తెలుగు అధ్యయనాలకు స్వాగతం

పారిస్ లో National Institute of Oriental Languages and Civilizations  సంస్థలో Department of Indian, South Asian and Tibetan Studies విభాగం ఉంది. వారు ఈ నెల 25 నుండి 29 దాకా First European Symposium on Telugu Studies నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా  ఈ రోజు తెలుగు భాష పైన ఏర్పాటు చేసిన వివిధ ప్రసంగాల్లో, తెలుగు వికాసం మీద మాట్లాడమని నన్ను కూడా ఆహ్వానించేరు. ఫ్రాన్సు, రష్యాలతో పాటు వివిధ ఐరోపీయ దేశాల్లో తెలుగు బోధిస్తున్న విదేశీ అధ్యాపకులతో పాటు, తెలుగు నేర్చుకుంటున్న విదేశీ విద్యార్థులు కూడా ఈ ఆన్ లైన్ సదస్సులో పాల్గొన్నారు. ఈ విధంగా ఒక అంతర్జాతీయ గోష్ఠిలో తెలుగు గురించి మాట్లాడే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషమనిపించింది.

ఈ గోష్టిని ఏర్పాటు చేసిన ప్రొఫెసరు అనూరాధగారు ఈ సదస్సు ఉద్దేశాల్ని వివరిస్తూ ఒక concept paper పంపించారు. వారం రోజుల కిందట ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పిందీ, ఈ పత్రంలో ఉన్నదీ ప్రధానంగా ఒకటే విషయం. విదేశాల్లో, ముఖ్యంగా యూరోపులో తెలుగు అధ్యయనానికి ముందుకొచ్చే విద్యార్థులకి తెలుగుని కేవలం ఒక సాహిత్యభాషగా మాత్రమే కాక, వివిధరకాల అధ్యయనాలకు కేంద్రబిందువుగా ప్రతిపాదించాలన్నది వారి ఉద్దేశ్యం. ఆ పత్రం ఇలా అంటోంది:

In this symposium we wish to advocate for a different conception-a civilizational approach to a significant cultural sphere in a Universalist spirit, perceiving Telugu realm as an interconnected whole.

మరొకచోట, సదస్సు ఉద్దేశ్యాలను మరింత వివరంగా ఇలా పేర్కొన్నారు:

The objective of this first European Symposium on Telugu is to open up constitutive domains and themes relating to Telugu, south India as a formal inter-connected area of study cantered on the language as well as society, history, culture, economy and politics,

ఈ ఉద్దేశ్య ప్రకటన నన్ను చాలా ఆకట్టుకుంది. చాలాకాలంగా తెలుగు సాహిత్యగోష్ఠుల్లో నేనిదే చెప్తూ ఉన్నాను. సాహిత్యాన్ని కావ్యానందం కోసం చదవడం ఒక పార్శ్వం. లేదా దాన్ని ఒక చారిత్రిక దృష్టితో చదవడం మరొక పార్శ్వం. కానీ, చరిత్ర, సంస్కృతి, భూగోళం, భాషా శాస్త్రం, వలసలు, వాణిజ్యం లాంటి వివిధ అంశాల్ని కలుపుకుంటూ భాషా వికాసాన్ని పరిశీలించడం వీటన్నిటికన్నా లోతైన పద్ధతి, ఇప్పుడు చాలా అవసరమైన పద్ధతి కూడా.

కాబట్టి, ఈ రోజు నా ప్రసంగం మొదలుపెడుతూ ఇరవయ్యేళ్ళ కిందటి ఒక జ్ఞాపకాన్ని ప్రస్తావించాను. అప్పట్లో పి.వి.నరసింహారావు గారు ఒకసారి హైదరాబాదు వచ్చినప్పుడు ఇక్కడి రచయితలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఒక రచయిత ఆయన్ని ‘తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదముందని వింటున్నాము, నిజమేనా?’ అనడిగాడు. ఆయన బహుభాషావేత్త కాబట్టి,  భారతప్రధానిగా ప్రపంచమంతా చూసినవాడు కాబట్టి సాధికారికంగా ఆ విషయం గురించి ఏమైనా చెప్పగలరని ఆ రచయిత ఉద్దేశ్యం. నరసింహారావుగారు ఆ ప్రశ్న విని చిరునవ్వారు. ‘తెలుగు భాషకి ఆ ప్రమాదం ఎప్పటికీ ఉండదు’ అని అన్నారు.  అక్కడితో ఆగకుండా, ‘తెలుగు గురించి తెలుసుకోకపోతే తక్కిన ప్రపంచానికి ఎంత నష్టం!’ అని కూడా అన్నారు.

