ఆ వెన్నెల రాత్రులు-29

దాన్ని అంటిపెట్టుకుని ఏకంగా ఒక అడవిమొత్తం నాదాకా ప్రయాణించి వచ్చింది. దానిమీద మాఘఫాల్గుణాల వెన్నెల కురిసి ఉంటుంది. నక్షత్రధూళి రాలి పడి ఉంటుంది. ఆ పువ్వు రంగులు పోసుకుంటున్నప్పుడు ఎంతో సూర్యరశ్మి దాని ఈనెల్లోకి ప్రవహించి ఉంటుంది. అప్పటికే సగం వాడిపోతూ ఉన్న ఆ పువ్వుని చేత్తో పట్టుకున్నాను. భగవంతుడా! అతని ఉత్తరాలు, మాటలు, చివరికి ఆ కవితలు కూడా చొరలేని ఏదో తావుని ఆ తేనెమరక స్పృశించింది. అది నా గుండె మీద సన్నని గాటుపెట్టింది.