియదు.

జాతీయోద్యమ సాహిత్యం మన సాహిత్య చరిత్ర నెరేటివ్‌ లోంచి తప్పిపోవడం ఒక విషయం. అసలు మన స్వాతంత్య్రోద్యమ చరిత్రకే సరైన నెరేటివ్‌ని మనం నిర్మించుకోలేకపోయామనేది మరొక విషయం. మన జాతీయోద్యమ చరిత్ర చూడండి. అది దాదాపుగా 1857 తిరుగుబాటుతో మొదలవుతుంది. కాని నైజాంలో స్వాతంత్య్రోద్యమ చరిత్ర 1812 లోనే మొదలయ్యింది. 1812 నుంచి 1857 దాకా నైజాం రాజ్యంలో తలెత్తిన తిరుగుబాట్ల గురించి చదువుతూ ఉంటే మన ఒళ్ళు ఉప్పొంగిపోతుంది. ఆ కాలంలో ఆ పోరాటాల గురించి ఎటువంటి సాహిత్యం వచ్చి ఉంటుంది? ప్రజలు ఎటువంటి పాటలు పాడుకుని ఉంటారు? మనకు తెలియదు. రాంజీగోండ్‌ ఉజ్వల పోరాటగాథ మీద కృషి చేసిన ద్యావనవల్లి సత్యనారాయణని రాంజీగోండ్‌ చుట్టూ ఏదైనా సాహిత్యం గోండుల్లో మౌఖికంగా ప్రచారంలో ఉందా అని అడిగాను. ఇంకా తెలుసుకోవలసి ఉందనే ఆయనన్నాడు. రాయలసీమలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కొంత ప్రసిద్ధి లభించింది. కానీ కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ మీద ఉన్న వహాబీ ఉద్యమ ప్రభావం గురించి మనం తెలుసుకోవలసినంతగా తెలుసుకోనేలేదు.  పనప్పాకం ఆనందాచార్యులు భారతజాతీయ కాంగ్రెసు ఏర్పడ్డప్పుడు అందులో సభ్యుడైన మొదటి తెలుగువాడు. ఆరేళ్ళు తిరక్కుండానే ఆయన నాగపూర్‌ కాంగ్రెస్‌ సభకి అధ్యక్షత వహించే స్థాయికి చేరుకున్నాడు. ఆయన రాసిన వ్యాసాలు, ఉత్తరాలు మనమేవైనా భద్రపరచగలిగామా?

స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ముస్లిముల పాత్ర గురించి రాస్తూ సయ్యద్‌ నసీర్‌ అహ్మద్‌ 1780 లోనే విశాఖపట్నంలో సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ అనే సిపాయి తిరుగుబాటు చేసాడని రాసారు. ఇక భారతదేశమంతటా గిరిజనులు తిరుగుబాట్లు చేసినప్పటికీ, గంజాం ప్రాంతంలో 1830 లో తలెత్తిన గుంసూరు తిరుగుబాటువల్లనే గిరిజన ప్రాంతాల్లో పాలనావిధానాన్ని ఈస్టిండియా కంపెనీ సవరించుకోవలసి వచ్చింది. ఇప్పుడు భారతరాజ్యాంగం అయిదవ షెడ్యూలు, ఆరవషెడ్యూలులో పొందుపరిచిన పాలనావిధానానికి మూలం ఒకప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన గంజాం జిల్లా గిరిజనుల తిరుగుబాటే అని ఎన్నిసార్లు చెప్పడానికేనా నాకు విసుగు ఉండదు.  ఇలా జాతీయోద్యమంలో ముస్లిములు, దళితులు, గిరిజనులు, స్త్రీలు నిర్వహించిన పాత్ర అపారం. వారి పోరాటాలకు చెందిన ఎన్నో చరిత్రలు, ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. కులమతాలకు అతీతంగా సాగిన పోరాటం అది.