ఆ మాట నన్ను ఇప్పటికీ వదల్లేదు. నిజమే కదా. దక్షిణభారతదేశంలో అతి పెద్ద భాషా, భారతదేశంలో మొదటి అయిదు పెద్ద భాషల్లో ఒకటీ, ప్రపంచంలోని మొదటి ఇరవై భాషల్లో అగ్రశ్రేణిలో ఉండేదీ అయిన  తెలుగు భాష గురించి తెలుసుకోకపోతే ప్రపంచానికెంత నష్టం! ఆ నష్టం ఒక భాషా సాహిత్యాన్ని చదవకపోతే వచ్చే నష్టం మాత్రమే కాదు, అసలు గత రెండువేల ఏళ్ళ మానవచరిత్రలోనూ, భారతదేశ చరిత్రలోనూ తెలుగు పోషించిన పాత్ర గురించి తెలుసుకోకపోతే వచ్చే నష్టం. కాబట్టి తెలుగు భాషా వికాసాన్ని ఒక inter-disciplinary  పద్ధతిలో చదివితే, ప్రతి ఒక్క భాషకీ కూడా తన గురించి తనకి మరికొంత అంతర్దృష్టి అలవడుతుందని చెప్పగలను. అటువంటి ఎంతో సుసంపన్నమైన చారిత్రిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని  తెలుగు భాష తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. అందుకని తెలుగు భాషని  నేను దక్షిణ భారత చరిత్రకు సంబంధించిన socio-cultural archive అనీ, index of social change  అనీ, repository of cultural memory అనీ, ఒక linguistic landscape అని మాత్రమే అని ఊరుకోకుండా, దాన్నొక socio-cultural reservoir అని కూడా అభివర్ణిస్తున్నాను.

ఇంత సుసంపన్నమైన భాష గురించి అధ్యయనం చేయడానికి విదేశీ భాషల విద్యార్థులు ముందుకురాగలిగితే అది తెలుగు భాషకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే మేలు చేకూర్చేది కాగలదని నమ్ముతున్నాను. ఉదాహరణకి ఎనిమిదో శతాబ్ది తాంగ్ యుగానికి చెందిన దు-ఫు కవిత్వం మొత్తం ఇంగ్లిషులోకి అనువాదమైందంతా నా దగ్గరుంది. పందొమ్మిదో శతాబ్ది అమెరికన్ కవిత్వం గురించి ఒక సాహిత్య విద్యార్థి ఎంత తెలుసుకోగలడో అంతా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. హోమర్, డాంటే, ఛాసర్, బోదిలేర్ ల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు సంపాదించి చదువుతూనే ఉన్నాను. మరి విదేశాల్లో ఉన్న సాహిత్య విద్యార్థులు కూడా ఒక పాల్కురికి సోమన గురించో, అన్నమయ్య గురించో, గురజాడ కన్యాశుల్కం గురించో వీలైనంత తెలుసుకోడానికి తహతహలాడుతుండాలి కదా!  మరోవేపు, పారశీక ప్రేమ కవిత్వం స్పానిష్ ఆండలూషియా మీదుగా దక్షిణ ఫ్రాన్సు చేరి ట్రుబడేర్ల కవిత్వాన్ని ఎలా ప్రభావితం చేసిందో నేను తెలుసుకోడానికి ఇష్టపడుతున్నట్టే, గోల్కొండ కుతుబ్ షాహీలు తెలుగులో యక్షగాన యుగాన్ని ఏ విధంగా ప్రోత్సహించారో తెలుసుకోడానికి ఫ్రెంచి, జర్మన్, రష్యన్ విద్యార్థులు కూడా కుతూహలపడాలి కదా!

కావ్యానందం కోసం, సాహిత్య చరిత్రను అర్థం చేసుకోవడం కోసం తెలుగు చదవడం మొదటి దశ. దాన్ని  దాటి, తెలుగు నేల మీద వివిధ శక్తులు inter-tectonic plates లాగా ఒకదాన్నొకటి ఎలా ప్రభావితం చేసుకున్నాయో, ఆ ప్రభావంలోంచి తెలుగు భాష ఎప్పటికప్పుడు ఎలా నూతన జవసత్త్వాలు సంతరించుకుంటూ ఉన్నదో అధ్యయనం చేయడం ఆ తర్వాతి దశ. సదస్సులో ఉన్న విద్యార్థులు ఈ రెండు దశల్లోనూ కూడా ప్రావీణ్యం సంపాదించే విధంగా కృషి చెయ్యాలని చెప్పాను.

సాహిత్య వికాసాన్ని inter-disciplinary  పద్ధతిలో ఎలా పరిశీలించవచ్చునో మూడు ఉదాహరణలు చెప్పాను. మొదటి ఉదాహరణ, సాహిత్య చరిత్రకు సంబంధించి. మన సాహిత్య చరిత్ర గ్రంథాల్లో నన్నయ పూర్వపు సాహిత్యం గురించి ఏవో కొన్ని పేజీలు లేదా మహా అయితే ఒక అధ్యాయం మాత్రమే కేటాయిస్తారు. కాని అంతకు ముందు తెలుగు శాసనభాషగా మారే క్రమంలో ఎటువంటి పురిటినొప్పులకు లోనయ్యిందో దాని అధ్యయనం చెయ్యాలంటే భాషాశాస్త్రం, మానవశాస్త్రం, పురాతత్త్వ శాస్త్రం, శాసనపరిశోధన, చరిత్ర, సాహిత్య రంగాల్లో నిపుణులైన ఒక బృందం కలిసికట్టుగా పూనుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి, వేంగీ చాళుక్యులు తొలిరోజుల్లో శాసనాల్లో దేశిఛందస్సుల్నే వాడారు. కాని పదో శతాబ్దం నాటికి సంస్కృత వృత్తాలూ, తత్సమపదజాలం, చంపూ ప్రక్రియ శాసనాల్లో ప్రవేశించాయి. వారు ఆ శైలిని  బాదామి చాళుక్యులనుంచి తెచ్చుకున్నారు. నన్నయ మహాభారత ఆంధ్రీకరణకి  ఆ నమూనానే అనుసరించాడు. ఎందుకని? దానివెనుక ఉన్న చారిత్రిక-ఆర్థిక-సామాజిక కారణాలేమిటి? అలానే వేములవాడ చాళుక్యులు బహుభాషా శాసనాలు వేసారు. ఎందుకని? అదే సమయంలో రేనాటి చోడులు సంస్కృత, ప్రాకృత, తమిళ, కన్నడాలతో సంబంధంలేని పూర్తి దేశి  తెలుగులో శాసనాలు వేస్తూ వచ్చారు. ఎందుకని? ఈ ప్రశ్నలు ఒక సమగ్ర అధ్యయనానికి దారి తియ్యగలవు. ఈ గోష్ఠి ఉద్దేశ్యం కూడా ఇదేకదా అని చెప్పాను.

అలానే రెండో ఉదాహరణ, తులనాత్మక కావ్యభాషా పరిశీలన గురించి. ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు కీర్తి శేషులు వడలి మందేశ్వరరావు గారు ఒక విషయం ప్రస్తావించారు. అదేమంటే, ఇటాలియన్ భాషను సాహిత్య భాషగా నిర్మించడంలో డాంటే (1265-1321) చేసిన కృషి గురించి దాదాపుగా ప్రపంచమంతా మాట్లాడుతూ ఉంది. కానీ ఆయనకన్నా దాదాపు ఒక శతాబ్దం ముందే నన్నయ కూడా అటువంటి కృషినే చేపట్టాడని ఎంతమందికి తెలుసు? లాటిన్ బంధనాలనుంచి ఇటాలియన్ ను విడిపించడంలో డాంటే చేసిన కృషి గురించి తెలుసుకున్నప్పుడు,  ఆయన సమకాలికుడైన తిక్కన (1205-1288)  తత్సమప్రాబల్యం నుంచి తెలుగును విడిపించడానికి చేసిన కృషి ఎంత విలువైందో అర్థమవుతుంది కదా. అలానే నన్నయ గురించీ, తిక్కన గురించీ, పాల్కురికి సోమన గురించీ తెలుసుకున్నప్పుడు ఇంగ్లిషు విద్యార్థులు ఛాసర్ నీ, ఇటాలియన్ విద్యార్థులు డాంటేనీ మరింత లోతుగా చదవగలుగుతారు కదా.

ఇక మూడవ ఉదాహరణ, సాహిత్యపరిశీలన ద్వారా ప్రపంచ స్థాయి దృక్పథాల్లో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకోవడం. ఉదాహరణకి, దక్షిణ భారతదేశంలో ప్రాబల్యం కోసం ఇంగ్లాండుకీ, ఫ్రాన్సుకీ మధ్య పోటీ తలెత్తినప్పుడు, అది మరింత విజ్ఞానం కోసం అన్వేషణగా కూడా మారింది. అందులో భాగంగానే ఫ్రెంచి జెసూటు మిషనరీలు రాయలసీమలో అడుగుపెట్టారు. అటువంటి ఒక ఫ్రెంచి మిషనరీ కళ్ళల్లో వేమన పడ్డాడు. ఆయన 1729 లో 367 వేమన పద్యాల్ని సేకరించి వాటిని యథాతథంగా పారిసు పంపించాడు. ఒక శతాబ్దం తర్వాత ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా బ్రౌను వేమన పద్యాల్ని మరింత విస్తృతంగా సేకరించాడు. దాదాపు 2100 పద్యాల దాకా సేకరించానని చెప్పుకున్నాడు. కాని వాటిల్లో దఫాదఫాలుగా ఆయన అనువదించినవి 1215 మాత్రమే. తక్కినవి పక్కనపెట్టేసాడు. ఒకే కవి గురించి ఇద్దరు విదేశీయులు అనుసరించిన వైఖరిలో ఈ తేడాకి కారణమేమై ఉండవచ్చు? తాను సేకరించినదాని ఫాదర్ లెగాక్ యథాతథంగా పారిసు పంపిస్తున్నపుడు అతడి వెనక French Enlightenment ప్రభావమూ, తాను సేకరించినవాటిల్లోంచి కొన్ని ఎంచుకోవడంలో, కొన్ని పక్కనపెట్టడంలో బ్రౌను వెనక, విక్టోరియన్ యుగ నైతికతా ప్రభావమూ (బ్రౌను విక్టోరియను యుగంకన్నా పదేళ్ళ ముందే తన కృషి మొదలుపెట్టినప్పటికీ, అతడు వేమనని 1866 దాకా కూడా అనువదిస్తూనే ఉన్నాడు) ఉన్నాయని చెప్పవచ్చునా? పద్ధెనింది, పందొమ్మిదో శతాబ్దాల్లో యూరోపు తన వలసపాలిత ప్రాంతమైన భారతదేశంలో ఒక దేశభాష పట్ల చూపిస్తూ వచ్చిన వైఖరిలో ఎటువంటి పరిణామాలు సంభవించాయి?

ఇలాంటి exciting ఉదాహరణలు కనీసం వందైనా చెప్పగలని ఆ విద్యార్థులకు చెప్పాను. కాబట్టి తెలుగుని అధ్యయనం చెయ్యడంలో గొప్ప సాహసం, ఇంతదాకా ఎవరూ అడుగుపెట్టని కొంత ప్రాంతాల్లో అడుగుపెట్టే అవకాశాల్లో ఉండే ఉత్కంఠా ఉన్నాయనీ చెప్పాను. పైగా, ఇటువంటి పరిశోధనల వల్ల ఇరువర్గాలూ కూడా, అంటే తెలుగువాళ్ళూ, విదేశీయులూ ఇద్దరూ కూడా పరస్పరం సుసంపన్నులవుతారని చెప్పాను.

ఎప్పుడో పధ్నాలుగో లూయీ కాలంలో 1695 లో ఫ్రాన్సు తెలుగునేల వైపు చూసిందనీ, మళ్లా ఇన్నాళ్ళకు పారిస్ తెలుగు సాహిత్యం వైపు చూస్తున్నందుకు, ఆ సంఘటనలో పాలుపంచుకున్నందుకు నాక్కూడా చాలా సంతోషమనిపించింది.

26-5-2026


Welcome to Telugu Studies

The Department of Indian, South Asian, and Tibetan Studies is housed within the National Institute of Oriental Languages and Civilizations in Paris. From the 25th to the 29th of this month, they are organizing the First European Symposium on Telugu Studies. As part of this event, I was invited today to speak about the evolution and development of Telugu during various lectures organized on the Telugu language. Along with foreign faculty members teaching Telugu in countries like France and Russia, international students learning Telugu also participated in this symposium. I felt immensely happy to receive this opportunity to speak about Telugu at such an international forum.

Professor Anuradha, the organizer of this symposium, sent a concept paper explaining its objectives. When she called me a week ago, what she said and what is outlined in this document essentially point to the same core idea. Their objective is to propose Telugu not merely as a literary language to students coming forward to study it abroad—especially in Europe—but as a central focus for diverse areas of study. The document states:

“In this symposium we wish to advocate for a different conception—a civilizational approach to a significant cultural sphere in a Universalist spirit, perceiving Telugu realm as an interconnected whole.”

Elsewhere, the objectives of the symposium were detailed further:

“The objective of this first European Symposium on Telugu is to open up constitutive domains and themes relating to Telugu, south India as a formal inter-connected area of study cantered on the language as well as society, history, culture, economy and politics.”

This declaration of intent appealed to me deeply. I have been saying the exact same thing in Telugu literary forums for a long time. Reading literature for poetic pleasure (kavyanandam) is one dimension. Reading it with a historical perspective is another. However, examining linguistic evolution by intertwining diverse elements like history, culture, geography, linguistics, migration, and trade is a much deeper approach than all of these—and it is a highly necessary method today.

Therefore, opening my speech today, I recalled a memory from twenty years ago. Back then, when Sri P.V. Narasimha Rao visited Hyderabad, he held an informal, candid meeting with local writers. On that occasion, a writer asked him, “We hear that the Telugu language is in danger of extinction; is it true?” Since he was a polyglot and had seen the world as the Prime Minister of India, the writer’s intention was to get an authoritative perspective on the matter. Hearing the question, Narasimha Rao smiled gently. “The Telugu language will never face that danger,” he said. Not stopping there, he added, “If the rest of the world does not know about Telugu, it is a great loss to the world!”

Those words have never left me. And how true it is! It is a tremendous loss to the world if it remains ignorant of Telugu—the largest language in South India, one of the top five largest languages in India, and one of the top twenty languages in the world. This loss is not just about missing out on reading a language’s literature; it is a loss of understanding the pivotal role Telugu has played over the last two thousand years of human and Indian history. Therefore, I can confidently say that if the evolution of the Telugu language is studied through an interdisciplinary method, every language will gain a deeper insight into itself. The Telugu language treasures within it such a richly endowed historical and cultural knowledge. That is why I do not stop at describing the Telugu language merely as a socio-cultural archive, an index of social change, a repository of cultural memory, or a linguistic landscape concerning South Indian history; I also characterize it as a socio-cultural reservoir.

If international language students can come forward to study such a rich language, I believe it will benefit not just Telugu, but the whole world. For instance, I possess the entire English translation of the poetry of Du Fu from the 8th-century Tang dynasty. I constantly read and learn as much as a literature student can about 19th-century American poetry. I routinely acquire and read fresh studies on Homer, Dante, Chaucer, and Baudelaire. Similarly, shouldn’t literature students abroad be eager to learn as much as possible about a Palkuriki Somanatha, an Annamayya, or Gurajada’s Kanyasulkam? On the flip side, just as I love to explore how Persian love poetry reached southern France via Spanish Andalusia and influenced the poetry of the Troubadours, shouldn’t French, German, and Russian students also be curious to know how the Qutb Shahis of Golconda patronized the era of Yakshagana in Telugu?

Reading Telugu for poetic joy and to understand literary history is the first stage. Moving beyond that, the next stage is to study how various forces on the Telugu soil influenced one another like inter-tectonic plates, and how the Telugu language continuously revitalized itself with new vigor through that influence. I urged the students at the symposium to strive for proficiency in both of these stages.

I shared three examples illustrating how literary evolution can be examined through an interdisciplinary method.

The First Example relates to literary history: Our literary history books dedicate only a few pages or, at most, a single chapter to pre-Nannaya literature. But to study the kind of labor pains the Telugu language underwent during its transition into an epigraphical language, a collective team of experts from linguistics, anthropology, archaeology, epigraphy, history, and literature must come together. For instance, the Vengi Chalukyas initially used Desi (native) meters in their inscriptions. But by the 10th century, Sanskrit Vrittas, Tatsama (Sanskritized) vocabulary, and the Champu (prose-verse) genre entered the inscriptions. They adopted this style from the Badami Chalukyas. Nannaya followed this very model for his Telugu adaptation of the Mahabharata. Why? What were the historical, economic, and social reasons behind it? Similarly, the Vemulawada Chalukyas issued multilingual inscriptions. Why? At the same time, the Renati Chodas consistently issued inscriptions in pure Desi Telugu, completely independent of Sanskrit, Prakrit, Tamil, or Kannada. Why? These questions can pave the way for a comprehensive study. I noted that this is precisely the objective of this symposium.

The Second Example concerns the comparative study of poetic language: The late, renowned literary critic Vadali Mandeswara Rao once pointed out a fascinating comparison. Almost the entire world talks about Dante’s (1265–1321) contribution to constructing Italian as a literary language. But how many people know that nearly a century before him, Nannaya undertook a similar endeavor? When we learn about Dante’s efforts to liberate Italian from the shackles of Latin, we can truly appreciate how valuable the efforts of his contemporary, Tikkana (1205–1288), were in liberating Telugu from the dominance of Tatsama vocabulary. Likewise, when English students learn about Nannaya, Tikkana, and Palkuriki Somanatha, they will be able to read Chaucer more deeply, just as Italian students can read Dante.

The Third Example is about understanding shifts in global perspectives through literary analysis: For instance, when a rivalry emerged between England and France for dominance in South India, it also morphed into a quest for greater knowledge. As part of this, French Jesuit missionaries set foot in the Rayalaseema region. Vemana caught the attention of one such French missionary. In 1729, he collected 367 of Vemana’s poems and sent them exactly as they were to Paris. A century later, C.P. Brown, as an employee of the East India Company, collected Vemana’s poems much more extensively. He claimed to have collected up to 2,100 poems. However, out of those, he translated only 1,215 in various phases; the rest he set aside. What could be the reason for this difference in attitude between two foreigners toward the same poet? Could it be argued that while Father Le Gac was sending what he collected intact to Paris, he was under the influence of the French Enlightenment, whereas Brown, in selecting some and discarding others, was influenced by Victorian morality? (Even though Brown began his work a decade before the Victorian era, he continued translating Vemana until 1866). What kind of shifts occurred in the attitude that Europe displayed toward a vernacular language in its colonized territory of India during the 18th and 19th centuries?

I told the students that I could provide at least a hundred such exciting examples. Therefore, I emphasized that studying Telugu involves a great sense of adventure and the thrill of stepping into uncharted territories that no one has explored until now. Furthermore, I stated that through such research, both sides—meaning Telugu people and foreigners—will mutually enrich each other.

France first looked toward the Telugu land long ago in 1695 during the reign of Louis XIV. Now, after all these years, Paris is looking toward Telugu literature once again. I felt incredibly happy to be a part of this historic moment.


Featured image: A copper plate inscriptions of Vengi Chalukyas, 9th Century.

Hyderabad, 26-5-2026

10 Replies to “తెలుగు అధ్యయనాలకు స్వాగతం”

  1. ఆహా ఇది కదా నేను ఆశించింది. అభినందనలు.
    తెలుగు భాష గురించి తెలుసుకోకపోతే నష్టం అనే విషయాన్ని వివరించి చెప్పారు.

  2. This is a very important perspective in the study of Telugu through an interdisciplinary method.

    Your examples and thoughts on studying Telugu in this way, through literary history, comparative study of poetic language, and understanding shifts in global perspectives through literary analysis are like guiding lights in that direction.

    I hope more research and courses are developed along these lines, helping students of literature all over the world and us understand the world better through Telugu language.

    Thank you for sharing such an important, well researched, and beautifully articulated talk, Sir 🙏🏽

  3. ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో గ్రీకు, లాటిన్, సంస్కృత భాషలను అధ్యయనం చేసినట్లే, తెలుగు పూర్వసాహిత్యాన్ని కూడా విశ్వసాహిత్య భాగంగా అధ్యయనం చేసే సమయం వచ్చిందని మీ ప్రసంగం ఘంటాపథంగా చెప్పినట్టైంది. ఎందుకంటే తెలుగు కవిత్వం కేవలం ప్రాంతీయ చరిత్ర కాదు; అది మానవ భావోద్వేగాల, ధర్మసంకల్పాల, సాహిత్య సౌందర్యాల విశ్వగానం.
    తెలుగు వంటి ద్రావిడ భాషల నిర్మాణం, ధ్వని సౌందర్యం, ఛందస్సు ప్రపంచ భాషా శాస్త్రానికి కొత్త కోణాలను అందిస్తాయి.
    నన్నయ, తిక్కన వంటి కవుల ద్వారా భారతీయ ధర్మదృష్టి, సమాజ నిర్మాణం, ఆత్మవిమర్శ, క్షమా ధర్మం వంటి విలువలు ప్రపంచానికి పరిచయమవుతాయి.

    ఈ మీ ప్రసంగం జిజ్ఞాసువులకు ముంజేతి దర్పణం !
    🙏🏻🙏🏻🙏🏻
    ప్రతాప చంద్రశేఖర్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading