
Rilke: Leonid Pasternak, PC: Wikicommons
బైరాగి ‘ఆగమగీతి’ 1983 లో వచ్చింది. నలభయ్యేళ్ళయింది ఆ పుస్తకాన్ని మొదటిసారి చేతుల్లోకి తీసుకుని. అందులో ప్రతి ఒక్క కవితనీ ఎన్నిసార్లు చదివివుంటానో లెక్కలేదు. అందులో ఆయన అనువాదకవితలు కూడా ఉన్నాయి. బహుశా శ్రీ శ్రీ తరువాత యూరపియన్ కవుల్ని అంతగా అనువదించి పరిచయం చేసిన కవి బైరాగినే అనుకుంటాను. కాని పాల్ యులార్డ్ తప్ప శ్రీ శ్రీ, బైరాగి ఇద్దరూ అనువదించిన యూరపియన్ కవులెవరూ లేరు. కాగా ఇలియట్, గిలాం అపొలినార్ లాంటి మాడర్నిస్ట్ కవుల్ని శ్రీ శ్రీ ఎప్పటికీ అనువదించి ఉండేవాడు కాడు. అలానే సుమిత్రానందన్ పంత్, బాల సీతారాం మర్దేకర్, విందా కరందీకర్, జీవనానందదాస్ లాంటి భారతీయ కవుల్ని కూడా శ్రీ శ్రీ అనువదించి ఉండేవాడు కాడు. ఎలా చూసినా, శ్రీ శ్రీ అనువాదాల్లో వదిలిపెట్టిన ప్రపంచాన్ని బైరాగి పూర్తిచేసాడు. నా వరకూ ఆ ఇద్దరూ ప్రపంచానికి తెరిచిపెట్టిన రెండు కిటికీల్లాగా ఉండేవారు.
ఆగమగీతిలోని అనువాద కవితల్లో రిల్క కవితలు కూడా మూడున్నాయి. బహుశా రిల్కని తెలుగులోకి అనువదించిన మొదటి కవి బైరాగి అనే అనుకుంటున్నాను. మరెవరైనా, శేషేంద్ర, ఇస్మాయిల్ వంటివారు అనువదించారేమో నాకు తెలియదు, కాని వాళ్ళు అనువదించినా బైరాగి తర్వాతే. ఆ మూడు కవితలూ నేనెన్ని సార్లు చదువుకుని ఉంటానో చెప్పలేను.
ఇవాళ ఒక మిత్రురాలు అడిగారు: నిర్వికల్ప సంగీతంలో రిల్క కవితలు ఎందుకు లేవు అని. అందులో జర్మన్ కవిత్వానికి గొథే రాసిన ‘ప్రొమీథియస్ ‘కవితను అనువదించాను. రిల్కను నేను అప్పటికి అర్థం చేసుకోగల స్థితిలో లేను. ఆశ్చర్యమే, గొథేని అనువదించానుగాని, రిల్కను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పడం. కాని అది నిజమే. గొథే వంటి క్లాసిసిస్టు, షెల్లీ వంటి రొమాంటిసిస్టు, నెరుడా వంటి సోషలిస్టు అర్థం కావడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. వారి కవిత్వం emotionally charged utterance కాబట్టి, అది నేరుగా హృదయంలోకి ప్రవేశిస్తుంది. కాని రిల్క? అతణ్ణి ఏమని పిలవాలి?
అప్పటికి నాకు తెలిసి తెలుగు కవిత్వమంటే రెండు రకాల అభివ్యక్తి మాత్రమే. అనుభూతిని ప్రకటించడం లేదా అభిప్రాయాలు ప్రకటించడం. ఎవరో ఇస్మాయిల్ వంటివారు ఇమేజిస్టు ధోరణిలో పదచిత్రాల్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తుండేవారు. కాని రిల్క రాసిన Buddha అనే కవితకి బైరాగి చేసిన అనువాదం చదివినప్పుడు అందులో అనుభూతికన్నా, అభిప్రాయప్రకటనకన్నా, పదచిత్రాలకన్నా భిన్నమైందేదో కనిపించింది. ఎంత ప్రయత్నించీ అదేమిటో బోధపరుచుకోలేకపోయాను. ఆ కవితను ఈ నలభయ్యేళ్ళలో వందసార్లేనా చదివి ఉంటాను. కాని ఎప్పటికప్పుడు అది నాకు అందుతూనే అందకుండా జారిపోయేది.
ఇప్పుడు ఇన్నాళ్ళకు సాహసించి ఈ కవితను నేను కూడా తెలుగు చేసాను. బైరాగిని దాటి చెయ్యగలనని కాదు, బైరాగి అనువదించిన కవితను నేను కూడా అనువదించానని నాకు నేను చెప్పుకోడానికి.
రిల్క బుద్ధుడి మీద మూడు కవితలు రాసాడు. New Poems (1907) లో Buddha పేరు మీద రెండు కవితలు, New Poems: Other Part (1908) లో Buddha in Glory పేరుమీద మరొక కవిత. ఇక్కడ Buddha అనే మొదటి కవితనే బైరాగి అనువదించాడు. రిల్క కవితకు ఎడ్వర్డ్ స్నో అనువాదం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఇందులో cat అనే ఇంగ్లిషు పదం జర్మన్లో ‘జంతువు’ (tier) అని మాత్రమే ఉంది. నా అనువాదంలో ఆ పదాన్ని పూర్తిగా వదిలేసాను. కాని బైరాగి దాన్ని ‘గంభీర ధీర మృగం’ అని అనువదించడం గమనించాలి.
అలూరి బైరాగి
బుద్ధుడు
అతడేదో వింటున్నటులే ఒక సంపూర్ణ శాంతి
దూరంగా మనం ఆగగా వినిపించదు మనకింక
అతడు నక్షత్రం మనకనులకేమి కనుపించదింక
దూరేతర నక్షత్రాల విస్తారం అతని క్షాంతి.
అతడు శేషం, మనం అతని మ్రోల నిలుచున్నది
అతడు కనగలందులకా? ఏమవసరమతనికి అది
మనం అతనిమ్రోల ప్రణమిల్లినా అతడు
ఒక గభీరధీరమృగంలా అసలు లక్ష్యపెట్టడు
ఏమనగా దేనికి ప్రణమిస్తున్నామో నేడు
అది అతనిలో భ్రమియించింది వేల ఏండ్ల నాడు
మనకనులకి తడితేగలదానినతడే మరచినాడు
మనకు శాస్తి, అతడు తనలో తాను నిండియున్నాడు.
వాడ్రేవు చినవీరభద్రుడు
బుద్ధుడు
అతడేదో విన్నట్టే వుంది. నిశ్చలం, సుదూరం…
మనం ఉలిక్కిపడి-దాన్ని పట్టించుకోడం మానేస్తాం.
అతడో బృహత్తార. మనం చూడలేని అసంఖ్యాక
తారాసముదాయం ఆయన చుట్టూ నిలబడి ఉంది.
అతడు సమస్తం. మనమిక్కడ ఎదురుచూస్తున్నది
ఆయన మనల్ని చూడాలనేనా? ఆయనకేం పని?
మనం కట్టకట్టుకుని ఆ పాదాలముందు పడినా,
విశ్రాంతిగా, ప్రశాంతిగా కనులరమోడ్చి ఉండగలడు.
మనల్ని ఆ పాదాలకు చెంతకు లాక్కుని వచ్చిందేదో
వేలవత్సరాలుగా ఆయనలో పరిభ్రమిస్తున్నదే.
జీవితం మనలో ఉద్రేకిస్తున్నదాన్ని మరిచినవాడుగా
మనం నోచుకోని వివేకాన్ని నిండుగా జీవిస్తున్నాడు.
Edward Snow
BUDDHA
As if he listened. Stillness: Something distant. ..
We check ourselves-and cease to hear it.
And he is star. And multitudes of giant stars
That we don’t see stand all around him.
He is everything. Are we really waiting here
For him to see us? What would he require?
And if instead we threw ourselves before him,
He’d remain deep and idle as a cat.
For what drags us roughly to his feet
Has circled in him for a million years.
He, who forgets what life instills in us
And lives in the wisdom we’re denied.
కవిత్వాన్ని అనువదించడమెప్పుడూ చాలా కష్టమనిపిస్తుంది నాకు .మూల భాషలో వ్యక్తమైనది మరో భాషలో తేవడం సులభం కాదు .
ఉదాహరణకు Snow What would he require అన్నదాన్ని బైరాగి ఏమవసరమతనికి ,అన్నారు ,మీరు అతనికేం పని అన్నారు .జర్మన్ లో ఏమాట వాడారో తెలియదు .మీ ముగ్గురి అనువాదమూ వేర్వేరు అర్థాల్ని ఇస్తున్నది .
ఇదే ఎప్పుడూ నా భయం .అందుకే వచనం అనువదించినంత ధైర్యంగా కవిత్వం చేయలేను .
కానీ, అనువదించాలి. మరొకరి కోసం కాదు. మన కోసమే.
బైరాగి, చినవీరభద్రుడు పదాలు వేరు వేరు అర్ధాన్ని ఇస్తున్నాయా?కళ్యాణి గారూ నాకు అలా అనిపించలేదే!!
నాకూ అదే సందేహం వచ్చిందండీ.
రిల్క బుద్ధ కవితను అనువదించిన మీ ఇరువురి కవితలు చదివిన తరువాత అనిపించేదేమంటే నలభై ఏళ్ల క్రింది కవితాభివ్యక్తి కి , ఇప్పటి కవితాభివ్యక్తికి తారతమ్యం చాలా ఉంది అని.
కింద ఆంగ్లానువాదం కూడా ఉంది కనుక మీ అభివ్యక్తి స్పష్టంగానూ దగ్గరగానూ ఉందనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక కవితానువాదాభ్యాస ప్రక్రియ, కవితాధ్యయన ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలిపే ప్రయత్నం బాగుంది.
ధన్యవాదాలు సార్
బుద్ధుడు..
మనం చేష్టలుడిగి.. చెవులురిక్కించినా వినబడని సుదూర నిశ్శబ్దాన్ని ఆయన ప్రశాంతంగా వింటున్నట్టే ఉంది..
వేల వేల అదృశ్య నక్షత్రాల మధ్య వెలిగిపోయే నక్షత్రం ఆయన..
ఆయన దృష్టి పటలంలో పడాలనా మన ఎదురుచూపులు?
సృష్టి సమస్తాన్ని తనలో నింపుకున్న పరిపూర్ణుడాయన.. మనతో ఆయనకేమీ పని?
మన సమస్తం సమర్పించి ప్రణిపాతం చేసినా పట్టని నిశ్చలగంభీరుడు ఆయన.
మనని ఆయన పాదాల వద్దకు ఈడ్చుకొని వస్తున్నదేదో.. వేల వేల సంవత్సరాలుగా ఆయనలో నిండి నిబిడీకృతమై ఉన్నది..
మనకు జీవితం ఇచ్చే సంకల్ప వికల్పానుభూతులను మర్చిపోయిన ఆయన.. మనకు అందని నిర్వికల్ప ఆత్మానందంలో రమిస్తున్నాడు..
..
ఇదో చిన్న అనువాద ప్రయత్నం గురువుగారు..
అద్భుతంగా చేశారు! హృదయపూర్వక అభినందనలు!🙏
అద్భుతమైన కవితని పరిచయం చేశారు.
ఎన్నోసార్లు చదివాక కొంచెం అర్థమైందన్పించింది. హృదయపూర్వక ధన్యవాదాలు.
ధన్యవాదాలు మేడం
కవిత్వానికి అవధులుండవని నిరూపించారు. అభినందనలు.
ధన్యవాదాలు