మీరు కొత్లాపురం మఠం రాచయ్య పేరు విన్నారా? ఆయన మహబూబ్‌ నగర్‌ జిల్లాకి చెందిన వీరశైవుడు. 1937 లో మహాత్ముడు గుంటూరు వచ్చినప్పుడు నైజాం నుంచి పెద్ద ఎత్తున సత్యాగ్రహులు ఆయన్ని కలవకుండా ఉండటానికి నిజాం గుంటూరు దారినవెళ్ళే రైళ్లన్నీ రద్దుచేసాడు. కాని రాచయ్య ఇద్దరుముగ్గురు మిత్రుల్తో కలిసి గాంధీని చూడాలన్న కోరికతో మహబూబ్‌ నగర్‌ నుంచి గుంటూరు నడిచివెళ్ళిపోయాడు. గాంధీని కలుసుకున్నాడు. ఆ స్ఫూర్తితోటే మహాత్ముడి జీవితచరిత్ర మొత్తాన్ని శ్రీమహాత్మగాంధి అనే అయిందంకాల episodic play  గా రాసాడు. ఆ నాటకం కనీసం వందసార్లు ప్రదర్శించబడిరదని విన్నాను. సాహిత్యమూ, ఉద్యమమూ ఇలా ఒకదాన్నొకటి పరస్పరం ప్రభావితం చేసుకున్న సంఘటనలు ఎన్నో ఇప్పటికే పౌరస్మృతిలోంచి తొలగిపోతున్నాయి. ఇటువంటి micro narratives  ని ఏరి తెచ్చుకుని ఒక grand narrative ని కూర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మా హీరాలాల్‌ మాష్టారు తరచు నాతో అంటుండేవారు: అంధ్రప్రాంతంలో జాతీయోద్యమం అంటే గ్రంథాలయోద్యమమేరా అని. ఆ మాట తెలంగాణాకి కూడా వర్తిస్తుంది. పంతొమ్మిదో శతాబ్దిలో కత్తితో చేసిన పోరాటం రెండుచోట్లా కూడా ఇరవయ్యవ శతాబ్దంలో కలంతో చేసారు. గ్రంథాలయాల ద్వారా, పత్రికల ద్వారా కవులూ, రచయితలూ, పత్రికా సంపాదకులూ, ప్రచురణ కర్తలూ జాతీయోద్యమంలో నిర్వహించిన పాత్ర మామూలు పాత్ర కాదు. అంధ్రలో సరే, తెలంగాణాలో కూడా విజ్ఞాన చంద్రిక గ్రంథమాల, అణా గ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల వంటి ప్రచురణసంస్థలు పోరాటకేంద్రాలుగా నడిచేయని మనకు తెలుసు. నిజానికి విజ్ఞాన చంద్రిక గ్రంథమాల మొదటి ప్రచురణ ‘అబ్రహాం లింకన్‌’ రచన చేసిందే గాడిచర్ల.  రెండు చోట్లా కూడా జాతీయోద్యమాన్ని ప్రజ్వరిల్లచేసిన పత్రికల జాబితా చాలా పెద్దది.  బ్రిటిష్‌ ప్రభుత్వానికి కాళ్ళకింద మంటలు పుట్టించిన ఎన్నో సంపాదకీయాలు ఆ పత్రికల్లోంచి బయటకు రానేలేదు.

సంపాదకీయాలు మాత్రమే కాదు, ఎన్నో కథలు, ఎంతో కవిత్వం కూడా ఆ పత్రికల్లోంచి సంకలనాల్లోకి ఎక్కనేలేదు. ఉదాహరణకి, మహాత్ముడు భారతదేశానికి రాకముందే ఆయన్ని ప్రశంసిస్తూ 1912 లోనే పట్టాభి సీతారామయ్య కృష్ణాపత్రికలో పద్యాలు రాసారని ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి గాంధీమీద వచ్చిన కవిత్వంలో భారతదేశం మొత్తం మీద అవే మొదటి పద్యాలు. కాని ఇప్పుడు చదవాలంటే అవి ఎక్కడ దొరుకుతాయి? చివరికి గురజాడ రాఘవశర్మ సంకలనంలో కూడా అవి నాకు కనిపించలేదు.

కాబట్టి- ఒకటి, మన జాతీయోద్యమ చరిత్రను మళ్లా సమగ్రంగా తిరిగి రాసుకోవడం, రెండోది, ఆ ఉద్యమం వల్ల ప్రభావితమై తిరిగి మళ్ళా ఆ ఉద్యమాన్ని ప్రభావితం చేసిన జాతీయోద్యమ సాహిత్యానికి మన సాహిత్య చరిత్రలో తిరిగి సముచిత స్థానం కల్పించడం. సాహిత్య అకాడెమీ నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు ఈ రెండు అంశాలకీ ఎంతో దోహదపడగలదని భావిస్తూ నాకీ అవకాశాన్నిచ్చిన అకాడెమీకి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.

Featured image: Wikicommons

29-08-2023

6 Replies to “జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-2”

 1. ఎన్నో తెలియని విషయాలు తెలిపారు. ఈ దిశలో పరిశోధనలు కొనసాగితే “ మనకు తెలియని మన చరిత్ర” పురుడు పోసుకోవచ్చు. మీ సమాచార సేకరణ అనన్య సామాన్యం. మీకు ప్రణామాలు.
  కిరణప్రభ గారి ఒక ప్రసంగం విని ఆశ్చర్యపోయి ఆ తరువాత సమాచారం సేకరించి ఒక గొప్ప దేశభక్తుని చరిత్ర మాత్రాచ్ఛందస్సులో
  క్రాంతివీరుడు
  *******************
  (పండిత్ శ్యామ్ జీ కృష్ణవర్మ)
  (ఇది మీకు వాట్సప్ లో పంపుతాను)
  అని రాసే అవకాశం కలిగింది. అది తానావారి పోటీ లో ప్రచురణార్హమైన మైన జాబితాలో ఉండటం ఒక చిరుతృప్తి. జీవితాన్ని విదేశాల్లో ఉండి దేశానికి అంకితం చేసిన ఒక అబ్రాహ్మణ మాన్య సంస్కృత పండితుడి చరిత్ర ఈ నాటికీ చాలా మందికి తెలియక పోవడం మనం సాహిత్య రంగంలో ఎంత వెనుక బడి ఉన్నామో తెలుస్తుంది.
  పేరుకోసం ప్రాకులాడే నవతరం కవులను కనులు తెరిపించే కొత్త వెలుగొకటి కావాలి రావాలి.

Leave a Reply

%d bloggers like this: